నా మొదటి కవిత ‘సోషలిస్టు చంద్రుడు’ 1957 నవంబర్‌లో తెలుగు స్వతంత్ర వారపత్రికలో అచ్చయి, నాకు అభ్యుదయ / ఆధునిక కవిగా గుర్తింపు తెచ్చింది. అప్పుడు నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలెజిలో బి.ఎ. ఫస్టియర్ చదువుతున్నాను. సరిగ్గా అదే నెలలో 17 సంవత్సరాలు నిండాయి.
అంతకుముందు కాలెజియేట్ హైస్కూల్లో ఉద్ధండ పండిత కవి ఉదయరాజు శేషగిరిరావుగారు మాకు తెలుగు చెప్పేవారు. పద్యాలు రాయడానికి ప్రోత్యహించేవారు గనుక బి.ఎ. ఫస్టియర్ దాకా శార్దూల, మత్తేభ పద్యాలు రాసాను. ‘శరద్వతీ’ మకుటంతో ప్రేమపద్యాలు కూడ రాసాను. కాని ఈ కవిత రాయడానికి ప్రేరణ మాత్రం 1957లో సోవియెట్‌రష్యా రోదసిలోకి స్పుత్నిక్ పంపించడం.
ఆ కవిత తెచ్చిన గుర్తింపు వచన కవిత రాయడానికి, అప్పటికి స్పష్టాస్పష్టంగా ఉన్న అభ్యుదయ భావాలు మాత్రమే ప్రచురించుకోవాలన్న ఒక అవగాహన ఏర్పడడం.
ఇటువంటి అభ్యుదయ, సోషలిస్టు భావాలు రాయడానికి పద్యం వాహిక కాదు అనే అవగాహనతో పాటు బి.ఎ. ఫస్టియర్‌లో ఒక్కసారిగా నా ప్రపంచం చాల విశాలమై, అభ్యుదయ భావాలు కలిగినవారితో స్నేహాలు ఏర్పడినవి. శ్రీశ్రీ, కాళోజీ కవిత్వాల ప్రభావం. అవి కంఠోపాఠంగా చదువుతూ హైస్కూలు రోజుల్లోనే అప్పటికే కమ్యూనిస్టు అయిన బంధువు / స్నేహితుడైన పెండ్యాల కిషన్‌రావు (1970లో ‘మార్చ్’, ‘విప్లవకవులు’ కవితా సంకలనం వేసి, విరసం ఏర్పాటులో, కార్యవర్గంలో ఉన్న కవి)తో పాటు మా ఊరు చినపెండ్యాలలో వాగులు, వంకలు, ఏనెలు, చేలల్లో తిరుగుతూ వాగుపక్క ఏనె మీద మాకిష్టమైన కవితాపంక్తులు, కవుల పేర్లు చెక్కుకునేవాళ్లం.
ఇప్పుడు తిరిగి వెనక్కి చూస్తే మొదటి ప్రభావం పియుసిలో పాఠ్యాంశంగా (ఐచ్ఛిక తెలుగులో) చదివిన ‘మనుచరిత్రం’లోని వరూధిని, ప్రవరుడి ఘట్టం లోని భాష నుంచి బయటపడలేదు. ఆ పాఠం చెప్పిన చెలమచెర్ల రంగాచార్యగారు వచనంతో సహా పద్యాలన్నీ చెప్పిన మర్నాడు కంఠతా చెప్పించుకొని గానీ ముందుకు వెళ్లేవాడు కాదు. అందుకని–
మరొక్క బాలచంద్రుడుదయించెను
యూరపు తూరుపు కాకేషియన్ కొండల్లోంచి
ఉవ్వెత్తున తారాజువ్వలా వియత్తలానికెగిరి
ఉర్వీతలం చుట్టూ కంటికి కానరాకుండా తిరుగుతున్నాడు
అని ఉపమలు, ప్రతీకలు, ఉత్ప్రేక్షలు అవి కాకపోతే వాటిలోకి యూరపు తూరుపు కాకేషియన్ కొండలొచ్చాయి.
మరొకవైపు కవికి ఉండే, ఉండాల్సిన మబ్బుకూ దుబ్బకూ ప్రాతినిధ్యం ఇచ్చే అసామాన్య ప్రజాస్వామ్య శ్రేయోరాజ్యం అతిత్వరలో ఏర్పడనున్నది వంటి ముగింపులో ప్రజాస్వామ్యం ఉన్నది. శీర్షికలో సోషలిజం ఉన్నది. అయితే ఈ రెండు నెహ్రూ హామీ పడిన (ఇప్పటికీ, మరీ ఇప్పుడయితే ఒకవైపు ప్రపంచీకరణ వల్ల మరొకవైపు బ్రాహ్మణీయ హిందూభావన రాజ్యస్వభావం కావడం వలన) ‘శ్రేయోరాజ్యం’ మీద భ్రమ ఉన్నందువల్ల వచ్చినవే.
అయితే పదేళ్లు గడిచేవరకే నా మొదటి కవితాసంకలనం ‘చలినెగళ్లు’ 1968 మే నాటికి ప్రచురింపబడే వరకే, నా మొదటి కవిత వస్తురీత్యా అందులో చేర్చడానికి నాకే మనసొప్పలేదు. ఇప్పటి కారణాలేమిటో 2007, 2017లలో వెలువడిన నా ఏభైఏళ్ల, అరవయ్యేళ్ల కవితా సంపుటాలకు రాసిన ‘ఎవరు రాసేరు మూడుయాభైలు’ ముందుమాటలో రాసాను గానీ 1968 నాటికి నా అవగాహనలో వచ్చిన మౌలిక మార్పుకు తోడు నాకు 1960 నాటికే ఆ కవితలో పెద్దలోపంగా కనిపించింది
ఆ స్ఫుత్నిక్‌లో పంపించిన కుక్కపిల్ల (లైకా) ప్రస్తావన లేకపోవడం. అప్పటికే నాకు 1957`58 విద్యాసంవత్సరంలో పరిచయమైన, ఆయన బతికి ఉన్నంతకాలం ప్రాణస్నేహితుడుగా ఉన్న బి.కిషన్‌రావు (మేం మిత్రులమందరం కిషన్ అని పిలుచుకునేవాళ్లం) ఇంట్లో రాత్రిళ్లు ఎక్కువగా పడుకునేవాణ్ని. ఆ ఇంట్లో అతని పెద్దమ్మవాళ్లు ఒక కుక్కపిల్లను పెంచుకునేవాళ్లు. అట్లా అది నాకు కూడ చాల మాలిమి అయింది. అది నా మొదటి కవిత రాసిన కొద్దిరోజులకే చనిపోయింది. స్పుత్నిక్‌లో పంపిన లైకా కూడ చనిపోయే ఉంటుంది. ఆశ్చర్యంగా నా మొదటి కవితలోకన్నా నాకు ఈ కవితలో ప్రపంచం స్థానంలో మనుషులు, స్పుత్నిక్‌స్థానంలో కుక్కపిల్లకు ఎక్కువస్థానం లభించినట్లనిపించింది.
కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!
అయినా దానికా స్వర్గంలో ఏముంటుంది గనుక
అక్కడుంటుంది?
స్వర్గంలోని వర్గకలహాలు
రేపు దాని కళ్లల్లో చదువుకుంటాను- అని 1958లో రాసాను.
ఈ కవిత రాయడంకన్న ముఖ్యం మాలిమి అయిన కుక్కపిల్ల చనిపోయినప్పుడు, చంద్రమండలానికి పంపిన స్పుత్నిక్‌నే కాని, కుక్కపిల్ల లైకాను గుర్తుపెట్టుకోక పోవడం ఒక అపరాధభావమనిపించింది. ఎందుకంటే ప్రలోభాలకు లోనయ్యే మనుషులకన్నా ఆ కుక్కపిల్ల గొప్పతనం నేను దాని చావులో గుర్తించాను.
నాకు కనువిప్పు కలిగించింది ` ‘ప్రతిద్వంద్వి’ సినిమా సత్యజిత్‌రే తీసిన ఆ సినిమాలో కథానాయకుడు ఉద్యోగార్థం ఒక యువకుడు. ఇంటర్వ్యూ చేసేవాళ్లు ‘ఈ దశాబ్దంలో జరిగిన గొప్ప మానవ విజయం ఏమిటి?’ అని అడుగుతారు. అతడు ‘వియత్నామ్ విజయం’ అంటాడు. వాళ్లందరూ వెంటనే మొదట ‘నువ్వు కమ్యూనిస్టువా’ అని ప్రశ్నించి, ‘మనిషి చంద్రమండలం మీదికి పోవడం నీకు మానవ విజయమనిపించలేదా’ అంటారు. అది సైన్స్ విజయం. మానవుడు సైన్స్‌లో చేసిన ప్రయోగాల ప్రగతి విజయం.
కాని వియత్నాం తనకన్నా ఎంతో బలమైన శత్రువు సామ్రాజ్యవాదంపై సాధించిన విజయం అది అమెరికా సామ్రాజ్యవాద టెక్నాలజీని వియత్నామ్ ప్రజాసాంకేతిక విజ్ఞానంతో ఓడిరచింది. ప్రజలపై బాంబులు కురిసే యుద్ధవిమానాలను ప్రజాగెరిల్లాలు వెదురుకర్రలతో తయారుచేసిన ` మన ప్రజలభాషలో చెప్పాలంటే చెలక కాపరి ఉండేలుదెబ్బతో పడగొట్టినట్లుగా పడగొట్టారు. ప్రజలు నిర్మించే చరిత్ర మాత్రమే కాదు ఆ క్రమంలో రూపొందించుకునే సాంకేతిక జ్ఞానమది.
ఇంక ఇప్పుడయితే ఈ సైన్యం విజయాలన్నీ ఈ స్పేస్‌రీసెర్చ్‌లన్నీ అప్పటికే రివిజనిస్టు రష్యా అయిపోయిన నేననుకున్న సోవియెట్ రష్యా హంగెరీ, జెకొస్లావేకియా నాటికే నక్సల్బరీ దృష్టిలో సోషల్ సామ్రాజ్యవాదం అయిపోయింది. ఇంక 1990 నాటికయితే తూర్పుయూరపు పరిణామాలతో పాటు రష్యాలో పరిణామాలు ఉక్రెయిన్ మీద మూడేళ్ల ఆక్రమణ యుద్ధం చేస్తున్న ఒక జాత్యహంకార సామ్రాజ్యవాద అగ్రరాజ్యనీతిని తలపిస్తున్నాయి.
ఇవ్వాళ దండకారణ్యంలో కగార్ యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఆదివాసులు జల్, జంగిల్, జమీన్, ఇజ్జత్ లతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కూడ పోరాడుతున్నారు. కనుక సందర్భం కోసమైతే, భాష, అవగాహనల రీత్యా ఏ సంపుటాల్లోనూ చేరని కవిత మళ్లీ రెండు కారణాల వల్లనే 2017లో వచ్చిన సమగ్ర కవితా సంపుటాల్లో చోటుచేసుకున్నది. ఒకటి తెలుగు స్వతంత్రలో ఒక పేజీలో అచ్చయిన నా కవిత ‘సోషలిస్టు చంద్రుడు’ నాకు అభ్యుదయ ఆధునిక కవి గుర్తింపునే తెచ్చినవి కనుక.
అప్పటికి ‘భారతి’లో వస్తే కవిగా గుర్తింపు, తెలుగు స్వతంత్రలో వస్తే అభ్యుదయ ఆధునిక కవిగా గుర్తింపు. విప్లవ కవి కూడ ఆధునిక కవియే.
రెండవది ఎంత అస్పష్టంగానైనా, అవగాహనకున్న ఎన్ని పరిమితులలోనైనా ఆ కవిత సోషలిస్టు లక్ష్యాన్ని, ప్రజాస్వామ్య సంస్కృతిని ఆకాంక్షిస్తున్నది. మబ్బుకూ దుబ్బకూ సమాన ప్రాతినిధ్యాన్ని ఇస్తున్నది. ఆకాశంలో విహరించే మేఘసందేశాలను దుబ్బలోకి తెచ్చి ఆ సందేశాలలోని సమానత్వ భావాన్ని ప్రతిఫలిస్తున్నది. కవిత్వంలో ఉండే ఒక ఇమెచ్యూర్ ఇన్నోసెన్స్ వల్ల ` అప్పటికీ ఇంకా 17 ఏళ్లకు ఉండే అడాలసెంట్ రొమాంటిక్ భాషలోనే చెప్పే లౌల్యం వల్ల, ఆ భాష, ఆ నిర్మాణం జరగకపోవచ్చు కానీ అందులో ఇవ్వాటి నూతన ప్రజాస్వామిక విప్లవపోరాటం పరిపక్వమయ్యే దశ సోషలిజం మీదనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నది.
నిర్మాణాల నుంచి ఉద్యమాల్లోకి, కవిత్వంలోకి కాకుండా కవిత్వం నుంచి కమ్యూనిజంలోకి వచ్చినవానిగా ఇపుడు నా ఈ మొదటి కవితలో (ఆంధ్రజ్యోతిలో రాసినట్లు నా మొదటి కవితాసంకలనంలో) ఈ పరిహరించదగిన వైరుధ్యాలు ఉన్నవి. కాని మంత్రసానియే మాయ కడిగిన నీళ్లతో పాటు శిశువును పారేయలేనపుడు కన్నతల్లి అయిన కవి తన సృష్టిని నిరాకరించలేడు కదా ఇపుడా బిడ్డను ఒక విశ్లేషణాత్మక వ్యాఖ్యలతో అంచనాతోనైనా తన సృజనగానే ప్రకటిస్తుంది.
సౌజన్యం: అనల, ఎన్. వేణుగోపాల్
వరవరరావు గారి కవిత్వ పరిచయం బాగుంది
బావుందిగానీ, తొలినాళ్లలో రాసిన మల్లెపూల కవితలను ఎందుకు ప్రస్తావించలేదు? అనేది అర్థం కాలేదు. దాదాపు 17 వరకు వున్న ఆ కవితలు ఇప్పుడు లభ్యమేనా?