కథల వల్ల సమాజానికి కలిగే భౌతిక ప్రయోజనాలు సున్నా అంటారు కానీ అవి మానవ మనుగడనుంచి విడదీయరాని భాగాలు. మనుషులతో పాటు ప్రపంచంలోకి ప్రవేశించి మనుషుల్ని మనుషులుగా ఉంచడంలో ముఖ్య పాత్రను నిర్వర్తిస్తున్నాయి. అలాంటి కథలు యువ సృజనకారుల చేతుల్లో పడితే కలిగే ప్రయోజనాన్ని సాధించిన రెండురోజుల బహుజన యువ కథా కార్యశాల మార్చి 11, 12 వ తేదీల్లో కోదాడ దగ్గర నడిగూడెం కోటలో విజయవంతం గా జరిగింది.
ఇందులో శిక్షణ పొందటం కోసం వచ్చిన యువతీయువకులు విశ్వ విద్యాలయాలలో చదివే వారి నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగులదాకా పలు రంగాలలో ఉన్నవారు. రెండు రోజులూ విసుగూ విరామం లేకుండా బహుజన కథ ప్రత్యేకత, విభిన్నతల గురించీ – సాధారణంగా కథకు చెందిన ముడి సరుకు, మూల పరికరాల గురించీ నేర్చుకున్నారు.
ఏది బహుజన కథ ? అభ్యుదయ, విప్లవ కథల నుంచి ఇది ఎక్కడ వేరుపడుతుంది? కథకు వస్తువునెలా ఎంపిక చేసుకోవాలి? దాన్ని కథగా మలచడానికి ఏం చెయ్యాలి? కధలో కథనం పాత్ర ఏమిటి ? ఘటనకూ, సన్నివేశానికీ ఉన్న తేడా ఏంటి? కథలో వీటి ప్రాముఖ్యత ఏంటి.పాత్రల నిర్మాణం యొక్క పాత్ర ఏమిటి.వర్ణన, సంభాషణల పరిధీ ప్రమేయం ఏమిటి.కధలో వాడేభాష యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, స్థల, కాలాల వ్యవహారం ఏమిటి.వాతావరణ విలువ ఏమిటి? ఉత్త కథకూ ఉత్తమ కథకూ ఉన్న తేడా ఏమిటి? కధ రాసే వివిధ పద్ధతులేమిటి ? కథకూ నవలకూ ఉన్న తేడా ఏమిటి?
ఇలాంటి బేసిక్ ప్రశ్నలనీ సందేహాలనూ యువ కథకులతో కలిసి ఛేదించి వివరించే అర్ధవంతమైన ప్రయత్నాన్ని నిష్ణాతులైన కథకులూ, విమర్శకులూ చేశారు. బహుజన కధ యొక్క తాత్విక విభిన్నతనూ సాంస్కృతిక ప్రత్యేకతనూ viశ్లేషిస్తూనే వివిధ కథాంగాలనూ వాటి స్వరూప స్వభావాలనూ వివరిస్తూ జి.లక్ష్మీనరసయ్య ప్రారంభోపన్యాసం చేశాడు. తరువాత జూపాక సుభద్ర కథకురాలిగా తన నేపథ్యంలోని అనుభవాలనూ, అవగాహననూ కథలుగా మలచిన తీరు తెన్నుల్ని ఆసక్తిదాయకంగా ఏకరువు పెట్టింది.ఈ సెషన్ కు అధ్యక్షత వహించిన పసునూరి రవీందర్ కధా రచన గురించిన నిర్మాణ అంశాలను ఉదాహరణపూర్వకంగా వివరించాడు. మొదటిరోజు సాయంత్రం స్వల్ప సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిలుకర శ్రీనివాస్ కథ రాయడంలోని వివిధ మెళకువ లనూ పద్ధతులనూ విస్తారంగా వివరించాడు. తాను ఇటీవల తీసుకొచ్చిన ‘బైండ్ల శంద్రయ్య’ కథలను ఈ నేపథ్యం నుంచి పరిచయం చేశాడు.తరువాత మొదటిరోజు జరిగిన బోధనాంశాల మీద సీరియస్ చర్చ జరిగింది.
రెండో రోజు ఉదయం సంగిశెట్టి శ్రీనివాస్ బహుజన చారిత్రిక వ్యక్తులను బహుజన కథలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. బహుజన కథకూ బహుజన చరిత్రకూ ఉండాల్సిన సంబంధం గురించి విమర్శనాత్మకంగా విశ్లేషణ చేశాడు. పెద్దింటి అశోక్ కుమార్ కధా రచనకు సంబంధించి పలు అంశాలను ఆకట్టుకునే రీతిలో బోధించాడు.విషయాన్ని సరళమైన ఆకర్షణీయమైన శైలితో ఉదాహరణలతో క్షుణ్ణంగా విశ్లేషించాడు.ఇక కవి సీతారం కొలకలూరి ఇనాక్ కధల ఆధారంగా కధా శిల్పాన్ని వివరించాడు. ఈ సెషన్ కు అధ్యక్షత వహించిన చందు తులసి ప్రసంగం కూడా కథా రచన పట్ల యువ రచయితల్లో ఉన్న పలు సందేహాలకు సమాధానాలు ఇవ్వగలిగింది. ఈ సెషన్ లో నూ యువ రచయితలు అడిగిన ప్రశ్నల తాలూకు చర్చ ఆలోచనాత్మకంగా జరిగింది.చివరి సెషన్ లో ముస్లింవాద కధ గురించి స్కై బాబా చేసిన ప్రసంగం ఆలోచనాత్మకంగా సాగింది. ఇందులో భాగంగా తన ‘విజిటేరియన్స్ ఓన్లీ ‘ కథను స్కై వివరించి చెప్పాడు. మెర్సీ మార్గరెట్ క్లుప్తంగా అభిరుచి నిండిన సందేశాన్నిచ్చింది.
కార్యశాలలో పాల్గొన్న యువతీయువకుల సంతృప్తికరమైన స్పందనతో సంతోషంగా కార్యక్రమం ముగిసింది. ఉత్త కథకూ ,ఉత్తమ కథకూ రచనా విధానంలోనూ ఇతివృత్త విషయం లోనూ వుండే మౌలిక వ్యత్యాసాలు తెలిశాయని వారు అభిప్రాయ పడ్డారు. సాఫీగా సాగే జీవితాన్ని కాక ఘర్షణ, పేచీ కేంద్రంగా వుండే జీవితాన్ని చిత్రించగలిగే కథలే బహుజన కథను పరిపుష్టం చేస్తాయని తెలుసుకోవడం బాగుందని వారు అన్నారు. కథలు రాయటానికి కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చుకుని తిరుగుముఖం పడుతున్నామని అందరూ అభిప్రాయపడటం నిర్వాహకులకు సంతృప్తినిచ్చిన విషయం. నిర్వాహకులైన స్కై బాబా,పసునూరి రవీందర్,చందు తులసి, మెర్సీ మార్గరెట్ , గాదె వెంకటేష్ లు ఈ రెండురోజుల కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కష్టపడి పనిచేశారు. ఈ కార్యశాలలో పాల్గొన్న వారినుంచి ముందు ముందు రాబోయే కథలను యువ బహుజన కధలు గా తీసుకురావాలనే నిర్ణయం నిర్వాహకులు తీసుకున్నారు.
*
వినూత్నమైన ప్రయోగం. ఔత్సాహిక కథారచయితలకి స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం. కథారచనలో నిష్ణాతులైన సాహితీసృష్టల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇటువంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతూ ఉండాలి.
అభినందనలు నిర్వాహకులకి.