ఉర్దూ మూలం: సాదత్ హసన్ మంటో
ఇంగ్లీష్ అనువాదం: మొహమ్మద్ ఉమర్ మెమన్
దేశ విభజన జరిగిన కాలం! అమృత్‌సర్ నుంచి మధ్యాహ్నం రెండుగంటలకి బయలుదేరిన ప్రత్యేక రైలు ఎనిమిది గంటల తర్వాత మొఘల్‌పురా చేరుకుంది. దారిలో జరిగిన మారణహోమంలో అనేకమంది చంపబడ్డారు.. చాలమంది గాయపడ్డారు. మరికొంతమంది దిక్కుతోచక చెల్లాచెదురైపోయారు.
పొద్దున్న పదయ్యింది. శరణార్థుల శిబిరంలో మంచులా వున్న కటిక నేలమీద పడుకున్న సిరాజుద్దీన్ కళ్ళు తెరిచాడు. నలువైపులా సముద్రంలా ఎగిసిపడుతున్న జనాల్ని చూశాడు. అతనికి ఆలోచించే శక్తి కూడా నశించింది. చాలాసేపు మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూస్తూ చుట్టూరా వున్న గందరగోళమేదీ వినిపించనట్లు చెవిటి వాడిలా వుండిపోయాడు. అతన్ని చూసిన ఎవరికైనా అతనొక దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి అతనేం ఆలోచించట్లేదు. అతని మెదడు మొద్దుబారి అలా శూన్యంలోకి చూస్తున్నాడంతే.
ఆకాశం వేపు అలా చూస్తుండగానే మేఘాల చాటునుంచి బయటకి వచ్చిన సూర్య కిరణాలు అతని కంట్లోపడి చురుక్కుమనిపించింది. ఉన్నట్లుండి స్పృహలోకి వచ్చి, జరిగిన సంఘటనలు నెమరేసుకోవడం మొదలెట్టాడు. కుమ్ములాటలు, దోపిడీ, కేకలూ, రైల్వే స్టేషన్, తుపాకీ మోతలు, నిద్ర, సకీనా….
ఒక్క ఉదుటున లేచి చుట్టూ వున్న జన సముద్రం వేపు చూస్తూ అరవడం మొదలెట్టాడు.
‘సకీనా… సకీనా!!’
ఒక్కగానొక్క ముద్దుల కూతురు సకీనా కోసం సిరాజుద్దీన్ అడుగడుగునా వెతికాడు. అలా మూడు గంటలు గడిచాయి. ఎంత వెతికినా తప్పిపోయిన అతని కూతురు కనిపించలేదు. నలువైపులా గందరగోళం! అరుపులూ, ఆర్తనాదాలతో అక్కడంతా విషాద చాయలు అలుముకున్నాయి.
తప్పిపోయిన పిల్లాడి కొసం వెతుకుతున్న తల్లి!
కనిపించకుండా పోయిన తల్లికోసం వెదుకుతున్న కొడుకు!
భార్య ఆచూకీ కోసం వాకబు చేస్తున్న భర్త!
కన్నకూతురి అన్వేషణలో ఓ తండ్రి!
కూతురి కోసం వెదికివెదికి సిరాజుద్దీన్ అలసిపోయాడు. ఓ మూల కూలబడి జరిగిందంతా గుర్తు తెచ్చుకోవడం మొదలెట్టాడు. సకీనా ఎప్పుడు ఎక్కడ తన దగ్గర్నుంచి తప్పిపోయిందీ!. ఆలోచిస్తుండగా అతనికి సకీనా తల్లి గుర్తొచ్చింది. తన కళ్ళెదుటే ఆమె ప్రాణం విడిచింది.
“నా గురించి బాధ పడకు ముందు సకీనాను తీసుకుని పారిపో” అతని చేతిలో కన్నుమూసే ముందు ఆమె మాట్లాడిన చివరి మాటలవి.
అప్పటికి సకీనా తండ్రి పక్కనే వుంది. అల్లరి మూకలు వెంబడించడంతో వాళ్ళిద్దరూ ప్రాణాలరచేత పట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఇంతలో సకీనా దుపట్టా జారిపడింది. దాన్ని తీయడానికి సిరాజుద్దీన్ ఆగబోయాడు. ఇంతలో సకీనా పెద్దగా అరుస్తూ అంది.
“నాన్నా.. దాన్ని వదిలేయండి”
కానీ అతను ఒక్క క్షణం ఆగి ఆ దుపట్టాని పైకి తీసాడు.
ఆలోచనల్లోంచి బయటకి వచ్చి సిరాజుద్దీన్ ఎత్తుగా వుబ్బి వున్న తన కోటు జేబు వైపు చూసుకున్నాడు. జేబులోంచి దుపట్టా బయటకి తీసాడు. ఇది సకీనా దుపట్టానే… మరి, సకీనా ఏది?
సిరాజుద్దీన్ అదే పనిగా ఆలోచించడంతో మెదడు మొద్దుబారింది. ఎంత ఆలోచించినా ఫలితం లేకపోయింది. ఆమెని రైల్వే స్టేషన్ కి తీసుకు వచ్చాడా? ట్రెయిన్ ఎక్కేదాకా తనతో వుందా ఆమె? ఆందోళనకారులు రైలుని ఆపినప్పుడు తాను తప్పించుకోగలిగాడా? అప్పుడే వాళ్ళు తన కూతుర్ని ఎత్తుకు పోయి వుంటారా?
సిరాజుద్దీన్ మెదడు అనేక ప్రశ్నలతో వేడెక్కింది. కానీ వాటికి సమాధానాలు లేవు. సిరాజుద్దీన్ పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం వుంది ఎవరికైనా. అతనే కాదు అక్కడ వున్న లక్షలాదిమంది భాదితులు కూడా దారుణమైన పరిస్థితిలో వున్నారు. అతనికి గుండెలవిసేలా ఏడవాలని వుంది. కానీ, ఏడుపు కూడా సహకరించలేదతనికి. అలా ఇంకిపోయాయి కన్నీళ్లు!
ఆరో రోజుకు కాస్త కుదుటపడ్డాడు సిరాజుద్దీన్. అతనికి సహాయం చేయడానికి సిద్ధపడ్డ కొందర్ని కలుసుకున్నాడు. ఎనిమిదిమంది యువకులు కలిసారతన్ని. అందరూ స్వచ్చంద సేవకులు! ఏమీ ఆశించకుండా అక్కడి వారికి సేవ చేస్తున్నారు. స్వంతంగా ఒక లారీ వుంది. కొన్ని తుపాకులు కూడా వున్నాయి. కిడ్నాప్ అయిన తన కూతురు గురించి వాళ్లకి చెప్పి ఏడ్చాడు సిరాజుద్దీన్. ఎలాగైనా ఆమెని వెతికి తెస్తామని వాళ్ళతనికి గట్టి భరోసా ఇచ్చారు. అనేక ఆశీస్సుల తర్వాత అతను తన కూతురు రూపురేఖలు వర్ణించడం మొదలెట్టాడు.
“నా కూతురు పేరు సకీనా. సుమారు పదిహేడేళ్ళ వయసు. పచ్చని పసిమి రంగులో వుంటుంది. నా పోలిక కాదు. అంతా తల్లి పోలిక. ఇంకా చెప్పాలంటే ఆమెకన్నా అందంగా వుంటుంది. బంగారు బొమ్మలా వుంటుంది. గుండ్రటి పెద్ద కళ్ళు, నల్లటి వత్తైన జడ, కుడి చెంప మీద చింత గింజంత పుట్టుమచ్చ.. ఆమె నా ఒక్కగానొక్క కూతురు బాబూ. కొంచం వెతికి పుణ్యం కట్టుకోండి. అల్లా మీకు మేలు చేస్తాడు…”
“ఒకవేళ మీ అమ్మాయి గనక బతికుంటే, ఆమెని త్వరలోనే వెతికి అప్పగించే బాధ్యత మాది” యువకులు ఆ వృద్ధుడికి భరోసా ఇచ్చారు.
ఆతర్వాత ఆ ఎనిమిది మంది యువకులూ ఎన్నో ప్రయత్నాలు చేసారు. ప్రాణలకు తెగించి అమృత్‌సర్ వెళ్ళారు. ఆ క్రమంలో అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది స్త్రీలనూ, పురుషులనూ, చిన్నపిల్లల్నీ కాపాడి భద్రంగా వారిళ్ళకు చేర్చారు. కానీ, పది రోజులపాటు గాలించినా సకీనా దొరకలేదు.
అదేపని మీద ఓ రోజు వాళ్ళంతా లారీలో బయలుదేరారు. అమృత్ సర్ జిల్లాలోని చేహార్టా నగరం వద్ద రోడ్డు పక్కన వారికి ఒకమ్మాయి కనిపించింది. లారీ శబ్దం విని పరుగుతీయడం మొదలెట్టింది. యువకులు లారీ ఆపి ఆమె వెనక పరిగెత్తారు. చివరికి ఒక పొలంలో దొరికిందామె. చాలా అందంగా వుంది. కుడిబుగ్గ మీద చింతగింజంత పుట్టుమచ్చ కూడా వుంది.
“భయపడకు! నీపేరు సకీనా కదా” ఒక యువకుడు చనువుగా అడిగాడు.
ఇంకా భయం నుంచి తేరుకోలేదామె. పాలిపోయిన మొహంతో కళ్ళప్పగించి చూస్తోంది. అది గమనించి ఆమెకి సాంత్వన కలిగేలా మాట్లాడారు వాళ్ళు. కష్టంలో వున్నవారిని ఆదుకోవడానికే తామొచ్చామని చెప్పడంతో ఆమె భయం పోయింది. తాను సిరాజుద్దీన్ కూతురిననీ, తన పేరు సకీనా అనీ చెప్పింది.
ఆ ఎనిమిది మందీ ఆమెని ఓదార్చారు. భయపడొద్దని ధైర్యం చెప్పి, ఆమెకి భోజనం పెట్టారు. తాగడానికి పాలిచ్చారు. తమ లారీలో ఎక్కించుకున్నారు. దుపట్టా లేకపోవడంతో సిగ్గుతో ఛాతీని కప్పుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు సకీనాకి. అది గమనించిన ఒక యువకుడు తన కోటు విప్పి ఆమెకి ఇచ్చాడు.
ఇంకొన్ని రోజులు గడిచాయి. సిరాజుద్దీన్ కూతురి జాడ గురించి ఎలాటి కబురూ లేదు.
అతను రోజూ అనేక శిబిరాలూ, ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి కూతురు కోసం వాకబు చేయసాగేడు. ఒకవేళ తన కుమార్తె బతికుంటే, త్వరలోనే తనకి అప్పగిస్తామన్న ఆ యువకుల మాట సిరాజుద్దీన్‌కు రోజూ గుర్తొస్తూనే వుంది. అందుకే వారి ప్రయత్నాలు సఫలం కావాలని కోరుతూ అర్థరాత్రిదాకా అతను ప్రార్థన చేసేవాడు.
ఓ రోజు సిరాజుద్దీన్‌కు శిబిరంలో ఆ యువకులు కనిపించారు. వాళ్ళంతా లారీలో కూచుని వున్నారు. సిరాజుద్దీన్ పరుగుపరుగున వాళ్ళ దగ్గరికెళ్ళాడు. అంతలోనే లారీ వెళ్ళిపోతోంది. ఆ వృద్ధుడు ఆయాసంతో రొప్పుతూ లారీ వెనక పరిగెడుతూ అడిగాడు.
“బాబ్బాబూ.. నా కూతురి అచూకీ ఏమైనా తెలిసిందా..?”
“తెలుస్తుందిలే.. తెలుస్తుందిలే..” అందరూ ఒకే గొంతుతో ఒకే మాటగా అన్నారు.
లారీ దుమ్ము రేపుకుంటూ స్పీడుగా దూసుకుపోయింది. ఆ యువకుల కృషి ఫలించాలని కోరుతూ అతను మళ్ళీ ప్రార్థన చేసాడు. అల్లాను వేడుకున్న తర్వాత అతని మనసు తేలికపడి ఊరట కలిగింది.
ఓరోజు రాత్రి సిరాజుద్దీన్ శిబిరంలో దిగాలుగా కూచుని వున్నాడు. ఇంతలో కొంచం దూరంలో కలకలం చెలరేగింది. నలుగురు వ్యక్తులు ఏదో మోసుకురావడం కనిపించింది.
సిరాజుద్దీన్ అక్కడి వారిని వాకబు చేసాడు. రైలు పట్టాల పక్కన ఒకమ్మాయి స్పృహ తప్పి పడి వుంటే ఆమెని మోసుకొస్తున్నారు. సిరాజుద్దీన్ వారి వెనకే నడిచాడు. ఆ అమ్మాయిని ఆస్పత్రిలో అప్పగించి వెళ్ళిపోయారు వాళ్ళు. అతను కొంచంసేపు ఎదురుగా వున్న వెదురు గుంజకు ఆనుకుని నుంచున్నాడు. తర్వాత నెమ్మదిగా లోపలికెళ్ళాడు.
ఆ గదిలో ఎవరూ లేరు. స్ట్రెచర్ పై ఒక మూటలా పడి వుంది. అతను అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాడు.
వున్నట్టుంది ఆ గదిలో లైటు వెలిగింది.
పాలిపోయిన ఆ శవం మొహం మీద మెరుస్తున్న పుట్టుమచ్చ అతనికి కనిపించింది.
అంతే.. ఆస్పత్రి పైకప్పు ఎగిరిపోయేలా గట్టిగా అరిచాడతను.
“సకీనా..! సకీనా..! సకీనా…!”
అంతకు ముందు ఆ గదిలో లైటేసిన డాక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు.
“ఏమైంది?”
“సార్… నేనామె తండ్రిని” మాటలూ ఏడుపూ కలిసి అతని గొంతు బొంగురు పోయింది.
స్ట్రెచర్‌పై వున్న శవం వేపు డాక్టర్ ఒక్కసారి పరీక్షగా చూశాడు. తర్వాత సిరాజుద్దీన్ వేపు తిరిగి అన్నాడు.
“ఆ కిటికీ తెరు”
వున్నట్లుండి ఆ శరీరంలో చలనం వచ్చింది!
నిర్జీవమైన ఆమె చేతులు సల్వార్ బొందు విప్పాయి!!
సల్వార్‌ని కిందకి జారవిడిచాయి!!!
“ఆమె బతికే వుంది..! నా కూతురు బతికే వుంది…!” ఆ ముసలి సిరాజుద్దీన్ ఆనందం పట్టలేక వెర్రికేక వేసాడు.
అదంతా గమనిస్తున్న డాక్టర్‌కి వొళ్ళంతా చెమట పట్టి ధారాపాతంగా కారిపోతోంది.
*
Add comment