ప్రామిస్డ్ ల్యాండ్ మాట నిలబెట్టుకుంటుందా? 

ల్లగొండ జిల్లా డిండి మండలం జేత్య తండాకు చెందిన ‘హాథిరామ్ సభావట్ 2023లో ‘నల్లింకు పెన్ను’ కవిత్వ సంపుటితో తెలుగు కవిత్వపుటల్లో కవిగా తన పేరును రాసుకున్న వ్యక్తి. ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ అభ్యసిస్తున్న విద్యార్థి. వర్తమాన సమాజ స్థితిగతుల పట్ల తన లోచూపును విస్తరించుకుంటూ పయనిస్తున్న కవి. హాథిరామ్ రాసిన “ఈ దేశానికో వాగ్దానం” కవిత తన పరిశీలనను, దృష్టి కోణాన్ని ఏ విధంగామనకు చూపెడుతుందో గమనిద్దాం.
*
ఈ దేశానికో వాగ్దానం
 ~
ప్రియమైన జోర్డానా…!
నా ప్రేమను మళ్ళీ మళ్ళీ ప్రకటించుకోవడానికి
ఎన్నో గులాబీ పూలను తీసుకొచ్చాను
కానీ నిలబడి నీకు ఇవ్వడానికి
కాసింత నేలె కరువైంది ఇక్కడ
ఈసారి మన ప్రేమను వేడుక చేసుకోడానికి
నీ దుప్పట అంతా నిండెలా కేకు ముక్కలు తీసుకొచ్చాను
కానీ ఈ కల్లోలిత వాతావరణంలో
నిన్ను చేరేసరికి
కేకు ముక్కలేవో శవాల ముక్కలేవో
తేల్చుకోలేక వెను తిరిగాను
మళ్ళీ ఈసారి
నీ మెడలో శిలువ
నా నెత్తి మీది టోపీల భారాన్ని దించేసుకొని
ఒకరి హృదయాల వాకిట్లో
మరోకరు నిలబడి
ఈ దేశానికో వాగ్దానం చేద్దామని వచ్చాను
కానీ
తూటాల దాటికి శిథిలమైన
ఈ వాకిట్లో ఏ మూల నుండైనా
నీ స్వరం వినిపిస్తుందన్న ఆశతోటే
స్వంత దేశాన శరణార్థినయ్యాను
చివరిగా
నీకు భరోసానిచ్చే మాటకోటి చెప్తా విను
నువ్వు నడిచి వెళ్లిపోయిన
ఈ దారి తెలుపు అయిన నాడే
మన ప్రేమకు రక్షణ
*
 జోర్డాన్ నదిని సంబోధిస్తూ ప్రారంభమైన (ఎత్తుగడ) కవిత ప్రేమ గీతాన్ని ఆలపిస్తుంది. ‘నా’ అనేది నెత్తి మీద టోపీ ధరించే వారిని (ముస్లింలు), ‘నీ’ అనేది మెడలో శిలువ వేసుకున్న వారిని (క్రిస్టియన్స్) తెలియజేస్తుంది. ఈ ప్రేమ గీతం ‘నా-నీ’ మధ్య అనేది వేరే చెప్పనక్కర్లేదు. ‘మతాంతర ప్రేమ’ వ్యవహారం కొంత కష్టసాధ్యమైనదని విషయం ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. సయోధ్య ఎవరు కుదర్చాలి? వారిద్దరి ప్రేమ పట్ల సానుకూలంగా స్పందించేది ఎంతమంది? ఇక్కడ సఫలమో, విఫలమో ఎన్నటికీ జరిగేను? ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య చెప్పబడ్డ ప్రేమగా వర్ణించినప్పటికీ అది రెండు సమూహాల మధ్య అధికారం, సార్వభౌమత్వం కోసం రగులుతున్న కాష్టంగా చెప్పవచ్చు.
*
 పాలస్తీనా (ప్రస్తుత ఇజ్రాయిల్) ను ప్రామిస్డ్ ల్యాండ్, హోలీ ల్యాండ్ అని పిలుస్తుంటారు కనుక ‘ఈ దేశానికో వాగ్దానం’ అనే శీర్షికలో ఔచిత్యం ఉందనిపిస్తుంది. పాలస్తీనా- ఇజ్రాయేల్ conflict ను కవి ఎలా డీల్ చేస్తున్నాడు? అనేది ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. అరబ్బులు -యూదుల మధ్య అంతర్, బహిర్ యుద్ధ వాతావరణము ఎలా convey చేయగలుగుతున్నాడు? అనేది కవి ముందున్న సవాల్.
*
‘నడిచి వెళ్లిపోయిన దారి’ గురించి, దారిపొడుగుతా ‘నిలబడేందుకు కాసింత నేల కరువైన’ ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురైన ఖండితదేహాల కల్లోలిత వాతావరణం గురించి, సొంత నేలమీద శరణార్థులుగా బతుకుతున్న దౌర్భాగ్యం గురించి మాట్లాడుతూ శాంతి మాత్రమే మనశ్శాంతిని ప్రసాదించగలదనే విశ్వాసాన్ని రక్షణగా భరోసానిస్తున్నాడు కవి. యుద్ధానికి అవసరమైన మారణాయుధాల్ని అమెరికా లాంటి దేశాలు ఇజ్రాయేల్ కు సరఫరా చేస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా G-20 దేశాల్లో పిఎల్ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) ను గుర్తించిన మొదటి అరబ్ యేతర దేశం మనది. జోర్డాన్, సిరియా, ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలను తాకుతూ దాదాపు 250 కిలోమీటర్ల పొడుగున ప్రవహిస్తున్న నది జోర్డానా. అందుకే అక్కడి సంఘర్షణలు, సాదకబాధకాలు నదికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే భావనతో ‘ప్రియమైన జోర్డానా’ అనగలిగినాడని అనిపిస్తుంది.
*
చివరిగా కవితో పాటుగా ‘పాలస్తీనా మీద ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని నిరసిస్తూ, అక్కడి యుద్ధ వాతావరణానికి ద్రవిస్తూ, కల్మషాల్ని తనలో కలిపేసుకునే నదీ ప్రవాహం కలహాల్ని సైతం తుడిచి పారేయాలని, తెలుపు దారిని పరిచి, శాంతి వెల్లివిరియాలని’ మనం కూడా జోర్డాన్ నదిని వేడుకుందాం.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత, విశ్లేషణ రెండూ చాలా బాగున్నాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు