ఎల్లప్పుడు చలాకీగా ఉండే ఇబ్రహీంలో అలాంటి ఒక మార్పు వస్తుందని ఎవరు గుడ ఊహించి ఉండరు. అతన్ని దగ్గరగ చూసిన వాళ్లు నోటి మీద వేలేసుకుంటున్నరు. ఆ ఇబ్రహీమే ఈ ఇబ్రహీం అంటే వాళ్ల మనసు ఒప్పుకునేటట్టు లేదు!
*
టైలర్ ఇబ్రహీం అంటే ఆ ఏరియాలో షానా ఫేమస్. మస్తు చలాకీ మనిషి. తను నవ్వుతు అందర్ని నవ్వించే స్వభావం. వచ్చే పోయే వారిని పలకరించడం, వరుసలు కలుపుకోవడం, మంచి చెడ్డలు అర్సుకోవడం అతని అలవాటు. ఒక్కసారి అతని దగ్గరికి బట్టలు కుట్టించుకుంటానికి వచ్చిన వాళ్లు మల్ల ఇంకెవల కాడికి పోరు. మాటలతో మనుషులను ఎంత జల్ది కలుపుకుంటాడో అంతే స్పీడ్‌గ బట్టలు కుట్టిస్తడు. ఎట్ల కావాలంటే అట్ల కుట్టిస్తడు. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తడు. ముఖ్యంగ అమ్మాయిల బట్టలు వెరైటీ వెరైటీగా కుట్టి వాళ్లను ఖుషీలో ముంచెత్తుతడు.
అతని కుట్టుడు నైపుణ్యం గురించి విన్న ఒక ఆయేషా నాలుగు బస్తీలు దాటుకొని ఇతన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఒక అమ్మాయికి వెరైటీగా మూడు జతల బట్టలు కుట్టడం గురించి ఆమె దెవులాట ఫలించింది. ఇబ్రహీం ఆల్రెడీ కుట్టిన కొన్ని ఫరాఖ్‌లు పైజమాలు ఆయేషాకు నచ్చినయి. అంతకన్నా ఎక్కువ ఇబ్రహీం నమ్మక్‌దార్ చెహ్రా, హస్కీ వాయిస్, వ్యంగ్యం గానీ ద్వంద్వర్థాలు గానీ లేని చలాకీ మాటలు ఆయేషాను కట్టి పడేశాయి. దాంతో ఆమె తాను కుట్టవలసిన బట్టలు కూడ ఇబ్రహీంకే కుట్టడానికి ఇస్తూ ఆ వంకన అతన్ని చూడడానికి, అతనితో మాట్లాడడానికి ఎక్కువగా రావడం మొదలుపెట్టింది.
ఆమె కనిపించగానే ఇబ్రహీం తనదైన తీరులో ‘క్యా మొహత్రమా! క్యా లేకే ఆయేహో.. ఔర్ క్యా లేకే జాయేంగే?’ అంటు ప్రతిసారీ కొత్త కొత్త పలకరింపుల్లో ఉత్సాహపరుస్తుంటడు.
‘కుచ్ లేకే ఆయి నహీ.. ఔర్ కుచ్ లేకే జావుంగీ భీ నహీ ఇబ్రహీం సాహబ్! తుమ్ సౌదాగర్ నహీ.. ఔర్ మురేa సౌదా కర్నా ఆతా భీ నహీ..’ అని నవ్వేది ఆయేషా, తాను కూడ కొత్త కొత్త జవాబులు వెతుకుతూ..
అట్లా ఇష్టంగా ఆయేషా ఇబ్రహీంతో ముచ్చట పెట్టడమే కాకుండా అతని ఇంట్లో అందరినీ కలివిడిగా పలకరించేది.
‘‘ఆంటీ! క్యా కర్రే?’’ అంటూ లోపలికి వెళ్ళేది. వాళ్లమ్మ పాన్‌దాన్ పక్కన పెట్టుకొని పాన్ చేసుకుంటూనో, పాన్ నములుతూనో టీవీలో పాతతరం సీరియల్స్ చూసుకుంటా మంచంపై కూసొని ఉండేది. ఆమె ఆయేషాను చూసి సంతోషపడేది. ‘ఆవో మాఁ..’ అంటూ మంచంపై చోటిచ్చేది. ఇద్దరు కాసేపు అవో ఇవో మాట్లాడుకునేవాల్లు. ఇబ్రహీం చిన్న చెల్లె మసూదా ఇంట్ల ఉన్నప్పుడు తనతో స్నేహంగ మాట్లాడేది. బయటికి వస్తు ‘జాతీ హూఁ.. ఆంటీ!’ అనేది. మరోసారి ఇబ్రహీంను తనివితీరా చూస్తూ ‘బట్టలు ఎప్పుడు ఇస్తావు’ అంటూ అడగాలి కాబట్టి అడిగి ‘పరవానై, కుచ్ జల్దీ నై!’ అనుకుంటూ ‘జాకే ఆతిమ్ ఇబ్రహీం సాహబ్’ అంటూ ఎల్తుంటది.
అప్పటిదాకా ఆమెను అంతగా చూడని ఇబ్రహీం ఆమె వెళ్లిపోతుంటే మాత్రం తదేకంగా చూస్తుంటడు. ఒకసారి రయ్యిన వెనక్కు మళ్లి చూసింది ఆయేషా. ఘబ్‌రాయించి తల దించి మిషిన్ కుట్టుకుంట ఉండిపొయిండు. చిరునవ్వుతో వెళ్లిపొయింది ఆయేషా.
అట్లా వారి మధ్య మౌన ప్రేమ నడుస్తూ ఉండేది. కానీ ఏనాడూ స్పష్టంగా మాట్లాడుకోనే లేదు.
ఇబ్రహీంకు ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లె మ్యారేజయి ఉండే. ఆయేషా పరిచయం అయ్యేనాటికి రెండో చెల్లెకు సంబంధాలు చూస్తుండడం వల్ల గుడ వేరే ఆలోచన చేయలేదు. ఆయేషాకు గుడ ఇంట్లో పరిస్థితులు అంతగా బాగలేకపోవడం, ఇంతలోనే మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేకపోవడంతో తొందరపడకపోయేది. కానీ ఆయేషాకు సంబందాలు వస్తనే ఉన్నయి. ఇప్పుడే చేసుకునే ఆలోచన లేదని చెప్పేస్తుంటది. ఇంకెప్పుడు చేసుకుంటవని ఇంట్ల పోరు నడుస్తున్నది.
*
ఇబ్రహీం బస్తీలో ఈ మద్య ఒక మౌలానా కిరాయికి చేరిండు. రోజూ ఇబ్రహీం షాప్ ముందు నుంచే మజీదుకు పోతూ వస్తున్నడు. మొదట్లో అతను దూరంగ కనబడంగనే సూషీ సూడనట్లు పట్టించుకోకుంట
ఉండేది ఇబ్రహీం. అది గమనించిన మౌలానా ఒక దినం ‘అస్సలామలైకుమ్ ఇబ్రహీం సాహెబ్!’ అంటూ పలకరించిండు. ‘వాలేకుమ్ అస్సలామ్ మౌలానా!’ అని జవాబిచ్చి తల వంచేసుకుని బట్ట కుట్టడంలో బిజీ
ఉన్నట్లుండిపొయిండు ఇబ్రహీం. మౌలానా తనను దాటిపోయినంక ఊపిరి గట్టిగా వదిలిండు. టైం చూసిండు. ఏదో ఒక రోజు ఈ ఉపద్రవం తనదాకా రాకమానదు అనుకున్నడు.
అనుకున్నట్లే రోజూ సలాం చెప్పే మౌలానా ఇబ్రహీంతో సలాం చెప్పించుకునే స్టేజీ దాటి ఒక దినం వచ్చి ఎదురుంగ నిలబడ్డడు. గుండెల్లో గుబులైంది ఇబ్రహీంకు. లోపల పనిచేసే వర్కర్‌ను కూతేసి కుర్చీ తెప్పించి ‘బైఠియే మౌలానా’ అన్నడు. గుండ్రటి ఒంటిని కుర్సీలో కుదేసి,
‘‘క్యా ఇబ్రహీం సాహెబ్! నేను రోజూ ఆజ్మాయిస్తున్నా! మీరు మజీద్ దిక్కు మల్లి గుడ సూస్తలేరు.. కమ్‌సేకమ్ జుమ్మా నమాజ్‌కు గుడ వస్తలేరు’’ అన్నడు.
మాటలు తడుముకున్నడు ఇబ్రహీం.
‘‘వైస క్యాబినై మౌలానా! బట్టలు కుట్టడంల బిజీ ఉంటున్నా.. మీరు రానప్పుడు జుమ్మా జుమ్మా పొయ్యేటోన్ని. ఈ మద్యే జర బిజీ ఐన..’’ అన్నడు.
ఇక జుమ్మా ఒక్క పూట నమాజ్ చదవడాన్ని దాటి మౌలానా పెద్ద క్లాసే ఇచ్చిండు. రోజూ ఐదు పూటలు నమాజ్ చదవడం ప్రతి ముస్లింకు తప్పనిసరి అంటూ వివరించి చావగొట్టి చెవులు మూసిండు. తప్పకుండా రావాలి చూడు అంటూ మాట తీసుకుని మరీ లేషిండు. ఆ మాటలు వినీ వినీ అలిసిపొయిండు ఇబ్రహీం. కానీ మౌలానా ఎప్పటి లెక్కనే చట్టచట్ట నడుసుకుంట మాయమయ్యిండు.
‘‘అరె సాజిద్! థోడా పానీ లారే!’’ అని కూతేసిండు ఇబ్రహీం.
ఇక అప్పట్సంది మౌలానా బెడద తగులుకుంది ఇబ్రహీంకు. ‘ఇబ్రహీం సాబ్! నమాజ్ పడ్‌కే ఆయేంగే ఆయియే’ అనేటోడు. ‘నై మౌలానా! జర అర్జంట్ బట్టలున్నై’ అనేటోడు ఇబ్రహీం. అంతదూరం నుంచి మౌలానా కనిపించంగనే లేషి షాప్‌లకు పోయేటోడు. ఒక జుమ్మా రోజు మౌలానా భయానికి తయారై మజీదుకు ఎల్లిండు. ఇతన్ని చూసి షానా ఖుష్షయ్యిండు మౌలానా! ఒకన్ని మార్చగలిగాన్నేను అనే తృప్తి కావచ్చు.
అయాల మజీద్ నుంచి వస్తున్న ఇబ్రహీంకు ఎదురుపడ్డది ఆయేషా!
‘‘అరె ఇబ్రహీం సాబ్! ఆప్ నమాజ్‌కు భీ జాతే క్యా?’’ అన్నది.
‘‘క్యా కరూం ఆయేషా జీ! ఏక్ ముసీబత్ ఆ పడీ హై! మా బస్తీలో ఒక మౌలానా దిగిండు. చంపుకు తింటున్నడు నన్ను. ఆయనకు ఇదే పని. నాకేమో బట్టలు కుట్టే పని ఉంటదంటే ఇంటలేడు’’ అన్నడు.
‘‘అచ్ఛాలో.. ఎప్పుడూ కూసునే బదులు అప్పుడప్పుడు వంగి లేవడం మంచిదే’’ అన్నది ఆయేషా.
ఇద్దరూ నవ్వుకున్నరు.
ఇగ అప్పట్సంది మౌలానా టైం దొరికినప్పుడల్లా రావడం ఇబ్రహీం ముందు కుర్చీ ఏయించుకుని కూసొని దీన్ గురించి చెప్పడం పెరుగుతూ పోయింది. మొదట్లో చికాకేసేది ఇబ్రహీంకు. వాళ్లమ్మకు చెప్పిండు సంగతి. ‘తప్పేముందిరా.. నమాజ్‌కు పోతుండాలని నేను చెప్పలేదా? మొత్తమే దీన్ గురించి పట్టించుకోకుంటే ఎట్లా.. ఆయన చెప్పేది గుడ విను’ అన్నది.
తర్వాత్తర్వాత మౌలానా చెప్పేది వింటూ పనిచేసుకునేవాడు.
ఒకరోజు మౌలానా తన పని చేస్తున్నాడు. ఆయేషా వచ్చింది. ఇబ్బంది పడ్డడు ఇబ్రహీం.
‘‘నా బట్టలు అయినయా?’’ అనడిగింది ఇబ్రహీంను.
‘‘అస్సలామలైకుమ్!’’ అన్నడు మౌలానా తల వంచుకునే ఆమెనుద్దేశించి.
‘‘వాలేకుమ్ అస్సలామ్!’’ అన్నది.
‘‘ఇంకా లేదు ఆయేషా జీ! ఎల్లుండి ఇచ్చేస్తాను’’ అన్నడు ఇబ్రహీం నవ్వు మొఖంతో.
మౌలానా ఇబ్రహీం దిక్కు చూస్తున్నడు.
‘‘ఈ మద్య బట్టలు కుట్టడం లేట్ చేస్తున్నరు.. ఇలాగైతే మేం వేరేవాళ్లను చూసుకోవలసి వస్తుంది’’ అన్నది కావాలనే ఆయేషా.
‘‘ఐసా కుచ్ నై ఆయేషా జీ! ఎల్లుండి ఇచ్చేస్తా’’ అన్నడు ఇబ్బందిగ ఇబ్రహీం. ‘‘అందర్ అమ్మీ అకేలే హై.. పలకరించండి’’ అన్నడు మళ్లీ.
అతని దిక్కు ఒకలాలా చూసి చేత్తో మౌలానాను చూపెడుతూ ఏందీ లంపటం అన్నట్లు సైగ చేసింది.
ఇబ్బందిగ చూసిండు ఇబ్రహీం. కదిలి ఇంట్లకు పొయింది ఆయేషా. ‘అరె, ఎంత హుషారుగ పలకరించేటోడు, మధ్యల ఈ మౌలానా ఒకడు జొర్రిండు, బిర్యానీలో బొద్దింక లెక్క’ అని కసిగ అనుకుంట.
ఆమె వెళ్లంగనే మౌలానా అవాళ కొత్త క్లాస్ ఇచ్చిండు, పరాయి ఆడవాళ్ల కళ్లలోకి కళ్లు కలిపి చూడడం ఇస్లాంలో నిషిద్ధం. తల దించుకుని వారితో మాట్లాడాలి అని.
*
మెల్ల మెల్లగ ఇబ్రహీంలో మార్పొచ్చింది. ఇప్పుడు ఆయేషా కన్నా మౌలానా మాటలే ఎక్కువ వింటున్నడు ఇబ్రహీం. కొన్నాళ్లకు తలపై టోపీ వచ్చి చేరింది. మెల్లగ గడ్డం పెరిగింది.
ఇప్పుడు ఇబ్రహీం ఆయేషా దిక్కు చూడకుండానే మాట్లాడుతున్నడు. ఇదివరకటి జోకులు హుషారు మాయమైనై..!
నిరాశపడిపోయింది ఆయేషా. అయ్యో! ఎలాంటి హుషారైన మనిషి, ఇలా అయిపోతున్నడేమిటి అని బెంగ పడ్డది. ఒకరోజు అతని ముందుకు స్టూల్ లాక్కుని కూర్చొని,
‘‘ఇబ్రహీం సాబ్! మీలో మార్పు మీరు గమనిస్తున్నారా? ఆ మౌలానా వల్ల మీలో అసలైన మనిషి మాయమవుతున్నడు. మీరు ఇంతకుముందు చాలా హుషారుగ ఉండేవారు. ఇప్పుడు ముబావంగ తయారైన్రు. మీ వ్యవహారం నాకు నచ్చడం లేదు. ప్లీజ్! మీరు ఇంతకు ముందులాగే బాగుంటారు ఇబ్రహీం సాబ్! ఆ మౌలానాను వదిలించుకోండి’’ అన్నది.
ఆమె దిక్కు చూడలేదు ఇబ్రహీం.
‘‘అదేం లేదు ఆయేషా జీ!’’ అంటు కాసింత నవ్వు మొఖం మిషిన్ దిక్కే ఒంపి ఊరుకుండిపోయిండు.
కాసేపు మౌనం తర్వాత,
‘‘ఇట్లా అయితే నేను మీ దగ్గరికి రావడం ఎందుకు చెప్పండి’’ అన్నది ఆయేషా.
‘‘అదేంటి, మీ బట్టలు ఈ మద్య టైంకే ఇస్తున్నాను కదా!’’ అన్నడు తల వంచుకునే.
‘‘అంతేనా మీరు అర్దం చేసుకున్నది.. అర్దమైనా ఇట్లా మాట్లాడుతున్నరా..’’ అంటూ చికాకు పడ్డది ఆయేషా! లేషి వెళ్లిపోయింది వేగంగ.
అయినా ఆమె దిక్కు చూడలేదు ఇబ్రహీం. కానీ మనసెందుకో చేదైపొయినట్లు అనిపించింది.
*
కొన్నాళ్లకు ఆయేషా వచ్చేసరికి షాప్‌లో ఇబ్రహీం లేడు. సాజిద్‌ను అడిగితే ఇస్తెమాకు పోయిండని చెప్పిండు.
‘‘నువ్వు కుడుతున్నవా బట్టలన్నీ’’ అనడిగింది.
‘‘క్యా కరూం బాజీ!’ ఈమద్య నేనే ఎక్కువ కుడుతున్న. ఇబ్రహీం భాయ్ ఏంటో, బాగా మారిపోయిండు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచనలో ఉంటున్నడు. గిరాక్ కూడా తగ్గింది బాజీ. ఆ మౌలానా ఒకడు, ఈయన టైం తింటున్నడు’’ అన్నడు.
‘‘ఎన్ని రోజుల ఇస్తెమా?’’ అనడిగింది.
‘‘నలభై రోజులు’’ అన్నడు సాజిద్.
మనసు చివుక్కు మన్నది ఆయేషాకు. ఇంట్లకు గుడ ఎల్లబుద్ది కాలేదు. వెనుదిరిగి ఎల్లిపొయింది. మద్యలో ఎవరో పలకరిస్తే గుడ పలకకుండ దబదబ తన షాప్‌కు వచ్చేసింది.
షాప్‌లో కుర్సీలో కూలబడ్డది. దు:ఖం పొగిలి పొగిలి వచ్చింది. జరసేపు ఏడ్చింది. అంతల ఏదో గిరాక్ వచ్చేసరికి పర్దా చాటుకు పోయి కండ్లు తుడుచుకొని వచ్చింది. వాళ్లు పొయినంక క్యాలెండర్ దిక్కు చూసింది. షానా రోజులుంది అనిపించి మనసు భారమైంది.
*
మనసు గట్టి చేసుకున్న ఆయేషా తన షాప్‌లో బిజీ అయింది. అయినా అప్పుడప్పుడు క్యాలెండర్ చూస్తనే ఉన్నది. మజ్జెలో రెండుసార్లు ఇబ్రహీం ఇంటికి పోయి వాళ్లమ్మను పలకరించి వచ్చింది. ఆమె అయోమయంలో ఉందనిపించింది. కొడుకుని వద్దని అనలేదు, కానీ ఇల్లు గడవడం, పిల్ల పెండ్లి చేయడం, ఇబ్రహీం పెండ్లి చేసుకోవడం ఎట్లనోనన్న చింత పడుతున్నది. ఏవో నాలుగు దైర్యం మాటలు చెప్పి వచ్చింది.
*
షాప్‌లో బిజీ ఎక్కువైన ఆయేషా 40 రోజులు దాటిపోయినంక గుడ వారం రోజులకు ఇబ్రహీంను కలవడానికి పోయింది. కుర్సీలో లేడు. సాజిద్‌ను అడిగింది, ‘అసర్ నమాజ్‌కు పోయిండ’ని చెప్పి నవ్విండు. ‘ఇప్పుడు ఐదుపూటలా?’ అనడిగింది. ‘అవును ఆపా!’ అన్నడు. ‘సరేలే’ అనుకుంట ఇంట్లకు పోయింది. వాళ్లమ్మ మంచంలో పండుకొని ఉంది. ఎదురుంగ ఏందో బోసిగా అనిపించింది. ఇంట్ల ఏ సప్పుడు లేదు.
‘‘ఆంటీ, సోగయే క్యా?’’ అన్నది.
‘‘నై మాఁ!’ అంటు ఇటు తిరిగింది ఫాతిమా. ‘‘బైఠో బేటా!’’ అన్నది. పక్కనున్న కుర్సీల కూసొని ‘‘క్యా ఆంటీ, పానం బాగుంది కదా?’’ అన్నది.
‘‘పర్వానై బేటా! నువ్వెట్లా ఉన్నవ్? అసలిటు దిక్కు వస్తనే లేవేంది?’’ అన్నది.
‘‘అవును ఆంటీ, షాప్‌లో బిజీ అయిన. ఈ మద్య ఇబ్రహీం సాబ్ గిరాక్ గుడ నాకొస్తున్నది. ఎట్లున్నడు ఇబ్రహీం సాబ్?’’ అన్నది.
‘‘ఎట్లున్నడంటే ఏం చెప్పను బేటా! ఎటూ చెప్పలేకపోతున్న..’’
‘‘ఏమైందాంటీ? ఏమన్నా ప్రాబ్లమా?’’
‘‘వాడు కొత్త కొత్త పద్దతులన్నీ చెప్తున్నడు. కాలేజీకి పోతున్న చెల్లెను బుర్ఖా ఏసి పోవలసిందే నని మొన్న గొడవ చేసిండు. దాంతో అది నేను కాలేజే మానేస్తా అని బెదిరించింది. మానెయ్యమంటడు! నేను బైటికి ఎల్తే దుపట్టా కప్పుకొని పోయేదాన్ని. నన్ను గుడ బుర్ఖా ఎయ్యమని బలవంతం చేస్తున్నడు. ఇంట్ల ఉన్న ఫోటోలు, వాళ్ల నాయన ఫోటో గుడ తీసి పెట్టెల పెట్టేసిండు…’’
‘‘అవునా..’’ అని ఆశ్చర్యపోయిన ఆయేషా ‘‘అవునాంటీ, ఇక్కడ టీవీ ఉండేది కదా? పాడయ్యిందా?’’ అన్నది.
‘‘ఇంకెక్కడి టీవీ బేటా! అగో.. మూట కట్టి ఆ అటక మీదికి ఎక్కించిండు. టీవీ సూడొద్దంటా! మన ఇస్లాంలో లేదంట. ఏం చెయ్యాల్నో తోచక ఇగ ఈ మంచంలనే ఒరిగి ఉంటున్న.. ఊకె ముడుచుకొని పండుకొని పండుకొని బేజారొస్తున్నది బేటా!’’ అన్నది విచారంగ ఫాతిమా.
‘‘అయ్యో! ఇంతల ఎంత మారిపోయిండేంది ఆంటీ! ఆ మౌలానానే దీనికి కారణం ఆంటీ!’’ అన్నది కోపంగ.
‘‘ఏమంటం బిడ్డా! ఏమన్న అంటే ఇస్లాం అంటరు. మా జమానాల ఈ పద్దతులన్నీ ఎక్కడియి. అప్పుడు గుడ ఐదు పూటలా నమాజులు చదివేటోల్లు ఇల్లూ సంసారాలు సూసుకోలేదా.. ఇప్పుడీల్లు ఏందో కొత్తగ చెప్తున్నరు.. ఎక్కువ జేస్తున్నరు. కొత్త ఏషాలు ఎక్కువైనై బిడ్డా! ఆఖరికి ఎక్కడికి తోల్తరో ఏమో..!’’ అన్నది బెంగగా ఫాతిమా.
‘‘మీరు ముందే జర చెప్పొద్దా ఆంటీ! చెల్లె షాదీ చేసేదుంది, నువ్వు షాదీ చేసుకునేదుంది’’ అని అన్నది ఆయేషా.
‘‘ఇంతగనం మనసు మీదికి తీసుకుంటడని అనుకోలే బేటా! నేనే నమాజ్‌కు పోతే మంచిదేగా.. ఆ మౌలానా చెప్పేవి మంచి విషయాలేగా అన్న బేటా! అదే తప్పయ్యింది’’ అన్నది తప్పు చేసినదాని లెక్క.
అంతల ఇబ్రహీం వచ్చిండని సాజిద్ లోపలికి వచ్చి సైగ చేసిండు.
ఏం కాదు లెమ్మని, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి బైటికొచ్చింది ఆయేషా.
దాదాపు నెలన్నరయ్యింది ఇబ్రహీంను సూడక. అతన్ని చూడంగనే మనసు లయ తప్పింది. కానీ అతను ఆయేషా దిక్కు చూడనే లేదు. తల దించుకునే ‘అస్సలామలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’ అన్నడు. బదులు నోరు దాటి బైటికి రాలేదు ఆయేషాకు. అట్లా నిలబడిపొయి అతన్నే చూస్తున్నది. గడ్డం పెద్దగా పెరిగింది. పాయింట్ షర్ట్ నుంచి లాల్చీ, మడిమల పైదాంక లొడాసు పైజమాలో రెండో మౌలానా లెక్క కనిపిస్తున్నడు ఇబ్రహీం. బాగ మండిరది ఆయేషాకు. రెండడుగులు అతని దిక్కు ఏసి,
‘‘మొత్తానికి ఆ మౌలానా మిమ్మల్ని అతని లెక్కనే మొత్తం మార్చేసిండు కదా ఇబ్రహీం సాబ్! ఇంక బట్టలేం కుడతారు, షాప్ బంద్ చేసి మీరు గుడ మజీదులో చేరిపోండి’’ అన్నది కసిగ.
‘‘అలా చెప్పకండి, అల్లా మార్గాన్ని తక్కువ చేసి మాట్లాడకండి’’ అన్నడు.
‘‘40 రోజులు పోయారుగా.. ఇంతకన్నా ఇంకేం మాట్లాడుతారు లెండి. మీతో వాదించి ఇక ఫాయిదా లేదు. మీ చెల్లెను మాత్రం ఆమెకు ఇష్టమైనట్లు ఉండనివ్వండి. చదువుకోనివ్వండి ఆ అమ్మాయిని. మీ అమ్మ కోసం దయచేసి ఆ టీవీ మళ్లీ పెట్టండి. మీకు ఇష్టం లేకపోతే మీరు చూడకండి. మీ తలకు ఎక్కిన ఛాందసత్వానికి మీ వాళ్లను బలి చేయకండి’’ అన్నది.
‘‘అవన్నీ ఇస్లాంలో హరాం. మీరు కూడా బుర్ఖా వేయకుండా ఇలా తిరగకండి’’ అన్నడు.
సర్రున కోపం తన్నుకువచ్చింది ఆయేషాకు-
‘‘మీరెవరు నాకు చెప్పడానికి? మీరు ఇలా మారింది కాక నన్ను గుడ 14వ శతాబ్దంలోకి నడవమంటారా? మీలాంటి మగబుద్ధి వెధవల వల్లే మన కమ్యూనిటీ ఇట్ల తగలబడ్డది. మొత్తం కమ్యూనిటీని సర్వనాశనం చేసిందాకా మీలాంటివారు ఇలాగే వాదిస్తారు. చివరకు పనులేమీ చేసుకోకుండా మజీదుల చుట్టూ తిరిగే బ్యాచీ ఎక్కువై ఇస్తెమాలు, జమాతులు, మదర్సాలు అంటు భూమికి భారమవుతారు. ఛీ!’’ అనుకుంట వేగంగా వెళ్లిపోయింది.
చేతులు నలుపుకుంటు మిషిన్ ముందు కూసుండిపోయిండు ఇబ్రహీం.
*
అప్పటి నుంచి మాటిమాటికి మజీదుకు వెళ్తుండడం, జొహర్, అసర్, మగ్‌రీబ్, ఇషా ఇలా నమాజుకు పోవడం రావడంలోనే బోలెడు టైం గడిచిపోతున్నది. గిరాక్ వచ్చినప్పుడు అందుబాటులో లేకపోవడంతో గిరాకి బాగా తగ్గింది. దానికి తోడు ఇంట్ల ఇతని చేష్టలకు ఫాతిమా గొడవ చేస్తుండేది. చెల్లె మాటినేది కాదు, ‘నువ్వు చెప్పినట్లు నేనుండలేను. కావాలంటే హాస్టల్లో ఉంటాను’ అని గొడవ చేసింది.
మౌలానా ఇతన్ని జిడ్డు లెక్క పట్టుకున్నడు. వాళ్లింట్ల ఏవో పరేషాన్లు చెప్పి పైసలు గుడ రాబట్టేటోడు. ఇస్తెమాల మీద ఇస్తెమాలని మూన్నెళ్లకోసారి నలభై నలభై రోజులు తీసుకెల్లిపోయేటోడు. దాంతో ఫాతిమా బెంగతో మంచం పట్టింది. ఒకరోజు ఏడుపు ఆపుకోలేక,
‘‘ఏమయ్యిందిరా నీకు? మంచిగ నడుస్తున్న ఇంట్ల కష్టాలు కొనితెచ్చినవేంద్రా.. ఎట్లుండేటోనివి.. ఎంత హుషారుగుండేటోనివి.. నవ్వుతూ నవ్విస్తు ఎంత మంచి పేరు తెచ్చుకున్నోడివి, ఇట్లయినవేందిరా..? మరీ ఇంతగనం పరేషాన్ చేస్తున్నవేందిరా మమ్మల్ని? ఇట్లయితే చెల్లె పెండ్లెట్ల చేస్తవ్? నువ్వెప్పుడు చేసుకుంటవ్?’’ అని బాగా ఏడ్చింది. తల్లిని ఎట్ల సమ్జాయించాల్నో తెలియక మొద్దు లెక్క నిలబడిపోయిండు ఇబ్రహీం. మసూదా తల్లి పక్కన కూసొని ఓదార్చింది.
రెండోరోజు మసూదా కాలేజీకి ఎల్లే టైంల బుర్ఖా వేసుకొమ్మన్నడు ఇబ్రహీం.
‘‘నేను వేసుకోను, నాకు చీదరగా ఉంటది.. నా దోస్తులు నవ్వుతరు’’ అన్నది మసూదా.
‘‘నువ్వు ఇట్ల చేస్తే ఇంట్ల ఉండొద్దు..’’ అని అరిషిండు ఇబ్రహీం.
దాంతో ఇబ్రహీంతో గొడవ పెట్టుకొని మసూదా హాస్టల్లో చేరిపోయింది. పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంట చదువుకుంట అన్నను పట్టించుకోకుంట అయ్యింది.
ఇష్టపడ్డ ఆయేషా మాటలు, ప్రాణమైన అమ్మ మాటలు, ఇష్టమైన చెల్లె మసూదా దూరంగా ఉండడం ఇవన్నీ ఇబ్రహీంను డిస్టర్బ్ చేసినయ్. ఊకె ఎటో ఆలోచనలో పడడం మొదలైంది.
ఈ అంతర్మధనంలో తలనొప్పి రావడం మొదలైంది. తల్లి, చెల్లె చెప్పేవి వాస్తవమేనేమో ననిపించేది. ఆయేషా గుర్తొచ్చేది. కానీ మౌలానా మాటలు భయపెట్టేవి. ఈ దునియా బుద్‌బుదప్రాయం, పరలోకమే శాశ్వతం అంటూ ఆఖిరత్ గురించి మౌలానా చెప్పిన మాటలు బాగా భయపెట్టి మెదడులో కూరుకుపోయినయ్ ఇబ్రహీంకు. దాంతో అంతర్మధనంలో తలనొప్పి ఎక్కువై తల పట్టుకొని కూర్చుండిపోయేటోడు. అట్లనే ఒకసారి స్పృహ తప్పి పడిపోయిండు. సాజిద్ పరుగెత్తుకొచ్చి నలుగుర్ని పిలిచిండు. అందరు సాయం పట్టి హాస్పిటల్‌కు తీసుకెల్లిన్రు. ఫాతిమా గుండె బగిలింది. తల్లడమల్లడమైంది. మసూదాకు ఫోన్ చేసింది. సెలవు పెట్టి ఆ అమ్మాయి వచ్చింది. ఇద్దరు కలిసి హాస్పిటల్‌కు ఎల్లిన్రు.
రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిండు ఇబ్రహీం.
కొంచెం ఆలస్యంగ తెలిసిన ఆయేషా ఆత్రంగ ఇబ్రహీం ఇంటికి పోయింది. ఇబ్రహీం కుర్సీలో లేడు. ఇంట్లకు అడుగుపెట్టింది. మంచంపై ఉన్నడు ఇబ్రహీం. పక్కన తల్లి కుర్సీల కూసొని ఉంది. చెల్లె గోడకు నిలబడి ఉంది.
మౌలానా దువా చదువుతున్నడు, ఇబ్రహీం కోలుకోవాలని!
దువా చదివి ఎనక్కు మల్లేసరికి ఆయేషా కనిపించింది.. ‘అస్సలామలైకుమ్…’ అన్నడు. ఆమె బదులివ్వలేదు. ఆమె మొఖంలో ఏదో తెలీని కోపం కనిపించింది. ఆ కోపంలోంచి ఏదో అనబోతున్నట్లు అనిపించింది. ఫాతిమా దిక్కు సూషిండు, ఆమె గుడ తన దిక్కు సూడకుంట మొఖం నారాజ్‌గ పెట్టి ఎటో దిక్కు సూస్తున్నది. మసూదా దిక్కు సూస్తే ఆమె గుడ అసహనంగ కనిపించింది.
వాళ్లందరిలో పేరుకున్న అసంతృప్తి ఏదో తన మీద బద్దలయ్యేటట్లున్నదని మెల్లగా బయటికి నడిచిండు మౌలానా.
*
చిత్రం: సృజన్ రాజ్
Add comment