బహుళ అస్తిత్వాలే మేలు: కె. శ్రీనివాస్

ఆధునికత ఇంగ్లీషు మార్గంలోనే రావాలని ఏముంది? మన దేశంలో దేశీయమైన ఆధునికతా క్రమం ఉండి ఉండొచ్చని అనేకమంది ఇంతకుముందు ఉదాహరణలతో సూచించారు కూడా. భారతదేశం అనేది ఏక శిల కాదు.

తెలుగు నాట పరిచయం అక్కరలేని స్వరం కె శ్రీనివాస్. చుట్టూ వైదిక సనాతన సంస్కృత వాజ్మయ పండిత పరిషత్ ఛాయల మధ్య తాను పెరిగినా ఎనభయ్యవ దశకంలో వచ్చిన ప్రత్యామ్నాయ విప్లవ, హక్కుల రాజకీయాలతో మమేకమయ్యారు. కుల, మత, లింగ, ప్రాంతీయ అస్తిత్వ వేదనతో తెలుగునాట పాత్రికేయ, పరిశోధన, విమర్శలో తనదయిన బౌద్ధిక ప్రపంచాన్ని ప్రోదిచేసుకున్నారు. అతని వాక్యం అత్యంత సరళమైనదీ గాఢత కలిగినది. ఓరియంటల్ కాలేజీలో మొదలైన ఆయన గమనం  సాహిత్యంతో ‘సంభాషించి’ వర్తమాన వాదాలకు ‘కొత్త వంతెన’ కట్టి, అనేక ‘సందర్భాలు’గా కాలం కదలికలను కల్లోలాలను చిత్రిక పట్టి ‘తెలంగాణా సాహిత్య వికాస’ ద్వారాలు తెరిచింది. తెలంగాణా వాదానికి ఒక పాయనూ చాయనూ అద్దిన బుద్ధిజీవి కె. శ్రీనివాస్.  ఇవాళ  శ్రీనివాస్ పుట్టిన రోజు– ఈ సందర్భంగా ఆయనతో  ప్రముఖ సాహిత్య సాంస్కృతిక విమర్శకుడు డాక్టర్ గుర్రం సీతారాములు ముఖాముఖి: 

  1. మొదటగా మీ పరిచయంతో బాటు సాహిత్య పరిశోధన లక్ష్యంగా బయలుదేరిన మీ ప్రస్తానం పాత్రికేయ రంగంవైపు ఎందుకు మళ్ళింది ?

కచ్చితంగా, ఇందువల్లనే  జరిగింది అని చెప్పలేను. కొన్ని కారణాలను ఊహించగలను. అందరిలాగే, ఏ సైన్సో, కామర్సో, చరిత్రో చదవడానికి వీలుగా నా చదువు మొదలయింది. కాని, ఇంటర్లో అందుకు బ్రేక్ పడింది. సమాంతరంగా సాయంత్రం ఓరియంటల్ కాలేజీలో చదివేవాడిని. చివరికి అదే ప్రధానమైన చదువు అయింది. తెలుగు టీచర్ లేదా లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించడానికి పనికొచ్చే చదువు అది. చదివినది ఆంద్ర సారస్వత పరిషత్ వారి కాలేజీ కావడం నన్ను బాగా ప్రభావితం చేసింది. కాలేజీ అంటే అక్కడి అధ్యాపకులు విద్యార్థులూ అని మాత్రమే కాదు. పరిషత్ చుట్టూ ఉన్న వాతావరణం, ముఖ్యంగా అక్కడి  సమావేశ స్థలంలో జరిగే వివిధ సభలు, అక్కడికి వచ్చే విశిష్ట వ్యక్తులు, యువభారతి, సాహిత్య అకాడెమీ దగ్గరి నుంఛి విరసం, జనసాహితి దాకా, జనతా పార్టీ మీటింగ్ దగ్గరి నుంచి ఎం ఎల్ పార్టీల మీటింగుల దాకా అన్నీ అక్కడ జరిగేవి. సాహిత్య సభలకు అయితే కాలేజీ వాళ్ళే పంపించేవాళ్లు. తక్కిన మీటింగులకు మేమే వెళ్లి కూర్చునే వాళ్ళం. చాలా పెద్ద భావ ప్రపంచాన్ని ఆ ప్రాంగణం పరిచయం చేసింది. మా ప్రిన్సిపాల్ కెకెఆర్ మాకు గొప్ప స్ఫూర్తి. 1970 ల చివరలో ఆయన నిర్వహించిన సారస్వత వేదిక సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే వాళ్ళం. సాహిత్య పరిశీలనలో సామాజిక, రాజకీయ, చారిత్రిక అంశాలను అన్వయించుకోవాలన్న ఆసక్తి కెకెఆర్ వల్లనే కలిగింది. శ్రీశ్రీని నూరిపోసిన నరహరి గారు, ఎంత కాదన్నా ప్రాచీనతే పైచేయిగా ఉండే ఓరియంటల్ స్టడీస్ ను తన ఆధునిక, యువ ఆలోచనలతో సమకాలీనం చేసిన చంద్రశేఖరరెడ్డి గారు, సంప్రదాయ పద్ధతుల్లో సాహిత్యాన్ని అర్థం  చేసుకోగలిగే పరికరాలను మాకు అందించిన ఇతర అధ్యాపకులు – ఈ వాతావరణం మాకు పాత, కొత్తలలోని మేలు అంతటిని పరిచయం చేసింది. మా నాన్న సింగరాచార్యులు అదే కళాశాలలో సంస్కృతం చెప్పేవారు. మా నాన్న సంస్కృత వ్యాకరణంలో, తెలుగులో పండితులే అయినా, మాది విద్వత్ కుటుంబం అని చెప్పలేను. మా నాన్నే – ఆయన పెరిగిన కుటుంబంలో మొదటితరం విద్యాధికుడు. 20 వ శతాబ్దం మొదటి సగభాగంలో తెలంగాణ శ్రీవైష్ణవ కుటుంబాలలో కూడా అక్షరాస్యత, చదువు పాక్షికంగానే ఉండేవి. అక్షరజ్ఞానం, లెక్కలు చెప్పే వీధిబళ్ళు బ్రాహ్మణేతరులే నిర్వహించేవారు. నన్ను తెలుగు విద్యార్థిగా చేయాలని ప్రత్యేకంగా మా నాన్న అనుకోలేదు. అది అలా జరిగిపోయింది.

తెలుగులో ఎంఏ చేసిన తరువాత, పండిట్ ట్రైనింగ్ కూడా చేసాను. నిజంగా టీచర్ అవుదామనుకున్నానా – తెలియదు. కాలేజీ మేగజైన్ ‘నెలవంక’కు సంపాదకుడిగా పనిచేసాను. కాలేజీ యూనియన్ కు ఒకసారి ప్రెసిడెంట్ గా చేసాను. నువ్వు యూనియన్ కంటే, పత్రికకు బాగా చేస్తావయ్యా అని ఆ రోజుల్లో కెకెఆర్ అన్న మాట నామీద ప్రభావం వేసిందేమో. పీజీలో ఉండగానే, పివి రాములు అనే మిత్రుడు, తను ‘కళా సౌరభం’ అన్న పత్రికను తెస్తున్నానని, అందుకు సాయం చేయమని అడిగాడు. అది సాహిత్యపత్రిక. దానికి వచ్చిన రచనలను ఎడిట్ చేయడం, కంపోజ్ అయ్యాక ప్రూఫ్ రీడ్ చేయడం చేసేవాడిని. నేను, గడియారం శ్రీవత్స, రామ హనుమన్, కృష్ణ – పత్రిక విషయంలో రాములుకు సాయం చేసేవాళ్ళం. చలం ప్రత్యేకసంచిక, కవిత్వ ప్రత్యేకసంచిక – బాగా పేరు తెచ్చుకున్నాయి. పివి రాములు ‘పిలుపు’ పేరుతో ఒక వారపత్రిక కూడా ప్రారంభించాడు. అది రాజకీయ పత్రిక. దానికి కూడా మేము చేదోడుగా ఉండేవాళ్ళము.

నా క్లాస్ మేట్ జయదేవులు చదువుతున్న రోజుల్లోనే, ఒక కాలు రాజకీయాల్లో ఉంచేవాడు. మెదక్ జిల్లా జోగిపేట దగ్గర చిన్న పద్మశాలి గ్రామం నుంచి వచ్చాడు. ఊర్లో చేనేత వృత్తివారికి కాని, పరిషత్ కాలేజీలో తోటి విద్యార్థులకు కాని, యూనివర్సిటీలోనూ బయటా అంధవిద్యార్థులకు గానీ అవసరమైనపనులు చేసిపెట్టేవాడు. అతను పక్కన ఉంటే కొండంత అండ. ఎమ్మే తెలుగులో ఉండగానే, అతను వాళ్ల ఊరికి సర్పంచ్ అయ్యాడు. సర్పంచుల కోసం అతను ఒక పత్రిక ప్రారంభించాడు. దాని పేరు ఊరు – వాడ. పంచాయత్ రాజ్ మాస పత్రిక. దానికి ఆయన ఎడిటర్, నేను executive ఎడిటర్ ని. చిన్నఆఫీస్, ఇంకా హ్యాండ్ కంపోజింగ్ దశ. విప్ల ప్రింటర్స్ లో అచ్చయ్యేది. మా సుధ కూడా కొంతకాలం అందులో పనిచేసింది. ఊరు వాడ పని ఎంత ఉత్సాహంగా ఉండేదంటే, అప్పట్లో ఆంధ్రప్రభ లో ట్రైనీ సబ్ ఎడిటర్ ఉద్యోగం వచ్చినా నేను వెళ్ళలేదు.

వెళ్ళకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. ‘ఉదయం’ అనే పత్రిక వస్తోంది, ఎబికె దానికి ఎడిటర్ – అనే టాక్ అప్పటికే మొదలయింది. ఆ పత్రిక వస్తుంది, నేను అందులో చేరతాను – అని నాకు నేనే ఖాయపరచు కున్నాను. ఏ నమ్మకంతో అట్లా అనుకున్నానో తెలియదు. పరీక్ష రాసాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. 1984 జనవరిలో ట్రైనీ గా చేరాను. ప్రధాన స్రవంతి పత్రిక వృత్తిలోకి రావడం అదే మొదలు. అప్పటినుంచీ  ముప్పై నాలుగేళ్ళుగా ఈ వృత్తి లోనే ఉన్నాను.

నేను సాహిత్య విద్యార్థిని, ఇంకా విద్యార్థినే. పరిశోధన చేసినా అప్పుడప్పుడు సాహిత్య రచనలు చేసినా నేను ఆ రంగానికి చెందిన విద్యార్థిని కావడం వల్లనే. అదే సమయంలో, నేను పాత్రికేయుడిని. పత్రికారచన ప్రధానంగా రాజకీయమైనది. నేను రాజకీయ, సామాజిక వ్యాఖ్యాతను. జర్నలిజానికి సంబంధించి నేను ప్రాక్టిషినర్ని, సాధకుడిని.

  1. తెలంగాణ సాహిత్య చరిత్ర మీద పరిశోధన చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ?

ఆలోచన కూడా హఠాత్తుగా వచ్చింది అనుకోను. సాహిత్య చరిత్రకు సంబంధించిన కొత్త ప్రశ్నలు 1980 దశాబ్దం చివరి సంవత్సరాల్లో మొదలయ్యాయి. అస్తిత్వ ఉద్యమాల ఆరంభమే ప్రశ్నలకు మూలం. 1980 ల మొదట్లోనే బలంగా గొంతు పెగిలిన ఫెమినిజం, 1985 కారంచేడు తరువాత రూపుతీసుకున్న దళితవాదం – ఈ ప్రశ్నలకు మూలం. జాతీయస్థాయిలో మండల్ వ్యతిరేక అనుకూల ఉద్యమాలు కూడా భావరంగంలో తీవ్రమైన పోరాటాన్ని తీసుకువచ్చాయి. ఆ సమయంలో ‘సుప్రభాతం’ పత్రికలో – సాహిత్యచరిత్రలలో, సంకలనాల్లో విస్మరణలకు, రచయితల పునర్మూల్యాంకనకు సంబంధించిన ఒక ఫీచర్ వచ్చింది. రాజీవ్ వెలిచేటి, ఖాదర్ మొహియుద్దిన్ మరికొందరు, కొన్ని షాకింగ్ ప్రశ్నలు వేశారు. ఆ తరువాత, ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికలో ‘కొత్త ప్రశ్నలకు కొత్త జవాబులు కావాలి’ అన్న వ్యాసం వచ్చింది. ఆ సమయంలోనే తెలంగాణా అస్తిత్వ ఆలోచనలు కూడా మొలకెత్తాయి. సారస్వత పరిషత్తు అధ్యక్షుడు దేవులపల్లి రామానుజరావు చనిపోయినప్పుడు, ఆయన గురించి ఒక నివాళి వ్యాసం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో రాసాను. ఆ వ్యాసరచన సందర్భంలో, రామానుజరావు కృషి ఎంతో తెలిసి, అతని వంటివారికి తగిన ప్రాచుర్యం రాకపోవడం, చనిపోయినప్పుడు తగిన నివాళులు కూడా పత్రికల్లో కనిపించకపోవడం నొప్పి కలిగించింది. వ్యాసంలో ఆ విమర్శను కూడా చేసాను. అప్పటికే, తెలుగు యూనివర్సిటీలో నేను ‘రెండు ప్రపంచ యుద్ధాల మధ్య తెలుగు సాహిత్యం’ అన్న అంశం మీద పిహెచ్ డి కోసం రిజిస్టర్ చేసుకుని ఉన్నాను. టాపిక్ మార్చుకుని, తెలంగాణ సాహిత్య వికాసం మీద చేయాలన్న ఆలోచన కలిగింది. గైడ్ గా ఉన్న జయధీర్ తిరుమలరావు అందుకు అంగీకరించి సహకరించారు. ఇదంతా 1993 – 94 లో జరిగినప్పటికి, పరిశోధనా వ్యాసం మాత్రం 1999 నాటికి పూర్తి అయింది. అప్పటికి సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తెలంగాణా వాదం బలపడిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఆధునిక చరిత్ర కాని, సాహిత్య చరిత్ర కాని 1940 ల నుంచి ఎక్కువగా దొరుకుతోంది. అంతకు ముందు అంతా అంధకారం అన్న అభిప్రాయం ఉండేది. నేను నా పరిశోధనను, 1900 నుంచి 1940 మధ్య కాలానికి పరిమితం చేసుకుని, అప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని అంశాలను నా పరిశోధనా వ్యాసం ద్వారా చెప్పే ప్రయత్నం చేసాను.

  1. తెలుగు పాత్రికేయ ప్రపంచం మొదటి నుండీ ఒక నిర్దిష్టమైన వచనశైలిని అనుసరిస్తూ వచ్చింది, దానికి భిన్నమైన కవిత్వ సున్నితత్వాన్ని మీ వచనానికి అద్దారు, ఈ రెండిటికీ పొంతన ఎలా కుదిర్చారు?

నా సాహిత్య నేపథ్యం అందుకు ఉపయోగ పడి ఉండవచ్చు. సాహిత్య విద్యార్థిగా నేను చదివిన కవిత్వం కాని, గొప్ప వచన రచనలు కాని నా శైలి మీద ప్రభావం చూపి ఉంటాయి. వచనంలో అలంకారిక శైలి వినియోగం మీద నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్ల, కొన్ని ప్రత్యేక ప్రక్రియల (మ్యూజింగ్స్ తరహా ) లోనే నేను మీరనుకుంటున్న శైలిని విస్తృతంగా వాడాను. రాజకీయ, సామాజిక అంశాల విశ్లేషణ చేసేటప్పుడు, సూటిగా కనిపించే శైలినే ఇష్టపడతాను. చిన్నవాక్యాలు, సరళమైన వాక్యాలు రాయడం వల్ల కూడా చదివించే గుణం వస్తుంది. పాత్రికేయుడిగా ఆ శైలిని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. పాత్రికేయ రచన అయినంత మాత్రాన నిర్జీవంగా ఉండనక్కర లేదు. అదే సమయంలో అర్థానికి ఆమడ దూరంలో ఉండే విధంగా హంగులు అద్దవలసిన పని కూడా లేదు.

  1. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపన తెలంగాణ సాహిత్య వికాసానికి పునాది అనడం మూలంగా ఆధునిక సాహిత్య వికాస చర్చ తెలుగుకు మాత్రమే కుదించే ప్రయత్నం జరిగింది. అంటే వందేళ్ళ కింద ఇక్కడ ఆధునికత లేదనేనా ?

ఏ పెద్ద పరిణామం అయినా, క్రమం అయినా ఒక్క సంఘటనతో, ఒక్క చర్యతో ప్రారంభం అవుతుందని అనుకోకూడదు. సున్నాకీ ఒకటికీ యెంత దూరం ఉందో చెప్పలేము. అటువంటి ప్రారంభాలను అన్వేషించే ఆసక్తి మీద నాకు గౌరవం కూడా లేదు. కాకపోతే, మనకు చరిత్రలను కొన్ని ఘట్టాలతో, మలుపులతో ముడిపెట్టి అర్థం చేసుకోవడం సులువు. కృష్ణదేవరాయ ఆంద్ర భాషానిలయం కంటే ముందు కూడా హైదరాబాద్ లో కొన్ని రీడింగ్ రూములు, వ్యక్తిగత గ్రంథాలయాలు ఉన్నాయి. ముద్రణాయంత్రం తెలంగాణ లోని కొన్ని సంస్థానాలలోకి వచ్చింది. పుస్తక ప్రచురణ కూడా జరిగింది. తెలంగాణలో మొదటి పత్రిక అని సాంకేతికంగా అనదగ్గది, ప్రభుత్వం వారి వ్యవసాయ శాఖ ప్రచురించిన ‘శేద్యచంద్రిక’ అన్న బులెటిన్. నిజానికి అది ఉర్దూబులెటిన్ కు అనువాదరూపం. కాని, గ్రంథాలయ ఉద్యమం అన్నది, కృష్ణదేవరాయ భాషానిలయం తోనే ఊపు అందుకున్నది. ఆ లైబ్రరీకి ఆ పేరు పెట్టడం వెనుక కూడా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. తెలుగు కు ఆదరణ లేని ఒక ప్రాంతంలో, తెలుగు భాషా సాహిత్యాలను బాగా పోషించాడని పేరున్న ఒక రాజు పేరుతో గ్రంథాలయం పెట్టడంలో ఒక ప్రకటన ఉన్నది.

గ్రంథాలయాలు అంటే, చదువుకునే పుస్తకాలు ఉన్న స్థలం అని మాత్రమే కాదు. అది సమావేశ స్థలం కూడా. అంతకు ముందు, గుడులు, భజన మందిరాలు తప్ప లౌకిక సమావేశ స్థలాలు లేవు. అప్పటికి హైదరాబాద్ రాజ్యంలో అక్షరాస్యత 3 శాతం ఉందనుకుంటా. అందులో తెలుగు అక్షరాస్యత ఇంకా తక్కువ. అటువంటి చోట పాఠకులు ఎక్కడ ఉంటారు? ఒక ఫ్యూడల్, రాచరిక వ్యవస్థలో, ఒక భాష మాట్లాడేవారి కోసం ఒక లౌకిక స్థలం ఏర్పాటు కావడమన్నది ఆధునికతలోకి ప్రయాణానికి ఒక సంకేతం. సార్వత్రిక అక్షరాస్యత, ముద్రణా సదుపాయాలూ పత్రికలూ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజాస్వామిక వేదికలు – ఇటువంటివన్నీ ఆధునికతకు చిహ్నాలు. గ్రంథాలయాలు, తరువాతకాలంలో ప్రభుత్వ వ్యతిరేక సమీకరణకు ఉపయోగపడ్డాయి. దొరల గడీలకు గ్రంథాలయాలు ప్రత్యామ్నాయాలుగా మారాయి. భాషానిలయంవంటి స్థలాల్లో సంప్రదాయ పండితులే కాదు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు కూడా సభలు జరుపుకున్నారు. భాషానిలయంతో పాటు, బ్రిటిష్ పాలిత సుల్తాన్ బజార్ ప్రాంతంలో అనేక సమావేశ స్థలాలు, సామాజిక కార్యకేంద్రాలు కూడా స్థాపితం అయ్యాయి. వివేకవర్ధిని విద్యాసంస్థలు, మహారాష్ట్రుల ఆధ్వర్యంలోనివి. అక్కడ జరిగిన ఒక సమావేశంలోనే, ఒక తెలుగు న్యాయవాదికి అవహేళన ఎదురైంది, ఆ సంఘటన, ఆంధ్రజన సంఘం ఏర్పాటుకు ప్రేరణ అయింది.

హైదరాబాద్ రాజ్యంలోని మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలలో కూడా వికాస ఉద్యమాలు జరిగాయి. ఉర్దూ, పార్శీ, మరాఠీ వంటి భాషలలో వ్యవహరిస్తూ ఉండే నాటి హైదరాబాద్ శిష్టసమాజానికి తెలంగాణ తెలుగు సమాజంతో గాఢమైన సంబంధం నాడు లేదు. ఆ శిష్ట  సమాజంలో కూడా సంస్కరణ వాదులు ఉండేవారు, మాడపాటి హనుమంత రావు, భాగ్యరెడ్డి వర్మ వంటి సంస్కర్తలకు ఆ శిష్ట సమాజంతో సంబంధం ఏర్పడింది. ప్రజాహిత రంగం అంటూ ఒకటి హైదరాబాద్ లో 20 శతాబ్ది ఆరంభ దశాబ్దాలలో అట్లా క్రమంగా ఏర్పడుతూ వచ్చింది. అ రంగం కొంతకాలానికి భాషల ప్రాతిపదికన విడివిడిగా కూడా వ్యవహరించడం మొదలయింది. తెలంగాణ తెలుగువారికి సంబంధించి, సాయుధపోరాటం, సాహిత్య సాంస్కృతిక వికాసాలు అన్నీ 1900లో బీజప్రాయంగా మొదలైనా గ్రంథాలయోద్యమం నుంచి జరిగిన క్రమమే మార్పుని స్పష్టంగా చూపించింది. తర్వాత అనేక ప్రవాహాలు చేరాయి. సొంతంగా వికాసక్రమాన్ని రచించుకున్న బృందాలు, సామాజిక బృందాలు కూడా 1940 ల నాటికి ఒక మహా పౌర సమాజంలో సంలీనం అయ్యాయి.

  1. తెలుగు సాహిత్యచరిత్ర నిర్మాణంలో సాహిత్య వికాసం గురజాడ చుట్టూ కేంద్రీకృతమవడం మూలంగా వందేళ్ళగా స్థిరీకరించిన ‘దిద్దుబాటు’ ప్రాసంగికత, మనుగడను తెలంగాణ అస్తిత్వఉద్యమం తుత్తినియలు చేసింది. అది పాక్షిగవిజయమే అయినా రాజ్యవితరణ ప్రాచ్యలిఖిత భాండాగార కేంద్రీకృత చర్చ శాస్త్రీయమైననది కాదు అని యురోపియన్ సమాజాలు నిరూపించాయి. మీ అభిప్రాయం ?

పరిశోధకుడిగా నేను చరిత్ర మీద తీర్పులను ఇష్టపడను. వాస్తవాలు, సత్యం, విశ్లేషణ, అంచనా ఏవైనా రాగద్వేష రహితంగా ఉండాలి. చరిత్ర శోధన మీద ఆసక్తికి ప్రేరణ రాజకీయలక్ష్యాలో ఆవేశాలో రాగద్వేషాలో కావొచ్చు, అభ్యంతరం లేదు. కాని, ఫలితాన్ని మాత్రం యథాతధంగా స్వీకరించాలి. విస్మృత చరిత్రను ఆవిష్కరిస్తున్నామంటే, ఆ విస్మృతికి కారణాలను కూడా నిర్మమకారంగా పరిశీలించాలి. గురజాడ, గిడుగు వంటివారిపై, వ్యతిరేకత అక్కర లేదు.  ఏ వ్యక్తి గురించయినా అతను నిర్వహించిన పాత్రనయినా, నాటి గరిష్ట  ప్రగతిశీలతని ప్రమాణంగా చూడాలి. దిద్దుబాటు ప్రాసంగికత తుత్తినియలు అయిందని నేను భావించడం లేదు. దిద్దుబాటును చారిత్రికంగా సరి అయిన రాజకీయ దృక్పథంతో అంచనా వేయడంలో మనం ఒక అడుగు ముందుకు వేశాము. మునుపటి అంచనాలోని లోపాలను దిద్దుకున్నాము. వివిధ ప్రక్రియల్లో ఎవరు ముందు, ఎవరు తరువాత అనే శోధనకు పెద్దగా ప్రాధాన్యం లేదని నేను కూడా అంగీకరిస్తాను. అచ్చమాంబ కథలు కాని, మాడపాటి కథలు కాని, గురజాడ కథలు కాని ఒకే కోవలోనివని మాత్రం అంగీకరించలేను. గురజాడకు ఉన్న exposure వేరు. అందుకు కారణాలు చారిత్రికం. ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది అని, బౌద్ధాన్ని వదులుకుని మనం చాలా నష్ట పోయామని, దేశమంటే మట్టి కాదు మనుషులు అని – తెలంగాణ లోని గురజాడ సమకాలికులు ఎవరూ అనలేరు. అందుకు కూడా కారణాలు చారిత్రికం. వ్యక్తుల సామర్థ్యాలు, ప్రతిభలు కారణం కాదు. అట్లాగే, భాగ్యరెడ్డివర్మ వ్యక్తం చేసినటువంటి భావాలు, కొన్ని ఆయన సమకాలికులైన బ్రిటిష్ ఆంధ్ర దళితులు కాని, అగ్రకులస్తులు కాని వ్యక్తం చేయగలిగేవి కావు.

తెలంగాణా అస్తిత్వ వేదన, చరిత్రలో తనను తాను వెదుక్కున్నది. కథలో, నవలలో తెలంగాణా వారు తొలి తరంలోనే ఉన్నా ఆ గుర్తింపు దొరకలేదని ప్రకటించింది. ఆ తొలినాటి రచనల పాఠ్యవిమర్శ ఇంకా జరగవలసే  ఉన్నది. బ్రిటిష్ వలసవాదంతో ప్రేరితమైన ఆలోచనలు తెలంగాణలో పెద్దగా వచ్చే అవకాశం నాడు లేదు. చరిత్రకు సంబంధించి ఆ తెలివిడి మనకు కలగాలి. భావకవిత్వం మనదగ్గర కూడా వచ్చిందని నాలుగు ఉదాహరణలు చూపితే ఉపయోగం లేదు. ‘కాపుబిడ్డ’ వంటి కావ్యం తెలుగులో మరెక్కడా రాలేదని గుర్తించడమే, తెలంగాణకు వాస్తవమైన యోగ్యత.

  1. తెలంగాణ ఉద్యమం భావోద్వేగాల పునాది మీద నిర్మితం అయింది అనే వాదన ఉంది. బౌగోళిక తెలంగాణ ఇక్కడి రాజకీయ ఆర్ధిక అంశాల మినహా తెలంగాణ అస్తిత్వ నిర్మాణ దశ మొదలయినది అని భావిస్తున్నారా ? .

భావోద్వేగాల పాత్ర లేని ఉద్యమం అంటూ ఏదీ ఉండదు. మలిదశలో తెలంగాణ అస్తిత్వాన్ని నిర్మించవలసి వచ్చింది. భారతజాతి, తెలుగుజాతి వంటివన్నీ నిర్మిత అస్తిత్వాలే. అస్తిత్వ నిర్మాణంలో చరిత్ర, సంస్కృతి ప్రధాన పాత్ర వహిస్తాయి. చరిత్రలో మన అస్తిత్వాన్ని యెంత పురాతన దశ నుంచి కనుగొంటే, అంత గట్టి అనుబంధం ఏర్పడుతుంది, సమీకరణ జరుగుంది. అస్తిత్వభావన వాస్తవమైనదా కాదా అన్నచర్చ అనవసరం. ప్రజలు తమను తాము ఒక రకంగా నిర్వచించుకోవాలని చూడవచ్చు. పాలకులు మరో అస్తిత్వాన్ని రుద్దవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఒకే అస్తిత్వంలోకి మార్చే ప్రయత్నం జరుగుతున్నది.

మనకు బహుళ అస్తిత్వాలు వర్తిస్తాయి.  ఏక అస్తిత్వం కంటే, బహుళ అస్తిత్వాలు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయి. అస్తిత్వాల వారీగా ఆకాంక్షలను నెరవేర్చుకునే ప్రయత్నంలో, మంచి – చెడు అస్తిత్వాల విచక్షణ అవసరం. అలాగే, అనేక సానుకూల అస్తిత్వాల మధ్య అవాంచనీయ ఘర్షణ లేకుండా, సమన్వయం చేసుకుంటే, విస్తృత ప్రజా సమూహాలకు మేలు జరిగే ప్రయత్నాలు సఫలం అవుతాయి.

  1. ఐదేళ్ళ కింద తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగుసభలు నాటి తెలంగాణ ఉద్యమ ఉధృతి నేపధ్యంలో రాజకీయ అవసరాల కోసమే జరిగాయి అని మీరు అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సభలు ఆ నమూనాకు భిన్నంగా తెలంగాణ ఆకాంక్ష నెరవేరేలా జరిగాయి అని భావిస్తున్నారా?

నిర్వహించిన వారి ఉద్దేశాలు ఏమైనా, ఆ సభలలో పాల్గొన్నవారి ఉత్సాహాన్ని గమనించినప్పుడు, తెలంగాణ ఉద్యమకాలంలో బాధితులుగా నినదించిన అస్తిత్వసాంస్కృతికతను, ఇప్పుడు విజేతలుగా వేడుక చేసున్నట్టు అనిపించింది. రాష్ట అవతరణ తరువాత ఇటువంటి సాంస్కృతిక సమ్మేళనం బాకీ ఉంది. అది నెరవేరింది. విజయోత్సాహం ఇది, ప్రభుత్వంతో మమేకత ఉన్న తొలినాళ్ళలో ఇటువంటి ఉత్సవం జరిగితే, మరింత సంబరంగా ఉండేది.

  1. వివక్షల కొలిమిలోంచి పురుడు పోసుకున్న తెలంగాణ భాష ఈనాటికీ పాఠ్యపుస్తకాల సిలబస్ రూపకల్పనలో భాగం కాలేదు. ఇక్కడి పండితవర్గమే ఆ ప్రక్రియకు అవరోధంగా ఉన్నారు అనే విమర్శ ఉంది. అసలు ప్రత్యామ్నాయ నమూనా ఎలా ఉండాలి అనుకుంటున్నారు?

తెలంగాణ భాష అంటూ ఒకటి ఉందా? అన్న ప్రశ్నకు ముందు జవాబు చెప్పుకోవాలి. భాషాశాస్త్రం ప్రకారం అయితే, తెలంగాణలో మాట్లాడేది తెలుగే. తెలంగాణకు ప్రత్యేకమైన మాండలికం, పలుకుబళ్ళు, యాస ఉన్నాయి. ప్రమాణ భాషగా చెలామణిలో ఉన్న భాషలో తెలంగాణ ప్రత్యేక పదజాలం పెరగాలి. ఏ ప్రాంత మాండలికానికి అయినా సృజనాత్మక సాహిత్యంలో ఎప్పుడూ మనుగడ ఉంటుంది. వైజ్ఞాకిక వచన రచన యెట్లా ఉండాలి అన్నది సమస్య. మాట్లాడే భాషకు, రాసే భాషకు విధులు వేరు. వాటిని అలవరుచుకోవలసిన విధానాలు కూడా వేరు. ఆధునిక భాషలు, సాధ్యమైనంత సూటి వ్యక్తీకరణకు, సులభ అనువదనీయతకు అనుగుణంగా ఉండాలి. లోతైన సాంస్కృతిక వ్యక్తీకరణలు బౌద్ధిక, సమాచార భాషకు ఉపకరించవు. నా ఉద్దేశంలో తెలుగు ప్రమాణభాషను సంస్కరించుకోవలసిన అవసరం ఉంది. తెలంగాణ పదజాలాన్ని సాధ్యమైనంత నిఘంటువులకు ఎక్కించవలసి ఉంది. ప్రమాణ భాష, నిఘంటు నిర్మాణం ఆ శాస్త్ర నిపుణులు చేయవలసిన పనులు. వారికి నిష్పక్షపాత దృష్టి ఉండాలి, ఆ రంగంతో సంబంధం లేనివారు భాషా కర్తవ్యాలను నెరవేర్చలేరు.

  1. లోప భూయిష్టమైన పాలనావ్యవస్థ వల్ల ప్రభుత్వేతర ప్రైవేటు విద్యావ్యవస్థలలోనే నేటికీ అత్యధికులు చదువుతున్నారు. ఈ స్థితిలో ప్రాధమిక విద్య మాతృభాషలోనే ఉండాలి అనే నినాదం – బడుగు బలహీన వర్గాలకు మెరుగైన ఉపాది అవకాశాలు కల్పించే ఆంగ్ల విద్యకు వారిని దూరం చేసే కుట్ర అని దళిత బహుజన మేధావులు  దీనిని  ఎలా అర్ధం చేసుకోవాలి?  

రెండూ రెండు వేర్వేరు విషయాలు. దళితులైనా, దళితేతరులైనా మాతృభాషను వదులుకుని మాత్రమే ఉపాధి పొందగలిగే పరిస్థితి ఉండడం అన్యాయం. దళితులకు ఇంగ్లీష్ దూరం చేయాలని, ఉపాధి అందకుండా చేయాలని నేనైతే అనుకోను.అలాగే, ఇంగ్లీష్ చదివినంత మాత్రాన ఉపాధిసమస్య తీరుతుందనీ  భావించలేను. చాలా దేశాలలో వారి స్థానిక భాషలలోనే విద్యాబోధన చేస్తున్నారు. అయినా అక్కడ ఉపాధికి అడ్డు రావడం లేదు. దళిత బహుజనుల పిల్లలకు ఇప్పుడు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పినా వారి ఇంగ్లీష్, అగ్రకులస్తులు సంపన్నులు చదివే ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో ఉండదు. ఇప్పుడు ఎవరూ ఇంగ్లీష్ స్థానంలో తెలుగు పెట్టమని అనడం లేదు. నా అభిప్రాయం అయితే, ఏడవ తరగతి వరకు తెలుగు మాధ్యమం, తరువాత నుంచి ఇంగ్లీష్ మాధ్యమం, తెలుగు కనీసంగా ఒక అంశం – ఇట్లా ఉండాలి. తెలుగును ఒక అంశంగా మాత్రమే చిన్నప్పటి నుంచి బోధిస్తే, ఇక తెలుగులో ఎప్పటికీ పరిభాష అభివృద్ధి కాదు. తెలుగులో శాస్త్ర వైజ్ఞానిక అంశాలు రాసే అవసరమే రాదు.

భాష అంటే దాని వ్యవహర్తల చరిత్రను, సంస్కృతిని దాచుకున్న వ్యవస్థ. రేప్పొద్దున చైనా ప్రపంచ శక్తి అయితే, అప్పుడు ఇంగ్లీష్ వదిలి మాండరిన్ ను నేర్చుకుందామా? గిరాకీ ఉన్న భాషను మనం వరించే బదులు, మన భాషకు గిరాకీ తెచ్చుకునే ప్రయత్నం చేయలేమా?

  1. చరిత్రలో స్థిరమైన భౌగోళిక సరిహద్దులు ఉండవు. వాటి మార్పుకోసం అనేక ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు బయలుదేరాయి. ఇలా సరిహద్దుల పునర్నిర్మాణం మారుతున్న దశలో ప్రాంతీయ అస్తిత్వ కేంద్రీకృత చర్చలకు ప్రాసంగికత ఉంటాది అని భావిస్తున్నారా?

ప్రాంతీయత భౌగోళిక నిర్దిష్టత మాత్రమే కాదు. సాంస్కృతిక నిర్దిష్టత కూడా. ఒక ప్రాంతంలో కొంతకాలం ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతీయ అస్తిత్వం పూర్తిగా ఆ వ్యక్తిలో ప్రతిఫలిస్తుందని చెప్పలేము. ఒక్కోసారి, సామాజిక అస్తిత్వానికి ప్రాంతీయ నిర్దిష్టత ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉన్నా వారు ఆ సామాజిక అస్తిత్వంతోనే పెనవేసుకుని, నివసిస్తున్న ప్రాంతానికి చెందకుండా మిగిలిపోతారు. అంతేకాదు, ఒక్కోసారి ప్రాంతీయ  అస్తిత్వం చలనశీలం కూడా. స్థలం మారినా మనతో వస్తూ ఉంటుంది. అమెరికాలో ఉన్నా ప్రాంతీయత లోనుంచే మాట్లాడుతుంది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి ఇప్పటికైతే, ప్రాసంగికత ఉన్నది. ఇతర అస్తిత్వాలలో పూర్తిగా కరిగిపోవడం ఇప్పట్లో సాధ్యపడుతుందని నేను అనుకోను. అలాగే, ఉద్యమకాలంలో లాగా ప్రధాన అస్తిత్వంగా కొనసాగుతుందని కూడా చెప్పలేను. అయితే, మన దృక్పథంలో, విచక్షణ వివేచనా పరికరాలలో ప్రాంతీయ అస్తిత్వవాదం అంతర్భాగమై పోయింది. అది కొనసాగుతూ ఉంటుంది.

  1. తొంబైవ దశకంలో వచ్చిన అస్థిత్వ సాహిత్య రాజకీయ సందర్భంలో మొలకెత్తిన భౌగోళిక సరిహద్దుల కేంద్రీకృత సాహిత్య రాజకీయచర్చలను ఎలా అర్ధం చేసుకోవచ్చు? వివిధ సామాజిక అస్తిత్వ వాదనలకు ఈ ప్రాంతీయ కేంద్రీకృత  వాదన లేదా చర్చలకు సంబంధం ఏమిటి?

వలస, స్థిరత – జమిలిగా సాగిన ప్రస్థానంలో, ఉనికి స్థావరమూ జంగమమూ కూడా. భౌగోళికతకు, నైసర్గికతకు, సంస్కృతికి, చరిత్రకు సంబంధం  ఉంది. మనం ఒక వాదం, దృక్పథం ప్రభావంలో ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వాదం, దృక్పథం లోనుంచి విషయాలను చూస్తాము,  ఫోకస్ చేసి కొంత చూస్తున్నామంటే, మరి కొంత చూడకుండా ఉంటున్నామన్న మాట. ప్రాంతీయతా సంవాదం తీవ్రంగా ఉన్నప్పుడు, అది కేంద్ర స్థానంలోకి వచ్చి, అనేకం పక్కలకు జరిగిపోయి ఉండవచ్చు. స్థూలత – కొన్ని సూక్ష్మఅంశాలను కప్పిపెడుతుంది. ఆ సూక్ష్మ అంశాల మీద విస్తృతంగా అధ్యయనం చేస్తున్నపుడు స్థూలత మిస్ కావచ్చు. కాబట్టి, పరిశీలన, సమీక్ష, విమర్శ, తిరిగి పరిశీలన – అన్న క్రమం కొనసాగుతూ ఉండవలసిందే. అన్ని అస్తిత్వవాదాల లాగానే, తెలంగాణ ప్రాంతీయవాదం కూడా అనేక పొరపాటు సూత్రీకరణలకు, అతివ్యాప్తి, అవ్యాప్తి నిర్ధారణలకు కారణమైంది. వాటిని వదిలించుకోవాలి.

  1. ఆంధ్ర ప్రాంతం తెలుగు ఆధునికతను ముందుకు తెస్తూ సాహిత్య సాంసృతిక రాజకేయాలను ప్రవేశ పెడుతున్న సందర్భంలోనే తెలంగాణ తన ఉనికిని ప్రకటించే ప్రయత్నం చేసింది, తెలంగాణ ఆధునిక అస్తిత్వప్రకటన ఆంధ్రప్రాంతం నుండి వచ్చిన తెలుగుఆధునికతకు భిన్నం అని మీరు భావిస్తున్నారా? 

అస్తిత్వవాద చర్చలు, ముఖ్యంగా తారతమ్య వివేచనతో, ముడిపడి ఉంటాయి. కాబట్టి, చర్చ పరిధి ముందే నిర్ణయం అయిపోతుంది. అభివృద్ధి – వెనుకబాటుతనం, నాగరికం – అనాగరికం,  కవిత్వం ఉండడం – లేకపోవడం, వ్యవసాయం రావడం – రాకపోవడం – ఇటువంటి ద్వంద్వాలలో, ఆంధ్రప్రాంతంతో పోల్చుకునేప్పుడు, తెలంగాణ అనివార్యంగా లోటును, లోపాలను, వివక్షను ఎత్తి చూపడమో, లేదా ఆ  ఆరోపణ అబద్ధమని వాదించడమో చేయాల్సి వస్తుంది. ఆంద్ర ఆధునికం, తెలంగాణా అంధకారం – అన్న ద్వంద్వం కూడా అంతే. ఆ చర్చలో భాగంగా, తెలంగాణ కూడా ఆధునికత దారిలో ప్రయాణించిందని, ఆంద్ర ప్రాంతంలో జరిగిన క్రమమే ఆధునికత అనుకోనక్కర లేదని వాదించాము. రెండుప్రాంతాల్లో జరిగిన మార్పులను పోల్చి చూసాము. ఆధునికత దానంతట అది గొప్పదీ, వచ్చి తీరవలసినదీ అని అనుకోనక్కర లేదు. ఆధునికత గొప్పది అనుకుంటే, అది ఇక్కడ కూడా జరిగింది అని చెప్పడం అస్తిత్వవాదానికి అవసరమైంది. రెండు ప్రాంతాల గమనంలో తేడాలు కనిపించినప్పుడు, తెలంగాణలో జరిగింది విభిన్నమైన ఆధునికతా ప్రయాణం అని ప్రతిపాదిస్తున్నాము.

  1. తొలి తెలుగు స్వతంత్ర కావ్యం రాసిన  పాల్కురికి సోమనాధుడు  ఆ నాటి  సాహిత్య చట్రం బయట సాంస్కృతిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాసిన ‘బసవపురాణం’ వదిలి సోమనాధుని కులగోత్రాల చుట్టే చర్చను తిప్పారు. దీని మీద మీ అభిప్రాయం?

అస్తిత్వవాద సాహిత్య విమర్శలో మనం ప్రశ్నలు సంధించడం మీదనే, పై పై తారతమ్య పరీక్ష మీదనే దృష్టి పెడుతున్నాము. పాఠ్యవిమర్శ పెట్టే ఓపిక ఉండడం లేదు. పాల్కురికి ఆదికవి అనే ప్రతిపాదన అయినా ఆయన కులమేమిటి అనే చర్చ అయినా ఉపరితల విన్యాసాలలో భాగమే. స్వతంత్ర కావ్యం రాసినవారినే ఆదికవి అనాలని ఇంతకాలం, తెలంగాణ వాదం వచ్చేదాకా, మనమెందుకు గుర్తించలేకపోయాము? నన్నయ అనువాద భారతంలో అతని సమకాలీన బ్రాహ్మణీయ భావజాలం చాలా చొరబడింది. వ్యాసుడి కంటే నన్నయ ఎక్కువ వర్ణాశ్రమ ధర్మ వాది. అనువాదం పేరుతో అతను స్వతంత్ర కల్పన చాలా చేశాడు.

  1. ఆంధ్రాప్రాంత విదేశీ వలస ఆధునికతకు, దక్కన్ ప్రాంతంలో రాజరిక నియంతృత్వ వ్యతిరేకత భిన్నమైనది అనే చర్చ ఉంది దక్కన్ కేంద్రీకృత ఆధునిక చర్చ భిన్నమైనది అని మీరు అన్నారు – అది ఎందుకు యెట్లా భిన్నమైనదో చెప్పగలరా?

ఇది చాలా పెద్దచర్చ. ఆధునికత ఇంగ్లీషు మార్గంలోనే రావాలని ఏముంది? మన దేశంలో దేశీయమైన ఆధునికతా క్రమం ఉండి ఉండొచ్చని అనేకమంది ఇంతకుముందు ఉదాహరణలతో సూచించారు కూడా. భారతదేశం అనేది ఏక శిల కాదు. పాలన రీత్యా, చరిత్ర రీత్యా, భౌగొళిక నైసర్గిక అంశాల రీత్యా వైవిధ్యం ఉన్న దేశం. ఇక్కడి క్షేత్ర వాస్తవికతలో మార్పులు ఒక్కోచోట ఒక్కోరకంగా వస్తాయి. బాహ్యమైన మార్పులకు స్పందనలూ వేర్వేరుగా ఉంటాయి. భిన్నమైన రాజకీయార్ధిక స్థితిలో ఉండిన దక్కన్ లో, తెలంగాణలో ఆధునికతా ప్రయాణం భిన్నంగానే ఉంటుంది కదా? ఆ భిన్నత్వాన్ని అంచనా వేయడానికి విస్తృతమైన పాఠ్య విమర్శ, అనేక చారిత్రిక ఆధారాల పరిశీలన అవసరం.

  1. ఇటీవల కొంతకాలం మీ జ్ఞాపకాలు రాసారు అర్ధంతరంగా ఆపారు కారణం?

జ్ఞాపకాలు కావు, అవి అనుభవాలు మాత్రమే. మళ్ళీ రాస్తాను.

  1. ఒకవైపు గ్లోబలైజేషన్ దూసుకు వస్తున్న క్రమంలోనే స్థానికత అంశాలు కూడా ముందుకు వచ్చాయి  ప్రపంచీకరణ, స్థానికత చర్చ ఏకకాలంలో జరగడం దేనికి సంకేతం ?

ప్రపంచీకరణకు సంకల్పిత, అసంకల్పిత ప్రతిస్పందనలే  స్థానికతావాదాలు అని నా అభిప్రాయం.

  1. తెలుగు సాహిత్యంలో ఆధునికత అత్యాధునికత లాంటి చర్చను అఫ్సర్ లాంటి వాళ్ళు బలంగా ముందుకు తీసుకొని వచ్చారు. దానిమీద జరగాల్సిన అంతగా మేధోచర్చ జరగలేదు కారణం? 

తెలుగులో మేధోచర్చలు పెద్దగా జరగవు. ప్రతిపాదనలూ ఖండన మండనలూ ఎక్కువగా  ఉద్వేగాల తోనో అతిశయోక్తులతోనో కాల్పనిక వ్యక్తీకరణలతోనో ఉంటాయి. బౌద్ధిక చర్చలకు ప్రమాణాలు మనం ఇంకా  ఏర్పరచుకోలేదేమో అనిపిస్తుంది.

  1. తెలుగు భాష ఆధునికం, ప్రామాణికం కావడం లేదు అనే విమర్శ మీరు తరుచూ చేస్తూ ఉంటారు. డిజిటల్ యుగంలో రెండు మూడుతరాల వెనకబాటు కూడా ఉంది అన్నారు అంటే కంప్యూటర్ అనుసంధానం అయినంత మాత్రాన ప్రామాణికం అయినట్లేనా ?

తెలుగు ప్రామాణికీకరణ, ఆధునికీకరణ ప్రయాణం ఇంకా చాలా ఉంది. కంప్యూటర్ భాష కాలేకపోవడం అందుకు ఒకానొక సూచిక. భాష ఆధునికత ప్రధానంగా వచనంలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా విజ్ఞాన ప్రసారంలో వచనం పాత్ర పెద్దది. తెలుగు బౌద్ధిక వచనం ఇంకా అభివృద్ధి చెందాలి. రాత భాష వేరు, మాట్లాడే భాష వేరు. రాత భాషలో ప్రత్యేకం శిక్షణ ఉండాలి, వేర్వేరు ప్రయోజనాలకు వేర్వేరు రకాల రాతలు ఉంటాయి. అట్లా ప్రతి ఒక్క కోవలోని రచనకూ ప్రత్యేక శిక్షణ ఉండాలి. మనం రాసే మాటలన్నీ నిఘంటువుల్లో ఉండాలి.  పదస్వరూపం నియతంగా ఉండాలి. కనీసం, సాధ్యమైనంత తక్కువ రూపాలు ఉండాలి. పరిభాష స్థిరపడాలి. ఇదంతా, ఎవరో ఆదేశిస్తే జరిగేవి కావు. ఆధునిక సమాజంలో భాష ప్రామాణికతను నిర్ణయించడానికి, తగిన ప్రతిష్ట,  విశ్వసనీయత, ప్రమాణ బద్ధత సాధించిన వ్యవస్థలు ఉండాలి. అవి ప్రభుత్వ యాజమాన్యం లోనివైన, ప్రభుత్వేతరమైనవైనా. భాష వంటి విషయాల్లో ప్రైవేటుగా వచ్చే చొరవ తక్కువ. ప్రభుత్వం కల్పించుకుంటే, కొంతకాలానికైనా, ఒక స్వయం చాలిత వ్యవస్థ ఏర్పడుతుంది. ఒక భాషా సమాజం తనను తాను అభివృద్ధి పరచుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే, భాషాభివృద్ధి ప్రయత్నాలూ జరుగుతాయి. విడిగా సాధించగలిగేది తక్కువ.

  1. ఒక నాడు ప్రపంచాన్ని శాసించిన గ్రీక్, లాటిన్, లాంటి భాషలు, రాజ్యాలు నేడు అంతరించి పోయాయి. ప్రజలనుంచి దూరం అయిన సంస్కృతానికీ అదే గతిపట్టింది. ఇప్పుడు తెలుగుకు ఆ దుస్థితి ఎంతో దూరంలో లేదు. ప్రజల అవసరాలని తీర్చని ఏ భాషనూ బలవంతంగా బ్రతికించలేము ఈ స్థితిలో తెలంగాణ తెలుగు బ్రతికేనా?

మీరు చెప్పిన భాషలు అంతరించిపోవడానికి కారణాలు వేరు. ఆ భాషలు పోయినా వాటి సంతానమో తోబుట్టువులో సంబంధీకులో వ్యవహారంలో ఉన్నాయి. అదొక సహజ పరిణామం. తెలుగు బతుకుతుంది. తెలుగు మాట్లాడే సమాజాలు సకల సామాజిక రంగాలలో స్వయంసమృద్ధి సాధిస్తే భాష కూడా పురోగమిస్తుంది.

  1. ఒకనాడు పత్రికల్లో సాహిత్య, ఎడిట్ పేజీలలో  ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకుల పెయిడ్ ఆర్టికల్స్ కూడా ఎడిట్ పేజీలలో దర్శనం ఇస్తున్నాయి. మీ కామెంట్?    

మీ అభిప్రాయంలో పొరపాటు ఉంది. పెయిడ్ ఆర్టికల్స్ లేదా పెయిడ్ న్యూస్ సమస్య జాతీయ స్థాయి సమస్య. ఎడిటోరియల్ పేజెస్ లో ఆ సమస్య లేదు. రాజకీయ, సామాజిక భావాల ఘర్షణకు, వినిమయానికి ఒకే వేదిక లభిస్తున్నదంటే, రాజకీయపార్టీలు, నాయకులూ దాన్ని వినియోగించుకోకుండా ఎందుకు ఉంటారు? తెలంగాణ ఉద్యమకాలంలో అనేకమంది ఉద్యమకారులు, రాజకీయనాయకులు రచనలు చేసారు. వాళ్ళిప్పుడు అధికారంలో ఉన్నారు. రాయడం ద్వారా వచ్చే ప్రతిష్ట వాళ్లకు తెలుసు. అలాగే తెలుగుదేశం వంటి పార్టీలలో మొదటినుంచి కొందరు విశ్లేషకులు, వ్యాసకర్తలు ఉన్నారు. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న కాలంలో వారి మేధోవిభాగాల వారు విరివిగా రచనలు చేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగిస్తున్నారు. ఇక లెఫ్ట్ సంగతి సరే సరి. రచనలు చేయడం వారి ముఖ్యమైన ఆచరణ రంగాలలో ఒకటి.  అధికార రాజకీయాలకు దూరంగా ఉన్న, సామాజిక రంగాలకు సంబందించిన యువ రచయితలు, ఈ రాజకీయ వ్యాసకర్తలు తమ స్పేస్ ను లాగేసుకుంటున్నారని భావించవచ్చు. కాని, వికసించవలసిన వేయి ఆలోచనల్లో రాజకీయ నేతలవి కూడా ఉంటాయి కదా.

*

 

 

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి ఇంటర్వ్యూ. చాలా విషయాలు తెలిశాయి.

  • అస్తిత్వ రాజకీయాలు, తెలంగాణ సాంస్కృతిక వికాసం, స్థానికత, ప్రాంతీయత, భాషా రాజకీయాల వంటి అంశాల మీద దాదాపు ఇరవై ప్రశ్నలు, విస్తృతమైన సమాధానాలతో కూడిన ఇలాంటి ఇంటర్వ్యూ చదివి చాలా రోజులయింది. అడగవలసిన ప్రశ్నలు నిర్మొహమాటంగా అడిగి మంచి సమాధానాలు రాబట్టుకున్నారు. సీతారాములు గారూ, బహుశా మీరే ఈ ఇంటర్వ్యూకి రెండవ భాగాన్ని సాధించగలరు. ఈసారి పాత్రికేయ రంగం మీద ప్రశ్నలు విస్తారంగా ఉండాలేమో!

  • Worth reading interview Gurram Seetaramulu, You did a good job ????????. నడుస్తున్న కాలం అడుగుతున్న ప్రశ్నలు. వెతుకున్న జవాబులు. నువ్ అడిగిన ప్రశ్నలకు పూర్తి జవాబు వచ్చింది అనుకోను, ఇంటర్వ్యూ పరిధి దృష్ట్య. ‘వాడుక భాషను కృత్రిమం చేసింది పండితులే. మళ్ళీ వాడుక భాషకు పితామహులు అంటూ వచ్చింది పండితులే. వాడుక భాష ఎప్పుడు వాడుక ప్రజల్ని వదిలి లేదు.’ అన్నాడు కళ్యాణరావు తన ‘తెలుగు నాటకం మూలాలు’ ప్రసంగం. ఆ లెక్కన చేస్తే గిడుగు, గురజాడలను తుత్తినియలు చేసిందనే చెప్పొచ్చు. ఎందుకSrinivas Kandlakuntata ‘ఏ వ్యక్తి గురించయినా అతను నిర్వహించిన పాత్రనయినా, నాటి గరిష్ట ప్రగతిశీలతని ప్రమాణంగా చూడాలి. దిద్దుబాటు ప్రాసంగికత తుత్తినియలు అయిందని నేను భావించడం లేదు. దిద్దుబాటును చారిత్రికంగా సరి అయిన రాజకీయ దృక్పథంతో అంచనా వేయడంలో మనం ఒక అడుగు ముందుకు వేశాము. మునుపటి అంచనాలోని లోపాలను దిద్దుకున్నాము.’ అన్నాడు. ‘మనం వేసిన ముందడుగు, లోపం’ ఏంటో కూడా చెప్పాల్సింది.

    ‘నిర్వహించిన వారి ఉద్దేశాలు ఏమైనా, ఆ సభలలో పాల్గొన్నవారి ఉత్సాహాన్ని గమనించినప్పుడు, తెలంగాణ ఉద్యమకాలంలో బాధితులుగా నినదించిన అస్తిత్వ సాంస్కృతికతను, ఇప్పుడు విజేతలుగా వేడుక చేసున్నట్టు అనిపించింది.’ అయితే ఎవరు విజేతలు అనేది తెలాల్సిన ప్రశ్న. కొందరు ‘విజేతలు వేడుక’ చేసుకుంటున్నప్పుడు మరికొందరు పోలీస్ స్టేషన్లలో మగ్గారు. ఎనమండుగురు పోలీసు తూటాలకు చంపబడ్డారు. నిర్వాహకుల ఉద్దేశాలను బట్టే సభలు నిర్వహించబడతాయి. ఎవరి నినాదం వెనుక, కార్యక్రమం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంతకాలం ప్రజలు మోసగించబడతారు.

    పాల్కురి ఆదికవి అనేది తెలంగాణ అస్తిత్వం బలంగా చెబుతూనే ఉన్నది. అయితే ఎక్కడ బసవపురాణం ప్రస్తావన లేదు. శ్రీనివాస్ కూడా దాన్ని దాటవేసినట్టు అనిపించింది. అయితే ఆదికవి అనేదానిపైనే చాలా చర్చ జరిగింది. రాత ప్రతిపాదికత అవుతుందా? అల్లికా? అని. ‘అంటరాని వసంతం, తెలుగు నాటకం మూలాలు’ జీకే ఒక తెలుగు సాహిత్యం పైనే గాక మొత్తంగా సాహిత్యంపై సంధించిన ప్రశ్నలు. ‘ఆదికవులు, వాడుక భాష పితామహులు’ అంటూ రాతకు ఇంకా ఎన్నాళ్ళు పట్టం కట్టాలి?.

    ఇంటర్వ్యూలో కొన్ని ఖాళీలు ఉన్నట్లు అనిపించింది. తెలుగు సాహిత్యంలో ఉన్న ఖాళీలు పూరించాలి. ఆ వైపుగా కృషి జరగాలి. తెలంగాణ అస్తిత్వం మేరకు ఆ ఖాళీ కొంత పూరించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ. కాకపోతే ఆలోషియస్ అన్న మాట ఎందుకో గుర్తొచ్చింది. ‘మాములుగా అర్థం అయితే విషయాన్ని, Complex చేయడమే అకాడమిక్స్’అని శ్రీనివాస్ సమాధానాల్లో నాకు ఎందుకో కొంత కాంప్లెక్సీటి కనపడింది.

    (నాకున్న పరిమిత జ్ఞానంతో రాసిన నాలుగు వాక్యాలు)

    • థాంక్స్ అరుణ్
      వాస్తవానికి ఇంకో మూడు నాలుగు ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉండే. ఏంటి అంటే ఆంధ్ర ఆధునికత డెక్కన్ ఆధునికత కన్నా భిన్నమైనది అని ఆయన సిద్ధాంత గ్రంధం లో ఈ అంశం ఫోకసడ్ గా ఉంది. ఎందుకో సమాధానం ఇవ్వలేదు. వాస్తవానికి ఈ సంభాషణ కొంచం చదువరులకు మాత్రమె ఉపయుక్తం. దానిని సింపుల్ ఫై చేయలేక పోయాం ఇద్దరమూ..ఆడికి ప్రశ్నలు కష్టంగా క్లిష్టంగా ఉన్నాయి అనికూడా K S అభిప్రాయ పడ్డాడు.
      అయినా ఇష్టంగా రాసాడు ఓపికతో ,ఓరిమి ,యుక్తితో…

  • మారుతున్న సమాజం గురించిన సైద్ధాంతిక దృక్పథం ప్రజల్లో బాగా వృద్ధిలోకి వస్తోందని చెప్పాలి, ఇందుకు సహకరించడంలో పాత్రికేయులదే ప్రధాన పాత్ర అన్నిపిస్తుంది.

    ముఖ్యంగా మున్ముందు తరాలకి బాటలు వేయగల వ్యక్తులు పాత్రికేయులే – వీరి వలన జరిగే మార్పు సాధారణంగా పెద్దస్థాయిలో ఉంటుంది.

    ఇంత వివరమైన పరిశోధన (ఎనాలిసిస్) చేయగలగడం నిజంగా చాల చక్కని విశయం. ఇది నాకింకా కొట్టవలసిన పిండే !

    అయితే, శ్రీనివాస్ గారి శైలి, వాడుకచేయు పదబంధములు, ప్రసంగములు చేయు విధానము, సరళి, వాక్కుల వెనక నిబద్ధత – అసామాన్యమైనవిగా గుర్తించాను … ఇది కలిగి ఉన్న వ్యక్తులను నేను తరచుగా కలుసుకోలేదు.

    అలాగే, రోజూ పత్రికలలో ప్రకటించు విధంగా ఊకదంపుడు ఉపన్యాసములు దంచే మామూలు రాజకీయ నాయకులని – ప్రజలపై పెద్ద పాత్రని ప్రభావాన్ని నెరపే వారిని – ఒక దారిలో పెట్టి వారికి శిక్షణా తరగతులు కండక్ట్ చేయడం గురించి ఇటువంటి కొందరు పాత్రికేయుల సమూహం వారు ఆలోచన చేస్తే – సమాజం కొంత విద్యని ఒడిసిపట్టగలదు …

  • శ్రీనివాస్ గారు సుప్రభాతంలో రాసిన వ్యాసం నేను ఎడిటర్ గా ఉన్నప్పుడు వచ్చిందే.. రత్తయ్య గారు గొప్ప ప్రజాస్వామిక వాది. నేను ఎడిటర్ గా చేసిన కాలంలో తెలంగాణకు సంబంధించిన అంశాలను విరివిగానే అచ్చు వేస్తూ వచ్చాను… – కాసుల ప్రతాపరెడ్డి

  • “అలాగే, ఇంగ్లీష్ చదివినంత మాత్రాన ఉపాధిసమస్య తీరుతుందనీ భావించలేను. చాలా దేశాలలో వారి స్థానిక భాషలలోనే విద్యాబోధన చేస్తున్నారు. అయినా అక్కడ ఉపాధికి అడ్డు రావడం లేదు.” ఈ వాక్యాలు పూర్తి నిజాల్ని చూపించడం లేదు. చాలా దేశాలు అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు అని. అదే పోనీ, ఉగాండా తీసుకుంటే? తేలేదేమిటంటే, ఉపాధికీ, మీడియం భాషకీ మధ్యన సంబంధం లేదు.

    కానీ, వేరే విధంగా సంబంధం ఉన్నది. ఈ నాడు, ఏది నేర్చుకొవాలన్నా సదుపాయాలు ఉన్నాయి, internet మీద. ఈ పాఠాలన్నీ దాదాపు ఇంగ్లీషులోనే ఉంటాయి. ప్రపంచ సాహిత్యం అనువాదాలు దొరుకుతాయి (మూలాన్ని మించకపోయినా). ఇంగ్లీష్ బాగా రానివారు రెండు ముఖ్యమైన value generation loop ల నుంచి బయట ఉంటారు: విజ్ఞాన ఉత్పత్తి, విజ్ఞాన వినియోగం.

    మరి మాండరిన్ నేర్చుకుంటామా? మీడియం భాష రెండు ఉపయోగాలుగా భావించ వచ్చు. ఒకటి ఉద్యోగ, వ్యాపారాల కోసమైతే, మరొకటి, నేర్చుకోవడం కోసం. (మీడియం కాక, అసలు భాష ప్రయోజనాలు బహు విస్తృతం). ఇప్పటి వరకూ, మాండరిన్ లో విజ్ఞాన కోశాలు, సమితులు ఏర్పాటు కాలేదు. కానీ, ఉద్యోగ, వ్యాపార పరంగా, అమెరికాలో మాండరిన్ నేర్చుకోవడం పెరిగింది. మా స్కూల్ లో, మాండరిన్ రెండవ భాషగా చదివే వారు, దాదాపు పది రేట్లు పెరిగారు, గత పదేళ్లుగా.

    నా అభిప్రాయం, తెలుగు మీడియం లో చదువు చెప్పాలో లేదో, శాస్త్ర వేత్తలని అడగాలి. తెలుగు రచయితలు, తెలుగు మీద ఆధార పడి ఉండేవారు నిస్వార్థంగా అభిప్రాయం చెప్పలేరు. మీడియం కాకుండా, ప్రత్యేకాంశంగా భాష నేర్పితే, నిజానికి, ఆ భాష కేవలం ప్రజల భాషలాగా మార్చడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ సబ్జెక్టులు తెలుగులో చెప్పడానికి, తెలుగుని ప్రజలకు దూరం చేయాల్సి వచ్చింది! (కర్బన ద్వి ఆమ్లజని? ద్వివర్గ సమీకరణం? కృష్ణవస్తు వికిరణం? Render unto Caesar what is Caesar’s and unto Lord what is Lords అన్నట్లు, నేర్చుకొనే మీడియం కీ, సంస్కృతికీ మధ్యన తేడా చూపిస్తే పోతుంది. ఇది అంత అభిలషణీయం కాకపోయినా, తప్పని సరి అవసరమేమో!).

    • రామారావు గారూ విలువైన ప్రశ్న. మూడో ప్రపంచ దేశాలలో భాష పట్ల భాషా రాజకీయాల పట్ల పూడ్చలేనన్ని అఘాతాలు ఉన్నాయి.వలస పాలనలో స్థానిక భాషలకు అన్యాయం జరిగింది.అన్య భాషలు స్థానిక భాషల మీద తిష్ట వేసి అనగదొక్కాయి అనే వాదన. ఒక భాష ఆయా ప్రజల అవసరాలు తీర్చలేనప్పుడు అనివార్యంగా అవసరం అయిన భాషనే ఎంచుకుంటాడు. ఇవ్వాళ స్తానిక భాషా జ్ఞానం ఉపాది చూపలేక పోతుంది కాబట్టే అంగ్లమో మరో విదేశీ భాష వైపో పోతున్నారు. శ్రీనివాస్ గారు “అలాగే, ఇంగ్లీష్ చదివినంత మాత్రాన ఉపాధిసమస్య తీరుతుందనీ భావించలేను” అనగలిగారు కానీ మాతృభాష మృతప్రాయం అవుతున్న విషాదాన్ని వొప్పుకోవడం లేదు.దానిని అధిగమించడానికి భాష ఇంకా ఆధునిక సాంకేతికతను అందుకునే అంతగా ఎదగాలి దానికోసం ఏం చేయాలి అనే ఆలోచన చేయడం లేదు.విషాదం ఏమిటి అంటే ఆంగ్ల భాషా వ్యతిరేకులు అది తెచ్చిన ఆధిపత్యానికి వ్యతిరేకులా కాదా అనేది తేల్చుకోలేక పోతున్నారు.భాష కోసం కంట శోష పెట్టె వాళ్ళ ఆచరణను అందరూ ఎద్దేవా చేస్తున్నారు.ఒక తెలుగు పండితుడు,భాషా ఉద్యమకారుడు తమ పిల్లలను ప్రభుత్వ అందునా మాతృభాష మాద్యమం లో చదివించడం లేదు. వాళ్ళు మాతృభాష నేర్చుకున్నా లేకున్నా వోరిగేది లేదు. ఒక రకంగా ఇప్పుడిప్పుడే ఆంగ్ల భాష వైపు వస్తున్న సమూహాలను నీరు గార్చే ప్రయత్నం ఒక కుట్రగానే అనుకోవచ్చు.భాష ను ఒకరు బ్రతికించలేరు ప్రాణం పోయనూలేరు.ప్రజలు తమ అవసరాలకు అవసరమైన మాధ్యమాలను ఎన్నుకొనే చైతన్యం వచ్చింది.

      • మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. మరో సారి కలుసుకుందాం.

        –రామారావు

    • దివికుమార్‌ జవాబు…

      బడికి వెళ్ళటానికి ముందే విద్యార్థులు ఎంతో ఒకింత భాషా పరిజ్ఞానంతో వుంటారు. అది సహజంగా తల్లి భాషే అయి వుంటుంది.తమ యింటిలో , ఇరుగు పొరుగు వారి భాషకూడా వారి తల్లిదండ్రుల భాషే అయివుంటుంది.
      సమస్య ఎక్కడ వున్నదంటే … సహజమైన, నిత్య వినియోగంలో వుండే మాతృ భాష ద్వారా పరాయి జీవిత భాషను నేర్వటం సులువా? లేక పరిచయం లేని జీవితానికి చెందిన పరాయి భాష ద్వారా పరిచయం లేని భాషను నేర్వటం సులువా?
      2. సమస్త ఆధునిక జీవన రంగాలను మాతృభాష ద్వారా నిర్వహించుకునే ప్రక్రియ అభివృద్ధి చెందకుండా భాష ఆధునిక మయే సమస్యే లేదు. లేకపోగా తెలుగు భాష మాట్లాడే భాషగా మారుతూ మౌఖిక భాషగా దిగజారడం ఖాయం. దాని తర్వాత దశ క్రమేణా కనుమరుగు కావడం.
      ఈ లోగా ఇటు తెలుగూరాని అటు ఇంగ్లీషు రాని ఇంటి కూటికీ బంతి కూటికీ చెడిన వారు తయారవుతారు.
      గడిచిన 30 ఏళ్ళ ల్లో సాగిన ఇంగ్లీషు మాధ్యమపు చదువు లను మదింపు చేయాలని ఎందుకు కోరటం లేదు?

      ఇంగ్లీషు మాధ్యమం లో చదువులు వెనుకే..అమెరికా పరుగులు న్నాయి. ఈదేశం లో బతికే ఆశలు అడుగంటి నాయని కదా దాని అర్ధం. అందుకు ఈ దేశ పాలకులు ఇసుమంతైనా సిగ్గు పడటం లేదు. మన పిల్లలు ఇంగ్లీషు బాగా నేర్చుకోవాల్సిందే. అది మాతృభాష ద్వారా నే సులువుగా, బాగా వస్తుంది. అందుచేత తెలుగు ద్వారా ఇంగ్లీషు బాగా నేర్పే ఏర్పాట్లు గురించి పాలకులకు సలహా లు ,సూచనలు యివ్వటం పై మేధావులు దృష్టి సారించాలి…దివికుమార్‌

  • చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. చర్చించాల్సిన అంశాలు ఎన్నో వున్నాయి.

  • క్రిటికల్ ఇంటర్వ్యూ. ప్రశ్నలు మరీనూ. అయితే శ్రీనివాస్ గారి సమాధానాలన్నీ సింపుల్ గా చెప్పారు. మరీ ముఖ్యంగా సీతారాములు గారు, తెలంగాణ భాష, తెలుగు ఆధునికత లో ప్రాంత భేధం, ఆది కవి ఎవరు, తెలంగాణా తెలుగు మనుగడ లాంటి ప్రశ్నల్లో ఏం సమాధానాలు ఆశించి అడిగారో అర్ధం కాలేదు. శ్రీనివాస్ గారి సమాధానాలు విస్త్రుతంగా, వినమ్రంగా, ప్రేమగా ఉన్నాయి. అతని పరిశోధనాంశం ఏదైనప్పటికీ, తెలుగు పత్రికా విలువల్ని ప్రస్తావిస్తే అతని భాష, భావమూ, ఎప్పుడూ వాగ్మయ ప్రామాణికత లో నే ధ్వనిస్తుంది. మరీ ముఖ్యంగా బౌద్ధిక చర్చలు, వలస ఆధునికత పట్ల భౌగోళిక ప్రమేయాల్లాంటి విషయాల మీద శ్రీనివాస్ గారు మరింత స్పష్టంగా చెప్పాల్సి ఉంది. Anyway ఇది పాఠ్యాంశం లా ఉంది. టూ క్రిటికల్. కొంత సామాన్య జనాల్నీ పరిగణలోకి తీసుకుని అడగాల్సిన ప్రశ్నలున్నాయి శ్రీనివాస్ ని. అతనొక వంతెన లా నిలబడ్డ పాత్రికేయుడు. ఆ కోణంలో రెండో భాగం కూడా సిద్దం చేయండి. సమాధానాల్ని సంతోషంగా చదివాన్నేనైతే. థ్యాంక్స్ అఫ్సర్ సాబ్. క్లాప్స్ సీతారాములు, నమస్తే అందమైన వచన శైలీ శ్రీనివాస్ గారు.

    • ఇది ఒక సంభాషణ మాత్రమె కాదు.చరిత్ర,సంస్కృతి,ఆధునిక కవితా వికాసాల మీద పరామర్శ. ముఖ్యంగా పరిశోధకులకి ఉపయుక్తమైన సమాచారం . తెలుగు చరిత్ర సంవాదం లో ఇలాంటి మేధో చర్చలు చేసే సందర్భం అరుదు. ప్రశ్నలు అడిగిన సమాధానాలు చెప్పిన ఇద్దరూ ఉద్దండులు అనే విషయం దోహదకం అవుతుంది. ఒక సంభాషణ ఇంత లోతుగా ఉంటుందా అనిపించింది. ఈ ఇంటర్వ్యూ ఒక పాత్రికేయుడు మరొక పరిశోధకుడు అందునా ఆంగ్లం లో పరిశోధన చేసిన సీతారాం సాహిత్య చరిత్ర మేధో విషయాల మీద ఇంత సమగ్రమైన చర్చ ఈ సందర్భంగా మనందరికీ ఇవ్వడం నిజంగా సంతోషం.మా విద్యార్ధులకు ఈ ఇంటర్వ్యూ తరగతి గదిలో చర్చకు పెట్టాను.

  • ఇంత మంచి ప్రశ్నలూ- వాటిని సరిగ్గా అర్ధంచేసుకుని ఇచ్చిన సమాధానాలూ ఈమధ్యకాలంలో చదివిన గుర్తులేదు.
    శ్రీనివాస్ గారి ఈ జవాబుతో నాకు పూర్తి ఏకీభావం ఉంది.
    ‘తెలుగులో మేధోచర్చలు పెద్దగా జరగవు. ప్రతిపాదనలూ ఖండన మండనలూ ఎక్కువగా ఉద్వేగాల తోనో అతిశయోక్తులతోనో కాల్పనిక వ్యక్తీకరణలతోనో ఉంటాయి. బౌద్ధిక చర్చలకు ప్రమాణాలు మనం ఇంకా ఏర్పరచుకోలేదేమో అనిపిస్తుంది.’
    చర్చలు చేసే పద్దతి పట్ల మనవారు సుదూరగతంలో చాలా కాన్షస్ గా పనిచేసారు. అది నేడు మృగ్యం.
    ‘భారతజాతి, తెలుగుజాతి వంటివన్నీ నిర్మిత అస్తిత్వాలే.’ ఇది చాలా సరళంగా చెప్పినమాట. దీని
    గురించి చాలాకాలంగా రాయాలని ఆలోచన.
    శ్రీపాద తెలుగుజాతి అనే అస్తిత్వం నిర్మించాలని సాహిత్యపరంగా చాలా గట్టి ప్రయత్నం చేసారు. “తెలంగాణలో నెరవేరిన శ్రీపాద కల” అనే పేరున తెలంగాణా ఏర్పడిన కొత్తలో ఒక ప్రయత్నం చేసాను.

  • చాల అద్భుతంగా రాసినారు డాక్టర్ గుర్రం సీత రాములు గారు కె.శ్రీనివాస్ గారు ..దళిత బహుజనులు ఇతర బాషలలో చదువు కొని తెలివిగా మారడం ఇష్టం లేకనే మా భవిషత్తు తరాల మీద కుట్ర చేస్తున్నారనే భావన

  • ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ.. తెలంగాణ భాష..దాని అస్తిత్వం పై మీరు కూడా చాలా లోతైన ప్రశ్నలు అడిగారు.. అందుకు సంబంధించి ఆయన ఇచ్చిన సమాధానాలు నిజంగా తెలంగాణ అంతా కరపత్రాలు రూపం లో రావాలి…అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన తెలుగు మృత భాష కాదు అని చెప్పిన అంశం అద్భుతం.. అఫ్సర్ గారు మొదలెట్టిన ఆధునికత ..తెలుగు బాషా అనే అంశంపై కూడా చాలా అద్భుతంగా చెప్పారు.. చాలా నిగూఢమైన విశేషాలు..వివరాలు కలిగిన వ్యక్తి నుండి అంతే తెలివిగా..చాకచక్యంగా సమాధానాలు రాబట్టారు..ఒక గోప్పా వ్యాసంగా చెప్పొచ్చు.. కుడోస్ ఇద్దరికీ…అభినందనలు..

  • తమ్ముడూ! మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. శ్రీనివాస్ గారు చెప్పిన విషయం కూడా సమగ్రంగా ఉంది.

  • ఒకప్పుడు ఎడిటోరియల్ పేజీ లో ప్రముఖ మేథావులు, గొప్ప రచయితలు,ఉద్యమ కారులు దేశ,రాష్ట్ర స్థితి గతులు గురించి రాస్థే చదువుతుంటే ప్రజల్లో ఆలోచనలు పెరిగి ప్రశ్నంచడానికిసిద్దమయ్యేవారు. పాలకులు, ప్రతిపక్ష నాయకులు సరిదిద్దుకొనే వారు కానీ ఈ వేల ఎడిటోరియల్ పేజీ లో తప్పులు చెసే బడా రాజకీయ నాయకులు, అధిఅధికారంలోఉండి మెజారిటీ ప్రజల హక్కుల్ని కాలరాసే నాయకులు,రాసే రాతల్ని చదవాల్సిన పరిస్థితి రావడం చూస్తూన్నాము బాధాకరం.ఇంటర్యూబాగుంది అందుకు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు