బహుజన రాజ్యాధికార దిశగా ‘మంద’

కథా వస్తువు చాలా కఠినమైనది కానీ కథకుడు దాన్ని తేనె వంటి తెలంగాణ తెలుగులో ముంచి ఒక రసగుళికను తయారు చేసి పాఠకుడి నాలుక మీదికి అక్కడి నుంచి హృదయంలోకి చాలా లాఘవంగా ప్రవేశపెడుతాడు.

హుభాషా కోవిదులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  నలిమెల భాస్కర్ తెలంగాణ భాషా శాస్త్రవేత్తగా, అనువాదకులుగా, కవులుగా, పరిశోధకులుగా, విమర్శకులుగా చిరపరిచితులు. ఇరుగుపొరుగు భాషల కథలను తెలుగు చేయడమే కాదు ఆయన స్వయంగా కథకులు కూడా. రాసినవి చాలా తక్కువ కథలే ఐనా నిలిచిపోయే కథలు రాశారు. ఆ కథల్లో అయనకు బాగా పేరు తెచ్చిన, సంచలనం సృష్టించిన కథ “మంద”. ఈ కథ భారత ప్రజాస్వామ్యంపై ఒక సమగ్ర వ్యాఖ్య. ఇది నవంబర్ 27, 1977న ఆంధ్రభూమి ఆదివారం సంచికలో ప్రచురింపబడింది. ఇప్పటికీ ఈ కథ ప్రాసంగికతను కోల్పోలేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యానికి మొదటి మెట్టైన గ్రామాల్లో ఏం జరుగుతుందో ఈ కథ వాస్తవికంగా చిత్రించింది. ఇప్పటికీ ఈ దేశంలో బహుజనులు కేవలం ప్రతీ అయిదేండ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసే ఓటర్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు తప్ప రాజ్యాధికారాన్ని సాధించింది తక్కువ. కొన్ని స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించినా మళ్ళీ వాళ్ళ వెనుక ఏ ఆదిపత్య అదృశ్య హస్తమో ఉండి నడిపిస్తున్నదనేది తోసిపారెయ్యలేని నిజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పాలన వచ్చిన తరువాత కొద్దిగానైనా రాజకీయం బహుజనుల వాకిట్లోకి వచ్చింది. కానీ అప్పటిదాకా అగ్రవర్ణాల చేతుల్లోనే నలిగి పోయింది. ఈ ‘మంద’ కథ ఈ విషయాన్ని మన మనసు మూలల్లోకి చొచ్చుకు పోయేలా కథీకరించింది.

గ్రామ పంచాయితీ నిధుల్లో తనకు వాటా ఇవ్వలేదని ధర్మయ్య అనే గ్రామ పంచాయితీ కమిటీ మెంబర్ తన ఇంట్లో కొంత మందిని  జమ చేసి  చాయ్ లు పోసి  “మన వూల్లే ఈది దీపాలెందుకు  యెల్గుతలెవ్వు? పంచ కమిటీ రేడియ ఆ సర్పంచు యింట్ల ఎందుకు నిద్ర వోతున్నది? ఇగ లెక్కలు ‘చెకిన్’ చేసుటానికి పంచ కమిటీ ఆఫీసరచ్చినపుడు, పది రూపాలకు కొనని కోడి పుంజులు పదిగేను రూపాలకెందుకు అమ్ముడు పోతున్నై? సుంకరి నర్సిగాడు ఎన్నడు సైకిలెక్కంది గానాడే ప్యాటకు పోయి బీరు సీసలెందుకు తెస్తడు? రెండు నెల్లకోపారి శెక్కరి ఎందుకు పంచుతరు? కట్కర్ ల పడ్డ గోజల పైసలు లెక్కలల్ల ఎందుకు కనవడుత లేవ్వు? ఇంగ ఇట్ల శెప్పుకుంట పోతే లచ్చలున్నై. వోని లచ్చలు, కోట్లుంటై. అయి మీకు సమజ్ గావాయే. మరి గిట్లైతే మనమెన్ని దినాలు నోరుమూసుకొని వుందాము. యోశన శెయ్యుండ్రి “ అని ఆ మందకు గ్రామపంచాయితీలో జరుగుతున్న మోసాల మీద పెద్ద లెక్చరే ఇస్తాడు. మంద కూడా ‘నువ్వద్దే’ అనుకుంటుంది. ఇట్లుండగా పంచాయితీ ఎలక్షన్లు వచ్చినయి. అందుకే ఈ మీటింగు. కొందరు ధైర్యం చేసి ఈసారి ధర్మయ్యను సర్పంచ్ గా నిలవడుమన్నరు. మా ఓటు మీకే అనుకుంటూ మంద ఆన్నుంచి కదిలిపోయింది.

అదే మంద ధర్మయ్యకు తెలువకుండా సర్పంచ్ రామచంద్రరావు గడీలకు పోయింది. “రామసెంద్రరావు దొర బంగారం పిసికి శేసినట్లుంటడు. పక్కన దొర్సాని పసుపుకొమ్ములు నూరి శేసినట్లుంటది… దొర కండ్లద్దాలమ్మితే మాదిగ నర్సిగాడు మూన్నెల్లు కూకుండి బతుకుతడు. దొర కడియాలు అమ్మిన పైసల్తోటి రాఘవులు పంతులు నెల బతుకుతడు. అసలు దొర మీదున్న మాలంత అమ్మితే శిన్నగ రెండు లగ్గాలు శెయ్యచ్చు. ఇగ దొర్సాని నిండ వడ్లు పోసి నింపిన గుమ్మి తీరుగ ఉంటది. ఆయమ్మ జాకిట్లల్ల మామూలు మనుసులకైతే మూడు జాకిట్లు కుట్టియ్యచు. దొర్సాన్ని, దొరను కలిపి సూస్తే పీర్ల పండుగ నాడు దూది పీరి పక్కన లాల్ చావ నిలబెట్టినట్లుంటది.” అట్లాంటి దొర ఈ మందను చూసి “నా గుణం మీకందరికి ఎరికే వుంటది. నాకు ఇది వరకు ఎవ్వలు కూడా పోటీ నిల్సోలేదు. నాకున్న అనుభవం ఎవలకుంది?” అని తాను తన పీరియడ్ లో చేసిన ‘గొప్ప పనుల’ గురించి పూస గుచ్చినట్లు చెప్పుకొస్తాడు. అన్ని పనులు మనం అనుకున్నట్టు జరుగుతయా? దేనికైనా టైమ్ రావాలే. ఎవరైనా ఆఫీసరు వచ్చినపుడు ఆయనతోని బాసల మాట్లాడాలే కదా! ధర్మయ్య ఏం మాట్లాడుతడు. అని చెప్పి మందకు టిఫిన్లు పెట్టించి పంపిస్తాడు. మందకు దొర మాటలు కూడా కరక్టే అనిపిస్తాయి.

“పొలం సూసుకొని యింటికి పోతున్న ధర్మయ్యకు పక్క తొవ్వ నుండి దొర వచ్చేది కనిపించింది.

“ధర్మయ్య”

“అయ్యా”

“ఊకోరాదు”

“———–“

“యిగో ఇటు జూడు” ఐదు పచ్చ నోట్లు పక్క కీస నుండి తీసి అన్నడు సర్పంచు.

“నేను మాత్రం పోటీ శెయ్యాలనుకొన్నానా దొరా? ఊరి గాడిది కొడుకులు కొంత మంది బలిమీటికి      నిలవడుమన్నరు. రామశెంద్రునసొంటోల్లు మీరు. గంత అన్యాయం సేత్తనా దొరా? దొర ఇచ్చిన పచ్చ నోట్లు      కీసల పెట్టుకుంట అన్నడు ధర్మయ్య.

“నీ గుణం నాకు తెల్వదా ధర్మయ్య? ధర్మరాజు అసోంటోనివి అనుకుంట దాటి పోయిండు దొర.”

నోటుకు ఓటమ్ముకునుడే కాదు పదవిని కూడా అమ్ముకునే దశకు చేరుకున్నాం. ఈ తీరుగానే ప్రజాస్వామ్యాన్ని పాతర పెట్టుకుంటూ పోతుంటే బహుజన రాజ్యాధికారం ఎప్పటికి దక్కేను? అందుకే ఇప్పటికీ అధికారం ఆధిపత్య వర్గాల చేతుల నుండి ఇతర వర్గాల వారి చేతుల్లోకి రావడం లేదు. ఈ కథ గ్రామ స్థాయిలో కుర్చీ చుట్టూ ఎన్ని కుట్రలు జరుగుతాయో చెప్తూనే బహుజనుల అనైక్యతను ఎత్తి చూపుతుంది. కథ పేరే భారత ఓటర్ల మనస్తత్వాన్ని పట్టి చూపుతుంది. ఈ కథలో చెప్పిన విషయాల కంటే చెప్పకుండా వదిలేసిన విషయాలే ఎక్కువ. ధ్వన్యాత్మకంగా మన గుండెను తాకే విషయాలే ఎక్కువ. భారత రాజ్యాంగం వయోజన ఓటు హక్కు కల్పించింది బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే. ఇన్నేండ్ల తరువాత కూడా మనకు ఆ విషయం అర్థం కాలేదని చెప్తుందీ కథ.

కథకుడు పాటించిన కంఠ స్వరం అమోఘమైంది. శిల్ప మర్యాద కూడా కథను నాలుగు కాలాల పాటు పాఠకుడి మనస్సులో ఉండేటట్లు చేస్తుంది. అన్నింటిని మించి కథకుడు వాడిన భాష. స్వచ్ఛమైన తెలంగాణ తెలుగులో సాగుతుందీ కథ. తెలంగాణ భాషా సొగసు, సౌందర్యం యొక్క విశ్వరూపం కనిపిస్తుందీ కథలో. కథా వస్తువు చాలా కఠినమైనది కానీ కథకుడు దాన్ని తేనె వంటి తెలంగాణ తెలుగులో ముంచి ఒక రసగుళికను తయారు చేసి పాఠకుడి నాలుక మీదికి అక్కడి నుంచి హృదయంలోకి చాలా లాఘవంగా ప్రవేశపెడుతాడు. ఇదే కథను తాను అనుకుంటే సోకాల్డ్ ప్రామాణిక భాషలో సుకుమారంగా చెప్పగలడు కథకుడు. కానీ కావాలనే తెలంగాణ తెలుగును ఎన్నుకొని తన అస్తిత్వాన్ని కాపాడుకున్నాడు. పత్రికలు కూడా 1977 నాటికి తెలంగాణ తెలుగుపై ఏ మాత్రం వివక్ష చూపకుండా ప్రచురించడం గమనార్హం.

కథలోని పాత్ర చిత్రణ కూడా అబ్బురపరుస్తుంది. ఈ కథలోని ప్రధాన పాత్రలు రెండే. మిగతావి మందలో అంతర్భాగం. ఒకటి ఊరి పెద్దకాపు ధర్మయ్య. రెండు సర్పంచ్ రామచంద్రరావు. మూడే వాక్యాల్లో ధర్మయ్య వ్యక్తిత్వాన్ని చూపెడుతాడు కథకుడు. ధర్మరాజు “నిజంగా ధర్మరాజే, ఎప్పుడన్న అవుసరం పడినపుడు గాని అవద్దమాడడు. గా పొద్దు తనకు ఒక కిలో శెక్కరి రాసిండని లొల్లి జేస్తే సర్పంచు నాలుగు కిలోలు రాసిండు. ఇగ మల్ల నోరిప్పితే ఒట్టు.” రామచంద్రరావు ఆహార్యాన్ని వర్ణించడంలోనే పాఠకుడు ఆయన వ్యక్తిత్వాన్ని గ్రహిస్తాడు. అదేగాక చాలా సంవత్సరాల నుంచి గ్రామంలో తనది ఏక చక్రాధిపత్యం. దాన్ని నిలుపుకోవడానికి వ్యక్తులను కొనడానికి కూడా వెనకాడడు. ఇది ఒక గ్రామ కథ కాదు. మొత్తం మన దేశం కథ. ప్రజాస్వామ్య సౌధం ఎలా శిథిలమౌతుందో వివరించే కథ.

కథలు ఊహల్లో కాదు నిజ జీవితం నుండి పుడుతాయనేదానికి ఈ కథ ఒక నిదర్శనం. అందుకే ఈ కథ  ఇంత సహజంగా వచ్చి ఇప్పటికీ తాజాగానే నిల్చున్నది. బహుశా ఒక యధార్థ సంఘటనకు స్పందించి రాసిన కథ అయ్యుంటుంది.  1977 నాటికి ఈ కథ రాయడం ఒక విప్లవమే. ఇది రాసినందుకు గాను వ్యక్తిగతంగా కొంత ఇబ్బందిని  కూడా ఎదుర్కొని ఉంటాడు రచయిత. కథ ముగింపు ద్వారా కూడా రచయిత కొన్ని వందల పుటలలో చెప్పలేని విషయాన్ని బోధ పరుస్తాడు. ఈ కథను చదవడమంటే బహుజన రాజ్యాధికార ఆవశ్యకతను తెలుసుకోవడం. బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడం. మొత్తంగా ఈ కథ తెలంగాణ కథ ఎదిగిన ఎత్తులకు నిదర్శనంగా చూపెట్టదగిన కథ.

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ సమీక్ష మూల కథలోని పాత్రలనూ కథను పరిచయం చేస్తూనే 70లలోనే బహుజనుల రాజ్యాధికారాన్ని స్పృశిస్తూ నలిమెల భాస్కర్ చేసిన కథా రచనా సందర్భాన్ని చక్కగా వివరించారు. అభినందనలు.

  • చాలా చక్కని విశ్లేషణ .
    శ్రీధర్ గారికి అభినందనలు.

  • ఎమర్జెన్సీ తర్వాత వఛ్చిన తెలుగు సాహిత్యాన్నంతా విమర్శకులు అయితే కమ్యూనిస్ట్-మావోయిస్టు, కాదంటే సనాతన దృక్కోణములో చూసిండ్రు. దీనితో ఈ రెండింటికి సంబంధం లేకుండా వఛ్చిన సెంట్రిస్ట్ భావజాలాన్ని గుర్తించలేదు. పీడితుల పక్షాన కుల చైతన్యముతో రాసిన వారిని మీదు మిక్కిలి ఎద్దేవా చేసిండ్రు. ఎందుకంటే అంతా వర్గం గురించి మాట్లాడుతుంటే దాన్ని కాదని వర్ణం గురించి, దాని మూలంగా ఎదుర్కొనే దాడి, హింస గురించి రాయడమే దానికి కారణం. గ్రామాల్లోని బడా భూస్వాములు, దొరల గురించి వారి దౌర్జన్యాల గురించి రాయడం అంటే మృత్యువుతో చెలగాటం ఆడడమే! అంతే గాకుండా సిరిసిల్ల-జగిత్యాల ఉద్యమానికి (1978) పునాదులు పడుతున్న సమయములో ఈ కథ రావడం దొరలను డైరెక్ట్ గా ఎదుర్కోవడమే! ఇందులోని భాష కరినగరపు మాధుర్యాన్ని అందిస్తుంది. అలాంటి మైలురాయి లాంటి కథను పరిచయం చేసినందుకు వెల్డండి శ్రీధర్ కు అభినందనలు..

    • తెలుగు కథా సాహిత్యంలో నిజంగానే ఈ కథ ఒక మైలురాయి…ధన్యవాదాలు సార్..

  • నలిమెల భాస్కర్ ఊరు నారాయణపురం లో ఈ కథ ఆ రోజుల్లో పెద్ద చర్చ .ఉద్యమాలు ఇంకా అప్పుడప్పుడే ఊర్లకు వస్తున్న సందర్భం దొరల అధికారాలను ప్రశ్నించే కథ .అదీ తెలంగాణా భాషలో రావడం గొప్ప . శ్రీధర్ కథను బాగా విశ్లేషించారు .ఈ కథ పేరుతోనే నలిమెల భాస్కర్ ‘మంద ‘అనే కథా సంకలనం వెలువరించారు .ఇందులో తెలుగు కథ ఇది కాగా మిగితా పదమూడు అనువాద కథలున్నాయి .

  • మంచి విశ్లేషణ వ్యాసం సార్. మంద కథ చదవాలి.

  • మిత్రుడు డా. నలిమెల భాస్కర్ ఈ కథ ‘ మంద ‘ ను రాసిన కొంత కాలానికి తను సంపుటీకరించిన భారతీయ కథల అనువాదాలతో కూర్చి ‘ మంద ‘ పేరుతోనే ఒక పుస్తకాన్ని వెలువరించాడు.. దాదాపు పదిహేళ్ళయిందేమో. అప్పుడు ‘ ఇండియా టు డే ‘ వారపత్రికలో నేను ‘ పానల్ రివ్యూవర్ ‘ గా ఉన్నా. ఒక పూర్తి పేజ్ రివ్యూ రాసిన ( ఇండియా టు డే లో ఒక పేజ్ సమీక్ష రావడమంటే చాలా ఘనమైన విషయమే అప్పుడు ) ఈ ‘ మంద ‘ కథను మిగతా సమకాలీన భారతీయ కథలతో పోలిస్తే ఎందుకు ఒక ఉత్తమ కథగా అవతరిస్తోందో మూల్యాంకనం చేస్తూ విపులంగా చెప్పడం జరిగింది. ఆ వారం భాస్కర్ ఆ సమీక్షను చూచి ఫోన్ చేసి.. ఎంతో మురిసిపోతూ తెలుగు కథా ఉన్నతిని పాఠకలోకానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పాడు.
    ఇప్పుడు .. ఇన్నాళ్ళకు శ్రీ శ్రీధర్ మళ్ళీ ఈ ‘ మంద ‘ కథను తడిమి.. ఆ జ్ఞాపకాల తుట్టెను కదిపిండు.
    కృతజ్ఞతలు.

    – రామా చంద్రమౌళి

    • డా. నలిమెల భాస్కర్ గారు రాసిన “మంద” కథను మొదట నేనే సమీక్షించానని అనుకున్నాను.. ఇంతకు ముందే మీరు చేయడం సంతోషంగా ఉంది. ఇది మంద కథ ఔన్నత్యాన్ని మరింత చాటి చెబుతుంది…ధన్యవాదాలు సార్.

  • బ‌హుజ‌నుల‌కు నేటికి ఓటు విలువ తెలియ‌దు. అందుకే వారింకా బానిస‌త్వంలోనే మ‌గ్గుతున్నారు. రాజ్యాధికార రుచి మ‌రిగిన అగ్ర‌వ‌ర్ణాల‌కు ఇదే వెసులుబాటును క‌లిగిస్తున్న‌ది. ఇప్ప‌టికీ కిందికులాలు అగ్ర‌వ‌ర్ణాల పార్టీల్లో ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు, మైనారిటీ సెల్‌ల పేరుతో బంధీల‌వుతున్న‌రు. వారిచ్చే ప‌వ‌రులేని నామినేటెడ్ పోస్టుల‌తో సంక‌లు గుద్దుకుంటున్న‌రు. దీన్నే మాన్య‌శ్రీ కాన్షీరాం “చెంచా యుగం” అన్నారు. ఈ ధోర‌ణి మార‌నంత సేపు బ‌హుజ‌నుల జీవితాలు బాగుప‌డ‌వు.
    దేశంలో నెల‌కొన్న అగ్ర‌వ‌ర్ణ ఆధిప‌త్యాన్ని, కిందికులాల అమ్ముడుపోయే మంద‌త‌త్వాన్ని ఏక‌రువు పెట్టిన సీనియ‌ర్ క‌థ‌కులు డా.న‌లిమెల భాస్క‌ర్ సార్‌కు ధ‌న్య‌వాదాలు. తెలంగాణ‌లో దొర‌ల దుర్మార్గాలు కొన‌సాగుతున్న స‌మ‌యంలో బ‌రిగీసి నిల‌బ‌డ్డ ఈ క‌థ‌కుని ధైర్యానికి జైభీములు!!
    ఇలాంటి క‌థ‌లు ఈనాడు కూడా అనేకం రావాల్సిన అవ‌స‌ర‌ముంది. నేటికి ప్రాసంగిక‌త క‌లిగిన మంచి క‌థ‌ను ప‌రిచ‌యం చేసినందుకు సాహిత్య మిత్రులు డా.వెల్దండి శ్రీ‌ధ‌ర్‌గారికి శుభాకాంక్ష‌లు.
    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

    • మీరన్నట్టు ఇలాంటి బహుజన కథలు చాలా రావాలి. ఇప్పటికే వచ్చిన వాటిని ఒక సంకలనంగా తీసుకొస్తే మరింత మంచిది. మీ స్పందనకు ధన్యవాదాలు..

  • బహుజన రజ్జాదికార దిశగా మంద శ్రీధర్ వెల్డంది కథ వస్తువు కఠినమయినది తీసుకొని కథ రాయడం మీ సాహసానికి ధన్యవాదములు
    అప్పుటికి ఇప్పటికి మార్పు ఏమి లేదు బహుజన మందలో ఈ మందను కాసే కాపరి మాన్యశ్రీ కాన్షిరాం రూపంలో నిస్వార్థ నాయకుడు జన్మిస్తే కానీ ఈ మందలో మార్పురాదు… ఆ మార్గం లో నడిచే వారిని పిచ్చోళ్లుగా చూసే వ్యవస్థలో అవమానపడి గాయపడి చచ్చి బ్రతుకుతున్న బహుజనిరాలిని …
    ఈ వస్తువుని కూడా తీసుకొని కథ రాయగలరని కోరుకుంటూ …మేరీ మాదిగ ,తార్నాక ,హైద్రాబాద్

    • తప్పకుండ మేడం… రచయితలంతా బహుజనుల కోణంలో రాయాల్సిన సందర్భంలో ఉన్నాం..రచయితలు, మేధావులు ఆలోచించాలి…మీ స్పందనకు ధన్యవాదాలు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు