ప్రవాసంలో ఆ తొలి రోజుల అన్వేషణ మీకు “తెలుసా”?

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) పాతికేళ్ళ పండగ సందర్భంగా వ్యాస పరంపరలో ఇది మొదటిది!

1988 లో జర్మనీ లో హైడెల్ బెర్గ్ లో ఒక్కడినే ఒక నాలుగు రోజులున్నాను. ఇండియన్ మొహం చూసి అప్పటికే వారమవుతుంది. జనవరి ఒకటో రోజున బజార్లో వెళుతుంటే, ఎవరో ఒక ఆఫ్రికన్ పెద్ద మనిషి, సూట్ వేసుకొని పోతూ కనబడ్డాడు. మేమిద్దరం మా పరాయి తనం గుర్తించుకొని, నవ్వుతూ పలకరించుకున్నాం. ఇన్నేళ్లకి, ఆ ముఖం నాకు గుర్తుంది. 

1986లో అమెరికా వచ్చిన రోజుల్లో, కొత్త అనుభవాల ఒరవడిలో పడి కొట్టుక పోతున్నా, అప్పుడప్పుడూ పరాయితనం వెంటనే వేటాడుతూ ఉండేది. మనం ఎవరం? మన జీవితానుభవాలు ఎవరికి అర్థం అవుతాయి? ఎవరితో సందేహం లేకుండా మాట్లాడగలం? ఇటువంటి ప్రశ్నలు వస్తుండేవి. ముందు ఒక ఆరు నెలలు డబ్బులు తగలేసి క్లాసుమేట్ లతో మాట్లాడుకునే వాళ్ళం. అయినా ఏమి మాట్లాడుకుంటాం? ఒకవైపు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వేరే వైపు, ఎంత మాట్లాడుకున్నా తరగనంత ఉంది. అప్పటికప్పుడు మాట్లాడుకోవలసిన మూలాన, ముఖ్య విషయాలు మాట్లాడేసి ఫోన్ పెట్టే వాళ్ళం. 

ఆ రోజుల్లో ముందుగా కనుక్కున్నది — యూజ్ నెట్. అది ఒక మహా సముద్రం. ఇప్పటి ఫేస్ బుక్ లో గ్రూప్ ల లాగ, అనేక గ్రూప్ లు ఉండేవి. ఎవరైనా గ్రూప్ లో పోస్ట్ చెయ్య వచ్చు. దీనికి ఒక సెంట్రల్ అథారిటీ అని ఉండదు. పోస్టు చేస్తే ఎవరైనా సమాధానం పెట్టవచ్చు. అందరూ కంప్యూటర్లు బాగా తెలిసిన వారు కాబట్టి, అందునా, అందరూ అమెరికా లో ఉన్నవారు కాబట్టి, ఉత్తర ప్రత్యుత్తరాలు సరదా గా ఉండేవి. ముఖ్యం, అవసరం అని లేకుండా సరదా విషయాలు, సీరియస్ విషయాలు — ఏవైనా ఆ గ్రూప్ చార్టర్ దాటనంత వరకు రాసుకోవచ్చు. సాహిత్యం అందులో కొంత మాత్రమే ఉండేది. వంటలు, దేశ విషయాలు, జోకులు, స్టూడెంట్ సమస్యలు (వీసా విషయాలు, ఇండియా టికెట్ విషయాలు లాంటివి), అమెరికా రాజకీయాలు, పొలిటికల్ చర్చలు, వార్తలు ఎక్కువగా ఉండేవి. సంభాషణలు అన్నీ ఇంగ్లీషులోనే నడిచేవి. 

ముఖ్యంగా, రోజుల్లో సోక్.కల్చర్.ఇండియన్ (ఎస్సీఐ) అని అందరికీ కలిసి ఉండేది. పాకిస్తాను, బాంగ్లాదేశ్ కూడా ఇందులో ఉండేవి. అందరూ ఇంగ్లీషులోనే రాసే వారు. అందరూ యూనివర్సిటీలోని వాళ్లే కాబట్టి, దాదాపు ఒకే విషయాల గురించి మాట్లాడు కొనే వారు. ఒక విధమైన అర్బన్ అప్పర్ మిడిల్ క్లాస్ భాష, విషయాలు, కబుర్లు ఎక్కువ కనబడుతూ ఉండేవి. ఆ గ్రూప్ లో తెలుగు వాళ్ళున్నప్పటికీ, తెలుగులో మాట్లాడు కోవడం కానీ, తెలుగు గురించి మాట్లాడు కోవడం కానీ ఉండేది కాదు.  

ఈ గ్రూప్ లు  ఏర్పాటు చెయ్యటానికి వోటింగ్ ఉండేది. ఎక్కువ మంది కనక ఒప్పుకుంటే, గ్రూప్ ఏర్పడేది. మరి ఎందుకు గ్రూప్ వద్దంటారు? ఉదాహరణకి  ఆ ఇండియన్ గ్రూప్ లో అప్పుడప్పుడూ బాగానే గొడవలు వచ్చేవి. ముందు పాకిస్తాన్ విడిపోతాం అన్నారు. ఇండియా వాళ్ళు వ్యతిరేకం గా వోట్ వేశారు. కానీ, చివరికి, పాకిస్తాన్, తర్వాత బంగ్లా విడి గ్రూప్ లు పెట్టారు.  అలాగే, కొన్నేళ్ళకి, తెలుగు వాళ్ళు ఒక గ్రూప్ కావాలన్నారు. అందుకు అనేక మంది ఇండియన్ గ్రూప్ వాళ్ళు వ్యతిరేకించారు. చివరికి స్కిట్ అనే తెలుగు వారి గ్రూప్ వచ్చింది. 

ఆ మొదటి తెలుగు గ్రూప్ ముందు బాగా నడిచేది. అందులో ఎవరైనా పోస్టు చెయ్య వచ్చు. అందులో స్టూడెంట్లు, ప్రొఫెస్సర్లు లాంటి వాళ్ళు ఎక్కువ. ఎవరో కొంతమంది ఉద్యోగం చేసుకునేవారు ఉండేవారు. ఇప్పుడు అమెరికా సాహిత్య రంగంలో పేరుమోసిన పెద్దలు ఆ గ్రూప్ లో ఉండేవారు. వేలూరి, జంపాల, మా అన్నయ్య చంద్ర, సురేశ్ కొలిచాల, పాలన, పరుచూరి, కమల అనుపిండి — ఇలాగ అనేక మంది అనేక విషయాలు తెలుగులో, ఇంగ్లీష్ లో రాస్తూండేవారు. వాద ప్రతివాదాలతో, తెలుగు, ఇంగ్లీషులతో లైవ్లీ గా నడిచేది. ఎక్కువగా మనుషులు లేకపోవడంతో, ఒకరికొకరు బాగా తెలిశాము. 1995 లో, అందరమూ, చికాగో తానాలో కలిశాం కూడా!

కొన్నేళ్లు గడిచేసరికి ఈ యూజ్ నెట్ అందరూ కనుక్కున్నారు. ఇష్టం వచ్చినట్లు పోస్టులు చెయ్యడం మొదలు పెట్టారు. కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్ లు రావడం మొదలు పెట్టాయి. అప్పుడు మరొక వోట్ పెట్టి, పోస్ట్ చెయ్యడానికి రెస్ట్రిక్షన్లు పెట్టాం. కానీ, కొన్నాళ్ళకి ఆ గ్రూప్ వాడటం మానేశారు. అప్పటికే యూజ్ నెట్ చివరి దశ కి వచ్చింది. 

అప్పటికే, అంటే 1992 నాటికి, మెయిలింగ్ లిస్ట్ లు ప్రాచుర్యం లోకి రావడం మొదలు పెట్టాయి. గ్రూప్ ల లాగ కాకుండా, ఎవరైనా మొదలు పెట్టవచ్చు. కాకపొతే, బులెటిన్ బోర్డు లాగ కాకుండా, మెయిల్స్ చూడాలంటే, అందులో చేరాలి. అప్పుడు WTD (వరల్డ్ తెలుగు డైజెస్ట్) అనే మెయిలింగ్ లిస్ట్ ముందు మొదలయింది. అది కొన్ని నాళ్ళు నడిచిన తర్వాత, తెలుసా, 1994 లో ననుకుంటాను, వచ్చింది. 

తెలుసా తో తెలుగు చర్చలు ప్రతాక స్థాయికి వచ్చాయి. దాదాపు 300 మంది ఉన్నట్లు గుర్తు. అది ముందు విస్కాన్సిన్ నుంచి శొంఠి రత్నాకర్ నడిపేవాడు. RTS లో తెలుగు ని ఇంగ్లీష్ లిపిలో, అనేక పోస్టులు వచ్చేవి. ఇది మెయిలింగ్ లిస్ట్ కాబట్టి, మెంబర్లు మాత్రమే పోస్ట్ చెయ్య వచ్చు. అందులో నేను కూడా ఎక్కువగానే పాల్గొన్నాను. ఇప్పటి ఫేస్ బుక్ లాగా కాకుండా, అప్పుడు, నా గోడ నా ఇష్టం అంటానికి లేదు. డైరీ లాగ కాదు. ఇది సాహిత్య వేదిక. సాహిత్యానికి సంబంధించిన ఏ విషయాలయినా మాట్లాడే వాళ్ళం. మోడరేటర్లు కావాలంటే పోస్టులు రివ్యూ చేసి వెనక్కి పంపవచ్చు.

1997 లో, తెలుసా రచ్చబండ అయింది, టెక్నికల్ విషయాల మూలాన. ఆ తర్వాత భారత దేశంలోని తెలుగు వాళ్ళు ఇంటర్నెట్ మీదకి వచ్చారు. అప్పుడప్పుడూ రచ్చబండలో పోస్టులు కూడా రాస్తుండే వారు.  అప్పుడు 2001 రోజుల్లో, వేలూరి గారు ఒక మార్కులు రాని మార్క్సిస్టులు అని ఒక విసురు విసిరి దుమారం ఎత్తారు కూడాను. అప్పుడు ఇండియన్ తెలుగు వారు ఇంటర్నెట్ నే అమెరికన్ విషయంగా చూసే వారు. పూర్తిగా ఇంటర్నెట్ సంభాషణల్లో పాల్గొనడానికి ఇంకా కొన్నేళ్లు పట్టింది. 

ఈ మెయిలింగ్ లిస్ట్ చాన్నాళ్లు నడిచింది. అందులో ఛందో బద్ధమైన పద్యాలూ, కవితలు, విమర్శలు, అభిప్రాయాలూ, వాద వివాదాలు లాంటివి వస్తూ ఉండేవి. ఈ మెయిలింగ్ లిస్ట్ ద్వారా పెరిగిన స్నేహాలతో ఈమాట లాంటి మ్యాగజిన్ లు వచ్చాయి కూడాను. తానా సాహిత్య సమావేశాలు, బుక్ క్లబ్బులు లాంటివి ఈ మెయిలింగ్ లిస్ట్ వాళ్ళ లాభం పొందాయి. ఇప్పటికీ, ఆ స్నేహాలు సాగుతూనే ఉన్నాయి. 

ఇది ఇలాగ సాగుతుండగా, మధ్యలో యూనికోడ్, తెలుగు ఫాంటుల పుణ్యమా అని, బ్లాగుల ఉద్యమం వచ్చింది. ఎవరి బ్లాగు వారిది కాబట్టి, భయం లేకుండా వాళ్లు రాసుకునేవారు. కాకపొతే, ఒక పెద్ద సంఘం, చిన్న చిన్న గుంపులుగా విడిపోయింది. తమకి తామే, తమ ప్రపంచాన్ని సృష్టించుకొని దానిలోకి వెళ్లి పోయినట్లు, ఎవరి మైక్రో కమ్యూనిటీ వారిది అయిపోయింది. అయినా, ఈ నాటి నూతన తరం తెలుగు రచయితలూ, రచయిత్రులు, బ్లాగుల లో రాసి  తమ కళను, కలాన్నీ పెంచుకున్న వారే. బ్లాగులతో బాటు, ఈ-మ్యాగజిన్ లు కూడా తెలుగులో రాసే వారు 

2008 నుంచీ, నేను ఫేస్ బుక్ మీద ఉన్నాను. ముందు కేవలం పని దగ్గర స్నేహితులైన వారు, తెలుగేతరులు ఎక్కువగా స్నేహితులుగా ఉండేవారు. రాను రాను నాకు  ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ లో ఎక్కువ మంది తెలుగు వారు అయి, వారి ద్వారా, తెలుగు విషయాలు ఎక్కువగా తెలియడం జరిగింది. అంతకు ముందు ఉన్న మెయిలింగ్ లిస్టుల కన్న తెలుగు సంభాషణలు ఎక్కువగా ఈ ఫేస్ బుక్ లోనే  జరుగుతున్నాయి. 

నా మిత్రుడు పరుచూరి అనేవాడు — ఏ తెలుగు ఎలక్ట్రానిక్ గ్రూప్ అయినా, పదేళ్ల కంటే ఉండదు అని. స్కిట్ ఒక నాలుగేళ్లు నడిచిందేమో. తెలుసా, రచ్చబండ ఒక పదేళ్లు బాగా నడిచాయి. ఫేసుబుక్ మాత్రం పదేళ్ల పైన నడుస్తుంది. అయితే, మొదట్లో, ఈ గ్రూప్ అన్ని జనాలకు ఒకటే. అంటే,తెలుగు వారందరికీ ఒకటే గ్రూపు ఉండేది. మనకి నచ్చని గొంతులు కూడా వినబడేవి. అవసరం కొద్దీ, కొంచెం ఎక్కువ అభిప్రాయాలు వినవలిసి వచ్చేది. అయితే, ఎక్కువ గొంతు ఉన్న వాడి మాటలే ఎక్కువగా వినబడేవి. 

ఇప్పుడు మైక్రో కమ్యూనిటీ ల పుణ్యమా అని, ఎవరికీ వారే వారి గ్రూప్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతకు ముందులా కాకుండా, భయపడకుండా తమ అభిప్రాయం చెప్పవచ్చు. మరీ మనం మాట్లాడుతున్నది పది సార్లు చూసుకోనక్కర లేదు. అందరూ మనలాంటి వాళ్లే! ఏదన్నా తప్పు ఉన్నా, విరుచుకు పడకుండా, సర్దుకు పోతారు. మన మనసుని కష్టపెట్టే మాటలు వినక్కరలేదు. 

అయితే, నష్టం ఏమిటంటే, అన్ని గొంతులూ మన గొంతుకు ప్రతిధ్వనులే. ఉదాహరణకు, ఒకప్పుడు శ్రీ శ్రీ, విశ్వనాథ గ్రూపులు ఎవరు ఎందుకు వేరే వారి కంటే గొప్పకవో తీవ్రంగా చర్చించు కొనే వారు. ఇప్పుడో? ఎవరి గ్రూప్ వారిది. వేరే వారి వాదాలు వినక్కర లేదు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారు ఎలాగ ఆలోచిస్తారో తెలియదు. ఎవరి పంచలో వారు కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. మనకి నచ్చిన వారు, మనల్ని మెచ్చిన వారు మాత్రమే అక్కడికి వస్తారు. అందుకే, రచ్చబండ ఖాళీ అయి పోయింది! 

*

రామారావు కన్నెగంటి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమెరికా సాహితీ ప్రపంచంలో కొందరు సీనియర్లు కొత్తవాళ్ళను తేలిగ్గా అంగీకరించలేకపోతున్నారన్నది చాణ్ణాళ్ళ కిందటే కలిగిన ఓ అభిప్రాయం.
    బహుశా 90లలోనుంచే కలిసుండటంతో వీరందరికీ కొత్తవారిని కలవటానికి, తెలుసుకోవటానికి ఆసక్తి కలిగే మోటివేషన్ ఏమీ ఉండకపోవటం సహజమేనేమో.

  • మంచి జ్ఞాపకాలు.
    WTD 1993లో మొదలై ఉండవచ్చు. తెలుసా 1996 లో. రచ్చబండ 2000లో.
    వేలూరి మార్కులు రాని మార్క్సిస్టులు వ్యాఖ్య – కాగితం పులి కళ్ళలో భయం అనే కవితాసంపుటి పై ఆంధ్రభూమి సాహిత్యపేజీలో చేసిన సమీక్షలో వచ్చింది.

  • తెలుసా, రచ్చబండ గ్రూపుల ఏర్పాటు లో పిల్లలమర్రి శివరామకృష్ణ (DC) గారి క్రియాశీలక మైన పాత్ర మరువరానిది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు