ఒక స్త్రీ ఒక పురుషుడు పరస్పర ప్రేమలో పడ్డ తర్వాత ఒకరి మీద ఒకరికి పిచ్చి లాంటి, వ్యామోహం లాంటి ఆకర్షణ ఏర్పడుతుంది. అది మనస్సర్రీరాల కంటే ఎక్కువ దూరం వెళ్తుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం, ఈర్ష్యాసూయలు కలగడం, ఒకరిని మరొకరు పొసెసివ్ గా చూసుకోవడం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. Fact is stranger than fiction అన్నట్టు కొన్ని సార్లు నిజ జీవితంలో జరిగిన ఘట్టాలు విభ్రాంతి కలిగేలా వుంటాయి. ఉదాహరణకు జపాన్ కు చెందిన అడే సదా గాథ.
మనం నిజ గాథలు కూడా తెరకు ఎక్కించేటప్పుడో, అక్షరబధ్ధం చేసేటప్పుడో కాస్త పౌడరు అద్ది presentable చేస్తాము. కొంత నిజాన్ని చాటు చేస్తాము, shy away చేస్తాము. ఎలాగంటే పిల్లలు పాపలు ఎలా పుడతారూ అంటే కొంగ తెచ్చి ఇస్తుందని కథలు చెప్పినట్టు. మనల్ని మనమే మోసగించుకుంటాం. సినిమా విషయానికి వస్తే ఈ మధ్య రా అని బోల్డ్ అనీ కొన్ని పదాలు వింటున్నా. నిజానికి వాటి అర్థం నాకు తెలీకపోయినా, నేను ఆ పదాలు వాడాల్సి వస్తే ఈ చిత్రానికి వాడుతాను.
స్త్రీ పురుష సంబంధాలలో అనివార్యంగా సెక్సు కూడా వుంటుంది. కాని దాన్ని తప్పించి కథ మిగతా అంశాలన్నీ చెబుతుంది. ఎందుకు? ఎందుకంటే సెక్సు అనేది బూతు, అశ్లీలం అని ప్రపంచ వ్యాప్తంగా అభిప్రాయం స్థిరపడిపోయింది. మన దేశంలో పూర్వం లేకున్నా ఆంగ్లేయులు వచ్చిన తర్వాత మారింది. ఈ చిత్రం దర్శకుడు నాగిసా ఒషిమా చెప్పేది ఏమిటంటే : అశ్లీలత బయట పెట్టడంలో లేదు, దాయడంలో వుంది. బర్టొలుసి గాని, ఇమ్మౌరా గాని మరొకరు గాని కథాంశంగా సెక్సు వుండి చిత్రీకరించేటప్పుడే తెలుసు తమని పొర్న్ చిత్రదర్శకులుగా ముద్రవేయడం ఖాయం అని. మరి పోర్న్ కి ఈ చిత్రాలకీ తేడా ఏమిటి? నాకు ఈ చిత్రం కూడా వో “పోర్న్ సీడీ” రూపంలోనే పదేళ్ళ క్రితం దొరికింది. కారణం మరేం లేదు చాలా దేశాలలో, తీసిన జపాను లో ఇప్పటికీ, ఇది బేన్ అయి వుండడమే. ఢిల్లిలో రీగల్ హాల్లో వో సాఫ్ట్ పోర్న్ చిత్రంగా మదాం బవరీ చూసినప్పుడు వచ్చిన నవ్వే ఇప్పుడూ వచ్చింది. మా మిత్రుడొకడు అన్న మాట గుర్తొస్తున్నది. పోర్న్ బోర్ రా, ఎంతసేపూ ఆ పిండి మర గోల; ఎమొషన్ వుండదూ ఏమీ వుండదు. అవును పోర్న్ కీ ఈ చిత్రాలకీ సెక్సు కామన్ అయినా తేడా సరిగ్గా అదే.
జపాన్ లో ఒక పక్క మానవత్వం మీద దృష్టి సారిస్తూనే వ్యాకరణ రీత్యా కొత్తగా, మెరుగ్గా సినెమాలు తీస్తున్న కురసావ, ఒజు లాంటి దర్శకులు వున్న కాలంలోనే నాగిసా ఒషిమా షాక్ కొట్టే రకం సినెమాలు తీశాడు. అతనిది విద్రోహ భాష. సమాజంలో స్థిరపడిన భావజాలమంతటినీ ప్రశ్నిస్తాడు. అతని పాత్రలు కేవలం తమ అంతరంగిక కథను చెప్పుకుంటూ వున్నా చాలా సటల్ గా రాజకీయ ధోరణి కూడా కనిపిస్తుంది, స్పష్టంగానో అంతర్లీనంగానో. ఇందులోనే ఒక దృశ్యం అతను సలూన్ కి అనుకుంటా వెళ్తుంటే ఎదుటినుంచి సైన్యం వస్తూ వుంటుంది. అవతలిపక్క వరుసలో జనం నిలబడి చప్పట్లతో వారికి స్వాగతం పలుకుతుంటారు. అతను తటస్థంగా వున్నా అతను సైనికులకు వ్యతిరేక దిశలో వెళ్తున్నాడు. ఇలా ఒషిమా ధిక్కార స్వరం కనిపించకుండా వుండదు.
ఇంతకీ సినెమా పేరు చెప్పలేదు కదూ. ఇంగ్లీషులో “ఇన్ ద రెల్మ్ ఒఫ్ సెన్సెస్” 1976 లో తీసినది. జపాన్ లో షూట్ చేసినా అక్కడి ప్రభుత్వం సెన్సార్షిప్ చాలా కఠోరంగా వుండడంతో ప్రాసెసింగ్ కి ఫ్రాన్సుకు వెళ్ళాల్సి వచ్చింది. అది డిజిటల్ సినెమా కాలం కాదు కదా. అందుకే జపాన్ ఫ్రాన్స్ ల సమ్యుక్త చిత్రంగా ఇది వచ్చింది. వచ్చినప్పటినించీ తీవ్ర వ్యతిరేకతను ఎదురుకొంటూనే వుంది. ఫిల్మ్ క్లబ్బుల్లో ప్రదర్శించినా, పోటీల్లో ప్రదర్శించినా బాగా సెన్సార్ చేసిగాని చెయ్యలేదు. మొదట్లో చాలా దేశాలు ఈ చిత్రాన్ని బేన్ చేశాయి. జపాన్ లో నైతే ఇప్పటికీ. ఒషిమా మీద కూడా కేసు నడిచింది. అతనైతే బయటపడ్డాడు కానీ, చిత్రం పై బేన్ మాత్రం కొనసాగింది. 1990 నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఒక పక్క దీన్ని వాటర్షెడ్ చిత్రంగా గుర్తించినా మరో పక్క ఇప్పటికీ దీని మీద తీవ్ర వ్యతిరేకత వుంది.
1936 లో జపాన్ లో జరిగిన వొక నిజమైన సంఘటన ఆధారంగా తీసిన చిత్రం ఇది. అడే సదా ఒక వేశ్య. కొత్తగా సర్వర్ ఉద్యోగానికై ఆ హోటెల్ కు వస్తుంది. దాని యజమాని కిచిజో ఇషిదా బేవార్సుగాడు. పని పాట చెయ్యడు. స్త్రీలోలుడు. ఆ హోటెల్ ను నడపడం అదీ అతని భార్యే చూస్తూ వుంటుంది, ఒంటి చేత్తో. మొదటి రోజునుంచే ఆ యజమానురాలికీ సదా కి మధ్య ఘర్షణ. పని జాగ్రత్త గా చెయ్యి లంజముండా అని తిడుతుంది. సదా కి కోపం వస్తుంది. గొడవవుతుంది. ఒకసారి ఆ పని చేస్తే ఇక ఎప్పటికీ నువ్వు అదే అంటుంది యజమానురాలు. ఇషిదా కళ్ళు సదా మీద పడ్డప్పట్నుంచీ వొక ఆకర్షణలో పడిపోతాడు. ఆమె కూడా. మొదట ఆమె మీద అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత తీవ్రమైన ఆకర్షణలో పడిపోతారు ఇద్దరూ. ఎంత అంటే ఎప్పుడూ అంటిపెట్టుకునే వుంటారు, 24 గంటలూ. అదే యావ. అదే తీరని అసంతృప్తి. అదే వ్యామోహం, పిచ్చి. సదా ని కలిసిన తర్వాత ఇషిదా తన భార్యతో కలిసినపుడు ఆమెకు కొత్తగా అనుభవం ఎదురవుతుంది. తమని చూస్తున్న సదా మీద కోపం రాదు. కాని సదాకి అసూయ. ఇషిదా కేవలం తనవాడు, తన భార్యతో కూడా కలవకూడదంటుంది. ఆమె ప్రేమలో నిండా మునిగిన ఇషిదా దానికీ ఒప్పుకుంటాడు. ఇద్దరూ వేరే చోట వుండడం మొదలు పెడతారు. అప్పుడప్పుడు డబ్బు కోసం సదా వో ముసలాయన దగ్గరికి వేశ్యగా వెళ్తుంది. కానీ ఆ ముసలాయనది ఆత్రమేగాని అయ్యేది ఏముండదు. సదా ఇషిదా ల పిచ్చి ముదిరి sadomasochistic lovemaking గా పరిణమిస్తుంది. పరస్పరం గాయ పరచుకోవడం, అందులోనే బాధనూ ఆనందాన్ని పొందడం. చివరికి గొంతు నులమడం, చేతులతోనో, వస్త్రంతోనో వరకూ వెళ్తుంది. ఇషిదా కి నెప్పిగా వున్నా, అది తనకు ప్రాణాంతకం అని తెలిసినా ఆమె మీద ప్రేమతో నీకు నచ్చినట్లే చెయ్యి అంటాడు. ఇక చిట్టచివరి దృశ్యానికి వస్తే వరుసగా సెక్సు చేసి చేసి అలసి పోయి ఇషిదా నిద్రలో జోగుతూ వుంటాడు. సదాలో అసంతృప్తి. అతని చెంపలు వాయిస్తూ మెలకువ తెప్పించాలని చూస్తుంది. నీకు నచ్చినట్టు చేసుకో అంటాడు. అయితె ఈ సారి ఆమె అతని గొంతు నులిమితే అతని ప్రాణం పోతుంది. అతను లేకుండా తను వుండలేదు. అతనూ అతని శరీరమూ తనకు కావాలి. ఇప్పుడెట్లా? పిచ్చి వ్యామోహంలో అతని అంగాన్నీ, వృషణాలనీ కోసి తన వస్త్రంలో దాచుకుంటుంది. ఆ రక్తంతో అతని వొంటి మీద “ఇషిదా సదా ఎప్పటికీ ఒక్కటే” అని వ్రాస్తుంది. అక్కడితో చిత్రం సమాప్తం. వాస్తవంలో సదా ఆ అవయవాలని తనకూడా పెట్టుకుని ఒక హోటెల్ తర్వాత మరో హోటెల్ లో దాక్కుంటూ తిరిగింది. మూడో రోజు పోలిసులు ఆమెను అరెస్టు చెయ్యడం, కోర్టు అయిదేళ్ళ శిక్ష వెయ్యడం, జపాన్ అంతా ఈ కథనం చదివి ఉద్రేకం చెందడం జరిగిపోతాయి. అయితే ఆశ్చర్యంగా ప్రజల్లో ఆమె పట్ల మిగతా భావనలతో పాటు జాలి కూడా కలుగుతుంది.
ఈ దర్శకుడే ఇలాంటి చిత్రమే 1978లో “ఎంపైర్ ఒఫ్ పేషన్” కు కేన్ అవార్డు వచ్చింది.
అశ్లీలత బయట పెట్టడంలో వుందంటారా? దాయడంలో వుందంటారా? మన చిత్రాల్లో ప్రేమ పేరుతో హీరో హీరొయిన్ ను వెంటపడి, వేధించి, అల్లరి చేసి, బలవంతం చేసి (అది ముద్దైనా), తన మగతనం చాటుకోవడం అశ్లీలం కాదూ? పూర్తిగా బట్టలు వేసుకున్నప్పటికీ.
*
దాయడం లొనే ఉంది,చాలావరకు, ji, ఒకరకంగా.. చిత్ర కథ బాగుంది..బాగరాశారు. ఎలాగు, సినిమా చూసే అవకాశం లేదు…
Padmapv గారు,
మీవస్పందన కు ధన్యవాదాలు.