సరస్వతికి ఈ ఇల్లు ఎంత సర్దినా ఎందుకు అద్దంలా మెరవదో అర్థం కాదు. ఒక్క డ్రాయింగ్ గది మాత్రం జనం జడుసుకోకుండా కూర్చునేలా ఉంటుంది. తక్కిన గదులన్నిటిలో తరగని పుస్తకాలు, బట్టలు…. అసలిన్ని బట్టలెందుకు మనిషికి? ఆ పుస్తకాలు మాత్రం! ప్రపంచంలోని ప్రతి విషయం, తనకు కావాలి. కనిపించిందల్లా కొనేయడమే. పైగా ఇంట్లో చర్చల కోసం ఎప్పటికప్పుడు ఎవరో సూచించారని కొత్త పుస్తకాలు తెస్తూండడం. ఛ. ఇందులో సగం పుస్తకాలను ఏదో లైబ్రరీకి ఇచ్చేయాలి. ఈ సంకల్పాలు ఇల్లు సర్దిన ప్రతిసారీ చేసుకునేవే. మళ్లీ మాయమైపోతాయి. తన భర్త కూడ ఇల్లు పట్టకుండా తిరిగే ఉద్యమకారుడు కనక సరిపోయింది. ఇల్లు ఎలా ఉందో ఎప్పుడూ చూడడు. తను వీసమెత్తు సాయం చేయడు కనక ఇలా ఎందుకుందని అడగడు కూడా..అదో సుఖం
ఇంతలో లాండ్ లైన్ మోగింది. తన ఇంట్లో లాండ్ లైన్ ఉన్నట్టు, అక్కచెల్లెళ్లు కాక, తెలిసిన వ్యక్తులు ఇద్దరే. ఇద్దరు తన బాల్యస్నేహితులు. ఆనంద్, వివేక్. ఇద్దరినీ కలిపి వివేకానందుడని పిలవడం తనకు అలవాటు కూడ. ఆ ఇద్దరిలో ఒకరై ఉంటారనుకుంది. ఫోన్ ఎత్తగానే ఆనంద్ గబగబా మాట్లాడేస్తున్నాడు.
“నీకో షాకింగ్ న్యూస్….. మన వివేక్ ఎంత మారిపోయాడో తెలుసా?’
సరస్వతికి అర్థం కాలేదు. “ నేను తనని పదిరోజుల క్రితం కలిశాను. శుభ్రంగా ఉన్నాడు. ఇంతలో ఎలా మారాడు?”
‘అబ్బ. చూడ్డానికి కాదోయ్. నిన్న తిరుమల కొండమీద మా బావగారికి కనిపించాడట’. వివేక్ కి అంత అలజడి ఎందుకు కలిగిందో సరస్వతికి అర్థమైంది. తనకు కూడ ఆశ్చర్యం వేసిన మాట నిజం.
ఆనంద్ చెప్తున్నాడు “మా బావగారి సంగతి తెలిసు కదా నీకు. తనకు ఆఫీసులో ఇన్‌స్పేక్షన్ ఉందంటే గుండు. పిల్లవాడి పరీక్షంటే గుండు. పిల్లదానికి అనారోగ్యం చేస్తే గుండు. భార్యకు ప్రమోషన్ టైం వస్తే గుండు. అలా మొత్తానికి సంవత్సరం పొడుగునా ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుంటూనే ఉంటాడు’
‘అన్ని సార్లు గుండు కొట్టుకోడానికి అసలు జుట్టు ఎప్పుడు పెరుగుతుంది ఆయనకు?’ సరస్వతికి నిజంగానే అనుమానం వచ్చింది.
‘పెరక్కపోతే విగ్ పెట్టుకుని కొట్టించుకుంటాడు’ విసుగ్గా అన్నాడు ఆనంద్. ‘అసలు విషయం అది కాదు సరసూ”
సరస్వతి ఒప్పుకుంది. ‘అసలు విషయం అది కాదు నిజమే. వివేక్ అసలు తిరుపతి కొండకు వెళ్లడమేమిటి? అంత దౌర్భాగ్యం ఎందుకు కలిగింది?’ ఇద్దరూ కాస్సేపు మాట్లాడలేదు. ఎందుకంటే ఇద్దరికీ అది మింగుడుపడ్డంలేదు. వివేక్ తామిద్దరినీ ఘోరంగా మోసం చేసిన భావన.
స్కూలు రోజుల్లోనే ఈముగ్గురూ ఒక కూటమి. కాలేజీకి వచ్చేసరికి వివేక్ ఆర్‌ఎస్‌యూలో చేరాడు. కమ్యూనిస్టు భావాల్ని, హేతువాద భావాల్ని బాగా ఒంటబట్టించుకున్నాడు. అతనిపాటి తెలివితేటలు, చదివిన వెంటనే ఆకళింపు చేసుకునే శక్తి తామిద్దరికీ లేదు. అందుకే అతనే తను చదివిన వాటినన్నిటినీ ఎంతో వివరంగా చెప్పేవాడు. సరస్వతి, ఆనంద్ త్వరలోనే అతని అనుయాయులైపోయారు. అతని నుంచి ఉత్తేజం పొంది తమ కుటుంబసభ్యులతోనూ గొడవ పెట్టుకున్నారు. చివరకి తనూ, ఆనంద్ తమ పార్టీ వారిని రిజిస్టర్డ్ వివాహం చేసుకుని, ఇంట్లో వాళ్లకు చాలా కోపం తెప్పించారు కూడా. కానీ దేనికీ రాజీపడలేదు. వివేక్ తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పెళ్లికి తీసుకువచ్చాడు కూడా. తమ వల్ల కాని పని అతను చేసి నిజమైన మిత్రుడనిపించుకున్నాడు. వివేక్ ని పెళ్లి చేసుకోమంటే మాత్రం ‘ఉద్యమాల్లో తిరిగే నాలాంటి వాళ్లకు పెళ్లి పనికిరాదు’ అనేవాడు. సరస్వతికి అదీ నిజమే అనిపించేది. కానీ ముఫ్పై అయిదేళ్లు వచ్చాక, ఒంటరిగా ఫీలయ్యాడో, లేక ఆ అమ్మాయి నచ్చిందో కానీ మొత్తానికి తన చెల్లెలి స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. అతనిది కూడ రిజిస్టర్డ్ పెళ్లే. ఆరునెలల క్రితం పెళ్లయిన నాటినుంచీ సహజంగానే వీళ్లద్దరి ఇళ్లకూ రాకపోకలు తగ్గించాడు. ఎపుడైనా కనిపించినా కాస్సేపే.
కానీ ఈ ఉపద్రవమేమిటి? దేవుడినీ, పూజలనూ, ఆలయాలనూ తెగతిట్టే వివేక్ తిరుపతి కొండకు వెళ్లడమేమిటి? సరస్వతి, ఆనంద్ ఇప్పటివరకూ ఏ దేవుడి జోలికీ వెళ్లలేదు. ఇద్దరూ తమ భావజాలం ఉన్నవాళ్లనే వివాహం చేసుకోవడం వల్ల ఎలాంటి ఘర్షణలూ తలెత్తలేదు.
సరస్వతి దిగ్భ్రాంతి నుంచి తేరుకుని అంది “ఆనంద్. నువ్వూ నేనూ ఊహించుకోవడం దేనికి? తను హైదరాబాద్ రాగానే ఫోన్ చేద్దాం. తనే చేస్తాడేమోలే. అప్పుడే అడుగుదాం”
“అవునవును. చేస్తాడు. తిరుపతి లడ్డు ఇవ్వొద్దూ మనకి? గుండు కూడా కొట్టుకున్నాడో ఏం పాడో’ కసిగా అన్నాడు ఆనంద్. సరస్వతికి నవ్వాగలేదు.
–
వారం గడిచినా వివేక్ నుంచి ఫోన్ రాలేదు. సరస్వతి, ఆనంద్ రోజుకు రెండు సార్లయినా పలకరించుకుని వివేక్ ఇద్దరిలో ఎవరికీ ఫోన్ చెయ్యలేదని అర్ధమై దిగాలుపడ్డారు. చివరికి సరస్వతికి ఇక ఆగాలనిపించలేదు.
‘మనమిద్దరం వాళ్లింటికి వెళ్దామా?’ అంది. ఆనంద్ కూడా ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్నాడు. ఇద్దరూ సాయంత్రం 7 దాటాక వివేక్ ఇంటికి వెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టగానే భార్య సునీత వచ్చి తలుపుతీసింది. వీళ్లిద్దరినీ చూడగానే ఆమె ముఖం వికసించింది.
“రండి రండి. మిమ్మల్నిద్దరినీ ఆయన తలచుకోని రోజు లేదు… ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువైంది. ఇద్దరు సెలవులో ఉన్నారట. ఈయన ఆలస్యంగా వస్తున్నారు. రోజూ అంటారు మీ ఇళ్లకు వెళ్లాలని.. ఓ పది నిమిషాల్లో వచ్చేస్తారు. కూర్చోండి”
ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. ఏం మాట్లాడాలో తెలీలేదు. సునీత ఇద్దరినీ మార్చి మార్చి చూసింది.
“సరస్వతి గారు బ్లాక్ కాఫీయే తాగుతారు కదూ. ఆనంద్ గారు టీ మాత్రమే. ఇప్పుడే వస్తానుండండి”. ఆవిడ లోపలికి వెళ్లింది. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు.
సరస్వతి ఏదో అనేలోపే తలుపు తోసుకుని వివేక్ వచ్చాడు. సోఫాలో కూర్చునివున్న ఇద్దరినీ చూసి అతని ముఖంలో ఆనందం.
“వారెవ్వా… థింక్ ఆఫ్ ది డెవిల్స్ అన్నట్టు ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను’ ఇంకా ఏదో అనబోయి ఇద్దరి ముఖాలూ చూసి
‘ఏమైంది? ఎందుకిద్దరూ అంత సీరియస్‌గా’ సింగిల్ సోఫాలో కూర్చుని బూట్లు విప్పాడు. సరస్వతి గొంతు సరిచేసుకుని అంది
“ఏం లేదు. మహమ్మదూ, కొండా లాగా, నువ్వు ఎంతకీ మమ్మల్ని కలవకపోయేసరికి, మేమే వచ్చాం. ఎలా ఉన్నావు?’
“ హాయిగా ఉన్నాను. ఉండండి. సునీతని పిలుస్తాను.’
“అక్కర్లేదు. తనే తలుపు తీసింది. మాకు కాఫీలు, టీలు ఇవ్వడానికి లోపలికెళ్లింది’ అంది సరస్వతి.
ఆనంద్ అక్కసు పట్టలేకపోయాడు
“బాలాజీ బాగున్నాడా?’ వ్యంగ్యంగా అడిగాడు
‘ఆయనెవరు?’ వివేక్ అడిగాడు
“ఆయన దర్శనం చేసుకుని వచ్చావు కదా…’ వ్యంగ్యంగా అన్నాడు. వివేక్ నవ్వాడు
“నామీద గూఢచార్లని పెట్టావా ఏం? నన్నడిగితే చెప్పేవాణ్నేగా. అసలు వెళ్లే ముందే చెప్పాలనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో, ఆ టికెట్లూ, కొండమీద కాటేజి బుకింగ్… ఈ గొడవలో మర్చిపోయాను. మొదటిసారి కదా వెళ్లడం; ఆ పద్ధతులేమీ నాకు తెలీవు…”
సరస్వతి ఏదో అనబోయేలోగా సునీత వచ్చింది ట్రేతో. ట్రేలో మూడు కప్పులు, మూడిట్లో మూడు రకాల ద్రవాలు. ఒక టీ, ఒక బ్లాక్ కాఫీ, ఒక లెమన్ టీ.. ప్లేట్లలో బిస్కట్లు, ఆపిల్ ముక్కలు. ఎవరివి వారికి అందించింది. తనూ కూర్చుంది. సరస్వతి, ఆనంద్ ముఖాలు చూసుకున్నారు. మౌనంగా తాగుతున్నారు. సునీత అందరి ముఖాలూ ఒకసారి చూసి
“మీరు కబుర్లు చెప్పుకోండి. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ లోపలికి వెళ్లిపోయింది. హమ్మయ్య అనేసింది సరస్వతి. వివేక్ నవ్వాడు.
“ఊ. ఇప్పుడు చెప్పు. మేమేం నీమీద గూఢచార్లను పెట్టలే. మా బావగారు అక్కడే ఉన్నారు. నిన్ను చూశారు. నువ్వు కూడ అందరిలాంటి వాడివేనని తేలిపోయింది’ అన్నాడు ఆనంద్
వివేక్ ‘అందరూ అంటే?’
“కమ్యూనిస్టులమని చెప్పుకుని ఆస్తులు పోగుచేసుకునేవాళ్లూ, ఆలయాల్లో మొక్కులు చెల్లించుకునేవాళ్లూ, వారఫలాలు చూసి పనులు చేసేవాళ్లూ…..’ సరస్వతి మొదలుపెట్టింది.
వివేక్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత
“నేను అవేవీ చెయ్యలేదు. మీక్కూడా తెలుసు’
“మరి? తిరుమల ఎందుకు వెళ్లావ్?’ చికాగ్గా అడిగాడు ఆనంద్
“సునీత కోసం” ఇద్దరూ కొద్ది క్షణాలు మాట్లాడలేదు. తర్వాత సరస్వతి అంది
“అంటే.. నీ నమ్మకాలు, నిబద్ధతలు అన్నీ భార్యకోసం వదులుకున్నట్టేనా?”
‘చేతనైతే సునీతను నీలా తయారు చెయ్యాలి గానీ….” ఆనంద్ అన్నాడు.
వివేక్ టీ కప్పు కింది పెట్టి వెనక్కి వాలి కూర్చున్నాడు.
“మీరన్న మాటలన్నీ కరెక్టే.. నేను ఇప్పటికీ ఆ బాలాజీనీ నమ్మను. మరో దేవుణ్ణీ నమ్మను. అది వేరే విషయం. కానీ…. సునీత నమ్ముతుంది. పెళ్లికి ముందు ఈ విషయం తెలీలేదా? అని అడుగుతారేమో. తెలుసు. కానీ ఇప్పుడు మీరన్నట్టే నేను కూడ అనుకున్నాను. ఎంతో మందిని నా వాగ్ధాటితో మార్చగలిగాను కాలేజీ రోజుల్నించి. నా భార్యను నెలరోజుల్లో మార్చలేకపోతానా? అనుకున్నాను. పెళ్లి కాగానే తిరుపతి వెళ్లడం వాళ్ల ఇంట్లో ఆచారమంటే నేనొప్పుకోలేదు. వాళ్లు ఏమనుకున్నారో తెలీదు. నన్ను బలవంతం చెయ్యలేదు… మరుసటిరోజు నుంచి అపుడపుడు నా నమ్మకాలు, అలవాట్లు, సిద్ధాంతాలు సునీతకు చెప్పడం మొదలుపెట్టాను. తను అన్నీ వింది. తనకు హేతువాదం, సామ్యవాదం వంటి పదాలు తెలుసు తప్పితే, వాటి మీద ఆసక్తి లేదు. రాజకీయాలంటే ఏ మాత్రం ఇష్టం లేదు. సామాజిక సిద్ధాంతాలు కేవలం రాజకీయాలు కావనీ, నిత్యజీవితానికి సంబంధించినవనీ నేను చెప్పేవరకూ తనకు తోచలేదంది. చాలా ప్రశ్నలడిగి నా చేత అర్ధరాత్రి వరకూ వాగించేది”
“తనేమీ అనేది కాదా?’ అడిగింది సరస్వతి.
“నాలుగు నెలలు మా సంభాషణలయ్యాక అంది – మీరన్నట్టు నేను కూడ ఇకనుంచి కులాలు, మతాలు పట్టించుకోను. ఆస్తులు కూడగట్టమని నిన్నడగను. పిల్లలు పుట్టాక వాళ్ల పెంపకంలో కూడ నీ అభిప్రాయాలు గౌరవిస్తాను. కానీ ఒక్కటి మానలేను. నాకు వెంకటేశ్వర స్వామంటే భక్తి. ఆయన పటానికి రోజూ దీపం పెడతాను. ఒక్కసారి మీతో తిరుమలకు వెళ్ళాలని పెళ్లికి ముందే అనుకున్నాను. అది మీరు తీరిస్తే సంతోషిస్తాను. మీరు రాలేనంటే సరే.. నేనొక్కదాన్నే వెళ్లొస్తాను. దానికి అడ్డుపెట్టకండి’ అంది.
ఆనంద్ ‘ ఓహో. మొక్కుకుంది కాబోలు. ఆవిడ మొక్కు తీర్చడానికి వెళ్ళావా?’ అన్నాడు.
వివేక్ ఓ క్షణం మౌనంగా ఉన్నాడు “నేనంత ఆలోచించలేదురా. మడి కట్టుకుని వంట చేసే సంప్రదాయం ఆమెది. చెల్లి చెబుతూండేది. వట్టి ఛాందస కుటుంబమని విసుక్కునేది తను. సునీతంటే నాకిష్టమని నేను చెప్పగానే మా రాధ భయపడింది. అలాంటి ఆచారాలనుంచి వచ్చిన పిల్లను నువ్వు భరించలేవన్నయ్యా అని కూడ అంది. కానీ ఎందుకో ఆ అమ్మాయిలోని ఒక స్వచ్ఛత, గాంభీర్యం, హుందాతనం నాకు నచ్చాయి. సునీతకి కూడ నేను, వాళ్ల భాషలో తిక్కల వాడిననే తెలుసు. కానీ తను చాలా యేళ్ల నుంచే నా మీద అభిమానం పెంచుకుందిట. నేను బయటపడేసరికి తనూ బయటపడింది. ఇక రిజిస్టర్ పెళ్లి చేసుకోడానికి ఎంత హోరాహోరీ జరిగిందో మీకు తెలిసిందే’
సరస్వతి అందుకుంది “సో… చివరకు తన మీద జాలిపడి నీ సిద్ధాంతాలను వదులుకున్నావన్నమాట?’
“జాలా? ‘ వింతగా చూశాడు వివేక్. ‘తనంటే నాకు చాలా ప్రేమ సరసూ.. తనకూ నామీద అంత ప్రేమా ఉందనుకుంటా. లేకపోతే వాళ్ల అమ్మా నాన్నలతో నెలరోజులు పోట్లాడి రిజిస్టర్ వివాహానికి ఎందుకు ఒప్పిస్తుంది? పెళ్లయిన మొదటి రోజే నా ఉపన్యాసాలు మొదలుపెట్టినా చాలా శ్రద్ధగా వినడమే కాదు. నాతో ఒప్పుకుంది కూడ. ఇంతవరకూ కులం గురించి, డబ్బు గురించి ఇలా ఆలోచించలేదని చెప్పింది…వర్గ దృక్పథమంటే ఇదీ అని కూడ ఇప్పుడే అర్ధమైందని అంది.’
ఆనంద్, సరస్వతి నుదురు కొట్టుకోవడం చూడనట్టే నటించాడు వివేక్ “ నా మీద ప్రేమ లేకపోతే తనకు ఏమాత్రం ఆసక్తి, ప్రవేశం లేని విషయాలని అంతబాగా విని, అర్థం చేసుకోడానికి ప్రయత్నించదు కదా. మరి నా సంగతేమిటి? ఇంత ప్రేమిస్తున్నానని చెల్లి చేత రాయబారం పంపించి అందర్నీ ఒప్పించిన నేను, ఆమె ఒక్క నమ్మకాన్ని గౌరవించడం జాలెలా అవుతుంది? తనకు నా వైపు నుంచి ఆలోచించే బాధ్యత ఉండాలని నేననుకున్నప్పుడు, తన వైపు నుంచి కూడ నేను ఒక్కసారైనా ఆలోచించనవసరం లేదా? అసలు తనని మార్చాలని నేనెందుకనుకోవాలి? తను నన్ను మార్చాలని ప్రయత్నిస్తే నేను భరించగలనా?’
శ్రోతలిద్దరూ కాస్సేపు మాట్లాడలేదు. తను ఆవేశంలో గొంతు పెంచి మాట్లాడాడని గ్రహించాడు వివేక్. సునీతకు వినిపించే ఉంటుంది ఎంత లోపలి గదిలో ఉన్నా. ఇబ్బందిగా అనిపించి, వాతావరణాన్ని తేలికపరిచేందుకు మాట మార్చాడు.
“ఇంతకూ మీ అమ్మాయికి ఏ స్కూల్లో సీటు వచ్చింది ఆనంద్?’
ఏదో ఆలోచనలో ఉన్నట్టు కూర్చున్న ఆనంద్ ఉలిక్కిపడ్డాడు. “ఏదోలే. మా ఇంటి దగ్గరే’. అని ఒక్క క్షణం ఆగి “ఒకమాట అడగనా వివేక్?’ ఏమిటన్నట్టు చూశాడు వివేక్
“తన డిమాండ్ ఈ ఒక్క కోరికతో ఆగిపోతుందని నీకేం నమ్మకం? ఇప్పుడు దీనికి ఒప్పుకున్నావు కదా. రేప్పొద్దున్న కార్తీక మాసంలో సత్యనారాయణవ్రతం చేసుకోవాలనుకున్నా అంటుందనుకో. ఒక్కసారే అంటుందిలే. అప్పుడేం చేస్తావు?” సరస్వతి ఆనంద్ కేసి మెచ్చుకోలుగా చూసింది.
వివేక్ మాట్లాడలేదు కాస్సేపు. తర్వాత నవ్వాడు. ‘నా డిమాండ్లు మాత్రం అయిపోయాయని నీకేం నమ్మకం? నేను మన రాష్ట్రంతో సరిపెట్టుకోక ఇతర రాష్ట్రాల్లో ఉద్యమాలకు కూడ వెళ్దామనుకుంటున్నాను. ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో ఒక పదవి కూడ త్వరలోనే నాకు రావచ్చు. మన పార్టీలోనేలే. ప్రభుత్వంలో కాదు. ఆ మాట చెప్తే అప్పుడు తను ఏ నిర్ణయం తీసుకుంటుందో?’
సరస్వతి అర్థం కానట్టు చూసింది ‘ఇదెక్కడి పెళ్లి? మాలా ఒక పార్టీ అమ్మాయిని చేసుకుంటే సరిపోయేదిగా. ఇంత సంఘర్షణ ఉండేది కాదు”
వివేక్ గట్టిగా నవ్వాడు ‘మన పార్టీ అమ్మాయిలెవ్వరూ నాకు నచ్చలేదు మరి. సునీతపై కలిగినంత ప్రేమ నాకు ఎవ్వరి మీదా కలగలేదు”
ఆనంద్ విసుగ్గా అన్నాడు ‘ఒకే రకమైన భావజాలం ఉండేవాళ్లే ప్రేమించుకుంటారురా. మీది ప్రేమో, కాదో కూడ నాకు తెలీదు’
సరస్వతి నవ్వింది ‘ అది పూర్తిగా నిజం కాదులే. అలాగైతే నువ్వో, తనో నన్ను ప్రేమించాల్సిందిగా. మీరూ ప్రేమించలేదు. నేనూ మీలో ఎవరినీ ప్రేమించలేదు’
వివేక్ అన్నాడు ‘నాకీ విషయంలో పెద్ద స్పష్టత లేదులేగానీ, ఒకే రకమైన భావజాలాలు స్నేహానికి మాత్రమే తప్పనిసరి అనుకుంటాను. ప్రేమ, పెళ్లీ…. వీటికి కాకపోవచ్చు’
‘మరైతే ప్రేమంటే ఆకర్షణే అవుతుంది’ ఆనంద్ ఇంకా తన వాదన ఆపదలుచుకోలేదు
“ఆకర్షణ తప్పనిసరి ప్రేమలో. కోరిక కూడ తప్పనిసరే. అన్నిటినీ మించి మనం బతికున్నంతకాలం, ప్రతి రోజూ ఆ మనిషితో గడపగలిగితేనే ఆనందంగా ఉంటుందని అనిపించడం ప్రేమ అనుకోవచ్చు. దాని అర్థం ఆ మనిషితో అన్నిటిలోనూ ఏకీభవించడం కాకపోవచ్చు’
సరస్వతి లేచి నించుంది ‘ అంటే…ఆ భావన నీకు సునీతను చూస్తే కలిగిందంటావ్’
వివేక్ అవునన్నట్టు తలవూపాడు.
ఆనంద్ కూడా లేచాడు “ కొన్ని సార్లు నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటూ, కొన్నిసార్లు ఆవిడను సమాధానపరుస్తూ జీవితం వెళ్లదీస్తావన్నమాట’
వివేక్ నవ్వాడు ‘ ఎవరైనా చేసేదంతే కదా.. కుఛ్ పాకర్ ఖోనాహై, కుఛ్ ఖోకర్ పానా హై..’ అన్నాడు కవి’.
__
చాలా బాగరాశారు మృణాళిని గారూ .
“కుచ్ పాకర్ కుచ్ ఖోనాహై, కుచ్ గోకుల్ కుచ్ నానా హైరానా” చాలా అర్థపూర్ణమైన పాటతో జీవితం అని ” beautiful Mrunalinigaru!