ప్రేమ కథలు – 1

‘ఈ పాట నాకెందుకు ఇష్టమో తెలుసా? నేను ప్రేమించిన వ్యక్తి అలాగే ప్రవర్తించాడు కనక’ అంది సురభి. ఉరమని పిడుగులా తనంతట తాను సురభి ఈ టాపిక్ మొదలుపెట్టేసరికి ఆశ్చర్యపోయింది విద్య.

కథలు సుఖాంతాలో, దు:ఖాంతాలో కావు. ప్రేమసంబంధాల్లో ఖచ్చితంగా సుఖాంతాలూ, దు:ఖాంతాలూ ఉంటాయని నేననుకోను. ఎంతో ఆనందంగా ఉండే సంబంధంలోనూ ఏదో అపశృతి ఉండవచ్చు. ఎంతో వేదనతో కూడిన సంబంధంలోనూ ఒక దరహాసం మొలకెత్తవచ్చు.

ప్రేమ విషయంలో తీర్పులు, తీర్మానాలు, తుది నిర్ణయాలు కుదరవు. అందులో అన్నీ సాపేక్షమే.  ప్రేమలో అనివార్యంగ కనిపించేది సంక్లిష్టత.  ఆ సంక్లిష్టతల్ని స్పృశించడానికి ఈ కథలు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఎవరికైనా ఇందులో ఏదో తమ జీవితాన్ని పోలివుంది అని అనిపిస్తే, మరీ మంచిది. దానికి పూచీ మాత్రం నాది కాదు

  –మృణాళిని

~

 ‘కౌన్ రోతాహై కిసీ ఔర్ కీ ఖాతిర్ ఐ దోస్త్? సబ్ కో అప్‌నేహీ కిసీ బాత్ పే రోనా ఆయా’

పాడుకుంటూ వాషింగ్ మిషన్ లోంచి బట్టలు తీసి ఆరేస్తోంది సురభి. టీవీలో అర్ణబ్ గోస్వామి కేకలు వింటున్న విద్య  ‘ఎప్పుడూ ఆ ఏడుపుగొట్టు హిందీ పాటలే’ అంది.

‘ఏడుపు గొట్టు హిందీ పాటల్లో ఉన్న అర్థం మా తెలుగు కావ్యాల్లోనూ, నీ ఇంగ్లీషు నవలల్లోనూ ఉండదు’ లోపలికి వచ్చి సోఫాలో కూలబడింది సురభి.

‘ఎవరైనా మరొకరి కోసం ఎందుకు దు:ఖిస్తారు? ఎవరికి వారికే పుట్టెడు దు:ఖం ఉన్నప్పుడు’ అన్నాడు సాహిర్. తెలుసా? ఎంత నిజం అది? ‘ అంది సురభి.

విద్య,  అర్ణబ్ ని మ్యూట్ చేసి, పూర్తిగ సురభి కేసి తిరిగింది.

“ఓహో. అందుకేనా నీ ప్రేమగాథ చెప్పమంటే ఎప్పుడూ చెప్పవు.. ఎలాగూ నేను నీతో పాటు ఏడవననేగా?’

సురభి ఫక్కుమని నవ్వింది. ‘నా ప్రేమగాథలో అంత ఏడవాల్సిందేమీ లేదులే’

‘మరైతే వృద్ధకన్యగా ఎందుకుండిపోయావు?’ అనేసి ‘సారీ’ అని నాలిక్కరుచుకుంది విద్య.

సురభి మాట్లాడలేదు. ఇంకా నవ్వుముఖంతోనే విద్యకేసి చూసింది. విద్య వెంటనే లేచి సురభి దగ్గరికి వెళ్లి, చేతులు పట్టుకుని’ ‘చాలా దరిద్రంగా మాట్లాడాను. వెరీ సారీ సురభీ….బాగా కోపం వచ్చిందా’ అంది.

సురభి సీరియస్ గా చూసి ‘ యాభై రెండేళ్ల దాన్ని వృద్ధ అంటే కోపం రాదూ?’ అంది. విద్య ఫకాల్న నవ్వేసి

“అయితే కోపం వృద్ధ కా? కన్య కు కాదా?’ అంది.

‘కట్టమంచి రామలింగారెడ్డిగారనుకుంటా, అన్నారు ‘నేను బ్రహ్మచారిని కాను;అవివాహితుడిని మాత్రమే’ అని. అలాగా.. నేను కన్యని కాను. అవివాహితను మాత్రమే’ అంది సురభి.

విద్య ముఖంలో భావం చూసి, సురభి మళ్లీ నవ్వింది.

__

సురభి నుంచి ఆమె కథను రాబట్టడానికి విద్య చాలా ఓపిక పట్టాల్సివచ్చింది. డిగ్రీ కాలేజీలో అధ్యాపకులుగా చేరిన రెండు మూడేళ్ల వరకూ వాళ్లిద్దరి మధ్య పెద్దగా స్నేహం లేదు. సురభి తెలుగు లెక్చరర్ అయితే, విద్య కెమిస్ట్రీ. విద్య సైన్స్ అధ్యాపకులతోనే ఎక్కువ స్నేహం చేసేది. అదీ కాక, తన భర్త, కొడుకులతో ఆమెకు సరిపోయేది. సురభి ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు. క్లాసు లేకపోతే తెలుగు నవలో, ఇంగ్లీష్ నవలో చదువుతూ కూర్చునేది. రెండేళ్ల క్రితం వరకూ తన లోకంలో ఉన్న విద్య జీవితం హటాత్తుగా మారిపోయింది. ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేసింది. అప్పటికే అతను షికాగోలో ఉన్నాడు కనక కోడలు వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాని నుంచి కోలుకోడానికి విద్యకు చాలా సమయమే పట్టింది. అంతవరకూ చాలా స్నేహంగా ఉన్న సహోద్యోగులు ఆమెను ఒంటరిగా వదిలేస్తే కోలుకుంటుంది లెమ్మనుకున్నారో, లేక వాళ్ల జీవితాలతో బిజీగా ఉన్నారో కానీ పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. అప్పుడే దగ్గరయింది సురభి.

“భర్త చనిపోతే జీవితం ఆగిపోదుగా?’ అంది ఒకరోజు విద్యతో సురభి.

“మాది ప్రేమ వివాహం సురభిగారూ… ఒక్కరోజు కూడ ఆయన నన్ను బాధపెట్టింది లేదు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్లం.. మీకేం తెలుస్తుంది లెండి ఆ ప్రేమ?’ తన ఉక్రోషంలో అనేసింది విద్య.

సురభి ఏమీ కష్టపెట్టుకోలేదు. చాలా మామూలుగ మాట్లాడింది “మీ బాధను నేను తక్కువ చెయ్యడం లేదు. కానీ అందులోంచి తేరుకోడానికి ప్రయత్నించాలని అడుగుతున్నానంతే. ఇలా ఎన్నాళ్లు కాలేజీ మానేసి, తిండి మానేసి ఉంటారు? మీరింకా బతికే ఉన్నారు కదా. మీకు పెళ్లి, పిల్లలు కాక వేరే జీవితం వ్యక్తిగా ఉండాలనే కదా ఒక వృత్తి లోకి దిగారు? ఆ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఎంతో ఇష్టపడతారు. ‘

ఇలా మాట్లాడుతూ, ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేసింది సురభి. క్రమంగా వాళ్ల పరిచయం స్నేహంగా మారి, తను ఉంటున్న అద్దె ఇల్లు వదిలి, విద్య కోసం ఆమె ఇంట్లో చేరింది సురభి, పేయింగ్ గెస్ట్ గా. ఎంత ప్రయత్నించినా తన గురించి ఏమీ చెప్పుకోని సురభి అంటే ఒక్కొక్కసారి కోపం వస్తూంటుంది విద్యకు.

‘వో జో మిల్ తేథే కభీ హమ్ సే దీవానోంకీ తర్హా… ఆజ్ యూ మిల్ తేహై జైసే కభీ పెహచాన్ నథీ’ పాడుతూ దోశెలు వేస్తోంది సురభి.

“హు. మళ్లీ మొదలు. నువ్వు తెలుగు మాస్టారివా? హిందీ మాస్టారివా? ‘ విసుక్కుంది విద్య.

‘ఎక్కడ సాహిత్యం బాగుంటే అక్కడ నేనుంటాను… భాషతో నిమిత్తం లేదు’ దోశెలు రెండు ప్లేట్లలో వేసి తెచ్చింది సురభి. సురభి లేచి చట్నీతో సహా మిక్సీని తెచ్చి టేబిల్ మీద పెట్టింది.

“దీన్నికప్పులోకి తీసే ఓపిక కూడ లేదా విద్యా’ అంది సురభి.

“అబ్బ. ఎంతుంది లెద్దూ. ఇద్దరం ఈ దోశెలు తినేసరికి అది అయిపోతుంది. మళ్లీ గిన్నెలు, కప్పులు ఎందుకూ’ సురభి నవ్వేసింది.

‘ఈ పాట నాకెందుకు ఇష్టమో తెలుసా? నేను ప్రేమించిన వ్యక్తి అలాగే ప్రవర్తించాడు కనక’ అంది సురభి. ఉరమని పిడుగులా తనంతట తాను సురభి ఈ టాపిక్ మొదలుపెట్టేసరికి ఆశ్చర్యపోయింది విద్య.

అక్కడికీ చాలా జాగ్రత్తగ అడిగింది “ఆ పాటకు అర్థమేంటి? అతనెవరు?’

‘ఒకప్పుడు నన్ను కలుసుకోవడానికి పిచ్చివాడిలా తపించేవాడు- ఈ రోజు కలిస్తే, నేనెవరో తెలియనట్టే ఉన్నాడు’  అదీ అర్థం. ఇక అతనెవరంటావా? వినోద్ కుమార్ అనీ…. ‘ విద్య ప్రశ్నార్థకంగా చూసింది. తను ప్రశ్న అడిగితే మళ్ళీ టచ్ మీ నాట్ లా ముడుచుకుపోతుందేమోనని మాట్లాడలేదు. సురభి విద్య కేసి చూసి నవ్వింది.

“సరేలే. విను. నేను ఎం.ఏ చేస్తున్నప్పుడు అతను నాకు పరిచయం. ఇంజనీరింగ్ చదివేవాడు. కానీ నా క్లాస్ మేట్ కి స్నేహితుడు. అందుకని రోజూ మా డిపార్ట్ మెంట్ కు సాయంత్రమయ్యేసరికి వచ్చేవాడు. అలా పరిచయం. తర్వాత్తర్వాత ఆ ఫ్రెండ్ కోసం కాక నా కోసం వస్తున్నాడని అందరికీ తెలిసిపోయిందనుకో. కానీ మా ప్రేమకు అదేమీ అడ్డు కాలేదు’

‘మరి.. పెళ్లి? ‘

‘అక్కడే వచ్చింది చిక్కు’ అని నవ్వింది సురభి.

‘ఏం? షరా మామూలా? మేనరికం ఉందనో, ఎక్కువ కట్నం వస్తుందనో తప్పించుకు పారిపోయాడా?’

సురభి అడ్డంగ తలవూపింది.’ అతను కాదు. నేను.. నేనే చేసుకోనన్నాను’

విద్య నిర్ఘాంతపోయినట్టు చూసింది. సురభి ఖాళీ పళ్లాలు తీసికెళ్లి సింక్ లో పడేసి తిరిగి వచ్చి కూర్చుంది. మళ్లీ లేచి లైట్లు వేసి కూర్డుంది. విద్య ఆమె కేసి చూస్తూ కూర్చుంది.

‘వెళ్లి ఎంగిలి చెయ్యి కడుక్కురా. ఈలోగా నా జీవితం అయిపోదు’ నవ్వింది సురభి.

‘ఇంక చాల్లే సస్పెన్స్. చెప్పు తల్లీ’ ధైర్యం తెచ్చుకుని అడిగేసింది విద్య.

‘పెద్ద కథేమీ లేదు. అతనికి ఎం.ఎస్ చెయ్యడానికి అమెరికాలో అవకాశం వచ్చింది. నాకు పిహెచ్. డి లో సీటు వచ్చింది. పెళ్లి చేసుకుని వెళ్దామన్నాడు. చదువు పూర్తయ్యేదాకా రానన్నాను. అమెరికాలో తను సెటిల్ అవుతాడట. తెలుగు పిహెచ్.డిని అక్కడేం చేసుకుంటావు? అక్కరలేదు. రమ్మన్నాడు. అమెరికాలో సెటిల్ అయినా, నా పిహెచ్.డి నాక్కావాల్సిందే అన్నా..’

‘అలా ఎందుకన్నావు? అతని ప్రేమ కంటే నీ డిగ్రీ ఎక్కువా?’

“అదే అతనూ అన్నాడు. ఇక్కడ విషయం చదువుకీ, అతనికీ మధ్య పోటీ కాదు. నేను దాన్నలా చూడలేదు. అతను చదువులో బిజీగా ఉంటాడు. అమెరికాలో ఎం.ఎస్ అంటే ఎంత కఠినంగా ఉంటుందో తెలిసిందే. అసలు నాతో మాట్లాడ్డానికి కూడ టైం ఉండదు. అందులోనూ చదువుకుంటూ ఉద్యోగం చెయ్యాల్సివుంటుంది బతకడానికి. ఇక మేమిద్దరం ఆనందంగా ఉండేదెక్కడ?  అప్పుడే పెళ్లి చేసుకోవడంలో ఏం అర్థం కనిపించలేదు నాకు. ఆ మాటంటే ఏమన్నాడో తెలుసా?” విద్య ప్రశ్నార్థకంగా చూసింది

విద్య ప్రశ్నార్థకంగా చూసింది.

“నీ పిహెచ్.డి నీకు అంత ముఖ్యమైతే, నేను అమెరికా వెళ్లడం మానేసి, ఇక్కడే ఉండిపోతాను. పెళ్లి చేసుకుందాం’ అన్నాడు’

“అబ్బో. అలా అనే మగవాళ్లు కూడ ఉంటారా?’ విద్య ఆశ్చర్యంగా అంది. ‘అంత ప్రేమించిన వాణ్ణి ఎలా వదులుకున్నావు?’

“ నాకు నీలా ఆనందం కలిగిన మాట నిజమే. కానీ …”

“కానీ ఏమిటి? అలాంటి వాడు దొరికితే నేనైతే ఆ రోజే చేసుకునేదాన్ని…నీకేం వచ్చింది’

సురభి ఒక్క క్షణం ఆగింది.

‘ విను…అతను మంచివాడు కదాని నేను అడ్వాంటేజి తీసుకోవచ్చా? అంటే…నా కోసం అంత పెద్ద త్యాగం చేసాక, అతను ఇక్కడ ఆనందంగా ఉంటాడా? జీవితమంతా తన అమెరికా అవకాశం పోయినందుకు బాధపడకుండా ఉంటాడా? అప్పటికే రెండేళ్లుగా అమెరికాకోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంట్లో వాళ్ల కోరిక కూడ కొడుకుని అమెరికా పంపడమే’

“కానీ అతనే ఒప్పుకున్నాడు కదా?’

“ప్రేమ వేడిలో, ఆ క్షణం నేను దూరమవుతానన్న బాధలో ఏదైనా ఒప్పుకోవచ్చు. కానీ తర్వాత? ఇక్కడ ఉద్యోగం, సంపాదన అతను ఆశించిన స్థాయిలో ఉండే నమ్మకం లేదు. అతని తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ అందరూ మంచి అవకాశం వదిలేసుకున్నావని పదిసార్లంటారు. మొదట్లో కాదనుకున్నా తర్వాత అతనికి కూడ అలాగే అనిపించవచ్చు. అంతే కాదు. తను ఇక్కడే ఉంటే వెంటనే పెళ్లి చేసుకుందామని కూడ అన్నాడు. దానికి నేనసలు ఒప్పుకోలేదు. అతనసలే ఒక్కగానొక్క కొడుకు. విడికాపురం పెట్టమని నేనడిగే ప్రసక్తే లేదు. కుటుంబ జీవితం మొదలుపెట్టానంటే నా చదువు అటకెక్కినట్టే. మూడేళ్లు ఆగి చేసుకుందామని ఎంత చెప్పినా  అతను ఒప్పుకోలేదు. వెంటనే పెళ్లి అని మొదలుపెట్టాడు. ఇక లాభం లేదని ‘నువ్వు అమెరికా వెళ్లి చదువుకో, ఉద్యోగంలో చేరు. తర్వాత ఇక్కడికి రా. ఈలోగా నా పిహెచ్.డి పూర్తి చేసుకుని నీతో వచ్చేస్తాను’ అన్నాను. అతని అనుమానమేమిటో తెలీదు. మూడేళ్లు మమ్మల్ని మార్చేస్తాయనుకున్నాడో ఏమిటో. నమ్మకం తక్కువనుకుంటా తన మీద, నా మీద.. మా ప్రేమ మీద..’

“ఏం చేసాడు?

‘అమెరికా వెళ్లిపోయాడు. చాలా కోపంగా. అక్కడే చదువు, ఉద్యోగం, అక్కడున్న తెలుగమ్మాయితోనే పెళ్లి..”

‘నువ్వు మళ్లీ కలవలేదూ?’

‘రెండేళ్లకోసారి ఇండియాకు వస్తాడు. ఫ్రెండ్స్ అందరం కలుస్తాం.. నాతో మాట్లాడ్డు. అసలు నాకేసే చూడడు”

“సరిపోయింది. మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు?’  విద్య చికాగ్గా అడిగింది

“పెళ్లి చేసుకునేంతగా  ఇంకెవర్నీ  ప్రేమించలేకపోయాను కనక’ అంటూ లేచి రేడియో ఆన్ చేసింది సురభి.

’హమ్ ఇంత్ జార్ కరేంగే.. తేరా కయామత్ తక్’ పాట వస్తోంది.

సురభి నవ్వింది ‘అర్థంచెప్పనా? నేను నిరీక్షిస్తూనే ఉంటాను – నీ కోసం ఆఖరిరోజు వరకూ.’ కయామత్ అంటే జడ్జ్ మెంట్ డే అని అర్థమనుకో… కానీ… భావం అదే….’ సురభి ఇంకా  ఆ పాట సాహిత్యాన్ని వివరిస్తూనే ఉంది.

విద్య మాట్లాడలేదు. సురభి చూడకూడదని లేచి వంటింట్లోకి వెళ్తూ కళ్లు తుడుచుకుంది.

 

లోగో బొమ్మ: మమత వేగుంట సింగ్ 

 

 

మృణాళిని

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాన్నాళ్ళకి మృణాలిని గారి కధ అదీ మంచి కధ చదివి తన్మయుడినయ్యాను. సురభి పాత్ర ను బాగా చిత్రీకరించారు. వెనక్కి వెళ్ళి అన్నీ కధలూ చదువుతాను

  • మరీ
    ఇంత సాధారణంగా ఉందేమిటి కథ ,అనిపించింది .
    హిందీ సినిమా సంగీతం లో ఎన్నో కోణాల్లో, అతి సంక్లిష్ట సందర్భాలేవో చాలా కనిపిస్తాయి.
    వేచి ఉంటాము ,అలాటి కథల ఆలోచనలు అల్లుకునే పాటల సాహిత్యం కోసం

  • మాట్లాడుకుంటూ ఉండే విషయాలను చక్కటి కథగా మార్చారు. అభినందనీయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు