వలస పోవడం అంటే అలవాటుపడ్డ జీవితాన్నుంచీ వేళ్లని పెకలించుకుని వెళ్లి ఇంకొక చోట పాతుకోవడం. అక్కడ ఏర్పరచుకున్న జీవితాల కథలని డయాస్పోరా సాహిత్యం అని నిర్వచించారు. అలా వలస వెళ్లి స్థిరపడిన కుటుంబాల్లోని పిల్లలు ఎదిగి చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పటినుంచో రక్తంలో ఇముడ్చుకునివున్న వంశీకులలోంచి జీవన సహచరుల నెన్నుకోవడం చాలా తేలికగా జరిగేదే అని చాలామంది అపోహపడతారు.
అమెరికాకు వచ్చి స్థిరపడిన కుటుంబాలలోని పిల్లలు అలా అంతర్జాతి (inter-racial) పెళ్లిళ్లు చేసుకోవడం శ్వేత జాతీయ పురుషులకి తూర్పుదేశాల స్త్రీ లంటే మక్కువ వల్ల అని, దానికి కారణం ఆ స్త్రీలు అణకువగా ఉండడ మనీ కూడా అచ్చులో కనబడడం అంత అరుదేమీ కాదు. పంధొమ్మిది వందల తొంభయ్యవ దశకం మొదట్లో వచ్చిన “Mississippi Masala” సినిమాలో భారతదేశం వంశీకురాలు ఒక ఆఫ్రికన్ అమెరికన్తో ప్రేమలో పడడాన్ని చూసిన కొందరికి ఈ అపోహలు కొద్దిగా తొలగే అవకాశ మున్నది. అయితే, సినిమాలో చూపలేనిది, కథలో పాఠకులకు దొరికేది పాత్రల అంతర్మథనం.
“ఒమకాసే” (https://www.newyorker.com/magazine/2018/06/18/omakase ) లోని అమ్మాయి స్త్రీ తల్లిదండ్రులు చైనా దేశం నుండీ అమెరికాకు వచ్చారు. ముఫ్ఫయ్యారేళ్ల వయసు వచ్చినా కూతురు ఇంకా పెళ్లిచేసుకోలేదని ఆదుర్దాపడుతున్నారు. (ఈ కథలో ఏ పాత్రకీ రచయిత్రి పేరు నివ్వలేదు.) ఆ వయసులో ఆమె ఒక శ్వేతజాతీయుణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకి పరిచయం చేసినప్పుడు ఆమె జీతం అతని జీతంకన్నా ఎక్కువ అయిన విషయాన్ని వాళ్లు పట్టించుకోరు; కూతురుకి జత దొరికిందే చాలనుకుంటారు. ఆ జంట రెండేళ్ల అనుబంధంలో అతనికోసం ఆమె బోస్టన్ నించీ న్యూయార్క్‌కు వచ్చి సహజీవనం మొదలుపెట్టి రెణ్ణెల్లయింది. మొదటినించీ ఆమెకి అతను తన నెందుకు ఎంచుకున్నాడని అనుమానం. ఆమె స్నేహితులకి మాత్రం, అతను తెల్లవాడవడం ఆమె సాంఘికంగా నిచ్చెనలో ఒక మెట్టు పైకి ఎక్కడం. అతనితో పరిచయం అయినప్పటి నించీ ఆమెలో తలెత్తిన అభద్రతా భావం చాలా మెల్లగా మాత్రమే తొలుగుతోంది.
కథ, ఆరుమందికన్నా పట్టని చిన్న జాపనీస్ రెస్టారెంట్‌కి ఆ జంట వెళ్ళడంతో మొదలవుతుంది. అక్కడ, ఆ జంట మధ్యలోని డైనమిక్స్‌ని వాళ్లు సర్వర్‌తో, షెఫ్‌తో జరిపే సంభాషణ నేపధ్యంలో రచయిత్రి అద్భుతంగా పాఠకుల ముందుంచుతారు. “ఒమకాసే” అన్న పదం ఈ కథకు శీర్షిక అవడానికి కారణ మేమిటీ అనేది చదివి తెలుసుకోవాలి.
ఈ కథ చదివిన తరువాత, ఆమె, ఆమె తల్లిదండ్రుల పాత్రల ఆలోచనలు భారతదేశం నుండీ అమెరికాకు వలస వచ్చిన కుటుంబాల్లోని పాత్రల ఆలోచనలకు భిన్నంగా లేవనిపిస్తుంది. ఆమె వయసున్నా గానీ ఇంకా పెళ్లి కాని పిల్లలు తమ స్నేహితుల కుటుంబాల్లో ఉన్నారని గుర్తున్నవాళ్లు ఈ కథని అర్థంచేసుకోవడానికి అవకాశ మున్నది. వలస వచ్చిన తరంలోని పిల్లలు తమ జీవన సహచరులని వేరే జాతి ప్రజలలోంచి తామే ఎన్నుకుంటున్నప్పుడు నిరంతరం అభద్రతా భావానికి గురవడానికి ఎన్నో కారణాలుంటాయి. వాటిల్లో, అవతలివాళ్లు తమకన్నా కూడా తమ జాతిగూర్చీ, సంస్కృతి గూర్చీ ఎక్కువ తెలిసినట్లు కనిపిస్తే ఒక రకం, పట్టించుకోనట్లు కనిపిస్తే ఇంకొకరకం భాగాలు కావచ్చు.
“టంగ్ డైనాస్టీ” గూర్చి అతడడిగిన ప్రశ్నకి ఆమెకు జవాబు తెలియదు. “చైనీస్ ఆరిజిన్ అమ్మాయి గనుక తెలిసే ఉంటుంది,” అని అనుకోవడంలో అతను తప్పుచేశాడా? “అశోకుడి కాలంలో,” అంటూ మొదలుపెట్టిన ఏ శ్వేతజాతీయు ణ్ణయినా భారతీయ కుటుంబ వారసత్వం కలిగి అమెరికాలో పెరిగిన అమ్మాయి, “ఇంప్రెస్ చెయ్యడానికి ముక్కునపట్టుకుని వచ్చాడు!” అని అనుకోవడమూ, ఇంకా ముందుకు వెడితే, “అశోకుడి గూర్చి నాకేమీ తెలియదని వెక్కిరిస్తున్నాడు!” అని చిన్నబుచ్చుకోవడమూ అంత అసహజ మేమీ కాదనిపిస్తుంది. అభద్రతకు గురిచేసే భావం ఏ రకానికి చెందినదయినా గానీ అది సమంజసమా కాదా అనేది ఎవరూ నిర్ణయించలేరు. దాన్ని నిండా మునిగినవాళ్లు మాత్రమే అనుభవించ గలిగేది. అలాంటి అనుభవాన్నొకదాన్ని మనముందుంచారు రచయిత్రి.
అస్తిత్వానికి పెద్ద పీట వేసి, ఆలోచింప జేసే కథని అందించిన రచయిత్రి వైకి వాంగ్.
వైకి వాంగ్ చైనాలో పుట్టారు. ఆమె ఐదు సంవత్సరాల వయసులో అమెరికాకు తల్లిదండ్రులతోబాటు వలస వచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పట్టా పొందారు. “కెమిస్ట్రీ” నవలకు ఆమె 2018 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన PEN/హెమింగ్వే అవార్డు నందుకున్నారు.
*
లోగో చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment