భూతలం అట్టడుగునుంచి
గొలుసుకట్టు కొండల శిఖరాగ్రానికి
మెలికలు తిరుగుతున్న తోవ
నాగస్వరం వూదుతున్న
మంత్రముగ్ద నాదాలకు
పురివిప్పి పరుగులు తీస్తున్న
కోడెనాగుల పడగ
ప్రేయసి మిసమిసల కౌగిట
తుళ్ళింతల కొలిమిలైన
పరవశాల పరితపనలకు
ఓదార్పుల నిట్టూర్పుల వలె
గిలిగింతల చలిగాడ్పులు
పట్టపగటి నీరెండ మాయలో
పొద్దో మాపో గుర్తెరుగరాని
అయోమయంలో
కీకారణ్యపు కడలి నడినెత్తిన
అలల ఆనంద నర్తనమాడుతున్న
వలపు వన్నెల మిసిమి నింగి
పరువపు వసంతమై బుసకొట్టాలని
పండుటాకుల రంగులు విదిల్చుతున్న
వయసుడిగిన గ్రీష్మరుతు ఇంద్రచాపమొక
కుబుసం విడుస్తున్న శ్వేతనాగుల విడిది
కనురెప్పపాటులో
అడుగడుగుకు రంగులు మార్చే
నత్తనడకల ఊసరవెల్లి
స్మోకీ హిల్స్ ఫాల్ కలర్లకు
కుంచెల రంగుల ఒడుపులు నేర్పిన
అయాచిత అనాది గురువు
కనురెప్పపాటులో
అడుగడుగున రంగులు మార్చే
అమానవీయ దౌర్బల్యాలకు
ఊసరవెల్లిని ఉపమానించడం ఒక
వ్యాకరణ దోష భూయిష్ట అపమానం
అమ్మ చంకల జోలపాటల
పసితనం కలలుగన్న
పేదరాసి పెద్దమ్మ గోరుముద్దల
వెండిగిన్నెల మెరిసిన
పున్నమి వన్నెల చంద్రులు
లోయల లోగిల్ల తలలు వాల్చి
సేదతీరుతున్న మానుల తలపోతలు
కాళ్ళకింద పాదాలకు
ఊసుల ముద్దులనద్దుతున్న
సుతిమెత్తని రంగులు పాన్పులు
రాలిన ఆకులు పేర్చిన
రేపటి సీతాకోకల రెక్కల
ఊహల బాసల పెనుగులాటలు
భూమ్యాకాశాల వర్ణమాలికల
సరిహద్దుల భ్రమల్ని చెరిపేసిన
స్మోకీ హిల్స్ ఫాల్ కలర్స్ కొండల
తలకట్టుల దిగంత రేఖలు
ఒకానొక అలౌకిక సుందర స్వప్నం
కబురంపిన ఒకానొక
అముద్రిత ఊహాగీతిక చిత్రలేఖనం.
*
Thanks for publishing my poem in Telugu Fall Colours in Smoky Hills.
చాలా బాగుంది కవిత. ధన్యవాదాలు