ప్రేమించి చూడు

నేను మంథనిలో మధుకర్ నయాను. నేనే తమిళనాట శంకర్ నయాను. నేనే మిర్యాలగుడలో పెరుమాళ్ళ ప్రణయ్ నయాను. ఎర్రగడ్డలో మాధవి నయాను.

విష సర్పాలు!

‘మనిషి కోతి నుండి పుట్టలేదు’

‘మరి?’

‘పాము నుండి పుట్టాడు’

‘ఎలా చెప్పగలవ్?’

‘పామే తన పిల్లల్ని తాను తినేస్తుంది’

ఈ నలుగురూ!

పట్టపగలు. నట్టనడి రోడ్డు. నలుగురూ చూస్తున్నారు.

కన్నతండ్రి వొకడు కాలయముడయాడు. కత్తితో కూతురు కుత్తుక పరపరా కోసేస్తున్నాడు.

ఔను, కూతురు నేరం చేసింది. ప్రేమించింది. కానివాణ్ణి. కులం కానివాణ్ణి.

‘నాన్నా’ నెత్తురోడుతూ కూతురు. అలసి ఆగి యేమిటన్నట్టు చూశాడు తండ్రి.

‘నన్ను యెందుకు చంపుతున్నావు?’ అతి కష్టమ్మీద అడిగిందా అమ్మాయి.

‘నలుగురిలో నన్ను తలెత్తుకోకుండా చేశావ్.. చావు..’ కత్తితో మరో వేటు వేయబోయాడు తండ్రి.

‘ఎవరు నాన్నా ఆ నలుగురు?’ కన్నీరూ రక్తమూ కలగలుస్తుండగా గొంతు పెగుల్చుకు పెనుగులాడుతూ అడిగింది కూతురు.

ఆ నలుగురూ నిలబడి చోద్యం చూస్తున్నారు. బుద్దిమంతుల్లా నోటిమీద వేలేసుకు చూస్తున్నారు. ఒకరి వూసుకీ జోలికీ వెళ్ళే రకం కాదన్నట్టుగా చూస్తున్నారు. చూస్తూనే నిలబడ్డారు.

‘ఒక్కరయినా వచ్చి నిన్ను ఆపారా? నన్ను బతకనివ్వమన్నారా? వీళ్ళ కోసమా నాన్నా నువ్వు నన్ను చంపుతున్నది?’ గొంతులోంచి కాదు, తెగిన కంఠనాళం లోంచి గాలిగాలిగా మాట బయటికొచ్చింది.

అప్పటికే ఆ తండ్రి మరో వేటు వేసాడు.

ఆ తరువాత ఆ కూతురు మళ్ళీ మరొక్క మాట అడగలేదు!

పెంపకపు హక్కు!

ఒకడు కోడిపిల్లలను ప్రేమగా పెంచాడు. కష్టపడికూడా పెంచాడు. కావలసిన తిండి పెట్టాడు. ముద్దు చేశాడు. పెద్ద చేశాడు. తరువాత కోసుకు తినేశాడు.

ఇంకోడు మేకపిల్లలను ప్రేమగా పెంచాడు. కష్టపడికూడా పెంచాడు. కావలసిన తిండి పెట్టాడు. ముద్దు చేశాడు. పెద్ద చేశాడు. తరువాత కోసుకు తినేశాడు.

మరొకడు గొర్రెపిల్లలను ప్రేమగా పెంచాడు. కష్టపడికూడా పెంచాడు. కావలసిన తిండి పెట్టాడు. ముద్దు చేశాడు. పెద్ద చేశాడు. తరువాత కోసుకు తినేశాడు.

ఇంకొకడు తను కన్నపిల్లలను ప్రేమగా పెంచాడు. కష్టపడికూడా పెంచాడు. కావలసిన తిండి పెట్టాడు. ముద్దు చేశాడు. పెద్ద చేశాడు. తరువాత కోసుకు తినేశాడు.

అర్థ తాత్పర్యాలు!

‘తండ్రీ కూతుళ్ళది రక్త సంబంధం’

‘కాదు, రక్తసిక్త సంబంధం’

ఆడవాళ్ళకు మాత్రమే!

పెళ్ళయ్యాక కూతురికి యింటి పేరుకూడా యివ్వనన్నాడు తండ్రి.

కాని ఆడపిల్లగా నా పరువూ బరువూ నువ్వే మొయ్యాలన్నాడు.

బరువు మొయ్యలేనని దించిన కూతురు తల తెగ్గోసి తలపాగా కట్టుకున్నాడు తండ్రి.

సేమ్.. షేమ్!

‘అర్థమయ్యిందా?’

‘ఊ’

‘ఏమర్థమయ్యింది?’

‘సేమ్ క్యాస్టు వాడ్నే ప్రేమించాలి’

‘ఇంకా?’

‘సేమ్ క్యాస్టు వాడ్నే పెళ్లాడాలి’

‘ఇంకా?’

‘సేమ్ రిలిజియన్ అయ్యుండాలి’

‘ఇంకా?’

‘సేమ్ స్టేటస్ కూడా వుండాలి’

‘ఇంకా?’

‘……………………………..’

‘ఇంకా?’

‘ఊ.. సేమ్ జెండరు అయ్యుండాలి’

‘వాట్ నాన్సెన్స్?’

‘కోర్టు కూడా రీసెంటుగా తప్పు కాదని తీర్పిచ్చింది’

‘ఇట్స్ షేమ్..’

‘నో.. ఇట్స్ సేమ్ టు సేమ్!’

ముందస్తు హామీ!

‘వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే- అన్యకులస్తుల్ని పెళ్ళి చేసుకుంటే ఆ పెళ్ళి చెల్లదని చట్టం తెస్తాం!’

‘సార్.. పనిలో పని- అన్యమతస్తుల్ని పెళ్ళి చేసుకుంటే కూడా చెల్లదని చట్టం చేయండి సార్..’

‘తప్పకుండా- ఏకులంలో పుట్టారో ఆ కులం వారినే పెళ్ళాడిన యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం!’

‘థాంక్యూ సర్.. మా పిల్లల్ని మేం నరుక్కొనే కనీస హక్కుని కల్పించండి’

‘మీ పిల్లల్ని మీరు నరుక్కొనే హక్కే కాదు, మీ పిల్లల్ని ప్రేమించి పెళ్ళాడిన వాళ్ళని కూడా నరుక్కొనే హక్కుని ప్రాధమిక హక్కులో చేర్చేలా చట్టం తీసుకొస్తాం’

‘మీరు ఒక్కరూపాయి యివ్వక్కర్లేదు.. వొత్తినే వోట్లేస్తాం.. మా తలిదండ్రుల వోట్లన్నీ మీకే వేస్తాం.. గెలుపు మీదే సార్..’

ఘర్ వాపసి!

‘నేను గర్భవతిని..’

‘నీ మొగుడ్ని చంపేశినం కదా?, ఘర్ వాపసి కా’

‘నేను రాను.. నా భర్త యింట్లోనే వుంటా’

‘ఇలా యిక్కడ్నే వుంటే నీ జీవితమెట్లా? సేమ్ క్యాస్టులో చూసి పెళ్ళి చేస్తరు రా’

‘నేను రాను.. నా ప్రణయ్ని కోల్పోయిన.. ఆకుటుంబానికి వారసుణ్ణి యిస్తా’

‘ప్రణయిగాడితో పాటు నిన్నూ ముక్కలుముక్కలు నరకాలి.. జై హిందూ జనశక్తి’

మారుతీలు!

‘అన్నా.. రాముడ్ని యేదో అన్నడని కత్తిమహేష్ని నగర బహిష్కరణ చేసిన్రు గదనే, మళ్ళీ దాన్ని దిద్దుకోవడానికి సమం చేయడానికి పరిపూర్ణానందస్వామినీ నగర బహిష్కరణ చేసిన్రు గదనే..’

‘ఔను తంబీ.. స్వాములోరు స్టే తెచ్చుకొని నగరంలో ర్యాలీ తీసి మరీ జై జై ద్వానాల మధ్య అడుగు పెట్టారు’

‘అయితే యిప్పుడు శాంతిభద్రతలకి వొచ్చిన ముప్పుగాని ప్రమాదంగాని లేదన్నట్నే గదనే?’

‘ఊ..’

‘అయితే, అందుకే- మిర్యాలగూడలో ఆర్యవైశ్యులకు ర్యాలీకి అనుమతిచ్చినట్టున్రు..’

‘నూటేభైమంది ర్యాలీగా వెళ్ళి అమృత తండ్రిని కలిసి మద్దతు కూడా యిచ్చారు’

‘హంతకుడు మారుతీరావుకు మద్దతు యివ్వడమేమిటన్నా?’

‘తప్పు తంబీ.. మారుతీరావే స్వయంగా నేరం అంగీకరించినా అతడు హంతకుడు కాదు, కోర్టు నిర్ధారించిన వరకూ నిందితుడే!’

‘సారీ అన్నా.. తెలీక హంతకుడు అనేసిన.. నామీద కేసు పెట్టరు గదనే?, అన్నా నాదొక అనుమానం?’

‘చెప్పు?’

‘నిందితుడు మారుతీరావు సఫారీ కోటిరూపాయలకి మాట్లాడుకున్నడు గదా.. ఆ డబ్బు ఈ ర్యాలీ తీసినోళ్లంతా జమ జేసిన్రేమోనే?’

‘ఏం మాట్లాడుతున్నావ్? మారుతీరావుని అంత తక్కువ జెయ్యకు..’

‘సారీ అన్నా.. జైలుదాక పోయిన్రు, ప్రణయి విగ్రహానికి అనుమతియ్య వద్దని వినతిపత్రాలు యిచ్చిన్రు, మద్దతు అంటే మాట మద్దతు మాత్రమే వుంటదా యేమి?’

‘అర్థం చేసుకో, మారుతీరావుకి మనం కూడా మద్దతు ఈయాల.. అర్థమయిందా?’

‘ఎందుకన్నా?’

‘ఎందుకేమిట్రా.. మన పిల్లల మీద మనకి హక్కువుండాలంటే.. మన పిల్లలు మనకు దక్కాలంటే.. జాతితక్కువ వాడల్లా మనకి అల్లుడనైపోతానని మన కూతురు చెయ్యిపట్టుకోకుండా వుండాలంటే..’

‘అర్ధమయిందన్న.. మంచీ చెడూ చూడకుండా మనమందరం భేషరతుగా మారుతీరావుకు మద్దతీయాల!’

‘అంతే కాదు.. మనం మారుతీరావులం కావాలి!’

‘అంటే ర్యాలీ తీసిన నూటేభైమంది మారుతీరావులే కాదు, కొన్ని కోట్లమంది మారుతీరావులు వున్నారన్నట్నేగదూ?’

‘మరి? ర్యాలీకి అనుమతించడం కాదు, రేపు జైలునుండి బెయిలు తీసుకొచ్చినప్పుడు ఊరేగింపుగా తీసుకురావాలి’

‘టపాసులు కూడా కాల్చుదామన్నా.. మస్తుగ ధూమ్ ధామ్ గ  దావత్ యిద్దామన్నా’

విగ్రాగ్రహం!

‘కలెక్టరుగారూ ప్రణయ్ విగ్రహానికి అనుమతించొద్దు’

‘ఎస్పీగారూ ప్రణయ్ విగ్రహానికి అనుమతించొద్దు’

‘అనుమతిస్తే గిస్తే మా మారుతీరావు విగ్రహానికి అనుమతించండి’

‘అరె.. గ మారుతీరావు బతికున్నడు గదనే, ఆయన విగ్రహం యెట్ల పెడుతరు?’

‘అయితే మారుతీరావుని సంపేసన్నా విగ్రహం పెడదాం!?’

విత్తులూ కత్తులూ!

‘ఎనిమిదో తరగతీ  తొమ్మిదో తరగతిలో ప్రేమేంటి అసహ్యంగా.. చంపి పాతిపెట్టేవాడు లేక?’

‘అప్పుడు స్నేహితులు.. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు నిండాక మేజర్లు అయ్యాక కదా పెళ్ళి చేసుకున్నారు?’

‘అసలు చదువుకోకుండా ప్రేమా గీమా అని భవిష్యత్తును నాశనం చేసుకున్నారు..’

‘నాశనం చేసింది తండ్రి, ఎక్కడ ఎప్పుడు చంపేస్తాడోనని కాలేజీ మానేసారు..’

‘ఇరవైమూడు సబ్జెక్టులు బ్యాకులాగున్నాయి తెలుసా?’

‘ఎప్పుడు చస్తామో తెలీక భయపడిపోతుంటే చదువెలా తలకెక్కుతుంది?’

‘అయినా వూళ్ళోకొచ్చి వెక్కిరించినట్టు కళ్ళకెదురుగా కాపురం పెట్టడమేంటి?’

‘ప్రణయివాళ్ళదీ యిదే సొంత వూరు కదా.. ఎక్కడికి పోతారు?’

‘ఎక్కడో చావాలి, వూళ్ళోకొచ్చి చావడమేమిటి? అయినా ఫేసుబుక్కులో ఆ పెళ్ళి వీడియోలేమిటి వెక్కిరించినట్టు?’

‘పెళ్ళికి వీడియోలు తియ్యకూడదని, పెళ్ళి ఫోటోలు షేర్ చెయ్యకూడదని తెలియని వయసు..’

‘అర్ధమయ్యింది.. యింతకీ నువ్వు చర్చి బ్యాచా? మాలా? మాదిగా?’

‘……………………………………………………………………………..’

‘అదీ సంగతి.. నువ్వు మా క్యాస్టులో పుడితే మా కష్టం నీకు తెలిసేది.. మా బాధ నీకు అర్థమయ్యేది!’

వయసు పిలిచింది!

‘మరీ ఒళ్ళు కొవ్వు కాకపోతే పద్నాలుగేళ్ళకు ప్రేమేమిటి?, మంచిపని చేసాడు.. ఏ తండ్రయినా అదే చేస్తాడు..’

‘ఔను బామ్మగారూ.. మీ పెళ్ళెప్పుడయ్యింది?’

‘నా పెళ్ళి నా పన్నెండో యేటయ్యింది.. ఇలా పుష్పవతిని అయ్యానో లేదో అలా పెళ్ళయ్యింది.. ఏడాది తిరక్కుండానే మా పెద్దాడు కడుపులో పడ్డాడు.. మా పెద్దాడికి ఏడాది వుండంగనే మా చిన్నాడు కడుపులో పడ్డాడు..’

‘చాలా తొందరగా కనేసారు..’

‘నీ వయసుకి అంటే పద్దేనిమిదేళ్ళకి నలుగుర్ని కనీ కాన్పు యెత్తిబెట్టేసాను.. అంటే పిల్లలకి పొలిస్టాప్ పెట్టేసాను..’

అందమూ ద్వందమూ!

‘కలికాలం.. కలికాలం..’

‘ఏమయ్యింది?’

‘పిదప కాలం.. పిదప బుద్దులు..’

‘ఎవరు?’

‘బళ్ళోకెళ్ళే వయసులో బారసాల చెయ్యమంటున్నారు..’

‘పిల్లల మధ్య వుండేది స్నేహం..’

‘స్నేహం ముదిరితే ప్రేమ..’

‘ప్రేమకు స్నేహమే ప్రాతిపదిక..’

‘ప్రేమా? వల్లకాడా? కామం..’

‘దేవదాసు పారూ బాల్య ప్రేమికులు..’

‘పిచ్చరు బాగుంటాది..’

‘తూనీగా తూనీగా పాట?’

‘సూపరుంటాది.. నాఫేవరేటు సాంగు’

‘అమృత ప్రణయ్..’

‘వాళ్ళ వూసెత్తకు.. మండుతుంది’

‘ఎందుకు?’

‘వయసురాకుండా వన్నెలూ సిన్నెలూ’

‘ఈ వుయ్యాల్లో యెవరు?’

‘నా మనవరాలు.. నా మనవడి పెళ్ళాం’

‘ఇంకా వుయ్యాల్లోనే వుందిగా?’

‘అది కడుపులో వుండగా అనుకున్నాం’

‘ఏమని?’

‘నాకూతురికి కూతురు పుడితే నా కొడుకు కొడిక్కి యిద్దామని’

‘ఔనా?’

‘వాళ్ళిద్దరూ పుట్టకముందే మొగుడూ పెళ్ళాలు!’

‘వీళ్ళిద్దరూ?’

‘వాళ్ళ పేర్లెత్తకు నాకు మంట..’

‘పాపం అబ్బాయిని నరికి చంపేసారు’

‘చంపాలా? వాళ్ళని నరికి పాతరేయాలా?!’

శూద్ర జననం!

‘నవమాసాలు మోసీ కనీ అల్లారుముద్దుగా పెంచిన కూతురు దూరమైతే ఏ తండ్రైనా తట్టుకోగలడా?’

‘మారుతీరావే తండ్రి కాదు, బాలస్వామి కూడా తండ్రే. ప్రణయిని కూడా నవమాసాలు మోసీ కనీ..’

‘లేదండీ.. వాడు పాదాల నుండి పుట్టాడు.. నవమాసాలు మొయ్యలేదు.. వాళ్ళమ్మ నొప్పులు పడలేదు?!’

జంటకవులు!

‘నేను నాకూతుర్ని నరికేశాను’ గొప్పగా అన్నాడు చారి.

‘నేను నా అల్లుడ్ని నరికేయించాను’ మరింత గొప్పగా అన్నాడు రావు.

‘మీరే నా ఇన్స్పిరేషన్’ చారి రావుకు దండం పెట్టాడు.

‘కోటి రూపాయలు సఫారి మాట్లాడుకున్నాను, పనయ్యింది సంతోషం’ వుప్పొంగిపోయాడు రావు.

‘నా దగ్గర కోటి లేదు..’ చారి దిగులుగా అన్నాడు.

‘లేదు.. లేదు.. నువ్వు కోటి రూపాయల విలువైన పని చేశావ్’ రావు మెచ్చుకున్నాడు.

‘అంతడబ్బు యెందుకు ఖర్చు పెట్టారు?’ అమాయకంగా అడిగాడు చారి.

‘ఎంతయినా ఖర్చు పెడతాను. ఎందుకంటే నా కులం నాకు ముఖ్యం. నా కూతురు పోతే వస్తుంది. కులం పోతే రాదు..’ అన్నాడు రావు.

‘కూతురు పోతే రాదు కదండీ?’ బేలగా చూశాడు చారి.

‘మళ్ళీ కంటాం, పెళ్ళానికి ఫామిలీ ప్లానింగు అయితే మరొకదాన్ని తెచ్చుకుంటాం’ గర్వంగా మీసం మెలేసాడు రావు.

‘మరి మనకి ఫామిలీ ప్లానింగు అయితే?’ అడగబోయి మింగేసి ‘మరొకడ్ని తెచ్చుకుంటాం’ అని సరిపెట్టేసుకున్నాడు చారి.

‘మనలోమన మాట.. కులం యెక్కడికీ పోదు కదండీ?’ అనుమానంగా అడిగాడు చారి.

‘కులం అంటే కులం మాత్రమే కాదు, దాన్ని అంటిపెట్టుకున్న వ్యాపారం.. యవ్వారం.. అవి పోతే?’ రావు మాటలు అర్థం కానట్టు చూశాడు చారి.

‘కడజాతివాడితో కూతురు వెళ్ళిపోయిందంటే యింట్లో రెస్పెక్ట్ యిస్తారా? వీధిలో రెస్పెక్ట్ యిస్తారా? చుట్టాలూ బంధువులూ రెస్పెక్ట్ యిస్తారా? మనదగ్గర పనిచేసేవాళ్ళు మనల్ని యెలా చూస్తారు? కళ్ళలోకి చూడలేని వాడు కూడా కళ్ళెగరేస్తాడు! మన అనుకున్న వాళ్ళు మన దగ్గరకొస్తారా? మన దగ్గర లాండ్ కొంటారా? ఫ్లాట్స్ కొంటారా? మనతో వెంచర్ వేస్తారా? బిజినెస్ చేస్తారా? చేసినా మనది పై చేయిగా వుంటుందా? వ్యాపారం దివాళా తియ్యదా?’ గుక్కతిప్పుకోకుండా అడిగాడు రావు.

‘ఇప్పుడు మాత్రం దివాళా తియ్యవా? మనం ఈడ జైల్లో కూర్చుంటే?’ చారి అడగలేక అడిగేశాడు.

‘ఇప్పుడు మనం జైళ్ళో శ్రీకృష్ణుడు లెక్క. మా కులపోళ్ళంతా ర్యాలీ తీశారు. మెమరాండం యిచ్చారు. రేపు బెయిల్ తెస్తారు. ఊరేగిస్తారు.  మన బిజినెస్ మనతోనే వుంటుంది. ఎటూ పోదు. కులం లెక్క..’ రావు ముఖంలో విజయగర్వం.

‘మా కులపోళ్ళు యెవరూ నాకోసం రాలేదు..’ చారి ముఖంలో దీనత్వం.

‘అన్ని కులాలూ వొకటి కావు’ రావు నవ్వాడు రావు.

ఆ నవ్వు జైలు గోడలమధ్యనే కాదు, నాలుగు దిక్కుల నడుమ ప్రతిధ్వనించింది!

కొన్ని గ్రహాలూ వొక విగ్రహమూ!

‘విగ్రహ నిర్మాణం జరగాలంటే కుదరదు..’

‘ఎందుకు కుదరదు?’

‘జీవో 55 ఫాలో కావాలి’

‘అంటే?’

‘మొదట మున్సిపల్ పాలకమండలి అనుమతివ్వాలి’

‘ఇస్తే ప్రణయ్ విగ్రహం పెట్టుకోవచ్చా?’

‘లేదు, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు అనుమతివ్వాలి’

‘ఇస్తే ప్రణయ్ విగ్రహం పెట్టుకోవచ్చా?’

‘విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదని ట్రాన్స్ కో ఏఈ అనుమతివ్వాలి’

‘ఇస్తే ప్రణయ్ విగ్రహం పెట్టుకోవచ్చా?’

‘లేదు, పంచాయితీ రాజ్ ఎస్ఈ కూడా అనుమతివ్వాలి’

‘ఇస్తే ప్రణయ్ విగ్రహం పెట్టుకోవచ్చా?’

‘ఆ తర్వాత కలెక్టర్ అనుమతివ్వాలి’

‘ఇస్తే ప్రణయ్ విగ్రహం పెట్టుకోవచ్చా?’

‘ఆ తర్వాత ఎస్పీ అనుమతివ్వాలి’

‘ఇస్తే ప్రణయ్ విగ్రహం పెట్టుకోవచ్చా?’

‘అప్పుడు కూడా విగ్రహం పెట్టుకోకూడదు?’

‘ఎందుకు?’

‘అప్పుడు మా తలిదండ్రుల సంఘం అనుమతివ్వాలి’

‘ఇస్తే ప్రణయ్ విగ్రహం పెట్టుకోవచ్చా?’

‘లేదు, అప్పుడు కూడా విగ్రహం పెట్టుకోకూడదు’

‘అదే ఎందుకు?’

‘ఎందుకంటే వాడు కులం తక్కువవాడు’

‘చనిపోయాడు కదా?’

‘చనిపోతే కులం మారిపోతుందా?’

‘మారదు!’

‘మా నిర్ణయం కూడా మారదు!!’

సృష్టి రహస్యాలు!

‘తలిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారా?- అమృతా అసలు నువ్వొక గర్భిణివేనా?’ యూట్యూబ్ వీడియోలో చెలరేగిపోయిందో అమ్మాయి.

‘నీలాంటి ఆడపిల్ల ప్రతికుటుంబంలో వుండాలి’ అని ఆ అమ్మాయిని అభినందించారు చాలామంది వీక్షకులు. నేను అయోమయంలో పడిపోయా.

‘మనం ఎంజాయ్ చెయ్యకుండా మన పిల్లలు పుట్టారా?’ అని మా ఆవిణ్ణి అడిగాను.

‘లేదండీ మనం ఎంజాయ్ చెయ్యలేదు. నోములూ వ్రతాలూ పూజలూ దీక్షలూ చేసి చిక్కి శల్యమై పోయి చెమటోడ్చి కన్నాం..’ అని మాయావిడ గలగలా నవ్వింది.

‘అది కాదు, ఎంజాయ్ చెయ్యకుండా ఏం చేశాం?’ అడిగాను, నామైండ్ ఆ మెసేజులు చదివి దిమ్మెక్కిపోయింది మరి.

‘లేదండీ మనమెక్కడ ఎంజాయ్ చేశాం. మనిద్దరమూ కలిసి కూర్చొని ఏడిస్తే పిల్లలు పుట్టారు..’ మళ్ళీ నవ్వింది మా ఆవిడ.

‘కాదు, ప్రసవం.. నొప్పులు..’ నాకు అంతకన్నా మాటలు రాలేదు.

‘అంత ఏడ్చినాకే పిల్లలు కడుపులో పడ్డారు. నవ్వుతూనే ప్రసవించాను’ అని మళ్ళీ నవ్వందుకుంది!

మారుతీరావు వొక్కడే.. మనువులే కోటాను కోట్లు!

‘మావయ్యా.. నన్ను చంపేయ్! నీ కూతురికి డబల్ బెడ్ రూమ్ యిల్లు. భూమి. ఇంకా ప్రభుత్వ వుద్యోగం. కోటి రూపాయలు. ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం’ అని ఎఫ్బీలో పోస్టు పెట్టాడొకడు. చాలా మంది లైకులు కొట్టారు.

‘కొండగట్టు బస్సు బాధితులకు కూడా అమృతకు యిచ్చేవన్నీ యివ్వాలి’ అని మరొకడు పోస్టు పెట్టాడు. చాలా మంది లైకులు కొట్టారు.

‘ల.. నీకు ఆ మా.. నాకొడుకుది రుచా? తండ్రిది కాదా?’ ఇంకొకడు పోస్టు పెట్టాడు. చాలా మంది లైకులు కొట్టారు.

‘నా మరిదినే నేను పెళ్ళి చేసుకుంటాను- అమృత’ మరింకొకడు ఫోటోలు పెట్టి షేర్ చేశాడు. చాలామంది లైకులు కొట్టారు.

‘తొమ్మిదో తరగతిలో ఒకడితో వేయించుకున్నావ్, మొగుడుపోయి వారం కాలేదు, మరిదితో కులుకుతానంటావా ల..’ ధర్మ రక్షకుడుని అంటూ ఇద్దరి ఫోటోలు పెట్టాడు. చాలా మంది లైకులు కొట్టారు.

‘అత్తామామలు కలిసి లేరు. అత్త మేడమీద గదిలో. మామ కిందగదిలో. విడాకులు తీసుకొని కలిసి వుంటున్నారు. ఇదేం ఫామిలీ’ అని మరో సంస్కారి చెలరేగిపోయాడు. చాలా మంది లైకులు కొట్టారు.

–ఇలా చదివి ఇంక చదవలేకపోయాను.

నేను మంథనిలో మధుకర్ నయాను. నేనే తమిళనాట శంకర్ నయాను. నేనే మిర్యాలగుడలో పెరుమాళ్ళ ప్రణయ్ నయాను. ఎర్రగడ్డలో మాధవి నయాను.

నేనున్న చోటు కారంచేడు అయ్యింది. నీరుకొండయ్యింది. పదిరికుప్పం అయ్యింది. కంచికచర్లయ్యింది. గోకరాజుపల్లెయ్యింది. లక్షింపేటయ్యింది.

నేను గజగజ వణికిపోయాను.

‘భయమేస్తోందా?’ అడిగింది మా ఆవిడ.

నాకిప్పుడు మారుతీరావుని, మనోహరాచారిని చూస్తే భయం వెయ్యడం లేదు?!

*

 

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

బమ్మిడి జగదీశ్వరరావు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు