ఫీనిక్స్ లా….నిలబడాలనే “దురస్తు” కథలు

డిసెంబర్ 24 న నల్గొండలో దురస్తు కతా సంకలనం ఆవిష్కరణ – ఈ కృషికి అప్పుడే పదేళ్ళు నిండాయంటే దాని వెనక వున్న అంకితభావం మనకో సంబరం!

దురస్తు అంటే…పునర్నిర్మాణం, తిరిగి నిర్మించడం. తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉన్న పదం.  పూర్వం తెలంగాణ ప్రాంతంలో గుడిసె ఇండ్లు ఎక్కువగా ఉండేవి. గుడిసె కప్పులను…తొలగించి కొత్త ఇంటి కప్పు వేయడాన్ని దురస్తు చేయడం అనేవారు. తెలంగాణ నుంచి వచ్చిన ఉత్తమ కథలను ఎంపిక చేసి ప్రతి ఏటా కథల సంకలనం తెస్తున్నారు డా. సంగిశెట్టి శ్రీనివాస్, డా. వెల్దండి శ్రీధర్. ఆ కథల సంకలనాలకి తెలంగాణ సమకాలీన పరిస్థితిని ప్రతిబింబించేలా …రంధి, అలుగు, దావత్…పేర్లు పెడుతుంటారు. ఆ క్రమంలో 2022 ఏడాదిలో తెలంగాణ నుంచి వచ్చిన కథల సంకలనానికి దురస్తు అని పేరు పెట్టారు.

డిసెంబర్ 24, 2023 ఆదివారం నాడు…నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరణ జరగనుంది. ఈ సందర్భంగా ఈ కథా సంకలనంలోని కథకులతో సారంగ ముచ్చటించింది. ఆయా కథల వెనుక ఉన్న నేపథ్యాన్ని….కథకులు సారంగతో పంచుకున్నారు.

***

వాస్తవ సంఘటనకు కథా రూపం                

(వెలుగు రేక కథ   -స్వర్ణ కిలారి)

పాతికేళ్ళ కిందట జరిగిన వాస్తవ సంఘటన, మూడేళ్ళ కిందట చూసిన  సినిమా, రెండేళ్ళ కిందట కలిసిన ఒక మిత్రుడితో జరిపిన సంభాషణ అన్నీ కలిసి ఈ కథగా రూపం తీసుకున్నాయి.

పాతికేళ్ళ కిందట కొత్తగూడెంలో డిగ్రీ చదువుతున్నప్పుడు  మిత్రులందరం సరదాగా, చిలిపిగా గడిపినప్పటి జ్ఞాపకాలు అవి.

మూడేళ్ళ కిందట థిరికే అనే మలయాళం సినిమా చూశాను. డౌన్ సిండ్రోమ్ ఉన్న ఒక చిన్నపిల్లాడి కథ. సరిగ్గా అప్పుడే నా కాలేజీ మిత్రుడు కాజువల్ గా ఫోన్ చేసాడు. చదువుకునేటపుడు చాలా జోవియల్ గా ఉండే మనిషి చాలా గంభీరంగా మారిపోవడం గమనించాను అతని మాటల ద్వారా.  తన కొడుక్కి ‘ఆటిజం’ అని చెప్పాడు.

అప్పటినుంచి ఈ రెండు సంఘటనల్ని జోడించి ఒక కథగా రాద్దామని అనుకున్నాను. అప్పటి నిజజీవిత సంఘటనకి కొన్ని మార్పులు చేర్పులు చేసి, కొంత కాల్పనికత జోడించి రాసిన కథ ఇది. సారంగ అక్టోబర్ 2022 సంచికలో ‘వెలుగు రేక’ గా ప్రచురితం అయ్యింది.

 

  మారని ఆచారం….మహిళకేనా భారం?

(ఉల్లి పూసలు కథ)                             –పెద్దింటి అశోక్ కుమార్

సమాజం ఎంతగా మారినా మనిషి ఎంతగా ఆధునికరించబడ్డా సనాతన ధర్మాలు సాంప్రదాయాలు ఆధునిక జీవితానికి తగ్గట్టుగా మారకుండా అలాగే ఉండిపోతున్నాయి. అవి మనుషులను,  ముఖ్యంగా స్త్రీలను మానసికంగా, భౌతికంగా హింసకు గురిచేస్తున్నాయి‌.  ఇప్పటికీ పల్లెల్లో భర్త చనిపోయిన స్త్రీలు శుభకార్యాలకు హాజరు కారు.  వాళ్లు ఎదురైతేనే ఏదో అరిష్టం అన్నట్టుగా చూస్తారు జనం.  అలాగే బొట్టు, కాటుక అలంకార వస్తువులు కూడా తీసివేసి ఆమెను విధవలు చేసి పలు రకాలుగా మానసిక హింసలకు గురి చేస్తారు. వేల ఏళ్ళక్రితం పుట్టిన ఆ ఆ ఆచారం సమాజం ఇంతగా మారినా ఇంత ఆధునికరించబడ్డా ఇంకా   అలాగే కొనసాగుతున్నాయి. ఎక్కడో ఒకచోట ఒకరిద్దరు ధైర్యం చేసి విభేదించినా సమాజం యొక్క ఆమోదం దొరకదు.  ఆఖరుకు ఇంట్లో సొంత మనుషులు  కూడా కోడలు, కొడుకు,భర్త వీళ్లు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ… తల్లీ, చెల్లీ అని చూడకుండా ఆమెను శుభకార్యాలకు దూరంగా ఉంచి అలంకారాలకు దూరం చేస్తారు.

ఈ దురాచారానికి వ్యతిరేకంగా  పూలమ్మ ఒక్క అడుగు ముందుకు వేసి తన కూతురుకు అలంకారాలు పెళ్లి తోనే  రాలేదని… భర్త పోయినంత మాత్రాన అవి పోవని తేల్చిచెప్పి  ఎదురు తిరిగిన కథాంశమే ఈ ఉల్లి పూసలు.

ఉల్లిపూసలు అంటే బిడ్డ పుట్టిన తర్వాత 21వ రోజు నాడు పురుడు చేసి,  బొడ్డు కోసిన బూడిదను కాల్చి చేతికి కట్టిన ఒక దండ. అప్పుడే బొట్టు కాటుకలు అలంకారాలు మొదలవుతాయి. అలంకారాలకు ఉల్లిపూసలను ప్రతీకాత్మకంగా చూపిస్తూ…ఆ నేపథ్యంలో సాగిన  కథ ఇది. తెల్సా కథల పోటీల్లో బహుమతిని గెలుచుకుంది.

 పోరాటం ఇంకా మిగిలే ఉంది…

(స్ధూపం కథ)                                           – పి.చంద్

మానవమనుగడ, చరిత్ర అభివృద్ధి పరిణామం మొత్తంగా భూమి కేంద్రంగా సాగింది. ఈ భూమి కోసమే యుద్ధాలు జరిగినవి. భూమి ఎవరి ఆధీనంలో ఉంటే వాడే అధికారం చెల్లించాడు. రాజ్యాలు ఏనాడు భూమి కొందరి ఆధిపత్యానికి దర్పణానికి హోదాకి చిహ్నం. కానీ సామాన్య ప్రజలకు మాత్రం భూమి అంటే అవసరం బతుకుదెరువు భూమి లేకుంటే బతుకు లేదు ముఖ్యంగా పేద ప్రజలకు. అందుకే ప్రజలు భూమికోసం పోరాటాలు చేస్తున్నారు. చేస్తారు కూడా… ప్రపంచ చరిత్ర ఇదే చెప్తుంది.

నిన్నటి మొన్నటి మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు ఈనాటి రైతాంగ పోరాటం వరకు దున్నేవాడికే భూమి ప్రతిపాదికన జరుగుతున్న పోరాటాలు…నిన్నటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా మా నేల మీద మాకే అధికారం ఉండాలని ప్రతిపాదనగా సాగిన పోరాటమే. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాని ప్రజల ఆశలు నెరవేరలేదు..

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా అధికారంలోకి వచ్చిన కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ భూమి లెక్కలు శాస్త్రీయంగా క్రమబద్ధీకరిస్తాం, డిజిటలైజ్ చేస్తాం, అంటూ ధరణి పోర్టల్ తెచ్చింది.

తెలంగాణలో విప్లవ పార్టీల నాయకత్వంలో గ్రామీణ పేదలు దాదాపు 50 సంవత్సరాలు అనేక నిర్బంధాల మధ్య అసమాన త్యాగాలతో రక్తతర్పణ చేసి దొరల భూములు లక్షలాది ఎకరాలు ఆక్రమించుకొని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. అటువంటి సాగుదారులకు భూమి వారి ఆధీనంలో ఉంది కానీ చట్టపరంగా భూమి హక్కులు లేకుండా ఉన్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని కేసీఆర్ ధరణి లెక్కల్లో సాగుదారు కాలం తీసివేయడం ద్వారా ఒక్క కలం పోటుతో వాళ్లను భూముల నుండి భేదకల్ (తొలగించడం) చేసింది. వారి నుండి భూములు గుంజుకొని మళ్లీ భూస్వాములకు తమ అనుచరులకు పెట్టుబడిదారులకు లక్ష ఎకరాలు కట్టబెట్టి రైతులను  మోసం చేసింది. ఇటువంటి  పరిణామమే నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటకాలంలో పోలీసు యాక్షన్ పేరిట నాటి సర్కారు సైన్యం చేసింది. ఏ దొరలకు వ్యతిరేకంగా నైతే తెలంగాణ పేదలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు అసమాన త్యాగాలతో నాలుగు వేలమంది అమరుల త్యాగాలతో…ఊళ్ల నుండి పీడిత భూస్వాములను తరిమేసి స్వాధీనం చేసుకున్న పది లక్షల ఎకరాల భూమిని… సర్కారు సైన్యాలు తమ పశుబలంతో ప్రజలను అణచివేసి పారిపోయిన దొరలను మళ్లీ ఊళ్లకు తీసుకువచ్చి వారి భూములు వారికి కట్టబెట్టి మళ్లీ దొరలరాజ్యం నెలకొల్పింది. ఈ పరిణామాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నమే స్థూపం కథ.

***

సంతృప్త స్వభావి                                   

(ఖుష్ మిజాజ్ కథ- స్కైబాబ)

నా “ఖుష్ మిజాజ్” కథలోని హనీఫ్ లాంటి స్వభావమున్న మిత్రులు ఇద్దరిని చాలా క్లోజ్ గా చూశాను. అందులో ఒక మిత్రుడు కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా చనిపోయినప్పుడు చాలా దుఃఖం కలిగింది. అతనిపై, అలాంటి వారిపై ఒక కథ రాయాలని బలంగా అనుకున్నాను.

మిత్రుడు యాది కొచ్చినప్పుడల్లా ఆ కథ ఎలాగైనా రాయాలనిపించేది. రెండుసార్లు మొదలేసి నాకే నచ్చక వదిలేశాను. చిన్న కథే కానీ కథ కాడానికి సంవత్సరాలు పట్టింది.

అవాళ మా ఊరు కేశరాజుపల్లిలో ఉన్నాను. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. నిద్ర పట్టడం లేదు. మిత్రుడు గుర్తొచ్చాడు. పక్క మంచంపై మా అమ్మ పడుకొని ఉంది. చప్పుడు కాకుండా లేచి మొబైల్ చేతిలోకి తీసుకున్నాను. టైం మూడు దాటింది. కుర్చీ వేసుకుని కూర్చొని మొబైల్ లోనే ఏకబిగిన ఉదయం ఎనిమిదిన్నర దాకా కథ రాసేశాను. తొలిసారి మొబైల్ లో కథ రాయడం! తరువాత మార్పులేమీ అవసరం పడలేదు. కథ ఇలా కూడా ఉండొచ్చునా అనిపించింది. పేరు కోసం చాలా ఆలోచించాను. సరైన అర్థం వచ్చేలా ఈ పేరు ఖాయం చేయడానికి కొందరితో చర్చించాల్సి వచ్చింది. కథ సాక్షి ఫండేలో అచ్చయింది. అలా నా మిత్రుడి యాదిని శాశ్వతం చేశానన్న తృప్తి మిగుల్చుకున్నాను.

ఈ కాలంలో ఎందరినో ఊరించే హై ఫై జిందగీ దక్కని వారి ఊహాలోకం ఎలా ఉంటుంది? అలాంటి వారే కాక,

ముస్లింలలో పేదరికం ఎక్కువగా ఉండడంతో ఇలాంటి మనుషులను చూస్తుంటాం. ఇదొక స్వభావం. వారికి ఇదొక తృప్తి నిచ్చే ట్రాన్స్. ఆ ట్రాన్స్ లో వారు హ్యాపీగా ఉంటారు. సంతృప్త స్వభావులుగా ఉంటారు. నిజానికి ఇలాంటి వారు తమ మిత్రులకు, పరిచయస్తులకు ఇలా కథలు చెప్పుకుంటారు.. రచయితలేమో కథలుగా, కవిత్వంగా రాస్తారు, అంతే!

***

మానని గాయం…మాసిపోని విషాదం

(ఆత్మ అగ్ని…అది నిన్ను దహిస్తుంది.- -ప్రొ. రామా చంద్రమౌళి)

భారతదేశం ‘ ఆజాదీకా అమృత మహోత్సవ్ ‘ ఉత్సవాలను గత సంవత్సరమంతా ఘనంగా జరుపుకున్న సందర్భంగా ముగింపు దశలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోది ఇకముందు ఆగస్ట్ 14 వ తేదీని ‘ భారతదేశ విభజన భయానక దినోత్సవం ‘ గా పాటిస్తామని ప్రకటిస్తూ, ఇది సామాజిక విభజనకు, అసమానతలు అనే విషాన్ని తొలగించి ఏకత్వం, సామాజిక సామరస్య మరియు మానవ సాధికారత స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ రోజు భారతదేశానికి గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించిన సందర్భాన్ని పురస్కరించుకుని, 75 ఏండ్ల క్రితం భారతదేశ విభజన ఎంత విషాద ఘటనగా జరిగిందో, దాదాపు పది లక్షలమంది పౌరులు ఎలా అమానుషంగా హత్య చేయబడ్డారో.. ఇవేవీ తెలియని ఇప్పటి తరానికి తెలియజెప్పడం కోసం ఈ కథ రాయబడ్డది.

భారతదేశాన్ని హిందువులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాన్ని ఇండియా అని పిలువబడే లౌకిక దేశంగా, ముస్లిం జనాభా అధికంగా ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్ అనబడే ముస్లిం మత దేశంగా విభజించమని బ్రిటిష్ ప్రధాని అట్లీ సర్ సిరిల్ జాన్ రాడిక్లిఫ్ అనే ఒక ఉన్నతస్థాయి బ్రిటిష్ లాయర్‌ను కమీషనర్‌గా పంపితే.. అతను కేవలం నలభై ఏడు రోజుల్లో అనేక రాజకీయ ఒత్తిళ్ళలో ఆదరాబాదరాగా ఒక పెన్నుతో రాజ్యాల మీదిగా ఒక గీత గీసి అశాస్త్రీయంగా కొన్ని శతాబ్దాల చరిత్రగల పవిత్ర భారతదేశాన్ని మూడు ముక్కలు చేశాడు.

ఈ రాడిక్లిఫ్ గీసిన ఈ అశాస్త్రీయ గీత కాలగతిలో ‘ రాడిక్లిఫ్ రేఖగా ‘ మిగిలిపోయి ఒక దుఃఖముద్రగా, మాననిగాయంగా మిగిలిపోయింది.

ఈ రాడిక్లిఫ్ భారతదేశ రాక్షస విభజన చేయకముందు ఎప్పుడూ ఈ దేశాన్ని సందర్శించలేదు. విభజనానంతరం లండన్ వెళ్ళిన అతను ఆత్మక్షోభతో, అపరాధ భావనతో కుళ్ళి కుళ్ళి మళ్ళీ ఎప్పుడూ భారతదేశాన్ని సందర్శించలేదు. భారతీయులు తను ఆ దేశానికి చేసిన ద్రోహానికి ఎక్కడ తనను చంపుతారో నన్న భయంకూడా అతణ్ణి జీవితాంతం వెంటాడింది.

అతని ఆత్మ రాడిక్లిఫ్‌ను అతని శేషజీవితాన్నంతా అగ్నిలా కాల్చి కాల్చి దహిస్తూనే ఉంది.

ఆ రకంగా ఒక మనిషి తెలిసో తెలియకో ఒక తప్పును లేక నేరాన్ని చేసి లక్షల మంది మరణానికి కారకుడైతే అతని ఆత్మ ఎంత క్షోభిస్తుందో, ఎంతగా ఆ మనిషిని దహిస్తుందో తగు రీతిలో ప్రతిభావంతంగా చెప్పాలన్న నా తపనే ఈ కథ.

***

గుండె రగిలి పుట్టిన కథ

(జజ్జనక –    డా. పసునూరి రవీందర్ )

నీళ్లు,నిధులు,నియామకాలు ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అనేక త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం… ఆ తర్వాత కొంతమంది పాలకుల చేతుల్లో దగాపడింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా….లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో చీకటి అలుముకుంది. ఇదంతా ప్రత్యక్షంగా చూసినపుడు… ఆ వేదన, దుఃఖం కలగలిసి గుండె రగిలినపుడు రాసుకున్న కథే ఈ జజ్జనక. పాలకులు అందించాల్సిన విద్య, ఉద్యోగాల బాధ్యత నుంచి పాలకులు తప్పించుకున్నపుడు, ఉద్యమంలో పాల్గొన్న ఒక ఉద్యమకారుడి గుండె రగిలితే పుట్టిందే ఈ కథ.

మారుతున్న విలువలు…

(జాయి జాదులు                       -కొట్టం రామకృష్ణారెడ్డి)

విలువలు మారుతున్నాయి. విలువలు పోతున్నాయి. విలువలు మారిపోతున్నాయి. రోజురోజుకు భూముల విలువలు మారిపోతున్నాయి. వ్యతిరేక దిశలో మానవీయ విలువలు కూడా మారిపోతున్నాయి.

కులమతాలకతీతంగా పూర్తి స్థాయిలో బంధాలు పిగిలిపోయాయి, అనుబంధాలు చిట్లిపోయాయి. అనుబంధాలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు అడుగంటిపోయాయి, అంతరించిపోయాయి.

మనుషుల మధ్య ఆస్తులు, అంతస్తులు కట్టిన గోడలు అంతకంతకు నిలువుగా, అడ్డంగా పెరిగిపోతూనే ఉన్నాయి.

అసలు మనిషి తానేం పోగొట్టుకుంటున్నాడో, తానేం విడిచిపెడుతున్నాడో, తానెంతకు దిగజారిపోతున్నాడో ఎప్పటికైనా తెలుసుకుంటాడా?

నిత్యం చుట్టూ, ప్రతి ఇంట్లో మారిపోతున్న విలువలు ఈ ‘జాయిజాదులు’ కథ రాయకుండా ఉండనంతగా వేధించాయి. రాయించాయి.

***

పెళ్లి సమాజం కోసమే కాదు…

(సుభాషిణి పెళ్లి                   -వి.శీ.)

పట్టణీకరణ నేపథ్యంలో పల్లెలు పట్నాలకు వలసబాట పట్టాయి. పట్టణాల్లో ధనిక, ఎగువ మధ్యతరగతి ఇళ్లకు పనిమనుషుల అవసరం అధికమైంది. ఇంటిపని సక్రమంగా చేసేవారి కోసం వెతుకులాట మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పనిమనుషులుగా పని చేస్తున్న నిరుపేద ఆడమనుషుల మానసికస్థితి, వారి ఆలోచనలు, ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనే ఆలోచనలోనుంచి పుట్టిన కథ ఇది. పెళ్లి ఇచ్చే సామాజిక భద్రత(Social Security)ని మించి వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల అవగాహన, తన ఇష్టాయిష్టాల మీద గౌరవం కలిగిన స్త్రీలకు ‘సుభాషిణి’ ఒక నమూనా.

పెళ్లి చేసుకోవడమనేది సామాజిక ఆమోదం కోసమే కాకూడదని, ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం కలిగాక పెళ్లి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నమ్మిన వ్యక్తి సుభాషిణి. తన చాకచక్యంతో అటు యజమానుల్ని, ఇటు తనకు వరసైన వాడిని దారికి తెచ్చుకోవడం ఈ కథలోని అంశం.

***

హెచ్. ఆర్. పెళ్లి చూపులు…

(సూర్యుడి నీడలు                      -కె.వి.మన్ ప్రీతమ్)

అమెరికా లాంటి అగ్ర దేశాల్లో వచ్చిన ఆర్థికమాంద్యం వల్ల, పడిపోయిన రూపాయి విలువతో, మన దేశంలోని చాలా కంపెనీలు కొన్ని లక్షల మంది సాప్ట్వేర్ ఇంజనీర్లను ఉద్యోగాల నుండి తొలగించారు. గత సంవత్సరం మొదలైన రిసిషన్ ఇప్పటి వరకు తెలియకుండా అందరి మీద ఏదో ఒక రకంగా ప్రభావం చూపిస్తూనే ఉంది. ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందడానికైనా, తొలగించడానికైనా హెచ్.ఆర్ ప్రమేయం లేకుండా అయితే జరగదు. అలాంటి ముఖ్యమైన పాత్ర గల ఓ లేడీ హెచ్.ఆర్ కి, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కి ఇంటర్వ్యూ తరహాలో జరిగే పెళ్లి చూపులే ఈ కథ.! ఐటీ వ్యవస్థలోని మార్పులు, అవి వ్యక్తిగత జీవితాలపై చూపిస్తున్న ప్రభావాలు, ఆ లేడీ హెచ్.ఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరి జీవితంలో మలుపు తిప్పుకోబోతుంది అనేది అసలు కథ. స్వయంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవడంతో నా చుట్టు ఉన్న జీవితాలే ఈ కథలో పాత్రలకు ఇన్స్పిరేషన్. ఈ కథను ప్రచురించిన ‘సారంగ‘ సంపాదకులకి, తెలంగాణ కథ ‘దురస్తు‘కి ఎంపిక చేసిన సంపాదకులకి కృతజ్ఞతలు.

***

నా భూమి…నా హక్కు

(భూమి పట్టా                           -బద్ది గణేష్)

తెలంగాణ, భూపోరాటానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు భూమికోసం, భూమి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరుగుతునే ఉన్నాయి. నాడు పోరాటల ఫలితంగా దొరలు, భూస్వాముల నుంచి భూములు గుంజుకోని రైతులకు ఇప్పించారు. ఆ భూమిహక్కులపై చట్టబద్దత ఏర్పడలేదు. ఆనాటికి ఉన్న పరిస్థితులు అలాంటివి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారిన చిన్న కమతాలు, తక్కువ భూమి ఉన్న రైతులకు ఇప్పటికి చాలా వరకు వాటిపై హక్కులు పొందలేదు. ప్రభుత్వాల, అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది!. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ భూమి సమస్యలను పరిష్కరించడానికి సవరించడానికి 2020లో ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. భూముల వారసత్వ హక్కును,  రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం అవుతుందని రైతులు అనుకున్నారు.  కాని అశించిన ఫలితాలు రాలేదు!. ఎక్కువ మొత్తంలో గ్రామాల్లో భూమి కొనుగోళ్లు కాగితాల మీదనే జరిగాయి. నిరక్షరాస్యతతో రైతులు దీనిపై దృష్టి సారించలేకపోయారు.  దీంతో కబ్జాలో ఒకరుంటే మరొకరి పేరు మీద భూమి నమోదై ఉండడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ కిరికిరి పరిష్కరించుకోవడం  కోసం రైతులు కాళ్లు అరిగేలా ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగిన పరిష్కారం నోచుకోలేక రైతుల ప్రాణాల మీదకే వస్తుంది. అయితే  ఇదే అదనుగా భావించిన కొందరు  బలవంతులు బలహీనుల భూములను తమ పేరు మీద మార్చుకొని దర్జాగా అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. కష్టాన్నే నమ్ముకొని భూమి సాగుచేసుకుంటున్న రైతులు ఆ ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు.  తాజాగా ఈ నేపథ్యంలో రాసిన కథే  ‘భూమిపట్టా’. ఈ  కథలో రత్తయ్య భూమి పట్టా చేసుకోవాలని ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతాడు. ఈ నేపథ్యంలో రైతయ్య ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటాడు? ఎసొంటి అనుభవాలు ఎదురైతాయి? సమస్య పరిష్కారం అవుతుందా? చివరికి తన భూమికి పట్టా సాధిస్తాడా? అనే కోణంలో కథ సాగుతుంది.

***

నా కథ…చేతి వృత్తుల చిత్రిక

(సారె ..            – సాగర్ల సత్తయ్య)

ప్రపంచీకరణ నేపథ్యంలో  విధ్వంసం అవుతున్న చేతివృత్తులను చిత్రిక పట్టిన కథ సారె. కుమ్మరుల దైన్య స్థితిని  కళ్ళకు కట్టి చూపించింది. కులవృత్తి పట్ల రెండు తరాల మధ్య సంఘర్షణను చిత్రించింది. నేటి ఆధునిక కాలానికి అనుకూలంగా మారాలని, ఉపాధి  కల్పించలేని కులవృత్తిని వదులుకోవాలని భావించే ఓ కొడుకు, కులవృత్తిని వదులుకోలేక ఉన్న ఊరిని విడిచి పట్నం వెళ్లలేక మదనపడే ఓ తండ్రి మానసిక స్థితిని చిత్రించడం ద్వారా  సారె కథ  నేటి సమాజ  వాస్తవస్థితికి దర్పణంగా నిలిచింది. తెలంగాణ జీవద్భాష ఈ కథకు మరొక ఆకర్షణ.

కళ కోసం కలవరింత

(రావుల కిరణ్మయి – అలుకు పూత)

నాయీ బ్రాహ్మణుల ఆశ్రిత కులమైన అద్దపుసింగుల పై ఎం.ఫిల్ పరిశోధన చేసినపుడు ఆశ్రిత కులాలను గురించిన ఆసక్తికరమైన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారు తరతరాల నుండి వస్తున్న సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణయే పరమావధి గా ఇప్పటికీ ప్రాకులాడడం, కాకతాళీయంగా విశ్వబ్రాహ్మణ ఆశ్రిత కులమైన రుంజ కళాకారుడి పరిచయం, కనుమరుగైన ఆ కళను తలచుకొని ఆ ఇంటి పరిస్థితుల ను ఆసరాగా చేసుకొని జానపదుల ఆత్మగౌరవం, తండ్లాటల నేపథ్యంగా రాసిన కథ “అలుకుపూత”

 

‘బోన్గిరి టూ లష్కర్’ – ప్రభాకర్ జైని

‘లష్కర్’ అన్న పేరు వినంగనే ఎన్నో మధుర స్మృతులతో పాటు గుండెను కోసే ఎన్నో విషాద సంఘటనలు గుర్తుకొస్తయి. మా అమ్మమ్మోల్ల ఊరు ‘జనగామ’. నా చిన్నప్పుడు ‘తాతిల్లు’ ఇయ్యంగనే, జనగామకు ఉరుకుడే. ఒక కథ రాయాలంటే, అందులోని పాత్రలలోకి రచయిత పరకాయ ప్రవేశం చేయాలి. తనలో నిక్షిప్తమైన సంవేదనలను, పాత్రల ద్వారా బహిర్గతం చేయాలి.

నేను ఈ కథ రాయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒక సమకాలీన సమస్య – కస్టమర్లు లేనప్పుడు సేల్స్ గర్ల్స్ కుర్చీలలో కూర్చునే హక్కు ఉంటుందని – తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంఘటనను హైలైట్ చేయాలనుకున్నాను. ఆ నేపథ్యానికి – నా బాల్యానికి సంబంధించిన సంఘటనలను, నా జీవన ప్రయాణంలో నేను గమనించిన, కథాంశాలను – జోడించి ఒక కల్పిత కథను ఊహించుకున్నాను. దీనికో పోరాటాన్ని జోడించాలని ఒక కథానాయికను రూపు దిద్ది ఆమె ద్వారా కథను నడిపించాను. కథతో పాటు, కథానుగుణంగా కొన్ని సమస్యలను – నిరుద్యోగం, పేదరికం, హైదరాబాదు నగర జీవితం, దుకాణుదారుల ఆగడాలను, హైదరాబాదు నగరం కొన్ని లక్షల మంది ఆకలిదప్పులను తీరుస్తుందనే నిజాన్ని – ప్రస్తావించాను. ‘ఉత్తమ పురుష’ మాధ్యమంలో కథ నడిపిస్తే నాకు సౌలభ్యంగా ఉంటుంది, పాఠకులను కూడా కట్టి పడేస్తుంది. ఆ విధంగా, ‘బోన్గిరి టూ లష్కర్’ కథ ఊపిరి పోసుకుంది.

రైతు పరిస్థితి పెనం మీంచి పొయ్యిలోకి అయింది: గాజోజు నాగభూషణం

వేలాదిమంది విద్యార్థులు, యువకుల బలిదానాలతో తెలంగాణ వచ్చింది. మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఏలుబడిలో ఉంది. రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాలు అమలు చేసినప్పటికీ, ధరణి పోర్టల్ లో అనుభవదారుల కాలం తొలగించడం వల్ల ఎందరో రైతులు తమ భూమిపై హక్కులను కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీనితో పెనంమీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది రైతు పరిస్థితి. నిరక్షరాస్యత వల్ల ఎప్పుడో కొన్న భూములు రెవెన్యూ రికార్డులోకి ఎక్కించుకొనే సోయి లేక వాటిపై హక్కుల్ని కోల్పోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

మా మిత్రుడు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొని ‘కడుపు కట్టుకొని, అందరి కోరికలు చంపుకుని, ఏదో బతుకు నెట్టుకు వస్తుంటే ఇవ్వాల నా భూమి నాది కాదంటే నేను ఏడ బోవాలి. సావు తప్ప ఇంకో మార్గం లేదు’ అని భోరున ఏడ్చినప్పుడు ఈ కథను రాయడం జరిగింది.తెలంగాణలో జరిగిన అనేక పోరాటాల ద్వారా బీదలకు పంచిన భూములు కూడా ఒకనాటి భూస్వాముల పేరున ఉంటున్నాయి.ఈ సమస్య రైతు మెడ మీద వేలాడుతున్న కొత్త కత్తి.
నూతన ప్రభుత్వంలోనైనా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుందాం.

*

చందు తులసి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆణిముత్యాలన్నీ ఏర్చికూర్చిన దురస్తు కథాసంకలనం తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు,ఆచారవ్యవహారాలకు,మనుషుల తండ్లాటకు అద్దమని రేపటి తరానికి దిక్సూచి లాంటిదని చెప్పడానికి గలుమట్ల ఈ సమీక్ష. అభినందనలు సర్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు