ప్రేమకథలు – 5       

కానీ తనెప్పుడు పలకరించాడు వాళ్లని? వాళ్ళు బయటికి రమ్మంటే ఎప్పుడు వెళ్లాడు వాళ్లతో? తన మనసులో మాటలు ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించాడు?

  హర్ష తలుపు దగ్గర నిల్చుని, గట్టిగా ఊపిరి పీల్చాడు. లోపల్నుంచి ‘అంత్యాక్షరి’ వినిపిస్తోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి అదేదో కర్మకాండలా అమ్మా నాన్న, అత్తలూ, మామలూ, వాళ్ల పిల్లలూ అందరూ ఆఖరి గంట, అంటే 11 నుంచి 12 వరకూ అంత్యాక్షరి ఆడాల్సిందే. ఏ భాషయినా ఓకే కనక, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, తమిళం పాటలతో ఒక గొప్ప హాస్య సన్నివేశం తయారవుతుంది. అందరికీ చాలా ఇష్టమైన గంట అది. గత ఏడాది వరకూ తనక్కూడా…అమ్మా నాన్నలతొ ఎక్కువ సమయం గడిపేది ఆ ఒక్కరోజే…

గుండె చిక్కబట్టుకుని, ముఖంలోకి నవ్వు తెచ్చుకుని బెల్ కొట్టాడు.

‘తీసే ఉంది’ ఎవరో అరిచారు. హర్ష తలుపు తోసుకుని వచ్చాడు. ఇద్దరు కజిన్లు లేచి పరుగెత్తుకు వచ్చారు. మరదలు శిల్ప నెత్తిన మొట్టికాయ వేసింది.

“ఇంత లేటా రావడం/ ఎంత నీ ప్రెండ్స్‌ తో ఉంటే మాత్రం. ఈ రోజు ఫామిలీ టైం. గుర్తులేదూ?’ హర్ష నవ్వి ఊరుకున్నాడు. ‘ఇప్పుడే వస్తా’ అని ఎవరినీ ఉద్దేశించకుండా చెప్పి లోపలికి వెళ్లాడు.

‘వాళ్లున్న మూడ్ లో తను ఎలా ఉన్నాడో ఎవరూ గమనించివుండరు. ఆ మాటకొస్తే తను ఎప్పుడు ఏ మూడ్ లో ఉన్నాడో అమ్మా, నాన్నా ఎప్పుడూ గమనించరు. వాళ్లలా గమనించకపోవడం ఇప్పటివరకూ తనకు చాలా ఆనందం కలిగించిన విషయం. ఎన్నిగంటలకు ఇంటికి వచ్చినా, తన పాకెట్ మనీ ఎంత వేగంగా ఖర్చుపెట్టేసినా, ఎవరితో ఏం చేసినా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేకపోవడం గొప్ప నిశ్చింత. కానీ ఈ రోజు? ఎవరైనా తను దాచుకుంటున్న బాధని చూడగలిగితే బాగుండునని ఉంది. తను ఏం చెయ్యబోయాడో ఎవరైనా అడిగితే బాగుండునని ఉంది. తను అలా ఎందుకు చెయ్యాలని అనుకున్నాడో, ఎందుకు చెయ్యలేకపోయాడో ఎవరైనా ప్రశ్నిస్తే గబగబా మనసు విప్పి చెప్పేయాలని ఉంది. కానీ… ఇన్నాళ్లూ లేనిది ఇవాళ ఎక్కడినుంచి వస్తుంది? ఇన్నాళ్లూ చెప్పుకోనక్కర్లేదనుకున్న అమ్మా, నాన్న ఇవాళ ఎందుకు అడుగుతారు?

హర్షకు కళ్లనిండా నీళ్లు కమ్ముకుంటున్నాయి. తన మీద తనకే జాలితో, కొంత అసహ్యంతో, ఏవగింపుతో దు:ఖం ఆగడం లేదు. ఇవాళ తను చూసిన రెండు జీవితాలను తలుచుకుంటే ఒళ్లంతా గగుర్పొడిచినట్టనిపిస్తోంది. బాత్ రూం లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. బయటినుంచి మళ్లీ శిల్ప గొంతే వినిపించింది.

‘పన్నెండవుతోంది… రా….కేక్ కట్ చేస్తున్నాం’ అరుస్తోంది. ‘వస్తాన్లే…. మీరు కానివ్వండి’ గొంతులో కన్నీళ్లు ధ్వనించకుండా కష్టపడి నోరు పెగుల్చుకుని అన్నాడు. ‘సరే’ శిల్ప అడుగులు దూరమయ్యాయి. గత ఆరుగంటల్లో జరిగిందంతా కళ్లముందు….

__

సాయంత్రం ఆరుగంటలు.  స్పందన కోసం మోటార్ సైకిల్ వేసుకుని సోమాజిగూడాలోని కాఫీ డేకి బయల్దేరాడు. మనసంతా పరమ ఉత్సాహంగా ఉంది. ఈరోజు స్పందన తన సమాధానం చెప్తానంది. కొత్తగా చెప్పేదేముందిలే.   ఓ ఏడాది నుంచి తమ స్నేహం ఎలా క్రమ వికాసం చెందుతూ వచ్చిందో, ఆమెను తనెంత ప్రేమిస్తున్నాడో ఆమెకు తెలీనిది కాదు. కాకపోతే ఇప్పటి అమ్మాయిల్లాంటిది కాదు. త్వరగా బయటపడదు. ఆ రఘుని ప్రేమించిన అమ్మాయి తనే ముందు ప్రపోజ్ చేసిందని చెప్పుకుని వాడు ఒకటే ప్రగల్భాలు. తను అలాంటి అమ్మాయిల్ని అసలు ఇష్టపడ్డు. అమ్మాయన్నాక కాస్త అణకువ, వినయం, సిగ్గు, బిడియం ఉండాలి. స్పందన అచ్చంగా అలాంటి అమ్మాయే. అందుకే తనకు ఎక్కువ నచ్చింది. తను చెప్పాక కూడ కాస్సేపు అదోలా చూసింది కానీ సమాధానం చెప్పలేదు. ‘తర్వాత చెప్తా’ అని పారిపోయింది. ఈరోజు చెప్పేస్తుంది.

కాఫీ డేకి చేరుకుని తమకు అలవాటైన సీట్ లో కూర్చున్నాడు. అరున్నరయినా స్పందన రాలేదు. ఫోన్ చేస్తే రింగవుతోంది కానీ తీయడం లేదు. 7 గంటలైంది. ఊహూ. రెండు కాఫీలు పూర్తి చేసాడు కానీ ఫోనూ లేదు. మనిషీ లేదు. ఆరోగ్యం బాగాలేదా? ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయిందా? గాభరా మొదలైంది. ఇరవయ్యోసారి మళ్లీ ఫోన్ చేసాడు. ఈసారి ఫోన్ ఎత్తారు. స్పందనే…

“ఓ… సారీ…. హర్షా… రాలేకపోయాను’ ఎంత మామూలుగా చెప్తోంది!! ఈరోజు తాము కలవడం ఎంత ముఖ్యమో గుర్తులేదూ తనకు? ఇవాళే కదా సమాధానం చెప్తానంది!

“మర్చిపోయావా? లేక కుదరలేదా?’ కొంచెం కటువుగానే అడిగాడు.

“రెండూనూ’ నవ్వింది. ‘అయినా మెస్సేజ్ పెట్టాల్సింది నీకు. వెరీ సారీ.. ఇక పెట్టెయ్యనా? అవతల నాకోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇయర్ ఎండ్ పార్టీ కదా”.  హర్షకు కలుక్కుమంది. నా కంటె ఎక్కువ ఎవరు ఎదురుచూస్తారు నీ కోసం? అన్నాననుకున్నాడు. అనలేదు.

“ప్లీజ్ స్పందనా… ఇవాళ మనమెందుకు కలుసుకోవాలనుకున్నామో గుర్తులేదా నీకు?’ అని అడిగాడు.

“ఓహ్. అదా.. . నీకు అర్థమైందనుకున్నాను. నువ్వేదో ఒక బలహీన క్షణంలో ఏదో చెప్పినట్టు అనిపించింది నాకు. అయినా నిన్ను నేను ప్రేమిస్తే ‘ఆలోచించుకుని చెప్తానని’ అంటానా? ఎవరైనా ప్రేమించామో లేదో నిర్ణయించుకోడానికి గడువు అడుగుతారా? నేను నిన్ను ఎప్పుడూ స్నేహితుడిగానే చూసాను’ ఒక్క క్షణం ఆగింది. ‘నిజంగా నీకు నా మనసులో ఏముందో అర్థం కాలేదా? అయితే నేను చేసింది పెద్ద తప్పే… వెరీ సారీ.. అలా అనుకుని వుంటే నేను తప్పక వీలు చూసుకుని వచ్చి చెప్పేదాన్నే.. మామూలు కాఫీ ప్రోగ్రాం అనుకున్నా” స్పందన హడావిడిగా మాట్లాడేస్తోంది.  హర్షకు ఏవేవో చెప్దామని ఉంది. గొంతు పెగలడం లేదు. అవమానం, ఆగ్రహం, దు:ఖం, పరాజయం, సెల్ప్ పిటీ, ఉక్రోషం అన్నీ అతని స్వరపేటిక చుట్టూ అల్లుకుంటున్నట్టుంది. స్పందన ఫోన్ ఎప్పుడు పెట్టేసిందో కూడ అతనికి తెలియలేదు. కాఫీ డేలో కూర్చున్నవాళ్లంతా ఫిల్మ్ పాడైపోయిన  నలుపు తెలుపు సినిమా నటుల్లా అలుక్కుపోయినట్టు కనిపిస్తున్నారు. ఎంతసేపు అలా కూర్చున్నాడో కూడ తెలీదు. ఎవరో వచ్చి సీటు ఖాళీ చెయ్యమని అడిగేవరకూ….

మెల్లిగా లేచాడు. ఏదో భ్రాంతిలో నడుస్తున్నట్టుంది. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసాడు. అలవాటైన బండి. అలవాటైన డ్రైవింగ్. అలా వెళ్తున్నాడు. ఎక్కడికి? అతనికి స్పృహ తెలిసేలోగా బేగంపేట రైల్వేస్టేషన్ లో ఉన్నాడు.

నెమ్మదిగా స్టేషన్ లోకి వెళ్లాడు. రైళ్లను చూస్తూ నించున్నాడు. మనసంతా ఖాళీగా ఉంది. చెప్పలేనంత కోపంగా ఉంది, స్పందనమీద. తన మీద. జీవితం మీద. ‘ఏం చేస్తే స్పందనకు బుద్ధి వస్తుంది? ఏం చేస్తే ఈ దు:ఖంనుంచి విముక్తి లభిస్తుంది? ఏం చేస్తే తనని తాను మర్చిపోగలడు? ఏం చేస్తే స్పందనను మరచిపోగలడు? అయినా తనెందుకు మరిచిపోవాలి? … తనకు చేసిన అవమానానికి స్పందన జీవితాంతం కుమిలిపోవాలి. ఆమెకు ఎప్పటికీ  ప్రేమ అనేది దక్కకూడదు. ఆమెకు జీవితం ఒక శాపంలా మారాలి. ఆమె కుళ్లి కుళ్ళి ఏడవాలి. అంటే తనేం చెయ్యాలి? అసలు తను ఎవరిక్కావాలి? తను బతికుంటే ఎంత, పోతే ఎంత? అమ్మకూ, నాన్నకు తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న అనుమానం కూడా లేదు. ఎలా ఉంటుంది? తనతో ఏరోజు మాట్లాడారు కనక? ఎవరికోసం బతకాలి?’  ఒకదానివెంట ఒకటిగా ప్రశ్నలు… జవాబుగా రైళ్లు పిలుస్తున్నట్టున్నాయి.  గబగబా అడుగులు ముందుకు పడ్డాయి.  ఎంఎంటిఎస్ వస్తోంది వేగంగా…. ప్లాట్ ఫారమ్ అంచుల వద్దకు వెళ్లాడు. వేగంగా వస్తున్న రైలు ఒక్కసారిగా కీచుమంటూ ఆగిపోయింది. అదేమిటి? తనింకా దూకనేలేదే?   ఇంతలో చూసాడు…పట్టాల మీద అడ్డంగా పడుకుని వున్న ఒక స్త్రీ, అయిదేళ్ల బాబు…

ఉలిక్కిపడ్డాడు. ఎవరో రైల్వే పోలీసులను పిలిచారు. ఇద్దరు కానిస్టేబిళ్లు వచ్చి తల్లీబిడ్డలను లాక్కుంటూ ప్లాట్ ఫారమ్ మీదికి తీసుకువచ్చారు. ‘”ఏమ్మా. రైళ్ళున్నవి నీలాంటోళ్ల ప్రాణాలు తీయడానికనుకున్నావా? మమ్మల్ని ఇట్లా సతాయించడం ఏమన్నా బాగుందా నీకు?  ’ కసురుకుంటున్నాడు పోలీసు.

“మాకున్న కష్టాలు చాలక ఈ ఆత్మహత్యలొకటి’ రెండో పోలీసు విసుక్కున్నాడు.

ఆమె నిర్ఘాంతపోయినట్టు చూసింది ఆయన కేసి. “నీక్కష్టాలా సారూ? మరి నాకేంది జెప్పవ్?  నా మొగుడు ఇంటినుంచి వెళ్లగొట్టిండు. ఆడు పెద్దపిల్లని కొట్టి చంపుతూంటే ఇంటినుంచి పారిపోయె.  ఏడుందో ఏటో..నిన్నటికి రెండేళ్లు. చిన్నోడున్నాడు కదా అంటే ఈ పిల్లగాడికి గుండె పోతందంట. ఎక్కువ దినాలు బతకడంట. డాక్టర్ కాడికి ఈణ్ని తీస్కపోయిన. పైసల్లేవు నా తాన. గది చెప్తే, ఆ కంపౌండర్ నా దగ్గర పడుకో… పైసల్లేకుండా డాక్టర్ చూస్తడన్నాడు… ఏం జేస్త? బిడ్డకు మందివ్వొద్దూ…వీడి కోసం ఎవునితో పడుకోడాన్కయినా సరే…కానీ ఈడు మూడునెల్లకంటే బతకడన్నడు డాక్టర్. పది లచ్చల ఆపరేషన్ చేయిస్తే బతుకతాడంట. నేనేడ తెచ్చేది సారూ? ఎవురెవురి దగ్గర పడుకుంటే అన్ని లచ్చలొస్తాయి సారూ?…. ఈడు కూడ లేకపోయినంక నేనెందుకుండేది?…. నువ్వు చేయిస్తవా చెప్పు ఆపరేషన్? ఇప్పుడు బతికిస్తివే… “ కోపంతో మొదలైన మాటలు దు:ఖంలో ముగిసాయి.

కానిస్టేబిల్ ఇలాంటి కథలెన్ని విని వున్నాడో. ఏ మాత్రం భావోద్వేగం లేకుండా తాపీగా అన్నాడు

“అదంతా నిజమేనమ్మా. కానీ కష్టాలొచ్చిన వాళ్లందరూ ఛస్తా వుంటే ఈ లోకంలో ఎవ్వడూ బతకడు’ వేదాంతధోరణిలో అన్నాడు. తన జేబులోంచి యాభై రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు. రెండో పోలీసు మరో యాభై తీసిచ్చాడు. ‘ఏదైనా తిను పిల్లవాడికి పెట్టు’ అంటూ.  ఆమె నిర్వికారంగా చూసింది. అంతకుముందున్న ఉక్రోషం, దు:ఖం ఏమయ్యాయో..

బిక్కముఖం వేసుకున్న పిల్లవాడిని దగ్గరికి తీసుకుంది. “పదరా పిలగాడా… ఇంక చచ్చింది చాలు. ఈ పానాలు పోయేటివి కావు.  యెపుడు పోతే అపుడే చద్దంలే…’ అంటూ వెళ్లింది. తల్లి ఎందుకు తనని పట్టాలమీద పడుకోబెట్టిందో, ఇప్పుడు ఎందుకు ఇద్దరూ మళ్లీ రోడ్డుమీద పడ్డారో అర్థం కాని ఆ పిల్లవాడు తల్లికేసి చూసిన అమాయకపు చూపు హర్ష హృదయాన్ని పిండేసింది.

అలాగే నించుండిపోయాడు… ఈ ప్రపంచంలో ఇలాంటి జీవితాలున్నాయా?  పోలీసులు మాట్లాడుకుంటున్నారు.

‘నిజంగా ఈమెను కాపాడకపోతేనే బాగుండేదేమో. ఎలా బతుకుతుందో పాపం’

“నిజమే….. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, ప్రియురాలు పొమ్మందనీ రోజూ రైలుకింద ఎంతమంది పడ్డంలేదూ? చిన్న చిన్న వాటికే చచ్చి కూర్చుంటున్నారు ఇవాళరేపు ఈ పిలగాళ్లు. వాళ్లెవర్నీ మనం కాపాడలేదుకానీ… ఈవిడ నిజంగా బతికి చేసేదేమీ లేదు.. కానీ…ఈమెను రక్షించాం…’ రెండో పోలీసు అన్నాడు. మొదటి పోలీసు భుజాలెగరేసాడు. ‘మన డ్యూటీ మనం చేస్తాం…అయినా ఆమె ఇంక చావదులే. ధైర్యంగానే వెళ్లింది’ ఇద్దరూ టీ కొట్టు దగ్గరికి వెళ్లిపోయారు.

హర్ష ఇంటికి బయల్దేరాడు. తను రైలు కింద దూకబోయాడన్న విషయం ఈ పోలీసులకు తెలీదు. అతని మనసంతా అయోమయంగా ఉంది…మూడు నెల్ల లోగా చనిపోబోతున్న అయిదేళ్ల పిల్లవాడి తల్లి. కూతురు ఎక్కడుందో కూడ తెలీని తల్లి. మొగుడు తరిమేస్తే వీథిన పడ్డ భార్య. దమ్మిడీ డబ్బుల్లేవు. ఆదుకునేవాళ్లు, తను ఛస్తే ఏడ్చేవాళ్లు కూడ లేరు.  ఆమె బాధ ముందు, ఆమె దు:ఖం ముందు తన ప్రేమ ఎంత? తన బాధ ఎంత?

ఇప్పుడు అతని కళ్లలో స్పందన కదలడం లేదు. స్పందన మీద తన ప్రేమ గుర్తుకు రావడం లేదు.  అయిదేళ్ల పిల్లగాడు, అతని తల్లి కదులుతున్నారు. అమ్మ, నాన్న తనతో ఎక్కువ మాట్లాడరు. నిజమే. కానీ తనెప్పుడు పలకరించాడు వాళ్లని? వాళ్ళు బయటికి రమ్మంటే ఎప్పుడు వెళ్లాడు వాళ్లతో? తన మనసులో మాటలు ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించాడు? మరుసటి రోజు కొత్త సంవత్సరమని గుర్తుకొచ్చింది.గబగబా ఇంటికి బయల్దేరాడు.

____

మృణాళిని

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి కధ మృణాలిని గారూ. “హర్ష ఇంటికి బయల్దేరాడు. తను రైలు కింద దూకబోయాడన్న విషయం ఈ పోలీసులకు తెలీదు. అతని మనసంతా అయోమయంగా ఉంది…మూడు నెల్ల లోగా చనిపోబోతున్న అయిదేళ్ల పిల్లవాడి తల్లి. కూతురు ఎక్కడుందో కూడ తెలీని తల్లి. మొగుడు తరిమేస్తే వీథిన పడ్డ భార్య. దమ్మిడీ డబ్బుల్లేవు. ఆదుకునేవాళ్లు, తను ఛస్తే ఏడ్చేవాళ్లు కూడ లేరు. ఆమె బాధ ముందు, ఆమె దు:ఖం ముందు తన ప్రేమ ఎంత? తన బాధ ఎంత?”

  • నమస్తే అండీ, ప్రతీ కథా చదువుతున్నాం, బావుందనుకొని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ కూడా, కానీ ఈ కథ ని తప్పకుండా చదువ వలసిన పిల్లలు ఎంతోమంది కళ్ల ముందు మెదిలారు ఇవాళ!! TQ Mam

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు