ఓ అజ్ఞాత ఆగామి కోట్లాది జన కోలాహాలాన్ని
నిర్జనచిత్రంగా మార్చేసింది
ఇప్పుడు కొయ్య బొమ్మకు జీవకళను అద్ది
బతుకు బొమ్మగా నిలపాలి
చిన్ని చిన్ని దూరాల నడక సాగి సాగి
అదృశ్య శత్రువుని నిర్వీర్యం చేయాలి
బుల్లి బుల్లి అడుగులతో భూమంతా
ఆశల ఊసులు వెదజల్లాలి
రెప్పకింద శోకం నింపిన ప్రాణద్రోహిని
కనుమరుగు చేయాలి
కన్నీటి పొరలను చెరిపి కొత్త చూపుతో
స్వప్నించాలి
ముచ్చెమటలా తడిసిన మట్టి మాగాణి నుంచి
కవచకుండలాల్ని ధరించిన కొత్త మొలకలు రావాలి
చీడ పురుగులు దరిచేరని లేత ఆకులు చిగురించాలి
వలసకూలీయే వజ్రసంకల్పంతో నవనిర్మాణానికి నడుంబిగించాలి
జన ఉద్యానాలు భావదీపాలై పరిమళాలు వెదజల్లాలి
పాదచారుడే పరమశక్తిశాలిగా విజయపథం వైపు పరుగులు తీయాలి
పండు అవ్వలు నిండు నవ్వులు ఒలకబోయాలి
అనంత చైతన్యాన్నిఆలింగనం చేసుకుని రేపటిని కలగనాలి
అప్పుడు శిథిల మైదానాల్లో పచ్చిక దొంతర్లు పరచి
వెన్నెల దీపాలు వెలిగించాలి
రేపటి చరిత్ర పుటలపై చైతన్యగీతం ఆలపించాలి
*
కంగ్రాట్స్ సార్ గాయపడ్డ పాదాలు “కన్నీటి పొరను చెరిపి కొత్త చూపుతో స్వప్నింంచాలని” ఆశ నిరాశ కారాదని కోరుకుంటూ