కొన్నేళ్ల క్రితం అమెరికా వచ్చి సిటిజెన్ షిప్ తీసుకొని, తర్వాత ఇండియాలో సెటిల్ కావడానికి వెళ్లిన కొంతమంది అమెరికా తెలుగు మిత్రులు, వారి తల్లితండ్రులని హైదరాబాద్ లాంటి పట్టణాలకి తీసుకువచ్చి గేటెడ్ కమ్యూనిటీలలో, లగ్జరీ అపార్ట్మెంట్ లలో వుంచేవాళ్లు. ఆ తల్లితండ్రులు అపార్ట్మెంట్ కల్చర్ లో ఇమడలేక పోవడాన్ని, ఆ తల్లితండ్రులతో మాట్లాడినప్పుడు “బంగారు పంజరంలో ఉన్నట్టుంది బాబూ” అని వారు అన్న మాటలు నన్ను తీవ్రంగా ఆలోచింపచేశాయి.
అప్పుడే ఒక కథ రాయాలని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి గారి మాతృమూర్తి రత్నమ్మ గారు తనువు చాలించినపుడు, సిధారెడ్డి గారిని పరామర్శించడానికి ఫోన్ చేసినప్పుడు వారి తల్లి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. నేను ఎప్పటినుండో ఆలోచిస్తున్న సబ్జెక్టుకు ఒక ప్లాట్ దొరికినట్టు అనిపించింది. అదే విషయం సిధారెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకొని రాసిన కథ అరుగు.
వెల్డండి శ్రీధర్ గారు తన సమీక్ష లో అరుగు కథను “అనేక పొరలతో బహు కోణాలున్న ఒక అమ్మ కథ ఇది” అన్నారు. అపార్ట్ మెంట్ జీవితం ఎంత దుర్భరం? వాటిల్లో ఇమడలేక వృద్ధులు ఎంతగా నలిగిపోతున్నారు? నగరాల్లో ఉంటూ ప్రతి మనిషిలో ఊరును వెతుక్కుంటున్న వృద్ధులు, అపార్ట్మెంట్ లో ఎలా ఉండాలో మర్యాదగానే చెప్పే కోడళ్ళు, కొడుకులు, తలెత్తి బతకాల్సిన జీవితాలు ఎంత సేపూ సెల్ ఫోన్లో మునిగి పోయి తలలు వంచుకొని జీవిస్తున్న వైనం, సంసార బండిని లాక్కు పోతున్న జోడెడ్లలో ఒక ఎద్దు మధ్యలోనే జీవితాన్ని చాలిస్తే మిగిలిన జీవితాన్ని ఒంటరిగా మిగిలిన ఎద్దు బలవంతంగా ఎలా లాక్కు పోతుంది, భర్త నేర్పిన జీవిత పాఠాలు, వృద్ధాప్యంలో ఎవరితోనూ చేయించుకోవద్దు. కాలు రెక్క ఆడంగనే చావాలి. మనవళ్ళకు ఆప్యాయంగా తినిపించే స్వేచ్చ కూడా లేదు. కొడుకుకు ఇష్టమని ఏదైనా చేయాలని వంట గదికి పోబోతే వద్దని కోడలు కట్టడి. పల్లీయుల ప్రేమ. కొడుకులకు ఎలాంటి కష్టం రాకుండా తన చావును ముందే ప్లాన్ చేసుకున్న ఒక సాహసం ఇలా ఎన్నో సుడిగుండాలు సగటు పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఈ కథలో అన్నారు శ్రీధర్ గారు. ఇది చదివాక , నేను ఇన్ని కోణాలను ఆవిష్కరించానా.. అని ఆశ్చర్యపడటం నా వంతు అయ్యింది.
కథ రాసేప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాయలేదు, కానీ ఈ కథలో ఒక్కో కోణం ఒక్కో తరాన్ని బాగా ఆకట్టుకుంది. అందుకే అన్ని వయసుల వారి నుండి ఎన్నో స్పందనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అరుగు కథపై వచ్చిన ఎన్నో అద్భుతమైన సమీక్షలను అరుగు కథ సంపుటిలో చివరి పేజీల్లో ప్రచురించడం జరిగింది. సమీక్షలు పంపిన సాహితీ మిత్రులందరికీ ఈ సందర్భంగా మరొక్క సారి ధన్యవాదాలు.
“అమెరికాలో పాతికేళ్ళకు పైగా ఉంటూ, ఎప్పుడో జరిగిన రైతాంగ పోరాటాన్ని, రజాకార్ల అకృత్యాలని కథలో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు” అని కొందరు , “నాటి తెలంగాణ భయ కంపిత పౌర జీవనం ఆవిష్కరించడంలో రచయిత కృతకృత్యులయ్యారు” అని ఇంకొందరు ప్రశంసించడం, “ఇప్పుడు నగరజీవితంలో అపార్ట్మెంట్లలోని డెబ్భై పైబడినవారి పరిస్థితి నూటికి నూరుపాల్లు ఇదే అభివృద్ధిపేరిట అన్నీ వలస బతుకులే, ఎన్ని ఊపిరులు ఇలా ఆగిపోయాయో” అని మరి కొందరు తమ స్పందనలను తెలియచేయడం రచయితగా నాకు ఇంతకన్నా కావాల్సిందేమిటి?
ముఖ్యంగా యువతరం స్పందించిన తీరు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. రత్నమ్మ అనే పాత్రని తమ స్వంత కుటుంబంలోని అమ్మమ్మగా, నానమ్మగా భావిస్తూ కొందరు యువకులు రాసిన స్పందనలు నన్ను బాగా ఆలోచింపచేసాయి. ఆ తర్వాత ఫోన్ చేసి వారి స్పందనలు తెలియచేయడం కూడా నన్ను భావోద్వేగానికి గురిచేసాయి. కథ రాసేప్పుడు నేను ముఖ్యంగా చూసుకునేది ఎమోషన్. ఎమోషన్ లేకుండా నా కథల్లో మోషన్ ఉండదు. కానీ నేనూహించని భావోద్వేగం అరుగు కథలో బాగా పండింది. “మీ కథ చదివాక ఏమీ చేయలేక, ఎలా స్పందించాలో తెలియక ఆ ట్రాన్స్ లోంచి బయట పడలేక, రత్నమ్మకి ఒక నిమిషం మౌనం పాటించాను మా కుంటుంబంలో ఒక మనిషి పోయినట్టు“ , “ నాకైతే మా అమ్మమ్మ గుర్తొచ్చింది. పాపం తను కూడా ఈ జెనెరేషన్ కి తట్టుకోలేక మాకు దూరంగా ఊర్లోనే ఉండేది, ఆమె ఎంత బాధ పడిందో ఇప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడామె లేదు”, “చనిపోయేవరకు పల్లెటూరిలో జీవించడమే ఆ పెద్దమనుషులకు అసలైన జీవితం. అలాంటి వారిని పల్లెటూరుతో అనుబంధం తెగ్గొట్టి వారిని యాంత్రికజీవనంలోకి తీసుకొస్తే ఇలాగే ఘోషిస్తాయి ఆ మనసులు” అని కొందరు యువకులు చేసిన ఈ కామెంట్స్, అలాగే అన్ని తరాల వారి నుండి, అన్ని వర్గాల వారి నుండి ఇంకా ఎందరో పాఠకులు కథ చదివి స్పందించి రాసిన వారి అమూల్య మైన స్పందనలు కథ కి అనుబంధంగా సారంగలో చదువుకోవచ్చు.
రత్నమ్మ అనే పాత్ర పూర్తి పరిణితి గల ఒక గ్రామీణ వృద్ధ మహిళ. ఎంతో జీవితాన్ని చూసింది, ఎన్నో సంఘటనల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలు ఎన్నో సంఘటనల నుండి ఆ ఊరి వారిని రక్షించాయి. అప్పట్లో ఆమె భర్త, ఊరివాళ్ళు అందరూ పొగిడారు ఆమె ముందు చూపుకి. నగర జీవితంలో కూడా ఎన్నో నేర్చుకుంది. అలాంటి పూర్తి పరిణితి గల మహిళ కథ ఈ అరుగు. ఒక ప్రముఖ పత్రికకు ఈ కథను పంపితే కనీసం కథ యొక్క ఆత్మని, కథలో చెప్పదలచుకున్న అంశాన్ని పరిశీలించకుండా, సినిమాలో శుభం కార్డు వేసినట్టు కథని సగానికి తగ్గించి హ్యాపీ ఎండింగ్ తో ముగించమని కోరడం నన్ను విస్మయానికి గురిచేసింది. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఒక పెద్ద పత్రికలో అచ్చు అవుతుంది అని నేను వారు చెప్పినట్టు కథని సగానికి తగ్గిస్తే ఎక్కువ మందికి చేరేదేమో కానీ ఒక రచయితగా చెప్పదలచుకున్న విషయం పెడదారి పట్టేది. కథ రాసిన తర్వాత పాఠకుల నుండి వస్తున్న స్పందన చూసిన తర్వాత కలిగిని ఈ సంతృప్తి ఎప్పటికీ వచ్చేది కాదు. నేను రాసిన అశ్రువొక్కటి కథకి ఇదే సమస్య వచ్చినప్పుడు, “మనం” అనే పత్రిక ఎడిటర్ గారికి కథ బాగా నచ్చి రెండు భాగాలుగా రెండు వారాల్లో సీరియల్ గా ప్రచురించడం నా కథ గొప్పతనం. ఒక కథకునిగా నేను పొందిన విజయం అని గర్వంగా చెప్పగలను.
అరుగు గురించి చెప్పాలనుకుంటే మనసు పొరల్లో దాగిన ఎన్నో సంగతులు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి, కానీ నాకిచ్చిన ఈ అవకాశం లో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను.
కథ ఇక్కడ చదవండి.
*
Add comment