బతుకమ్మ పండుగకు ‘తల్లిగారిల్లు’

“తంగేడు పూలంటే పూలమ్మకు చిన్నప్పటి నుంచి చెప్పలేనంత ప్రేమ. పెళ్ళికి ముందు తల్లిగారింటి దగ్గర ఉండగా.. బతుకమ్మ పండగ మొదలైందంటే చాలు. పూలమ్మ రెక్కలు నేల మీద నిలిచేయి కాదు. తెల్లారక ముందే నిద్ర లేచి పిట్టలాగా పూల కోసం ఉరికేది. తంగేడు పూలు, గునుగు పూలు, గడ్డి పూలు, బీర పూలు… ఇట్లా తీరొక్క పూలు తెంపుకుని బువ్వలు తినే యాళ్ళకు ఇల్లు చేరుకునేది. తెచ్చిన పూలన్నీ ఒక చాపలో పోసేది. వాళ్ళమ్మతో కలిసి  బతుకమ్మను పేర్చేది.”

‘తల్లిగారిల్లు’ కథ చదవండి తల్లిగారిల్లు

తంగేడు పూవు చుట్టూ గునుగు పూవు అల్లుకున్నట్టు తెలంగాణ సాంస్కృతిక వారసత్వమంతా బతుకమ్మ పండుగ చుట్టూ అల్లుకొని ఉంటుంది. బతుకమ్మంటే చెరువు అలల మీద మెలమెల్లగా కదిలి పోయే పూల తేరు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణలోని ప్రతి ఊరు వసంత శోభను సంతరించుకుంటుంది. తోవ పక్కన పూసిన పూలన్నీ, అడవిలో విరిసిన పుష్పాలన్నీ ఇంటికి చేరి ‘తాంబాలం’లో గుమ్మడి ఆకుల మీద బుద్ధిగా ఒదిగి కూర్చుంటాయి. తీరొక్క పూవులతో ముస్తాబైన బతుకమ్మను దేవుని గుడి ముందరో, చెరువు కట్ట మీదనో ఉంచి కన్యలందరూ వాళ్ళ తల్లులతో కలిసి కొత్త కోకలు కట్టుకొని ఆ గౌరీ మాతను తమకు పచ్చని జీవితాన్ని ప్రసాదించుమని బతుకమ్మల చుట్టూ తిరుగుతూ నాజూకైన చేతులతో చప్పట్లు కొడుతూ..

“శ్రీలక్ష్మీ నీ మహిమాలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మా…

బంగారు పువ్వులూ బతుకమ్మయని పేర్చి.. మంగళంబున నిన్ను మధ్యన నిలిపియూ..

అరే.. రంగు రంగుల పువ్వులూ.. గౌరమ్మ రాతి తంగేడు పువ్వులూ గౌరమ్మా..

కోరి ఈ రీతిగా చేరి పూజింతుమూ.. జారు సుందరమైన సౌభాగ్యములనిచ్చి

పైరు పంటలు పల్లెటూళ్లలో పచ్చగా.. పాడియావులు పిల్ల పాపలతో నిండుగా..

ఎల్ల కులంల వారినీ గౌరమ్మ చల్లగా చూడవమ్మా గౌరమ్మా…

అని పాడుతూ గౌరమ్మను వేడుకుంటారు. బొడ్డెమ్మతో మొదలు పెట్టి ఎంగిలి పూల బతుకమ్మ మీదుగా సద్దుల బతుకమ్మ దాకా ఇదే సందడి.

బతుకమ్మంటే తెలంగాణ ఆడబిడ్డల మనసు పండుగ. పెళ్లి పేరుతో తను వదిలి పెట్టి పోయిన చెట్టును, చేమను, పిట్టను, పుట్టను, వాగును, వంకను, తల్లిని, స్నేహితురాలిని అందర్నీ మళ్ళీ ఒక్కసారి కౌగిట్లోకి తీసుకొని తనివి తీరా తడిమి చూసుకొని సంవత్సరానికి సరిపడా ప్రేమను, ఆప్యాయతను, గుండె బలాన్ని, సంతోషపు టానిక్ ను రక్తంలో నింపుకోవడం. పుట్టి పెరిగిన నేల మీది మమకారాన్ని, ఊరు మర్యాదనూ, మన్నననూ, పలకరింపునూ, అనుబంధాన్ని ఊపిరి తిత్తుల నిండా పీల్చుకోవడం.

తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయి అక్కడ అత్త బెదిరింపుల మధ్య ఇంటెడు చాకిరీతో పాటు పొలం పనులూ చేసీ చేసీ చేతులరిగిపోయి, నెత్తురింకి పోయి కనీసం యేడాదికొక్కసారి బతుకమ్మ పండుగకైనా ఓ పది రోజుల విశ్రాంతి దొరుకుతుందని ఈ పండుగకు తల్లిగారింటికి పోవచ్చని మురిసి పోతూ బతుకమ్మ పండుగ కోసం ఏడాదంతా ఎదురు చూసే ఆడపిల్లలెంతో మంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు తీసుకు పోవడానికి వచ్చే తల్లిగారు ఈ సారి రాక పోతే ఆ ఆడబిడ్డ మనసు ఎంత తల్లడిల్లుతుంది? తల్లిగారి ఇంటి చుట్టూ, తల్లిదండ్రుల చుట్టూ, బతుకమ్మ పండుగ చుట్టూ, ఊరు చుట్టూ అల్లుకునే జ్ఞాపకాలెన్నో. అట్లా ఎదురు చూసే పూలమ్మ కథే ఈ ‘తల్లిగారిల్లు’.

“చేల గట్ల మీద తంగేడు పూలు కనబడగానే నాయిన వస్తడు.. తీస్కపోతడని ఎదురు చూసేది పూలమ్మ. ఇంగ పుట్టింటికి పోతుంటే పూలమ్మ ఆనందం మాటల్లో చెప్పతరం కాదు. వేరే లోకానికి పోతున్నంత ఆనందంగ ఉండేది. పుట్టి పెరిగిన ఇల్లు, ఊరు.. బాగున్నవారా పూలమ్మ. ఎప్పుడొచ్చినవు.. ఏంది బిడ్డా! మనిషివి తగ్గిపోయినవు అంటూ ప్రేమతో పలకరించే జనాలు. అట్ల తల్లిగారిల్లు వచ్చినపుడు పూలమ్మకు మల్లొక్క జన్మ ఎత్తినంత సంబరం. బిడ్డ రాక రాక వచ్చిందని తల్లి కాలు కింద పెట్టనిచ్చేది కాదు. ఉన్నంతలోనే కమ్మగా అన్నీ చేసి పెట్టేది. ఇంగ బతుకమ్మ మొదలు పెట్టిన రోజు నుంచి సద్దుల బతుకమ్మ దాకా చిన్న పిల్లే అయ్యేది పూలమ్మ. అట్లాంటి పూలమ్మ ఈ ఏడాది పుట్టింటికి పోయే రాతకు దూరమయ్యింది.” ఎందుకో కథలోకి పోతే కానీ తెలియదు.

వ్యవసాయధారులకు పండుగ లేదు, పబ్బం లేదు. అట్లా పండుగ చేసుకుంటూ కూర్చుంటే పాడినిచ్చే ఆవులు, బర్రెలు, వ్యవసాయానికి భుజమిచ్చి ఆసరాగా నిలబడే ఎడ్లు, గేదెలు ఆకలికి అరిచీ అరిచీ చచ్చిఊర్కుంటాయి.  దీనికి తోడు కఠినాత్మురాలై కోడల్ను పసురం కంటే కడహీనంగా చూసే  అత్త దొరికితే ఇగ ఆ ఆడబిడ్డ గోస చెప్పరాదు. ఈ కథలోని పూలమ్మ అలాంటి కష్టానికే నోచుకుంది.  “అత్తకు పూలమ్మంటే చిన్న చూపు. ఏదో గతిలేక చేసుకున్నం అని నిత్యం సాధింపులు. పేరుకే ఇంట్లె కోడలు. పని మనిషి కంటే అధ్వానంగా పని చేయించేది అత్త. చిన్న వయసులోనే పెళ్లి, సరైన తిండి లేక, నిద్ర లేక… ఇప్పటికీ సంతానం దక్కలేదు. పాతికేళ్లకే పుట్టెడు కష్టాలు చూసింది పూలమ్మ. ఈ కష్టాల చెర నుంచి విముక్తి దొరికేది బతుకమ్మ జరిగే తొమ్మిది రోజులే.”

కథ తంగేడు పూల సోయగంతో మొదలై తంగేడు, గునుగు పూల అందంతోనే ముగుస్తుంది. నడుమ పూలమ్మ అత్త వెంకటమ్మ కరుకుదనం, భర్త శంకరి, మర్ధి శీనయ్యల మంచితనం, తోటి కోడలు సుభద్ర మౌనం, సుభద్ర తండ్రి సైదులు మానవీయపు మాటలు పాఠకుడిని ఉన్నచోట ఉండనీయవు. కష్టంలో తేడా ఉండొచ్చు కానీ పూలమ్మలు తెలంగాణలో కడప కడపకు ఉంటారు. పుట్టింటికి పోలేని పూలమ్మ కన్నీళ్లు మన గుండెల్ని కూడా తడి చేస్తాయి. కథ నిండా పూలమ్మ కన్నీటి కాలువలే పారుతుంటాయి. ఆమె కష్టపు జీవితం మనల్ని మెలి పెడుతుంది. ఇంటి పని ఒకవైపు, వ్యవసాయపు పనులు మరో వైపు, ఇంకో వైపు అత్త నిరాదరణ పూలమ్మను పీల్చి పిప్పి చేస్తాయి. పేరుకే ఆమె పూలమ్మ కానీ ఆమె జీవితం నిండా ముళ్లే పర్చుకొని ఉన్నాయి. పూలమ్మ ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ప్రతినిధి. బతుకమ్మ పండుగకు కూడా నోచుకోలేక ఆమె మనసు ఎంత క్షోభ పడుతుందో కథకుడు కళ్ళకు కట్టిస్తాడు.  కథలోని మిగిలిన పాత్రల్ని చిత్రించడంలో కూడా కథకుడి నేర్పు దాగి ఉంది.

కథంతా సరళ శిల్పంలో సాగినా బతుకమ్మ పండుగలాగే హృదయమంతా పర్చుకుంటుంది. పూలమ్మలో మన చెల్లెలో, అక్కనో కనిపిస్తుంది. బతుకమ్మ పండుగకు పుట్టినింటికి రావాలని ప్రతి ఆడబిడ్డ ఎంతలా ఆరాట పడుతుందో, తనలో తానే నిశ్శబ్దంగా ఎంతలా పోరాడుతుందో కథకుడు ప్రతి అక్షరంలో చూపించాడు. భార్య మనసు అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టమే. అలాటి మంచి పాత్ర శంకరి. సైదులు పాత్ర కూడా సగటు పాఠకుడికి నచ్చుతుంది. తన బిడ్డతో  సమానంగా పూలమ్మను కూడా చూడడం సైదులు గొప్పదనం. బతుకమ్మ పండుగ ఉన్నన్ని రోజులు చదువరుల గుండెల్లో నిల్చిపోయే కథ.

కట్ల పూవు వంటి ఈ కథను రాసింది 2015 నుండి తెలంగాణ జీవితం, చరిత్ర, సంస్కృతి, మానవ సంబంధాలను కథలుగా మలుస్తున్న వర్ధమాన కథా రచయిత చందు తులసి. ఇప్పటి దాకా పది కథలకు పైగా రాశారు. అవన్నీ పుస్తకంగా రావాల్సి ఉంది. చందు తులసి పేరు చెప్పగానే ఆయన రాసిన ‘ఊరవతల ఊడలమర్రి’, ‘బుక్కెడు బువ్వ’, ‘రంగురెక్కల వర్ణ పిశాచం’ ‘పాలపిట్టల పాట’, ‘నీళ్ళబిందె’ వంటి కథలు కథా ప్రేమికుల మనోఫలకంపై మెదులుతాయి. ఇవేగాక ఎన్నో సమకాలీన అంశాలపై వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాస్తున్నారు. ఎంతో మంది రచయితలను ఇంటర్వ్యూ చేశారు. ఈ కథ మొదట 17 సెప్టెంబర్ 2017న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది. తరువాత ‘దావత్’ తెలంగాణ కథ – 2017 సంకలనంలో కూడా ముద్రణ పొందింది.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పూలమ్మ , ఎంతో మంది తెలంగాణ ఆడ బిడ్డల ప్రతిబింబం …కానీ కథ లో ముగింపు అందరికీ వస్తే బాగుండు. మంచి కథ కు, చక్కటి విశ్లేషణ.

  • మంచి కథకు చక్కటి విశ్లేషణ. పూలమ్మ తెలంగాణ ఆడబిడ్డకు ప్రతినిధి అని బాగా పోల్చారు. బతుకమ్మ పండుగని గుర్తుచేసే గునుగుపువ్వు, తంగేడు పూలలాంటిది ఈ కథ కూడా. అభినందనలు.

  • విశ్లేషణ బావుంది…
    నేను కథ చదివాను.
    చందు తులసి కథలు అన్నీ చదివాను.
    చాలా బాగా రాస్తున్నారు.

  • చందు,శ్రీధర్ గార్లకు అభినందనలు. కథ మరియు కథా విశ్లేషణ బాగుంది.

  • కథ పేరును నాలాంటి రచయితలెవరైనా
    ” బతుకమ్మ” అనో “తంగేడు పూలు” అనో, మరింకేదో పెట్టి ఉండేవారు. చందుతులసి గారు మాత్రం “తల్లిగారిల్లు” అనే ఆర్ద్రతా , ఉదాత్తత గల టైటిల్ తో బతుకమ్మ పండుగ తో తెలంగాణ ఆడపడుచులకు ఉండే అనుబంధాన్ని మంచి కథగా రాశారు. కథ అంతా తెలంగాణ లోని చాలా ఇళ్లల్లో జరిగే వ్యవహారంలానే అనిపిస్తూ మనల్ని చివరిదాకా అలవోకగా చదివింపజేస్తుంది. ఇక శ్రీ శ్రీధర్ గారి విశ్లేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ కథాసాహిత్య చరిత్ర లో గొప్ప విశ్లేషకులు గా చిరస్థాయిగా వారి పేరు నిలిచివుంటుంది‌. మంచి మంచి కథలను వెతికి పట్టుకొని మనకు విశ్లేషణాత్మకంగా అందిస్తున్న శ్రీ శ్రీధర్ గారికి వేలవేల కృతజ్ఞతలతో పాటు అంతకన్నా ఎక్కువ అభినందనలు.

    • మీ లాంటి పెద్దలకు కథ నచ్చడం సంతోషం సార్.

  • చక్కని కథను హృద్యంగా విశ్లేషించారు. కథాసాహిత్యంలో మీరు చేస్తున్న కృషి మరువలేనిది సార్. హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు

  • Wonderful ….గొప్ప కథ…..పాఠాలు గా ఉండాలి. తరతరాలుగా ………..అభినందనలు . నమస్కారం అశోక్ సిద్దిపేట

  • హృద్యమైన కథకు ఆసక్తికరమైన విశ్లేషణ.మిత్రులిరువురికి శుభాకాంక్షలు,అభినందనలు.👏👏

  • ఈ రోజు మన సంస్కృతి ని తెలిపే పాటలు,కథలు వివిరివిగా విరచింపబడుతున్నాయి,కాని వాటిని పరిచయం చేసే వారు తక్కువగా ఉన్నారు.ఈనేపథ్యంలో మనకు ఒక బాధ్యతగా భావించి మంచి కథలను, మంచి పాటలను పరిచయం చేస్తున్న
    డా. వెల్దండి శ్రీ ధర్ అభినందనీయులు.

    • ఔను సార్. మీ లాంటి పెద్దలదే ఆ బాధ్యత

  • హృదయాలను కట్టి పడేసే కథలను.. పాఠకులకు అందించడంలో ఎప్పుడూ… శ్రీధర్ గారు ముందుంటారు…
    ఉత్తమ సమీక్ష నందించారు . ధన్యవాదాలు మాష్టారూ🙏

    .

  • సమీక్షను వీక్షిస్తేనే కథాబలం అర్థమయింది.కథా కదనం శైలీ కూడా హత్తుకునేటట్లుందని వేరే వివరించనక్కర్లేదు….పూలమ్మ మనసు ఎంత నలిగిపోయిందో.. మెలిపడిందో చిక్కగ వర్ణించారు సమీక్షకులు.
    మెలిపెట్టిన ఘటనను రచయిత వాసి వన్నెకెక్కినవారుకాబట్టి అంతహృద్యంగా రాయగలిగారు.
    వీరి రచనలు నేలవిడిచి సాముచేయని కథలే. నేనుచదివాను…ఊరిఅవతల ఊడలమర్రి…యీంకాను…చేవగలరచయితను ఎంచుకున్న సమీక్షకులుకూడా అంతే అభిరుచివున్నవారు…అంతే సాంద్రతగల కథ అమ్మగారిల్లు కథ…సమీక్షను చదివితేనే కంటనీరు వచ్చిందండి. పూర్తిగ అసలు కథ చదివితె కథాబలాన్ని, పూలమ్మ పసివాడని తనాన్ని ఫీలవుతూ మరింతగుండెచెరువవడం ఖాయం.
    ఓ మంచి రచయిత గొప్పతనాన్ని మరో మంచిరచయిత గుర్తేరగడం పలువురికి పంచడంకూడా సహృదయతేనండి.
    మంచి encouragement గ చెప్పవచ్చునండి.మంచి కథను పంచారు.

    వి.వి. భరద్వాజ

  • ఎప్పటిలాగే మీ విశ్లేషణ బాగుంది. మీకు అభినందనలు.

  • హాయైన ముగింపుతో పండగ లాంటి కథని పరిచయం చేసిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు.

    ఇంత మంచి కథ రాసిన చందు తులసి గారికి శుభాభినందనలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు