చాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న!
వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు వేసుకుంటూ వస్తారు?
చెప్పడం కష్టమే!
కాని, మన చదువు అనుభవాలను నెమరేసుకుంటూ ఓ పది నిమిషాలు సాలోచనగా కూర్చున్నప్పుడు వొక్కో రచయితా వొక్కో రచనా వొక్కో మజిలీలా కనిపిస్తాయి. కొన్ని మజిలీలు మనల్ని విస్మయంలో పడేస్తే, ఇంకా కొన్ని మజిలీలు ప్రశ్నలవుతాయి. ఇంకా కొన్ని జవాబులవుతాయి. మాలతి చందూర్ ఏదీ కాదు! అసలు ఆమె రచనలు నేనెప్పుడూ సీరియస్ గా చదవలేదు. ఆమెని నేను సీరియస్ రచయిత్రిగా ఎప్పుడయినా తీసుకున్నానో లేదో తెలీదు. దానికి బలమయిన కారణం వొక్కటే: అసలు సాహిత్యాన్ని వొక సీరియస్ వ్యాపకంగా తీసుకోని కాలం నించీ నేను ఆమె రచనలు చదువుతూ ఉండడమే!
కాని, ఆశ్చర్యం ఏమిటంటే, జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె రచనలు ఎదో వొకటి చదువుతూనే వున్నా. వొక రచయితని ఇన్ని దశల్లో ఇన్ని వయసుల్లో చదువుతూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
2
నేను మిడిల్ స్కూల్ లో – అంటే ఆరో తరగతి- చదువుతున్న రోజుల్లో మా అమ్మ గారు రంగనాయకమ్మగారికి వీరాభిమాని. రంగనాయకమ్మ రచనలన్నీ ఆమె మళ్ళీ మళ్ళీ చదివేది. ‘ఆ పుస్తకంలో ఏముంది రెండో సారి చదవడానికి ?’ అని నేను అడిగినప్పుడల్లా నాకు అర్థమయ్యే భాషలో కథలాంటిది ఎదో చెప్పేది. కాని, వాటి మీద నాకు ఆసక్తి వుండేది కాదు. నాకు నాటికల పిచ్చి వుండడం వల్ల కేవలం నాటికల పుస్తకాలే చదివే వాణ్ని ఆ రోజుల్లో! అవి చదవడానికి బాగుండేవి. పైగా, ఆ డైలాగులు కొట్టుకుంటూ తిరిగే వాణ్ని.
ఇంకో వేపు మా అమ్మగారు మంచి వంటలు చేసేది కాబట్టి, ఎక్కువ సమయం నేనూ అమ్మా వంట గదిలో గడిపే వాళ్ళం. అలా వంటల మీద ఆసక్తి పెంచుకుంటున్న రోజుల్లో ఉన్నట్టుండి వొక రోజు మా ఇంట్లో-వంట గదిలో- ‘వంటలు- పిండివంటలు’ పుస్తకం ప్రత్యక్షమయింది. మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా ఆసక్తిగా చదివిన తొలి పుస్తకాల్లో ఇదీ వొకటి అని ఖాయంగా చెప్పగలను. ఈ పుస్తకం ఎంత ఉపయోగంలో పెట్టానంటే, ఏడాది తిరిగే సరికి నూనె, కూరలూ, పసుపు మరకలతో ఈ పుస్తకం ఇక చదవడానికి వీల్లేకుండా పోయింది. నాన్నగారు బెజవాడ వెళ్తున్నప్పుడు పనిమాలా చెప్పే వాణ్ని “ మాలతి చందూర్ పుస్తకం ఇంకో కాపీ తీసుకు వస్తారా?” అని!
అలా ప్రతి ఏడాది ‘వంటలు-పిండి వంటలు’ పుస్తకం కొత్త ఎడిషన్ మా ఇంట్లో చేరేది. అది చదవడం వల్ల నాకు జరిగిన లాభం ఏమిటంటే, రెండు వందల పేజీల పుస్తకం ఏదన్నా అలవోకగా ధీమాగా చదివేయడం! అది ‘చందమామ’ చదివే అనుభవం కన్నా భిన్నమయింది నాకు – మెల్లిగా నా చేతులు మా అమ్మగారి పుస్తకాల మీదకి మళ్ళాయి. నాటికలే కాకుండా, కథలూ నవలలూ చదవడం మొదలెట్టాను. అవి చదవడం మొదలెట్టాక మాలతి చందూర్ ‘వంటలు- పిండివంటలు’నా పుస్తక ప్రపంచంలోంచి నిష్క్రమించింది.
౩
ఏడో తరగతిలో మేం పట్నం- అంటే ఖమ్మం- చేరాం. కాన్వెంటు చదువు నాకు పెద్ద కల్చర్ షాక్. మిగతా పిల్లలు వాళ్ళ ఇంగ్లీషు పలుకులు వింటున్నప్పుడల్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్! అసలు నాకేమీ తెలియదు, ఎలాగయినా సరే ఈ లోకాన్ని ఉన్నపళాన అర్థం చేసేసుకోవాలి అని ఆబ. తెల్లారేసరికి మంచి ఇంగ్లీషు మాట్లాడేయాలి, క్లాస్ మేట్ల మైండ్ బ్లాంక్ అయిపోవాలి అని తీర్మానించుకున్న రోజుల్లో కనిపించిన ఇంగ్లీషు పుస్తకమల్లా చదివేయడం! పిచ్చి పట్టినట్టు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకాన్ని మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేయడం…శంకరనారాయణ నిఘంటువులో రోజూ కొన్ని పేజీలు బట్టీ కొట్టడం!
నా అవస్థలు చూసి నాకే అవస్థగా వుండేది. అప్పుడు దొరికింది స్వాతి మాసపత్రిక! అందులో మాలతి గారి కెరటాల్లోకి దూకేసాను. మొదటి సారి చదివిన ఇంగ్లీష్ నవల ‘ of human bondage.’ ఆ నవల చదవడానికి ముందు మాలతి గారి వ్యాసం చదివి, అందులో events అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని, ఆ పాత్రల పేర్లు కాగితం మీద తెలుగులో రాసుకొని, ఇంగ్లీషు నవల చదవడం! ఇదీ సాధన! అలా మాలతి గారి సపోర్టుతో ప్రతి నెలా వొక ఇంగ్లీషు నవల చదవడం, ఆ నవల గురించి ఇంగ్లీషులో సమ్మరీ రాసుకొని, కొన్ని సార్లు మాలతి గారి కెరటాల వ్యాసాన్ని నా బ్రోకెన్ ఇంగ్లీషు అనువాదం చేసుకోవడం ….అలా, ఏడాది తిరిగే సరికి మాలతి గారు నా చేత పన్నెండు నవలలు చదివించారు. డికెన్స్, థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్, వర్జీనియా వూల్ఫ్….ఇలా నా బుర్ర నిండా ఇంగ్లీషు పేర్లు!
ఈ క్రమంలో మాలతి గారు నాకు నేర్పిన పాఠం: జ్ఞానానికి భాష అడ్డంకి కాదు- అని! ఆమె ఎంత కష్టమయిన నవల అయినా సరే, అతి తేలికయిన భాషలో చెప్పేస్తుంటే, అంత లావు లావు నవలలు కూడా ‘వీజీ’ అయిపోయేవి. పైగా, ఆ పిచ్చి అవేశాల ఉద్వేగాల టీనేజ్ లో ఆ చిన్ని వ్యాసాల గడ్డిపోచ పట్టుకొని ఎంత పొగరుమోత్తనంతో ఎంత గోదారి ఈదానో!
4
ఆ తరవాత మాలతి చందూర్ సొంత రచనలు ఏం చదివానో పెద్దగా గుర్తుండని స్థితి కూడా వొకటి వచ్చేసింది. పైగా, ఆమె ‘ప్రశ్నలూ జవాబుల’ శీర్షిక ఆవిడ పట్ల నా గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది కూడా! ఇంత చదువుకొని ఈవిడ ఎందుకిలా మరీ నాసిగా రాస్తారా అనుకునే రోజులు కూడా వచ్చేసాయి. సొంతంగా రాయడం ఎంత కష్టమో కదా అని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితి! ఆవిడే పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం అంతా చదివాక, ఆవిడ సొంత రచనలు మరీ అన్యాయంగా అనిపించడం మొదలయింది. చూస్తూ చూస్తూ ఉండగానే, నా చదువు పటంలోంచి మాలతిగారు నిష్క్రమించేసారు.
కాని, ఆమె ‘కెరటాలే’ తోడు లేకపోతే, నాకు ఈ మాత్రం ఇంగ్లీషు వచ్చేది కాదు. ప్రపంచ సాహిత్యం చదవాలన్న తపన నాలో పుట్టేది కాదు. కాని, నా ముందు పరచుకున్న ప్రపంచంలో మాలతి గారిని ఎక్కడ locate చేసుకోవాలో ఇప్పటికీ నాకు తెలియదు.
*
Yes sir.. కొన్ని రచనలు, కొందరు రచయితలు మనకు తెలియకుండానే మన మనసులపై ముద్రలు వేసుకుని ఉంటారు.
It is a great advanture afsar bhai, you are a living legend and knowledge icon in our age. Heart full congratulations Afsar bhai… Saleem.
ఆంగ్ల సాహిత్య ఆణిముత్యాలు పత్రికలు చదివే సామాన్య పాఠకులకు పరిచయం చేసిన ఘనత నిశ్చయంగా మాలతీ చందూర్ గారిదే. ఆ పరిచయం మీరన్నట్లు ఆంగ్ల సాహిత్యం పట్ల అభిరుచి కూడా కలిగించింది.
మీదైన శైలి లో బలే చెప్పారు మాలతి చందూర్ గారు మీచేత వంటలు పిండివంటలు నుంచి ఇంగ్లీషు పుస్తకాలు వరకు చదివించిన రీతి .
మీ కలం ద్వారా
మాలతీ చందూర్ గారి పుస్తకం ‘ వంటలు పిండి వంటలు’
మరో మారు గుర్తు చేసుకున్నానూ.అలాగే స్వాతి మాస పత్రికలో ఆంగ్ల నవలలు పరిచయం పట్ల నాకు అవగాహన వుంది.కాని వేల సంఖ్యలో పాటక ఆదరణ పొందిన ఆంధ్రప్రభ వారపత్రికలో ని,ప్రమదా వనం శీర్షికన,ప్రశ్న-జవాబులు నా బాల్యం నుండి నేను ఫాలో అయ్యాను.వయసులో మీ కంటే నేను చాలా పెద్దవాడిని. ఆ శీర్షిక ఎంతో విజ్నాన దాయకం గా
వుండేది. సామాన్య పాటకుడి స్థాయికి దిగి సరళమైన భాషలో
సమాధానం ఇచ్చేవారు. అలాంటి శీర్షికను మీరు తక్కువ చేసి రాయడం నాకు ఎందుకో నాకు రుచించ లేదు. మీ పాటి సాహితీ అనుభవం నాకు లేదు,అది వేరే విషయం! భారతి వంటి సాహిత్య పత్రికలు తప్ప మిగతా అన్ని పత్రికలు అన్ని స్థాయిల పాటకులను దృష్టిలో వుంచు కోవలసిందే. మాలతీ చందూర్ ప్రమదా వనం శీర్షిక గుర్తు చేసినందుకు మీకు ధన్య వాదాలు.
మాలతి చందూర్, గారి బుక్స్ పదిలం గా దాచు కొన్నాం . వంటింటి చిట్కాలు,.. వారివి చదివే ఆచరించే దాన్ని కొత్త గా వంట, నేర్చు కొనే ప్రయత్నం లో,, అందాలు, చిట్కాలు, పుస్తకం, పడిలేచే కెరటాలు, సదా, దగ్గర, ఉండేది, అప్పట్లో.. చెదలు పట్టి, ఇళ్ళు మారడం,వల్ల. విలువైన వారి సాహిత్యం ని పోగొట్టు కొన్నాం!
సాహిత్య ప్రపంచంలో అడుగుపెట్టిన అందరికి కలిగే అనుభవము అఫ్సర్ గారు. ఆ ప్రధమదశలో చదివి ఆరాధించిన నవల , పెరిగి అభిప్రాయాలు అభిరుచులు ఏర్పడిన తరువాత ,చిన్నప్పుడు చదివి ఆనందించిన నవలలు ఎంత పేలవంఅనిపిస్తాయో!! ఆమె స్వంత నవలలు చదవలేదు , అయితే ఆమె ఇంగ్లీషు నవలలు తెలుగులో పరిచయంచేసిన అన్ని వాల్యూమ్ లు చదివాను ఆశ్చర్యం అద్భుతం!!!
మాలతీ చందూర్ గారు మీ కలంలో, రాతలో ఎంతగా ఇంకిపోయారో,మిమ్మల్ని మరెంతగా ప్రభావితం చేశారో చెప్పకనే చెప్పారు, సార్! నిజానికి ఆవిడ సొంత రచనల కంటే ఆవిడ రాసిన “కెరటాలు ” చాలా మందికి స్ఫూర్తి దాయకమని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. మీరు ఎంతో నిజాయితీగా, స్పష్టంగా మాలతీ చందూర్ గారి గురించి రాసి, ఆవిడ గొప్పతనాన్ని మరోసారి చెప్పారు. మీ రచనా శైలిని మళ్లీ మాకు రుచి చూపించారు! ధన్యవాదాలు!!
అవునండీ, ఆమెకి ఒక ప్రత్యేక స్థానముంది మాలాంటి ఎంతోమంది హృదయాల్లో.
సాహిత్యం లో గొప్ప రచనలు ఉంటాయని మాలతి గారి వల్లే తెలిసింది. A great timely tribute to a wonderful person. Thank you very much.
Malathichandur maata aatunchitee mee charetra raachukunnattu yundi. Mee anubhavaalu Kavi charetra ayutundi kada afsar gaaru!
చాలా గొప్పగా రాశారు. “అవునూ, నాకూ ఇలాగే అనిపించింది” అని చదివిన చాలా మందికి అనిపించేలా
ప్రశ్నలూ జవాబులు శీర్షిక చదువుతూ ఉన్నపుడు, ఆమె జవాబుల కంటే నాకు “జనం ఇంత హెల్ప్ లెస్ గా ఒకరి అభిప్రాయాలు, సలహాల మీద ఎంతగా ఆధార పడుతున్నారా” అని దిగులుగా అనిపించేది
దానికి తోడు మొదట్లో ఆమె సలహాలు ఎదుటి వారి కోణంలో న్యాయగా ఉండేవి, రాను రాను ప్రతి జవాబులో మాలతీ చందూర్, సలహా ఇవ్వడం కంటే తీర్పులు ఇవ్వడం, వెటకరించడం ఎక్కువగా ఉండేది. “నన్ను అడగండ్ది” శీర్షికన స్వాతి వీక్లీలో జవాబులు ఇచ్చే నాటికి మరీ ఎక్కువై పోయింది.
జాగర్తగా పరిశీలిస్తే ఈ తీర్పులు ఆమె నవలల్లో కూడా కనపడతాయి. భూమి పుత్రి నుంచి, ఏమిటీ జీవితాలు నవల వరకూ. అప్పట్లో మనకి నచ్చాయంతే
,
కానీ మీరన్నట్టు పాత కెరటాలు మాత్రం మాలతీ చందూర్ అమోఘ కృషి
అలాగే వంటలు పిండివంటలు కూడా. పెళ్ళయ్యాక మొదట అర్జెంట్ గా, అవసరంగా కొన్న పుస్తకం అది 🙂
ఒక తరం చదువరులను ఎంతగానో ప్రభావితం చేసిన మాలతీ చందూర్ ను తెలుగు సాహితీ చరిత్రకారులు మరిచిపోయిన ఈ సందర్భం లో ఈ write-up ఎంతో విలువైనది.