ఫ్లవరు

‘శంఖం మీది గీతలు లాగా అల్లుకు పోయిన తీగలు

ప్రతీ తీగకు రెండు వైపులా ఎరుపు , ముదురు ఎరుపు, నలుపు రంగుల మిశ్రమంతో ఆకులు.

ఆ ఆకుల గుబురుల మధ్యలో కొబ్బరి బొండాం సైజు తెల్లటి రంగు పుష్పం.

ఆ పుష్పం రెక్కల మీద లేత గులాబీ రంగు తో అల్లుకున్న ఈనెలు…’

“విచిత్రంగా ఉందే ఈ పువ్వు. ఎక్కడ పూస్తుంది? మీరెలా చూడ గలిగారు?” అని మీరు అడిగే ముందు, నా పరిచయం చేసుకోవాలి.

నా పేరు ల్యారి డెరెల్. పూర్తి పేరు చెప్పినా నన్ను గుర్తు పట్టే వాళ్ళు తక్కువే. ల్యారి అనుకోండి, సరిపోతుంది. నాకు ప్రపంచంలో తిరగడం, అదీ ప్రాచ్య దేశాలలో తమ ఆధ్యాత్మిక చింతన పంచుకునే గురువుల సత్సంఘంలో గడపడం మరీ ఇష్టం.

గత ఆరు నెలలు నెదర్ లాండ్స్ లోని లైడెన్ లో నివసిస్తున్నాను. దానికి కారణం ఈ నగరంలో ఉన్న  యూనివర్సిటీలో భారత సంస్కృతి పైన అధ్యయనం చేయడానికి ఉన్న కోర్సులు, గ్రంధాలు. 16వ శతాబ్దం లో నెలకొల్పిన ఈ యూనివర్సిటీ ప్రాచ్య దేశాల గురించి, అందునా హిందూ సంస్కృతి పైన పరిశోధనలకు ఐరోపా దేశాలలో ప్రథమ స్థానంలో ఉంది. సంస్కృతం భాషకు ఏకంగా ఒక విభాగమే ఉంది.

మార్చి మాసం చివర. ఇంకా చలి పూర్తిగా పోలేదు. క్యూకెన్ హాఫ్ తులిప్ గార్డెన్ ఈ వారమే తెరిచారు.  ఎందుకో పూలను చూడాలనిపించింది. ప్రొద్దున్నే లైడన్ నుంచి బస్ తీసుకొని గార్డెన్ కు అర గంట లో చేరిపోయాను. ఎన్ని పూలు. ఎన్ని రంగులు. సీజన్ ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి కొన్ని చోట్ల పూలు పూర్తిగా విడగలేదు. కానీ ఎంత అందం. వర్డ్స్వర్థ్ వ్రాసిన ‘డాఫోడిల్స్’ పూల పై పద్యం గుర్తుకు వచ్చింది. కొన్ని రోజులు, సంఘటనలు గుర్తుండి పోతాయి. భవిష్యత్తులో అవి గుర్తొచ్చినప్పుడెల్లా ఒక అనిర్వచనీయ మైన ఆనందం కలుగుతుంది. ప్రకృతి అందాలకు ఉన్న లక్షణమేమో ఇది.

గార్డెన్ బయటకి వచ్చిన తరువాత ఆమ్స్టర్డామ్ కు పోవాలనిపించింది. బస్సు ఎక్కేసాను. గంట ప్రయాణం. సెంట్రల్ స్టేషన్ దగ్గర దిగి బైసికిల్ రెంట్ కు తీసుకొని మ్యూజియం డిస్ట్రిక్ట్ వైపు తొక్కడం మొదలెట్టాను. టూరిస్ట్ జనాలతో రైక్స మ్యూజియం ముందు దారి నిండిపోయింది. దాని వెనుక ఉన్న వాన్ గో మ్యూజియం వరకు ఉన్న జన సందోహం రోడ్డు మీద నుంచే కనిపిస్తున్నది. అనుకుంటే పోయి మ్యూజియం చూసే రోజులు పోయాయి. ఇప్పుడీ మ్యూజియం లు చూడాలంటే వారలకు ముందే రిజర్వ్ చేసుకొని ఉండాలి. మ్యూజియంలు దాటుకొని వాండెల్ పార్క్ లో కొంత సేపు బైసికిల్ పైనే తిరిగాను. ఆకలి వేసింది. సమయం మధ్యాహ్నం రెండు. పార్క్ బయట పడి ఆ పార్క్ చుట్టూ ఉన్న రోడ్డు మీద తిరుగుతుంటే ఒక ఇండియన్ రెస్టారెంట్ కనపడింది. పేరు ‘అన్మోల్’, చూస్తూనే ఆకర్షించింది.

బైసికిల్ రోడ్డు పక్కన ఉన్న సైకిల్ స్టాండ్ లో పార్క్ చేసి రెస్టారెంట్ లో అడుగు బెట్టాను. రెస్టారెంట్ చిన్నదే. ఒక 12 టేబుల్స్ కంటే ఎక్కువ లేవు. నేను చూసిన ఇతర భారతీయ రెస్టారెంట్ లతో పోలిస్తే ఇంటీరియర్ కొంచెం విలక్షణంగానే ఉంది. భారతీయ సంస్కృతిని  గుర్తుకు తెచ్చే వస్తువులు, ఫోటో ఫ్రేమలు ఉన్నా ఏదో తేడా అనిపిస్తున్నది.

రెస్టారెంట్ అప్పుడే తెరిచారులా ఉంది. జనాలు ఎవ్వరూ లేరు. నేను వెళ్ళగానే కిచెన్ లో ఉన్న ఒకతను బయటకి వచ్చి నన్ను నాకు నచ్చిన టేబిల్ దగ్గర కూర్చోమన్నాడు. అతను చూడడానికి ఇండియన్ లాగా అనిపించినా, అతని భాష, మేన్నరిజం,  కాదేమో అన్న అనుమానం కలిగిస్తున్నది.  మంచి నీళ్ళు తెచ్చి, ‘ డ్రింక్స్?’ అని అడిగాడు. లేదు నేరుగా లంచ్ చేస్తానని చెప్పి నాన్, పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసాను. రెస్టారెంట్ లో కూర్చున్న వారికి కిచెన్, కిచెన్ లో పనిచేస్తున్న వారు కనిపిస్తారు. నన్ను కూర్చోబెట్టినతను కాక మరో తెల్లావిడ కూడా కిచెన్ లో పని చేస్తున్నది.

ఆకలి మీద ఉన్నానేమో తొందరలోనే లంచ్ ముగించి టీ ఆర్డర్ చేసి, మెల్లగా టీ సిప్ చేస్తూ నా బ్యాక్ ప్యాక్ లో నుంచి ఒక పుస్తకం తీసి చదవడం మొదలెట్టాను.  నాకు సర్వ్ చేసినతను బిల్ చేతి కిస్తుంటే నాకిందాక మెదిలిన ప్రశ్నలు గుర్తుకు వచ్చాయి.

“నైస్ ఫుడ్. రుచిగా వండారు. మీ పేరేంటి? ఇక్కడ ఎన్నాళ్ళుగా పని చేస్తున్నారు?” అని అడిగాను.

“నరేయిన్. నేనే ఈ రెస్టారెంట్ ఓనర్ ను.”

“మీ రేనా రెస్టారెంట్ ఓనర్. కంగ్రాట్స్. నాకు మీ రెస్టారెంట్ అంబియన్స్, ఫుడ్ రెండూ నచ్చాయి. జనాలు లేనట్లు ఉన్నారు. కొత్తగా పెట్టరా? కూర్చోండి,” అన్నాను నేను. కొత్త ప్రదేశాలు సందర్శించడం, కొత్త వారితో పరిచయం చేసుకొని వారి జీవితాల గురించి కొంత తెలుసుకోవాలనుకోవడం నా బలహీనత.

“అవును, రెస్టారెంట్ గత ఏడాదే పెట్టాము. రెస్టారెంట్ మూడు గంటల తరువాత బాగానే బిజీ అవ్వుతుంది. మరో వైటర్ కూడా మూడు తరువాత వస్తుంది. ప్రస్తుతం నేను మా ఆవిడ మాత్రం చాలు,” అంటూ కిచెన్ లో ఉన్నావిడకు చేయి ఊపాడు. ఆవిడ కిచెన్ లో పని ఆపి నరేయిన్ పక్కన వచ్చి కూర్చుంది.

“సోఫీ,” అంటూ చేయి కలిపింది.

“నా పేరు లారెన్స్. కాల్ మీ ల్యారి”

అటు తరువాత మేము కబుర్లలో పడ్డాం.

“ఒక మాటడగనా? మీ పేరు నరేయిన్ అంటున్నారు. మీ భాష ఆక్సెంట్ కూడా కొత్తగా ఉంది. భారత దేశంలో ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు?”

పక్కున నవ్వాడు నరేయిన్. “ఈ ప్రశ్నను ఇది వరకే నన్ను చాల మంది అడిగారు. నేను పుట్టింది, పెరిగింది సురినామ్ దేశంలో. దక్షిణ అమెరికాలో ఉన్న అతి చిన్న దేశం.  డచ్ దేశస్తులు ప్రపంచంలో ఇండోనేషియా లాంటి అనేక దేశాలను తమ కాలనీలుగా ఎలారు. అలాంటి దేశాలలో ఇదొకటి. కాదంటే మిగిలిన కరీబియన్ దేశాల లాగానే, ఈ దేశంలోనూ చెరుకు పంటల వ్యవసాయానికి భారత దేశం నుంచి చాల మందిని కూలీలుగా తీసుకు వచ్చారు. మా ముత్తాతలు దక్షిణ భారత దేశం నుంచి వచ్చారని విన్నాను.”

“ఆహ్…ఇప్పుడర్ధమైంది, మీరు ఈ ఆమ్స్టర్డామ్ ఎలా చేరారో,” నవ్వాను నేను. నరేయిన్ కూడా నవ్వాడు. సోఫీ ముఖంలో మాత్రం ఏమీ మార్పు కనపడలేదు. అదే నిర్లిప్త మౌనం. మా మాటలు మాత్రం వింటున్నది.

“అవును. ఈ దేశం ఉన్నత చదువుల కని వచ్చాను. ఇక్కడ గణిత శాస్త్రంలో డాక్టరేట్ పొందాను. యూనివర్సిటీ లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం మొదలెట్టాను. అప్పుడే ఇదిగో సోఫీ నీ కలిసాను. తనూ మా యూనివర్సిటీ మెడికల్ కాలేజి లో చదివింది.”

“మరి ఈ రెస్టారెంట్ లో మీరు?”

 “పాతికేళ్ళు నేను యూనివర్సిటీ లో, తను హాస్పిటల్ లో పని చేసిన తరువాత, విసుగేసి ఇదిగో ఈ రెస్టారెంట్ పెట్టాము. నాకు వండడం ఇష్టం. ఇలా రెస్టారెంట్ పెట్టాలని నా కలకాలం కోరిక. నాకు ఇది ఫుల్ టైం జాబ్. సోఫీకి తన సొంత క్లినిక్ ఉంది. పొద్దున్నే కొద్ది గంటల అక్కడ పని చేస్తుంది. మధాహ్నాలు, నాకు ఈ రెస్టారెంట్ లో సహాయ పడుతుంది,” నరేయిన్ సోఫీ భుజం మీద చేయి వేసి మృదువుగా నొక్కాడు.

“మొత్తానికి మీ ప్యాషన్ కి తగ్గ ఉద్యోగం మీరే వెదుక్కున్నారన్న మాట. జీవితం అనుభవించడానికి అంత కన్నా మంచి మార్గమేముంది.”

“మా గురించి సరే, మీ సంగతేమిటి?” మళ్ళీ నరేయిన్ గొంతే. సోఫీ మౌనం నాకు అర్ధం కాలేదు. అలాగని, ఆవిడ ముఖంలో ఎలాంటి విసుగు ఛాయలు కనిపించటం లేదు. మా మాటలు బాగానే ఆసక్తిగా వింటున్నది.

“నా గురించి చెప్పాల్సింది పెద్దగా ఏమీ లేదు. నేనో దేశాల దిమ్మరుని. మనుష్యులను కలవడం నాకు ఇష్టం. ప్రాచ్య దేశాల ఆధ్యాత్మిక చింతనలు అధ్యాయనం చేయడం ఇష్టం. లైడెన్ యూనివర్సిటీ ఇండోలజీ పరిశోధనలకు వందల ఏళ్లుగా ఐరోపా ఖండంలోనే ప్రసిద్ధి. అందుకే ఆ యూనివర్సిటీ లో చేరి అక్కడ చదువుతున్నాను.”

“ఈ వయస్సులో చదువు? చదువులేనా?  ఉద్యోగాలేమి ప్రయత్నించలేదా?”

“ఉద్యోగం చేయక పోవడమేమిటి. అన్ని రకాల పనులు చేస్తాను. కొన్ని రోజులు ఘనులలో త్రవ్వకాల పని కూడా చేసాను. కొంచెం డబ్బు మిగిలితే, ఇదిగో ఇలా మరో దేశం తిరుగుతాను. ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యార్థులకు దొరికే చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాను. ఆ డబ్బులు నా జీవితావసరాలకు చాలు. నేను వంటరి గాన్నే. “

“లైడెన్ నుంచి ఆమ్స్టర్డామ్ మ్యూజియంలు చూడడానికి వచ్చారా? ఇవ్వాళ ఏమి చూసారు?”

“ మ్యూజియంలు, అందులోని పెయింటింగ్లు, ఇప్పటికే చాలా సార్లు చూసాను.”

“ఏంటి అలా మొహమొత్తెట్టి నట్లు చప్పగా చెప్తున్నారు. ఈ మ్యూజియంలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి జనాలు వస్తారు.”

 “పెయింటింగ్ లు చూడడం ఆనందంగా అనిపించినా, అవి వేసిన ఆర్టిస్ట్ జీవితాలు తలచుకుంటే తెగ బాధ వేస్తుంది. ముఖ్యంగా వేన్ గో. అలానే, వేన్ గో మ్యూజియం లో అతను వేసిన ‘ పొటాటో ఈటర్స్ ‘, రైక్స్ మ్యూజియం లో రెమ్బ్రెంట్ వేసిన ‘ నైట్ వాచ్’ చిత్రాలను చూస్తే ఈ మ్యూజియంలు గొప్ప కళాఖండాలకు కట్టిన గాజు సమాధుల లాగా అనిపిస్తాయి.”

“ సమాధులు!” పక్కున నవ్వాడు నరేయిన్, “భలే మాటన్నారు.  మన జనాలు ఎగబడి చూసే తాజ్ మహల్, ఈజిప్ట్ పిరమిడ్ లు కూడా మనుష్యులను ఏలిన చక్రవర్తుల సమాధులే కదా. మరి మీరు ఈ రోజు మ్యూజియంలు చూడలేదన్న మాట.”

“మీరు మ్యూజియం మాటనగానే నా జ్ఞాపకాల సమాధుల లో నిక్షేపమైన ఆ మ్యూజియం లలోని చిత్రాలు ప్రత్యక్ష మయ్యాయి. ఆ విధంగా మరో సారి చూసేసాను. బట్ సీరియస్ గా, ఈ రోజు ఎందుకో పువ్వులను చూడాలనిపించింది. క్యూకెన్ హాఫ్ గార్డెన్ కి పొద్దున్న వెళ్ళాను. ఎన్ని పూలు! ఎన్ని రంగులు! తనివి తీరా లేదు.”

నేనేమన్నానో అని ఒక సారి ఉల్లిక్కి పడి పునః స్మరణ చేసేలా నరేయిన్ ముఖంలో మార్పు. నా మాటలు నరేయిన్ ను డిస్టర్బ్ చేశాయని తెలిసిపోతున్నది.

“పూలు, పూలు, పూలు. ఎందుకు పూలను గురించి ఈ వ్యామోహం, ఈ పరవశత. పూల మీద కవితలు కొల్లలు, చిత్ర కళలో బొమ్మలు బోలెడు. వేన్ గో ఐరిస్, సూర్య కాంతం చిత్రాలు ప్రత్యక్షం గానే చూసి ఉంటారు. చివరకు షేక్స్పియర్ కూడా రోజ్ ఈజ్ ఆ రోజ్ ఈజ్ ఆ రోజ్ అంటూ నాటకంలో ఇరికించేసాడు.” కయ్యానికి కాలు దువ్వుతున్న ఈ మాటలు నరేయిన్ నుంచి బొత్తిగా ఊహించలేదు. మనస్సులోనే ఆశ్చర్య పడ్డాను.

“అంటే మీ ఉద్దేశ్యం ఎంటి? పూల గురించి మీకు మరో దృక్పథం ఉందా? ఎందుకో మార్సెల్ దూ చాంప్ ను గుర్తుకు తెప్పిస్తున్నారు.”

“దూ చాంప్ యూరినల్ బౌల్ ను తిప్పి చూపించి ఒక ఫౌంటెన్ అన్నాడు.  మామూలు వస్తువును కళా ఖండం చేశాడు. కానీ ఎంతో ఎత్తులో అన్నీ కళల ప్రక్రియలలో అందలం వేసి కూర్చోబెట్టిన పూల మీద నా మాటల వల్ల,  పూల మీద మీ అభిప్రాయాలు, చూసే విధానం, మారుతాయి. అది మీకు మీకు నచ్చ లేదంటే, మనం మరో టాపిక్ మీద మాట్లాడుకుందాం.”

“పుష్పం, పుష్పం గా కాకుండా, అమ్మాయి గానో , విలపించే గాయని గానో, మరెన్నో రూపాలలో నేను, చదివిన కవితల, రచనలు పుణ్యం వల్ల,  చూసేశాను. నేను కొత్తను వెదికే మనిషి. మీ దృక్పథంలో పుషాన్ని చూపెట్టండి. ఆనందిస్తాను. “

“అనందిస్తారా? అదీ చూద్దాం. నేనైతే ముందే నా డిస్క్లైమర్ ఇచ్చేసాను. ఇక నేను చూసిన పువ్వును మీరు ఇది వరకు చూసి ఉండరు.”

“గో ఎహెడ్. వర్ణించండి,” కుతూహలం తోనే అడిగాను నేను. నేను చూడబోయే దృశ్యాలు, విన బోయే విషయాలకు భయపడితే నేనో దేశాల దిమ్మరి ఎలాగౌతాను?

“శంఖం మీది గీతలు లాగా అల్లుకు పోయిన తీగలు

ప్రతీ తీగకు రెండు వైపులా ఎరుపు , ముదురు ఎరుపు, నలుపు రంగుల మిశ్రమంతో ఆకులు.

ఆ ఆకుల గుబురుల మధ్యలో కొబ్బరి బొండాం సైజు తెల్లటి రంగు పుష్పం.

ఆ పుష్పం రెక్కల మీద లేత గులాబీ రంగు తో అల్లుకున్న ఈనెలు…”

“విచిత్రంగా ఉందే ఈ పువ్వు. ఎక్కడ పూస్తుంది? మీరెలా చూడ గలిగారు?”

నరేయిన్ పూనకంలో ఉన్నవాడి లాగా, మనిషిక్కడ, మనసెటో ఉన్నవాడి లాగా మాట్లాడుతున్నాడు. సోఫీ ముఖంలోనూ మార్పులు. ఆవిడ ముఖం ఎర్రబడ్డది, పారిపోవాలనుకున్న మనిషిని బలవంతంగా కూర్చోబెట్టి నట్లుంది.

“నీ ప్రశ్నలకు జవాబులు కావాలంటే నీకో చిన్న కథ చెప్పాలి.”

చెట్టెక్కి శవం భుజం మీద వేసుకున్న తరువాత తప్పుతుందా, “చెప్పండి”, అన్నాను.

“నాకు బాగా పరిచయం ఉన్న వాడే. రాజు అనుకుందాం. తనూ గణిత శాస్త్రంలో ఉద్దండుడు. భార్య , ఒక పిల్ల వాడు ఉన్నారు.  మా యూనివర్సిటీ లోనే పరిచయం. రాజు లో నాకు బాగా నచ్చిన విషయం అతనికి విజ్ఞాన శాస్త్రం మీద ఉన్న అపార నమ్మకం.”

“అందరు శాస్త్రజ్ఞులకు ఉన్న లక్షణమే కదా. ఇందులో ప్రత్యేకత ఏముంది.”

‘అవును నిజమే. కానీ రాజు సైన్స్ ను మాత్రమే నమ్మే వాడు. ఎంత నమ్మే వాడంటే, తనను తాను నాస్తికుడుగా చెప్పుకునే వాడు. మత విశ్వాలను పూర్తిగా ఖండించే వాడు. ‘రిలీజియన్ ఇస్ ది ఫస్ట్ రిఫ్యూజ్ ఆఫ్ ఇడియట్స్’ అంటూ మతాలను, ఆ మతాలు నమ్మే జనాలను తిట్టే వాడు.  అలాంటి వాడికి ఎవరికి రాకూడని అనుభవం ఎదురయ్యింది.”

“ఏమయ్యింది?” నేను కథలో లీనమైపోయి అడిగాను.

“రాజు భార్య అమెరికన్ సిటిజన్. ఐయోవ రాష్ట్రం పెల్ల నగరం ఆవిడ పుట్టిల్లు. ఆ నగర వాసులు ఒకప్పుడు డచ్ దేశీయులే. దాదాపు రెండు, మూడు వందల ఏళ్ల క్రితం అమెరికా వలస వచ్చి ఆ మిడ్ వెస్ట్ నగరం లో స్థిర పడ్డారు. ఆవిడ అమెరికా నుంచి ఆమ్స్టర్డామ్ కి చదువులకని వచ్చి, ఇక్కడ రాజు ను కలిసి పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిర పడిపోయింది. కానీ సెలవులలో, వీలున్నప్పుడల్లా తన తల్లి, తండ్రులు, బంధువులు ఉన్న పుట్టిల్లు పెల్ల కు పోవడం మామూలు. ఒక సారి,  వేసవి సెలవులకు పెల్ల పోతుంటే రాజు యూనివర్శిటీ లో పని ఉందని వెళ్ళలేదు.

“అలా తన కుటుంబం పెల్ల పోయినా కొన్ని రోజులకు రాజుకు వాళ్ళబ్బాయి నుంచి ఫోన్ వచ్చింది. మరో ప్రొఫెసర్ తో ఏదో సీరియస్ గా కొత్త రిసెర్చ్ పేపర్ గురించి మాట్లాడుతూ ఆ ఫోన్ ఎత్తలేదు. ఆ రోజు సాయంత్రమే రాజుకు మరో కాల్ వచ్చింది. మళ్ళీ కాల్ ఎత్తకున్నా, మళ్ళీ, మళ్ళీ రింగ్ అవ్వడంతో ఫోన్ ఎత్తుకున్నాడు. భార్య నుంచి పెద్ద ఏడుపుతో ఫోన్. పిల్లాడు చనిపోయాడని.”

“అంత అర్థాంతంగా ఎలా పోయాడు?” నేను షాక్ అయ్యి అడిగాను.

“అర్థం కాలేదా?” కొంచెం కోపంతో మిళితమైన గొంతు తో అన్నాడు. ఇంత వరకు నెమ్మదిగా మాట్లాడిన మనిషి, ఇలా మారాడేమిటి అనిపించింది నాకు.

“నిజంగానే నాకర్ధం కాలేదు నరేయిన్,” మంద్ర స్వరం తో నింపాదిగా చెప్పాను నేను.

“అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా తెలుసు కదా, వాళ్లకు గన్స్ టాయ్స్ లాగా. ప్రతీ ఇంట్లోనూ గన్స్ ఉంటాయి. పిల్ల వాడికి అందు బాటులో గన్ దొరికింది. మన వాడు రాజు,  ఆ రోజు పిల్ల వాడు చేసిన ఫోన్ తీయక పోవడం ఈ ఆత్మ హత్యకు దారి తీసింది, అని అంటాడు. ‘నేను చేసిన కర్మ, నన్ను వదలలేదని’ విలపిస్తాడు. అలా  పిల్ల వాడి ఫోన్ తీయక పోవడం మొదటి సారి కాదు అని వాపోతాడు. పోయిన వాడు రాడు కదా అని రోదిస్తాడు.  అతను ఇన్ని రోజులు నమ్మిన శాస్త్రంలో, అతని దుఃఖానికి ఏ మాత్రం ఊరట దొరకలేదు.

ఆ ఫోన్ తీసుకొని ఉండాల్సింది. ఫోన్ తీసుకొని ఉండాల్సింది, ఫోన్ తీసుకొని ఉండాల్సింది, మాటి మాటికి వాపోతాడు.”

“నరేయిన్ , ఎక్కడ పోతున్నావు. ఇంతకూ నువ్వు చూసిన పువ్వు గురించి చెప్పలేదు,” విస, విస లేచి కిచెన్ వైపు అడుగులు వేస్తున్న నరేయిన్ చూసి అడిగాను.

“సోఫీ ను అడుగు. తను చెప్తుంది,” అంటూ దృష్టి పూర్తిగా కిచెన్ వైపే పెట్టి, ఒక జోంబీ లాగా అడుగులు వేశాడు. రాజు నరేయిన్ కు అతి సన్నిహితుడు అయ్యి ఉండాలి.   నరేయిన్ అలా దుఃఖా భారంతో, అకస్మాత్తు గా వెళ్లి పోవడం అందు వల్లే అయ్యి ఉండాలి.

సోఫీ వైపు చూసాను. అంత వరకు ఎటువంటి ఛాయలు, ఎక్సప్రెషన్స్ లేని సోఫీ ముఖంలో ఏదో అంతు తెలియని బాధ. బహుశా అలా నరేయిన్ అకస్మాత్తుగా లేచి పోయాడన్న ఆవేదన వల్ల కావచ్చు.

“నరేయిన్ కథను మీరు పట్టించుకోకండి. అది పూర్తిగా నిజం కాదు,” నరేయిన్ కిచెన్ లోపలికి వెళ్లేంత వరకు ఆగి మెల్లగా చెప్పింది. కిచెన్ గాజు కిటికీల నుంచి నరేయిన్  కత్తి తీసుకుని పూర్తి ఏకాగ్రతతో వంటకు కావలసిన పదార్ధాలను కట్ చేయడం కనిపిస్తున్నది.

“అయితే ఏది నిజం, ఏది నిజం కాదు?” ఇలా భర్త ఉన్నంత వరకు గుట్టుగా ఉన్న మనిషి, లేనప్పుడు నోరు తెరిచి భర్త మీద అభాండాలు వేస్తున్నదన్న ఆశ్చర్యాన్ని, అణచు కుంటూ సోఫీ ని అడిగాను

“రాజు వాళ్లబ్బాయి ఆత్మ హత్య చేసుకోలేదు. అతని చావు ఒక ఆక్సిడెంట్ మాత్రమే.”

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగు తున్నారు!”

“నేనో సైకియాట్రిస్ట్. ఇలాంటి కేసులు చూసాను. నాకు కూడా రాజు తెలుసు, ఆ అబ్బాయి తెలుసు.  పెల్లా నగర పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడాను. వారుంటున్న కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నేనన్నది కరెక్ట్ అనే చెప్పారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ తరువాత పోలీస్ వారు ఆ అబ్బాయి మరణం ఆక్సిడెంట్ అని ధ్రువ పరిచారు.”

“మరి నరేయిన్ అలా ఆత్మహత్య అంటున్నాడేమి?”

“రాజు వాళ్ళబ్బాయి ఫోన్ చేయడం నిజమే. కానీ ఆ అబ్బాయి ఆ రోజు ఫోన్ చేసి రాజుతో పంచుకోవాలనుకున్నది, తను సంతోషంగా పెల్లా లో గడుపుతున్న రోజుల గురించి. రాజు తను ఆ ఫోన్ తీసుకోలేదన్న గిల్టీ ఫీలింగ్ తో ఏదో ఏదో ఊహించుకున్నాడు. తను ఫోన్ తీయనందు వల్లే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని పొరబడుతున్నాడు.”

“రాజు లాజికల్ అని ఒక పక్క అంటూ, మరోపక్క తను ఇలా ఊహించుకున్నాడు అనడం పూర్తిగా వ్యతిరేకంగా లేదు? నాకు నమ్మబుద్ధి కావడం లేదు.”

“రాజు అలా ఎలాంటి ఆధారం లేకుండా నమ్మడానికి కారణం తను ఎదుర్కొన్న షాక్ వల్లే. ఇన్ని రోజులు నాస్తికుడని, విజ్ఞాన శాస్త్రం మాత్రమే నమ్ముతానన్న మనిషి కర్మ సిద్ధాంతానికి దాసుడైపోయాడు. అతను నమ్మిన శాస్త్రం లో అతనికి జవాబు దొరకలేదు. అబ్బాయి మరణం యాదృచ్చికం అని సరి పెట్టుకోలేక పోయాడు. జవాబులు లేని ప్రశ్నలు రాజు లాజికల్ మైండ్ కు సరిపోవు. అప్పుడే అతనికి తను ఇన్ని రోజులు నమ్మని కర్మ సిద్ధాంతం చేదోడుగా వచ్చింది. కర్మ అనుకోవడంతో, ఎదురు చూస్తున్న ఊరట రాజుకు దొరికింది. తనకు తెలియకుండా పూర్వ జన్మలో తప్పు చేసుండాలి అనుకున్నాడు.  ‘అబ్బాయి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తీసుకోలేదు. నా కర్మ. అనుభవించి తీరాల్సిందే’, అని రాజు సరిపెట్టుకున్నాడు.”

“ఇంతకీ నరేయిన్ చూసిన పువ్వు గురించి చెప్పలేదు.”

“ఆ పువ్వు చూసింది అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న రోజే. అబ్బాయి గన్ తీసి నప్పుడు, ప్రమాదవశాత్తు పేలి అతని తలను ముక్కలు, ముక్కలు గా చేసేసింది.

మెడ –

శంఖం లా ఉన్నది,  చీలిపోయి తీగలు లాగా కనిపించింది.

కారిపోయిన రక్తపు చారలు –

ఎరుపు, ముదురు ఎరుపు, నలుపు రంగుల మిశ్రమంతో ఆకులు లాగా రెండు వైపులా కనిపించాయి.

మెదడు –

మెడ తీగల పైన పూసిన పెద్ద రోజా పువ్వు లాగా కనిపించింది

ముక్కలైన మెదడు –

లేత గులాబీ రంగు లో తీగలు లాగా అల్లుకున్న ఈనెలు తో ఉన్న తెలుపు పూరెక్కల లాగా కనిపించాయి.

“మీరే చూసినట్లు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్ప గలుగు తున్నారు? అయినా జీవం లేని, ముక్కలైన శరీరాన్ని అందమైన పువ్వుతో ఎలా పోల్చాలనిపిస్తుంది?”

“జీవం ఉన్న, లేకున్నా ఆ జీవి కి సంబంధించిన ప్రతీది ప్రేమించే వారికి అందంగానే కనపడుతుంది. ఇక  తమ పిల్లలను అణువణుువు ప్రేమించే తల్లి, తండ్రులకు అలా అనిపించడంలో ఆశ్చర్యమేమి ఉంది.’

“రాజు గారి గురించి పూర్తిగా తెలియదు. ఆయన భార్య గురించి బొత్తిగా తెలియదు. నిజంగానే వాళ్ళు అలా అనుకున్నారా?,” నా ఆశ్చర్యానికి కారణాలు స్వగతంలో వెదుక్కుంటూ బయటికే అన్నాను.

“రాజు గురించి చెప్పే ముందు, నరేయిన్ గురించి చెప్పాలి. నరేయిన్ ఇలా మనస్సు విప్పి మాట్లాడింది ఎప్పుడు వినలేదు. మీలో ఏదో ప్రత్యేకత ఉంది. మీలో నేను చూసిన లక్షణాలు, శ్రద్ధగా అవతలి మనిషి చెప్పింది వినగలగడం,  ఎదుటి మనిషితో మీకున్న తాదాత్మ్యం, ఎంపథీ. ఇన్ని రోజులు తనలోనే పెట్టుకొని మధన పడుతున్న విషయం మీ ముందు ఇవ్వాళ చెప్పుకొచ్చాడు.  తను మామూలు అవ్వడానికి గాడిలో పడ్డాడనిపిస్తుంది.”

“ఏంటి అలా అనేసారు? ఇందులో నరేయిన్ బాధేముంది? రాజు కదా వాళ్ళబ్బాయిని కోల్పోయింది?”

“రాజు అని ఎవ్వరూ లేరండి. పోయింది మా అబ్బాయే. అది ప్రమాదవశాత్తు జరిగిందని నాకు తెలుసు. ఆ నిజం తను ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. అందుకే ఆ బాధేదో పరాయి వ్యక్తి రాజు కు జరిగినట్టుగా ఊహించుకుంటున్నాడు.”

ఈ సారి నేను చలించిపోయాను.

“అయ్యో ఎంత దుర్ఘటన. మై కండోలెన్సెస్.” సోఫీ చేతులు పట్టుకొని చెప్పాను.

“పరవ లేదండి. మీకే థాంక్స్ చెప్పాలి. ఈ మాత్రం ఆ విషయం పై మాట్లాడగలిగాడంటే, తను త్వరలోనే మామూలు మనిషి అవ్వుతాడు.  ఆ దుర్ఘటన జరిగిన వెంటనే నరేయిన్ లో బాగా మార్పులు వచ్చాయి. చేస్తున్న ఉద్యోగం కూడా పట్టించుకోవడం మానేశాడు. అందుకోసమే ఆ ఉద్యోగం మానేసి ఈ రెస్టారెంట్ తెరవమని ప్రోత్సహించాను. ఆ కిచెన్ లో ఉన్నంత సేపు, అతనికి ఇహలోక విషయాలేమీ గుర్తుండవు. ఒకప్పుడు దేవుడిని నమ్మని నాస్తికుడు. ‘రిలీజియన్ ఇస్ ది ఫస్ట్ రెఫ్యూజ్ ఆఫ్ ఇడియట్స్’ అనే వాడు. ఇప్పుడు అతన్ని చూస్తే ‘రిలీజియన్ ఇస్ ది అల్టిమేట్ రెఫ్యూజ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్’ అనిపిస్తుంది.”

ఇంక మాట్లాడానికి లేనట్లు సోఫీ లేవబోయింది. కిటికీ లో నుంచి బయటకు చూసాను. నీలాకాశం, అక్కడక్కడ మబ్బులు, ఆహ్లాద మైన వెచ్చదనం తో కాస్తున్న ఎండ, బయట కు వచ్చి సమయం గడప మని ఆహ్వానిస్తున్నవి. ప్రస్తుతం సేద నీడలు వెదుక్కుంటున్న నరేయిన్, సోఫీ లు కూడా ఈ క్షణికానందాల, వెలుగు ప్రపంచం లో అడుగు పెట్టాల్సిందే. సమయం ఆ పని చూసుకుంటుంది.

“థాంక్స్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ కంపెనీ. ఒక చివరి ప్రశ్న. మీరు కూడా నాస్తికులా? మీరు ఇంకా లాజికల్ గా ఆలోచిస్తున్నట్లు ఉంది.” సోఫీ ని అడిగాను నేను

“దేవుడి మీద నమ్మకం ఉంది. చిన్నప్పటి నుండి చర్చ కి, ఇప్పుడు గుళ్ళకు కూడా పోతుంటాను. బైబిల్, భగవద్గీత రెండూ చదువుతాను. కాదంటే మానవులకు అంతు బట్టని విషయాలు కొన్ని ఉన్నాయని నమ్ముతాను. ఆ విషయం ఒప్పుకున్న తరువాత, ఆ అంతుబట్టని విషయాలకు, రిలీజియన్ ఆపాదించే, ఋజువు పరచలేని వివరణలు అనవసరం అనిపిస్తుంది నాకు. ప్రమాదాలు, ట్రాజెడీలు జరుగుతుంటాయి. అలాగే అవకాశాలు, అంతులేని ఆనందాలు దొరుకుతుంటాయి. దానికి కర్మ సిద్ధాంత, లేక ‘గాడ్ హస్ ఎ ప్లాన్’  లాంటి ఆసరాలు నాకు అవసరం లేదు.”

రెస్టారెంట్ బయట అడుగు పెట్టాను. ప్రతీ షాప్ బయట, సైడ్ వాక్ లో అక్కడక్కడ  తులిప్ మొక్కలు, అందమైన విరిసిన పూలతో కనిపిస్తున్నాయి. మానవ జాతి చేస్తున్న ఉపమాన, ఉత్ప్రేక్షలు వదిలించుకోవాలనేమో, గాలికి సుతారంగా అటూ ఇటూ కదులుతున్నాయి.

***

(ల్యారి డెరెల్ ప్రయాణాల ఆధారంగా అల్లిన రెండో కథ ఇది. మొదటి కథ ‘ఎడారిలో ఒక రేయి’  ‘సారంగ’ పక్ష పత్రిక(జూలై 15, 2024) లో ఇదివరకు వచ్చింది. సోమర్సెట్ మామ్ నాకు ఇష్టమైన రచయిత. మామ్ కు గురుదక్షిణగా ఈ సిరీస్ కథలు వ్రాయడం మొదలుపెట్టాను. ల్యారి గురించి మరిన్ని వివరాలకు సోమర్సెట్ మామ్ వ్రాసిన ‘ది రేజర్స్ ఎడ్జ్’ చదవండి.)

నిర్మలాదిత్య

జీవితం చక్కగా నడుస్తున్నా, అవతల వైపు ఏముందో అన్న ఉత్సుకత తో 1998 అమెరికాకు వలస రావడం ఓ గొప్ప మలుపు - ప్రస్తుత నివాసం టాంపా బే , ఫ్లారిడ, USA . 1986 నుంచి 1998 వరకు విపుల, ప్రభ, జ్యోతి, స్వాతి వంటి పత్రికల లో కథలు అచ్చైయాయి. 1998 నుంచి 2004 వరకు evaram.com తెలుగు పత్రిక వెబ్లో నడపడం అందులో రచనలు చేయడం మరువరాని అనుభవం . 2004 నుంచి అమెరికా జీవనం ప్రతిపలించే మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నం, దాదాపు అన్ని కథలు వంగూరి ఫౌండేషన్ పోటీలలో నెగ్గినవే. యూనివర్సిటీ అఫ్ అయోవా రైటర్స్ వర్క్షాప్ ద్వారా రెండు కథలు ఇంగ్లీషు లో అచ్చయాయి. దాదాపు ముప్పై ఏళ్లు పాటు వ్రాసిన మొదటి 24 కథల సంకలనం ' సైబీరియన్ క్రేన్స్' 2023 లో విడుదల అయ్యింది.

జీవితము అనుక్షణం సంతోషంగా గడపడానికి నా స్నేహితురాలు, సహచరి నిర్మల, అబ్బాయి ఆదిత్య కారకులు. అబ్బాయి ఆస్టిన్ లో ఉండడం వల్ల, ఈ నగరం కూడా తరచూ రావడం ఈ మధ్యనే మొదలయ్యింది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు