విరసం – విప్లవ రచయితల సంఘం- కేవలం తెలుగు సాహిత్య జీవుల సమూహం కాదు. సామాజిక రాజకీయ ప్రజా జీవనంలో కొత్త భావనల వెల్లువ. ఈ వెల్లువని ఇప్పుడు 50 యేళ్ళ తరవాత యెలా చూడాలి? యే యే అంశాలు విరసం చరిత్రని ఇప్పుడు నిర్వచిస్తాయి? ఈ ప్రశ్నల వెలుగులో విరసం తరఫున పాణి – అఫ్సర్ తో చేసిన ఇంటర్వ్యూ ఇది.
- మార్క్సిస్టు సాహిత్య విమర్శలో విప్లవ సాహిత్య విమర్శ తీసుకొచ్చిన మార్పులను మీరు ఎలా విశ్లేషిస్తారు?
నేను ప్రధానంగా కవిని కాబట్టి, కవిత్వ పరమైన కోణం నించే మాట్లాడతాను. ఇప్పుడు నాకు అందుబాటులో లేదు కానీ శ్రీశ్రీ “మరో ప్రస్థానం” గురించి నేను 1980లలో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వ్యాసం రాసినప్పుడు చాలా మంది మండిపడ్డారు. శ్రీశ్రీ “మహాప్రస్థానం” ముందు “మరో ప్రస్థానం” యెంతా అని! మీరు మార్క్సిష్టు సాహిత్య విమర్శా, విప్లవ సాహిత్య విమర్శా అని అన్నప్పుడు వెంటనే నాకు అది గుర్తొస్తోంది. నేను విద్యార్థి రాజకీయాల్లో వున్నప్పుడు కూడా అందరూ శ్రీశ్రీ అంటే “మహాప్రస్థానం” అనే ఖాయంగా చెప్పేవాళ్లు. “కాదు. విప్లవ పరిభాష అనేది శ్రీశ్రీకి యేర్పడింది “మరోప్రస్థానం” లో మాత్రమే” అని చెప్పడానికి నేను చాలా పోరాడేవాణ్ణి. నిజంగానే పోరాడేవాణ్ణి.
శ్రీశ్రీలాంటి కవికి “మహాప్రస్థానం” నుంచి “మరో ప్రస్థానం” దాకా రావడం అంత తేలిక ఏమీ కాదు. అట్లాగే, మార్క్సిస్టు సాహిత్య విమర్శకి విప్లవ సాహిత్య విమర్శ దాకా రావడం కూడా! ఈ మార్పుకి క్రమ పరిణామమూ, వికసమూ వున్నాయి.
మొదటి మార్పు: ముందే చెప్పినట్టు పరిభాష. అభ్యుదయ వారసత్వం బలమైనదే కానీ, అది బలమైన ప్రజల పరిభాషని సాహిత్యంలోకీ, సాహిత్య విమర్శలోకీ తీసుకు రాలేకపోయిందన్నది నిజం. రెండు: సిద్దాంత పరమైన relevance స్థానిక పోరాటాల్లోంచి రావాలన్న పట్టింపు విప్లవ సాహిత్యం మొత్తంగా తీసుకొచ్చిన మార్పు. అది చాలా సహజంగానే సాహిత్య విమర్శలోకి కూడా ప్రవేశించింది. మూడు: ఇంత దూరం వచ్చాం కాబట్టి- 1970ల తరవాత యువతరం- కొంచెం గట్టిగా చెప్పాలనుకుంటే – ఎమెర్జన్సీ తరవాతి సాహిత్య తరానికి విప్లవ సాహిత్య విమర్శ అనివార్యమైంది. ఈ మూడు కారణాల చరిత్రని ఇంకా మనం స్పష్టంగా చెప్పుకోవాలి. స్పష్టంగా అనే కంటే స్ఫుటంగా చెప్పుకోవాలి.
- మొత్తంగా తెలుగు సాహిత్య విమర్శ ధోరణుల మీద దీని ప్రభావం ఏమిటి?
తెలుగు సాహిత్య విమర్శ ఇప్పటికీ కూడా కట్టుగొయ్యల బానిస. తనని తాను ఛాలెంజ్ చేసుకొని వెన్నెముకతో నిలబడే సాధికార political subjectivity దానికింకా యేర్పడలేదు. మనకి ప్రపంచం మీద వున్న ఆసక్తి స్థానికత మీద లేదు. అరువు వాదాల మీద వున్న ఆకర్షణ మన పల్లె నుంచి పుట్టే భావనల మీద లేదు. విప్లవ సాహిత్య వారసత్వం అట్లాంటి భ్రమల్ని కొంతవరకు బద్దలు కొట్టిందన్న నమ్మకం వల్ల మా రాజకీయ సాహిత్య తొలి రోజులు మేం అటు అడుగులు వేశాం. ఆ అడుగుల మీద నాకూ, మా తరానికి ఇప్పటికీ భరోసా వుంది. తెలుగు సాహిత్య విమర్శ కి కావల్సిన నిర్దిష్టతని అది అందించగలిగిందని అనుకుంటున్నా. ఈ విషయం నేను “ఆధునికత- అత్యాధునికత”లో కూడా గట్టిగా చెప్పానే అనుకుంటున్నా. అయితే, ఒక దశలో విప్లవ సాహిత్య విమర్శ కూడా కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించింది. కేవీయార్, త్రిపురనేని వంటి వారు భిన్నమైన విప్లవ సాహిత్య విమర్శ సంప్రదాయాలని నెలకొల్పారని నా అభిప్రాయం. వరవరరావు గారిలో ఆ రెండు సంప్రదాయాల మేలు కలయిక కనిపిస్తుంది. ఇప్పుడు వేణు, పాణి, డానీ, కూర్మనాథ్, వరలక్ష్మి, అరసవిల్లి, వర్మ, నారాయణ స్వామి లాంటి విమర్శకుల్లో ప్రధానంగా వరవరరావు గారి సంప్రదాయం నిలిచి వుందని కూడా అనుకుంటున్నా. ఇంకా కొత్త తరానికి వస్తే ఈతరం పొయెట్-క్రిటిక్స్ లో ఈ ధోరణి బలంగా విస్తరిస్తోంది.
- నిర్దిష్టంగా తెలుగు సమాజాల్లోని భావజాల క్షేత్రాల్లో విరసం తీసుకొచ్చిన మార్పులను ఎలా గుర్తించవచ్చు?
నిర్దిష్టతే ప్రధానమైన మార్పు. Paradigm shift అంటారే, అట్లాంటి మార్పు. అప్పటిదాకా భావజాలాలన్నీ పైనుంచి కిందకి వచ్చాయి. అంటే, from the above. యెక్కడో జరిగిన రాజకీయ సాంస్కృతిక మార్పుల్ని మనం స్వీకరిస్తూ వచ్చాం. తెలంగాణ సాయుధ పోరాటం తప్ప అభ్యుదయ సాహిత్య చరిత్రలోగానీ, భావజాలంలో గానీ నిర్దిష్టత వున్న సందర్భాలు అంతగా లేవు. తెలంగాణా సాయుధ పోరాటంలో కూడా కొన్ని అంశాలు- కులం, మతం- లాంటి నిర్దిష్టమైన అంశాలని అభ్యుదయ సాహిత్య వేత్తలు పట్టించుకోలేదు. ఆ విమర్శ విప్లవ సాహిత్య భావజాలం మీద కూడా వుంది కానీ, వున్నంతలో నిర్దిష్టమైన/ స్థానికమైన అంశాల మీద ఫోకస్ చేయడంలో విరసం సాయపడింది.
- విప్లవ సాహిత్య విమర్శకు ఒక సామాజిక తాత్విక రాజకీయ పునాది ఉన్నప్పటికీ విప్లవ విమర్శకుల్లో కూడా మీరు చూసిన ప్రత్యేకతలు ఏమిటి?
ఈ ప్రశ్నకి సమాధానం ఇంతకుముందు చెప్పినట్టున్నాను. విప్లవోద్యమానికి “ఒక సామాజిక తాత్విక పునాది” వున్నప్పటికీ, అక్కడి నించి వచ్చిన సాహిత్య విమర్శలో అది భిన్న రూపాల్లో విస్తరించింది. సిద్ధాంత నిబద్ధతని వొక్కొక్కరూ వొక్కో విధంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాటిని మనం reading practices అంటున్నాం. ఆ reading లోని భిన్నత్వం వేర్వేరు interpretations వైపు వెళ్లింది. అందుకే, త్రిపురనేని విమర్శ కొంతమందికి conventional గా అనిపిస్తుంది. అంత కరుకుదనం సాహిత్య విమర్శకి అవసరమా అన్న ప్రశ్న తలెత్తింది కదా! 1980లలో “సృజన”లో గాని, “అరుణ తార”లో గాని వేర్వేరు సందర్భాల్లో గాని త్రిపురనేని విమర్శ ధోరణి గమనించినప్పుడు రాజకీయ సిద్ధాంతానికీ, సాహిత్యానికీ మధ్య వుండాల్సిన dynamics గురించి చాలా సందేహాలు కలుగుతాయి. ముఖ్యంగా, సాహిత్యంలో కొత్త తరం తీసుకోస్తున్న మార్పుల్ని ఆయనలాంటి విప్లవ విమర్శకులు capture చేయలేకపోయారు. అది ప్రత్యేకత కంటే బలహీనతగానే చూడాలి. “రక్తస్పర్శ” (1985) లో వచ్చినప్పుడు కెవియార్ ఆ కవిత్వాన్ని వొక కొండగుర్తు అన్నారు. నా కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆయన “అఫ్సర్ హృదయం వుండాల్సిన చోటే వుందని” అన్నారు. అదే సమయంలో త్రిపురనేని భిన్నమైన కోణం నించి conventional గా విమర్శించారు. ఇవి రెండూ ఆయా వ్యక్తుల ప్రత్యేకతలో, బలహీనతలో కాదు. విప్లవ సాహిత్య శిబిరంలో వున్న రెండు ధోరణులుగానే ఇప్పటికీ నేను చూస్తాను.
- విమర్శ అంటే సామాజికత, తాత్వికత, సాహిత్యకతల విశ్లేషణ. విప్లవ విమర్శకులు ఈ పని ఎలా చేశారు?
విమర్శకి మీ నిర్వచనం బాగుంది. కచ్చితంగా అదే విమర్శ చేయాల్సిన పని. కానీ, ఒక సిద్ధాంత పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఆ మూడింటి balance అంత తేలిక కాదు. “విప్లవ విమర్శకులు” అని మీరు వాడుతున్న భావన యేదైతే వుందో, అది ఒక lump కాదు. దాన్ని గడ్డకట్టిన ఘనపదార్థం చేయడానికి కొంత ప్రయత్నం జరిగినా అది సఫలం కాలేదు. విప్లవ భావన అనేది విరసం కంటే విశాలమైందని నా కచ్చితమైన అభిప్రాయం. విరసం బయట వుండి విప్లవ సాహిత్య విమర్శ చేస్తున్న వాళ్ళని కూడా ఇప్పుడు విరసం సీరియస్ గా తీసుకోవాలి. అప్పటికి గాని, విప్లవ భావన broad spectrum తెలియదు.
- ప్రత్యేకించి సామాజిక శాస్త్ర పద్ధతులను విరసం సాహిత్య విమర్శలోకి ఎలా తీసుకొచ్చింది?
చాలా మంచి ప్రశ్న. నాలోపలి social scientist ముచ్చటపడే ప్రశ్న. తెలంగాణ సాయుధ పోరాటం వల్ల peasant movement అనేది ఏ rangeలో మాట్లాడవచ్చో తెలిసింది కానీ, సాహిత్య విమర్శ పరిధిలో అభ్యుదయ విమర్శకులు దాన్ని సరిగా పట్టుకోలేకపోయారు. దానికి కావలసిన training వాళ్ళకి లేకపోయింది. అట్లాంటి పక్వమైన training విరసం అందించిందని అనుకుంటున్నా. పీర్ల పండగ మీద నా ఇంగ్లీష్ పుస్తకం “The Festival of Pirs: Local Islam and Shared Devotion in South India”(2013) లో నాకు బాగా వుపయోగపడిన tools విరసం సాహిత్య విమర్శ వల్ల నేర్చుకున్నవే! ప్రధానంగా ఆ పుస్తకంలో మతం కన్నా రాజకీయ సామాజికత మీద నేను పెట్టిన వూనికలో ఆ ప్రభావం గట్టిగా కనిపిస్తుంది. వరవరరావు, సీవీ సుబ్బారావు, బాలగోపాల్ , రంగనాథాచార్యులు, కె. శ్రీనివాస్ లాంటి సాహిత్య విమర్శకులని ఈ వారసత్వం నుంచి మాత్రమే చూడగలం. ఇప్పుడు ఈ తరహా సాహిత్య సాంస్కృతిక విమర్శ ఇంకా అవసరం.
- ప్రజా పోరాట క్షేత్రంలో భాగమైన విప్లవ సాహిత్యోద్యమం కాల్పనికత-రాజకీయ నిబద్ధతకు మధ్య ఎలాంటి సమన్వయం సాధించిందనుకుంటున్నారు?
చాలా కష్టమైన process అది. విప్లవోద్యమం లోపల వున్న వాళ్ళూ, బయట వున్నవాళ్లూ ఒకే విధమైన సమన్వయం సాధించగలరని అనుకోలేం. అయితే, స్థూలంగా అట్లాంటి సమన్వయం అవసరం అన్న భావాన్ని విరసం పెంపొందించింది. అది విరసంలోపల వున్న వాళ్ళకే కాదు, బయట వున్న సాధారణ రచయితలకు కూడా అవసరమైన సమన్వయం. ఇప్పుడు విరసంలో వుండి బలమైన గొంతుకలుగా వినవస్తున్న చాలా మంది కవులూ రచయితలూ ఈ తోవలోకి ఎంతో సహజంగా ప్రయాణిస్తున్నారు. “అరుణతార”లో ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ప్రతి కొత్త గొంతుకా ఇది సాధించే క్రమంలో పదును తేలుతున్నారు.
- ఒక రచనలోని మానవ అనుభవం నుంచి సామాజిక వాస్తవికతను విప్లవ సాహిత్య విమర్శ ఎలా కాప్చర్ చేసింది?
ఇది కూడా అంతగా తేలికైన ప్రక్రియ కాదు. విప్లవ సాహిత్య విమర్శకే పరిమితమైందీ కాదు. నా మటుకు నేను ప్రతి రచనలోనూ ఇలాంటి tension ని అనుభవిస్తాను. అది సృజనాత్మక ప్రక్రియ అయినా, critical writing అయినా- ఇలాంటి ఒక awareness పెంచడంలో విప్లవ సాహిత్య విమర్శ పాత్రని మనం గమనించుకోవాలి. ఏ అనుభవమైనా దానికదే అంతిమం కాదనీ, అది భిన్న సామాజికతల సారాంశం అనీ అర్థమవడానికి విప్లవ సాహిత్య విమర్శ సాధనాలు సమకూర్చింది. 1970 నించీ మనం గమనిస్తూ వచ్చిన human experiences నిజంగా ఏ లోతుల్లోంచి పెల్లుబుకుతున్నాయో ఒక assessment ఇచ్చింది విప్లవ సాహిత్యమూ, అది అందించిన సాహిత్య విమర్శ. అయితే, దాన్ని ఏ మేరకు అందుకున్నామన్నది ఆయా invidividual writers ని బట్టీ, వాళ్ళ సామాజికతని బట్టే వుంటుంది. ముఖ్యంగా, స్థానిక పోరాటాలూ సంఘర్షణలూ వున్న చోట వాటి బలమేమిటో తెలిసి వస్తోంది. అదే విధంగా, ఇంకో వైపు నించి విప్లవ శిబిరాల్లో కూడా విడివిడి మానవ అనుభవాలు- అంటే, స్త్రీలూ, కులం, మతం, ప్రాంతం- లాంటివి సమాన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
*
చాలా మంచి ఇంటర్వ్యూ.
A critical perspective about contemporary litarary criticism …Sir..Nice one..
భిన్న సామాజికతల సారాంశం … ..అందుకేనేమో మీ రచనల్లో బలంగా కనిపిస్తుంది.
విలువైన interview.
భయ్యా దిల్ ఖుష్ హువా…
ఈ ఇంటర్వ్యూ లో చాలా విషయాలు తెలుసుకున్నాను.
వర్మ గారు రాసిన విమర్శలు ఎక్కడ దొరుకుతాయో చెప్పరా దయ చేసి
Interview, బాగుంది..!👍👌!
భావం దృష్ట్యా గొప్పదే గాని పాఠకుణ్ణి ఆకట్టుకునే ఆసక్తికర అంశం, శైలి విషయంలో అత్యంత బలహీనమైనది మరోప్రస్తానం. విరసం ప్రయాణం చక్కగా విశ్లేషించబడిన పైరచన లో “స్పష్టంగా అనేకంటే స్ఫుటంగా చెప్పుకోవాలి” అన్న వాక్యం అర్ధం కాలేదు.
విరసం పాణి గారూ!
విరసం వెల్లువని 50 యేళ్ళ తరవాత యెలా చూడాలి? యే యే అంశాలు విరసం చరిత్రని ఇప్పుడు నిర్వచిస్తాయి? మీద అఫ్సర్ గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ కి, మీ ఇద్దరకీ అభినందనలు.
యీ సందర్భం లో నాకు కలిగిన యీ క్రింది అధర్మ సందేహాలని మీ ముందు ఉంచుతున్నాను.
1) యే యే అంశాలు విరసం చరిత్రని ఇప్పుడు నిర్వచిస్తాయి? అన్న బలమైల ప్రశ్నని విప్లవ సాహిత్యం అంటే విప్లవవాద కవిత్వంగా …. తెలుగు సాహిత్య విమర్శ ధోరణులను విప్లవ సాహిత్య / మార్క్సిస్టు సాహిత్య విమర్శ గా మాత్రమే చర్చించటం విషయ పరిధిని కుదించటం లా లేదా ?
2) ప్రజా పోరాట క్షేత్రంలో భాగమైన విప్లవ సాహిత్యోద్యమం …. గురించి చెప్పుకోవాలంటే విరసం మార్గాన్ని ఎంచుకున్న దిగంబర కవులు, శివసాగర్, గద్దర్, వంగపండు, కలేకూరి లాంటి వాళ్ల ప్రస్థావన అక్కరలేదా?
3) భావజాల క్షేత్రాల్లో విరసం తీసుకొచ్చిన మార్పులను ఎలా గుర్తించవచ్చు? …. దళితవాదం ,స్త్రీవాదం, ముస్లిమ్ మైనారిటీ అస్తిత్వం, ఇతరేతర అస్తిత్వ వాదాలు విరసం ప్రేరణ తో కానీ విరసం నుండి విడివడి భిన్న రూపాల్లో విస్తరించింన పాయలుగా పరిగణించక్కరలేదా ?
4) విప్లవ రచయితల సంఘం (విరసం) సామాజిక, రాజకీయ, ప్రజా జీవనంలో కొత్త భావనల వెల్లువ గా గుర్తించినప్పుడు ….. కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, బీనాదేవి, రంగనాయకమ్మ, పతంజలి, పి.సత్యవతి నుండి ప్రగతీశీల నవలా రచయిత కేశవ రెడ్డి, అల్లం రాజయ్య, అట్టడుగు వర్గాల గాథలను హృదయాన్ని కదిలించగలిగేలా రాసిన కథకుడు అట్టాడ అప్పలనాయుడు ఎందరెందరి వల్లో సాహిత్యం తొక్కిన పుంతనలని వాటి ప్రభావాల గురించిన ప్రస్థావనే లేకపోవటం సమంజసమేనా ?
5) ప్రింటు మీడియా పరిమితులను అధిగమిస్తూ ప్రగతిశీల గళాలకు వేదికగా వచ్చిన, వస్తున్న అంతర్జాల పత్రికల పాత్ర ( సారంగ నుండి మరెన్నో ) గురించిన ప్రస్థావన ఎందుకు లేదు ?
“ప్రపంచం మీద వున్న ఆసక్తి స్థానికత మీద లేదు”. ఎంత గ్రహింపు ఉన్నా సహితీలోకం మిస్సవుతున్న మౌలిక భావనను ఇంటర్వ్యూ శీర్షికగా తీసుకోవడం బావుంది. కోన్ని పరిమితుల్లోనైనా ఇంటర్వ్యూచాలా బాగా వచ్చింది.