ప్రేమ! నిజానికి మనిషికి మనిషికి మధ్య రక్త సంబంధం కంటే ప్రేమ సంబంధమే ఎక్కువ. ఎప్పుడో నిన్ను రకరకాలుగా అల్లుకుపోయిన వారితో తెగతెంపులు చేసుకునేంతవరకు నీకు వాళ్ళకి మధ్యన పనిచేసినది కేవలం వస్తు సహిత భౌతిక వాదం కాదు మిత్రమా! నిన్ను వారిని కలిపి వుంచిన రసాయన శాస్త్రం ప్రేమే. పనిగట్టుకొని శతృవుల్ని సృష్టించుకునేంత వరకు వారితో నీకున్నది ప్రేమానుబంధం కాదూ? “బాగున్నావా?” అనే పలకరింపు ప్రేమ లక్షణం కాదూ? చిర్నవ్వు ప్రేమ సంకేతం కాదూ? మనుషుల మధ్య యాంత్రికత అని సణుక్కుంటున్నాం కానీ అది కూడా ప్రేమ పూర్వకమైన ఫిర్యాదు కాదా? హింసకి, అత్యాచారాలకి ఘొల్లుమంటున్నామంటే అది మనలోని మానవీయ ప్రేమ కాదూ?
మనిషిని ముంచెత్తేందుకు ఎన్ని రకాల ప్రేమలున్నాయసలు! సహజాత పరమైన తల్లీ బిడ్డల ప్రేమ సరే సరి. తండ్రీ పిల్లలది మాత్రమేం తక్కువా ఏమిటి? తోబుట్టువుల్ని తలుచుకుంటే హృదయం ఆనందంతో తొణకిసలాడదూ? ఇంక స్నేహితుల గురించి చెప్పేందుకేముంది? ఇవన్నీ లేకుండా మనిషి బతగ్గలడా? ఈ భావోద్వేగాలకి భిన్నంగా ఏం జరిగినా మనిషి విలవిల్లాడిపోవటం తప్పదు కదా! ఈ బంధాలు శృతి, గతి తప్పటమే హింస కదా! మనిషి మీద మనిషి అమలు చేసే హింసని చూసి కలిగే దుఃఖం ప్రేమకి సంకేతమే కదా! ఒక భీతావహ సందర్భంలో ఒకరి చేతిలో హృదయం నెత్తురోడిన సందర్భంలో మనిషి డెస్పరేట్ గా ఎదురు చూసేది మరో మనిషి భరోసా కోసమే కదా. అది ప్రేమే కాదా? మనిషిని పరిస్తితులెంత పతనం చేసినా తిరిగి నిలబెట్టేది ఏదో బంధం నుండి దొరికిన ప్రేమే.
మరి అన్ని ప్రేమలూ ఒకటేనా? మనిషిని ఉత్తేజ పరచి, కళ్ళనో ప్రేమ విల్లంబు చేసి, గుండెనో అనుభూతుల తోటగా చేసే ప్రేమోద్వేగమేది?
****
మిగతా ప్రేమలన్నీ సహజాతపరంగానో, సాంఘీక బంధాల నుండి ఒక అనివార్య బాధ్యతగానో, పరస్పరాధరితంగా పుట్టినవేమో కానీ స్త్రీ పురుషుల మధ్య పుట్టే ప్రేమ మాత్రం పూర్తిగా ఐఛ్ఛికం. మంచో చెడో కానీ పుట్టిన ప్రతి మనిషి ఎదురు చూసేది ఆ క్షణం కోసమే. తన ఆపోజిట్ సెక్స్ కి చెందిన ఒక మనిషి నుండి “ఐ లవ్యూ” అనే ఒక కబురు కోసం ఎదురు చూసినంతగా మరి దేనికోసమూ ఎవరూ ఎదురు చూడరు జీవితంలో. ఎవరో రావాలి. వెతుక్కొని, వెతుక్కొని మరీ రావాలి, చేయి పట్టుకొని గుండెలకి హత్తుకోవాలి అనే భావిస్తారు. ఆ చేతి స్పర్శతో అమ్మ కడుపులో ఒక కణంగా ఏర్పడ్డప్పటి అనుభవం గుర్తుకు రావాలి. నీ కోసమే కదా నేనీ భూమ్మీదకి అమ్మ కడుపు నుండి జారి పడ్డది అన్న అనుభూతి కోసం తపిస్తారు. అప్పటి వరకు జీవితంలో వున్న లోటుపాట్లన్నీ ఆ పిలుపుతో మర్చిపోవాలి. భస్మమైపోయిన కలలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొందాలి. ఆ ఒక్క పిలుపుతో లోకం మొత్తం అందంగా కనబడాలి. నిజంగానే మనిషికి ప్రేమ మీద ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ వుంటాయి. అవును. ఐ లవ్యూ అన్న పిలుపు వినటానికే, చెప్పటానికే ఆ క్షణం బతికున్నాననే భావన కలగటం అసంభవం కాదు. స్త్రీ పురుషుల మధ్యన ప్రేమ తప్పొప్పులకి, ఖండన సమర్ధనలకు అతీతం కాకపోవచ్చేమో కానీ అది సంభవించటం మాత్రం అనివార్యం.
ఆ భావన కలిగే వరకు ఎన్ని ముఖాల్లోకి ఆతృతగా తొంగి చూస్తాం! ఆ మాట వినేంత వరకు ఎంత మందిని జాగ్రత్తగా గమనిస్తాం! ఆ స్పర్శ అనుభూతమయేంత వరకు ఎంతమందిని తడుముకుంటాం! ప్రేమ. నిజంగా మనసు తహతహలాడేది దేహాల పొందు కోసమేనా? కాదేమో. మరైతే ఆ ప్రేమ ఏమిటి? దాని లక్షణాలేమిటి? లక్ష్యమేమిటి? జీవితంలో ఎప్పుడూ వెంటాడే వైఫల్యమేదో, లోటేదో, శూన్యమేదో తనని తాను పూరించుకోటానికి చేసే అన్వేషణే కావచ్చేమో. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని ఒక మనిషిలో వెతుక్కోవటం కావొచ్చేమో. నీ ప్రేమకి కారణాలు నీకు తెలియదు. అసలు నీకు కారణాలు అనవసరం. ఆ మనిషి కావాలి అనే బలమైన వాంఛ. ప్రేమంటే ఇదే అనుకుంటాం. బలమైన కాంక్షతో రగిలిపోయే భావననే ప్రేమగా భావిస్తుంటాం. ప్రేమ ఒక నిర్ణయం కాదు తీసుకోటానికి. మనసును, తనువును కంపింప చేస్తూ ఏర్పడే భావోద్వేగ భావన ప్రేమ!
అయితే మరి స్త్రీ పురుషుల మధ్య ప్రేమ భావన నిజానికి కవులు వర్ణించినట్లుగా ఎప్పుడూ పువ్వులా సున్నితమైనదేనా? నీలాకాశంలా ప్రశాంతమైనదేనా? వానమబ్బులా ఆశ గొలిపేదేనా? చందమామలా చల్లనిదేనా? కోయిల గొంతులా తీయనిదేనా? ప్రేమ ఎప్పుడూ సోయి లేకుండా హాయి గొలిపేదేనా? లాలన ఇచ్చేదేనా? మంచు కొండల్లో చలిమంటలా నులి వెచ్చనిచ్చేదేనా? వాస్తవానికి స్వప్నానికి వారధేనా? సుఖాన్ని మంజూరు చేసేదేనా? శాంతిని కలగజేసేదేనా? ప్రేమ మనిషిలో మానవీయ భావనలకు నీళ్ళు పోసేదేనా? జీవితానికి కొత్త రంగులద్దేదేనా? సరికొత్త ఊపిర్లు పోసేదేనా? అసలు ప్రేమంటే కొందరన్నట్లు హార్మోన్లకి సంబంధించిన జీవ ప్రక్రియేనా? అసలు ప్రేమ ఒక బలమా లేక బలహీనతా? ప్రేమలో వున్నది గొప్ప మహత్తా లేక ఒట్టి గమ్మత్తా?
****
ప్రేమ పుట్టినంత వీజీ కాదు ప్రేమ నిలబడటం, ప్రేమని నిలబెట్టుకోడం. ప్రేమ నిలబడాలంటే, నిలబెట్టుకోవాలంటే ఎత్తి కుదేసే భావోద్వెగాలు, కుదిపేసే కాంక్షలు చాలవు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ పుట్టేంత వరకే హృదయం కేటలిస్టుగా పని చేస్తుంది. ప్రేమ ఇద్దరి జీవన సంగమంలా మారటంలోనూ, ఆ తరువాత ప్రవహించటంలోనూ సమాజమే కేటలిస్టు. సమాజంలో బతికే ప్రతివారూ సమాజానికి ప్రతిబింబులే. సామాజిక వాతావరణం, కుటుంబ పరిస్తితులు, కెరీర్ కాంక్షలు, ప్రవర్తనా సంస్కారలు, వ్యక్తిగత అలవాట్లు, అవగాహన స్థాయి…ఇలాంటి భౌతిక వాస్తవాలే ప్రేమ నిలబడటానికైనా, పడిపోవటానికైనా కేటలిస్టుగా పనిచేస్తాయి. ఈ విషయాల్లో వచ్చే తేడాలే ప్రేమ కొంప ముంచుతుంటాయి.
మానవ సంబంధాల గొలుసులో అత్యంత ముఖ్యమైన, అదే సమయంలో అత్యంత బలహీనమైన లింకు స్త్రీ పురుష సంబంధమే. అత్యంత ఆకర్షణీయమైన – అదే సమయంలో అత్యంత పాశవికమైన; అత్యంత భావుకమైన – అదే సమయంలో అత్యంత నిర్దాక్షిణ్యమైన; మనిషి అతి ఎక్కువగా కోరుకునేదీ – అదే సమయంలో అతి ఎక్కువగా సంశయాత్మకంగా వుండేది స్త్రీ పురుష సంబంధమే. త్యాగాన్ని ఆశించి స్వార్ధాన్ని ప్రేరేపించేది కూడా అదే. మిగతా అన్ని రకాల మానవ సంబంధాలలో స్త్రీ పురుష సంబంధాలకి ఉన్నదాని కంటే ఎక్కువ హామీ వుంటుంది ఏదో మేరకి నిలుస్తాయని. స్త్రీ పురుష ప్రేమలో ఈ హామీ వుండదు. నిలవటం ఒక చాన్సే. దంపతీ బంధంలో వుండటమే ప్రేమ నిలవటానికి సంకేతం కాజాలదు. ప్రేమ సాఫల్యం వేరు, బంధంలో కట్టి పడేసినట్లుండటం వేరు. ఎందుకిలా జరుగుతుంది?
స్త్రీ పురుషుల మధ్య ప్రేమలో రెండు రకాలుంటాయి. ఒకటి వివాహపు ముందు ప్రేమ. రెండోది వివాహానంతర ప్రేమ. వివాహానంతర ప్రేమలో మళ్ళీ రెండు రకాలుంటాయి. ఒకటి వివాహం లోపలి ప్రేమ. రెండోది వివాహం బైటి ప్రేమ. వివహానికి ముందు ప్రేమ లక్ష్యం సాధారణంగా వివాహం చేసుకోవటం లేదా కలిసి జీవించటం ఒకటే వుంటుంది. వివాహ పూర్వ ప్రేమలో సఫల, వైఫల్యాలు రెండు రకాలు. ఒకరు ప్రేమించి మరొకరు స్పందించక పోతే అది ఏక పక్ష ప్రేమ. అది ఖచ్చితంగా విఫలమయినట్లే భావించటం జరుగుతుంది. ఇద్దరూ ప్రేమించామనుకొని ఆ తరువాత పొసగక పోవటం, అనుమానాలు లేదా విశ్వాస భంగాలు కూడా ప్రేమ వైఫల్యానికి దారి తీస్తాయి.
ఇప్పుడు పెద్దలు కుదిర్చిన, పెళ్ళి చూపుల తతంగంతో కూడిన పద్ధతులు దాదాపుగా లేవు. ఎంత మ్యారేజి బ్యూరో ద్వారా సెట్ చేసినా భాగస్వామి ఎంపికలో అమ్మాయిలు, అబ్బాయిలు స్వేఛ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రేమ స్థానంలో కెరీర్ లక్ష్యాలు వచ్చి చేరాయి. ఇదివరకటి రోజుల్లో యువతీ యువకులు ప్రేమించుకుంటే వాళ్ళకి పెళ్ళి తప్ప విడివిడి లక్ష్యాలుండేవి కావు. సాధారణంగా ప్రియురాలు ఇల్లాలు అవుతుంది. అదే ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే హోం మేకర్ అవుతుంది. కానీ ఇప్పుడలా కాదుగా. ఆమె కూడా సమాన విద్యావంతురాలు. కెరీర్లో యువకుడికి ఎన్ని ఆపషన్స్ వుంటాయో యువతికీ అన్ని ఆప్షన్స్ వుంటాయి. ఆర్ధిక స్వావలంబన ఇవాల్టి యువతుల ప్రధాన లక్ష్యం. తామూ చదువుకున్నామని, తాము కూడా ఉద్యోగం చేసి సంపాదించటం ద్వారా తమ ఉనికికి ఒక విలువ సంతరింప చేసుకోవాలనే పట్టుదలతో వున్నారు. పెరిగిపోతున్న వినిమయ, విలాస, విహార సంస్కృతిలో ఖరీదైపోతున్న జీవితాన్ని దృష్టిలో వుంచుకొని కూడా తమ సహచరి సంపాదనాపరురాలు కావాలనే యువకులు కూడా భావించటం జరుగుతున్నది.
సరిగ్గా ఇక్కడ జరిగేదేమంటే హృదయ స్పందనల కంటే వాస్తవిక అవసరాల పట్ల స్పృహ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కెరీర్ పరమైన ఆప్షన్స్, అభివృద్ధి కీలక పాత్ర పోషించి లాభనష్టాల లెక్కలు కీలకమైపోతాయి. ఇద్దరి మధ్యనా ఒక బలమైన ఆకర్షణ, మోహం కంటే సంపాదన, హోదా, పనిచేసే రంగం వంటి మెటీరియలిస్ట్ కాలిక్యులేషన్లే ఎక్కువగా పని చేస్తాయి. ఒకరిపట్ల ఒకరికుండాల్సిన మోహం బదులు కెరీరిస్ట్ ఆకర్షణలే ప్రలోభపెట్టి దగ్గర చేస్తాయి. ఇలాంటి వ్యవహారాల్లో ఇద్దరూ ఒక పరిపక్వమైన మనసుతో, ఒకరినొకరిలో తమకనుకూలమైన సుగుణాల్ని ఎంచుకొని, తృప్తి పడి, పరస్పరం సహకరించుకుంటే ఆ బంధం నిలుస్తుంది. అక్కడ వివాహానంతర ప్రేమ బలపడుతుంది. ఒకరి సంస్కారం పట్ల మరొకరికి వున్న గౌరవం ఇద్దరిలో కంపేటిబిలిటీని పెంచవచ్చు. ఆ విశాలహృదయం లేకపోతే అసహనాలు పెరిగి, అసలే ప్రేమ పునాదిగా లేని బంధం కూలిపోవచ్చు.
ఒకవేళ ఇద్దరూ పెళ్ళికి ముందు ప్రేమించుకొని, ఒకరి పట్ల మరొకరికి వున్న వ్యామోహం కారణంగా పెళ్ళి చేసుకున్నా కొత్తగా అప్పటివరకు దాగిన లోపలి బలహీనతలు బైటపడి ఇద్దరిలో విశాలమైన సంస్కారపూరిత ప్రవర్తన లేకపోతే ఇద్దరి మధ్యన అప్పటి వరకు కొనసాగిన ప్రేమ ఒక భ్రాంతిలా అనిపించి మాయమైపోతుంది. ఎప్పుడైతే స్త్రీ కూడా పురుషుడంత లోకాన్ని చూసి, అతనంత సంపాదనపరురాలు అవుతుందో సహజంగానే వేల సంవత్సరాల పురుషాధిపత్య భావనలకి తూట్లు పడటం ఖాయం. ఇది అత్యంత సహజమైన ప్రక్రియే. స్త్రీ మరో విధంగా పురుషుడి ఆధిపత్య ధోరణిని ప్రశ్నించటం లేదా బైటపడటం జరగని పనే. ఆధిపత్య ధోర్ణి పునాదుల మీద లేచిన మన వివాహ వ్యవస్థ బీటలు వారటానికీ ఆమె స్వావలంబన, స్వాభిమానం ప్రధాన కారణం. వివాహ సంబంధానికి వున్న ఆమోదం వివాహేతర సంబంధానికి వుండకపోవచ్చు ఈ రోజు. కానీ దాన్ని ప్రత్యామ్నాయంగా ఎంతోమంది భావించుకుంటున్నారన్నది నిజం. కూలిపోయే దాన్ని నిలబెట్టుకోవాలనుకోవటం అవివేకం. అక్కడ చేయాల్సింది కొత్త నిర్మాణం.
****
ప్రేమకి కూడా వర్గ స్వభావముంటుందనేది ఒక వాస్తవం. నిజానికి ఈ ప్రేమ గొడవలన్నీ ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందినవే. మనం కొంచెం నిశితంగా గమనిస్తే ఏ వర్గం వారు ఆ వర్గం వారినే ప్రేమిస్తారని స్పష్టమౌతుంది. మహా అయితే దిగువ మధ్య తరగతి-ఎగువ మధ్య తరగతి యువతీ యువకుల మధ్య ప్రేమలు సంభవించ వచ్చేమో కానీ అత్యంత ధనికులు – పేదవారి మధ్యనైతే సంభవించదు. కోటలో రాకుమారి తోట రాముడిని ప్రేమించటమనేది జానపద కథల్లోనూ, అలానే జమీందారు గారబ్బాయి గోపీ పేదింటి పిల్ల రాధని ప్రేమించటమనేది సినిమాల్లో మాత్రమే సంభవిస్తుంది. ఎప్పుడైనా అలాంటివి అరుదుగా, ఒక మినహాయింపుగా వాస్తవంగా సంభవిస్తే అది చిరంజీవి కూతురి కథ లేదా బొమ్మన రాజ్ కుమార్ కూతురి కథలా తయారవుతుంది.
****
ఒక యువతీ యువకుడు లేదా ఒక స్త్రీ ఒక పురుషుడు తామిద్దరం ప్రేమించుకుంటున్నామని భావించి ప్రేమ భావనల్ని ఇచ్చి పుచ్చుకునే ముందు అసలు ఎవరికి వారు ఆ ప్రేమలో తనకి తానెంత ముఖ్యమో, తన భావోద్వేగాలెంత ముఖ్యమో అవతలి వ్యక్తి కూడా తనకి అంతే ముఖ్యం అనుకోగలిగేంత ప్రజాస్వామిక హృదయౌన్నత్యాన్ని కలిగి వుంటారా? తాను కోరుకోవటమే ప్రేమ కాదని, తానివ్వటం కూడా ప్రేమని విశ్వసించగలరా? ప్రేమంటే క్యాండిల్ లైట్ డిన్నార్లు, డేటింగ్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఫిబ్ 14 సంబరాలు కాదని, ప్రేమంటే ఒక భిన్నాభిరుచిని, సామర్ధ్యాలకు సంబంధించిన ఒక బలహీనతని, బతికే విధానంలో ఒక వైవిధ్యాన్ని సహించి, భరించి, అలా బతకనిచ్చే ప్రవర్తనా సంస్కారం కలిగి వుండటమనే అవగాహన నిజంగా ఇరువురిలో వుంటుందా? ఏ లక్షణాలు చూసి మోహపడి, ఆకర్షణకి గురయ్యామో అవి మాత్రమే కాకుండా ఇతరత్రా అలవాట్లు, అభిరుచులు, బిహేవియరల్ టెంపరమెంట్ తమకి అనుకూలంగా వున్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఆకర్షణ మంచుతెరలన్నీ కరిగిపోతాయి.
ప్రేమ కుల, మత, జెండర్ విలువలకి అతీతమా? చాలా సందర్భాల్లో కాదు. ప్రేమ బంధంలో కులపరమైన వివాదాలు తీసుకొచ్చుకుంటే అది ప్రేమెలా అవుతుంది? మతం మారితేనే ప్రేమికుల్ని పెళ్ళి చేసుకుంటామని షరతు పెట్టడం ప్రేమెలా కాగలదు? తన ప్రేమని అంగీకరించలేదని అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోయటం లేద మెడ మీద కత్తితో పొడిచేవాడు కూడా తాను ప్రేమికుడిననే అంటాడు. వాడి నేరం నిజంగానే ఆమె ప్రేమని దక్కించుకోలేదన్న నిస్పృహ నుండి పుట్టిందేనా? లేక అసలు కారణం స్త్రీ హృదయాన్ని, వ్యక్తిత్వాన్ని అంగీకరించలేని పితృస్వామిక పురుషాధిపత్య స్వభావమా? కుల, మతపరమైన వివక్షకి ఆడా, మగా ఇద్దరూ బాధ్యులు కావొచ్చు. కానీ జెండర్ పరమైన హింసకి మాత్రం పురుషాదిపత్యాన్ని నెత్తిన మోసే పురుషుడే కారణం అవుతాడు. ప్రేస్మ కోసం స్త్రీలు తమ వ్యక్తిత్వాల్ని, పురుషులు తమ మనిషితనాన్ని పోగొట్టుకున్న ఉదంతాలు అనేకం చూసాను.
నిజమైన ప్రేమ వున్న చోట ఆధిపత్యానికి, హింసకి తావు లేదు. ఒకరి పట్ల ప్రేమంటే ఆ వ్యక్తి ఆత్మగౌరవాన్ని కలిగివుండే హక్కుని గౌరవించటం. ప్రేమంటే ఒక ప్రజాస్వామిక ప్రవర్తన. ఎందుకంటే భూగోళంలో ఎన్ని వందల కోట్లమంది మనుషులుంటే అన్ని వందల కోట్ల ముఖ్హాకృతులు వున్నట్లు అన్ని మనస్తత్వాలు, అన్ని రకాల ప్రవర్తనలు కూడా వుంటాయి. ప్రతి మనిషికి ఒక విశిష్టమైన (యునీక్) శారీరిక నిర్మాణం వున్నట్లే ఒక మానసిక నిర్మాణం కూడా వుంటుంది. మనిషిని బైట నుండి చూసినంత తేలిక కాదు అతను లేక ఆమె అంతరంగం చూడటం. ప్రతి మనిషి ఒక విశ్వం. అవతలి వారి మానసిక కక్ష్యలోకి దూరిపోయి, ఆధిపత్యాలు చలాయించి, గందరగోళం చేయాలనుకుంటే రగడరగడే! ఈ వైవిధ్యాల్ని అవగాహన చేసుకోవటం ఒక గొప్ప మానసిక సంస్కారం. తనని తానెంత ముఖ్యమనుకుంటారో తన లవర్ కూడా తనకి అంతే ముఖ్యం అనుకున్నప్పుడు వైవిధ్యాలు ఇద్దరి మధ్యన వైరుధ్యాలుగా తలెత్తవు. అయితే ఇది ఇద్దరి బాధ్యత. ఆ పని ఎప్పుడూ ఎవరో ఒకరే నెత్తికెత్తుకుంటే లేదా సర్దుకుపోవాల్సి వస్తే రెండోవారి స్వార్ధానికి, అహానికి బలిపశువు కావలిసిందే.
****
అనుకున్నవన్నీ నిజం కాదనటానికి ప్రేమని మించిన ప్రబల తార్కాణం లేదు. అది సంభవిస్తుంది. నశిస్తుంది. మరలా సంభవిస్తుంది. మరలా నశిస్తుంది. మరలా సంభవిస్తుంది. అది ఒక్క మనిషితో కావొచ్చు లేదా ఒక్కరిని మించి కూడా కావొచ్చు సంఖ్యలో. పునరపి….పునరపి…..
*
అద్భుతమైన ఆర్టికల్ ..ప్రేమలోఉన్న హిపోక్రసీ మీద ఛెళ్ళున కొట్టినట్లయ్యింది .అయితే.,ఇక్కడ కొంతమంది దీన్ని ప్రేమవివాహాలు ,పెద్దలు చేసిన వివాహాల క్రింద కూడా ఈవ్యాసాన్ని ఉపయోగించుకోవచ్చనుకుంటా ..ఏమైనా..ఒకమాట..నిజం..meeru vrasinatlu .అన్నిబంధాల్లో అత్యంత బలహీనమైన బంధం స్త్రీ పురుషుల..మధ్య బంధమే ..ఏదిఏమైనా ..గుప్పెటమూసిన సంస్కృతి తాలూకు అంతర్గత రహస్యాల పరంపరకు చాలామందిమి అతీతులం కాదు ..మీరన్నట్లు అత్యంత అవగాహనా సంస్కారం మాత్రమే …ఆ బంధాలమధ్యన అంతరాలు ఎక్కువ మేరకు ప్రక్కకు వెళ్ళవచ్చు ….ఇచ్చుకోవడం క్షమించుకోవడం లాంటి చాలా విశాల సంస్కృతి ..మాత్రమే..ఎలాంటి వివాహాలైన సౌకర్యంగా ఉంచుతాయి..ఏమైనా ఆస్థి సంబంధాల్లో ..ఎవరు బలవంతులో వారు ఆధిపత్యం చెలాయిస్తారు..ప్రేమకుడా అందులో భాగమే …కాదేది..దీనికనర్హం …మనిషి వెతుక్కునేది ..తడుముకొనేది …తానికేమి కావాలోతెలియని అస్పష్టత రుగ్మతతో నలిగిపోవడమే …where the mind is with out fear….ఎన్నో భావ జాల సంకెళ్ళమధ్యన …ఈవ్యాసం గొప్పగా ఆలోచించే అవకాశాన్ని ఇచ్చింది ..very thought pravoking artical..congrats
ధన్యవాదాలు అరుణగారు!