ధనవంతమైన చాలా ప్రభుత్వాలు తమ దగ్గర వున్న కొంత ధనాన్ని ఒక్క నిధిలాగా (fund) సృష్టించి అలాంటి మొత్తాన్ని రకరకాల విదేశీ ఆస్తులలో (పెట్రోలియం లీజులు, స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు, పవర్ ప్లాంట్లు, ఓడ రేవులు ఇలా ఎన్నో రకాల ఆస్తులలో) పెట్టుబడిగా (investment) పెట్టడానికి ఉపయోగిస్తూ వుంటాయి. ఇలాంటి నిధిని సావరెన్ వెల్త్ ఫండ్ (sovereign wealth fund) అని అంటారు. మలేషియన్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక్క సావరెన్ వెల్త్ ఫండ్‌ను సృష్టించింది విదేశీ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి. ఈ నిధి పేరు 1ఎండిబి (1MBD లేదా 1 మలేషియా డెవలప్మెంట్ బెర్హాడ్).
ఈ 1ఎండిబి నిధి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రుణాన్ని అమర్చిపెట్టడానికి పెద్ద పేరు మోసిన అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్[1] గోల్డ్‌మ్యాన్ స్యాక్స్‌ను (Goldman Sachs) సలహాదారుడిగా ఎంచుకుంది. చాలా కంపెనీలు తమంతట తాము తమకు కావాల్సిన ధనాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి అమర్చుకోలేవు కాబట్టే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లను ఎంచుకుంటాయి, ఎలాంటి ధనాన్నైనా అమర్చిపెట్టేందుకు. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి ధనాన్ని అమర్చిపెట్టేందుకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లు గట్టి ఫీజే తీసుకుంటాయి.
విశ్వవిఖ్యాత వాణిజ్య వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ (Bloomberg) ప్రకారం, 1ఎండిబి నిధి పవర్‌ప్లాంట్లు కొనడానికి జారీచేసిన బాండ్లను (రుణాన్ని) అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు రెండు అంచెలలో అమ్మి 6.50 బిలియన్ల డాలర్లు అమర్చి పెట్టింది గోల్డ్‌మ్యాన్ స్యాక్స్. ఈ బాండ్లని (రుణాన్ని) అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు అమ్మిపెట్టడాని 600 మిలియన్ల డాలర్ల ఫీజు గుంజింది గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ 1ఎండిబి నిధి దగ్గర నుంచి. కాకపోతే, ఇలా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ద్వారా అమర్చిన ఈ రుణంలో చాలా మొత్తాన్ని మలేషియా ప్రభుత్వోద్యోగులు, బ్యాంక్ అధికారులు కైంకర్యం చెయ్యడానికి గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ స్వయానా సహాయం చేసిందని గగ్గోలు మొదలయ్యింది.
ఈ వదంతి మొత్తం ప్రపంచం చుట్టూ పాకి కనీసం 10 అగ్రదేశాలలో (మలేషియాలోనే కాక సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, లగ్జెంబర్గ్, యూఏఈ, థాయ్‌లాండ్లలో) బ్యాంకర్లు, రాజకీయనాయకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద పెద్ద ఎత్తున దర్యాప్తులు నడుస్తున్నాయి. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ దర్యాప్తులు చేసి గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ అమర్చిన 6.50 బిలియన్ల డాలర్ల రుణంలో బహుశా 4.50 బిలియన్ల డాలర్లు (అంటే రూ. 30,000 కోట్లకు పైగా 2009 నుంచి 2014 మధ్యలో) కైంకర్యం అయినట్టు అంచనా వేసింది. మధ్యవర్తుల ద్వారా, రకరకాల షెల్ కంపెనీల ద్వారా టాక్స్ హేవెన్స్‌కు డబ్బు దారి మళ్ళించి అక్కడ నుంచి ఆ డబ్బు మలేషియా మాజీ ప్రధాన మంత్రికి, మలేషియా ప్రభుత్వ అధికార్లకు, మధ్యవర్తులకు, బ్యాంకర్లకు ముట్టచెప్పినట్టు సాక్ష్యాధారాలతో సహా బట్టబయలయింది.
మలేషియా ప్రభుత్వం, ఈ పెద్ద ఎత్తు మోసం వెనుక గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ మూలపాత్ర వుందని అమెరికా కోర్ట్‌లలో కేసు వేసింది 3.30 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించమని (దారి మళ్ళించిన 2.70 బిలియన్ల డాలర్లనే కాకుండా 600 మిలియన్ల డాలర్ల ఫీజు కూడా వాపసు తిరిగి ఇవ్వమని). తీగలాగితే డొంకంతా కదిలినట్లు పది దేశాలలో ఈ పెద్ద ఎత్తు మోసంలో పాల్గొన్న బ్యాంకుల పేర్లు, ఆ బ్యాంక్ అధికార్ల పేర్లు బయట పడటమే కాకుండా ఎన్నో క్రిమినల్ కేసులు కూడా నమోదు చెయ్యడం జరిగింది.
మనీ లాండరింగ్[2] ఆరోపణల మీద సింగపూర్ ప్రభుత్వం రెండు స్విస్ ప్రైవేట్ బ్యాంకుల (బీఎస్ఐ మరియు ఫాల్కన్ ప్రైవేట్ బ్యాంక్) బ్రాంచ్‌లను మూతేసి వెళ్ళగొట్టింది సింగపూర్ నుండి. అన్నీ తెలిసి కూడా దొంగ దార్లలోకి డబ్బు మళ్ళించినందుకు, దొంగ పనులలో పాల్గొన్నందుకు సింగపూర్ ప్రభుత్వం పేరు మోసిన రెండు స్విస్ బ్యాంకుల (యూబీఎస్ మరియు క్రెడిట్ స్విస్) మీద, పేరు మోసిన రెండు బ్రిటిష్ బ్యాంకుల (స్టాండర్డ్ చార్టర్డ్ మరియు ఆర్‌బీఎస్ గ్రూప్‌కి చెందిన కూట్స్ ఎండ్ కం.) మీద, ఒక్క సింగపూర్ బ్యాంక్ డీబీఎస్ మీద కూడా మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.
మలేషియా మాజీ ప్రధాన మంత్రి మీద, మలేషియా ప్రభుత్వ అధికార్ల మీద, మధ్యవర్తుల మీద పెద్ద ఎత్తున దర్యాప్తులు నడుస్తున్నాయి. గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ అధికార్లు దొంగిలించిన డబ్బుతో కొంతమంది పదవీవిరమణ చేసి భోగాలలో తేలియాడుతున్నారని తెలిసింది. మలేషియన్ మాజీ ప్రధానమంత్రి అక్కౌంట్లో 600 మిలియన్ల డాలర్లు దొరకడమే కాదు, ఎన్నో వాచ్‌లు, హేండ్ బ్యాగ్‌లు, ఆభరణాలు లాంటి విలాస వస్తువులు దొరికాయి. బ్యాంకర్లు, ప్రభుత్వాధికారులు, మధ్యవర్తులు విలాస వస్తువుల మీద డబ్బు విరజిమ్మినట్టు తేలింది. అంతే కాదు, దొంగిలించిన డబ్బులో కొన్ని మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి 2013లో “ది వుల్ఫ్ ఆఫ్ వాల్‌స్ట్రీట్” అనే హాలీవుడ్ సినిమా కూడా తీసారట.
దర్యాప్తుల కథనం ప్రకారం, మాజీ గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ అధికార్లు ఇలాంటి దొంగ స్కీమును తయారు చేయడంలో సూత్రధారులే కాకుండా మిలియన్ల డాలర్లను దొంగిలించి స్వంత అక్కౌంట్లలో వేసుకోవడమే కాకుండా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పది దేశాలలో బ్యాంకులతో మలేషియా ప్రభుత్వాధికారులతో మోసగాళ్ళైన మధ్యవర్తులతో కుమ్ముక్కై ఇలాంటి స్కీమును అమలులోకి తీసుకువచ్చి దొంగిలించిన డబ్బును పంచి ఇచ్చినట్టు దాదాపుగా తేలిపోయినా, గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ మేనేజ్‌మెంట్ అమెరికన్ కోర్ట్‌లో ఈ ఆరోపణలకు వ్యతిరేకంగా గట్టిగా పోరడటానికి నిశ్చయించుకుంది, ఏదైనా మోసం జరిగివుంటే అందులో బ్యాంక్‌కి ఎలాంటి పాత్ర లేదంటూ.
బ్యాంక్‌లో పై అధికారుల అండదండలు లేకుండా పది దేశాలలో ఇన్ని బ్యాంకులను, అంత మంది బ్యాంకర్లను, మధ్యవర్తులను, ప్రభుత్వాధికారులను ముగ్గులోకి దింపి 2.70 బిలియన్ల డాలర్లను దారి మళ్ళించి దొంగిలించడం ఎలా సాధ్యమో నమ్మశక్యం కాకుండా వుంది. మనిషి దురాశ ముందు అన్నీ దిగతుడుపే, ఇది ఎంత పెద్ద జీతగాళ్ళనైనా ఎంత డబ్బున్న వాళ్ళనైనా ఎంత పెద్ద మనుష్యులనైనా ఎంత పేరున్నవాళ్ళనైనా కూడా కక్కుర్తి పడేలా చేసి దొంగతనాలకు పురికొల్పగలదని దీని వలన తేలుతుంది. ఇవి పేద దేశాలలో గతి లేక తిండికి లేక చేసే అవినీతి పనులు కాదు.
బయటి లింకులు
https://www.bloomberg.com/graphics/2018-malaysia-1mdb/
https://in.reuters.com/article/malaysia-politics-1mdb-goldman/goldman-sachs-pleads-not-guilty-in-malaysia-over-1mdb-bond-sales-state-media-idINKCN20I0PV
[1] ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లు (ఉదాహరణకు గోల్డ్‌మ్యాన్ స్యాక్స్) సామాన్య ప్రజలకు సేవలు అందించవు. కేవలం పెద్ద పెద్ద కంపెనీలకు, ఇతర సంస్థలకు ఈ బ్యాంకులు రకరకాల సేవలను అందిస్తాయి, అలాంటి ఖాతాదారులకే ఫైనాన్స్ విషయాలలో సలహాలిస్తుంటాయి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ప్రజలకు కంపెనీ షేర్లు అమ్మి కంపెనీలకి డబ్బును కూడపెట్టడం, ఒక్క కంపెనీ వేరే కంపెనీని కొనడంలో కావాల్సిన సేవలు, రకరకాల పద్ధతులలో కంపెనీ కోసం పెట్టుబడిని ఎలా తీసుకురావచ్చని, ఇలా ఎన్నో రకాల సేవలు. సాధారణంగా, ఈ బ్యాంకులకు సామాన్య ప్రజల డబ్బును డిపాజిట్లు రూపంలో ఆమోదించే చట్టబద్దమైన అనుమతి ఉండదు.
[2] మనీ లాండరింగ్ అంటే అక్రమమైన డబ్బుని, నల్ల ధనాన్ని చట్టబద్ధమైన వ్యాపారం ద్వారా సంపాదించినట్టు వకీళ్ళ, అక్కౌంటెంట్ల, బ్యాంకుల సహాయం ద్వారా దొంగ లెక్కలు సృష్టించి చట్టబద్ధమైన ఆదాయంగా కనిపించేలా మార్చే పద్ధతి. అక్రమమైన డబ్బు అంటే చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు (ఉదాహరణకు వ్యభిచారం, అక్రమ ఆయుధాల సరఫరా, నకిలీ సామాన్లు, దొంగ సారా, డ్రగ్స్ వగైరా వగైరా నుంచి సంపాదించిన డబ్బు ఈ కోవలోకి వస్తుంది). నల్లధనమంటే ప్రభుత్వం కళ్ళుకప్పి పన్నులు ఎగ్గొట్టిన సంపాదన. ప్రభుత్వ బొక్కసం అందుబాటులో వున్నవారు, అందులోంచి మోసపూరితంగా దొంగిలించే ధనం (embezzlement) కూడా ఈ కోవలోదే.
ప్రపంచవ్యాప్తంగా , ప్రతి దేశంలో ఇంత పెద్ద ఎత్తున కొందరు కుమ్మక్కై ఈ విధంగా మోసం చేసి దోచుకుంటుంటే , అరికట్టే విధానం లేదా? ఇంకోచోట జరక్కుండా ఆపలేరా ?
వైరస్ వ్యాప్తి నివారణకు వాక్సిన్ కనుక్కొన్నట్లు , మానవుడి దురాశకి కూడా ఒక వాక్సిన్ కనుక్కుంటే ఎంత బాగుంటుంది .
బాగుంది ఈ వ్యాసం …..investment banks ఈ విదంగా public money ని అవినీతి అధికారులకి & రాజకీయ నాయకులకి దోచిపెట్టడం గురించి , తెలియని వారికికూడా ఈ వ్యాసం ద్వారా easy గా తెలుస్తుంది.