ప్రేమకథ-12

‘అయితే మాత్రం? నన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను మాట్లాడింది నచ్చకుండా ఎలా ఉంటుంది?’

సాయంత్రం వరకూ ఈమెయిల్ చూసుకోడానికి కుదర్లేదు. ఆఫీసులో అధికారిక ఈమెయిల్ తప్ప వ్యక్తిగత ఈమెయిల్స్ చూసే అలవాటు లేదు. ఇంటికి వచ్చి, గ్రీన్ టీ తాగి లాప్ టాప్ ని ఒళ్లో పెట్టుకుని ఈమెయిల్ చూడ్డం మొదలుపెట్టాను.

మంజుల నుంచి మెయిల్! ఎంత కాలానికి! ఎన్నేళ్లయిందో గుర్తులేదు. రెండో, మూడో… కాస్త ఆనందిస్తూ, కాస్త భయపడుతూ తెరిచాను.

‘డియర్ రోహిత్,

నా నుంచి ఈమెయిల్ అంటే మూర్ఛపోకు… నువ్వు “ఐ టోల్డ్ యూ సో’ అనడానికి ఒక అవకాశమిద్దామని ఈ మెయిల్. ‘

చదవడం ఆపేశాను. నేను దేనికి ‘ఐ టోల్డ్ యూ సో’ అనాలి? నేనేమన్నానని? ఎం.ఏ రోజుల్నించి దాదాపు 20 ఏళ్లు సాగిన మా స్నేహంలో ఎన్నో అనే ఉంటాను. తను కూడ చాలా మాటలనేది నన్ను. ఇద్దరి మధ్యా ఒక్క రహస్యం కూడ ఉండేది కాదు. తన ఆడస్నేహితులకంటే ఎక్కువగా నాకే అన్నీ చెప్పుకునేది. నేనూ అంతే. తర్జనభర్జనలెందుకు? మెయిల్ పూర్తిగా చదివితే అర్ధమవుతుందేమో.

మళ్లీ కంప్యూటర్ కేసి తిరిగాయి కళ్లు.

“దేనికనాలా అని ఆశ్చర్యపోతున్నావేమో….’ నవ్వేశాను నేను గట్టిగా. తను ఎదురుగా కూర్చున్నట్టే ఉంది.

“నా గురించి నాకంటే బాగా నీకే తెలుసు కాబట్టి దేనికైనా ‍అనుకోవచ్చు. విషయమేమిటంటే నేను మధు గురించి చెబుతున్నప్పుడు ఒక మాటన్నావు. నీకు గుర్తుండే ఉంటుందిలే… ఆరోజు నాకు నీమీద బాగా కోపం వచ్చింది. నీ మీద పంతం కొద్దీనే వెంటనే వేణుని పెళ్లి చేసుకున్నాను. హాయిగా ఉన్నాను. అని అనుకున్నాను.నీక్కూడా అదే చెప్పాను. మేం షికాగో వచ్చినప్పటినుంచి నీతో కబుర్లు తక్కువయ్యాయి. మొదట్లో బాధపడేదాన్ని. నీతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడ్డానికి వీలవ్వదని. కానీ కొత్త జీవితం.. కొత్త స్థలం… వేణు.. ఆనందంలో నిన్ను అంతగా మిస్సవలేదు. కానీ నాలుగేళ్లయిపోయింది ఇక్కడికి వచ్చి. దాదాపు మూడేళ్లయింది నీకు కనీసం ఈమెయిల్ పంపి.

ఏమిటో…నాకు జీవితం బాగా బోరు కొడుతోంది. వేణుని ప్రేమించానని ఎందుకనుకున్నానో తెలీడం లేదు. అంతకు ముందు విక్రమ్, సంజీవ్, మధు లని కూడ ప్రేమించాను కదా. అలాగే వేణుని కూడ వదిలేస్తే పోయే దానికి పెళ్లెందుకు చేసుకున్నాను?’

నేను చదవడం మానేశాను. మనసంతా వికలమైపోయింది. ఏమిటీ అమ్మాయి? జీవితమంటే ఏమనుకుంటోంది? పెద్ద ఆశ్చర్యంగా లేదు కానీ, బాధగా మాత్రం ఉంది. మళ్లీ మొదలుపెట్టాను.

“అందరూ ప్రేమించి పెళ్లిచేసుకుని ‘అండ్ దే లివ్డ్ హాపీలీ ఎవర్ ఆఫ్టర్’ అన్నట్టు ఎలా ఉంటారు రోహిత్? నా వల్ల కాదు బాబోయ్. ఇదివరకు వేణుతో కలిసి లాంగ్ వాక్ కీ, లాంగ్ డ్రైవ్ కీ వెళ్లడం, గంటల తరబడి ఇండియా గురించి, అమెరికా గురించి, పుస్తకాలగురించి, పాటల గురించి మాట్లాడుకోవడం ఎంతో బాగుండేది. ఇప్పుడు విసుగొస్తోంది. అసలు ఒక్కోసారి నిద్రలేవగానే ఏ పాట గుర్తుకొస్తుందో తెలుసా? ‘జిందగీకీ ఆయినేకో తోడ్ దో.. ఇస్ మే అబ్ కుఛ్ భీ నజర్ ఆతా నహీ’.. నా జీవితమనే అద్దం పగలగొట్టడం మంచిదేమో. నిజంగానే అందులో ఏమీ కనిపించడం లేదు…’

తలపట్టుకు కూర్చున్నాను. ఈ మెలోడ్రామా ఏమిటి? అసలు తనకు ఏం లేదని? అందం, చదువు, ప్రేమించే భర్త, కావలసినంత డబ్బు… ఏ సమస్యలూ లేవు…ఇప్పుడే కాదు. మొదట్నుంచీ కూడా సమస్యలేవీ లేని జీవితం మంజుది. అందుకే ప్రేమగురించి ఆలోచించేందుకు బోలెడు టైము. రెండు రోజులు ఒక అబ్బాయితో మాట్లాడితే అతనికి తన మీద ప్రేమ ఉందనుకునేది. మరో వారం రోజులు మాట్లాడుకుంటే తను కూడ అతన్ని ప్రేమించాననుకునేది. మొత్తం కథ నాకు చెప్పేది…. మామూలుగా అబ్బాయిలకుంటుంది ఈ అలవాటు. అమ్మాయిలకు అరుదే…. ఏ పని మీదా గంట కూడ సమయం గడపక పోతే ఇలాగే ఉంటుందని తిట్టేవాణ్ణి. సహజమైన తెలివితేటల పుణ్యమాని ఎక్కువ సేపు చదవకపోయినా అన్ని పరీక్షలూ మంచి మార్కులతో పాసైపోయేది. ఎప్పుడూ సినిమా పాటలు వింటూ, ఆ ప్రణయలోకంలో తేలిపోయేది. ప్రతి అబ్బాయి పరిచయంలోనూ చాలా హిందీ, తెలుగు సినిమా పాటలు, పాత్రలూ కోట్ చేసి నన్ను చంపుకుతినేది. ఒకదశలో నాకు చిరాకేసి ‘విక్రమ్‌కి రాజేశ్ ఖన్నా పాటలు పాడావుగా… సంజీవ్ కి హీరోని మార్చు. ధర్మేంద్ర పాటలు బాగుంటాయి’ అని కూడ అన్నాను. ‘నా ప్రేమంటే నీకంత అలుసా?’ అని పోట్లాడింది. మళ్లీ కంప్యూటర్…

“నీకు నేనంటే ఒళ్లు మండిపోతోందని తెలుసు…..ఏమో…. ఇన్నేళ్లూ నీకు ప్రేమించడం రాదని వెక్కిరించేదాన్ని కదూ…. ఇప్పుడు అనుమానంగా ఉంది..”

నిజంగానే మంజుల ప్రేమకథల దెబ్బకి నేను వారిజ మీద ప్రేమ ఉన్నా చెప్పలేదు. ఆమెది వేరే కులం; చాలా డబ్బున్న అమ్మాయి. నేనో మధ్యతరగతి వాణ్ణి. ఎందుకొచ్చిన గోల అని హాయిగా అమ్మ చూపిన పక్కింటి పిన్నిగారి కూతుర్ని చేసుకున్నాను. అంతకంటే హాయిగా నా భార్యను ప్రేమిస్తూ ఆనందంగా ఉన్నాను.

“నిజంగా నీకు ప్రేమించడం రాదేమో గానీ…. ఏది ప్రేమో, ఏది కాదో నీకు తెలుసనుకుంటా….’ ఈ సారి కంప్యూటర్ మూసేశాను…

అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఏమన్నానో మంజులతో…. ఎందుకన్నానో…..

ఆ రోజు సాయంత్రం ఇద్దరం వంట చేస్తున్నాం… అపుడపుడూ వాళ్ల తల్లిదండ్రులకో, మా తల్లిదండ్రులకో వంట చేసిపెట్టడం మాకిద్దరికీ అలవాటు. వాళ్లు కూడ మమ్మల్నిద్దరినీ మంచి స్నేహితులుగా అర్థం చేసుకున్నారు కనక ఇద్దరం రెండు గంటలు వంటింట్లో ఉన్నా ఏ గొడవా ఉండేది కాదు. మంజులకంటే నాకే వంట బాగా వచ్చు కనక తను కూరలు తరగడం, మిక్సీ వెయ్యడం..నా ఆదేశాల మీద చేసేది. వంట హుషారుగా చేసే మంజుల ఆరోజు కొంచెం మందకొడిగా ఉంది.

“ఏం? మధుతో గొడవపడ్డావా?’ అడిగాను

“ఊ… గొడవంటే గొడవేమరి….నన్ను ఘోరంగా తిట్టిన శిరీషను వెనకేసుకువచ్చాడు. ఆ పిల్ల అతన్ని అప్పుడెప్పుడో ప్రేమించిందిలే…. “ ఇదంతా మా గ్రూపులో మామూలే.. ఓ పదిమంది అమ్మాయిలూ, అబ్బాయిలూ కలిసి గ్రూపుగా ఉండేవాళ్లం. మాలోనే ప్రేమలు, విడిపోవడాలూ.. విడిపోయినా అందరూ స్నేహంగా ఉండడాలూ.. కామన్.. ఒక్కొక్కప్పుడు కాస్త ఈర్ష్య రగులుతున్నా పెద్దగా గొడవలు లేవు. ‘ప్రేమ అనేది ఒక్కసారే ఒక వ్యక్తితోనె కలుగుతుంది’ అనే సినిమా డైలాగులు, నవలా డైలాగులు ఎంత అబద్ధమో. అలా అనేవాళ్లకు ప్రేమగురించి తెలీదు. ఈ కాలం ప్రేమల గురించి అసలే తెలీదు.

“ఎంతైనా ఒకప్పుడు ప్రేమించుకున్నారు కదా…కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంటుంది .. క్షమించి వదిలేసెయ్’ పోపు వేస్తూ అన్నాను.

“వేరే దానికైతే క్షమించవచ్చు. నన్నే తిట్టినపుడు?. చెప్పేశానులే మధుకి…”

గరిట కింద పడేశాను. “ఏం చెప్పావ్?’ అడిగాను

“ఇక నీకూ, నాకూ రామ్ రామ్ అని…” తాపీగా అంది…

నేను కోపంలో స్టవ్ కట్టేశాను. జీడిపప్పును ముక్కలు చేస్తున్నట్టు నటిస్తూ తింటోంది మంజుల. తన కేసి తీవ్రంగా చూశాను.

“నీకేం సరదాగా ఉందా ప్రేమంటే? ‘ మంజుల నిర్లక్ష్యంగా తల ఎరగేసింది. రెండుభుజాలు పట్టుకుని కుదిపాను.

మంజుల కళ్లల్లో నీళ్ళు చూసి వదిలేశాను.

“లేకపోతే ఏంటి రోహిత్! నేను ఆ మధ్య ఒక మీటింగ్ లో ఏదో పుస్తకం గురించి మాట్లాడాను. నా ఉపన్యాసం చెత్తగా ఉందట. అందులో కొత్తగా ఏమీ చెప్పలేదట.. నా సొంత ఆలోచనే లేదట.. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడ్డం అని శిరీష అంటూంటే మొద్దబ్బాయిలా ఉలకడు పలకడు ఆ మధు”

‘ఎందుకంటావ్? మధుకి కూడ పుస్తకాల గురించి బాగానే తెలుసుకదా. తనూ ఆ రోజు మీటింగ్ కి వచ్చే ఉంటాడు. నిజంగానే నువ్వు బాగా మాట్లాడలేదని అనుకున్నాడేమో. శిరీష చెప్పింది కరెక్టేనేమో” అన్నాను.

‘అయితే మాత్రం? నన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను మాట్లాడింది నచ్చకుండా ఎలా ఉంటుంది?’

“ఎందుకుండకూడదు? ప్రేమ వేరు; అది వేరు.. మధుకి ఆ తేడా తెలుసు. అందుకే శిరీషది తప్పని అనలేకపోయాడు”

మంజులకు దు:ఖం ఎక్కువైంది. ‘ఛీ.. ఎంత చెత్తగా మాట్లాడుతున్నావు. అయినా నువ్వేమనుకుంటే నాకేం? కానీ మధు?.. నన్ను ప్రేమించే వాడికి నేనేం చేసినా అద్భుతంగా ఉండాలి. నాలో ఏ లోపమూ కనిపించకూడదు. మా మాటకంటే మరొకరి మాటకు విలువ ఇవ్వకూడదు. అదేగా ప్రేమంటే? …”

నా చిరాకు ఆకాశాన్నంటింది.

అప్పుడన్నాను “లేదు మంజులా. నువ్వు ఎప్పటికీ ఎవర్నీ ప్రేమించలేవు. నీకు నిన్ను ప్రేమించుకోడానికే హృదయం చాలదు. ప్రేమించడం అనే భావనను ప్రేమిస్తావేమో కానీ… మనుషుల్ని కాదు. ఎప్పటికైనా నీకిది అర్థమవుతుందో లేదో’

అదీ. ఇన్నేళ్లకు మంజులకు గుర్తుకు వచ్చిన నా మాట.

మళ్లీ కంప్యూటర్ తెరపైకి దృష్టి మరల్చాను.

“నాకెందుకు విసుగ్గా ఉంది? పిల్లల్ని కంటే బెటరా? ఇక్కడ అందరూ అదే అడుగుతున్నారు. ఏమో. అదొక వదిలించుకోలేని బంధమైపోతుంది కదా. పిల్లలు పుడితే వేణును వదలడానికి కష్టమేమో.. ఇలాంటి ఆలోచనలు కూడ వచ్చాయి. చాలాసేపు ఆలోచించాను…నలుగుర్ని ప్రేమించాను కదా.. నాలుగో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నాను. ఎందుకు ఏవీ నిలుపుకోలేకపోయాను? ఏ సన్నివేశంలో అయినా, ఏ సంభాషణలో అయినా నేను నా వైపు నుంచే ఆలోచిస్తాను. అది కరెక్టే అనుకుంటాను. అది సహజం కదా..ఈ మధ్య వేణుతో చాలా చిన్న చిన్న వాటికి గొడవపడుతున్నాను. వేణు ఒకరోజు అన్నాడు “అపుడపుడూ తప్పు చేయడం, తప్పు మాట్లాడ్డం సహజం మంజులా. అలాగే తప్పు ఒప్పుకోవడం కూడ. ఒక్కసారి నీ మాట తప్పని ఒప్పుకుని చూడు. ఒకే ఒక్కసారి…పోనీ.. ఒక పని చేయగలవా? నీ పట్ల నాకుండాల్సిన ప్రేమగురించి కాక, నా పట్ల నీ కుండాల్సిన ప్రేమగురించి ఆలోచించు….నేనింకేమీ అడగడం లేదు. నిన్ను మారమని కూడ అడగడం లేదు.. ఆలోచించమంటున్నానంతే….’ ఇలా అన్న తర్వాత అతను నాతో ఎక్కువ మాట్లాడలేదు. అప్పట్నుంచీ ఇంట్లో ఉండే టైం తగ్గిపోయింది. రెండు రోజులైంది. బోస్టన్ లో పనుందని వెళ్లాడు. ఫోన్ కూడా చెయ్యలేదు. దిగులుగా ఉంది. వంట చేసుకుంటూంటే నువ్వు గుర్తుకు వచ్చావు. నువ్వు చెప్పింది నిజమేనేమో… నాకు ప్రేమించడం రాదనుకుంటా… కానీ ప్రేమించబడడం చాలా ఇష్టమే మరి……. ఇప్పుడేం చెయ్యను? ఐ టోల్డ్ యూసో అనకు. ఇంకేదైనా చెప్పు. నీ మంజుల”

ఏం చెప్తాను? ఏం చెప్పగలను? ప్రేమించడమంటే మనల్ని ప్రశంసలతో ముంచెత్తడం కాదనీ, మనమేం చేసినా వెనకేసుకురావడం కాదనీ, మనకేది మంచిదో, మనం ఏ లోపాలను అధిగమించాలో చెప్పేదనీ, మనం మరింత మంచి మనుషులుగా ఎదగడానికి ప్రోత్సాహం ఇచ్చేదనీ చెప్పాలని ఉంది. ఇప్పుడు అలా రాసానంటే మళ్లీ ఎగిరిపడుతుంది – నీ బోడి కౌన్సిలింగ్ అక్కర్లేదంటుంది. అయినా ..ప్రియుడి నుంచి ఫోన్ రాకపోతే ఇదివరకైతే దుమ్మెత్తిపోసే మనిషి ఇప్పుడు దిగులు పడుతోంది. …. మొత్తానికి తనేమిటో తనకూ అర్థమవుతోందేమో… ఐ టోల్డ్ యూ సో, మంజూ..

____

 

మృణాళిని

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Expecting unconditional Love, without having any empathy for the Lover.
    It’s the most common phenomenon among youth who had been Pampered kids of excessively caring parents.
    Not that every pampered kid becomes like this, but it’s a significant positive correlation.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు