చిక్కుకున్న సుడిగుండాల్లోంచో
అడుగేసిన ఊబుల్లోంచో
నిర్దాక్షిణ్యంగా వదిలేసిన సమూహాల్లోంచో
నిలబడేందుకు చేసే ఆఖరి ప్రయత్నమిది
గడ్డకట్టని రక్తం
విప్పారిన పువ్వుల్లోంచి
నిరంతరం స్రవిస్తూనేవుంది
నీటిని వర్షించాల్సిన మేఘం
కత్తుల తుపాన్లు సృష్టిస్తోంది
దహనమవ్వాల్సిందేదో
దందహ్యమానంగా వెలిగిపోతోంది
వెలుగును మింగేసిన చీకటి
మౌనంగా రోదిస్తోంది
లేచేందుకు ఆసరా కోసం వెతుకుతున్నాను
మేఘాల్ని చీల్చుకొనివచ్చే కాంతిరేఖ
నన్ను చేరుతుందో లేదోనని
నిండా మునిగాక కూడా
ఇంకా భయంగానే ఉంది
లోహపురెక్కలకు వేలాడుతున్న
ప్రాణబిందువు ఏ క్షణానైనా జారిపడొచ్చు
వేలాది పాదాల తొక్కిడిలో
మెతుకు మట్టిపాలవుతోంది
ఏ పరదా చాటునుంచైనా
ఒక తుపాకీ పేలొచ్చు
లేదంటే ఓ మనవబాంబు
తననూ లోకాన్నీ తుదముట్టించొచ్చు
నీలో సగమై నిలవాల్సినదాన్ని
నేలరాయడం నీ మృగత్వానికి ప్రతీక
కఫన్ లోంచి ఉదయించే ప్రశ్నలకు
సమాధానం ఎప్పటికీ దొరకదు.
*
వేలాది పాదాల తొక్కిడిలో మెతుకు మట్టి పాలౌతుంది