‘కూడలి’ లో ఏం జరిగింది? అని బయటి జనాలు ఒకటే గుసగుస.కొందరు ఒక్కతీరుగ అడగవట్టిల్లు.ఏం ఒరగబెట్టిన్లని సుత ఇంకొందరు మొఖం మీన్నే అనవట్టిరి.ఇగ రేషానికన్న ఏం జరిగిందో చెప్పక తప్పలే.అడిగినోల్లతోటి ఏం జెప్పిన్నో అది మీకు సుత జెప్పుత..ఇనున్లి.
‘బడంపేట’ అని సంగారెడ్డి జిల్లాల ఒక వూరున్నది.ఆ వూరవుతల ‘యక్షి కూడలి’ అనే పేరున్న ఒక ఎన్ .జి.ఓ. మధు-సాగరి దంపతులు దాన్ని అర్సుకుంటాల్లు.అది వాళ్లదే.యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి దాన్నొక ఫ్లాట్ ఫాం గా తీర్చిదిద్దిన్రు.మంచి ఆర్కిటెక్చర్ కనబడుతుంది ఆ నిర్మాణంలో.సుట్టుపక్కల వున్న కొంత ఎవుసం భూమిల సేంద్రియ ఎరువులేశి పంటలు పండిత్తరు.ఆడికొచ్చినోల్లకు వాటితోనే వండిపెడుతరు.బరిగొడ్లు,చిట్టిము త్యాలు,కొర్రలు,తైదలు,సజ్జలు, పజ్జొన్న ఇసోంటివి.ఎన్కటోల్లు ఏం తిండిదిన్నరో..అది దొర్కుతదన్నమాట.కవులు,రచయితలు రెండు రోజులుండి ఆడ దొరికే వైలు సదువుకోవచ్చు.నచ్చింది రాసుకోవచ్చు.మన రాశిన వైలు అక్కడి లైబ్రరీకి ఇవ్వొచ్చు.ఇంకా మనం యాది మర్శిన గొంగడి,ఈతసాపల తయారీలో శిక్షణ సుత ఇత్తరు.బహుజనుల కళానైపుణ్యాలు అంతరించిపోకుండ కాపాడుతాన్లు.’విత్తనం’ అనే సమూహముంది.వీళ్లు ఆయిమన్న ఇత్తునాలు దొర్కబట్టి రైతులకిత్తానికి సాయంఋజేత్తరు.’యోధ’ పనులు సుత అందరూ వంతులేసుకుని మరీ జేత్తరు.అంటే ఇయ్యాల నేను ఇల్లు వూడ్తే..రేపు పాయఖానాలు కడుగాలె.ఎల్లుండి వంటపనిసూడాలె.గిసోంటియన్నట్టు. రెండురోజులే వున్నం గావట్టి మేం చేయలేదనుకో..ఎప్పుడన్న వారం,పదిరోజులు వుంటే మాత్రం చేయక తప్పదు.ఐనా మన పనులు మనం చేసుకునుడు సుత సుతారమేనా?అది బహుజనతత్వం.
~
మొన్నటికి మొన్న (9,10నవంబర్ 2019) రెండు రోజులు “బహుజన కవుల కచ్చీరు”జరిగింది.జి.లక్ష్మీనర్ సయ్య,స్కైబాబా,పసునూరి,వెంకటక్ రిష్ణ లాంటి పెద్ద తల్కాయలు గీ పనికి పూనుకున్నరు.ఎంతమందిని పిల్శిండ్లోగని ఓ 30 మంది దాక జమైండ్లు.అక్కడో 20గాల పొత్తుకూడిండ్లు.మొదటిరోజు పోవుడు పోవుడుతోటే తైదల అంబలి తాగి రెండు అరటిపండ్లు తిని ఇగ ఏం జెప్తరా..ని కూసున్నం.అదేరోజు (9నవంబర్ 2019) వివాదాస్పద బాబ్రీమసీదు గురించి సుప్రీంకోర్టు తుదితీర్పునిచ్చింది.ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ,అటు కేంద్రంలోనూ ఏకపక్ష నిర్ణయాధికారాలు ఎంత దూరం తీసుకెళ్తాయో కండ్లకు కట్టినట్టు సూపెడ్తానయి.స్వేచ్ఛకు తావులేని దేశమైంది.సమానత్వానికి అర్ధమే మారిపోయింది.ఇసోంటి క్లిష్టపరిస్థితుల్లో బహుజన కవులందరం ఒక్కకాడ జమై రేపటికోసం కార్యచరణ ఎట్లుండాల్నో చర్చించుకున్నం.ఆటలాడినం.పాటలు పాడినం.ఎగిరినం.దునికినం.ఆయిమన్ న తిండిదిన్నం.అలావా సుత ఆడినం.బహుజనులు చేసే అరొక్కపని జేశినం.ఏంజేత్తరో తెల్సుకున్నం.బహుజన సంస్కృతిని పురాగ వొంటబట్టిచ్చుకున్నం.రెండోరోజు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకున్నం.
~
రెండు రోజుల చర్చల తర్వాత కొలిక్కివచ్చిన అంశాల్లో రాజ్యాధికారం ,కుల నిర్మూలన,విస్తృత బహుజన సాహిత్య సృజన,విరివిగా బహుజన పుస్తకాల ప్రచురణ మొ॥ నవి చెప్పుకోవచ్చు.
ఈ రెండూ సమాంతరంగా జమిలీగా సాధించాల్సినవి.
కులం గురించి మాట్లాడుకున్నం.ఎవల కులం వాళ్లు జెప్పినం.నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఎవల స్థానం ఏందో ముందే నిర్ణయమైపోయింది.చేసే వృత్తిని బట్టి కులాన్ని ఆపాదించిన సంగతి తెలిసిందే.అగ్రకులాలు అనబడే బ్రాహ్మణవర్గం,ఇప్పటి రెడ్లు,వెలమలు,కాపులు వారి వారి స్థాయిల్లో క్రింది కులాలుగా పిలువబడుతున్న SC,ST,BC,మైనారిటీ,ఆదివాసీలను మానసికంగా,శారీరకంగా హింసకు గురిచేస్తూనే వున్న విషయాల్ని గుర్తుచేసుకున్నం.కారంచేడు,చుం డూరు సంఘటనలను నెమరేసుకున్నం.చిక్కనవుతున్న పాట,పదునెక్కినపాట వచ్చిన సందర్భాల్ని తలుసుకున్నం.దళితులను ఊచకోత కోసిన సంఘటనలు మనకండ్లముందు పటంగట్టినట్టు చరిత్ర సూపెడుతూనే వుంది.గుజరాత్ లో జరిగిన నరమేధాన్ని ,ముస్లింల పట్ల సమాజ వైఖరికి నిరసన తెలిపినం.ఆదివాసులపై నిత్యం జరుగుతున్న అన్యాయాల్ని అంచనా వేసినం. దళితులకు అండగా బి.సీ కవులు గొంతెత్తిన తీరును పరిశీలించాం.అప్పట్లో “బహువచనం,మేమే,మొగి,వెంటాడుతున్ న కలాలు-వెనుకబడ్డకులాలు” వంటి సంకలనాలు వచ్చిన కాలాన్ని తర్కించుకుని ఎందుకు వెనకడుగు వేసాయో,అందరినీ కూడగట్టడంలో ,ఒకే తాటిపైనిలపడంలో ఎందుకు విఫలమయ్యాయో ,లోపం ఎక్కడుందో ఆ లోటును పూడ్చేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నాం.ఈ మధ్య కాలంలో “సమూహం” పేరుతో సంకలనం వచ్చి అనేక జిల్లాల్లో ఆవిష్కరణ సభలు జరిగి BC వాదాన్ని తెరపైకి మళ్లీ తీసుకొచ్చిన వైనాన్ని పరిచయం చేసుకున్నాం.
~
ఐతే తినే తిండి మీద సుత ఆంక్షలు వున్న కాలమిది.ఒకే కులంలోని ఉపకులాల మధ్య సఖ్యత లేని సమయమిది.దీనికి తోడు మన మెదళ్లలో బలంగా నాటుకుపోయిన మనువాదం,హిందూత్వ భావజాలం.అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వున్నామని మాత్రం అర్థమౌతుంది.కాని ఈ సంక్లిష్టతను చేధించడం ఎలా ? అందుకే బహుజన వాదం ప్రత్యేకతను సంపాదించుకుంది.ఆర్ ఎస్ ఎస్ సైద్ధాంతిక భూమికపై మనుగడ సాగిస్తూ అధికారంలోకి వచ్చిన బి.జె.పి ని గమనిస్తే ఎన్ని ఎత్తులు, కుయుక్తులతో రాజ్యాధికారాన్ని సాధించిందో తెలుస్తుంది.మెజారిటీ ప్రజలైన హిందువుల్ని పూర్తిగా దశల వారీగా బ్రాహ్మనైజ్ చేయడం.బహుజన దేవుళ్లైన ఎల్లమ్మ మొ॥న గుడిలోకి బ్రాహ్మణ పూజారులు రావడం,ఇంటిదేవతల్ని మరిపిస్తూ పకడ్భంధీగా హిందూత్వ భావజాలాన్ని పటిష్టపరచడం,దాన్ని కాపాడుకోవడానికి అధికారాన్ని పొడిగించుకోవడానికి సైన్యాన్ని సుత సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో వాడుకోవడం గమనిస్తే పూర్తిగా వారి అంతరంగాన్ని అర్థంచేసుకోవచ్చు. కేవలం ఎన్నికలకు ముందే దాడులెందుకు జరుగుతున్నట్టు? ఓట్లపండుగైపోయిన తర్వాత వాటిఊసే లేకుండా ఎందుకు పోతుంది? బహుజనులమైన మనం తర్కించుకోవాల్సిన ఆవశ్యకత,బాధ్యత ఎంతో వుందని తెలిసింది.
పుట్టిన కాడి నుంచి చచ్చేవరకు జరిగే ప్రతీ తతంగం బ్రాహ్మణుడు లేకుండా జరగట్లేదు.కొంతమంది బహుజనులు సుత బ్రాహ్మణులమే అనే అభిప్రాయంతో సుత వున్నరు.పూర్వం ఏ కులంలోని పెద్ద ఆ కులంలో జరిగే పెళ్లి తంతును నిర్వహించేవాడు.ఇప్పుడా పరిస్థితి లేదు.మన ఇంట్లోకి,ఒంట్లోకి సుత ప్రవేశించింది బ్రాహ్మణ భావజాలం.దీన్ని తుడిచిపెట్టడం మామూలుగా అయ్యే పనికాదు.ఐతే అసాధ్యం మాత్రం కాదు.
కులాన్ని నిర్మూలించడం ఎట్లా?కులాంతర వివాహాల ద్వారానే సాధ్యమని చెప్తాడు జి.వెంకటక్రిష్ట అనే కవి.నిజంగానే కులాంతర వివాహాల ద్వారా కుల నిర్మూలన సాధ్యమయ్యే పనేనా?అంటే ఒక్కపాలిగా సెన్సెక్స్ పడిపోయినంత సేపట్లో అయ్యే పనికాదు.దీంట్లోనూ చిక్కులు లేకపోలేదు.వాటినన్నింటినీ కూలంకషంగా చర్చించాల్సిన అవసరముంది.కులాంతర వివాహం చేసుకున్న జంటలకు పుట్టిన పిల్లలకు ఏ కులం క్లెయిమ్ అవుతుంది.వాళ్ల పిల్లలకు,వాళ్ల వాళ్ల పిల్లలకు ఇలానే కులాంతర వివాహాలు జరిగితే ఏ కులం వర్తిస్తుంది? తద్వారా కాలక్రమేణా కులం నశిస్తుందన్నది వెంకటక్రిష్ణ గారి సమాధానం.
~
మరి బహుజనులకు రాజ్యాధికారం ఎందుకు? తెలంగాణ ఉద్యమ సందర్భంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న ఉద్యమకారుడే గద్దెనెక్కి కూసున్న విషయం తెలిసిందే.ఎందుకని చేయలేదంటారు? ఒక్కసారైనా ఆలోచించుకోవాలి.ఈ దేశంలో మెజారిటీ వర్గం బహుజనులే.మైనార్టీలుగా వున్న అగ్రవర్ణాలుగా పిలువబడే అతికొద్దిమంది చేతిలో నిర్ణయాధికారం వుండడం వల్ల మెజారిటీ ప్రజల హక్కులు కాలరాస్తున్న వైనాన్ని రోజూ చూస్తూనే వున్నాం.
తెలంగాణలో RTC కార్మికుల సమ్మె జరుగుతూనే వుంది.అటు ప్రభుత్వమూ ఇటు కార్మికులు జిద్దుమీదనే వున్నరు.కార్మికసంఘాల నాయకత్వమంతా అగ్రవర్ణాలతో నిండి వుంది. కేవలం కార్యకర్తలుగా మాత్రమే ఊడిగంజేత్తానికి బహుజనులు పనికొత్తరా?అన్ని సంఘాల్లోనూ అధ్యక్ష పదవుల్లో ఒక్క బహుజనుడైనా వున్నడా? ఒక్కశాతం సుత లేదు.ఇక బహుజన మహిళల సంగతి చెప్పక్కర్లేదు.ఉద్యోగ సంఘాల్లోనే బహుజన నాయకత్వం లేనప్పుడు రాష్ట్ర,కేంద్ర స్థాయి రాజకీయాల్లో ఎలా సాధ్యం?ఒకవేళ తప్పిదారిన బహుజనుడు సంఘనాయకుడైతే సంబంధిత శాఖా మంత్రి దగ్గరికి సుత రానియ్యడు.పనులు కావాలంటే అగ్రవర్ణ నాయకుడే కావాలని బహుజనులే బాహాటంగా చెప్తున్నరు.అంతా బానిసలుగా తయారైనం.వడ్డించేటోడు మనోడైతే ఎవని పెళ్లి అయితేనేం?
మంత్రివర్గంలో బహుజనులు లేకపోవడమే ప్రధాన కారణం.ఆ మంత్రివర్గంలో సుత నాయకుడైన ముఖ్యమంత్రి మనోడు కాకపోవడమే.అంతేగానీ బహుజనులల్లో ఆయిమన్న నాయకులు లేక కాదు.డబ్బుకు అమ్ముడుపోకుండా బహుజనుడు నిలబడితే ఎంతమందిమి ఓట్లేస్తాం జెప్పున్రి? మూలం ఎక్కడుందో కనిపెడదాం.మంత్రివర్గంలోనూ,కేబి నేట్ స్థాయిల్లోనూ బహుజనులు వుంటే క్రింది స్థాయిల్లోని అన్ని సంఘాల నాయకత్వం బహుజనులదే అవుతుంది.రాష్ట్రంలో ఏ ప్రభుత్వముంటే అదే పార్టీ గ్రామస్థాయిలో ఆక్టివేట్ అవుతుంది.పనులు తొందరగా పూర్తవ్వాలంటే అది తప్పనిసరి అని జనాలందరికీ తెలుసు.వలసలు సుత మామూలే.అందుకే కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలె.అట్టయితేనే మదపుటేనుగును మన తొవ్వకు తెచ్చుకోగలుగుతాం.నోటుకో,మందు సీసాకో ఓట్లను అమ్ముకునేది మన బహుజనులే.ఏ పార్టీ మీటుంగుల్లో జూశినా అందరి జెండాలు భుజాన మోసుకు తిరిగేది మనమే.ఈ తీరు మారాలె.ఇన్నేండ్లుగా పార్టీ జెండాలు మోసుకుతిరుగుతునే వున్నాం.మనకేం ఒరిగింది?జాతీయజెండాను అధికారికంగా ఎగురవేసే దమ్ము బహుజనులకు లేదా? ఆ సోయిని తెప్పియ్యాలె.ఎవలు దెప్పిత్తరు?ఎన్నో ఉద్యమాలకు మూలం కవులే.కవులు పూనుకుంటే ఏదైనా సాధ్యమే.
బహుజన సంస్కృతిని విస్తృతంగా వ్యాప్తిచేయాలె.ప్రత్యామ్నాయ రాజకీయాల్ని సృష్టించాలె.అందుకు ఆజ్యం పోసేదీ..,చైతన్యం కలిగించేదీ., కవి ఒక్కడే.అందుకే ఈ బహుజన కవుల కచ్చీరు.ఇది ప్రారంభమే అయినా ఎన్నో ప్రశ్నలు మెదళ్లను తొలిచివేస్తున్న సందర్భంలో “బహుజన కవుల కచ్చీరు” ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
బహుజన వాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ఎలా?కవులు,రచయితలు ఆ పనికి పునుకోవాలి.బహుజన తత్వాన్ని ఎరుకపరిచే రచనలు చేయాలె.మూలాల్లోకి వెళ్లి రాయాలి.ఏ ఉత్పత్తికులానికి సంబంధించిన బహుజన రచయిత ఆ వృత్తికి సంబంధించిన సంస్కృతిని,వారి సాధకబాధకాలను ,పరిష్కార మార్గాలను ఆ వర్గానికి అందేలా రచనలు చేయాలి.ఏ ఒక్క ప్రక్రియ దగ్గరో ఆగిపోవద్దు.కవిత్వం ,కథ , విమర్శ అన్ని ప్రక్రియల్లోనూ తన సమర్థతను బట్టి రాసుకుంటూ పోవాలి.ఇలా రాసుకుంటూ పోయే క్రమంలో పురాణ ప్రతీకల్ని వాడడం ఆపేయాలని,బహుజన తత్వాన్ని బోధించిన పూలే వంటి మహనీయుల్ని అర్ధంచేసుకుని,రచనలు చేయాలని,గులాంగిరీ లాంటి రచనలు తప్పకుండా చదవాలని,బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రాథమిక పరిజ్ఞానం అవసరమని సంగిశెట్టి శ్రీనివాస్ తెలియజేశిండు.విమర్శ గురించి మాట్లాడుతూ బహుజన కవుల,రచయితల రచనల్ని విమర్శించేటప్పుడు అగ్రవర్ణ విమర్శకుల అవసరం పడుతుంది.ఆ అవసరాన్ని తగ్గించాలి.అకాడెమీ స్థాయిల్లో బహుజనుల మెజారిటీ వుండాలి.సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకుంటే బహుజన జీవితాల్ని పాఠాలుగా రూపొందిస్తే పాఠశాల స్థాయిలోకి బహుజన ఐడియాలజీని, సంస్కృతిని,భాషను సంపద్వంతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.ఇంకా బి.సి ల మీద ఎంత అప్రెషన్ జరిగితె తేరుకుంటారో అని విచారం వ్యక్తపరిచారు.
ఎంతోమంది బహుజన కవులు,రచయితలున్నప్పటికీ బహుజన సాహిత్యం ఆశించినంతమేరకు రాలేదు.దానికీ కారణాలు లేకపోలేదు.ఇతరత్రా ప్రయోజనాలకోసం తమనుతాము తాకట్టు పెట్టుకున్నోళ్లు ఉండొచ్చు.బహుజనతత్త్వంపై సోయి లేకపోయి వుండొచ్చు.అసోంటోళ్లను సుత జర సోయిదెప్పిచ్చి బహుజన సాహిత్యం పరిపుష్టం చేసే దిశగా పురికొల్పాల్సిన బాధ్యత వుండనే వుందని కచ్చీరు ముక్తకంఠంతో గొంతెత్తింది.
మంచి ప్రారంభం సగం పనిని పూర్తిచేసిన ఉత్సాహం ఇస్తుందన్నట్లు కవుల్లోని అనుమానాలను నివృత్తి చేసి,దిశానిర్ధేశం చేసినట్లు భావిస్తున్నాను.ఇది ఇక్కడితో ఆగిపోకుండా మెజారిటీ బహుజన కవుల మద్ధతు కూడగట్టడం ఎంతో అవసరం.జిల్లా,మండల స్థాయిల్లోనూ ఇలాంటి కచ్చీర్లను ఏర్పాటుచేయడం వల్ల బహుజనవాదానికి మరింత బలం చేకూరుతుందని, బహుజనుల రాజ్యాధికారమే వారి సమస్యలకు పరిష్కారమని బలంగా నమ్ముతూ,ఆ దిశగా అడుగులు పడుతున్నాయని విశ్వాస ప్రకటన చేస్తున్నాను.
*
baagaa raasinav raajkumar
thank u sir
మంచి విశ్లేషణతో కూడిన రిపోర్టు రాజు !
thank u sir
రాజన్న!కూడలి ప్రధాన ఆశయం చెబుతూ ఇప్పటి రాజకీయాలపై మాట్లాడడం అద్భుతంగ ఉంది
thank u gopal
రాజ్ కుమార్, డీటైల్ గా రాసావు. సారాంశాన్ని రాసావు. అభినందనలు.
thank u sir
అవును. ఆయన అపురూపమయిన కవి. జీవితాంతం తాను నమ్మిన లక్ష్యాల కోసం నిలబడిన వాడు. ఉద్యమ నాయకత్వం తెచ్చిపెట్టే అవకాశాలను స్వలాభం కోసం కలలో కూడా వాడుకోని నిజాయితీ తన సొంతం.
ఆయన రచనలన్నీ మీ సారధ్యంలో వస్తున్నందుకు అభినందనలు. కృతజ్ఞతలు.
అయితే తరచూ తెలుగు సాహిత్యం లో జరిగే కొన్ని వర్ణనల గురించి చిన్నసూచన.
భారత దేశాన్ని విముక్తి చేయాలన్నదే తన (ఉద్యమ) లక్ష్యమని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. చివరిదాకా ఆయన లక్ష్యం అదే అని ప్రజల నమ్మిక కూడా. ఆయనను “తెలంగాణా ఉద్యమ నాడి” అన్నారు. ఎలా?
అలాగే “ఉరితీయబడ్డ పాట నుండి చెరపడ్డ జలపాతం నుండి, గాయపడ్డ కాలిబాట నుండి, వాయులీనం నుండి తిరిగి వస్తాడు. తిరిగి లేస్తాడు.”
అలా జరగాలనే ఆయన అభిమానుల కోరిక. కానీ, తాను జీవితాంతం కలగన్న వర్గ కుల పోరాటాలు ఆ దృక్పధం(దళిత బహుజన శ్రామిక విముక్తి) దాదాపు ఆయనతోనే అంతరించిపోయినట్టు కనిపిస్తోంది.
క్షమించాలి. ఇది శివసాగర్ వ్యాసంమీది పోస్టు ….