ప్రశ్నల రెపరెపలు

అసలు ఎవరి గురించైనా ఎందుకు రాయాలి? ఎందుకు తెలుసుకోవాలి?

వణుకుతున్న చేయిలా రెపరెప కొట్టుకుంటున్న తెల్లకాగితం. నిర్జీవంగా,గడ్డకట్టిన మంచులా.

నల్లటి అక్షరాలతో మంచు కరిగించనా, పదరేఖల్ని గీయనా, ప్రపంచపు ప్రతి సత్యాన్నీ కాగితంపై నడిపించనా..

ఖాళీ కాగితపు ఒంటరితనాన్ని పోగొట్టే భావాలు. కాగితంపై జ్వలిస్తున్ననల్లటి మంటలు. నడుస్తున్న పదధ్వనుల్లో వేనవేల ఆర్తనాదాలు.

కూలుతున్న జీవితాల కూకటివ్రేళ్ల విరిగిపడుతున్న చప్పుడు. కాగితంపై చల్లారిన చితిమంటల భస్మ గీతికలు.

కాగితంపై బీజాక్షరాలు. వేనవేల శతాబ్దాల ప్రాచీన ఆత్మల శబ్ధ ఘోష. ప్రకృతిలో కలిసిన శవాల సంభాషణ.

అక్షరాల ఆకులు రాలిన చెట్టులా కాగితం.ముడుచుకున్నపసిపాప పిడికిలి రహస్యాన్ని విప్పమంటున్న కాగితం.

కాగితాన్ని స్పృశించాను. అది భగ్గున మండి నా వ్రేళ్లను ధగ్ధం చేసింది.

 

ఈ రాత్రి నేనేమి రాయగలను?

మట్టి పెళ్లలు కూలి మరణించిన అభాగ్యుల గురించి రాయనా,

జైళ్లో బందీ అయి నేలను కరుచుకుని పడుకున్న రచయితల గురించి రాయనా,

ఓట్ల కోసం తలలు నరుక్కున్న రెండు పార్టీలకు చెందిన అమాయకుల గురించి రాయనా,

అసలు ఎవరి గురించైనా ఎందుకు రాయాలి? ఎందుకు తెలుసుకోవాలి..

 

గడియారపు ముల్లుకు అంటిన నెత్తురును ఎందుకు కళ్లు పసికట్టాలి?

ఇదొక తాత్వికమైన ప్రశ్న. తత్వశాస్త్రమంటే ఉపనిషత్తులు గుర్తుకు వస్తున్నాయి.

దేన్నైనా తెలుసుకోకపోతే చీకటిలోకాల్లోకి వెళతామని ఈశావాస్యోపనిషత్తు అంటుంది. పోనీ తెలుసుకున్నవాడెవడైనా సుఖిస్తాడా.. అంటే తెలుసుకున్న వాడు అంతకంటే అంధకార బంధురమైన లోకాలకువెళతాడని అదే ఉపనిషత్తు చెబుతుంది..

ఎంత విచిత్రం? అంటే జ్ఞానం అంటే తెలుసుకుని బాధపడటమా?

తెలుసుకోకపోవడం  వల్ల మృత్యువును అధిగమించడం, తెలుసుకోవడం వల్ల అమృతత్వాన్ని సాధించడం జరుగుతుందట.

సరైన జ్ఞానాన్ని ఆర్జించడమే బ్రహ్మమని ఐతరేయోపనిషత్తు చెబుతుంది.

 

ఎవరి ప్రేరణతో మనం వివిధ విషయాల గురించి ఆలోచిస్తున్నాం? ఎవరి ప్రేరణతో మనం మాట్లాడుతున్నాం.. అని కేనోపనిషత్తు ప్రశ్నిస్తుంది.

మనం తెలియని విషయాల్ని తెలిసినట్లు చెబుతుంటాం. మనకంటే జ్ఞానులు లేరని భావిస్తుంటాం. అవిద్యయా మంతరే వర్తమానా:  అన్న శ్లోకంలో ఇది గుడ్డి వాడు గుడ్డివాడిని నడిపించినట్లే అవుతుంది.. అని కఠోపనిషత్తు చెబుతుంది.

సత్యమే జయిస్తుంది కాని అసత్యం కాదని ముండకోపనిషత్తు చెబుతుంది.

అన్నం బ్రహ్మమా, ప్రాణం బ్రహ్మమా, మనస్సు బ్రహ్మమా, విజ్ఞానం బ్రహ్మమా, ఆనందం బ్రహ్మమా అన్న మీమాంసల్లో సాగుతుంది తైత్తిరీయోపనిషత్తు. చివరకు నేనే బ్రహ్మను. అంటుంది బృహదారణక్యోపనిషత్తు.

అసలు బ్రహ్మమంటే ఏమిటి? అది కూడా జ్ఞానమే. నిరంతరం బృహత్తరంగా వర్ధిల్లేదే బ్రహ్మం.

 

ప్రశ్నకు, అక్షరానికీ, అన్వేషణకూ, ఆలోచనకూ, విద్యకూ, జ్ఞానానికీ, సత్యానికీ ఒకప్పుడు ఆనాటి అవసరాల రీత్యా  ప్రాముఖ్యత నిచ్చిన ఉపనిషత్తులు ఇప్పుడు చాలా మందికి అవసరం లేకపోవచ్చునేమో..

సాంకేతిక పరిజ్ఞానం అనేక ప్రశ్నల్ని పరిష్కరించిఉండవచ్చు.

కాని భారతీయ సంస్కృ తిని కాపాడాలని, దాన్ని జీర్ణించుకోవాలని చెప్పే వారు ఉపనిషత్తుల్లో ఉన్న ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు ప్రజల్లో వ్యాప్తి చేయడం లేదు?

ప్రశ్నించే తత్వం స్థానంలో వ్యక్తి ఆరాధనా తత్వాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నారు..

సత్యానికి ప్రాధాన్యత నిచ్చిన  సంస్కృతిని విడనాడి అసత్యాల ప్రచారంలో విజయాలు సాధించాలని ఎందుకు అనుకుంటున్నారు?

ప్రశ్నించేవారిని దేశ ద్రోహులుగా, ఆలోచించేవారిని జాతి వ్యతిరేకులుగా, నిలదీసేవారికి దేశ భక్తి లేదన్నట్లుగా ఎందుకు భావిస్తున్నారు?

ప్రశ్నించిన వారిని మత వ్యతిరేకులుగా ఎందుకు తీర్మానిస్తున్నారు? మతానికి ముందు ప్రశ్న పుట్టింది. ప్రశ్నించడమే అసలు మతం.

 

ప్రశ్నించడం మన సంస్కృతి. అది ఆగిపోయినప్పుడే మన సమాజం వెనక్కు వెళ్లింది. దురాచారాల దుర్వ్యవస్థల్లో చిక్కుకుపోయింది. శాస్త్ర జ్ఞానం మట్టిపొరల్లో కలిసిపోయింది.

భారతీయ సంస్కృతిని కాపాడాలంటే అభ్యంతరమే లేదు. ఎందుకంటే అది ప్రశ్నించే సంస్కృతిని కాపాడడమే అని నా ఉద్దేశం. జ్ఞానాన్ని సముపార్జించడమే భారతీయ సంస్కృతి అన్నది నా అభిప్రాయం.

మీరు పాప పుణ్యాలను నమ్ముకుంటే నాకు అభ్యంతరం లేదు. ఆ ప్రాతిపదికగానే మీ రాజకీయ పార్టీలనుంచి పాపులను ఏరివేయండి.

వేల కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్ లో ప్రవేశించి, మళ్లీ వేలకోట్లు ఆర్జించేందుకు, కుంభకోణాలు చేసేందుకు, దారుణాలకు పాల్పడేందుకు, మీ అసమర్థతను ప్రశ్నించిన వారిని అణిచేవేసేందుకు, ఊచకోతకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్న ఈ వ్యవస్థల్ని మార్చేయండి. మీ పురాణాల్లోనే శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించినట్లుగా వ్యవహరించండి.

ప్రజలను ప్రశ్నించ వద్దని, వారు అవిద్యలోనే ఉండాలని, వారు మీరు విసిరేసే నాణాలను ఏరుకుని మీకు సలాములు చేయాలని, కుక్కల్లా మొరగాలని, మీ అబద్దాలను నమ్మి చప్పట్లు కొట్టాలని  అనుకోకండి.

ఎందుకంటే మీరు మెచ్చే భారతీయ సంస్కృతిలోనే ఉన్నది ప్రశ్నించే స్వభావం. సృష్టికర్తకు సృష్టికర్త ఎవరు అని ప్రశ్నించింది ప్రశ్నోపనిషత్తు.

మనకు ఆధునిక ప్రశ్నోపనిషత్తులుకావాలి.

తెల్లవారుజామున ఆకులనుంచి చెట్లు రాలుతుంటే మేఘాలనుంచి చంద్రుడు మందహాసం చేస్తున్నాడు. రఫీమార్గ్ ఫుట్ పాత్ పై పడుకున్న అభాగ్యుడిని వెన్నెల స్పృశిస్తోంది.

నువ్వే అగ్నివై తపింపజేస్తున్నావు.. నువ్వే సూర్యుడివై కాంతినిస్తున్నావు. నీవే మేఘమై వర్షిస్తున్నావు. నీవే ఇంద్రునివి. గాలివీ. భూమివీ నీవే. పదార్థానివీ, దైవమూ నీవే.

అదే ప్రాణం. ఆ ప్రాణానికి ప్రాణప్రదమైనది ప్రశ్న. దాన్ని కాపాడుకోవడమే మన భారతీయ సంస్కృతి. విశ్వసంస్కృతి కూడా కావాలి.

విశ్వయోగా దినం లాగా విశ్వ ప్రశ్నదినాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా మన పాలకులు సాధించాలి.

*

                                                .

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Wonderful! Thanks, Krishundu for bringing up this questioning , reasoning that is basic to our understanding. Even Nasadeeyasooktam is a great example of such reasoning!

    • ప్రశ్నించకుండా అంగీకరించడం బానిసత్వం తో సమానం అని చార్వాకుడు చెప్పిన సూక్తి మనకు శిరో ధార్యం కావాలి. స్వామీ. నమోనమః

  • ప్రశ్న అన్నిటికీ మూలం… ప్రశ్నించడం అంటే? మెదడును వాడడం… చైతన్యాన్ని వాటేసుకోవడం, తన ఉనికిని కాపాడుకోవడం, తనకు రావాల్సింది రాబట్టుకునే ప్రయత్నం చేయడం , స్వేచ్ఛను అనుభవించడం… అడిగేవాడికి చెప్పేవాడు లోకువ కాదు… చెప్పేవాడికి అడిగేవాడు లోకువ కాదు… ఇలా… జర్నలిస్ట్ గా, భావుకుడుగా, కవిగా, రచయిత గా ప్రశ్నించడం కృష్ణుడు జీవలక్షణం… సహజ లక్షణం… కృష్ణుడు ప్రశ్నిస్తూనే ఉండాలి… ఆ ప్రశ్నలు ఇలాగే కవితలై పొంగుతూనే ఉండాలి…

    • కొప్పరపు కప్పురము ఆంటిన మాననీయ శర్మ మీరు. నమో నమః

  • .”భారతీయ సంస్కృతిని కాపాడాలంటే అభ్యంతరమే లేదు. ఎందుకంటే అది ప్రశ్నించే సంస్కృతిని కాపాడడమే అని నా ఉద్దేశం. జ్ఞానాన్ని సముపార్జించడమే భారతీయ సంస్కృతి అన్నది నా అభిప్రాయం.

    మీరు పాప పుణ్యాలను నమ్ముకుంటే నాకు అభ్యంతరం లేదు. ఆ ప్రాతిపదికగానే మీ రాజకీయ పార్టీలనుంచి పాపులను ఏరివేయండి.

    వేల కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్ లో ప్రవేశించి, మళ్లీ వేలకోట్లు ఆర్జించేందుకు, కుంభకోణాలు చేసేందుకు, దారుణాలకు పాల్పడేందుకు, మీ అసమర్థతను ప్రశ్నించిన వారిని అణిచేవేసేందుకు, ఊచకోతకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్న ఈ వ్యవస్థల్ని మార్చేయండి. మీ పురాణాల్లోనే శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించినట్లుగా వ్యవహరించండి.

    ప్రజలను ప్రశ్నించ వద్దని, వారు అవిద్యలోనే ఉండాలని, వారు మీరు విసిరేసే నాణాలను ఏరుకుని మీకు సలాములు చేయాలని, కుక్కల్లా మొరగాలని, మీ అబద్దాలను నమ్మి చప్పట్లు కొట్టాలని అనుకోకండి.

    ఎందుకంటే మీరు మెచ్చే భారతీయ సంస్కృతిలోనే ఉన్నది ప్రశ్నించే స్వభావం. సృష్టికర్తకు సృష్టికర్త ఎవరు అని ప్రశ్నించింది ప్రశ్నోపనిషత్తు.

    మనకు ఆధునిక ప్రశ్నోపనిషత్తులుకావాలి.

    తెల్లవారుజామున ఆకులనుంచి చెట్లు రాలుతుంటే మేఘాలనుంచి చంద్రుడు మందహాసం చేస్తున్నాడు. రఫీమార్గ్ ఫుట్ పాత్ పై పడుకున్న అభాగ్యుడిని వెన్నెల స్పృశిస్తోంది.

    నువ్వే అగ్నివై తపింపజేస్తున్నావు.. నువ్వే సూర్యుడివై కాంతినిస్తున్నావు. నీవే మేఘమై వర్షిస్తున్నావు. నీవే ఇంద్రునివి. గాలివీ. భూమివీ నీవే. పదార్థానివీ, దైవమూ నీవే.

    అదే ప్రాణం. ఆ ప్రాణానికి ప్రాణప్రదమైనది ప్రశ్న. దాన్ని కాపాడుకోవడమే మన భారతీయ సంస్కృతి. విశ్వసంస్కృతి కూడా కావాలి.

    విశ్వయోగా దినం లాగా విశ్వ ప్రశ్నదినాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా మన పాలకులు సాధించాలి.” చాలా బగరాశారు మిత్రమా

    • సుబ్రహ్మణ్యం గారూ, మీరెప్పుడూ నన్ను వెన్ను తట్టే ఆది శంకరులే

  • సార్ మీ రచనల్లో సృశించని అంశం వుండదు. మీరు రాసిన అక్షరంలో ప్రతి సమస్యను ప్రస్తావిస్తోంది. రాజ్య దమనకాండ , వ్యక్తి పూజ, అనేక అంశాలు , మనసులోతుల్లో వున్నా రాయలేక , లోలోన కుమిలిపోతూ వుండే నా లాంటి వారికి మీ రచనలు ఎంతో ఊరటినిస్తున్నాయి

  • ఉపనిషత్తుల కాలం నాటి ప్రశ్నకల్పలతను వర్తమాన సమాజ దుఃస్థితుల మీదికి ప్రాకించి మళ్లీ ప్రాణం పోశారు, కృష్ణారావు గారూ! మీ కవితలలో అత్యంత వైవిధ్యపూర్ణమైన నిర్వచన వచనాన్ని చదివాను ఈరోజు!

    • విద్వాంసులయిన మీరు నా సాహసాన్ని ప్రోత్సహించడం నాకెంతో మనోబలాన్ని అందించింది. మీరు నాలో ప్రాణాన్ని రగిలించారు. నమో నమః

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు