ఊహించని ఒక ఆరోగ్య విపత్తు వస్తే దానిని ప్రభుత్వాలుగా, పౌర సమూహంగా ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో మన దేశానికి ఏమాత్రం అవగాహన లేదని ‘కరోనా వైరస్’ రుజువుచేసింది. ప్రాథమిక ఆరోగ్యం ప్రభుత్వాల ఆలోచనలోంచే కాదు మధ్యతరగతి మస్తిష్కంలోంచి కూడా జారిపోయింది. అనారోగ్యమనగానే ఉన్నత మధ్యతరగతి వర్గాల వారికి గుర్తుకు వచ్చేది కార్పొరేట్ హాస్పిటళ్ళు, అందులో ఎవరికి ఎన్ని నక్షత్రలున్నాయో దానిని బట్టి ఆ డాక్టర్ దగ్గరకు పరిగెత్తటం. అందుకే, ప్రభుత్వ హాస్పిటళ్ళలో పరిస్థితులు ఏ విధంగా దిగజారుతున్నాయో పట్టించుకోవటం మానేసాయి ఈ వర్గాలు. కరోనా(కోవిద్19) అనే వైరస్ వ్యాప్తి చెందుతోంది అన్నాకూడా ఆ తీవ్రత ప్రభుత్వాల దృష్టి పథంలోకి రాలేదు. డిసెంబర్ చివరి వారం నుంచే చైనాలో శరవేగంగా పెరుగుతున్న వైరస్ గురించీ వార్తలు వస్తున్నా గానీ, పరిస్థితి అర్థం కావటానికి మనదేశంలో మూడునెలలు పట్టింది. ప్రభుత్వాలకే అర్థం కాలేదు, ఇంక సామాన్య ప్రజలకేమి అర్థం అవుతుంది! దీనితో పాటు, ఆరోగ్య రంగంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సామాజిక సంస్థలు ఎంత తక్కువ వున్నాయో (దాదాపు లేవనే చెప్పాలి!) కూడా ఈ విషయం బాగా బయటపెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దీనికి మినహాయింపు కాదు.
నిజానికి చైనాలో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా వుంది అని వార్తలు వచ్చినా కానీ, ఆ దేశం మీద ఎకసెక్కాలు పడ్డారు కానీ అది మన దేశంలోకి కూడా రావొచ్చు అనే ఊహ కూడా చేయలేదు. పైగా, అది అంటువ్యాధి అని చెబుతున్నా గానీ! మనది చాలా వేడి ప్రదేశం కాబట్టి మన దేశానికి వైరస్ రాదు అనే భ్రమ ప్రతి ఒక్కరికీ పనిచేసిందనే చెప్పాలి. ఇక్కడి ప్రభుత్వాలు కూడా ఈ అంశం మీద మొదట్లో చూపించిన వైఖరి కూడా దానికి దోహదం చేసింది. చైనా, ఇటలీ, అమెరికా, ఇంకా ఇతర దేశాల నుంచీ వచ్చే వార్తలు వింటున్నా, చదువుతున్నా గానీ, దానిపట్ల ఒక సమాలోచన కూడా ఎక్కడా జరగలేదు. బహుశా, సామాజిక సంస్థలూ, రాజకీయ పార్టీలూ, కార్యకర్తలు అందరూ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తలమునకలుగా మునిగిపోయి వుండటం ఒక కారణమైతే, ఆరోగ్య పరమైన సామాజిక కార్యాచరణ, సంస్థలు లేకపోవటం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. మార్చి మొదటివారంలో హైదరాబాద్లో మొదటి పాజిటివ్ కేసు నమోదు అయ్యేవరకూ కూడా ప్రత్యక్ష పౌరస్పందన తక్కువే అని చెప్పాలి.
వైరస్ తీవ్రత గురించి వింటున్నప్పటి నుంచీ, ప్రత్యక్షంగా ఏం చేయాలి అనేది ఎవరికీ తోచలేదు. అప్పుడప్పుడే, చేతులు పదేపదే శుభ్రం చేసుకోవాలి, మొహానికి మాస్క్ పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలి వంటి వ్యక్తిగత జాగ్రత్తలు రావటం మొదలయింది.
మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల వ్యక్తుల ఐక్యకార్యాచరణ (డబ్ల్యుటివో జెఎసి) సభ్యులుగా, మార్చి మొదటివారంలోనే వివిధ ఉద్యమ, స్వచ్చంద సంస్థలతో, వ్యక్తులతో ప్రజలకు అవగాహన కల్పించడంలో ఈ విషయమై ఏమన్నా చేయగలుగుతామా అని మాట్లాడుతూ వస్తున్నాము కానీ ఏదీ కార్యాచరణ లోకి రాలేదు. వ్యక్తిగత జాగ్రత్తలు చెప్పటం వరకే పరిమితమయ్యామనిపిస్తోంది. వ్యవస్థగా వైద్యపరంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్మాణాత్మకమైన అంశాల మీదకు చర్చ వెళ్లలేదు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు 2018 లో డబ్ల్యుటివో జెఎసి గా అనేక అంశాల మీద ఒక ప్రణాళిక ను విడుదల చేశాం. ప్రతి రాజకీయపార్టీ ముఖ్యులను ప్రత్యక్షంగా కలిసి అందించాం. అందులో ప్రధానమైన అంశం ప్రాధమిక ఆరోగ్యం. ఈ విషయంలో రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన విధానపరమైన అంశాలు. వాటిని ఏ రాజకీయ పార్టీ కూడా ముఖ్యమైన అంశంగా భావించలేదు. అధికారంలోకి వచ్చిన పార్టీ వాటిని పట్టించుకోలేదు. నిజంగా పట్టించుకుని వుంటే ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా తట్టుకోగలిగే వ్యవస్థ మనకు ఏర్పడి వుండేదనటంలో సందేహం అక్కరలేదు.
అయితే, ప్రభుత్వం ఏ రకమైన ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రకటించిన లాక్ డౌన్ పెను సామాజిక సంక్షోభం లోకి దారి తీసింది. ఆరోగ్య రంగంలో రావలసిన పౌర కార్యాచరణ కన్నా ఊహించని ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్న వూపిరాడనివ్వలేదు. పరిమితులను, పరిస్థితులను అతి తొందరలోనే అధిగమించి, మార్చ్ మొదటివారం నుంచీ ఇప్పటివరకూ హైదరాబాద్ నగరంలో అత్యంత ముఖ్యమైన సామాజిక కార్యాచరణ వ్యక్తులుగా, చిన్నచిన్న పరిమిత గుంపులుగా ప్రారంభమయ్యి ఒక సమూహంగా మారింది. వ్యక్తులుగా, సంస్థలుగా నిరంతరాయంగా కొన్నివందల మంది శ్రమకోర్చి పనిచేశారు. కోవిద్ వైరస్ అదుపుకోసం ప్రభుత్వం ప్రకటించిన టోటల్ బంద్ నుంచీ ఇంకా కొనసాగుతున్న లాక్ డౌన్ ల వల్ల ఉత్పన్నమైన అనేక సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పౌర సమూహాలుగా పరిష్కారాలు వెతకటం, ప్రభుత్వానికి వివిధ పరిష్కారాలు సూచిస్తూ, అవసరమైనప్పుడు ప్రశ్నిస్తూ, న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తూ బాధిత వలస కార్మికుల శ్రేణులకు, వివిధ సమూహాల ప్రజలకు బాధ్యతాయుతంగా మద్దతుగా నిలబడటం వరకూ అనేక ప్రజాస్వామిక సామాజిక కార్యాచరణలు దీనిలో వున్నాయి. ఆహారం, రేషన్, షెల్టర్, రవాణా, ఆరోగ్యం ఇలా ఎన్నో అంశాలలో ఈ ప్రజా సమూహాల కార్యాచరణ ప్రత్యామ్నాయ వ్యవస్థగా పనిచేసింది. వాస్తవానికి ఎన్నో వనరులతో పాటు ఎంతో విస్తృతమైన యంత్రాంగం వున్న ప్రభుత్వం చేసిన దానికన్నా మిన్నగా ఈ పౌర సమూహాలు పనిచేశాయి. ఇంకా చేస్తూనే వున్నాయి.
తొలిఅడుగులు:
‘ప్రజలందరి ఇండ్ల నుంచీ, వీధుల నుంచీ ప్రతిరోజూ చెత్తను తీసేసే పారిశుద్ధ్య కార్మికుల సేవల పట్ల సమాజానికి ఏమీ గౌరవం వుండదు, పైగా వారంటే ఒక చులకన కూడా వుంటుంది. వీరికి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు చెప్పటం, వైరస్ గురించి అవగాహన కల్పించడం మన బాధ్యత’ అంటూ వసుధ రంగంలోకి దిగింది. తమ కాలనీలోకి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు చేతులకు వేసుకునే గ్లోవ్స్ కొని ఇవ్వటం మొదలు పెట్టింది. దాదాపు జంటనగరాల్లోని అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుల నివాస ప్రాంతాలకు వెళ్లి, చేతికి వేసుకునే గ్లోవ్స్ ఇవ్వటమే కాకుండా వాటిని ఉపయోగించాల్సిన విధానం, వైరస్ సోకకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తూ వెళ్లింది. నా పనిలో భాగంగా అవగాహన కోసం వ్యాసాలూ రాయటంతో పాటు, శానిటైసర్లు మార్కెట్లో కొనడం కంటే మనమే తయారుచేస్తే, మాస్కులు కుట్టిస్తే ఎలా వుంటుందనే ఆలోచన చేసి తెలంగాణ గృహకార్మిక యూనియన్ వారితో అవి తయారుచేయించే పనితోపాటు, అన్ని సంస్థలను ఒక దగ్గరకు తీసుకువచ్చేపనిలో నేను నిమగ్నమయ్యాను . సునీత, తేజస్విని కూడా వారుండే ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులకు గ్లోవ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ముందు వందల్లో కొన్న గ్లోవ్స్ కొన్ని రోజులు గడిచేటప్పటికీ వేలల్లోకి మారాయి. కోవిద్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంగ్లీష్ లో వివరించే కరపత్రాన్ని ఆషా అనువాదం చేసింది. ఈలోపల తెలంగాణ ప్రభుత్వం మార్చి 15 నుంచీ 31 వరకూ రాష్ట్రమంతా వాణిజ్య కార్యక్రమాలను, ప్రజా రవాణాను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది.
మొదటి రోజునుంచే 65 సంవత్సరాల ఖలీదా పర్వీన్ తన ఇంట్లోనే భోజనం వండి రోడ్డు మీద అవసరమున్నవాళ్లకు అందించడం ప్రారంభించారు. ‘నేను మీ కిచెన్ కు మద్దతు’ అంటూ కొండవీటి సత్యవతి ఆర్థికంగా ఓచెయ్యి తోడు వేసింది. అలా, ఖలీదా నిర్వహించిన కిచెన్ రంజాన్ పండుగ వరకూ నిరంతరాయంగా నానల్ నగర్లో నడుస్తూనే వుంది. ఆ తర్వాత కూడా అవసరమైనప్పుడు ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఆవిడ సిద్ధమైపోతున్నారు. తన ఈ ప్రయత్నం గురించి చెబుతూ, “ నడుచుకుంటూ వెళ్తున్నవలస కార్మికులను చూసిన వెంటనే, కూలి పనులు లేకపోతే వీరి పరిస్థితి ఏమిటి, కుటుంబంలో ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులూ వుంటారు, హోటల్స్ వుండవు, ఇలాంటి సమయంలో వీరికి ఆహారం ఎలా అనే ఆలోచన వచ్చి వెంటనే కొంతమందికి వంట చేయడం మొదలుపెట్టాం నేనూ మా అమ్మాయి. మాఇంటి చుట్టుపట్ల వుండే విద్యార్థులు కూడా హోటల్స్ మూసేయడంతో ఇబ్బందులు పడటం నా దృష్టికి వచ్చింది. హైదరాబాద్ లో ఇలా చాలా మంది వుంటారు కదా, ఏం చేయగలుగుతాం అని ఆలోచించి ‘నేను ఇలా మొదలు పెట్టాను, ఎవరైనా సపోర్ట్ చేస్తే ఈ ప్రయత్నం కొనసాగిస్తాను’ అని ఫేస్స్ బుక్ లో పోస్ట్ చేశాను. చాలామంది స్నేహితులు స్పందించారు. దానితో మా కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం అయింది. ప్రభుత్వం లాక్ డౌన్ పెంచుకుంటూ పోవడంతో మేమూ మా కమ్యూనిటీ కిచెన్ ని కొనసాగిస్తూ వెళ్ళాము. మొత్తం అరవై నాలుగు రోజులు వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరాశ్రయులకు ఆహారం అందిస్తూ వెళ్ళాం. కొద్దిరోజుల తర్వాత హోటల్స్ లో వంట పనిచేసే వొరిస్సా కార్మికులు కొందరు ముందుకు వచ్చి వంట పనిలో బాధ్యత కూడా తీసుకున్నారు. అనేక కుటుంబాలకు రేషన్ కూడా అందించడానికి ప్రయత్నం చేశాము. ఎంతోమంది స్నేహితులు అనేక విధాలుగా ఈ పనిలో మద్ధతు అందించారు. మొదట్లో పోలీసులు కొంచం దురుసుగా వున్నప్పటికీ, ఆ తర్వాత వారే ‘మేడం, ఫలానా ప్రాంతంలో భోజనం అవసరం వుంది, ఇవ్వగలుగుతారా’ అంటూ అడగటం మొదలు పెట్టారు. మా వైపు నుంచీ దగ్గర దగ్గర నాలుగు వందల మందిని వాళ్ల స్వంత ఊర్లకు చేర్చటానికి సహాయం అందించగలిగాము” అని వివరిస్తూ, “ ఇలా సహాయం చేయటం పుణ్యం కోసం కాదు, మనకోసం శ్రమించిన వారికి మనం బాధ్యతగా చేయగలిగిన పని చేయటం’ అన్నారు.
ఆ తర్వాత, మా దృష్టికి వచ్చిన అంశం గృహకార్మికుల సమస్య. వారిని పనిలోకి రాకుండా ఆపేయడమంటే వారు పనిలోకి రానిరోజులకు జీతం ఇవ్వనట్లే. తక్కువ వేతనాలతో పనిచేసే ఈ సమూహం మీద ఇది మరింత ఆర్థికపరమైన భారం మోపి అప్పులపాలు చేస్తుంది. సిస్టర్ లిజీ ఈ సమస్యను డబ్ల్యుటివో జెఎసి ముందుకు తీసుకురావటంతో, గృహకార్మికులకు పూర్తి జీతం చెల్లించాలనే డిమాండ్ తో ప్రభుత్వానికి తొలి మెమొరాండం ఇచ్చాం.
మరో ముఖ్యమైన అంశం ట్రాన్స్ జెండర్ సమూహాలు. హైదరాబాద్లో వుండే ట్రాన్స్ జెండర్ సమూహ సభ్యులకోసం ఆన్ లైన్ లో విరాళాలు సేకరించే ‘కెట్టో’ వేదిక ద్వారా డబ్ల్యుటివో జెఎసి నుంచీ ఒక కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని రచన ముద్రబోయిన, మీరా సంఘమిత్ర, మాల, తేజ్, సునీత , వసుధ, ఆదిత్య బాధ్యులుగా మరికొంతమంది కలిసి పనిచేయటం ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు విరాళాలు సేకరించి రెండువందలయాభై మందికి తక్షణ సహాయం అందించగలిగాము. దీనితో పాటు, ప్రత్యేకంగా కోవిద్ సమయంలో జెఎసి నుంచీ ట్రాన్స్ జెండర్ సమూహాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాలపై స్పష్టమైన డిమాండ్లతో మెమొరాండం పంపించాము.
ఈ ప్రయత్నం గురించీ వివరిస్తూ రచన “లాక్ డౌన్ వల్ల ట్రాన్స్ జెండర్ వ్యక్తులు మూడు రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. పనిలేకపోవటం అనేది ప్రధాన సమస్య. ప్రధానంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు బిక్షాటన, సెక్స్ వర్క్ మీదే ఆధార పడతారు. అవి ఆగిపోయాయి. దాచుకున్న కొద్ది డబ్బులు కూడా అయిపోయాయి. రోజువారీ అవసరాలకి కూడా చాలా కష్టమయిపోయింది. ఎవరికీ కూడా రేషన్ కార్డు లాంటివి వుండవు. ఇది చాలా సమస్య. కోవిద్ సమయంలో భౌతిక దూరం పాటించడం అనేది ముఖ్యమనుకున్న తర్వాత సెక్స్ వర్క్ చేయటం అనేది అసాధ్యం. స్పర్శ అనేదే దానిలో ముఖ్యమైన అంశం కాబట్టి. తొంభై శాతం మందికి ఆదాయం ఆగిపోయింది. ఆర్ధికకార్యకలాపాలు అన్నీ ఆగిపోవడంతో భిక్షాటన అనేది సాధ్యం కాదు. బయటికి వస్తే కోవిద్ వస్తుందేమో అని భయం. ఇంకో పక్క ఆకలి. మరో ప్రధానమైన అంశం ఆరోగ్యం. డయాబెటిస్, థైరాయిడ్, బిపి వంటి సమస్యలకు మందులు వేసుకోవటం అనేది చాలా ముఖ్యం. వాటికి సమస్య వచ్చింది. అలానే అనేకమందికి ట్రాన్సిషన్ జరుగుతూ వుంటుంది కాబట్టి హార్మోనల్ మందులు అవసరం అవుతాయి. సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం వుంటుంది. మధ్యలో ఆపితే శారీరికంగా భరించలేని ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది హెచ్ఐవి పాజిటివ్ ఉంటారు. వారికి ఎఆర్టి మందులు వాడాల్సి వుంటుంది. ఇవి ప్రభుత్వమే ఇస్తుంది. కానీ రోజూ తప్పనిసరిగా వాడాల్సిన మందులు కొనుక్కునే పరిస్థితి లేకపోయింది. పని లేకపోతే ఆదాయం వుండదు. ఆదాయం లేకపోతే ఆహారం, ఆరోగ్యం రెండూ వుండవు. ట్రాన్స్ జెండర్ల పరిస్థితి మరీ సమస్యాత్మకం. సొంత ఇళ్లు వుండవు. అద్దెలు మిగిలిన వాళ్ల కంటే ఎక్కువ పెట్టాలి. డబ్ల్యుటివో జెఎసి నుంచీ సహాయం అందించడానికి ఒక ప్రయత్నం చేసాము. అలాగే వేరే ఎన్జీవో ల నుంచీ కూడా సహకారం తీసుకుని చాలామందికి రేషన్, మందులు అందించగలిగాము. హైదరాబాద్ నగరంలో ప్రతిఒక్కరికీ రేషన్ తీసుకెళ్లి అందించడంలో మా సమంతా ఎంతో పని చేసింది. తను ఆటో నడుపుతుంది. తన ఆటోలోనే అందరి ఇళ్ళకు వెళ్లీ అందించాము. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల గురించి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము కానీ, వాస్తవ రూపంలోకి రావటానికి ఎన్నో రకాల సమస్యలు వున్నాయి. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, మాకు గౌరవప్రదమైన ఉపాధి, విద్య, ఆరోగ్య అవకాశాలు కల్పించండి, కానీ మేము అడగని షెల్టర్ హోముల వైపు మమ్మల్ని నెట్టాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు” అని తెలిపింది.
కొంతకాలం తర్వాత ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందించాలని కోరుతూ ఆర్టిఐ యాక్టివిస్ట్ వైజయంతి వసంత హై కోర్ట్ లో వేసిన ప్రజాప్రయోజన వాజ్యంతో ప్రభుత్వం నుంచీ కొంత కదలిక వచ్చింది.
మా జెఎసి నుంచీ పడిన తొలి అడుగులు ఇవి.
(ఇంకా వుంది..)
Great Service 👍
చాలా బాగా వ్రాశారు షాజియా
Ashalata
ప్రభుత్వం చేసిన దానికన్నా మిన్నగా…!
సజయ. కె సజయ. కె
పౌర సమూహాల పోరు-
ఊహించని ఒక ఆరోగ్య విపత్తు వస్తే దానిని ప్రభుత్వాలుగా, పౌర సమూహంగా ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో మన దేశానికి ఏమాత్రం అవగాహన లేదని ‘కరోనా వైరస్’ రుజువుచేసింది.
కె సజయ గారు
మీ వ్యాసంలో మీరు వ్యక్తీకరించిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ, దోపిడీకి మారుపేరైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,
ఈనాడు కరోనా వైరస్ ప్రపంచంలోని ప్రగతిశీల మేధావులకు, బుద్ధి జీవులకు, ప్రపంచ వామపక్ష పార్టీల ముందు ఎన్నో క్లిష్ట సమస్యలను ముందు పెడుతూ, అంతేకాదు సింబాలిక్గా కరోనా అంటుంది కదా ప్రజలు నా వల్ల చనిపోవడం లేదు, పాలకుల నిర్లక్ష్యం పాలకుల అవినీతి పాలకుల దోపిడీ విధానాల వల్ల సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల చనిపోతున్నారు,నా పేరు తో డ్రగ్ మాఫియా లక్షల కోట్ల వ్యాపారం ప్రారంభిస్తుంది, నేను ఒకే ఒక్కరికి తల ఒగ్గు తాను వాళ్లు కమ్యూనిస్టులు,, ఇప్పటికైనా గ్రహించండి , 1930 నాటి చారిత్రక సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి, ఫాసిస్ట్ పాలకుల వైపు ఉంటారా కమ్యూనిస్టుల వైపు నిలబడతారా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు , మేధావులు కళాకారులు కమ్యూనిస్టుల వైపు నిలబడి పోరాటం చేసి తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారు, మళ్లీ ఆ సందర్భాన్ని గుర్తు చేయడానికి ఈ ప్రపంచానికి కరోనా వైరస్ రూపంలో మీ ముందు నిలబడ్డాను ఆలోచించండి ఆలోచించండి, దోపిడీ పాలకులతో రాజీ పడతారా, లేఖ కమ్యూనిస్టు సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంఘటిత శక్తితో ఐక్య పోరాటంతో, దృఢసంకల్పంతో పోరాడండి అంటూ కరోనా వైరస్ తాత్విక పరంగా తెలియజేస్తుంది. అని నేను భావిస్తున్నాను.
Freedom for All Political Prisoners in India!”
Down down Indian criminal government
మీ అందరి సేవలు కరోనా కష్టకాలంలో సంస్తలుగా వ్వక్తులుగా మానవీయా కోనంలో మీరందరు చేసీన సేవలు మరువలేనివి మీకు సహకరించిన వారందరికీ పేరు పేరునా దన్యవాదములు మీరు చేసినా మంచి పనిని మా కొరకు రిపోర్ట్ గా రాసి సజయ గారు చక్కగా తెలియజేసినారు
త్యాంక్యు ఆల్ జై బీంమ్ పాలడుగు మేరిమాదిగ 9848148259
Amazing and my kudos to your great service..
ప్రభుత్వాలు లేక పోయినా పర్వలేదు. ప్రజా సంఘాల వలన ఆ గేప్ భర్తీ అయినట్లుగా ఫేస్బుక్ ద్వారా తెలియవచ్చింది. ఇది ఎంతో సంతోష పడాల్సిన అంశం. దిక్కు మొక్కు లేని దీనులకు ఎంతోమంది ఆదుకొనే మానవతా వాదులు ఉన్నట్లు బరోస ఇచ్చారు. ఇందుకు మనుషులుగా మనమంతా సంతోష పడాలి.
నిజమే ప్రభుత్వం కన్నా మిన్నగా చేసిన వీరందరూ ఎంతో సహాయ పడ్డారు ముక్యంగా వలస కార్మికులకు. ప్రభుత్వాలన్నీ (కేంద్ర , రాష్ట్ర ) సిగ్గుపడలి. పెరుపేరునా వీరందరికీ మనం అభినందనలు చెప్పాలి.
Great services and humanity 🙏🙏🙏
చాలా బాగా చేశారు మీరు