రామకృష్ణ హఠాత్తుగా చనిపోవడంతో, శేఖర్ తాను తలపెట్టిన ఆత్మహత్యా ప్రయత్నాన్నికనీసం వొక వారం పాటు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండు విషాదాలు వెంటవెంటనే చోటు చేసుకున్నప్పుడు మొదటిదానికి వచ్చినంత ప్రచారం, గుర్తింపు రెందోదానికి రావు. ఆ విషయం శేఖర్ కి తెలుసు.
***
‘‘రామకృష్ణ మనకి భౌతికంగా దూరం అయ్యుండొచ్చు. కానీ అతని జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే వుంటాయి. అతని ఆశయాల సాధన కోసం పునరంకితం కావడమే అతనికి మనమిచ్చే ఘనమైన నివాళి.’’ ఉపన్యాసం ముగించి స్టేజీ దిగాడు శేఖర్. ఆ ప్రాంగణమంతా చప్పట్లతో దద్దరిల్లిపోతోంది. ‘‘జోహార్ రామకృష్ణ’’ అంటూ ఎవరో అరిచారు. జోహార్ జోహార్ అనే కేకల మధ్య చాలా పిడికిళ్లు గాల్లోకి లేచాయి.
రామకృష్ణ మరణం అంతమందిని కదిలించడం శేఖర్ కి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి అక్కడ వున్నవాళ్లలో చాలామందికి రామకృష్ణ అంటే పడదు. అడిగిన వాళ్లందరికీ కాదనకుండా అప్పులిస్తాడు రామకృష్ణ. మార్కెట్లో వున్న రేటు కన్నా ఎక్కువ వడ్డీనే ముక్కుపిండి మరీ వసూలు చేస్తాడు. యూనియన్ లీడర్ గా తాను తప్ప మిగిలిన వాళ్లెవ్వరూ రాకుండా పాలిటిక్స్ ప్లే చేస్తాడు. కానీ అతను చనిపోయాడనగానే అందరూ అతని మీద సదభిప్రాయం వున్నట్టు మాట్లాడుతున్నారు. రామకృష్ణతో తమకి ఎంతకాలంగా అనుబంధం వుందీ, అతను తమకి ఎంత క్లోజ్ అన్నది చెప్పుకోవడంలో పోటీలు పడుతున్నారు.
రెండు నిముషాల క్రితం తాను యిచ్చిన వుపన్యాసం గుర్తొచ్చి నవ్వుకున్నాడు శేఖర్. రామకృష్ణ ఆశయాల సాధన కోసం అందరూ పునరంకితం కావాలా? అసలు ఆ మాటలకి అర్థమేంటి? రామకృష్ణ ఆశయాలు ఏంటి అని అడిగితే, ఇప్పుడు చప్పట్లు కొట్టినవాళ్లలో ఎంతమంది సమాధానం చెపుతారు? పునరంకింతం కావాలంటే గతంలో వొకసారి అంకితం అయ్యుండాలిగా? అప్పుడు నిజంగానే అంకితం అయ్యుంటే యిప్పుడు ప్రత్యేకంగా పునరంకితం కావాల్సిన అవసరం ఎందుకొస్తుంది? గతంలో అంకితం అయ్యుండకపోతే, యిప్పుడు పునరంకితం కావడం కుదరదుగా?
పోయినేడాది సింహాచలం చచ్చిపోయినప్పుడు జరిగిన మీటింగులో కూడా తాను యివే మాటలు వాడాడు. ‘సింహాచలం ఆశయాల సాధన కోసం అందరూ పునరంకితం కావాలీ’ అని. అప్పుడు కూడా అందరూ పిడికిళ్లు బిగించినట్టు గుర్తు. సింహాచలం ఆరెస్సెస్ లో పనిచేస్తాడు. రామకృష్ణ వామపక్ష భావాలు వున్నవాడు. వ్యక్తిగత స్వార్థం తప్ప, యీ యిద్దరికీ నిజంగానే ఏవో ఆశయాలు వుండి వున్నా కూడా, అవి ఖాయంగా వేర్వేరు అయ్యుండాలి. మరి యిద్దరి ఆశయాల సాధన కోసమూ పునరంకితం అవ్వడం కష్టం అవుతుందని ఎవరికీ అనిపించలేదా? చచ్చిపోయిన వాళ్ల విషయంలో జనాలకి సిద్ధాంతాల పట్టింపు వుండదేమో. పైగా, ఎన్ని వాగ్దానాలు చేసినా, అవి నెరవేర్చామో లేదా పోయినోడు వచ్చి చూస్తాడా ఏంటి అనే ధైర్యం కావచ్చు.
ఇంటికొచ్చాక కూడా యీ ఆలోచనలు శేఖర్ ని వదల్లేదు. తాను రామకృష్ణ గురించి అలా ఎందుకు మాట్లాడాడు? రామకృష్ణ ఏమంత గొప్పవాడు కాదనీ, అతని మరణం అతని కుటుంబసభ్యులకి తప్ప ఎవరికీ లోటు కాదనీ తన అభిప్రాయం. అదే విషయం స్టేజీ మీద చెప్పుంటే ఏమైవుండేది? పైకి తనని తప్పుబట్టినా చాలామంది తన ధైర్యాన్ని చూసి అసూయపడి వుండేవాళ్లు. మంచి ఛాన్సు మిస్సయిపోయినందుకు ఫీలయ్యాడు శేఖర్. ఇంతలోకి, వొక వారంలో తాను ఆత్మహత్యా ప్రయత్నం చేయబోతున్నట్టు గుర్తొచ్చింది అతనికి. ఆ ఆలోచన తెచ్చిపెట్టిన వుద్విగ్నతలో రామకృష్ణ మరుగున పడిపోయాడు.
తనకి నిజంగా ఆత్మహత్య చేసుకునే వుద్దేశం లేదనీ, అదొక ఫేక్ సూసైడ్ అటెంప్ట్ అనీ ఎవరికైనా తెలిసే ప్రమాదం వుందా? సమస్యే లేదు. ఫేకింగ్ అనే ఆర్టులో ఒలింపిక్స్ పోటీలు పెడితే తనకి గోల్డ్ మెడల్ రావడం ఖాయం. తాను ఎన్నిసార్లు యెంతమందిని బురిడీ కొట్టించలేదు.
***
‘‘పెద్దయ్యాక నేను ఏం అవ్వాలనుకుంటున్నాన్నంటే.. అనే అంశం మీద నెక్ట్స్ మాట్లాడబోయే విద్యార్థి తొమ్మిదో తరగతి, బీ సెక్షన్ నుండీ శేఖర్’’, మైకులో అనౌన్స్మెంట్ వినిపించింది.
‘‘ఒక ఎమ్మెల్యేకి వందల మంది అభిమానులు వుండొచ్చు. ఒక హీరోకి వేలమంది అభిమానులు వుండొచ్చు. ఒక క్రికెటర్ కి లక్షలమంది అభిమానులు వుండొచ్చు. కానీ, వీళ్లంతా కలిపినా వొక సైనికుడి కాలి గోటికి కూడా సరిపోరు. ఆ సైనికుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో ఎవరికీ తెలియకపోవచ్చు. అతను మరణించిన సంగతి ఎవరికీ పట్టకపోవచ్చు. వందకోట్ల మంది స్వేచ్ఛావాయువులు పీల్చడం కోసం తన వూపిరిని పణంగా పెట్టే సైనికుడిగా జీవించడం కంటే గొప్ప అదృష్టం వేరొకటి వుండే అవకాశమే లేదు. అందుకే నేను పెద్దయ్యాక సైనికుణ్నవుతాను.’’ శేఖర్ స్పీచ్ ముగించేసరికి దేశభక్తితో స్కూలు స్కూలంతా పూనకం పట్టినట్టు వూగిపోతూ వుంది. అయ్యేయస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పిన భావన అనే అమ్మాయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఫస్ట్ ప్లేస్ వచ్చినవాళ్లకి పంచతంత్ర కథల పుస్తకం, సెకండ్ వచ్చినవాళ్లకి భగత్‌సింగ్ జీవితచరిత్ర యిస్తామని ముందుగా అనౌన్స్ చేశారు. కానీ, సైనికుడు కావాలన్న శేఖర్ సంకల్పాన్ని చూసి ముచ్చటేసిన హెడ్మాస్టారు భగత్‌సింగ్ పుస్తకాన్ని అందుకునే అర్హత శేఖర్ కి మాత్రమే వుందని ప్రకటించారు. పంచతంత్రం పుస్తకం భావనకి వెళ్లిపోవడం చూసి శేఖర్ కడుపు రగిలిపోయింది. నిజానికి శేఖర్ కి అసలు సైనికుడు కావాలని లేదు. ఎంచక్కా సినిమాల్లోలాగా మాఫియా డాన్ అవ్వాలనేది అతని కోరిక. ఆ విషయం బయటకి చెపితే బహుమతి రాదని స్పీచి రాసిచ్చిన ట్యూషన్ మాస్టారు వెనక్కి లాగాడు. తీరా యిప్పుడు చూస్తే, నచ్చిన మాటని బయట పెట్టే అవకాశమూ పోయింది. బంగారం లాంటి కథల పుస్తకమూ పోయింది. హెడ్మాస్టారు, ట్యూషన్ మాస్టారు యిద్దరూ పాకిస్తాన్ వుగ్రవాదులు అయినట్టు, తాను సైనికుడిగా మారి వాళ్లిద్దర్నీ కాల్చేసినట్టు ఆరోజు రాత్రి కలొచ్చింది శేఖర్ కి.
***
‘‘కాలేజీలో యింతమంది అమ్మాయిలుండగా నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావు శేఖర్?’’ గడ్డి పరకలు తెంపుతూ అడిగింది భాను. అలాంటి సందర్భంలో ఏం చెపితే రొమాంటిగ్గా వుంటుందో అతనికి వెంటనే తట్టలేదు.
‘‘గడ్డిపరకలు యింత లాఘవంగా తెంచగలిగే నీకన్నా మంచి అమ్మాయి నాకెక్కడ దొరుకుతుంది భానూ’’ అందామా అనుకున్నాడు. అదేమంత అందంగా లేదనిపించి ఆగిపోయాడు.
‘‘నిన్నే, చెప్పూ’’ మోచేత్తో పొడిచింది భాను. ఏదో వొకటి చెప్పకపోతే మళ్లీ పొడుస్తుందేమోనని భయమేసింది శేఖర్ కి. ‘‘కారణాలు, పర్యవసానాలు ఆలోచించుకొని మొదలెడితే అది ప్రేమ ఎలా అవుతుంది భానూ? అది అలా జరిగిపోయిందంతే. ఒక్కటి మాత్రం చెప్పగలను. మన ప్రేమ ఎప్పుడు మొదలయ్యిందో నాకు తెలియదు. కానీ, ఎప్పటికీ ముగిసిపోదని మాత్రం చెప్పగలను’’ అన్నాడు.
‘‘అబ్బా, ఎంత బాగా చెప్పావ్ శేఖర్’’ మళ్లీ మోచేత్తో పొడుస్తూ అంది భాను. ఆమె మోచెయ్యి తగలరాని చోట తగలడం ద్వారానే తన జీవితం చరమాంకానికి చేరుకుంటుందని అతనికి చాలాసార్లు భయమేస్తూ వుంటుంది. ఆ విషయం బయటకి చెప్పాలనేది అతని బకెట్ లిస్టులో వున్న కోరికల్లో వొకటి.
‘‘ఒకవేళ నేను మా యింట్లోవాళ్లు తెచ్చిన సంబంధమే చేసుకోవాల్సి వస్తే నువ్వు ఏమైపోతావ్ శేఖర్? ఇప్పుడు నా మీద వున్న ప్రేమంతా అప్పుడు ద్వేషంగా మారుతుంది కదూ?’’ అడిగింది భాను.
‘‘అంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నువ్వు ఎక్కడ వున్నావు, ఎవరితో వున్నావు అన్నది నాకు అనవసరం. నువ్వు నాదానివి. భౌతికమైన దూరాలు నీమీద నాకున్న ప్రేమని తగ్గించలేవు’’ అన్నాడు. నిజంగా తమ యిద్దరి మధ్యా భౌతికదూరం పెరిగితే, ఆమె మోచేతికి తాను అందననే ఆలోచన అతనికి చాలా ఆహ్లాదంగా అనిపించింది.
‘‘అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుందాం శేఖర్’’ అంది భాను. ఆమె మనసులో ఏం కోరుకుంటుందో అతనికి అర్థం కాలేదు. కానీ, అతను మాత్రం ఆమె దూరం కాకూడదని ఎప్పుడూ బలంగా కోరుకోలేదు. భానుతో కలిసి గడపడం అతనికి అలవాటుగా మారిందన్నది నిజమే. అంతమాత్రాన ఆమెని వదులుకోలేనంత గాఢమైన బంధం యిద్దరి మధ్యా లేదు. ఆ విషయం ఆమెకి కూడా తెలుసని అతని అనుమానం.
***
‘‘మగాడంటే నువ్వేరా బాబూ. అవసరమైతే మా ఆయన్నీ, మీ ఆవిడనీ లేపేయడానిక్కూడా నేను రెడీ’’ దగ్గరకి లాక్కుంటూ అంది ఊహ.
‘‘మీ ఆయనా, మా ఆవిడా? పెళ్లి కాకుండానే వాళ్లెక్కణ్నించీ వచ్చారు?’’ అడిగాడు శేఖర్.
‘‘అబ్బా అదేలేద్దూ. పెళ్లయ్యాక సంగతే నేను చెప్పేది’’ విసుక్కుంది.
‘‘ఎవరెవర్నో చేస్కోని వాళ్ల ప్రాణాల మీదకి తేవడం దేనికి? మనిద్దరమే పెళ్లి చేస్కుంటే సరిపోద్దిగా’’ అడిగాడు.
‘‘నీకు లాజిక్కుల మీద వున్న శ్రద్ధ లవ్ మేకింగ్ మీద లేదు కదా?’’ నిరాశ నటిస్తూ, పైట పక్కకి లాగేసి, అతని మొహాన్ని తన గుండెలకి అదుముకొంది. ఆమె శ్వాస తీసుకునే వేగంలో మార్పు అతనికి అర్థం అవుతోంది. రెండు క్షణాలు గడిచాయో లేదో, ఆల్రెడీ క్లయిమాక్స్ కి చేరినట్టు రొప్పడం మొదలెట్టింది.
శేఖర్ కి కూడా ఊహ స్పర్శ చాలా సుఖాన్నిస్తోంది. ఇద్దరికీ పరిచయం కాకముందు, అలా అర్థనగ్నంగానో పూర్తి నగ్నంగానో ఆమెతో కలిసి పడుకొని కబుర్లు చెప్పాలని అతనికి వుండేది. ‘నువ్వు నా సొంతం, మనిద్దరికీ వొకరి మీద వొకరికి అధికారం వుంది, మనల్నెవరూ విడదీయలేరు’ అని చెపుతున్నట్టు, నింపాదిగా అలాంటి క్షణాలని ఆస్వాదించాలని అతను అనుకునేవాడు. కానీ, ఊహ వ్యవహారం వేరు. ఒంటి మీద చెయ్యి పడగానే ఆమెకి తమకం ముంచుకొస్తుంది. చుట్టూతా ఏం జరుగుతుందో అర్థం కాదు. మొత్తం అయ్యాక, అప్పటిదాకా ఏం జరిగిందో ఆవగింజంత అయినా గుర్తుండనంత వుక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఒకటోసారి, రెండోసారి అయితే ఓకే. కానీ, ఎన్నాళ్లయినా ఆమె అదే ఫ్లో లో కంటిన్యూ అవ్వడం అతనికి యిబ్బందిగా వుంది. చేయకూడని తప్పేదో చేస్తున్నట్టు, దొరకబుచ్చుకున్న నాలుగు క్షణాల్లోనే స్వర్గం అంచులు దాటేయాలన్నట్టు హడావుడి పడడం అతనికి నచ్చడం లేదు.
కానీ, ఊహ తన నుండీ ఏమి ఆశిస్తుందో శేఖర్ కి తెలుసు. తన దేహం తాకడానికి అతను తహతహలాడిపోతున్నాడని అనుకోవడంలో ఆమెకి ఆనందం వుంటుందని అర్థమైంది అతనికి. అందుకే, ఆ కాసేపూ ఆమె అంచనాలని అందుకోడానికి, తాను కూడా శృతిమించిన తమకాన్ని అభినయించక తప్పలేదు. లేని ఆవేశం వున్నట్టు, రాని వుద్రేకం వచ్చినట్టు నటించడంలో కష్టం తెలిశాక, అతనికి మొత్తం స్త్రీజాతి మీద బోలెడంత ప్రేమ పెరిగిపోయింది. ఒక చప్పటిరాత్రి మోహపుదీపంతో వెలిగిపోయినట్టు నమ్మడం, నమ్మించడం అంత తేలికేమీ కాదు. తాను కూడా అందరి మగాళ్లలాంటి వాడినే అని ఊహ అనుకుంటుందా? తనకి మాదిరిగానే ఆమెకి కూడా యీ తంతు మొత్తం వొక భారంగా మారిపోయిందా? ఏమో!
***
శేఖర్ కి వైదేహితో పెళ్లి కుదిరిందని తెలియగానే ఆఫీసులో అందరూ అనుకున్న మాట వొక్కటే.. ఆ పిల్ల అదృష్టవంతురాలు! శేఖర్ ఎవరినీ ఎప్పుడూ నొప్పించే తరహా కాదు. బయటివాళ్ల విషయంలోనే అలా వుంటాడంటే, యిక భార్యని ఎలా చూసుకుంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని కదిలించినా యిదే ముచ్చట. పెళ్లయ్యిన మూడు నెలలకి వైదేహి పుట్టింటికి వెళ్లింది. మళ్లీ వెనక్కి రాలేదు.
వైదేహిని తిరిగి రప్పించడానికి ఏం చేయాలా అని ఆలోచించాడు శేఖర్. బతిమలాడి, బెదిరించి, పంచాయితీలు పెట్టి ఆమెని రప్పించడం అతనికి యిష్టం లేకపోయింది. అది తన ఫిలాసఫీకి వ్యతిరేకం. ఆమె తనంతట తానుగా రావాలి. ఇష్టం లేని కాపురంలోకి బలవంతంగా యీడ్చుకు రాకూడదు. మరి ఎలాగ? శేఖర్ కి తట్టిన పరిష్కారం ఆత్మహత్యా ప్రయత్నం. తాను వెళ్లిపోవడం వల్లే శేఖర్ చనిపోవాలనుకున్నాడని వైదేహి అనుకోవాలి. మనిషి ప్రాణం కన్నా తన పంతం ముఖ్యం కాదని గ్రహించాలి. ‘అవును, నీ కోసమే చచ్చిపోవాలనుకున్నాను’ అని తాను నోరు విప్పి ఆమెతో చెప్పడు. కాబట్టీ, అది బ్లాక్ మెయిల్ కిందకి రాదు. ఇలా ఆలోచించి, ఫేక్ సూసైడ్ అటెంప్ట్ కి సిద్ధమయ్యాడు శేఖర్.
ఇంతలోకి రామక్రిష్ణ గుండెపోటుతో చనిపోయాడు. తాను తలపెట్టిన ఆత్మహత్యా ప్రయత్నాన్ని శేఖర్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఒక వారం అయితే ఏం జరిగుండేదో కానీ, నాలుగో రోజు వైదేహి నుండీ వుత్తరం వచ్చింది.
‘‘శేఖర్, మనిద్దరికీ సరిపడదని తెలుసుకోడానికి యింత సమయం తీసుకున్నందుకు క్షమించు. నీ మొగుడితో కలిసి బతకడంతో నీకున్న కష్టం ఏంటి అని నన్ను ఎవరైనా నిలదీస్తే, చెప్పడానికి నా దగ్గర సరైన సమాధానం లేదు. అది బయటి ప్రపంచానికి అర్థమయ్యేది కాదు. నీకైనా అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. కానీ, చెప్పడం నా బాధ్యత. నీకు ఏది సంతోషాన్నిస్తుందో నీకే తెలీదు. నిజమైన సంతోషం అంటే ఏంటో నీకే తెలియనప్పుడు, ఎదుటివాళ్లని నువ్వెలా సంతోషంగా వుంచగలవు? నీకేం కావాలో ముందు తెలుసుకో. దాన్ని సాధించడానికి నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు పోరాడాల్సి రావచ్చు, రాజీ పడాల్సి రావచ్చు, వోడిపోవాల్సి రావచ్చు. ఏం జరిగినా అది విజయం కిందే లెక్క. కానీ, లేని యుద్ధాన్ని వూహించుకొని, దాన్నుండీ పారిపోవడానికి ప్రయత్నించడం అవివేకం. ఇంతకు మించి నేనేం చెప్పలేను.’’
ఆ లెటర్ చదివాక శేఖర్ కి అనుమానం వచ్చింది. తాను ఏం చేయాలనుకున్నాడో వైదేహికి తెలిసిపోయిందా? ఇప్పుడు తాను ఏం చేస్తే విజయం సాధించినట్టు అవుతుంది?
***
శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తని ఎవరూ నమ్మలేకపోయారు. కానీ, చనిపోయేముందు, అతను రాసిపెట్టిన సూసైడ్ నోట్ బయటకి వచ్చి, వాట్సప్ లో చక్కర్లు కొట్టిన తర్వాత నమ్మక తప్పలేదు.
‘‘నా చావుకి ఎవరూ కారణం కాదు. నాకు ఎలాంటి ఆశయాలూ లేవు. ఒకవేళ వున్నా, వాటిని సాధించడానికి గతంలో ఎవరూ అంకితం అవలేదు. ఒకవేళ అయినా, నేను మరణించిన సందర్భంగా వాళ్లు పునరంకితం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎవరిపట్లా నాకు గౌరవం గానీ, ప్రేమ గానీ లేవు. భౌతికంగానే కాదు, జ్ఞాపకాల్లో కూడా ఎవరికీ దగ్గరగా వుండడం నాకు యిష్టం లేదు. ఎవరూ నన్ను తలుచుకోవద్దు. నా గురించి మాట్లాడుకోవద్దు. ఇదే నా చివరి కోరిక. నా చావు ఫేక్ కాదు’’.
మృత్యువు ముంగిట నిలబడి కూడా, తన మరణం ఎవరికీ భారంగా పరిణమించకూడదనే ఆలోచన చేయగలిగిన వుదాత్తమైన మనసున్న వ్యక్తిగా అందరూ శేఖర్ ని కొనియాడారు. అతని ఆశయాల సాధన కోసం పునరంకితం కావాలని అతని కొలీగ్స్ లో చాలామంది నిర్ణయించుకున్నారు. సూసైడ్ నోట్ లో వున్న చివరి వాక్యం మాత్రం చాలామందికి అర్థం కాలేదు.
*
కథ బాగుంది శ్రీధర్. మధ్యలో కామెడీ కాస్త ఇబ్బంది పెట్టింది.
Thank you Ravi 😍
కధ బ్రహ్మాండంగారాశారు. ఇంత మానసిక ధోరణుల వైచిత్రిని గురించి రాసి మెప్పించగలవారు ఒకరిద్దరుంటేగొప్పే. hats off to you.
Thank you so much madam. I feel honoured. 💕🙏
ప్రతి మనిషి బయటికి ఒకలా లోపల ఒకలా వుండడం సర్వసాధారణం. అది మన లోపలి మనిషికి అర్ధం అయిన రోజున ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు అని చక్కగా చెప్పారు సార్.
Thank you sir 🙏
ఇంతకీ ఆ శేఖర్ బ్రతికే ఉన్నాడనుకోవాలా?
పాపం! చనిపోయినా కూడా….
నిజంగానే చనిపోయాడండీ. ఆత్మహత్య చేసుకోబోయినట్లు నటించాలనేది ముందున్న ఆలోచన. కానీ, జీవితమంతా ఏం చేస్తూ వచ్చాడో తల్చుకొని, కనీసం ఒక్కసారైనా.. ఫేక్ కాని ఒక పని చేయాలనుకున్నాడు.
బాగుంది.మానవ నైజం లోని ఒక పార్శ్వాన్ని చక్కగా చెప్పారు
Thank you sir 🙏
కధ బావుంది
Thank you sir 🙏
కథ బావుంది సార్
Thank you sir 🙏