ప్రేమ్ నగర్ పాడిన ఆగ్రహ గీతం

ఒక మహత్తరమైన ఊరు తన గుండె గేయాన్ని ఎలుగెత్తి పాడింది.

Jab zulm-o-sitam ke koh-e-garan
Rooyi ki tarah ud jayenge,
Hum dekhenge hum dekhenge
Hum mehkumon ke paon tale,
Ye dharti dhar dhar dharkegi,
Aur ahl-e-hakam ke sar oopar,
Jab bijli kar kar karkegi,
 

–ఫైజ్

***
వాళ్ళన్నారు
ఊరంతటికీ
ఒకటే రంగేస్తామని
మేమన్నాం
మాది ఏడురంగుల
శ్వేత వర్ణమని
వాళ్ళన్నారు
మిమ్మల్ని విడదీసి
కొందరిని ఏరేస్తామని
మేమన్నాం
సియామీ కవలలం
కదా మేం అని
***
   రెండు-మూడు వారాలుగా ఉబుకుతున్న క్రోథం, పేరుకుంటున్న దుఃఖం, సొంపనివ్వని ఆలోచనలు — ఈ శనివారం మధ్యాహ్నానికి అన్ని హద్దుల్నీదాటేశాయి. ఊరు కట్టలుతెంచుకున్న చెరువైంది. మొజాంజాహీ మార్కెట్లో పట్టుకుని నుంచి పంజరాల్లో పెట్టి నల్లమల అడవుల్లోకి వదలబడ్డ పావురాలు — వందలసంవత్సరాల ఇంటి ఆనవాళ్లను పట్టుకుని ఎగురుకుంటూ వచ్చి — ఈ ఊరు మీదే కాదు మాది కూడా అని ప్రకటించినట్టు — వేలమంది మంది ఇళ్లలోంచి, సందుల్లోంచి, మొహల్లాల్లోంచి, రేకుల షెడ్డులనుంచి, నాలాల అవతలనించి, ప్రహారీల ఎత్తులు దాటుకుని, భయాలను బద్దలుకొట్టి, ఆంక్షల్నితుత్తునియలు చేసి, పిల్లల్ని ఎత్తుకుని, నినదించే హృదయాల్ని జెండాలుగా ఎగరేసిన మధ్యాహ్నం….ఒక మహత్తరమైన ఊరు తన గుండె గేయాన్ని ఎలుగెత్తి పాడింది.
***
  ఊరంటే హృదయం కదా!
  ఇది హృదయంనిండా పూల తోటల్ని నింపుకున్నభాగ్ నగర్ కదా!
  ఎవరో వచ్చి ఆగం చేస్తే ‘జీ హుజూర్’ అని పడివుంటుందా?
***
  ఊరంటే మనుషులు కదా!
  తారామతి ప్రేమగీతాలతో వెలిగిన ప్రేమ్ నగర్ కదా!
  ఇప్పుడు వాడెవడో వచ్చి ద్వేషాగీతం పాడమంటే ఎలా పాడుతుంది?
***

ఊరంటే తల్లి కదా!

వేల ఏళ్లుగా ఒడి చేరిన బాటసారుల్ని చేరదీసిన ఊరుకదా!
ఇప్పుడు మనం వేరు, వాళ్ళు వేరు అంటే ఎందుకూరుకుంటుంది?
***
ఇన్నాళ్లూ రెక్కలకింద భయంతో పిల్లల్ని పొదివిపట్టుకున్న ఈ నగరం
— ఇప్పుడు ఇక పిల్లల్ని వేలాదిగా వెంటేసుకుని రోడ్ల మీద
ఈ శనివారం మధ్యాహ్నం ఓ ప్రేమ గీతం పాడింది
అది ఒక పెను ఆగ్రహ ప్రకటనగా ప్రతిధ్వనించింది
***

కూర్మనాథ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు