వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ వ్యాసాల పుస్తకం విద్వేషపు ‘విశ్వ గురు‘ లో వ్యాసాలు నేటి పాలకుల తప్పిదాలను నెల సంవత్సరం వారీగా విపులంగా వ్రాసారు. నేటి దుస్థితి కి కారణాలు విశదీకరించే రీతిలో సరైన హేతువు ను కళ్ళ ముందుంచే ప్రయత్నం చేసారు.
ప్రణాళికా సంఘానికి మోడీ అంత్యక్రియలు వ్యాసంలో సోషలిస్ట్ గా తనకు తాను గా ప్రకటించుకున్న నెహ్రూ ప్రణాళికా బద్ద పాలనకు అంకురార్పణ చేయగా కాలక్రమంలో నిర్వీర్యమైన తీరు ను ఎండగడుతూ దాన్ని రద్దు చేసిన వైనాన్ని తప్పు బడుతూ భవిష్యత్తు లో కూడా ప్రజానుకూల విధానాలు రావద్దని సంఘ్ పరివార్ కంకణం కట్టుకున్నదని రచయిత తేట తెల్లం చేసారు.
వంది మాగధుల భజనకే వందరోజుల పాలన వ్యాసంలో కార్మిక సంక్షేమ చట్టాల రద్దు చేసే కార్యక్రమం, ప్రభుత్వ సంస్థల అమ్మకాలు ఆఖరికి రక్షణ రంగంలో విదేశీ సంస్థల చేతుల్లో పెట్టి పండుగ చేసుకున్న తీరును చెప్పారు. విద్యా రంగం లో సైన్సు ను దూరం చేసి మతోన్మాద చేరికను బట్ట బయలు చేసారు.
దొంగలు దొంగ సొమ్ము ను బయట పెట్టి ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తామని ప్రకటించి తర్వాత చెబుతున్న కుంటిసాకులను సోదాహరణంగా వివరించారు. భారతీయులం నల్ల వారమై వుండి శ్వేత జాతీయుల పదమైన నల్లధనం ను మనం అనడం భావదాస్యం అని రచయిత ఉటంకించారు.ఇది ఆలోచించాల్సిన విషయం. అక్రమ ధనం వివిధ రూపాల్లో ఇంకా బలపడుతుందనేది దాచినా దాగని సత్యం.
ఘర్ వాపసి పేరిట లౌకిక రాజ్యం లో మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలను ఉదహరిస్తూ పరివార్ ఆకృత్యాలకు సమాజం తల్లడిల్లుతున్న విధాన్ని ఈ వ్యాసంలో వెలిబుచ్చారు. డిజిటల్ ఇండియా మాటున జరుగుతున్న మోసాన్ని బహుళ జాతి సంస్థల కి దేశాన్ని మార్కెట్ గా చేస్తూ మౌలిక వసతుల కల్పన లేని ఇండియా ను ఈ వ్యాసం లో విశదీకరించారు. హంతక అసహనం దబోల్కర్ నుండి రోహిత్ దాకా వ్యాసం లో ప్రశ్నించే వారిని చంపే దాకా చంపించేదాకా విశ్రమించని శక్తుల గురించి హెచ్చరించారు. హిందూ బ్రాహ్మణీయ భూస్వామ్య సామ్రాజ్య వాద శక్తుల కలయిక యే రోహిత్ వేముల హత్య కి దారి తీసిందని, విశ్వ విద్యాలయాలు అగ్ర హారాలు గా విషం కక్కుతున్నాయని స్థూలంగా చెప్పారు.
బారాముల్లా జిల్లాలో కట్టుదిట్టమైన సైనిక స్థావరం పై జరిగిన దాడి లోని నిజానిజాలను తేటతెల్లం చేయ టానికి ఏ మీడియా సంస్థ కూడా ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అది తన సంతతి ని తానే మింగే జాతి ని మతోన్మాదం తయారు చేయగలదని కూలంకషంగా చర్చించారు. పక్క దేశం కూడా అలాగే విద్వేషాన్ని రెచ్చ గొడుతూ పాలిస్తుందని ఖరాఖండిగా చెప్పారు. కేవలం రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన యే చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
పెద్దనోట్ల రద్దు ను అర్థరాత్రి ప్రకటిస్తూ నల్లధనం వెలికితీత కరెన్సీ వుండదు అవినీతి రద్దు అనే మూడు విషయాలను ప్రజల ముందుకు తోసారు. దానితో పాటు ఉగ్రవాదం కూడా అంతం అని భజన పరుల తానా తందానా ఎరిగిందే. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం చలామణీ లో వున్న నోట్ల కంటే ఎక్కువే ఖజానా కు చేరిందని, నల్ల ధనం లేదు పైగా నకిలీ సైతం అరికట్ట బడలేదు. నోట్లు మార్చుకునేందుకు సాధారణ ప్రజానీకం పడిన పాట్లు వరుసల్లో నిల్చుని ప్రాణాలు కోల్పోయిన వారు ఇవ్వన్నీ పాలకుల దృష్టికి రాలేదని రచయిత నిశితంగా విమర్శించారు. ఈ చర్య వల్ల ఒనగూడింది ఏమీ లేదని అందరూ గ్రహించిననూ ఇంకా భజన మాత్రం ఆగలేదని వాపోయారు. దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల ను తప్పు దోవ పట్టించటానికి ఎప్పటికప్పుడు మత విద్వేషాన్ని వెదజల్లు తున్న పాలకుల దుర్నీతి ని సాక్షాత్కరించాడు.
భక్తి ముసుగు లో అరాచక ముఠా సాగిస్తున్న లైంగిక దోపిడీ ని బాబా గుర్నీత్ రామ్ రహీమ్ ను కడిగేసారు. వ్యవసాయం లో నూతన పద్దతులు ప్రవేశ పెట్టి ఎదిగిన పంజాబ్ హర్యానా సమాజాన్ని సైతం బాబా ల్లాంటి అభివృద్ధి నిరోధక శక్తులకు లోబడే మనస్తత్వాల ను చైతన్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని రచయిత కొరడా ఝుళిపించారు .
ఏకీకృత జి ఎస్ టి రాష్ట్రాల అధికారాలను హరించే విధానాన్ని, కేంద్రం దయాదాక్షిణ్యాల పై ఆధారపడి రాష్ట్రాలు బతకాల్సి వచ్చే తీరు ను తెలియచేస్తూ ఇదంతా ప్రపంచీకరణ దృష్ట్యా జరుగుతున్న పరిణామాలకు కొనసాగింపు గా సూత్రీకరించారు.
బ్రాహ్మణీయ పాలకులు రెండు వందల ఏళ్ళ భీమా కోరే గావ్ సంస్మరణ సభకు వెళ్ళే దళిత బహుజనుల ను ఆపడానికి పన్నిన కుట్రలను , వారి చైతన్యాన్ని జీర్ణించుకోలేక గోవింద్ గైక్వాడ్ సమాధి ని సైతం తవ్వి పడేసిన పరివారం కుటిల బుద్దిని సమాజానికి పరిచయం చేసారు. ప్రశ్నించే కలాలను గళాలను జైల్లో తోయటమో చంపటమో జరుగుతున్న ఫాసిజం వేళ్లూనుకుని పోతున్న తీరు ను , దాన్ని పడగలో భవిష్యత్తు వినాశనమని రచయిత ఆవేదన వ్యక్తం చేసారు.
కాశ్మీర్ పై దండయాత్ర 1933 నుండి 1945 దాకా సాగిన నాజీ దుర్మార్గం గా అభివర్ణించారు. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేసి భీతావహులను చేస్తున్న వైనం పాలస్తీనా ప్రజలపై వారి భూభాగం పై సామ్రాజ్య వాదుల దుర్మార్గాన్ని ఙ్ఞప్తి కి తెస్తుందంటూ ఫాసిజాన్ని ఎదుర్కోవాల్సిన శక్తులకు హెచ్చరిక జారీ చేసారు. అందమైన లోయల్లో కార్పొరేట్ శక్తులు దూరుటకు 370 అధికరణ రద్దనేది సుస్పష్టం.
రామాలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పు ను సిగ్గుబిళ్ళ గా అభివర్ణించిన రచయిత వ్యంగ్య కోణాన్ని అర్థం చేసుకోవాలి. అయోధ్య తీర్పు ను సంఘ్ తీర్పు గా బలవంతం గా తయారు చేసిన స్క్రిప్ట్ అని ఖరాఖండిగా చెప్పారు. విశ్వాసమే ఋజువు అని చెప్పటం వంచనా శిల్పానికి పరాకాష్ఠ అని వ్యాఖ్యానించారు. సి ఎ ఎ ,ఎన్ ఆర్ సి ,ఎన్ పి ఆర్ ల పేరిట ముస్లిం సమాజాన్ని భయాందోళన లకు గురి చేయటం, ఉత్తరాన తూర్పున కల్లోల్లం సృష్టించే పాలక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మను స్వామ్యాన్ని నిలదీసారు. సకల జాతులు భిన్న సంస్కృతులు కలిగిన ఇండియా లో ఉమ్మడి పౌర స్మృతి అంటూ తెర తీసిన భావజాలం ఫక్తు సంఘ్ దేనని చాటారు.
వ్యవసాయ సంస్కరణ ల పేరిట విశాల భూ క్షేత్రాలను కార్పొరేట్ లకు ఇవ్వాలనే కుట్ర ను తన వ్యాసంలో విశదీకరించారు. రైతును కూలీ చేసే దాగి వున్న అజెండా ను కూలంకషంగా చర్చించారు రచయిత. ఏ పంట వేయాలో చెప్పే నేల రకం తెలియని నిరక్షర కుక్షుల రంగప్రవేశం క్షమించ రానిది. రైతు ఉద్యమానికి అందరం సంఘీభావం తెలపాలి అంటూ అవసరాన్ని నొక్కి వక్కాణించారు. విద్వేష రాజకీయాలతో విశ్వ గురు కాగలరా?! అంటూ జి 20 అధ్యక్ష పీఠాన్ని తగిలించుకున్నంత మాత్రాన కాజాలడని నిర్ద్వంద్వంగా తోసి పుచ్చారు. ఈ పుస్తకం లోని వ్యాసాలు ఆలోచింప జేసే విధంగా వాస్తవాన్ని బేరీజు వేసుకునే విధంగా వున్నాయి. ఏ మాత్రం చైతన్యం గల వ్యక్తి అయినా ఫాసిజాన్ని తరిమేయగల సరంజామా ఈ వ్యాసాల్లో వుంది
ప్రతులకు : మలుపు బుక్స్ 302 నవ్య మెట్రో అపార్ట్మెంట్ ఉప్పల్ భగాయత్ హైదరాబాద్ 500039 ను సంప్రదించండి.
*
ఈ ఆర్టికల్ లో వాడిన బొమ్మ చూసి, సారంగలో ఇలాంటిది ఎలా రాగలదని షాక్ కు గురయ్యాను. అలాంటి బొమ్మ వాడటం దుర్మార్గానికి పరాకాష్ఠ.
ఆర్టికల్ లో ఎన్నో అర్థ సత్యాలు ఉన్నాయి. కొన్ని నేను వెంటనే పట్టుకోగలిగాను. ప్లానింగ్ కమిషన్ లో నేను ఏడు సంవత్సరాలు పని చేసాను. అలాగే ఢిల్లీలో ఈమధ్య అల్లర్లు జరిగిన బాబార్పూర్ ప్రాంతంలో బంగ్లాదేశీలు అక్రమంగా సెటిల్ అవ్వడం నేను ఢిల్లీలో ఉన్న రోజులలో మొదలైంది. నేను ఆ ప్రాంతానికి నా మిత్రుడి పని మీద రెండు సార్లు వెళ్ళాను, ప్రత్యక్షంగా చూసాను. తరువాత వాళ్లందరికీ ఓట్లు ఇచ్చేసారు.
ఇలా అజెండా పెట్టుకొని, నిజానికి మసిపూసి మారేడుకాయ చేసి, జనాల్ని నమ్మించగలమనుకునే అతితెలివి మేధావులతో వాదించడం వృధా.
సారంగలో ఇలాంటి వాటికీ చోటివ్వవద్దని మనవి.