ఫిల్టర్ లు లేని అసలు సిసలు ముఖం

“కవితా! ఓ, కవితా!” కొత్త కవిత్వ సంపుటాలని పరిచయం చేసే వేదిక.

వునిప్పుడు
మాట్లాడుతోంది నేనే

బలహీనతల వల్లెవేతకు స్వస్తి చెబుతూ
నిలువరింతల దిక్కుల్ని చీల్చుకుంటూ
అస్తిత్వ తంత్రిని మీటుతూ
కొత్త రాగాల స్రవంతిని అవుతున్నదీ నేనే
..
సగం సగంగానో
నిశ్శబ్ద శబ్దం గానో
అర్థ అర్థాల పార్శ్వంగానో
అల్పపీడన వాక్యం గానో
మాటల నిండా నేనే ఉంటాను’ – సుధా మురళి

‘తడి ఆరని వాక్యమొకటి’ – కొత్త పుస్తకం. నిజంగా ఓ కొత్త మస్తకం. కొత్త ఆలోచనా సరళి కొంగొత్త వ్యక్తీకరణ. పోలికకు ఒదగని స్వతంత్ర అభిభాషణం సుధా మురళి సొంతం. కవులందరిలాగే నిలువనీయని ఉక్కపోత నుంచే ఈమె రాయడం మొదలెట్టింది. పెల్లుబికే నిస్సహాయత నుంచి పద్యం పుట్టటం ప్రత్యేకత. పద్యాన్ని మాత్రం నిస్సహాయను చేయలేదు. వెన్నెముక తో నిటారుగా నిలబెట్టింది. తెర మాటు నుండి కాదు. మాట వెనుక నక్కి కాదు. సూటిగా సంధించి వదిలిన బాణంలా భావాల్ని ఎక్కుపెట్టి వదిలింది‌.

‘మా శీలాలను మేమే రద్దు చేసుకుంటాం’ లో పలికించిన కరుకైన ప్రతిఘటన స్వరం అత్యంత నిస్సహాయ స్థితి నుంచి వచ్చిందే. వరుస అన్యాయాలు, న్యాయం దక్కాల్సిన చోట మరింత అవమానాలు, ప్రబలుతున్న అమానవీయతలను దర్శిస్తూ సంఘర్షణకు గురైన గొంతు పెగుల్చుకున్న ప్రతిఘటన ఇది.

‘కలల సమాధిపై నిర్మించబడ్డ పొదరిల్లు’ అంటూ ఈమె కవిత్వానికి కొత్త నిర్వచనాలు ఇచ్చింది. ఈ కవిత్వంలో నవ్వుకు నానార్థాలు. శోకానికి సర్వనామాలు. మనిషి గుణానికి అనేక విశేషణాలు. ప్రవర్తనకు పర్యాయపదాలు. మొత్తంగా ఈమె కవిత్వం కొత్త వ్యాకరణం తొడుక్కుని ఆల్రెడీ సెట్ చేసిన కొలమానాల నుంచి కాస్త సైడ్ తీసుకుని నిలబడుతుంది.‌

ప్రశ్నించడం స్పందించడం కనుమరుగై అలసత్వం స్తబ్దత ఆవరించిన మెదళ్ళలో కాస్త కదలిక కోరుకుంటోంది.

‘ఇప్పుడు లేళ్ళు తాబేళ్ళవుతున్నాయి’ అని బద్దకాన్ని తట్టి లేపుతుంది.

‘రక్తం ఉడకాల్సిన చోట
భయం మంటపై మానం కుతకుతలాడుతోంది
జవాన్ని చంపుకున్న జీవం
కబోది బతుకు బతికేస్తోంది’ అంటూ పేరుకున్న స్తబ్దతను పెకిలించే ప్రయత్నం చేసింది.

‘మాటలెందుకు నిశ్శబ్దాన్ని మాత్రమే ఉచ్ఛరిస్తున్నాయో’ ఇక్కడ మాటలు మౌనాన్ని తొడుక్కోలేదు, నిశ్శబ్దాన్ని ఉచ్ఛరిస్తున్నాయి. ఉచ్ఛరించేదే నిశ్శబ్దం అయినప్పుడు ఆ మాటలు పెగిలేదెన్నడు‌!?

కులాలుగానో మతాలుగానో ప్రాంతాలుగానో దేశాలు గానో భాషలుగానో భావాలుగానో మనుషులు చీలిపోతున్న వైనం ఈమెలో వేదన రగిలిస్తుంది. గాలన్ల కొద్దీ దుఃఖాన్ని పెంచుతున్న దేశాన్ని సమాజాన్ని ఇంకెట్లా నిరసించాలని పదే పదే ఆందోళన పడుతుంది‌. ఆందోళనకు పరిష్కారాన్నీ వెతుక్కుంటుంది.

‘ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం
నీ రక్తాన్నీ నా నెత్తురునీ
పరస్పర తర్జుమా చేసుకుందాం’ అని పిలుపునిస్తుంది.
‘రా చెరో స్వేదాన్ని ధారపోద్దాం
ఈ మట్టి నీదీ నాదీ
దోచుకో చూస్తున్న మూడో వాణ్ణి ఇద్దరం కలిసి ఎదుర్కొందాం
ఈ గాలి నీకు ఊపిరి నాకు జీవం
కలుషితం చేయచూసే ఆ పొగను పొమ్మని చెబుదాం”నువ్వెవరి మంత్రాలు వల్లె వేయక్కర్లేదు నేనెవరి దారిలోనో పూలు చెల్లించనవసరం లేదు’ నువ్వూ నేనూ ‘అవిభక్త మనుషులమవుదాం’ లో మత ప్రతీకలు ఎవరి గురించి మాట్లాడుతోందో రివీల్ చేసాయి. దాంతో ఈ కవిత గొప్పతనం కొద్ది కొద్దిగా అర్థమవటం మొదలవుతుంది.

‘స్వధర్మాభిమానం ఒక సాకు పరధర్మ కూల్చివేతకు తెగబడిన తేనె పూసిన కత్తి’ అని ‘మతభంగాల’ గుట్టు విప్పుతుంది. ‘సామరస్యాన్ని నేర్పలేని మతగ్రంథాల్లారా సజీవ సమాధుల్లోకి దూరిపొండి’ ‘నేనీ దేశపు గర్వాన్ని ఒకప్పుడు ఇక్కడ మతం ఉండేదట అనే మాటకై వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను’ అనే ఆకాంక్ష ను వ్యక్తం చేస్తుంది.

రణరంగం లేని చోటు లోకాన లేదన్నట్టు,
మనుషుల్ని వేరు వేరుగా విడదీసి ఒంటరులను చేసే కులము-మతము, స్త్రీ పురుష అంతరాలు, ఆధిపత్య పోకడలు, బంధాల్లోని దూరాలు ఈమె మనసును క్షణక్షణం రణరంగం చేశాయి. ‘ఖండిత’ కవితలో ఎదర శత్రువును నిలబెట్టి దునుమాడుతున్నట్టు వాక్యాలు విలయ తాండవం చేసాయా అన్నట్టు రాసింది.

‘మడికట్టుకున్న నా దేహం’ అంటూ అగ్రవర్ణ మగువ ఆత్మ ఘోష వినిపించిన కవిత నాణేనికి మరోవైపును పట్టిస్తుంది. వర్గమేదైనా వర్ణమేదైనా ఈ దేశంలో మగువ స్థానం దిగువే. ఎక్కడైనా ఆమె బలిపీఠం పైనే.

ప్రతి రచనకు స్థలమూ కాలమూ ఉంటుంది. ఈమె కవిత్వానికి ఆ నిర్దిష్టతను అంచనా కట్టాల్సిన అవసరం కనపడదు. ప్రాసంగికత కలిగి ఉండడం అందుకు దోహదపడింది. తక్షణ స్పందనలుగా ప్రకటించిన కవితల్లోనూ ఆ ప్రాసంగికత ఉండడం గమనార్హం. ‘పైపై తాకుళ్ళ వేటతో కోల్పోనిదా శీలం!?’ అని తీక్షణంగా ప్రశ్నించిన ‘పచ్చిగాయం’ కవిత అలాంటిదే. దుస్తుల పై నుంచి తాకారు కనుక లైంగిక వేధింపుల కిందకు రాదని న్యాయస్థానం కేసును కొట్టివేసిన సందర్భంలోనిది.
నెలసరిలో ఉన్న మహిళ చేతివంట తినరాదన్న చినజీయర్ అనుచిత వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రాసిన కవిత ‘సిగ్గేస్తోందా’. ఒకవేళ ఈ సందర్భాలు తెలియని పాఠకులు చదివినా కవిత నిర్వహించిన తీరు వల్ల విషయంతో రిలేట్ అవుతారు. ఈ కవితలో కవి కనబరిచిన ఫోర్స్ కు అల్లల్లాడిపోతాం. ఇలాంటి ఫోర్స్ తీవ్రత ఇంకొన్ని కవితల్లోనూ పరుచుకుని ఉంటుంది.

అంతరంగ ప్రపంచానికి బాహ్య లోక వాస్తవాలు అధిక శాతం విరుద్ధంగానే ఉంటాయి. అప్పుడే సంఘర్షణకు పునాది పడుతుంది. ఆడపిల్ల కు ఈ వైరుధ్యం ఇంకొంచెం ఎక్కువ అనుభవంలోకి వస్తుంది. ‘ఆడపిల్లకే పెళ్ళీడెందుకొచ్చింది’ కవితలో ఒక వయసు రాకముందు నుంచే ఆమె ఆడ’పిల్లవడం గురించి ఆమే ఎందుకిలా అనే ఆవేదన వినపడుతుంది. ఆడపిల్లను ఆమె స్వేచ్ఛను హరించి మరీ రక్షించుకోవలసిన అగత్యాన్ని అమ్మ మనసుతో రాస్తుంది.

‘కొవ్వొత్తుల కుత్తుకల పై వెలుగును చూసి బెంబేలెత్తుతున్న విఫలను’ అంటూ నిర్భయ దిశ అనేక సంఘటనల్లో అమానుష చర్యలు ఆడపిల్ల తల్లిని ఎంత భయానికి గురిచేస్తున్నాయో చెప్తుంది.

‘ఆగదు ఏదీ
నీ చే లోకం పుట్టటం
నీదన్న అస్తిత్వం అక్కడ గిట్టడం’ అంటుంది మరో కవితలో

Women’s day రోజుల్లో స్త్రీలను ప్రశంసల్లో ముంచెత్తే పురుషలోకాన్నుద్దేశించి- స్త్రీ ఎంతటి అవమానాలు సహిస్తుందో ఎంత వేదన అనుభవిస్తుందో పురుషుడికి తెలియాలంటే ఆ ఒక్క రోజు లింగమార్పిడి జరగాల్సిందే అంటుంది‌.

‘అల్లుకున్న తీగవంకే అందరి దృష్టి
ఆ పై
నవ్వుల పూవులు పూస్తోందో
ఎండమావి ఆకులు రాల్చుకుని
ఒట్టి కట్టెగానే మిగులుతోందో
ఎవరా దిక్కుకు తలతిప్పి చూసేది’ బంధాలలో ఒదిగిన ఆమె ఎంతో ఒంటరో తెలియజేస్తుంది.
బంధాల్లో ఏర్పడే ఖాళీ, ప్రేమ దప్పిక తీరనితనంలోని పెయిన్ నూ సమర్థంగా కవిత్వం చేసింది‌

‘చాలా జాగానే మిగిలింది
నీకూ నాకూ మధ్య
చెరో గుప్పెడు మాటల్ని తీసుకొచ్చి పరిచేద్దాం’ అంటుంది ‘మాట’ లో

మోహ పడడం భంగపడడం మరపుకోసం ప్రయత్నించడం ఈ అనుభవం నుంచి పాఠం నేర్చుకునే విజ్ఞత పనిచేయనితనం మరల మోహపడడం అంతా ఓ సర్కిల్ లా ఈ చర్య రిపీట్ అవుతుంది. ‘మోహమూ మరపు జూదం’ అనేస్తుంది.

చీకటి అలుముకున్నప్పుడే చంద్రుని అందం ఇనుమడిస్తుంది. అది లేకపోతే ఊహించడం కష్టం. అలానే దుఃఖపు చీకటి అద్దుకుని వెలిగిపోతున్న జాబిల్లి సుధ కవిత్వం.

‘తేలిపోవాల’ ఆడ మగ ఇద్దరిలో ఎవరు గొప్పో తేలిపోవాల అంటూనే ఒకరు లేనిది మరొకరు సాధ్యం కాదు అనే విషయాన్ని.. వేరు వేరు అవయవాలు విరుద్ధ విధులు సృష్టిలోనే దాగుందన్న నిజాన్ని ఆలోచింపజేస్తుంది‌.
పై వాస్తవాన్ని పక్కనపెట్టి ఆధిపత్యాన్ని ప్రదర్శించే పురుషులను చీకటితో పోలుస్తుంది ‘విరాగిని’లో. ఇక్కడ వెలుగు స్త్రీ. వెలుగుకు తానే కారణమని మీసం మెలేస్తోందట చీకటి. ‘ఆ వెలుగును వెలిగించే హృదయాలేవీ ఏం మనుషులకూ పుట్టలేదని ఎప్పుడు అర్థం అవుతుందని’ ప్రశ్నిస్తుంది. ఇదీ వాస్తవమే.
‘యత్ర నార్యస్తు పూజ్యంతే ఎన్ని నోళ్ళల్లో నానిందో చినికి చినికి పీలికలు అయ్యింది’ అంటుంది.

ఈ వస్తువులు ఈమే కొత్తగా రాసిందేమో అనిపిస్తాయి కొన్ని కవితలు:
నిర్వాణ – ‘తల్లి కావటం వరమే కానీ తల్లి కాకపోవడాన్ని పాపపు ఖాతాలో వేయొద్దంటుంది’ అలాగే
‘వందల మాతృత్వ కణాలు ఒక్కటై
ఉరేస్తున్న గుండెను బతికించుకోవడం
నవ్వులతో ప్రశ్నల్ని తప్పించుకోవడం
ఇప్పుడేదీ అంతా తేలిక కాదు
ఈ బాధను ఎవరూ సరితూచలేరు’ తల్లికాలేకపోయిన మగువలందరి తరఫునా గళమెత్తుతుంది.

‘ట్రాష్’ కవిత ott ల్లో ప్రసారమయ్యే నగ్నత్వానికి అంబాసిడర్ లాంటి ప్రోగ్రామ్స్ మీద – ‘బద్మాష్.. ఇక్కడ అందరికి అందరం వాణిజ్య సముదాయాలం. కోరికల గుర్రాల్ని అరచేతిలో మేపుతున్న అభినవ ఆదర్శాలం’ ఛర్నాకోల ఝళిపిస్తున్న వాక్యాలుంటాయి. కొన్ని సందర్భాల్లో పదాలన్నీ పచ్చితనం నిండి ఉంటాయి. అయితే ‘దిగంబరతకు అనగ్నతకూ అభేదం పాటించింది సుధ’ అని ముందుమాటలో ప్రసేన్ మాట వందశాతం కరెక్ట్. అందువల్లే కవి చెప్పదలుచుకున్న విషయంలోని వేదనే పఠితులను తొలుస్తుంది కానీ ఆ పచ్చితనం కాదు.

‘ప్రేమలన్నీ ఒకేలా ఉండవు’ – కవిత మరో భిన్నమైన పార్శ్వం.
‘ఒక్కొక్క రేకు విడిపోయాక కూడా
పువ్వును సుగంధం అంటి పెట్టుకునే ఉంటుందేమో కానీ
ఒక్కొక్క మమతా విరిగిపోయాక
బతుకు రెట్టింపు బరువు తూగుతుంది
అవును –
బాల్యం యవ్వన వృద్ధాప్యాల సాక్షి గా
ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు ఉబ్బుగానూ
బల్లపరుపుగానూ
అథఃపాతాళ దిశగానూ
జారిపోతుంది’

‘కొత్తగా కన్నీరయింది. కొత్తగా తేల్చేసింది‌. కొత్తగా చీదరించుకుంది. ఆ కొత్తదనమే సుధామురళి కవిత్వం అయింది’ అన్నారు ముక్కామల చక్రధర్. అదే కొత్తదనం నేనూ ఫీలయ్యాను. సుధ కవిత్వం చదువరికి భిన్నమైన అనుభూతిని పంచుతుంది. ఒక రొటీన్ నెస్ నుంచి పక్కకు జరిగి ఆలోచించేలా చేస్తుంది. Exterior గా interior గా మనిషి గురయ్యే అనేక అవస్థలు సంక్లిష్టతలు అక్షరరూపం లో దర్శనమిస్తాయి. వ్యక్తీకరణలో ఈమె Transparency మనల్ని చకితుల్ని చేస్తుంది. వాక్యాల్లో ఏ ముసుగు లేనితనం చూసి ఇంత పారదర్శకత మనకి సాధ్యమేనా అని చెక్ చేయిస్తుంది. అదంతా కవి నిజాయితీ అంటాన్నేను. నిజాలను వెల్లడించడానికి వెరవనితనం. ‘తడి ఆరని వాక్యమొకటి’ సుధా మురళి మొదటి కవిత్వ సంపుటి. మార్చి 2 వ తేదీ ఆవిష్కరణ. అంతకంటె ముందు ఆమె కవిత్వ స్వరాన్ని, కవిత్వ కాంట్రిబ్యూషన్ ను పరిశీలించి ‘రాధేయ కవితా పురస్కారం – 2025’ ప్రకటించడం ఈమె కవిత్వానికి కితాబు.

‘నా అక్షరాల్లోని అన్నివేదనలు నావి కావు, కానీ అన్ని వేదనలలోనూ నేను ఉన్నాను’ అంటుంది సుధ. ఇలా పరాయి దుఃఖాన్ని సొంతం చేసుకునే లక్షణం. ఇది చాలదూ ఓ కవికి.
ఇంతకీ ఈమె కోరుకునేదంతా –
‘ఎవరిదైనా ప్రాణమేననే
పసితనపు హృదయ చాంచల్యాలు
ఎవరి మరణాన్నైనా
శోకించగల దుఃఖిత విశాల నయనాలు’

ఈ సంపుటిలో తొంభై కు పైగా కవితలున్నాయి‌. నేను పంచుకుంది పావు వంతు. మాట్లాడాల్సింది చాలా మిగిలే ఉంది. చర్చించేందుకు చాలా విషయం ఉంది. చదవాల్సిన లిస్ట్ లో చేర్చుకోవలసిన పుస్తకం.

*

ఫణిమాధవి కన్నోజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సూటిగా ఉన్నదున్నట్లు రాసే కవి సుధ. తనకి ధైర్యమూ ఎక్కువే. కవిత్వ లోతుల్ని , వస్తు విస్తృతిని, దృక్పథ స్పష్టతను, అభివ్యక్తి లో నవ్యతను చక్కగా విశ్లేషించారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు