( ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో సంగారెడ్డి పట్టణ సమీపంలోని బడంపేట్ గ్రామంలో గల యక్షి కూడలిలో బహుజన కథకుల సమావేశం బహుజన కథా కచ్చీరు జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బహుజన కథకులు ఈ సమావేశంలో పాల్గొని బహుజన సాహిత్యంపై చర్చించారు. ఈ సమావేశం తాత్విక పునాది, చర్చ జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై కూడలి సంస్థ నిర్వాహకులు మధు స్పందన ఈ వ్యాసం)
అణచివేతను నిర్భయంగా ప్రశ్నించడం….
స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు సామూహిక శక్తిని పొందడం….
కచ్చీరు ద్వారా కథకులు సాధించిన విజయాలు.
***
బహుజనుల యుగం ఇది…!
వర్తమానం, భవిష్యత్ కూడా బహుజనులదే..
బహుజన కథా కచ్చీరులో బహుజన తాత్వికత, సాంస్కృతిక, భాషా మూలాలు బహుజనుల్లోని విభిన్న సమూహాల ( ఆదివాసీ,దళిత,బీసీ, ముస్లిం) ప్రత్యేకతలు అస్తిత్వాలు, మానవీయ సంబంధాలు ఉత్పత్తి సంబంధాలు వీటన్నింటిపై జరుగుతున్న దాడి పీడన, వాటిని ఎదుర్కొంటున్న రాజకీయ, సాంస్కృతిక ఆచరణ కూడలి కథా కచ్చీరులో పలికించాయి, ప్రకటించాయి.
ఈ దేశంలో సామాజిక మార్పు ఆసాధ్యమయ్యే పని కాదు. ఆ మార్పు కొరకు పోరాడేవారి మూలాల దగ్గరకు వెళ్లి అందులోని బలాన్ని గుర్తించి వారిపై జరుగుతున్న పీడన రూపాలను గ్రహించినపుడే… మార్పునకు నిబద్ధతతో కూడిన ఆచరణ ఉన్నపుడే పీడనను పెంచి పోషిస్తున్న బ్రాహ్మణ వాద, మనువాద సంస్కృతిని బద్దలు కొట్టగల మనే దృక్పథం, దృష్టికోణం స్పష్టంగా బయటకు వచ్చాయి.
అడుగడుగునా వివక్షతకు మానసిక భౌతిక హింసకు గురవుతున్న పీడితుల భావజాలాన్ని దిక్సూచిగా వారి అక్షరాలను అర్థం చేసుకుంటే తప్ప బహుజన మూల స్వరూపాన్ని పట్టుకోలేము. నీవెక్కడున్నావు దగ్గర మొదలు కొని …నీవెవ్వరు అనే దగ్గరకు వెళ్లడం ఒక రాజకీయ ప్రక్రియ. అణచివేతను నిర్భయంగా ప్రశ్నించడం స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు సామూహిక శక్తిని పొందడం కచ్చీరు ద్వారా కథకులు సాధించిన విజయాలు.
బహుజన సాంస్కృతిక జీవన పునాదుల ఆధారంగా నిరంతరం వివక్షను పెంచి పోషించే భావజాల సంస్కృతులను కూలదోయడం ద్వారానే మానసిక,రాజకీయ విముక్తి సాధ్యమవుతుంది. బహుజన మనిషిని, మనిషిగా గుర్తించలేని సమాజంలో మనుషులంతా ఒక్కటే అన్న నినాదాలకు తావులేదు. ఆ నినాదాలను తిరస్కరించాలి కూడా.
వేల సంవత్సరాలుగా గౌరవంతో బతకడానికి స్వేచ్ఛనివ్వలేని సమాజాన్ని సృష్టించిన మనువాదాన్ని నిర్మూలించే బాధ్యత బహుజనులే మోయాల్సివస్తున్నది. కనుక సాంస్కృతిక రాజకీయ ఉద్యమ నిర్మాణానికి బహుజన సాహిత్యం, కళల పాత్ర నేడు మరెంతగానో పెరిగింది.
బహుజనులపై హింసను విస్తృతంగా ప్రయోగించడం ద్వారానే సమాజాన్ని ఎప్పటిలాగా నిలబెట్టుకోవాలనే హిందూ మతోన్మాదాన్ని నిర్వీర్యం చేసే బాధ్యత బహుజనులదే అయ్యింది. దేశాన్ని ఒకే సంస్కృతి కిందకు తెచ్చే ప్రయత్నాలను వైవిధ్య బహుజన సంస్కృతులు పునాదులుగా తీసుకుని చరిత్రను , నడుస్తున్న చరిత్రను బహుజనులు ఊహించే సమాజాన్ని రచించే బహుజన కథకులకు ప్రధాన పాత్ర ఉంటుంది.
బహుజన జీవితాల్లోని ఉత్పత్తి సంబంధాలు ఆడ,మగ సమానత్వపు విలువలను నియంత్రించే బ్రాహ్మణీయ భావజాలాన్ని ఎండగట్టే సాహిత్యాన్ని తెచ్చే బాధ్యత బహుజనులదే అవుతుంది.
ఉత్పత్తి , ఉత్పత్తి వనరుల ఎలాంటి అధికారం లేకుండా చేస్తున్న భూస్వామ్య పెట్టుబడి దారీ శక్తులను ఎత్తి చూపేలా బహుజన జీవితాల్లోని అంతర్లీన సంఘర్షణను , వైరుధ్యాన్ని, మానవీయ సంబంధాలను సమానత్వపు ప్రజాస్వామ్యిక విలువలను రూపం, సారంగా ఉండాలనే ప్రకటన కథకు దిశానిర్దేశమే కాకుండా బహుజన సిద్ధాంతీకరణకు తోడవుతుంది.
30 సంవత్సరాల క్రితం వేళ్లూనుకున్న అస్తిత్వ ఉద్యమాలు విడివిడిగానూ, ఒకరూపం నుంచి ఇంకో రూపంలోకి వెళుతున్న విడదీసే లోబరుచుకునే కుట్రలు జరుగుతున్న అంతిమంగా మేమందరం బహుజన తాత్విక ఆచరణాత్మక కలయికలో భాగమే అని కథకులు ప్రకటించారు.
ఇది ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా కుల మనువాద నిర్మూలన పోరాటాలను మరో అడుగు ముందుకు వెళ్లినట్లే.
జీవితంపై, జీవితానికి కావాల్సిన వనరులపై, ప్రేమపై, ఆత్మ గౌరవంపై, అధికారాన్ని సంపూర్ణంగా సాధించే దిశగా బహుజన కథకులు కచ్చీరు ద్వారా ప్రకటించారు. మనువాదాన్ని ధ్వంసం చేయాలనే రాజకీయ దృక్ఫధాన్ని నిర్దేశించారు. జీవితానుభవాల నుంచి విశ్లేషించే భాష , సంస్కృతిపై శైలిపై నిబద్ధతతో కూడి రచన కొనసాగినపుడు బహుజన తాత్విక సౌందర్యాన్ని బయటకు తేగలుగుతాము అని కచ్చీరు తేల్చింది . బహుజనుల యుగం, ఆ యుగాన్ని నిర్మించే యువమేధావులు కథకులు, రచయితలు కళాకారులు ఆధిపత్యాన్ని నిరంతరం ధిక్కరించి సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామనే ప్రకటన అందరి చెవులకు వినబడాల్సిందే.
***
బహుజన కథా కచ్చీరు కు ఆతిధ్యం ఇచ్చిన కూడలి స్థాపకులైన మధు ఇలా స్పందించడం కచ్చీరు ప్రాముఖ్యతను, సక్సెస్ ను తెలుపుతోంది!
బహుజన కథకుల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది.