ప్రపంచ ప్రజాగాయకుడు విక్టర్ హార (Victor Jara ) మ్యానిఫెస్టో అనే పాటలో, “ధనవంతులకోసమో, పేరు తెచ్చుకోవడం కోసమో పాడదు నా గిటార్” అని అంటాడు. ప్రజలకోసం గొంతెత్తిన తన గిటార్ తన ప్రయోజనాన్ని కనుక్కుందని అంటాడు. ఎంత గొప్ప భావన?
“నేనెప్పటికైనా నా రచనల గురించి అలా ఫీల్ అవగలనా? ఈ ప్రపంచానికి నేనెందుకు, నా రాతలెందుకు?” అని గింజుకుంటునే ఉంటాను.
నా రాత కూడా తన ప్రయోజనాన్ని కనుక్కుందని నాలో ఓ చిన్న ఆశను రగిలించింది ‘ఇద్దరు గొంగళిపురుగులు ‘ అనే నా కథ. రెండేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారంలో ప్రచురితమైన కథ గురించి పాఠకులనుంచి ఇప్పటికీ ఈమెయిల్ ద్వారా స్పందన వస్తోంది.
నాకూ, పదమూడేళ్ల మా అమ్మాయికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఈ కథ రాశాను. మా ఇద్దరికీ కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరం ప్రోబింగ్ ప్రశ్నలు వేసుకోవడం ఇష్టం. తనను నొప్పించిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటూ, మనసుల్లో అరలు ఏర్పాటు చేసుకోవడం గురించి మాట్లాడుకున్నాం.
చంఘీజ్ ఖాన్ను ఒక మనిషిగా తెలుగు పాఠకుల ముందు ఆవిష్కరించిన ‘ఛంఘీజ్ ఖాన్’ అనే నవలలో, తెన్నేటి సూరి గారు టెమూజిన్ తన మనసులో అరల్ని ఏర్పాటుచేసుకుంటాడనీ, ఒక అరకీ మరో అరకీ సంబంధం ఉండదనీ రాస్తారు (Page 195). మా అమ్మాయి వయసులో ఉన్నప్పుడు నేను చదివిన పుస్తకంలోని ఆ వాక్యం ఇన్నేళ్ల తరువాత కూడా నన్ను సవాల్ చేస్తుంది. ఆమెను అడుగుతూ నన్ను నేను ప్రశ్నించుకుంటున్న సంభాషణకు ఆ వాక్యమే నాకు ప్రేరణ. పిల్లల మాటలు వినాలే గానీ, ఏడ్చి తడిసిన కళ్లల్లోని ఇంధ్రధనుస్సుల గురించీ, వాన నీళ్లల్లో మునిగిపోతున్న చంద్రుడి గురించీ మనకు మూసుకుపోయిన మనసులు తెరుచుకునేలా చెప్తారు. జీవితాంతం వెతుక్కుంటున్న ప్రశ్నలకు ఊహించని కోణం నుంచి జవాబు చూపిస్తారు.
తన ఐదుగురు పిల్లలకోసం రాసిన చివరి ఉత్తరంలో చే గెవారా (చే గువేరా), “అన్నింటికీ మించి, ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడైనా జరిగే అన్యాయాల్ని అనుభూతి చెందే సత్తా కలిగి ఉండండి.” అని రాస్తాడు. ఈ ప్రపంచంలో పుట్టాం గనక, అపసవ్యంగా, అడుగడుగునా అన్యాయల పుట్టగా ఉన్న సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చే మాటల నుంచే నాకు అర్థమయింది.
నాకు అర్థమైన విషయాల్ని ఇతర్లతో పంచుకోవాలన్నది ఈ కథ రాయడంలోని ముఖ్య ఉద్దేశ్యం: పిల్లలు ఆకాశానికి ఎగిరి, కిందపడితే పట్టుకోగలిగే సేఫ్టీ నెట్ లా ఉండాలి గానీ, వాళ్ల రెక్కల్నీ, ఆలోచనల్నీ బంధించే వల కాకూడదు తల్లిదండ్రులు. అదే సమయంలో వాళ్లెటు ఎగురుతున్నారో పట్టించుకోవాలి, మానవత్వం ఉన్న మనుషులుగా ఎదగడానికి దారి చూపించాలి. వాళ్లు సమాజం ఇంత అన్యాయంగా ఎందుకు ఉందో తెలుసుకోవాలి, దాన్ని మార్చే శక్తిని సంపాదించుకోవాలి.
కథలోని వేరే విషయాల్ని కూడా గమనించారు కానీ, కథ రాయడం వెనుక ముఖ్య ఆ ఉద్దేశాన్ని పాఠకులు పట్టుకున్నారు. చాలావరకు అందరికీ నచ్చిన అంశాలు: ఒకరికొకరికి సాంత్వననిచ్చుకుంటున్న ఓ తల్లీ కూతుళ్ల మధ్య సున్నితమైన బంధం, స్వంత నొప్పినుంచి జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ప్రపంచంలోని అన్యాయాలెందుకున్నాయో తెలుసుకుని, వాటిని ఎదిరించే జీవిత లక్ష్యానికి ప్రాముఖ్యం ఇవ్వాలనే అంశం.
అవును, ఇది సందేశాత్మక కథే – ఇకపై రాస్తే గీస్తే ఆ సో-కాల్డ్ చట్రంలోంచే రాస్తుందట నా కలం, అందుకు తానేమీ సిగ్గు పడటం లేదట. పోగా, ఒకింత గర్వం కూడానట.
ఇంకో నిజం ఒప్పేసుకుంటున్నా. నేనొక రైటర్ ని అనీ, బాగా రాస్తాననీ, అలా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఒకప్పుడు అనుకునేదాన్ని. ఈ కథ రాసేప్పుడూ, రాశాకా, కథ అచ్చయ్యాక, పాఠకులు ప్రతిస్పందన చదివాక, “నేనెందుకు, నా రాతలెందుకు” అన్న ప్రశ్నలకు నాకు జవాబు దొరికింది. నా రాత ఉన్నది నాకు పేరు తెచ్చిపెట్టడానికి కాదు. రచయితగా నన్నెవరు గుర్తిస్తారు, గుర్తుంచుకుంటారు అన్నది ఇకపై నాకు అనవసరం. నా కలం రాసి ప్రపంచం మీదకు ఎగరేసిన రాతకు కొన్ని గుండెల్నైనా కదిలించి, కరిగించే సత్తా ఉందన్న సంతోషం ఆ కలానికి చాలు.
ఇంతోటి సంతోషానికి కారణమైన ఈ కథంటే నాకు చాలా ఇష్టం.
By the way, మనమున్నామే, మనం… మనుషులం… మనం అద్భుతమైన వాళ్ళం! ఎంత అద్భుతమైన వాళ్ళమనీ???
గొంగళిపురుగులంత!!!
ఇక కథ చదవండి.
*
ఇద్దరు గొంగళిపురుగులు
“నువ్వు చేసిన పనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నా.”
ఎక్కడో మారుమూల నొక్కిపెట్టేసిన గ్నాపకాల్లోంచి హఠాత్తుగా ఎగిరొచ్చింది సూదంటురాయి ఒకటి.
గట్టిగా ఊపిరి పీల్చుకుని తల విదిల్చింది శశి. కంప్యూటర్లో టైపు చేస్తున్న డాక్యుమెంట్ ను సేవ్ చేసి, కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి నడుస్తూ “మేఘా, తినడానికి ఏమన్నా తెచ్చివ్వనా?” అని హాలుకు అవతల వున్న మేఘ గదిలోకి కేకేసింది.
మేఘ 7వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ వల్ల సంవత్సరం నుంచి క్లాసులన్నీ ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. గట్టిగా అరిచి క్లాసు డిస్టర్బ్ చేశానేమోనని అనుకుంది శశి.
“ఇక్కడే ఉన్నానమ్మా.”
రైటింగ్ టెబిల్ పక్కనే ఉన్న సోఫాలో ముడుచుకుని కూర్చునుంది మేఘ.
శశి నవ్వేసింది, “నువ్వెప్పుడొచ్చావ్, నా చల్లని మబ్బు తునకా.” మేఘ పక్కన కూర్చుంటూ అంది.
“ఇందాకే. పక్కన పిడుగుపడ్డా వినపడదేమో అన్నట్లు రాసుకుంటున్నావని డిస్టర్బ్ చెయ్యకుండా కూర్చున్నా. అయిపోయిందా పని?”
“ఇంకొంచెం ఉందిరా. ఏదో సడన్ గా గుర్తొచ్చి ఆలోచన తెగిపోయింది. కాఫీ చేసుకుందామని వెళ్తున్నా. నీకేమన్న చేసివ్వనా? ”
“వాక్ కి వెళ్దామా? టెన్ మినిట్స్ లో వచ్చేద్దాం.”
“రిపోర్ట్ పని అయ్యాక వెళ్దామా?”
“సరే” నెమ్మదిగా అన్నది మేఘ. శశి మేఘ వైపు చూసింది. మేఘ తల తిప్పేసుకునే లోపల తన ఉబ్బిన కళ్లను చూసేసింది.
“లేదులే, నాక్కూడా బ్రేక్ కావాలి. ఇప్పుడే వెళ్దాం పద.” మాములుగా అయితే ఉత్సాహంగా లేచేది కానీ, ఈరోజు మెల్లగా కదిలింది మేఘ.
మాస్కులు పెట్టుకుని బయటకు వచ్చారు. అప్పుడే వచ్చిన వసంతానికి పువ్వులు విరగబూసిన చెట్లు గాలికి మెల్లగా కదులుతూ ఒక వింత అందం అలుముకుని ఉంది. గాలికి ఎగురుతున్న వెంట్రుకలను కళ్ల మీద నుంచి చెంపల మీద జరుపుకుంది మేఘ. ముఖం శశికి కనిపించనివ్వకుండా జుత్తును సర్దుకుంది. అదంతా క్రీగంట గమనిస్తున్న శశి ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది
ఒక ఇంటి ముందు గడ్డిలో తెల్ల సీతాకోకచిలుక ఒకటి ఎగురుతూ కనిపించింది. తెల్ల సీతాకోకచిలుకలంటే మేఘకు భలే ఇష్టం. వసంతం వచ్చేస్తుందని చెప్పటానికన్నట్లు చలికాలం చివరి రోజుల్లో అప్పుడప్పుడే తలలెత్తుతున్న గడ్డిపువ్వుల్లో ఆడుకుంటూ కనిపిస్తాయవి. చలికాలం మళ్ళీ మొదలయ్యేంతవరకు కనిపిస్తూనే ఉంటాయి.
ఇప్పుడంటే పక్షులంటే పిచ్చిగానీ, నాలుగైదేళ్లవయసున్నప్పుడు సీతాకోకచిలుకలంటే చాలా ఇష్టపడేది మేఘ. శశికి కూడా సీతాకోకచిలుకలంటే భలే ఇష్టం. ఎంత ఇష్టమంటే తనే ఒక సీతాకోకచిలుక అనీ, తన పాప పిల్లసీతాకోకచిలుక అని అనుకునేంత. అయినా మేఘ చెప్పేంతవరకు సీతాకోకచిలుకల్లో ఎన్నెన్నో రకాలుంటాయని శశికి తెలీదు. ఎన్ని రకాలో చెప్పడమే కాదు, అసలు సీతాకోకచిలుకలంటే ఏమిటో, సీతాకోకచిలుకలుగా ఉండడమేంటో శశికి అర్థమయ్యేట్టు చేసింది మేఘ.
ఒకరోజు శశి ఏదో పనిలో పడి మేఘను కాసేపు పట్టించుకోలేదు. మరీ కళ్ల ముందే పెట్టి చూసుకోకుండా తన చిన్ని ప్రపంచానికి తనను వదిలెయ్యడం నేర్చుకుంటున్న రోజులు.
టీవీలో సీతాకోకచిలుకల డాక్యుమెంటరీ పెట్టుకుని చూస్తూ, “అమ్మా, అమ్మా చూడు ఎంత బాగుందో బుజ్జిది, చిట్టిదీ” అని ఒకటే కేకలు. ఏమిటా అని చూస్తే ఒక చిన్న తెల్ల గుడ్డులోంచి ఓ పురుగు మెల్లగా బయటకు వస్తోంది. శశికి ఏదోలా అనిపించింది. మేఘనేమో కేరింతలు కొడుతోంది, “బుజ్జి గొంగళిపురుగూ” అంటూ. శశికేమో ‘యాక్’ అనే ఫీలింగ్. మేఘ అలాంటి ఫీలింగ్సేం లేకుండా చూస్తోందని శశికి సంతోషమే కానీ ఆ పురుగును చూడలేక తల తిప్పేసుకుంది. ఎంత దాచినా దాగని విచిత్రంగా వంకర్లు పోయిన శశి ముఖం మేఘ కంట పడనే పడింది. శశిని విచిత్రంగా చూసింది.
ఏం చెప్పాలో అర్థం కాలేదు శశికి. పాకే జంతువులన్నా, ఎలుకలన్నా చాలామందికి జుగుప్సగా ఉంటుంది ఎందుకు? గుడ్డులోంచి వచ్చేసిన గొంగళిపురుగును చూసింది. అది అప్పుడే తనున్న ఆకును తినడం మొదలెట్టేసింది.
ఆ గొంగళిపురుగు తింటూ, పెద్దదవుతూ చర్మాన్ని చీల్చుకుని కొత్త తొడుగులు తొడుక్కుంటూ ఆఖరికి తన చర్మంతోనే గూడు కట్టేసుకుంది. అది శరీరంలో ఒక చివరిభాగంతో ఓ చిన్న కొమ్మను పట్టుకుని వేళ్లాడగానే, మేఘ శశి వళ్లోకి ఎక్కేసి “చూడు, చూడు” అని అరిచింది. వంకర్లుపోతూ, కష్టంగా చివరి పొరను చీల్చుకుంటూ, దాన్ని మడతలు మడతలుగా పైకి ఎగదోస్తూ, చివరికి అతి చాకచక్యంగా దాన్ని విదిల్చేసి, వంకర్లు పోయిన శరీరాన్ని కష్టంగా సర్దుకుని ఆకుపచ్చని చిట్టచివరి పొరలో సమాధిలోకి వెళ్లిపోయింది. ఒక్కోపొర చీల్చుకుంటున్నప్పుడూ, తన చర్మంనుంచే గూడు చేసుకుంటున్నప్పుడూ అది పడిన యాతన చూసి శశి కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఏ క్షణంలోనైనా పడిపోతుందేమో అన్నట్లు గాలికి సన్నగా ఊగుతున్న ఆ గూడును చూసి శశికి వేల అర్థాలు స్పురించాయి.
కాసేపటికి గూడు గట్టిపడి, మెల్లగా పారదర్శకంగా మారింది. అందులోంచి ఎర్రటీ, పసుపు రంగులమీద నల్లచారలున్న రెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. “అది మొనార్క్ సితాకోక చిలుక. భలే ఉంది కదూ?” ఆ డాక్యుమెంటరీని ఏ వందో సారి చూస్తున్నా, మొదటిసారి చూస్తున్నట్లు విస్మయంతో చూస్తూ చెప్పింది మేఘ.
చిన్ని సీతాకొకచిలుక చివరికి ప్రతి పొరని ఎంత జాగ్రత్తగా చీల్చుకుందో అంత చాకచక్యంగా గాజులాంటి గూడును చీల్చి బయటకు వచ్చి ఆ గూడునే చిన్ని కాళ్లతో పట్టుకుని కొద్దిసేపు వేళాడింది. ఆ గూడుకు వెళ్లాడుతూనే రెక్కలను ఆరబెట్టుకుందది. తడారి, పెద్దగైన రెక్కలను ఒక్కసారి విప్పార్చి, టపటపా కొట్టి ఎగిరిపోయింది ఆ సీతాకోకచిలుక – నిశ్సబ్దంగా తనపని తాను చేసుకుంటూ లోకానికి ఇన్ని రంగులను అద్దడానికి.
డాక్యుమెంటరీ అయిపోయినా, టీవీ ఆఫ్ చెయ్యకుండా కూర్చుండిపొయ్యారు తల్లీకూతుర్లు.
శశి ఆలోచనల్లో మంథనాలు కనిపెట్టినట్లు, మేఘ, “ముందు గొంగళిపురుగు. తరువాత సీతాకోకచిలుక“ అని అన్నది.
ఎన్నో ఒడిదొడుకుల తరువాత, అప్పుడప్పుడే మేఘతోడి జీవితంలో సర్దుకుంటున్న శశికి గొప్ప ధైర్యం ముంచుకొచ్చినట్లనిపించింది. “మనం ఇంకా సీతాకోకచిలుకలం అవలేదురా చిట్టితల్లీ. ఇంకొన్ని పొరల్ని చీల్చుకోవలసి ఉంది.“ అని మాత్రం అనగలిగింది.
“ఓయ్ మనం ఇద్దరు బుజ్జి గొంగళి పురుగులు.” చప్పట్లు కొడుతూ శశి చుట్టూ ఎగిరింది మేఘ.
అప్పట్నుంచీ చిన్నదో పెద్దదో ఏ కష్టంలోంచి బయటపడినా, మరో పొర చీల్చుకున్నాం అనుకునేవాళ్లు.
గడ్డిలో ఎగురుతున్న తెల్ల సీతాకోకచిలుకను చూడగానే శశికి అదంతా గుర్తుకు వచ్చింది.
“ఇంక ఇంటికి వెళ్లాలమ్మా. నీ హోంవర్క్ చేసుకోవాలి కదా?”
“తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన రెండు క్లాసులు ఎగ్గొట్టేసాను. సారీ”
వంట్లో బాగోలేకపోతే తప్ప ఇంతవరకు క్లాసులు ఎగ్గొట్టలేదు మేఘ. మొదట్లో కొంచెం కష్టపడ్డా ఆన్లైన్ క్లాసులకు తొందరగానే అలవాటుపడింది. టీచర్లందరూ ఎంత కష్టపడి పనిచేస్తున్నా పిల్లలపట్ల చాలా సహనంతో ఉంటున్నారు, మేఘ చదువుతున్న 7th క్లాస్ టీచర్లయితే మరీను.
“పర్లేదులే. టీచర్లకు నేను ఈమైల్ పెడతానులే.”
“మ్మ్. ఏమైందో చెప్పనా?”
చెప్పమన్నట్లు మేఘవైపు చూసింది శశి. మేఘ రెండుకళ్ల చివర చెంపలమీదకు దూకడానికి సిద్ధంగా ఉన్న రెండు పెద్ద కన్నీటిబొట్లు.
“ఏమ్మా? ఏరా తల్లీ?”
“అంతా నా తప్పే. సారీ.” మాస్కు తీసి చెంపలమీద కన్నీళ్లను చొక్కా చేతుల చివర్లతో తుడుచుకుంటూ అంది, “మన బంధువు ఒకరు ఇంకొకరికి పంపాల్సిన ఈమెయిల్ నాకు పంపించారు.”
“ఎవరా బంధువు?”
“ఎవరో ఒకరు…”
మేఘ ఎవరి గురించి మాట్లాడుతోందో ఆ మాటతో శశికి అర్థమయింది. ఒక స్వచ్చంద సంస్థలో పనిచేస్తున్నప్పుడు మేఘ వాళ్ల నాన్న కలిశాడు శశికి. కొన్ని నెలల్లో ప్రేమ, పెళ్లి వెంట వెంటనే జరిగిపోయాయి. ఇంటి పని ఇద్దరు కలిసి చెయ్యాలన్న ప్రామిస్ పెళ్లి తరువాత మర్చిపోయాడతను. అతను పనిలో కలవకపోయినా తనే చేద్దామనుకుంది. కుటుంబ బాధ్యతలతో ఊపిరి సలపనంత పనితో సంవత్సరాలు గడిచిపోయాయి. జీవితం పట్ల నిరాసక్తతతో నలిగిపోయేది. మేఘ పుట్టాక డిప్రెషన్ కు లోనయ్యింది. ఆమెకు మానసికంగా ధైర్యం ఇవ్వకపోగా ఏవో మాటలతో ఎత్తి పొడిచేవాడు. అక్కడే ఉంటే ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో అని మేఘకు రెండేళ్లప్పుడు అతనితో బంధం నుంచి విడిపోయింది. మేఘ సెలవుల్లో అతని దగ్గరికి వెళ్లి వస్తుంటుంది.
“సరే సరే, చెప్పు.”
“ఆ ఈమెయిల్ లో మనిద్దరి గురించి రాశారు. నేను చేసిన ఒక పని వాళ్లకు నచ్చలేదు. నేనలా చెయ్యడానికి కారణం నువ్వట. నువ్వు నాకు సరిగ్గా నేర్పటం లేదట. అది చదివి నాకు చాలా బాధేసింది. చాలాసేపు ఏడ్చాను. క్లాసులు అటెండ్ అవలేకపోయాను.”
“అయ్యో, చిన్నమ్మా!” గట్టిగా ఊపిరి పీల్చుకుంది శశి. “ముందైతే ఈమెయిల్ నీకు పంపించారని వాళ్లకు ఒకమాట చెప్పెయ్. దాంట్లో ఉన్న కంటెంట్ ని ఇగ్నోర్ చెయ్. ఇకపై నిన్ను అడ్రెస్ చెయ్యని ఈమెయిల్, మెస్సేజ్ – ఏదైనా, చదవకు.”
“మొదటి సెంటెన్స్ లోనే నా పేరు చూసి, చదివాను. నా తప్పు వల్లే కదా, నీ గురించి అలా అన్నారు.”
“వేరే వాళ్లకు రాసింది చదవడం మంచిది కాదు. అది పక్కనపెట్టి, వాళ్లకు నీ గురించి నచ్చనిది నీకు చెప్పలేదు, సో అది నీ ప్రాబ్లెం కాదు. నచ్చటం, నచ్చకపోవడం అది వాళ్ల ఒపీనియన్. మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నదే మనకు ముఖ్యం. ఎవర్నీ నొప్పించకుండా జాగ్రత్తగా ఉంటూనే నీ పని నువ్వు చేసుకునే అమ్మాయివి నువ్వు. ఇది నేను గమనించిందే కాదు. మీ టీచర్లు, నీ స్నేహితుల పేరెంట్స్ కూడా చెప్తారు నాకు.” శశి నవ్వింది, “అమ్మాయిని ఎంత బాగ పెంచుతున్నావు నువ్వు అని నాకు కాంప్లిమెంట్ ఇస్తారు తెలుసా? మేమిద్దరం ఒకర్నొకరం పెంచుకుంటున్నాం అని చెప్తాను.”
“ఏమో, భలే కష్టంగా ఉంది. ఇంటికి వెళ్లాక కాసేపు పడుకుంటాను.”
కొద్దిసేపు మౌనంగా నడిచారు. ఒక ఇంటి బాల్కనీలో కూర్చుని ల్యాప్ టాప్ లో ఆన్లైన్ క్లాసు అటెండ్ అవుతున్న ఒక అమ్మాయి మేఘను చూసి నవ్వుతూ చెయ్యి ఊపింది. మేఘ కూడా చెయ్యి ఊపింది కానీ ముఖంలో నవ్వు వెలగలేదు.
“చిన్నమ్మా. నీకో విషయం చెప్పాలి. మా సుమిత్ర పిన్ని గుర్తుందా?.”
“నువ్వు చిన్నప్పుడు కొన్నేళ్లు తన దగ్గరే పెరిగావు కదా. ఆ చిన్నమ్మమ్మే కదా.”
“మ్మ్, తనే. మీ నాన్న నుంచి విడిపొయ్యాక ఓ రెండేళ్లకు తనను కలవడానికి వెళ్లాను. కొద్దిసేపు ఏవేవో మాట్లాడిందో లేదో మీ నాన్న నుంచి విడిపోయి కుటుంబానికి చెడ్డపేరు తెచ్చానని ఏవేవో మాట్లాడింది. బంధువుల ఇళ్లకూ, పేరంటాలకూ వెళ్లలేకపోతోందట. వెళ్లినా అందరిముందు తలెత్తుకుని తిరగలేకపోతోందట. నేనెట్లా ఉన్నానని గానీ, ఊరుగాని ఊర్లో నిన్ను పెట్టుకుని నేనెలా ఉన్నానో అనిగాని అడగలేదు.” శశి గొంతు వణికింది.
“అందరికంటే ఎక్కువ తనే నిన్ను అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు అట్లా మాట్లాడింది చిన్నమ్మమ్మ?”
“ఏమో. మనకోసం, మనవాళ్ల కోసం కాకుండా ఇతర్ల కోసం బతకడమేమో అది. అప్పుడప్పుడు ఆమె మాటలు గుర్తొచ్చి భలే బాధ పెడతాయి. ఇదొక్కటే కాదు వేరే ఇంకెన్నో బాధ పెట్టే విషయాలు గుర్తొస్తాయి. ఇంతకీ అదంతా ఎందుకు చెప్పానంటే ఆ ఎపిసోడ్ తరువాత కొన్ని రోజులు బాగా దిగులుగా, ఒంటరిగా అనిపించింది. ఇప్పటికీ ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, చాలా ముఖ్యమైన రిపోర్ట్ మీద పని చేస్తున్నాను. అదీ పిల్లల గురించి. అంత పని చేస్తున్నా అప్పుడప్పుడు ఆ విషయం గుర్తొస్తోంది. డిస్టర్బ్ అయినా, మళ్లీ పనిలోకి పడిపోవడం అలవాటైంది. కానీ ఆ బాధలోనే ఉండి ఉంటే అలవాటయ్యేది కాదు.“
“…”
“చిన్నమ్మా, మన ఫీలింగ్స్ కి మనసులో అరలు ఏర్పాటు చేసుకుంటే ఎట్లా ఉంటుందంటావ్?. ఇట్లాంటివి జరిగినప్పుడు బాధేస్తుంది నిజమే. కొన్ని విషయాలకు కొన్ని నిమిషాలు, మరి కొన్నింటికి కొన్ని గంటలు, కొన్ని రోజులు ఒక్కోసారి కొన్ని నెలలూ, సంవత్సరాలే బాధ పడతాం. కానీ చెయ్యాల్సిన పనుల్ని పక్కన పెట్టి కాదు. నువ్వు క్లాసులు అటెండ్ అవ్వాలి, హోంవర్క్ చెయ్యాలి. నేనేమో నా పని మీద ఫోకస్ పెట్టాలి. ఆ సమయంలో మనల్ని బాధపెట్టిన సంఘటనని మనసులో ఒక అరలో పెట్టి మూతపెట్టేద్దాం.”
“అదేమన్నా బొమ్మల అరనా? మనసమ్మా మనసూ” డ్రమాటిక్ గా అంది మేఘ.
శశికి నవ్వొచ్చింది. మేఘ చెయ్యి ముద్దు పెట్టుకుంది. అంతలోనే, తను రాస్తున్న రిపోర్ట్ లోని విషయాలు ఆమె కళ్ల ముందు కదలాడాయి.
“అరల్లో పెట్టడం చాలా కష్టం. కానీ, ఇట్లాంటివి జీవితంలో చాలానే ఎదురొస్తాయి. పని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లు కరోనావైరస్ వల్ల వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వేరే దారి లేక వందల మైళ్లు నడుచుకుంటూ వెళ్తున్నారని చెప్పాను కదా. వాళ్లల్లో ఎంతోమంది పిల్లలు…”
“వాళ్లతో పోలిస్తే నా పరిస్థితి బాగుందని చెప్తున్నావా?” శశి మాటకు అడ్డొచ్చి తీక్షణంగా అడిగింది మేఘ.
శశికి గుండెపొరల్లో కలుక్కుమంది. “వాళ్లతో పోల్చుకోలేం చిన్నమ్మా. మన జీవితంలోంచి వాళ్ల బాధ, భయం, దుఃఖం కొంచెం చూడగలమేగానీ ఆ నొప్పి మన అనుభవంలోకి రానిది. పోల్చుకొమ్మని కాదు నేను చెప్పేది. ఇలాంటి స్థితి ఈ లోకంలో ఉండకూడదు అని అనుకున్నాం గుర్తుందా? ఊరికె అనుకుంటే సరిపోదురా. పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయో తెలుసుకోవాలి, వాటిని మార్చటానికి ఏం చెయ్యాలో తెలుసుకోవాలి.”
మేఘ ఏం మాట్లాడకుండా వింటోంది. “మళ్లీ లెక్చర్ ఇస్తున్నా కదూ?” శశి అడిగింది.
“ఊహూ, వింటున్నా.. చెప్పు.”
“ఆకలి, భయం, బాధ లేని లోకం కావాలి మనకు. ఏమంటావ్?” మేఘ ముఖంలోకి తేరిపార చూసింది శశి.
తడికళ్లతో శశిని చూసింది మేఘ, “అమ్మా, ఈ మధ్య నాకో ఆలోచన వచ్చింది. నేను పియానో, కరాటే నేర్చుకుంటున్నా కదా. పెద్దయ్యాక పిల్లలకు అవన్నీ నేర్పిస్తే? అంటే, డబ్బులేం తీసుకోకుండా.”
తల్లీకూతుర్ల మాటలు విన్న శశి స్నేహితులు శశిని ఆట పట్టిస్తారు, “నీ కూతుర్ని నీలా తయారు చేస్తున్నావా?” అని. ఒక్కోసారి కోప్పడతారు కూడా, “నీ అల్లోచనల్ని తన మీద రుద్దుతున్నావు. స్వేచ్చగా పెరగనివ్వు.” అని. ఆ మాటలు విన్నప్పుడు శశికి విచిత్రంగా ఉంటుంది. “నా పాపకు పాఠాలు నేర్పడానికి ప్రపంచమంతా పొంచి ఉంది. మరి నేను నేర్పొద్దూ?” వాళ్లంతా సరే, శశికే ఒక్కోసారి అనిపిస్తుంది. “ఎందుకు ఇదంతా. పాపను హాయిగా, ఏ ఇబ్బందుల్లో పెట్టకుండా తన స్నేహితుల్లాగే పెంచొచ్చు కదా?” అని ఎప్పుడన్నా అనిపిస్తుంది. కానీ వెంటనే “అందరు పిల్లలూ తనలాగే హాయిగా, ఏ ఇబ్బందులూ లేకుండా పెరగాలి కదా? అందుకు నేనూ, నా పాపా ఎంతో కొంత పని చెయ్యాలి కదా” అన్న ఆలోచన అన్ని సందేహాలను తీర్చేస్తుంది. అందుకే చాన్స్ దొరికినప్పుడల్లా మేఘకు పాఠం మొదలుపెడుతుంది. పసిపాపగా ఉన్నప్పట్నుంచి ఇలాంటి మాటలు విని అలవాటయిందో, లేక స్వతహాగా ఇతర్ల బాధను తన బాధ చేసుకునే మనస్తత్వం ఉన్నందుకేమో శశి చెప్పే మాటలు వింటూ, తన ఆలోచనలనూ పంచుకుంటుంది మేఘ.
“చాలా మంచి ఆలోచన చిన్నమ్మా. కానీ కొంతమంది పిల్లలకు నేర్పించగలవు. ఇంకా ఎంతోమందికి ఎవరూ నేర్పరు కదా, నేర్చుకోడానికి వాళ్ల దగ్గర మనీ ఉండదు. చిన్నప్పుడే పనుల్లో పడిపోయి టైం కూడా ఉండదు.”
“మ్మ్. అందరు పిల్లలు వాళ్లకు ఏది ఇష్టమైతే అది నేర్చుకునే లాగ ఉంటే బాగుండు.”
“అదే మరి. ఎందుకట్లా లేదో, ఏం చేస్తే అట్లా ఉండొచ్చో తెలుసుకోవడానికి చదువుకోవాలి. దానికి అడ్డొచ్చేదాన్ని ఏదైనా సరే మనసులో ఒక అరలో పెట్టేసి మూత పెట్టెయ్యాలి. ఏమంటావు?”
“అట్లా ఉండగలిగితే హ్యాపీనే కానీ అట్లా మూత పెట్టేస్తూ ఉంటే ఒకరోజు అర నిండిపోయి బాధంతా పొర్లిపోయి ఇంకా చాలా చాలా బాధ పెడితే?”
“అవున్నిజమే. దాంట్లోంచి బయటపడడం ఇంకా కష్టం. ఏం చెయ్యొచ్చంటావు?”
“అరల కాన్సెప్ట్ బానే ఉంది కానీ, తలలో ఎక్కడో దాచి మూత పెట్టే బదులు, పీకి బయట పడేస్తే?” మెరుస్తున్న కళ్లతో అన్నది మేఘ.
“పీకి బయట ఏట్లా పడేస్తావమ్మా? అదేమన్నా చిత్తు కాగితమా? మనసమ్మా మనసు!” మేఘను అనుకరిస్తూ అన్నది శశి.
“అమ్మా!!” మేఘ బుంగమూతి పెట్టేసింది కానీ, తనలో పొంగుతున్న ఉత్సాహం శశినీ అంటుకుంటోంది.
మేఘ భుజాల చుట్టూ చేతులువేసి అన్నది, “ఓకే, ఓకే రా. అదెట్లా చేద్దామో నువ్వే చెప్పు.”
“మ్మ్…” ఆలోచనలో పడిపోయిన మేఘను చూసి ఎప్పుడో సైకాలజీ పుస్తకంలో చదివిన ప్రయారటైజ్, కంపార్టమెంటలైజ్ అన్న పదాలు ఆమెకు గుర్తొచ్చాయి. మేఘ తన బాల్యపు ఆలోచనల్లోంచి ఆ పదాల వెనక కిటుకుని కనుక్కోగలదా అని కుతూహలంతో ఎదురుచూసింది.
“ఫస్ట్, చేస్తున్న పని మానెయ్యకుండా డిస్టర్బ్ చేస్తున్నదాన్ని అరలో పెట్టేద్దాం.’ తల్లి మనసు చదివేసినట్లు అన్నది మేఘ, ‘కానీ ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా అరను క్లీన్ చేసెయ్యాలి. వీలయితే దాని గురించి ఇబ్బంది పెట్టినవాళ్లతో డైరెక్ట్ గా మాట్లాడెయ్యడం. లేకపోతే నీతోనో, నాన్నతోనో, నా బెస్ట్ ఫ్రెండ్ తోనో పంచుకోవడం.”
“ఎవరికీ చెప్పుకోలేకపోతే కథనో, పోయెమో రాసెయ్యడం.” మేఘ మంచి రచయిత కావాలన్న తన కలను అందించింది శశి.
“మ్మ్… అంత టైం లేకపోతే, డైరీలోనో, నోట్ బుక్కులోనో ఒక క్విక్ నోట్ రాసుకోవచ్చు.” మేఘ గట్టిగా ఊపిరి పీల్చుకుని నిటారుగా నిల్చుంది, “ఇక వెళ్దామా, లాస్ట్ అవర్లో టీచర్లను డౌట్స్ ఆడగొచ్చు. కనీసం అదైనా అటెండ్ అవుతా ఈరోజుకి.”
పిచ్చుకల కిచకిచలకు గొంతు కలుపుతూనే గబగబా ఇంటివైపు నడిచారు ఇద్దరూ. ఆ శబ్దానికి ఓ చెట్టు పక్కన ఏదో వెతుక్కుంటున్న ఉడత చెట్టెక్కేసి పూలు నిండిన కొమ్మల్లోకి తుర్రుమంది.
ఇల్లు దగ్గరికి రాగానే చెంగు చెంగున గుమ్మంలోకి ఉరుకుతూ అరిచింది మేఘ, “అమ్మా, నాకు ఇప్పుడెలా ఉందో తెలుసా?’ వెనక్కి తిరిగి చేతులు బార్లా చాపి నవ్వింది, ‘క్లారిటీతో ఏదో తేలికగా ఉంది. ఇంకో పొర వదిలించుకున్నట్లుంది.”
శశి మేఘ దగ్గరికి పరిగెత్తి తనంత ఎత్తైన మేఘ నుదుటిపై ముద్దు పెట్టి ముఖాన్ని దోసిళ్లలోకి తీసుకుంది, “అవునవును నా బుజ్జి గొంగళిపురుగూ. నాకూ మరో పొర వదిలించున్నట్లుంది.”
*
ఈ గొంగళి పురుగులు సీతాకోక చిలుకలయ్యే మెటామొర్ఫోసిస్ ని చూసిన కళ్లతోనే ఈ కథను ఆనందించాను. ప్రేమగా అభినందనలు. <
ఎవరి యుద్ధాలు వాళ్ళే చెయ్యాలి. పెద్దలసంగతి సరే ఎలాగో ఒకలా face చేస్తారు. అది యుద్ధమన్న సంగతి తెలీకుండానే యుద్ధభూమిలో నిలబడాల్సిన పరిస్థితి కొందరు పిల్లలది. ఎటూకాని వయసులో సంక్షోభాన్ని ఎదుర్కునే పిల్లలకు అండగా నిలబడే ఏర్పాటు చేసుకోలేదు సమాజం. దగ్గరవాళ్లే ఎవరోఒకరు తోడు నిలబడాలి.
ఆ యుద్ధంలో ఆ మేరకు బాల్యాన్ని కోల్పోతారు కావచ్చు. కానీ ఆ మేరకు వాళ్ళు రాటుదేలుతారు కూడా.
హృద్యమైన కథ.
పిల్లల ప్రపంచాన్ని గురించిన సాహిత్యం ఇంకా రావాలి.