బహుజన హితాయ-బహుజన సుఖాయ 

Cue sheet రేడియో ప్రసారాలకు కీలకం.

ఉదయం సిగ్నేచర్ ట్యూన్ తో మొదలై రాత్రి జైహింద్ తో ప్రసారాలు ముగిసేవరకు ఏఏ కార్యక్రమాలుంటాయో చెప్పే డేటా షీట్ అది. ఒకవిధంగా చెప్పాలంటే రేడియోలో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు అంటే ఆ సమయానికి ప్రసారం అవ్వాల్సిందే.ఖచ్చితత్వం రేడియో ప్రసారాల ప్రాధమిక సూత్రం.

ఇది అమలు చేయటానికి క్యూ షీట్ తోడ్పడుతుంది.

అటు అనౌన్సర్ కు,ఇటు కంట్రోల్ రూమ్ లోని ఇంజనీర్లకు సమన్వయం ఏర్పడుతుంది.అలాగే డ్యూటీ ఆఫీసర్ కార్యక్రమాలను రేడియో లో వింటూ మానిటర్ చేస్తున్నప్పుడు, ఏమైనా తేడాలుంటే గమనించి, కరెక్ట్ చేయటానికి ఛాన్స్ ఉంటుంది.

రేడియో కార్యక్రమాలు రూపొందించడం లో మార్పులు, చేర్పులు,ఢిల్లీలో ఉండేటటువంటి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో సంబంధిత అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న రేడియో కేంద్రాల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.తద్వారా కార్యక్రమాల్లో ఏకసూత్రతను అనుసంధానిస్తారు 

ఆకాశవాణి కేంద్రాలన్నీ వివిధ వర్గాల శ్రోతలకు ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందిస్తాయి.అది ఈనాటికీ కొనసాగుతోంది.కొన్ని చెప్పాలంటే వ్యవసాయదారులకు, పిల్లలకు, మహిళలకు, యువతకు, సీనియర్ సిటిజన్లకు ఇలా అన్నమాట. ఒక్కో కేంద్రం తన ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఆ కార్యక్రమాలకు పేర్లను జోడిస్తుంది.

ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం “ఇల్లు -వాకిలి” పేరుతో అరగంట సేపు రైతులకు కార్యక్రమం ప్రసారం చేస్తే, విజయవాడ కేంద్రం “పంటసీమలు”గా ప్రసారం చేస్తుంది.

రేడియో అంటేనే సంగీత, సాహిత్యాలకు పెద్దపీట వేస్తుందని వేరే చెప్పనక్కర్లేదు కదా.దక్షిణాది రాష్ట్రాల రేడియో స్టేషన్లలో కర్నాటక శాస్త్రీయ సంగీతం సింహభాగం తీసుకుంటే ఉత్తరభారతంలో హిందూస్తానీ సంగీతం ఆ స్థానం తీసుకుంటుంది.దీనితోబాటుగా లలిత సంగీతం,జానపద సంగీత కళాకారులకు అండగా నిలిచేదీ ఆకాశవాణే.

ముఖ్యంగా సంగీత కళాకారులకు ఆడిషన్స్ నిర్వహించి వారి ప్రతిభకు అనువైన గ్రేడింగ్ ఇస్తుంది.ఇందుకోసం ఆడిషన్ బోర్డు ఉంటుంది.B,B high,A,A top .. ఈవిధంగా ఆ గ్రేడింగ్ ఉంటుంది.వీరిని performing artists అంటారు.

ఆకాశవాణిలో నాటక విభాగం కూడా చాలా ముఖ్యమైనది.

శ్రవ్య నాటకానికి,దృశ్య మాధ్యమంలో చూసే డ్రామాకు తేడా ఉంటుంది.రేడియో డ్రామా వినే శ్రోతలకు ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది.ఆర్టిస్టు తన గొంతులో అనేక భావోద్వేగాలను పలికించటం ద్వారా,శ్రోతను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకెళతాడు.ఈ క్రమంలో ఆ శ్రోతను మెప్పించగలగాలి అతను.అలా రేడియో డ్రామాలో నటించే  కళాకారుడికి శ్రవ్య నాటకమెప్పుడూ ఓ ఛాలెంజ్..ఓ సవాల్..

ఒక శారదా శ్రీనివాసన్,ఒక నండూరి సుబ్బారావు,ఒక రవివర్మ,ఒక నండూరి విఠల్,ఒక కోకా సంజీవరావు,ఒక చిరంజీవి.. అలా తమ గొంతుతో వీరంతా శ్రోతల మదిలో,హృదిలో నిలిచిపోయారు..బందా కనక లింగేశ్వర రావు విజయవాడ కేంద్రం లో డ్రామా ప్రొడ్యూసర్ గా రూపొందించిన నాటకాలు ఈనాటికీ గుర్తుండిపోయాయి.

“గణపతి”,”వరవిక్రయం”, “కన్యాశుల్కం” నాటకాలు ఆయన నిర్వహణలో రూపొందినవే..

ఇక సాహిత్య కార్యక్రమాల అంశానికి వస్తే తొలిరోజుల్లో 

ఆకాశవాణిలో ఆనాటి సాహితీ దిగ్గజాలు కొలువై ఉండేవారు.దేవులపల్లి కృష్ణశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, స్థానం నరసింహారావు, రావూరి భరద్వాజ, త్రిపురనేని గోపీచంద్ వంటి వారు పనిచేసేవారని చెప్పుకున్నాం కదా.

అలా రేడియో ఆరోజుల్లో ప్రింట్ మీడియాతో పోటీ పడుతుండేది.

రేడియో భాషా సాహిత్యాలకు చేసిన సేవ వెలకట్టలేనిది.రేడియో ప్రసారాలు కొన్ని తరాలకు భాషా సంస్కృతుల పట్టుగొమ్మగా నిలిచాయి.ఆకాశవాణి అంటే అంతులేని అభిమానం శ్రోతలకు అందరికీ అందుకే.

ఆకాశవాణి సమాచార స్రవంతిగా,వినోద వాహినిగా,విద్యాప్రదాతగా తన బాధ్యతలు అప్పుడూ నిర్వహించింది.ఇప్పుడూ నిర్వహిస్తోంది.దేశవ్యప్తంగా ఉన్న నాలుగు వందల ఇరవై పైచిలుకు కేంద్రాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.”బహుజన హితాయ-బహుజన సుఖాయ” అన్న లోకోక్తి కి అనుగుణంగా ప్రజాసేవా ప్రసారాలను నిర్విరామంగా అందిస్తోంది.

ఇక ఆకాశవాణి విజయవాడ కేంద్రం లో నా ప్రయాణం పదకొండేళ్లపాటు సాగింది.డ్యూటీ ఆఫీసర్ గా చేరానని చెప్పాను కదా. మా ప్రధాన విధి, రేడియో ప్రసారాలు 

అంతరాయం లేకుండా ప్రసారమవుతున్నాయాలేదా అన్న అంశాన్ని పర్యవేక్షించటం.

అదనంగా రేడియోకి సంబంధించిన సమాచారాన్ని అనేకమంది ఫోన్ ద్వారా ఎంక్వైరీ చేస్తుంటారు.వారికి కావలసిన సమాచారాన్ని అందించటం తో పాటు, అపోహలను, అనుమానాలను తొలగించటం.. దీనితోపాటు ప్రసారమైన కార్యక్రమాలను సర్టిఫై చేసేందుకు Logbook లో ఎంట్రీస్ వేయాల్సి ఉంటుంది.రికార్డు చేసిన ఆర్టిస్ట్ లకు చెక్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.మేము పనిచేసే ప్రదేశాన్ని “డ్యూటీ రూం” అంటారు.మమ్మల్ని డ్యూటీ ఆఫీసర్ అంటారు..ఇవే కాకుండా రేడియో కార్యక్రమాల్లో పాల్గొనాలి.రూపొందించాలి..స్క్రిప్ట్ లు అవసరమైనప్పుడు రాయటానికి సిద్ధంగా ఉండాలి.

నేను చేరిన తొలి రోజుల్లో, ప్రసారాలను అర్థం చేసుకునే క్రమంలో ఓ సంఘటన జరిగింది.అది నన్నొక విధంగా షాక్ కు గురి చేసింది.. అదేమిటంటే!

*

రాంబాబు చెన్నూరి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాంబాబు గారు కాలం మారిందని డ్యూటీ రూమ్ కాన్సెప్ట్ కూడా మారింది. ఇప్పుడు అంతా AI తరం. Radio ను జీతంగా చూస్తూ ఉన్నారు. మీ ఉద్యోగ సమయం లో చివరి రోజుల్లో కార్యక్రమాలను నిర్దేశించిన గురువు గారు డ్యూటీ రూమ్ ఎందుకు అన్నారు..q sheet ఏమిటి అన్నారు..ఎందుకు వ్యవసాయ కార్య క్రమం అన్నారు..మొత్తం గా అందరిని భయ పెట్టీ రేడియో ను పునర్ నిర్మించే పనిలో పడ్డారు. పదవి శాశ్వతం అనుకున్నా ఉద్యోగి కదా చివరకు పదవి విరమణ చేయాల్సి వచ్చింది అనుకోండి.

    Q sheet…Duty room ఆవశ్యకత తెలియ చేశారు. డ్యూటీ రూమ్ లో పని చేసి న వారికి దాని విలువ తెలుస్తుంది..

  • చాలా ఆసక్తి కరంగా రాస్తున్నారు.
    ఆకాశవాణీ అంటే ఏమిటో వివరంగా రాస్తున్నారు.
    తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలా చాలా బాగా రాస్తున్నారు.అభినందనలు మీకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు