బతుకు అర్ధం వెతుక్కుంటున్న ప్రయాణికుడు

అరణ్య కృష్ణ కొత్త పుస్తకంతో కాసేపు

రణ్యకృష్ణ భిన్న సందర్భాలలో వ్రాసిన వ్యాసాలు ఏవో సాధారణ రచనలు కావు.  దాదాపు ప్రతి వ్యాసంలో ఒక విశిష్ఠత వుంది. తాను ఎంచుకున్న వస్తువు మూలాల్లోకి వెళ్లి సాహసంగా ప్రశ్నించి, పాఠకుడిని కొన్ని సందర్భాల్లో ఉక్కిరిబిక్కిరి చేసే వ్యాసాలివి.  ఈ వ్యాసాల పరిధి చాలా విస్తృతమైనది, అది మతం మీదే కావొచ్చు.  మత విద్వేషం మీదే కావొచ్చు – ఇలాంటి అంశాలు ఒక ఎత్తైతే మరికొన్ని వ్యాసాలు – సినిమా, క్రికెట్, స్పేస్ టూరిజం, రోడ్డు ప్రమాదాలు వంటి అంశాల మీద చేసిన విశ్లేషణలు మనం రోజూ చదివే విశ్లేషణలు కావు.  ఇందులో సర్జరీ వుంది.  ఈ పుస్తకానికి “కొంచెం నిప్పు కొంచెం నీరు” అని పేరు పెట్టడంలోనే రచయిత గతి తార్కిక ఆలోచనా పద్ధతిని అర్థం చేసుకోవచ్చు.  నీళ్లల్లో నిప్పుంది.  అదే నీళ్లతో నిప్పుని చల్లార్చవచ్చు.  అందుకే ఇందులోని కొన్ని వ్యాసాలను ముట్టుకుంటే నిప్పులా తోస్తాయి.  మరికొన్ని వ్యాసాలు నీళ్ల ప్రవాహంలా, మానవీకరించే ఒక చల్లని సందేశంలా ఉంటాయి.

స్త్రీ పురుష సంబంధాల మీద అరణ్యకృష్ణ విశ్లేషణలు ఒక రాడికల్ ఫెమినిస్ట్ స్థాయిలో వున్నాయి.  వీటి మీద చలం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.  అన్ని మానవ సంబంధాలలో స్త్రీ పురుష సంబంధం చాలా ప్రాకృతికమైనదని, ఈ సంబంధాన్ని మానవీకరించి, అలా మానవీకరించిన సంబంధం చాలా సహజమైపోవాలని మార్క్స్ అంటాడు.  (“The man-woman relation is the most natural relationship.  It should be humanized and humanized relation should become natural”) స్త్రీ పురుష సంబంధం మానవీకరించడమంటే లైంగిక సంబంధంలోని బలవంతాన్ని, ఆధిపత్యాన్ని, దౌర్జన్యాన్ని, హింసని తొలగించి ఆ సంబంధం ఒక ఆత్మీయ అనుభూతిగా, ప్రేమమయంగా వుండాలని రచయిత ఈ వ్యాసాల్లో బలంగా వాదించాడు.  మానవ సమాజం లైంగికత్వాన్ని కృత్రిమంగా వ్యవస్థీకరించిందని, ఒక సహజ సంబంధాన్ని దాని పునాదుల్లోనే దాదాపు ధ్వంసం చేసిందనే స్థాయికి తన విశ్లేషణని రచయిత తీసుకెళ్లారు.   అంతేకాదు మొత్తం వివాహ వ్యవస్థని, అందులోని పద్మవ్యూహాన్ని ప్రశ్నిస్తూ ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో కలిసి జీవించొచ్చు అంటూ వివాహ తతంగాన్ని ప్రశ్నించడమే కాక తన స్వంత జీవితంలో తన సహచరి అవగాహనతో అలా జీవించడం నాలాంటి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

వివాహ వ్యవస్థ, కులం, మతం, ఆస్థి, పరువుల మధ్య పెనుగులాడుతున్నది.  ప్రేమించి పెళ్లి చేసుకునే యువతీ యువకుల్ని పరువు పేరిట హత్య చేయడం ఈ అమానవీయ ప్రక్రియకి ఒక పరాకాష్ఠ.  పిల్లలు సుఖంగా జీవిస్తే చాలని భావించవలసిన తల్లిదండ్రులే వారిని హత్య చేయడం లేక హత్య చేయించడం దాకా పరిస్థితి విషమించింది.  అంటే మానవసమాజం తల్లిదండ్రుల ప్రేమ గురించి ఇంతకాలంగా నీరు పోసి పెంచుకున్న ఒక బలమైన విశ్వాసం కూలిపోవడం మన కళ్ల ముందర చూస్తున్నాం.  కులపరంగా, మతపరంగా, సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహాల పరిస్థితి భయంకరంగా మారుతున్నది.  భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేయడం, భర్తలు సరేసరి, భార్యకు వివాహేతర సంబంధం అనుమానాలతోనే హత్యలు చేయడం ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది.  తల్లి ఎవరినో ప్రేమించి పిల్లలు ఆ సంబంధానికి అడ్డంకులని వాళ్లని చంపివేయడం చూస్తే మనం ఎంత అపరిపక్వ, అమానుష దశలో జీవిస్తున్నాం అనిపిస్తుంది.  అందుకే అరణ్యకృష్ణ మొత్తంగా వ్యవస్థీకరించిన ఈ స్త్రీ పురుష సంబంధాలకు మరొక నిర్మాణం, మరొక నిర్వచనం కావాలని బలంగా ఈ వ్యాసాలలో ప్రతిపాదించారు.  ఈ సంబంధాల పట్ల స్థిరపడ్డ దృష్టికోణాన్ని మార్చుకోవల్సిన అగత్యాన్ని గుర్తించాలని వాదించారు.  ఒక్క స్త్రీ పురుష సంబంధాల మీదనే కాక అన్ని రకాల ప్రజాస్వామిక ఉద్యమాలని, తిరుగుబాట్లని, విప్లవ భావాలని నిజాయితీగా ఆహ్వానించి వాటికి పూర్తి మద్దతుగా నిలిచే నైతికతను అరణ్యకృష్ణలో స్పష్టంగా గమనించవచ్చు.

ప్రశ్నించే వారిని రాజ్యం ఎన్ని విధాలుగా హింసిస్తుందో, ఎంత అమానుషంగా ట్రీట్ చేస్తుందో అంటూ జి.ఎన్.సాయిబాబా అనుభవిస్తున్న అండా సెల్ జైలు శిక్షనే ఉదహరించారు.  అలాగే వరవరరావుగారి జీవిత పోరాటాన్ని ప్రస్తావిస్తూ ప్రజా జీవితంలో వుంటూనే ప్రభుత్వాన్ని, దాని దుర్మార్గాన్ని ఇంత సుదీర్ఘ కాలం ఢీకొన్న మరొక కవి లేరంటారు.  అట్లానే చెరసాలలని జీవితంలోకి ఆహ్వానించిన బుద్ధిజీవి కూడా మరొకరు లేరని చెబుతూ ఆయన అనుభవిస్తున్న శిక్ష పట్ల చింతనాపరులు స్పందించాల్సినంతగా స్పందించక పోవడాన్ని తప్పుపట్టారు.  ఈ ఉదాశీనత ప్రభుత్వ దుర్మార్గాలకు దోహదం చేయదా? అనే సూటి ప్రశ్న అడిగారు.  ఈ రెండూ ఉదాహరణలుగానే చెప్పినా రాజ్యం చేతిలో చితికిపోతున్న జీవితాల పట్ల ఎంతో కన్సర్న్ తో వ్రాశారు.  నేరం శిక్ష మీద మౌలిక ప్రశ్నలు అడుగుతూ సత్యంబాబు ఉదంతం గురించి వ్రాశారు.  పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేసిన ఉదంతాలు ఎన్నో వున్నాయి.  ఇవ్వాళ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న వారిలో చాలామంది అమాయకులు, పేదలు, అణగారినవారూ వున్నారు.  ఎంతమంది క్రిమినల్స్ శిక్షల నుండి తప్పించుకున్నా ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదనే నాగరిక విలువ నుండి మనం చాలా దూరం వెళ్లిపోయాం.  రచయిత ఈ వ్యాసాల్లో రాజ్య స్వభావాన్ని, దాని నిర్బంధ చట్టాల్ని గట్టిగా ప్రశ్నించారు.

రాజ్యం ఇవ్వాళ చేపట్టి అమలుచేస్తున్న అభివృద్ధి నమూనాని, అది చేస్తున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతూ, దీని అంతిమ పర్యవసాననం ఏమిటో ఆలోచించాలని హెచ్చరించారు.  ఈ అభివృద్ధి ఎంత తలకిందులుగా వుందో ఒక ఉదాహరణ ఇస్తూ టూరిజం లాంటి ఒక విజ్ఞాన ప్రక్రియ మనిషి అనుభవాన్ని విశాలంగా మార్చే బదులు అది మనిషి వికృత స్వభావాన్ని మరింత పెంచి ఒక ‘హ్యూమన్ ట్రాఫికింగ్’గా దిగజారడం ఎంత విషాదకరమో వివరించారు.  ఇది మహిళల జీవితాన్ని ఎంత దుర్భరంగా మార్చిందో వివరిస్తూ దీనిని టూరిజం పేర జరిగే అభివృద్ధి యొక్క విష ఫలితంగా పేర్కొన్నారు.

ఈ వ్యాసాల్లో మరొక భయంకరమైన ‘పుకార్ల కేన్సర్’ అంశాన్ని చాలా లోతుగా ప్రస్తావించారు.  మీడియా దుష్ప్రచారం, మనుషుల్ని రెచ్చగొట్టడం, సత్యాన్ని ధ్వంసం చేయడం, నిజాన్ని అబద్ధంగా – అబద్ధాన్ని నిజంగా చెప్పడం ఇప్పుడొక సాధారణ విషయమైపోయింది.  ఎన్ని రకాల పుకార్లు ప్రచారంలో వున్నాయో కూడా ప్రస్తావించారు.  ఈ అంశం గురించి, దాని విష పరిణామాన్ని గురించి వ్రాస్తూ పుకార్లు హిట్లర్ చేసిన అమానుష దుర్మార్గ మారణకాండకు ఎట్లా ప్రజల సమ్మతిని కూడగట్టాయో మనం మర్చిపోకూడదని హెచ్చరించారు.

వ్యవస్థీకృత సాంస్కృతిక విలువల పట్టు మన మేథస్సులపై, చైతన్యంపై ఎలా పనిచేస్తుందో అరణ్యకృష్ణ వివరించారు.  ఇవ్వాళ రాజకీయాలు ప్రజల మౌలిక సమస్యలను పక్కదారి పట్టించే సాంస్కృతిక పార్శ్వాన్ని ఎత్తిచూపుతూ దాని విష పరిణామాన్ని వివరించారు.  రాజకీయాలు ఈ ‘సాంస్కృతిక పెట్టుబడి’(cultural capital)ని ఎంత దుర్మార్గంగా వాడుకుంటుందో అందరం చూస్తునే ఉన్నాం.  ఎందుకో విప్లవోద్యమం నుండి అస్తిత్వ ఉద్యమాల దాకా సాంస్కృతిక పట్టుని, దాని లోతుని అంచనా వేయడంలో విఫలమయ్యారు.  మన సమాజంలో మన గురించి, మన బలహీనత గురించి, మెజారిటేరియనిజం గురించి రచయిత చేసిన విశ్లేషణ చాలా విశిష్ఠమైందే కాక మనిషిని మనిషిగా తప్ప వేరే కోణం నుంచి చూడడాన్ని అరణ్యకృష్ణ అంగీకరించడు.

అరణ్యకృష్ణ విశ్లేషణలో జనాభా పెరుగుదలపై వ్రాసిన వ్యాసాన్ని భిన్న కోణం నుండి చూడవచ్చు.  జనాభాని మనుషుల్ని లెక్కించడం (head count) ద్వారా చూడకూడదు.  ఉదాహరణకు భారత్ జనాభా 140 కోట్లు.  అమెరికా జనాభా 30 కోట్లు కానీ ఒక సాధారణ అమెరికన్ వినియోగం (consumption)…అంటే వస్తు వినియోగాన్ని గమనిస్తే అది ఒక సాధారణ ఇండియన్ కంటే 30 రెట్లు ఎక్కువ.  ఈ కోణం నుండి అమెరికా జనాభా 900 కోట్లు అవుతుంది.  జనాభా నియంత్రణలో బాటు వినియోగాన్ని (consumption)  నియంత్రించ వలసి ఉంటుంది.  అలాగే ఎన్నికల రాజకీయాలని ఒక వైపు మౌలికంగా ప్రశ్నిస్తూ మహిళలకు 30% రిజర్వేషన్లు కల్పిస్తే పరిస్థితి మారుతుంది అని ప్రతిపాదించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇలాంటి కొన్ని పరిమితులున్నా ఈ పుస్తకంలో చాలా విలువైన వ్యాసాలున్నాయి.  ఈ పుస్తకంలో ఉన్న ప్రతి వ్యాసం మీద ఒక వ్యాసం వ్రాయొచ్చు.  ఆ పని ముందుమాటలో చేయడం భావ్యం కాదు. ఈ మొత్తం వ్యాసాల్లో ఒక తీవ్రమైన ఆగ్రహం వుంది.  ఇది ధర్మాగ్రహమే.  కొన్ని వ్యాసాల్లో రగిలిపోయిన ఆవేశముంది.  నా దృష్టిలో ఈ రచనలో సామాజిక స్తబ్దత పట్ల, భయానకంగా అనిపించే స్పందనారాహిత్యం పట్ల, కూలిపోతున్న విలువల పట్ల ఆగ్రహం ఒక వైపు, నూతన సమాజ ఆవిర్భావం కోసం పడుతున్న ప్రసవవేదన పట్ల ఆశ మరొక వైపు కూడా కనబడతాయి.

ఒక కోణంలో అరణ్యకృష్ణ ఒక స్వాప్నికుడు.  మరో కోణంలో బాలగోపాల్ లా తన వ్యక్తిగత జీవితంలో, ఆలోచనల్లో, రచనల్లో జీవితానికి అర్ధం వెతుకుతున్న ప్రయాణికుడు.  ఈ రచన చదివిన ఎవరైనా దాని ప్రభావం నుండి తప్పించుకోలేరు.

*

ప్రొఫెసర్ హరగోపాల్

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముందుమాటలు ఎలా రాయాలో తెలియచెప్పే వ్యాకరణ పుస్తకం లాంటిదీ ముందుమాట. హరగోపాల్ గారికి, అరణ్య క్రిష్ణ గారికి హ్రుదయపూర్వక అభినందనలు

  • మనిషిని మనిషిగా తప్ప వేరే కోణం నుంచి చూడడాన్ని
    అంగీకరించని అరణ్యకృష్ణ గారి
    “కొంచెం నిప్పు కొంచెం నీరు” లోని వివిధ వ్యాసాల పుస్తకం పై హరగోపాల్ గారి ఈ పరిచయ వాక్యం అద్భుతం
    అరణ్య కృష్ణ గారికి అభినందనలు 🌿🍀🌿

  • అభ్యుదయ భావాల దారాలతో నేసిన వ్యాసాన్ని ఏ పోగు కాపోగు విప్పి దారాల రంగుల్ని పాఠకుడి ముందుంచారు. కుడోస్ సర్ మేలైన విశ్లేషణ

  • భావంలో వేడి, పదాలలో పదును
    కూర్పులో నేర్పు, నిజమైన నిజాయతి
    కవితైనా, వ్యాసమైనా
    చదువరిని నిలవేసే రచయత
    బ్రతుకు అర్ధం ఇంకా వెతకటంలోనే
    ఉన్నారంటారా!!

  • మంచి విశ్లేషణ. చెయ్యి తిరిగిన రచయిత అరణ్యకృష్ణ గారైతే ఆయనని మించిన అనుభవజ్ఞులైన విశ్లేషకులు హరగోపాల్. తన సమీక్షలో పూర్తి న్యాయం చేశారు. ఇద్దరికి అభినందనలు

  • హరగోపాల్ సర్ ముందు మాట లోనే పుస్తకం చదవాల్సిన అవసరాన్ని వివరించారు…. పుస్తకం ఎక్కడదొరుకుతుంది???

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు