తలుపు ధడాల్ని వేసిన శబ్దం. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సైక్లింగ్ చేస్తున్న రాజీవ్ కు అది వినిపించకపోవడం మంచిదయిందనుకుంది సరళ. లేకపోతే ఒక్క అరుపు అరిచేవాడు తండ్రి మీద. ఇద్దరి అరుపులతో ఇల్లు దద్దరిల్లేది. తనకు గుండె దడ. వంటింట్లో గిన్నెలు సర్దుతూ ‘పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా’ అని కూనిరాగం తీస్తోంది. రాజీవ్ లోపలికి వచ్చాడు.
“అప్పుడే అయిపోయిందా నీ జిమ్మింగ్?’ అంది.
“నేను సరిగ్గా 8.45 కి బ్రేక్ ఫాస్ట్ కి రాకపోతే తిడతావు కదా’ నవ్వుతూ అన్నాడు.
సరళ కూడ నవ్వింది. ‘వెళ్లాడా ఆ మహానుభావుడు?’ గొంతులో చికాకు దాచుకుంటూ అడిగాడు.
“మరో ఏడుగంటలు మనశ్శాంతి. ఇవాళ త్వరగా వస్తాడట కూడా…’ అంది సరళ.
“అసలు నువ్వు ఎందుకు భరిస్తున్నావు ఈ దుర్మార్గుడిని? ఒకటా రెండా? ముప్ఫై ఏళ్లు’ రాజీవ్ కు, సరళకు కూడా ఈ టాపిక్ కొత్త కాదు. తండ్రి మురళి మూర్తీభవించిన అహంకారం, నోటి దురుసు రాజీవ్ కి ఇల్లంటేనే అసహ్యం కలిగించేలా చేస్తూంటుంది. భార్య మీద చెయ్యి వెయ్యకుండా మాటలతో ఎన్ని హింసలు పెట్టవచ్చో అన్నీ పెట్టడంలో బహునేర్పరి మురళి. ఇరుగుపొరుగుకు అతను ఎంత మంచి వాడిలా కనిపిస్తాడో.. నిత్యం సరళను కించపరుస్తూ, అనుమానిస్తూ, అవమానిస్తూ అతను మాట్లాడే మాటలు ఆ తల్లీకొడుకులకు తప్ప మూడో కంటికి తెలీదు. తన తల్లి ఎప్పుడూ ఎదురు మాట్లాడగా చూడలేదు రాజీవ్. అసలు అతని మాటలు విన్నట్టు కూడ కనిపించడం లేదు ఈ మధ్య. ఎక్కువ మాట్లాడదు భర్త ఇంట్లో ఉన్నంత సేపూ. అతను వెళ్లగానే పాడుతూ పని చేస్తూ, టీవీ చూస్తూ, పుస్తకాలు చదువుకుంటూ చాలా హుషారుగా ఉంటుంది. సాయంత్రం ఆరు దాటగానే ముఖంలో గాంభీర్యం, పెదవులపై నిర్లిప్తత అతిసహజంగా వచ్చి కూర్చుంటాయి.
“ఇదీ ఒక బతుకేనా అమ్మా….’ అంటూంటాడు. సరళ నవ్వేసి ఊరుకుంటుంది. ఈ రోజు రాజీవ్ వదిలిపెట్టదల్చుకోలేదు.
“నాన్నను వదిలివెళ్లాలని నీకెప్పుడూ అనిపించలేదా? నాకోసమే కలిసివుండాలనుకుంటే అక్కర్లేదు. చిన్నప్పుడు అలా అనుకున్నా అర్థం ఉంది. కానీ ఇప్పుడు నేను ఉద్యోగస్తుడినయ్యాను. నువ్వింకా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు..’
సరళ తెలుసన్నట్టు తలవూపింది. ఏదో కొత్త విషయం చెబుతున్నట్టు ‘నేను మీ నాన్నని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. ‘అంది.
“అయితే? అది నాకు తెలిసిందేగా? కొంపదీసి ఇంకా ఉందా ఆ ప్రేమ?’ చికాగ్గా అడిగాడు రాజీవ్
లేదన్నట్టు తలవూపింది సరళ.
“మరి?’ రాజీవ్ అసహనంగా అడిగాడు.
సరళ కాస్సేపు మాట్లాడలేదు. తర్వాత మొదలుపెట్టింది.
___
తెల్లగన్నేరు పూలు రోడ్డు మీదంతా పరుచుకునివుంటే, వాటిని తొక్కకుండా పరికిణీని పైకెత్తి పట్టుకుని, వంకర టింకరగా నడుస్తూ స్కూలు చేరుకోవడం నాకలవాటు. రోజూ ఆ క్రతువు జరగాల్సిందే.. ఏరోజైనా ఎక్కువ గన్నేరు పూలు రాలకుండా, వీధంతా శుభ్రంగా ఉండి, నేను నిటారుగా నడిచిపోయే అవకాశం వస్తే చిరాకు.
స్కూలు టిఫిన్ డబ్బాలో అమ్మ చపాతీలకు, బెల్లం, నెయ్యి నంజుకోడానికి పెడితే నాకిష్టం…రెండే రెండు చపాతీలు. ఒక్కొక్కొదాని మధ్యలో బెల్లంపొడి, కరిగించిన నెయ్యి పూసి వుండాలి. అదీ నా లంచ్ డబ్బా. ఏరోజైనా అమ్మ చపాతీలకు కూర పెట్టినా, చపాతీల బదులు, తిరగమోత అన్నం పెట్టినా చాలా కోపం.
కాస్త పెద్దగయ్యాక, కాలేజీకి బయల్దేరేముందు రేడియో సిలోన్ లో పాత హిందీపాటల్లో సైగల్ పాట వినగానే బయల్దేరడం నాకలవాటు. ఏ రోజైనా ఇంకా ముందు బయల్దేరాల్సి వచ్చినా, సైగల్ పాట సమయానికి ఎవరైనా పిలిచి మాట్లాడినా, కరెంటు పోయి, సైగల్ పాట వినకనే బయల్దేరాల్సి వచ్చినా చాలా బాధ.
అక్క, అన్నా రాత్రి ఒంటిగంటవరకూ మేలుకుని చదువుకుంటూ ఉంటే, తొమ్మిదికే నిద్రపోయి మూడు గంటలకు లేచి చదువుకోవడం నాకలవాటు. ఏ రోజైనా అమ్మకు ఒంట్లో బాగలేక, పొద్దొన్నే నన్ను లేపడం కుదరదు, రాత్రే చదువుకుని పడుకో అంటే చిరాకు.
నాకిష్టం లేని పని చెయ్యమని ఎవరైనా అడిగితే, మాట్లాడకుండా, చెయ్యకుండా ఉండిపోవడం అలవాటు. అక్క, అన్న గోలపెట్టి వాదించి, తమ మాట నెగ్గించుకోవడమో, ఎదటివారికి లొంగిపోవడమో ఏదో ఒకటి చేస్తూంటారు. నాకు మాత్రం ఎదిరించే అలవాటు లేదు…. ఎదిరిస్తే వాదించాలి. మాట నెగ్గించుకోవాలి. కుదరకపోతే సంఘర్షణ పడాలి. అంత అవసరమా? కొన్నాళ్లు పోతే మనకిష్టం లేనిది కూడ అలవాటైపోతుంది కదా…
ఇంగ్లీషులో చెప్పాలంటే ‘అయామ్ ఎ క్రీచర్ ఆఫ్ హాబిట్’. నేను లేవడాన్ని బట్టి గడియారాలు సరిచేసుకునేవారు, టిఫిన్ తింటున్నానంటే, స్నానం అయిపోయిందని ఊహించేవాళ్లు, పొద్దున్నే మూడు గంటలకు లేవకపోతే, నాకు జ్వరం వచ్చి వుంటుందని భయపడేవాళ్లు…కాలేజీ నుంచి రాగానే ఏదో నవల చేతిలో పట్టుకోకపోతే ‘సూర్యుడు ఇవాళ ఎటు అస్తమిస్తున్నాడ’ని అమ్మ అడిగేది. అలవాటు తప్పనని అందరికీ నా గురించి తెలుసు.
___
సరళ ఆగింది. రాజీవ్ తల్లికేసి విచిత్రంగా చూసాడు.
“నేనడిగిందేమిటి? నువ్వు చెప్తున్నదేమిటి? నువ్వు అలవాటు తప్పవని నాకూ తెలుసు. రోజూ ప్రతి పనిలోనూ చూస్తూంటాను కదా…’
‘నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను’ కొద్దిసేపు ఏమీ తోచనట్టు ఆగింది.
‘మురళి, నేనూ పెళ్లికి ముందు దాదాపు రెండేళ్లు ప్రేమించుకున్నాం. చాలా.. వేరుగా ఉండేవాడు అప్పుడు. ఆడవాళ్లను ఎంతో గౌరవించేవాడిలా… నా అభిప్రాయాలకు విలువ ఇచ్చేవాడిలా.. అక్కడ కూడ నా అలవాటు తప్పలేదు. బ్యాంక్ నుంచి వచ్చి స్నానం చేసి అమ్మకు వంటలో సాయం చేసాకే అతన్ని కలిసేదాన్ని. ‘ఓ అరగంట ముందు రా’ అంటే ఒప్పుకునేదాన్ని కాదు. సినిమాకు వెళ్లాలంటే శనివారమో, ఆదివారమో. అంతే. నా అలవాటును తెగ మెచ్చుకునేవాడు. ఇంత క్రమశిక్షణ ఉండే అమ్మాయిలు అసలుండరు ఈ లోకంలో. దాని వల్ల నా మీద ప్రేమ పెరిగిందనేవాడు. అంతా నిజమే అనుకున్నాను. పెళ్లయ్యాక కూడ కొంతకాలం బాగానే ఉన్నట్టనిపించింది. నిజంగా ఉన్నాడో, నేను తలమునకలుగా ప్రేమలో ఉన్నందువల్ల ఉన్నాడని అనుకున్నానో తెలీదు. నన్ను ఉద్యోగం మానేయమన్నప్పుడు మనసు చివుక్కుమంది. కానీ నాకు డబ్బు అవసరం లేనప్పుడు మరొకరికి నా ఉద్యోగం వస్తుందిలే అనుకున్నా. నువ్వు పుట్టాక మెల్లిమెల్లిగా అసలు స్వరూపం బయటకు వచ్చింది. ఇక నటించనవసరం లేదనుకున్నాడేమో’
“అవును కదా. పిల్లలు పుట్టాక ఇక భార్యలు బందీలవుతారాయె’ వ్యంగ్యంగా అన్నాడు. తిరిగి తనే అన్నాడు.
‘అప్పుడు సరే… ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను. నిన్నంటే ఉద్యోగం మాన్పించాడు కానీ నన్నేం చెయ్యలేడుగా. ఇంకా ఆ దరిద్రుడిని భరించాల్సిన అవసరం ఏముంది?’ రాజీవ్ కు కోపం పెరుగుతోంది. సరళ మాట్లాడలేదు.
రాజీవ్ కాస్సేపు ఊరుకుని మళ్లీ అడిగాడు ‘ ఇంకా ఉందా ప్రేమ”
“ప్రేమ కాదురా. అలవాటు… ‘
“వాట్?’ అయోమయంగా చూసాడు రాజీవ్
“నాకు మార్పంటే భయంరా రాజీవ్. చిన్న విషయంలో మార్పు వచ్చినా భరించలేను. ఇంతవరకూ నా కథలో ఏం చెప్పానో నీకర్థం కాలేదులా వుంది. ప్రస్తుతం నా జీవితంలో ఒక నియమం ఉంది. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ ఏమీ మాట్లాడకుండా, తనకు ఎదురు చెప్పకుండా ఉంటే అంతా బాగానే ఉంటుంది కదా… ఎలాగూ రోజుకు దాదాపు 8 గంటలు ఇంట్లో ఉండడు. నెలకు నాలుగైదు రోజులన్నా కాంప్ వెళ్తాడు…. ఆ టైమంతా నాదే కదా… అవి ఎంత ఆనందంగా గడిపినా అడిగేవాడు లేడుగా… ఈ రొటీన్ అలవాటైపోయింది…. విడిగా వెళ్లి, నువ్వూ నేనూ కొత్త పనులు, కొత్త చోటు…. కొత్త మనుషులూ….. నిన్ను ఇబ్బంది పెట్టడాలూ… ఎందుకు వచ్చేసావని సంజాయిషీలు…అబ్బ. ఈ వయసులో అదంతా నాకవసరమా?’
“అమ్మా…. నువ్వేం మాట్లాడుతున్నావో నీకర్థమవుతోందా? ఎంత దారుణంగా రాజీ పడుతున్నావో తెలుస్తోందా? ఇదీ ఒక బతుకేనా? భర్త ఇంట్లో లేకపోతే కలిగే ఆనందం ఈ జీవితానికి చాలు అనుకోవడం ఎంత దారుణం? అసలు విషయం అది కాదులే. నీకు ఇంకా ఆయనమీద ప్రేమ చావలేదు… మీ ఆడవాళ్లూ….‘ రాజీవ్ కు ఆ కోపంలో తల్లిని తను కూడ బాధపెడుతున్నానని తోచలేదు. సరళ మామూలుగానే అంది
‘ప్రేమ చావడం, బతకడం కాదురా… అది అలవాటుగా మారిందంతే…. భర్త మంచివాడైతే ప్రేమ, ప్రేమగానే ఉంటుంది కాబోలు. నాకు తెలీదు. కానీ భర్త మారిపోయినా, భర్తే కాదు… భార్య మారిపోయినా ఇంకా అలవాటంటూ ఒకటుంటుంది కదా.. ముఫ్పై ఏళ్లుగా కలిసివున్నాం కదా….దాన్ని ఎలా కాదంటావు? అలవాట్లు మార్చుకునే వయసు కాదురా నాది? బహుశా జీవితం మీద ఉత్సాహం ఉంటే మార్చుకోగలిగేదాన్నేమో…అలాంటి వాళ్లు ఈ వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించగలరేమో… కానీ …నాకు మాత్రం…పాతికేళ్లయింది ఉత్సాహమన్నది చచ్చిపోయి..ఇప్పుడు ప్రయోగాలెందుకు? నా అలవాటులోనే నన్ను బతకనివ్వు”
రాజీవ్ కు అంత బాధలోనూ తల్లి మాటలు సందేహాలను, భయాన్ని లేవనెత్తాయి. ‘అన్ని ప్రేమలూ ఇంతేనా? కొన్నేళ్ళయ్యాక అలవాటుగా మిగిలిపోతాయా? ఊహూ. తనూ, స్వాతి అది నిజం కాదని నిరూపిస్తారు’ తనకు తనే నచ్చజెప్పుకుంటూ అమ్మను అలాగే ప్రేమగా చూస్తూ కూర్చున్నాడు.
___
కథ చాలా బాగుంది చాలా లోతుగా కూడా ఉంది ఒక్కసారైనా ఈ కథ చదవాలి మనం ఎలాంటి జీవితం లో ఉన్నాము అనడానికి….మృణాళిని గారికి ధన్యవాదాలు
భలే unjudegemental కథ, మృణాళిని గారూ! మీ కథలో సరళ కరెక్టే, రాజీవ్ ఆలోచనానూ కరెక్టే. రాజీవ్ అనుకున్నట్లే జరిగాలని, అతని స్వాతి ఇంకో సరళ కాకుండా జాగ్రత్త పడాలని అనుకుంటున్నాను.
ఊహాతీతమైన విశ్లేషణ. అసలు పెళ్లి చేసుకోవడం కూడా ఇలా అలవాటు పడకముందే చేసుకొవాలి. Adjustment కి అవకాశం ఉంటుంది.
చక్కటి కథ.