ప్రేమకథ – 7

కథా కాదు; కవిత కూడా కాదు. నవల అంతకంటే కాదు. ఏం రాసాడు?

నిద్రలేచాను. వంటింట్లోకి నడిచాను. ఎందుకు వచ్చానో గుర్తుకు రాలేదు. మళ్లీ వచ్చి మంచం మీద పడుకున్నాను. కిటికీ తెరలు తొలగించాను. బయట ఇంకా చీకటే…

బెల్లు మోగింది. ఇంత చీకట్లో ఎవరూ? వెళ్లి తలుపు తీసాను. పని పిల్ల జ్యోతి.

“ఏం అప్పుడే వచ్చావు?’

“అప్పుడేనా? ఏడున్నరైంది కదమ్మా. ఇంకా తిడతావనుకున్నాను”

“మరి చీకటిగా ఉందెందుకూ? తుఫాను వస్తోందా? “

“చీకటా? ఎండ ఫెళ్లుమంటూంటే… అసలు అక్టోబర్ నెలలానే లేదు కదమ్మా. ఒకటే ఉబ్బరం” చీపురు తీసుకువచ్చి దులిపేస్తోంది.

సూర్యుడు ఫెళఫెళమంటున్నాడా? చీకటి ఎక్కడ మరి?

జ్యోతి బెడ్ రూం ఊడవడానికి వెళ్లింది.. వెళ్లిన అయిదు నిమిషాలకే బయటకు వచ్చింది

“అప్పుడే ఊడ్చేసావా?’ అడిగాను. తలవంచుకుని అడ్డంగా తిప్పింది.

“ఊహూ. ఊడవను. అక్కడ టేబిల్ మీద కాయితాలు మీరు తీసి పారేస్తారా? నేను పారేయనా?’ నాకు ఒళ్లు మండింది. సారథి రాసుకునే కాయితాలు పారేస్తుందా? ఎంత గుండె ధైర్యం దీనికి?

“ఊడవకపోతే మానెయ్. ఆ కాయితాలు తీయడానికి వీల్లేదు. అయినా నేల్లో ఊడవడానికి టేబిల్ మీద కాయితాలు అడ్డమా నీకు?’

“మీరే కదా. టేబిళ్లు, కుర్చీలు దులిపి ఊడవమంటారు?’ గొణుక్కుంటూ వెళ్లింది. అబ్బ. అసలే చీకటి. పొద్దున్నే వచ్చి కూర్చుని మళ్లీ వాదులాట కూడా నాతో. పదో తరగతి వరకూ చదువుకుంది కదూ… తన వాదనాపటిమంతా నా పైనే చూపిస్తుంది.

“అమ్మా..’ మెల్లిగా పిలిచింది మళ్లీ. విసుగ్గా చూసాను.

“మూడు రోజులైంది మీరు నాకు కాఫీ ఇచ్చి… అసలు మీరు తాగుతున్నారా?’

“చీకట్లో కాఫీ ఏమిటే? ….నాకు తెల్లారాక ఒక కాఫీ తాగడమే అలవాటు. తెలీదా నీకు? కావాలంటే నీకిస్తాలే… ‘ లేచి లోపలికి వెళ్లాను. డికాషన్ కూడ వేయలేదు. సారథి లేడు కదా….

జ్యోతి నాకేసి అదోలా చూసింది. ‘నాకొక్కదానికే అయితే పెట్టొద్దులేమ్మా” అంది.

జ్యోతి ఎప్పుడు వెళ్లిపోయిందో తెలీదు. విసుగ్గా ఉంది. ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. తోడికోడలు సుధ ఫోన్ చేసి, ‘బయటకు వెళ్దాం వస్తావా. కొంచెం షాపింగ్ ఉంది’ అంది. ఎందుకూ బయటకు వెళ్లడం? నాకు సారథితో తప్ప ఎవరితో షాపింగ్ చేసే అలవాటు లేదు. ఇక నుంచి షాపింగ్ అవసరమే లేదు…

ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. ఒకవైపు రేడియోలో మన్ చాహే గీత్ వినిపిస్తోంది. మరో వైపు టీవీలో ఆరోగ్య కార్యక్రమాలు వస్తున్నాయి. రెండూ ఆన్ చేసి పడుకున్నానా?  అంటే మధ్యాహ్నమైందా? ఏమిటో.. అదోలా ఉంది కడుపులో… ఆకలేమో…లేచి నించున్నాను. ఓపిక లేక మళ్లీ కూలబడ్డాను… ఫోన్ మళ్లీ…. విసుగ్గా తీసాను

“మంజులా…’ మోహన్  గొంతు.

“ఊ…”

“ఏమిటలా ఉన్నావు? “

“ఎలా ఉంటాననుకున్నావు?’ కాస్సేపు నిశ్శబ్దం

“ సారీ…. నేను అనాలనుకుంది అలా కాదు.. నీ లీవు అయిపోయింది. పెట్టింది 15 రోజులే కదా…మొన్నటికే అయిపోయింది లీవు. పొడిగిస్తున్నావా, వచ్చి చేరుతున్నావా అని మేనేజర్ అడుగుతున్నాడు”

“ఏమో. అసలు ఆఫీసుకు ఎలా వస్తాననుకున్నావు? అడగడానికి నోరెలా వచ్చింది ఆయనకు?’ మోహన్ రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు

“సాయంత్రం ఇంటికి వస్తాను. అప్పుడు మాట్లాడదాం” ఎందుకూ రావడం? సారథి ఉంటే ఇద్దరూ బాడ్మింటన్ ఆడుకునేవాళ్లు. నాకంటే సారథి కే మంచి ఫ్రెండయిపోయాడు మోహన్ ఆ బాడ్మింటన్ పుణ్యమాని. ఇప్పుడొచ్చి ఏం చేస్తాడట?

మళ్లీ కడుపులో అలజడి. అబ్బా. ఏదో తినాలి కాబోలు. అమ్మ వెళ్లిపోయి మూడు రోజులయింది. ఏదో ఇంత వండేది. ఎప్పుడో కొంచెం తినేదాన్ని. ఇప్పుడు వండుకోవాలా? ఎవరున్నారని? సారథి ఫోన్ చేసి ఏం కూర కావాలో చెప్పందే ఎలా వండడం? ‘నిన్న వేపుడు తిన్నాం కదా.ఇవాళ పులుసు కూర వండుతావా?’ అని అడగందే ఏం వండాలో ఎలా తెలుస్తుంది? లేచి వంటగదిలో డబ్బాలు వెతికాను. ఏమీ తినాలనిపించడం లేదు. ఫ్రిజ్ తెరిచాను. చీకటిగా ఉంది… లైట్ చెడిపోయిందా?… వెతగ్గా..పెరుగుగిన్నె కనిపించింది. బయటకు తీసి కప్పులో పెరుగు చక్కెర వేసుకుని స్పూను తెచ్చుకుని టీవీ ముందు కూర్చున్నాను. ఛానల్స్ తిప్పుతూంటే స్టార్ ప్రీమియర్ లో ‘సిక్స్ ఫీట్ అండర్’ వస్తోంది.

‘ఆరడగుల లోతున’… శవపేటికను పడేస్తారు. అందమైన శవపేటిక ఎంచుకుంటారు. ఎంత ఖరీదైతే అంత గొప్ప.  మనకు శవపేటిక అవసరం లేదుగా… కట్టెలు చాలు. ఒళ్లంతా రూపురేఖలు లేకుండ కాలి బూడిదైపోవాలి. … అదీ మన సంప్రదాయం. శవపేటికైతే చాలా కాలం పాటు స్మశానానికి వెళ్ళి దాన్నయినా బయటినుంచి చూడొచ్చు కదా…సారథి పెట్టెనైనా చూసుకునేదాన్ని కదా… అలా కాల్చేసారేం? అంత ప్రేమించిన సారథిని వాళ్లన్నయ్య కాల్చేస్తోంటే నేనెందుకు ఊరుకున్నాను?

అవును కదూ.. నేనసలు అక్కడ లేను…నన్నెవరు తీసుకెళ్లారు కనక స్మశానానికి? ‘ఈ మధ్య మన కుటుంబాల్లో కూడ ఆడవాళ్లు వెళ్తున్నారు స్మశానానికి’ ఎవరో అన్నారు. ‘వద్దు. మంజుల తట్టుకోలేదు’ ఇంకెవరో అన్నారు. ‘పాపం. ఎంత ప్రేమించిందో అతన్ని’ మరొకరు.

వీళ్లకేం తెలుసు నేనెంత ప్రేమించానో సారథిని? ఏదో తెలిసినట్టు మాట్లాడుకుంటున్నారు. లేచి లైటు వేసాను. ఏమిటో మధ్యాహ్నం కూడ చీకటిగానే ఉంది.

రఫీ సీడీ పెట్టుకుని పడుకున్నాను. ఎప్పుడు నిద్రపోయానో సోఫాలోనే పడుకుని…. లేచేసరికి ‘బిఛ్ డే సభీ బారీ బారీ…’ అంటున్నాడు రఫీ.. నా మూడ్ ఎలా తెలుస్తుందో రఫీకి…. లేచి సిడి ప్లేయర్ ఆఫ్ చేసేసాను. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసాను. మోహన్.

“ఏమిటి? ఈ టైంలో లైట్ వేసుకున్నావు? ‘ అన్నాడు

“చీకటిగా ఉంది కదా?’ వీళ్లకెవ్వరికీ ఎందుకర్థం కావడం లేదు ఎంత చీకటిగా ఉందో? పొద్దున్న జ్యోతి కూడ అంతే.

మోహన్ నాకేసి వింతగ చూసాడు. “ఇంకా అయిదున్నరేగా…ఊ. చెప్పు. రేపట్నుంచి ఆఫీసుకు వస్తానని బాస్ కి చెప్పనా?’

“ఎందుకొస్తాను? ఎలా అడుగుతున్నావసలు?’

మోహన్ ఇబ్బందిగా చూసాడు. “బాధ మరిచిపోడానికి……’ గొణిగాడు…

నాకు మోహన్ వెళ్లిపోతే బాగుండునని ఉంది. ఫోన్ మోగిన శబ్దం. మొబైల్ ఎక్కడ పెట్టానో తెలీడంలేదు… మోహనే లేచి డైనింగ్ టేబిల్ మీద ఉన్న ఫోన్ ని తెచ్చి ఇచ్చాడు. అమ్మ నెంబర్ స్క్రీన్ మీద. తీయాలని లేదు. కానీ మోహన్ ముందు బావుండదేమో. తీసుకున్నాను.

“ఎలా ఉన్నావు తల్లీ…. నాన్న ఇంకొంచెం బాగుండివుంటే నేను అక్కడే ఉండాల్సిన దాన్ని. భోజనం చేసావా?”

వీళ్లందరికీ పిచ్చా? సారథి చనిపోయాడు. నేను భోజనం చెయ్యాలా? అదంత ముఖ్యమా? నేను ఆఫీసుకు వెళ్లాలా?బాంక్ నుంచి ఇంటికి వెళ్లాలంటే సారథి ఉన్నాడన్న ఆనందంతోనే… అది లేకపోయాక బాంక్ ఎందుకు?

“మంజూ…. ఏమైందమ్మా.. మాట్లాడవేం? పనమ్మాయిని రోజంతా ఉండమని చెప్పాను…ఉండడం లేదా?’

“ఎందుకూ. నేనే తరిమేసాను దాన్ని. సారథి బదులు పనిపిల్లా? ఏం చెప్తావమ్మా…’ చికాగ్గా అన్నాను..

అమ్మకు కోపం వచ్చినట్టుంది. “సారథి లేడు మంజూ. ఇక రాడు. సారథి చనిపోయాడు…. అర్ధమవుతోందా? నువ్వేం చిన్నపిల్లవా ఇన్నిసార్లు అందరం చెప్పడానికి? ‘

మోహన్ నాముఖంలోకి భయంగా చూస్తున్నాడు. అమ్మ ఏమంటోందీ ..?

బాగా కోపం వచ్చింది.. “అమ్మా. సారథిని నేను పెళ్లి మాత్రమే చేసుకోలేదు. ప్రేమించాను. మనిషి చచ్చిపోతే ప్రేమ చచ్చిపోవాలా? నీకేం తెలుస్తుంది అయినా. నీకు ప్రేమంటే ఏం తెలుసు? నాన్నతో డ్యూటీనే తప్ప నిజంగానే ప్రేమతో కాపురం చేసావా? ఇప్పుడు మాత్రం? డ్యూటీ కోసమేగా వెళ్లావు? మీ తరానికి ప్రేమంటే తెలుసా అసలు? ఎవరో చేసుకోమంటే చేసుకోవడం, ఆ మొగుడు పోతే ఇరుగుపొరుగుతో ముచ్చట్లు చెప్పుకుంటూ, మనమలుంటే ఆడుకుంటూ, కోడళ్లతో పోట్లాడుతూ గడిపేయడం… ప్రేమంటే ఏమిటో నన్నడుగు చెప్తా… ఆ మనిషి పక్కనుంటే ప్రపంచమే అక్కరలేదన్నంత ఆనందం; అతను లేకపోతే బతకలేనంత దు:ఖం;“ అమ్మ ఎప్పుడు ఫోన్ పెట్టేసిందో.

మోహన్ లేచి నించున్నాడు. నాకు దు:ఖం ఆగడం లేదు. మోహన్ రెండడుగులు వేసి ముందుకు వచ్చాడు. నన్ను పట్టుకుని ఓదారుస్తాడా ఏమిటిపుడు? ఆ దు:ఖంలోనూ గాభరా వేసింది. సోఫాలోంచి లేచాను. మోహన్ ఆగిపోయాడు.

“మంజూ… పోనీ మా ఇంటికి రారాదూ? లక్ష్మితో ఉంటే కొంచెం బాగుంటుందేమో…. పిల్లలు కూడ ఉంటారు కదా… కొంచెం రిలీఫ్ గా ఉంటుంది..”

అంటే నాకు పిల్లలు లేరని ఎత్తిపొడుస్తున్నాడా? సారథికి నేను, నాకు సారథి. పెళ్లై పదేళ్లయినా మాకు పిల్లల్లేరని అందరికీ బెంగే. మాకు తప్ప. ‘మీ ప్రేమకు ప్రతిబింబాన్ని చూసుకోవాలని లేదూ?’ అడిగేది మోహన్ భార్య లక్ష్మి. ప్రేమే అంత గొప్పగా ఉంటే, ప్రతిబింబంతో పనేమిటో? వీళ్లందరూ నేలబారు మనుషులు. ప్రేమ ఔన్నత్యం తెలీదు. పిల్లలు పుడితేనే భార్యాభర్తల ప్రేమ నిలుస్తుందనుకుంటారు…అసలు సారథికివ్వడానికే నా ప్రేమ సరిపోవడంలేదనిపించేది… ఇంకా దాన్ని మరొకరితో పంచుకోవడమా?

మోహన్ వెళ్లిపోయినట్టున్నాడు. తలుపు వేసిన చప్పుడు. మళ్లీ నేనూ….చీకటి….అన్ని గదుల్లో లైట్ వేసేసాను. ఇంత చీకట్లో ఎలా ఉండడం? పడక గదిలోకి వెళ్లాను. ‘కాయితాలు తీస్తానని బెదిరించింది ఆ జ్యోతి. నేనే సర్దుకుంటా నా సారథి కాయితాలు”

పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతున్నాయి కాయితాలు. సారథి ఆక్సిడెంట్ లో చనిపోయినప్పటినుంచి ఈ గదిలోకి ఎవరు వెళ్లడానికీ నేను ఒప్పుకోలేదు. తను ముందు రోజు రాత్రి రాసుకున్న కాయితాలు అలాగే ఉన్నాయి. రెండు రోజుల క్రితం తలుపులు తెరిచాను. నిన్న జ్యోతికి ఊడవడానికి అనుమతి ఇచ్చాను.

మంచం మీద కూర్చున్నాను. పేపర్లు తీసాను. సారథి ఎందుకో ప్రతిసారిలా ఈసారి తను రాస్తున్నది నాతో పంచుకోలేదు. నాకు చదివి వినిపించలేదు. దెబ్బలాడితే నవ్వి ఊరుకున్నాడు. చదవడం మొదలుపెట్టాను. కథా కాదు; కవిత కూడా కాదు. నవల అంతకంటే కాదు. ఏం రాసాడు?

“మొన్న మంజుకి న్యూమోనియా వచ్చిందంటే గుండె ఆగినంతపనైంది. తను పూర్తిగా కోలుకునేవరకు నేను మనిషిని కాలేకపోయాను.  అసలు మా ఇద్దరి ప్రేమకు దిష్టి తగిలుంటుంది. పెళ్లికి ముందు అయిదేళ్ల నుంచీ ప్రేమించుకుంటూ, పెళ్లై పదేళ్ళయినా అంతే ప్రేమగా ఉండడం ఎలా సాధ్యమవుతోంది? అని నా ఫ్రెండ్స్ కూడ అంటారు. అప్పుడు మేం నిజంగా అరుదైన భార్యాభర్తలమే అనిపిస్తుంది. మంజుకి ఏదైనా జరిగి చనిపోతే? తనకు కూడ పిల్లలు అత్యవసరం అనిపించకపోవడం మంచికే అయింది. లేకపోతే ప్రతి డెలివరీకి నాకు ప్రాణం పోయేంత పనయ్యేది. తను దక్కుతుందో లేదో అని…’

పెదవులకు ఉప్పగ తగిలాయి కన్నీళ్లు….“తర్వాత స్ధిమితంగా ఆలోచిస్తే ఇప్పుడనిపిస్తోంది. ఇంత బేలగా ఆలోచిస్తున్నానేమిటా అని. ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు పోక తప్పదు. కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుంటే తప్ప…. లోకంలో అతి సహజమైన చావును గురించి బతికుండగా ఆలోచించి నేనేం సాధించినట్టు? ముందుగా తను చనిపోతే ఏమవుతుంది? తనతో గడిపిన 15 ఏళ్ల జీవితం తక్కువేమీ కాదు. అది ఇచ్చిన ఆనందం మరో యాభై ఏళ్ల వరకూ నన్ను నడిపిస్తుంది. ఇక ఉద్యోగం, స్నేహితులు, నా వ్యాపకాలు, నా రచనలు, నాకిష్టమైన సంగీతం… ఇంకా ఎన్నున్నాయి జీవితంలో ఎంజాయ్ చెయ్యడానికి? … ..”

మరో పేరా ఉంది. నాకది కనిపించలేదు. కళ్లు మూతలు పడ్డాయి.

ఎప్పుడు లేచానో తెలీదు….. నెమ్మదిగా లేచి బయటకు వచ్చాను. వంటింట్లోకి వెళ్లి కాఫీ డికాషన్ వేసాను. లైటు అవసరమనిపించలేదు. మిగిలిన గదుల్లోని లైట్లన్నీ ఆపేసాను. ఎందుకు వెలుగుతున్నాయవి? డికాషన్ దిగగానే కాఫీ కలుపుకుని హాల్లోకి వచ్చాను. కాలింగ్ బెల్ మోగింది.

వెళ్లి తీసాను. జ్యోతి

“ఇంతలేటా రావడం?’ అన్నాను. జ్యోతి తెల్ల ముఖం వేసింది.

‘అదేంటమ్మా…. అప్పుడే వచ్చావా అని తిడతారనుకున్నాను. ఈరోజు యాద్గరిగుట్టకు పోవాలె జల్దీ వస్తానని చెప్దామని రాత్రి మూడు సార్లు ఫోన్ చేసాను. మీరు తియ్యలేదు. ధైర్యం చేసి వచ్చేసా.. .. అప్పుడే కాఫీ పెట్టుకుని తాగేస్తున్నారా?’

“ఎంతయిందేమిటి టైము? తెల్లగా తెల్లారాక వచ్చి పైగా కబుర్లు…” విసుక్కున్నాను. నా ఫోను, వాచి ఎక్కడ పెట్టానో… మా ఇంట్లో ఒక్క గోడ గడియారమూ ఉండదు.

“నాలుగున్నరేమ్మా….బయట చిమ్మ చీకటి…’ వంటింట్లోకి వెళ్లింది జ్యోతి.

‘ నువ్వొకతి. అన్నీ అతిశయోక్తులే. ఇంత వెలుతురుంది కదా…. ఉండు. కాఫీ కలుపుతా నీక్కూడా…’ తన వెంటే నేనూ లోపలికి నడిచాను.

___

 

.

 

మృణాళిని

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సారంగ లో వ్యాసాలూ కవితలూ చదువుతున్నాను కానీప్రేమకథ అనిఉంటే అంత ఆసక్తి కలగలేదు.కానీ ఈరోజు మీరచనలు చదివిన చాలాకాలంఅయ్యింది అని కాజువల్ గా మొదలుపెట్టాను.అద్భుతమైన కథనంతో నాకు గుండెని పట్టి కుదిపినట్లయ్యింది.బాగుందనే చెప్పాలా మ రో మాటేమైనా ఉందా ఆలోచనలో పడిపోయాను.సాదరాభినందనలు మృణాళినిగారూ.

  • మొత్తానికి వెలుతురు ,చీకటి మనసులో నే ఉన్నాయని సున్నితంగా చెప్పారు.ఇప్పటికే2 సార్లు చదివా .very nice story.,👌👌

  • “పెదవులకు ఉప్పగ తగిలాయి కన్నీళ్లు….“తర్వాత స్ధిమితంగా ఆలోచిస్తే ఇప్పుడనిపిస్తోంది. ఇంత బేలగా ఆలోచిస్తున్నానేమిటా అని. ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు పోక తప్పదు. కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుంటే తప్ప…. లోకంలో అతి సహజమైన చావును గురించి బతికుండగా ఆలోచించి నేనేం సాధించినట్టు? ముందుగా తను చనిపోతే ఏమవుతుంది? తనతో గడిపిన 15 ఏళ్ల జీవితం తక్కువేమీ కాదు. అది ఇచ్చిన ఆనందం మరో యాభై ఏళ్ల వరకూ నన్ను నడిపిస్తుంది. ఇక ఉద్యోగం, స్నేహితులు, నా వ్యాపకాలు, నా రచనలు, నాకిష్టమైన సంగీతం… ఇంకా ఎన్నున్నాయి జీవితంలో ఎంజాయ్ చెయ్యడానికి? … ..” ఇది చదివాక కూడా …. ఆమె ఆలచనలో తేడా లేదా

    • నేను పైన చేసిన సూచన తప్పని మళ్ళీ చదివినప్పుడు గ్రహించను. ఆవిడ అతను రాసినది చదివేకనే తనలో మార్పు వచ్చినట్టు మృణాలిని గారు చీకటిని కూడా వెలుగుగా చూపించడం లో ఉందని గ్రహించక పోవడం నా తప్పే. తాను చివరిలో రాసిన ఈ పేర దానికి ఉదాహరణ . “నాలుగున్నరేమ్మా….బయట చిమ్మ చీకటి…’ వంటింట్లోకి వెళ్లింది జ్యోతి.

      ‘ నువ్వొకతి. అన్నీ అతిశయోక్తులే. ఇంత వెలుతురుంది కదా…. ఉండు. కాఫీ కలుపుతా నీక్కూడా…’ తన వెంటే నేనూ లోపలికి నడిచాను.”

  • అసలు సారథికివ్వడానికే నా ప్రేమ సరిపోవడంలేదనిపించేది… ఇంకా దాన్ని మరొకరితో పంచుకోవడమా? Speechless. Yentha premo.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు