ప్రవాస జీవనం ఒక కుదుపు

అమెరికా తెలుగు జీవనంలో మనం చెప్పలేనివి ఇంకా చాలా వున్నాయి. అవి చెప్పాలి. అవి సాహిత్యంగా మారిన రోజు నిజంగా అమెరికా తెలుగు సాహిత్యం అనే భావనకి జీవం పోసినట్టు!

“రోమ్ లో ఉన్నప్పుడు, రోమన్లలా ఉండాలి” అనే సామెత, మీరు ఎక్కడ ఉన్నా, అక్కడి సంస్కృతి, ఆచారాలకు అనుగుణంగా మెలగాలని చెబుతుంది.   మరి అమెరికాలో ఉన్న  తెలుగువారు నిజంగా అమెరికన్లలాగా  మెదులుతున్నారా అని ప్రశ్నించుకుంటే కొంత చేదునిజం  అయినప్పటికీ ఎన్నో సందర్భాల్లో కాదనే చెప్పాల్సివస్తుంది.  ముఖ్యంగా సామాజిక బాధ్యతతో ఆలోచించే నాలాంటి రచయితకి తప్పకుండా ఆ అంశాలను కథగానో , కవితగానో , వ్యాసంగానో  స్పృశించాలనే  అనిపిస్తుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా ఎంసీఏ పూర్తి చేసి 1998లో జీవనభృతిని వెతుక్కుంటూ అమెరికా చేరుకున్నాను. అమెరికాకు రాక పూర్వమే అంటే 1992 లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ఈవారం కథ “పర్యవసానం” , సుప్రభాతం పక్ష పత్రికలో “మౌనసాక్షి”  కథలతో నా రచనాపర్వం  ప్రారంభించాను.   చదువు, వృత్తిలో స్థిరపడటం కోసం పడే ఆరాటంలో  అటు ఇండియాలో, ఇటు అమెరికాలో కొన్ని రోజులు సాహిత్యం జోలికి  అసలే వెళ్ళలేదు.

అమెరికాకు వచ్చిన తర్వాత, జీవితంలో కొంత స్థిరపడ్డాక  ఎన్నో సంఘటనలు చూసిన తర్వాత మళ్ళీ నాలోని రచయిత మేల్కొన్నాడు. వంగూరి ఫౌండేషన్ సాహిత్య సేవ, సారంగ పత్రిక, డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ లాంటి సాహిత్య సంస్థల స్పూర్తితో  ఇటు అమెరికా నేపధ్యంగా  డయాస్పోరా కథలు, నేను పుట్టిపెరిగిన ప్రాంతాల్లోని సంఘటల స్ఫూర్తిగా  కొన్ని కథలు రాసాను.   ముందుగా “మౌనసాక్షి” కథా  సంపుటి,  ఆ తర్వాత “అరుగు” కథల సంపుటి,  ఆ వెంటనే “శ్రీగీతం” నవల రాయడం జరిగింది.  అమెరికాలో ఉన్నాం కాబట్టి అన్ని అమెరికా కథలే కాకుండా, బాల్యాన్ని వెంటాడే సంఘటనలను మరచిపోలేము కదా!  ఆ నేపథ్యంలో  కూడా కొన్ని కథలు అమెరికాలో  రాసాను.

కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్న నా రచనలు (పాటలు, కవితలు, కథలు)  అన్నీ ఏదో ఒక విధంగా సమాజం లోని అసమానలతలను తట్టి లేపే  విధంగా, ఆలోచనాత్మకంగానే ఉంటాయి. చదువుపట్ల పిల్లల అభిరుచులను పక్కకు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్ల లో పిల్లలను ఎలా రుద్దుతారో,  అమెరికాలో కూడా తెలుగు వారు వారి పిల్లల చదువు పట్ల ప్రవర్తించే తీరు, దాన్ని వల్ల  ఎంత మంది చిన్నారులు చితికి  పోయారో తెలుసుకున్న తర్వాత రాసిన కథ ‘వేకప్’  (సారంగలో ప్రచురితమైంది).

ఒకరు పెద్ద ఇల్లు కొన్నారని, హైఎండ్ కార్ కొన్నారని, స్తోమత లేకపోయినా పోటీలు పడి కొనుక్కుని చితికి పోయిన కొన్ని  జీవితాలు చూసిన తర్వాత రాసిన కథ ‘ధీమా’  కౌముది, వంగూరి ఫౌండేషన్ డయాస్పోరా కథల  సంపుటిలోనూ అచ్చయింది.    రూపాయల్లో అన్నీ పంచుకుని సంతోషంగా సాగిన స్నేహం, అమెరికాకు వచ్చిన తర్వాత తోటి మిత్రుడు  సహాయం ఆర్జించినప్పుడు  డాలర్లలో ఆలోచించిన ఆ స్నేహబంధం ఎలా దూరమయ్యిందో అనే విషయాన్ని “ఫ్రెండ్స్” కథలో వివరించాను.

అంతేకాకుండా ఇక్కడి మంచు ఇబ్బందులని యమధర్మ రాజు అమెరికా వస్తే ఎలా ఉంటుందో హాస్యప్రధానంగా  సాగిన కథే అయినా మనుషులు అమెరికా అయినా, ఇండియా అయినా నమ్మించి  ఎలా మోసం చేస్తారనే విషయాన్ని “మన నరకమే మన స్వర్గం” అనే కథ రాసాను. కులము, మతము, దేశము  అన్ని వేరయినా కేవలం గ్రీన్ కార్డు కోసం అమెరికా పౌరసత్వం ఉన్న  అమ్మాయిలని నమ్మించి,  ప్రేమించి ఒకసారి గ్రీన్ కార్డు రాగానే పూర్తిగా నమ్మి జీవితాన్ని అర్పించిన ఆ అమ్మాయిని మోసం చేసి, తల్లి తండ్రుల మాటలను కాదనలేక మళ్ళీ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలను చూసిన తర్వాత “నయా వంచన” అనే కథ రాసాను.

ఎంతో  పెద్ద పెద్ద చదువులు చదువుకొని,  అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, ఇక్కడి విజ్ఞానాన్ని చూసి కూడా, పిల్లలు పుట్టడం లేదని తల్లితండ్రుల మాట జవదాటక ‘పేగుబంధం’ అనే సెంటిమెంటు కోసం, పంచభూతాల సాక్షిగా పెళ్లాడిన భార్యని,  పూర్తిగా నమ్మి సర్వసం అర్పించిన భార్యని నిర్దాక్షన్యంగా వదిలేసి రెండో పెళ్ళికి సిద్ధం అవడం అనే సిగ్గు మాలిన పని చేసిన యువకుల కథ ఆధారంగా రాసిన కథ “నాతిచరామి” ఇది “అందెలరవమిది” అనే ఫీచర్ ఫిలిం గా రూపొందించబడి ఎన్నో అవార్డులు కూడా స్వంతం చేసుకుంది.

ఇంకా అమెరికా నేపథ్యంలో ‘వెలితి’, ‘సూపర్ హీరో’ అనే కథలు కూడా రాసాను.  వంగూరి వారి ‘డయాస్పోరా కథల సంపుటికోసం “సొంత లాభం కొంత మానుకు” అనే కథ మంచి ప్రశంశలతో  పాటు ‘మన వాళ్ళను తక్కువ చేసి చూపిస్తున్నావు’ అనే విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.   ఇక్కడ నేను చెప్పే సమాధానం ఒక్కటే – శరీరానికి ముల్లు కుచ్చినప్పుడు, మళ్ళీ నొప్పించనిదే  ఆ ముళ్ళు బయటకు రాదు.   ముళ్ళును అలాగే వదిలేస్తే  శరీరానికే మోసం వస్తుంది.  ‘ట్రెండ్’ అనే ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ, కొన్ని విలువలని మరచి పోతున్న మన మిత్రులకి దాని పర్యవసాన్ని వివరిస్తే , కనీసం ఒక్కరు మారినా కథకుడిగా విజయం లభించినట్టే.

భార్యా-భర్తలిద్దరూ సంపాదనలో పడి అమెరికాలో పుట్టిన పసిబిడ్డలని వారి తల్లి తండ్రులతో  ఇండియాకి పంపి ఎలా ఆ చిన్నారుల మురిపాలను, ముద్దు  చేష్టలను  కోల్పోతున్నారో అనే అంశాన్ని ‘పిలుపు’ అనే కథగా తర్వాత లఘు చిత్రంగా తీసినప్పుడు, ఆ చిత్రం స్పూర్తితో దూరంగా ఉన్న చిన్నారులని  తిరిగి తమ దగ్గరకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో.  ఇండియాకు పంపకుండా ఉద్యోగం మానేసి పిల్లల బాగోగులు చూసుకున్న సంఘటనలు కూడా ఎన్నో.  ఇంకా  ఎన్నో సంఘటనలు ఇంకా అచ్చురూపంలోకి రాలేదు.    పిలుపు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా  అమెరికా లో జరిగే ఎన్నో సంఘటనలను, ఎన్నారైలకు ఉపయోగ పడే ఎన్నో విషయాలను చిన్న చిన్న అంశాలుగా వీడియోలు ప్రచురించాం.

అమెరికా తెలుగు జీవనంలో మనం చెప్పలేనివి ఇంకా చాలా వున్నాయి. అవి చెప్పాలి. అవి సాహిత్యంగా మారిన రోజు నిజంగా అమెరికా తెలుగు సాహిత్యం అనే భావనకి జీవం పోసినట్టు!

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

వేణు నక్షత్రం

ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా ఎంసీఏ పూర్తి చేసి 1998 లో జీవన భృతిని వెతుక్కుంటూ అమెరికా జరిగింది. సిద్దిపేటలో 90 వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో , కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్న నా రచనలు (పాటలు, కవితలు , కథలు ) అన్నీ ఏదో ఒక విధంగా సమాజానికి ఉపయోగ పడే విధంగానే వుంటాయి . కథలు మౌనసాక్షి (సుప్రభాతం 1992) , పర్యవసానం ( ఆంధ్రజ్యోతి 1993) మరి కొన్ని కవితలు,పాటల తో ప్రారంభించిన సాహిత్య ప్రయాణం, అమెరికా చేరడంతో కొంత కాలం విరామం ప్రకటించక తప్పలేదు. గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ రంగం లో పని చేస్తున్నప్పటికీ, ప్రవుత్తి గా సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకొని సాహిత్య ,సాంస్కృతిక రంగంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా నా కలానికి ఎప్పుడూ ఏదో పని చెపుతూనే ఉన్నాను .

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు