బల్లి వైద్యం

క్రీ.శ. 2064..

బల్లుల జాతి అంతరించిపోయింది. డాక్టర్లకు, బల్లులకు మధ్య జరిగిన యుద్ధంలో బల్లులన్నీ మరణించాయి. అజ్ఞాతంలో ఉన్న బల్లులను గాలించి, కాల్చి చంపుతున్నారు.

ముప్పై ఏళ్ళు వెనక్కి వెళితే, చెన్నైలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో, ఆ ఎనిమిదో వార్డులో, ఇరవై నాలుగో బెడ్ మీద, ప్రాణం మీద ఆశను ఇంకా అలానే పట్టుకోనున్న ఆ మృతజీవిని నేనే. ఇంకాసేపట్లో నన్ను ఆ బెడ్ నుండి, ఈ వార్డు నుండి, ఈ హాస్పిటల్ నుండి, ఈ చెన్నై నుండి, వీలైతే ఈ భూమ్మీద నుండి గెంటేస్తారు. గెంటేయడానికి పెద్ద కారణాలేమీ అవసరం లేదు. మా ఇల్లంతా ఊడ్చి, బంధుమిత్రులంతా తలా ఓ చెయ్యేస్తే అయిన మొత్తం అక్షరాలా ‘లక్షా ఎనభై నాలుగు వేలు’. నేను గత తొమ్మిది రోజులుగా ఈ హాస్పిటల్‌ని హోటల్‌గా వాడుకుంటున్నది, బీపీ దగ్గర్నుండి యురిన్ టెస్ట్‌ల వరకు ‘తొమ్మిదివందల తొంభై తొమ్మిది’ టెస్టులు కలిపి అయిన మొత్తం పోను, మిగిలిన మొత్తం ‘రెండువందలా ఐదు రూపాయలు’.

నా జేబుకు బూజు పట్టిందన్న సంగతి రెండు నర్సు కుక్కలు నిన్న సాయంత్రమే పసిగట్టాయి. మనం ఖాళీ చేసేప్పుడు డబ్బులు కట్టుకోవడానికిది హోటల్ కాదు. కనీసం పదివేలన్నా కడితే, ఆ రోజుకు గుండెల మీద చెయ్యేస్కొని బతకొచ్చు. కట్టకపోతే గుండెలు బాదుకున్నా బతకలేవు. నాలాగే అరగంటలో బయటుంటావు. నువ్వు శవంలా పడున్న ఆ బెడ్డు మీదకి ఇంకో శవం వచ్చి గుండెల మీద చెయ్ వేస్కొని నిద్రపోతుంది. ఆ.. ఎన్ని రోజులు? జేబుకు బూజు పట్టనన్ని రోజులు. అంతే! ఆ బెడ్డు మీదకి ఇంకో బతికున్న శవం. శవాలకు కరువా? చావుకు దగ్గరగా ఉన్న శవాలన్నీ వచ్చేది ఇక్కడికే! బూజు పట్టని జేబులతో వచ్చి, బూజు పట్టిన గుండెలతో నిష్క్రమిస్తాయి. అదే బాటలో నేను రోడ్డు మీద నిలుచొని ఒక చేత్తో సెలైన్ బాటిల్ పట్టుకొని, జేబులో ఉన్న రెండువందలతో హాస్పిటల్ వైపు ధైర్యంగా చూస్తున్నా.

పదిరోజులు వెనక్కి వెళ్తే, నా కడుపులో ఏదో కదులుతున్నట్లనిపించింది. రాత్రికి పడుకుంటే నొప్పిగానే ఉందిగానీ, అది ఎలాంటి నొప్పో అర్థం కావట్లేదు. పక్కింటి ముసల్నాకొడుకు “పక్కూర్లో ఒక పిలకాయకు గూడా నీ మాదిరే కడుపులో ఏదో కదిలిందంట. కొన్రోజులకల్లా ఆ పిల్లోడు కనిపియ్యకుండ పోయినాడంట. ఒక్యాల ఒరిబిజం అయినా దిగిన్డచ్చు. ఎందుకయినా మంచిది, పొయ్యి డాటేర్ని కలుసుకో. మనూరి ఆకుపసరుని, నాటుమందుని నమ్ముకుంటే పొట్ట పగిలి చచ్చావ్” అన్నాడు. నా లివర్, కిడ్నీలు మెల్లగా వణికాయి. పొట్ట కూడా కొంచం ముందుకు వచ్చినట్లనిపించింది. దాంతో బంధుమిత్రులు ఏడుస్తూ నవ్వు మొకంతో ఇచ్చిన ‘లక్షా ఎనభై నాలుగు వేలు’ పుచ్చుకొని రెడ్ బస్ ఎక్కితే, వాడు కూడా తొంభై రూపాయలు ఎగస్ట్రా కాటేసాడు.

చెన్నైలో ఈ కాబోయే శవాలుండే శ్మశానంలో దిగా. ‘తొమ్మిదివందలా తొంభై తొమ్మిది’ టెస్టుల తర్వాత డాక్టర్లందరూ ఏకకంఠంతో తేల్చి చెప్పేసారు “మెడికల్ మిరాకిల్! నీకో కొత్త రోగం వచ్చింది” అని. ఇంత పెద్ద నామకరణం కూడా చేసారు కానీ నోరుతిరగదు. అదేదో ఇంగ్లీషు పేరు. దానికి ఎనిమిది చిన్న ఆపరేషన్లు అంటే కిడ్నీలు, లివరు, లంగ్సు, గుండెలాంటి చిన్న అవయవాలు, నాలుగు పెద్ద ఆపరేషన్లు(వీటికి పెద్దగా కష్టపడను అవసరం లేదు. మత్తుమందు ఇవ్వకుండా లైట్‌గా పైపైన చేస్తారంట), ఒక పెద్ద పెద్దాపరేషన్ చెయ్యాలంట. ఇది మాత్రం చాలా కాంప్లికేటేడ్ ఆపరేషన్ అంట. ఇండియా మొత్తం మీద నలుగురు మాత్రమే చెయ్యగలరంట.

ఆ ఆపరేషన్ చెయ్యడం మాములు విషయం కాదంట. సుడిగుండంలోకి తెప్పను తీస్కెళ్లినట్లే, కటిక చీకట్లో సూదిలోకి దారం ఎక్కించినట్లే, పొద్దున్నే పచ్చిమంచినీళ్ళు కూడా తాగకుండా ఉదయం ఆరుగంటలకు మొదలుపెట్టి, మరుసటి రోజు ఉదయం ఏడు గంటలవరకు, అంటే ఇరవై ఐదు గంటలు ఒక యజ్ఞంలా శ్రద్ధా, భయము, భక్తి, విముక్తితో చెయ్యాల్సిన మహా కర్త కర్మ క్రియ అంట. హీరోయిన్ శ్రియ కూడా డాక్టర్ అవుదామని ఈ ఆపరేషన్‌కి భయపడి యాక్టర్ అయిందంట. అందుకే ఆ ఆపరేషన్ గురించి జనాల్లో అవేర్నెస్ ప్రోగ్రాం లాంటి చెత్త పనులు పెట్టుకోలేదంట. పెద్ద డాక్టర్‌గాడిది, మనది ఒకే క్యాస్ట్ అయితే నలభై శాతం డిస్కౌంట్ కూడా ఉంటుందంట. ఇదంతా చెప్పిన ఆ చిన్న డాక్టర్ కుక్క మొరిగి, జొల్లు కార్చి, ఏదో సాధించిన దానిలా తోకూపుకుంటూ పక్క వార్డులోకెళ్లింది.

మీరు ఏ పూటకాపూట పబ్బం గడుపుకునే 99 శాతం జనాభాలోని వారైతే, మీ స్థోమతకు మించిన రోగం వస్తే అది నలభై లక్షలైతే, మీరు డబ్బులు కట్టడానికి, కట్టి బతకడానికి ఒక శాతం కూడా ఛాన్స్ లేదని తెలిస్తే, అప్పుడు మీ మెదడులో జరిగే రసాయన చర్యలే, ఇప్పుడు నా మెదడులో జరుగుతున్నాయి. బెడ్డు మీద పడుకున్న వాళ్ళందరూ అస్థిపంజరాల్లా కనిపిస్తున్నారు. కేవలం డాక్టర్లు, నర్సులు మాత్రమే కండపట్టి జీవంతో నిగనిగలాడుతున్నారు. నన్ను నేను చూస్కుంటే నేను కూడా అస్థిపంజరంలానే కనిపిస్తున్నా. బయటికొచ్చి చూస్తే 80 శాతం అస్థిపంజరాలే తిరుగుతున్నాయి భూమ్మీద. గట్టిగా రెప్పల్లేని కళ్లను మూస్కున్నా. నిద్రపట్టింది. కలొచ్చింది.

నేను పీఎంని కిడ్నాప్ చేసి, నాకు ఫ్రీగా ఆపరేషన్ చెయ్యమని బెదిరించా. వాడేమీ మాట్లాడలేదు.

“ఒకరోజు నేను కూలీకెళ్లి, పొద్దుట్నుండి రాత్రి వరకు రాళ్లు మోస్తే నాకిచ్చే కూలీ ఐదువందలు. వాళ్ళు ఒకరోజు ఏసీ రూముల్లో ఆపరేషన్ చేస్తే నలభై లక్షలెందుకు?”

“నువ్వు కమ్యునిస్టువా?”

“కాదు. నేను పనిచేస్తే నాకిచ్చే ఐదువందలే వాళ్ళకిస్తా!”

“నువ్వు ఉగ్రవాదివా?”

“కాదు”

“తీవ్రవాదివా?”

“కాదు. నేనో మాములు కూలీని, నేనో రోగిని”.

“భూమ్మీద ఉండేదంతా నీలాంటి రోగులే లేవయ్యా! నువ్విన్ని రోజులు కష్టపడి మాకు రాళ్లు మోసావ్, ఇల్లు కట్టావ్, అందుకే నిన్ను ఇన్ని రోజులు బతకనిచ్చాం. ఇంతకీ నీకు సొంత ఇల్లుందా?”

“నాకంటూ సొంతం ఏమీలేదు, మిగిలిన ఈ డబ్బు తప్ప”.

“అవి తొందరలోనే అయిపోతాయి ఖర్చులకుంచు. నువ్వు దేశానికి చేసిన సేవకుగాను గవర్నమెంటు తరపున నీకో ఆరడుగుల నేల ఇప్పిస్తాం, నువ్వు చనిపోయాక వాడుకో”.

“నాకు చనిపోవాలని లేదు. నేను బతకాలి”.

“బతికి ఏం సాధిస్తావ్? మాలాంటి వాళ్ళకు రాళ్లు మోస్తూ, ఇల్లు కడుతూ, పన్నులు కడుతూ… కడుతూ… కడుతూ… ఒకరోజు జీవశ్చవంలా కన్నుమూస్తావ్. అదేదో సుఖంగా ఇప్పుడే చనిపో. నీకో విషయం తెలుసా? మనం చనిపోయినవాళ్ళమే. చనిపోయాక భూమి అనే నరకం మీదకొస్తాం. ఇక్కడ మన పాపాలకు తగిన శిక్ష అనుభవించి చనిపోతాం. ఇక్కడ చనిపోతే స్వర్గానికి వెళ్ళొచ్చు. అక్కడంతా సుఖసంతోషాలే. అందుకే సుఖంగా చనిపో”.

“మరైతే ఇక్కడ కూడా కొందరు సుఖపడుతున్నారుగా! అప్పుడు నరకం ఎలా అవుతుంది?”

“ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వు నిజమైన భారతీయుడివి కాదు. కానీ నీకు సమాధానం చెపుతా. ఎందుకంటే నువ్వింకాసేపట్లో కన్ను, నోరు మూస్తావ్ కాబట్టి. నేను ఇందాకా చెప్పిందంతా నిజం. ఇది నరకం. నరకంలో కూడా మన ‘లా’లోలాగే కొన్ని లొసుగులున్నాయి. ఈ భూమి అనే నరకంలో ఉన్న ప్రధాన లొసుగు సమానత్వం”.

“అదెక్కడుంది?”

“అదే లేదని చెపుతున్నా. ఇక్కడ బలవంతుడంటే బుద్ధి లేదా దేహబలం ఏదైనా కావచ్చు. బలవంతుడు సుఖంగా బతకడానికి వెసులుబాటు ఉంది. నీలాంటివాళ్ళు.. అంటే బడుగు, బలహీనులు కష్టపడి.. పడి.. పడి.. పడి.. పడి.. పడి ఒకరోజు చస్తారు. ఆ తర్వాతంతా స్వర్గమే. నీలాంటి వాళ్ళు చావడమే సుఖం”.

“సరే” అని కట్లు విప్పా.

“నేను వెళ్ళొస్తా. అప్లికేషన్ పెట్టుకో, ఆరడుగుల నేల గ్యారెంటీ” అని మాయమయ్యాడు.

ఇంతలో ఏదో మొరుగు వినిపించింది. కళ్ళు తెరిస్తే పక్కన నర్సు కుక్క. రాత్రికి భోజనం పెట్టి ఖరీదైన మాత్రలు ఓ రెండు డజన్లు మింగించి వెళ్ళింది. భోజనం మాత్రం చాలా బాగుంది. అది రోజూ పెట్టేది కాదు. చాలా ఆహార పదార్థాలు తెచ్చి పెట్టారు. ఏంటి విశేషం అని అడిగితే ‘ఆ ముసలి పెద్ద డాక్టర్‌గాడికి పిల్లలు లేరంట. అందుకే ఓ కుక్కను పెంచుకున్నాడంట. అది జాతుల్లోనే మేలైన జాతి కుక్క. అది బ్రీడుల్లోనే మేటైన బ్రీడు కుక్క. దాని తోకకు మట్టి అంటకుండా బంగారు తొడుగు చేయించి మరీ పెంచారంట. ఆ మేలైన జాతికుక్క ఒకరోజు దాని మేలైన కుక్క బుద్ధి చూపింది. పనోళ్ళందరూ పనుల్లో ఉన్నప్పుడు గడప దాటింది. తోట దాటింది. గేటు దాటింది. హైక్లాసు స్ట్రీటు దాటింది. మురిక్కాల్వల వెంబడి వాసనచూస్తూ, మురిక్కాలవ పక్కనున్న మురికి వీధిలోకి దూకింది. ఆ వీధిలో దిక్కులేని దీనురాలిగా ఉన్న ఓ వీధి కుక్కను చూసింది. అది ఒంటరి ఆడకుక్క. దాన్ని ఉద్ధరించాలనుకుంది. వెళ్లి వెనక నుండి వాటేసుకుంది. అంతే! తన బంగారు తొడుగు తోకను పట్టుకులాగారెవరో? ఎవరో కాదు, ముసలి డాక్టర్‌గాడు. పనోళ్లందరినీ పనికిమాలిన బూతులు తిట్టి, తన బంగారు తొడుగు కొడుకుని మందలించి, ఈడుకొచ్చిన కొడుక్కి పెళ్ళిచెయ్యకపోతే వీధులపాలవుతాడని గ్రహించి, ఇంకో బంగారు తొడుగున్న మేలు జాతి ఆడకుక్కను చూసి పెళ్లి ఖాయం చేశాడు. 

ఆ పెళ్ళికి మన దేశం నలుమూలల నుండి ప్రముఖులందరూ హాజరయ్యి, బంగారు మేలుజాతి కుక్కల జీవితం ఎలాంటి కష్టాలు పడకుండా సుఖంగా గడవాలని, పండంటి మేలు జాతి కుక్కలకు జన్మనివ్వాలని, అవి పుట్టడమే బంగారు తొడుగు తోకతో పుట్టాలని మనస్ఫూర్తిగా.. నిజంగానే మనస్ఫూర్తిగా.. ఆనందబాష్పాలు రాల్చి ఆశీర్వదించారు. ఆనందం తట్టుకోలేక ఆడారు, పాడారు, చిందులేసారు. ఆఖర్లో ఇంటికెళ్లేప్పుడు పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులను ఉత్తచేతులతో పంపడం ఇష్టంలేక ముసలి డాక్టర్ తన స్థోమతకు తగ్గట్టు తలా ఒక బంగారు కుక్క విగ్రహాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ విగ్రహం ఒక్కోటి మన పెళ్లికొడుకు కుక్కంత బరువుంది. పెళ్లి ఖర్చులన్నీ జమచేస్తే వచ్చిన ఖర్చు తొమ్మిది వందలా తొంభై తొమ్మిది కోట్లంట’.

నా గుండె రగిలింది. నర్సు కుక్క మీద ద్వేషం పెరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఏదో ముందే ఇచ్చుంటే సైలెంటుగా కుక్కలాగా నక్కి, ఆ పెళ్ళికి హాజరై బంగారు కుక్క విగ్రహాన్ని కానుకగా పొంది, దాన్ని తాకట్టు పెట్టి ఆపరేషన్ లెక్క కట్టి, ప్రాణాల్ని కొనుక్కునేవాడిని. వీలైతే మిగిలిన డబ్బుతో నా పక్క బెడ్డు శవాన్ని, ఇంకా మిగిలితే ఈ వార్డు శవాలను, ఇంకా మిగిలితే ఈ హాస్పిటల్లో ఉన్న మొత్తం శవాల ప్రాణలను బేరం ఆడకుండా కొనేవాణ్ణి. బ్యాడ్‌లక్! ఈ హాస్పిటల్లోని నర్సు కుక్కలకందరికీ బంగారు తొడుగు తోకని కానుకగా ఇచ్చాడంట ముసలి డాక్టర్ కుక్క. ఆ ముసలి కుక్కను ఇంప్రెస్ చెయ్యటానికి ఒక నర్సు కుక్క ఆ బంగారు తొడుగు తోకను వెనకాల తగిలించుకుంది. దాంతో మిగిలిన నర్సు కుక్కలన్నీ తగిలించుకొని ఆ బంగారు తోక ఊపుకుంటూ తిరుగుతున్నాయి. ఛా! నేను నర్సుగా ఈ హాస్పిటల్లో చేరినా బాగుండు! ఆ తోక ఖరీదెంతో?

పెళ్లి తతంగం విన్న తర్వాత కడుపుమంటతో నిద్రపట్టడం లేదు. నా పక్క బెడ్లో ఉన్నోడితో మాట్లాడదాం అంటే వాడు దయ్యమో, ఆత్మో అంతుచిక్కడంలేదు. మనం ఏం చెప్పినా వింటూ ఉంటాడు. ఉలకడు పలకడు. మనం ఏం అడిగినా సమాధానం చెప్పడు. వాడికి మాట్లాడాలనిపిస్తే పొడిపొడిగా కొద్దిసేపు మాట్లాడతాడు. వీడితో మాట్లాడ్డం కంటే గోడతో మాట్లాడ్డం నయం అనుకొని గోడవైపు తిరిగా.

అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. రోజూ రాత్రి మసక చీకటి ఉంటుంది. కాని ఈరోజు కటిక చీకటిగా ఉంది. టైం చూస్తే పన్నెండు దాటింది. నాకేమో నిద్రపట్టడం లేదు. కొద్దిసేపటికి ఏదో ఆకారం మా వార్డులో కదులుతోంది. నా బెడ్డుకు దగ్గరగా వస్తుంది. ఆ ఆకారం వెనక ఏదో మెరుస్తోంది. గొంతు తడారిపోయింది. నుదుట పట్టిన చెమటను తుడుచుకున్నా. ఇక ఆగలేక “ఎవరూ” అన్నా.

“నువ్వింకా పడుకోలేదా?” అంది నర్సు కుక్క

“లేదు. ఈ టైములో నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ? ఈరోజు ఎందుకింత చీకటిగా ఉంది?”

ఆమె నా దగ్గరకొచ్చి నా పక్కనే కూర్చుంది. ఆమె బంగారు తోకని నిమిరా. ఆమె నా మీదకి వాలి, చెవిలో

“నీ పక్క బెడ్‌వాడ్ని ఈ రాత్రికి చంపేస్తున్నా” అంది.

“వాడు నువ్వడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని చంపేస్తావా?”

“అందుక్కాదు. వాడి ఆపరేషన్‌కి ముప్పై లక్షలు ఖర్చవుతుంది. అంత ఇచ్చుకోలేడట. అందుకే ఈ నరకం నుండి తప్పిస్తున్నా. రెండు వేల రూపాయలు మాత్రమే! చాలా సులభమైన పద్ధతిలో చంపేస్తా. ఈరోజు ఉదయం నాకు రెండువేలిచ్చాడు. అందుకే ఇప్పుడొచ్చా” అని లేచి నా పక్క బెడ్ మీదకి వెళ్లి కూర్చొని, వాడి మొఖం మీద మొఖం పెట్టింది. వాడ్ని నోరు తెరవమంది. వాడు మెల్లగా నోరు తెరిచాడు. ఆమె కూడా నోరు తెరిచి వాడి ప్రాణాల్ని పీలుస్తోంది. వాడి ప్రాణాలు వాడి నోటి నుండి ఆమె నోట్లోకి కాంతికిరణాల్లా ప్రసరిస్తున్నాయి. అలా రెండు నిమిషాల్లో వాడి ప్రాణాల్ని పీల్చేసి, బాత్రూంకెళ్ళి వాంతి చేస్కొని మొత్తం కక్కేసింది. మొకం తుడుచుకుంటూ మెల్లగా నా దగ్గరికొచ్చింది.

నా మీదకి వాలి “నీక్కావాలంటే డిస్కౌంట్ కూడా ఇస్తా. ఆలోచించుకో” అని నా నుదిటిన ముద్దు పెట్టి నవ్వుతూ బంగారు తోకూపుకుంటూ వెళ్ళింది. నా పక్క బెడ్‌లోవాడు బతికున్నప్పుడే శవంలా ఉంటాడు, ఇప్పుడు దెయ్యంలా ఉన్నాడు.

పొద్దున్న లేచేసరికి పక్క బెడ్డు ఖాళీగా ఉంది. టిఫిన్ల తర్వాత ఆ నర్సు గురించి కొంచం ఎంక్వయిరీ చేసా. ఆమె మొదట ఓ పేషెంటుగా ఇక్కడ జాయిన్ అయ్యి, డబ్బులు కట్టలేకపోవడంతో పేషంట్లని చూస్కోమని యూనిఫాం ఇచ్చారంట. అప్పట్నుండి పదేళ్లుగా ఇక్కడే ఉంది. నర్సుగా ఇంకో ఐదేళ్ళు చేస్తే జూనియర్ డాక్టర్‌లా కూడా ప్రమోషన్ వస్తుందంట. ఇక్కడున్న జూనియర్ డాక్టర్లందరూ ఒకప్పుడు నర్సులేనంట. ఆమె ఈ రోజంతా నన్నే చూస్తూ, నవ్వుతూ, సిగ్గుపడుతూ తిరిగింది.

రాత్రి భోజనాల తర్వాత నాకు మాత్రలు ఇస్తూ “నలభై లక్షలు ఏర్పాటయ్యాయా?” అని విచారంగా అడిగింది.

“అదే పనిలో ఉన్నా”.

“డబ్బు ఏర్పాటు చేస్తున్నావా?”

“నీకు రెండు వేలు కడదాం అనుకుంటున్నా”.

“ఎందుకలా నిరాశగా మాట్లాడతావు? ప్రయత్నిస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు”.

“నాలాంటివాళ్ళు ఎంత ప్రయత్నించినా కొండని పిండి చెయ్యలేరు. దాని బదులు నీ చేతుల్లో సుఖంగా చనిపోవడం మేలు”.

“అలా అనొద్దు ప్లీజ్! నీకేమీ కాదు. మన ప్రేమసాక్షిగా చెపుతున్నా. నిన్ను నేను బతికిన్చుకుంటా” అని ఆమె కన్నీళ్లు కారుస్తూ, నా మొఖం అంతా ముద్దులు కురిపించి వెళ్ళింది. ఆ సమయంలో వార్డులో ఎవ్వరూ మమ్మల్ని చూడటం లేదు. చూసినా మా ఇద్దరికీ వాళ్లతో పనిలేదు.

డబ్బు లేకపోయినా ప్రేమకు బతికించుకునేంత శక్తి ఉందా? లేదా… లేదా… నా ఆపరేషన్ కోసం డాక్టర్లకు ఆమె లోగిపోతుందా? ఆ సీనియర్ ముసలి డాక్టర్ కుక్క చొంగ కారుస్తూ ఎప్పుడూ ఆమె వైపే చూస్తుంటాడు. ఈ మనోవేదన అనుభవించేకంటే రోగంతో చనిపోవడమే మేలు. కానీ ఆమె మీద నాకున్న ప్రేమ నన్నింత వరకు బతికిస్తోంది. రాత్రి పన్నెండు తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చింది.

“నిన్ను ఆ డాక్టర్లకి అర్పించి నిలుపుకున్న ప్రాణం నాకక్కర్లేదు”. నా మనోవేదనంతా కక్కేసా.

“ఛీ! అలా ఎలా ఆలోచిస్తావ్? ఇన్ని గంటల మన ప్రేమలో నన్నర్థం చేస్కుందింతేనా? నా ప్రాణం, దేహం, సర్వస్వం నీకు తప్ప ఇంకెవ్వరికీ కాదు. ఆఖరికి నాక్కూడా కాదు, నీకే.. కేవలం నీకే” అని నన్ను హత్తుకొని ఏడ్చింది. ఇద్దరం చాలాసేపు అలా హత్తుకొని పడుకోనున్నాం. ఆమె తోకని పట్టుకొని ముద్దు పెట్టుకున్నా. ఈ రోగం, ఈ బాధ భరిస్తున్నాకాని ఆమె ప్రేమని భరించలేకపోతున్నా. ఆమె ప్రేమ నాలో కొత్త జీవాన్ని నింపి ప్రాణంపై పోయిన ఆశలకు నీళ్ళు పోస్తోంది.

కలొచ్చింది. ఆమె, నేను మేఘాల పాన్పుపై విహరిస్తున్నాం. అక్కడంతా పువ్వులు, ప్రేమ, ఆనందం, తప్ప ఇంకేం లేవు. ఆనందం.. ఇంకా ఆనందం, ఇళ్లు కట్టడాలు, పన్నులు కట్టడాలు, డాక్టర్లకు బిల్లులు కట్టడాలు లేవు. అక్కడ రోగాలు, రోగులు, డాక్టర్లు లేరు. అక్కడ సూర్యుడు జీవశక్తితో ప్రకాశిస్తున్నాడు. అతనికెదురుగా చంద్రుడు ప్రేమ కాంతులను వెదజల్లుతున్నాడు. ఆ కాంతి తుంపర చినుకుల్లా భూమంతా కురుస్తున్నాయి. ఆ కాంతిలో, ఆ వెన్నెల్లో మేమిద్దరం నగ్నంగా తడుస్తూ, దోసిళ్ళతో కాంతిని పట్టి ఒకరిమీదకి ఒకరం చల్లుకుంటున్నాం. చిలుకలు మీద కురుస్తున్న వెన్నెలను విదిలించి మమల్ని చూసి కిలకిల నవ్వి గోరింక చాటున దాక్కున్నాయి.

“ఇంకేం వద్దు ప్రియా! ఈ క్షణం ఇలానే ఆగిపోవాలి”.

ఆగిపోయింది. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళాడు. చంద్రుడి నుండి వేడికాంతులు ప్రసరిస్తున్నాయి. పువ్వులన్నీ వాడిపోయాయి. పక్షులన్నీ వేడికి తట్టుకోలేక నేలకొరిగాయి. తాగడానికి నీళ్ళు లేవు. సువాసనలు వెదజల్లడానికి పువ్వులు లేవు. ఆ ప్రపంచం అంతా ఎండిపోయింది. అది ఒక కలలా కరిగిపోయింది. ఇప్పుడు మేమిద్దరం తప్ప అక్కడ ఏమీ లేదు. దిగంబరంగా మేమిద్దరం. తిండి లేక ఆమె మరణించింది. ఓ ఆరడుగుల గుంత తీసి ఆమెని అందులో పడుకోబెట్టి నేను ఆమెపై పడుకొని మట్టి కప్పుకున్నా.

ఇక్కడ లేచా. అక్కడి ప్రపంచానికి, ఇక్కడి ప్రపంచానికి పెద్ద తేడా లేదు. బిల్లు కట్టగా మిగిలిన రెండు వందలు జేబులో పెట్టి, అందరూ కలిసి బయటికి సాగనంపారు. ఆమె కూడా నవ్వుతూ చూస్తుంది తప్ప ఏమీ మాట్లాడలేదు. పెద్ద డాక్టర్ కుక్క వెనక నర్సు కుక్కలన్నీ బంగారు తోకలూపుకుంటూ లోనికెళ్లాయి. శక్తి లేక హాస్పిటల్ బయట ఫుట్‌పాత్ మీద కూర్చున్నా. ఎవరో పిలిచినట్లనిపించింది. పక్కన ఎవరూ లేరు. మళ్ళీ పిలుపు. గోడవైపు చూస్తే బల్లి నావైపే చూస్తుంది. దగ్గరగా రమ్మంది. దగ్గరగా వెళ్ళా. చాలా రహస్యంగా చెవిలో చెప్పింది. ‘రాత్రి పదిగంటలకి హాస్పిటల్  పక్కనున్న పాడుబడ్డ ఇంకో హాస్పిటల్‌కి రా! రాకపోతే నీకే నష్టం. రహస్యంగా రా’ అని చెప్పి గోడమీద పాక్కుంటూ పాడుబడ్డ హాస్పిటల్ వైపు వెళ్ళింది. మిగిలిన రెండు వందలతో భోజనం చేసి రాత్రికి గోడదూకి పాడుబడ్డ హాస్పిటల్‌కి వెళ్ళా. అక్కడ మొత్తం చీకటి… ఆ చీకట్లో బల్లి నవ్వు. 

“ఎందుకు నవ్వుతున్నావ్?”

“నేను తెమ్మన్నవి తెచ్చావా?”

“ఎక్కడా దొరకలేదు. చాలా కష్టపడి తెచ్చా. నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఆ ఆపరేషన్ నువ్వు చేస్తావా?”

“చెప్పాకదా! కొన్ని వందలసార్లు ఆ ఆపరేషన్ రూమ్‌లో గోడ మీద నుండి ఆ పెద్ద డాక్టర్‌గాడు చేసే ఆపరేషన్ చూసి నేర్చుకున్నా. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా నాలుగు ఆపరేషన్స్ చేసాము”.

“మరెవ్వరికీ తెలీదా?”

“తెలిస్తే రిస్కు”

“సరే! ఆపరేషన్ ఎప్పుడు చేస్తావు?”

“ఇప్పుడే”

ఉన్నట్లుండి మిగిలిన బల్లులు మాట్లాడటం మొదలెట్టాయి.

“ఇంత చీకట్లో ఎలా చేస్తావ్?” అన్నాను.

“మాకు కనిపిస్తుంది. నువ్వొచ్చి ఇక్కడ పడుకో”.

పడుకున్నా. బల్లులన్నీ ఓ పదినిమిషాలు నా మీద పాకాయి.

“నీ ఆపరేషన్ అయిపోయింది. నీ ప్రాణానికేం ప్రమాదం లేదు. నువ్వెళ్లొచ్చు”.

“అంతేనా! మరి ఆ డాక్టర్లు ఇరవైఐదు గంటలు చెయ్యాలన్నారు? నలభై లక్షలన్నారు. ప్రభుత్వం పట్టించుకోదా?”

బల్లులన్నీ నవ్వుతున్నాయి.

*

రాయాలన్న తపన పుడితేనే…

* హాయ్ నాగేష్! మీ గురించి చెప్పండి.

మాది కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర్లో ఉన్న లింగాపురం. డిగ్రీలో బీఏ(స్పెషల్ తెలుగు) చేశాను. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండి సినిమాల్లో పనిచేశాను. ప్రస్తుతం మా ఊళ్ళో ఉంటూ సొంతంగా సినిమా కథలు రాసుకుంటున్నాను.

* సాహిత్యం మీద ఆసక్తి ఎలా ఏర్పడింది?

అందుకు ముఖ్య కారణం మా నాన్న కృష్ణయ్య. చిన్నప్పుడు ఆయన పెద్ద బాలశిక్ష పుస్తకం కొని, అందులోని అక్షరాలు నాకు నేర్పించారు. నేను బడికి వెళ్లకముందే నాకు ఓనమాలు వచ్చాయంటే ఆయన వల్లే. ఆ తర్వాత నాకోసం కాశీ మజిలీ కథలు, భట్టి విక్రమార్క కథలు లాంటి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. ఆయన చదువుకున్నది నాలుగో తరగతి. కానీ ఆయనకు చదువంటే చాలా గౌరవం. అందుకే చదువుకొమ్మని నన్ను, మా తమ్ముణ్ని బాగా ప్రోత్సహించారు.

* మీ రచనా ప్రయాణం ఎలా మొదలైంది?

ఎనిమిదో తరగతిలో ఇంగ్లీషు టెక్ట్స్‌బుక్‌లో కథ చదివి, దాన్ని తెలుగులో రాశాను. ఒక రకంగా అదే మొదటి కథ. అయితే కథలకన్నా ఎక్కువగా కవితలు రాశాను. పదో తరగతిలో 60-70 దాకా కవితలు రాశాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు పుస్తకాలు బాగా చదివేవాణ్ణి. అప్పుడే ఓ నవల కూడా రాసి సగంలో ఆపేశాను. 

ప్రముఖ రచయిత, అనువాదకులు, న్యాయవాది, మాజీ ఎమ్మెల్యే ఎం.వి.రమణారెడ్డి(మల్లెల వెంకటరమణారెడ్డి) గారిది మా ఊరే. డిగ్రీలో ఉన్నప్పుడు వెళ్లి ఆయన్ని కలిసి, నా కవితలు ఆయనకు చూపించాను. ఆయన్ని కలవడం నా జీవితంలో పెద్ద మలుపు. ఆయన నా కవితలు చూసి, ‘కథలు రాయలేదా?’ అని అడిగారు. అప్పటికి నేను కథలు రాయలేదు. కానీ ‘రాశానని’ అబద్ధం చెప్పాను. ఆ తర్వాత మళ్లీ ఆయన పిలిచేలోగా రెండు కథలు రాసి, తీసుకెళ్లి చూపించాను. ఆయన చదివి, మెచ్చుకున్నారు. రచనల విషయంలో సలహాలిచ్చారు. ఆయన దగ్గరున్న చాలా పుస్తకాలు నాకు చదువుకొమ్మని ఇచ్చేవారు. అవి చదివాక వాటి గురించి మేమిద్దరం చర్చించుకునేవాళ్లం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.

* మీ మొదటి కథ ఎప్పుడు ప్రచురించారు? దాని నేపథ్యం ఏంటి?

చిన్నప్పటి నుంచి సినిమా డెరైక్టర్ అవ్వడం నా లక్ష్యం. ఇంటర్ నుంచే షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉండేవాణ్ని. రోజుకు నాలుగు సినిమాలు చూసేవాణ్ణి. ఆ సమయంలో నా ఆలోచనలు పక్కవారికి అర్థమయ్యేవి కావు. ఆ అనుభవంతో ‘బావిలో గొర్రెలు’ అనే కథ రాశాను. 2023 జనవరిలో ఆ కథ రాస్తే, అక్టోబరులో ఆ కథ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. చాలామంది ఫోన్ చేసి, మెసేజ్ చేసి మెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘కుర్చీలు-మనుషులు’, ‘కొండచిలువ’, ‘బోసినవ్వు’.. ఇలా తొమ్మిది కథలు రాశాను. అందులో ఏడు కథలు ఫేస్‌బుక్‌లోనే పోస్ట్ చేశాను.

* మీకు ఎలాంటి రచనలంటే ఇష్టం?

అంశం ఏదైనా సరే, దాన్ని కథలా చెప్పే కథలంటే నాకు ఇష్టం. కొందరు రచయితలు అంశాన్ని డాక్యుమెంటేషన్ చేసేసి, దాన్నే కథ అంటున్నారేమోనని అనిపిస్తూ ఉంటుంది. డాక్యుమెంట్ చేయని కథలే నేను చదవగలను. అల్లం శేషగిరిరావు గారి కథలంటే చాలా చాలా ఇష్టం. కాఫ్కా రచనల్ని చాలా ఇష్టంగా చదువుతాను. రాచమల్లు రామచంద్రారెడ్డి, కేశవరెడ్డి, కొమ్మూరి సాంబశివరావు, రావిశాస్త్రి, రంగనాయకమ్మ.. ఇలా చాలామంది రచనలు ఇష్టం.

* ఇంకా ఏమేం రాయాలనే ఆలోచన ఉంది?

నేను బలవంతంగా కథలు రాయలేను. నాలో కథ రాయాలన్న తపన పుడితేనే రాస్తాను. ఇప్పటికి 9 కథలు రాశాను. మరో 6 కథలు రాశాక వాటిని పుస్తకంగా తేవాలని అనుకుంటున్నాను. నాకు నవల రాయడం చాలా ఇష్టం. తప్పకుండా ఓ నవల రాస్తాను.

*

డాన్ నాగేష్ పోతుబోయిన

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు