ప్రతీకాత్మక కథనాల వెన్నెల పడవ
కథలనిండా రాజ్యనిర్బంధమూ, ఎన్ కౌంటర్లూ, ఎన్నికల ప్రజాస్వామ్యమ్యంలోని దుర్మర్గాలూ చిత్రితమై వున్నా, ఎక్కడా ఆ జార్గాన్ కన్పించనే కన్పించదు.
పేరుకు దీన్ని వెన్నెల పడవ అన్నాడుగానీ, నిజానికిది లావానౌక. అది, వికృత విన్యాసాలు చేస్తూన్న వ్యవస్థనూ, దానితో తన పబ్బం గడుపుకొంటూ ఆ వికృతాలకు మరిన్ని చేరుస్తూన్న రాజ్యాన్ని చూస్తూ బధ్ధలవుతున్న లావా. ఆ లావా దేశకాల పరిణామాలను తనలో ముంచి కథారూపాలుగా మనకు దృశ్యమానం చేస్తుంది. ఆ మేరకు ప్రతి కథా ప్రతీకాత్మకమైనది. బాహ్యంగా కన్పించేదే కథగా అనుకుంటూ లోపలికి వెళ్తే గంధకం లాంటి కొత్త కథ ధ్వనిస్తుంది, ఆలోచనల్ని ఘాటెక్కిస్తుంది. అసలు రచయిత లక్ష్యమే అది. ప్రతి కథలోనూ కొత్త అర్థాలు చెప్పడం. కొత్త సందర్భాలను వివరించడం. కల్లోలకాల కథనాలు యెలా వుంటాయో చూపడం.
ఉదాహరణకు ఒక కథ, దాని పేరు ముసురు. ఇందులో ప్రొటాగనిస్ట్ వృత్తి రీత్యా విలేఖరి. పల్లె నుంచీ పట్నంలో వుంటున్నవాడు. బండి మీద ఆఫీసుకు పోతూ ఆకాశంలో దూదిపింజల్లాంటి మేఘాల్ని చూస్తూ నిట్టూర్చేవాడు. వాన కోసం చిన్నప్పటి ఆలోచనల్ని కెలుక్కునేవాడు. ఒక మధ్యాహ్నం ఓ పాప వ్యాన్ కింద పడి చనిపోతుంది. ఆ సాయంత్రం రాక రాక మంచి వాన కురుస్తుంది. ప్రొటాగనిస్ట్ తాను ఆనందపడి , వానపడ్డందుకు అందరూ స్పందించాలనుకుంటాడు. మొదట తనింట్లోనే ఆ సూచనలేమీ కన్పించవు. ఉదయం బాస్ నుంచి ఫోనొస్తుంది. నిన్న చనిపోయిన పాప గురించి హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీ చేయమని. ప్రతిదాన్నీ వార్త చేయడమనే యాంత్రికత కమ్ముకుంటుంది. వార్త కవరేజీ కోసం పొద్దున బస్సులో బయల్దేరితే, తుంపర పడతానే వుంది. అతనికేమో వుత్సాహంగా వుంది, స్కూల్ లో పిల్లెవరూ దాన్ని పట్టించుకోవడమే లేదు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెంటనే కోపమూ వస్తుంది. పిల్లల్లోనేమో దిగులు. వారి కళ్ళల్లో కన్నీరు. అప్పుడు అతడికి గుర్తొస్తుంది తనెందుకు స్కూల్ కు వచ్చాడో. పాప దుర్మార్గంగా చనిపోతే, హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీ కోసం వచ్చాడు. యెదురుగా పిల్లలు నిన్నటిదాకా తమతో ఆడిన పాడిన నేస్తం కనుమరుగైందనే దుఖ్ఖంలో తడిసివున్నారు. అప్పుడు అనిపిస్తుంది అతనికి రాత్రి నుంచి తాను చూస్తున్నది వాననీటినా, లేక రోదిస్తున్న తలిదండ్రుల, పిల్లల కన్నీటినా, అని. మనక్కూడా అంతా తేటతెల్లమైతుంది. చదివాక ఆ విలేఖరి యెంత అమానవీకరణకు గురయ్యాడో కదా యీ వ్యవస్థ వల్ల అనిపిస్తుంది మనకు .
ఇంకో వుదాహరణ, మన నాయకులు జనజీవనస్రవంతి లో కలవమని పిలుపులిస్తూంటారు. ప్రతిదాన్నీ ప్రాక్టికల్గా చూసి పిల్లలకు చెప్పాలనుకునే ఒక టీచర్, ఆ జనజీవనస్రవంతి యెలా వుంటుందో చూద్దామని బయలుదేరుతాడు. యెక్కడ వెతికినా, యెంత వెతికినా ప్రజాస్వమ్యంలో అలాంటిదేదీ కన్పించదు రాజుగారి బట్టలు లాగా, ఇట్లా యీ కథకుడు రూపొందించే లావా ప్రవాహాల్ని యెన్నో వుదాహరణల్లో చూడొచ్చు.
కె. వీ కూర్మనాథ్, క్షుద్రక్రీడ కథ (లగుడు బారసిజాంబ్రీ పేరుతో) రాసిన కథాకాలం నుండీ ఆ కథ కల్పనాసామర్థ్యం నుండీ యేమాత్రమూ పక్కకు జరగలేదు.రాజ్యస్వభావమూ, ప్రజాస్వామ్యం పేరుతో అదిచేసే నిర్వాకాలూ, రాజ్యనిర్బంధమూ యేమీ మారనందున “e. కుక్క” (2000-2005) సంపుటి నుండి వెన్నెల పడవ (2006-2018) కథల కాలం దాకా యింకా ఘోరంగా కొనసాగుతున్నందున నిబధ్ధత గల రచయితగా, ప్రత్యామ్నాయ పంథాగల రచయితగా కూర్మనాథ్ ఆ రాజ్యానికి, ఆ పాలక వర్గాలకూ, ఆ వ్యవస్థకూ బట్టలు లేవనీ, అవి రాజుగారి బట్టలనే నగ్న సత్యాన్ని చెప్పే, ఆదివాసీ లగుడు బారసిజాంబ్రీ గానే వుండిపోయాడు. ఇంకా వెనక్కు వెళ్లి 1642. క్రీ. శ లో గోల్కొండ (హైదరాబాద్) ను సందర్శించిన టావెర్నియర్ ను ఆవాహన చేసుకొని, అతని మునిమనవడిని తెలుగు నేలమీదకి రప్పించీ క్రీ.శ 2642 నాటిక్కూడా యీ వ్యవస్థ యేం మారిందో చూసుకోమని ఛాలెంజ్ చేస్తాడు. అంతెందుకు ఒక జర్నలిస్టు దినవారీ బతుకులోనీ చిత్తడి చిత్తడి లాంటి వొత్తడిని వర్తమాన నగరంలో ఒక రోజు గా చూపి జీవితం అలాకావడానికి కారణమేమిటో తెలుసుకోమంటాడు.
కూర్మానాథ్ కథలు చదివితే, శ్రీకాకులవుద్యమ కాలం నుండి నేటి తెలంగాణా స్ఫూర్తి దాక, నింపాదిగా, వొడపుగా,పదునుగా ఆర్ద్రంగా, రాయగలిగడం ఉత్తరాంధ్ర నైపుణ్యానిదైతే, ప్రతీకాత్మకంగా, క్రోధం రగిలించేదిగా, నిర్మాణాత్మకంగా రాయగలగడం విరసం యిచ్చే శక్తి. ప్రతి వస్తువు లోనూ సామాన్యపు చూపుకు కనిపించని కోణాన్ని యెత్తి చూడడానికి యెంత నైపుణ్యం అవసరమో, ఆ చూపును అలాగే నిలిపే ఆలోచనగా మార్చడానికి అకుంఠిత దీక్ష అవసరం. ఆ రెండింటి సమన్వయమే యే రచయితతోనైనా నిజ సమాజ విశ్వరూప సందర్శన చేయిస్తుంది. అలాంటి నైపుణ్యాలున్న కథలెన్నో యీ పుస్తకం లో వున్నాయి.
మామూలు కంటికి అన్ని మరణాలూ ఒకేలా కన్పిస్తుంటాయి. యాంత్రికతకు గురైన మనుషులు స్పందనలు కోల్పోయి వుంటారు. చురుకైన వారు గుర్తు చేసినప్పుడు మామూలు సందర్భమే కొత్త సందర్భంగా మారిపోతుంది. ఒక కల్లోలానికి అంచున వున్న వూర్లో, అన్నీ అసహజ మరణాలు చూసీ చూసీ, రాజ్యం చేసే హత్యలకు యిక కన్నీరు కార్చలేని స్థితికి చేరి, జీవితంలో సెలబ్రేషన్ లేకుండా పోయుంటుంది. అప్పుడు వూర్లో ఒక సహజ మరణం సంభవిస్తుంది. చావు డప్పు వాయించే అతను చావుడప్పు వద్దు, బాజా భజంత్రీలు వాయిస్తా అంటాడు. అవును కదా అనుకుంటారంతా, అంతే. వూర్లో పండగవాతావరణం నెలకుంటుంది. ఇంతే, కొత్త సందర్భాలు కథ. ఇంకో కథుంది, ‘నదిని నిర్మిస్తున్న వాళ్ళు’ అని. ఎక్కడో పుట్టిన జల, ఏరై వూళ్లోకొస్తుంది. హడావుడి ప్రారంభమవుతుంది. సర్దకోమని చెప్పేవాళ్లూ, పిల్లల్ని, పడుకున్నవాళ్లనీ లేపేవాళ్లూ. యింటికొచ్చిన ఆడపడుచు కు పసుపూకుంకాలు పెట్టారా అని వాకబు చేసేవాళ్లూ. మారిన వాతావరణంలో కలకలం చేసే కాకులూ, కుక్కలూ. ఏరు వూర్లోకి యెక్కడిదాకా వచ్చిందో, పోయినసారి వచ్చినప్పుడు యేమేమి చేసారో చెప్పుకునేవాళ్లూ. వరద తీసాక మేటలతో యెంత కష్టమో అనుకునేవాళ్లూ. ఒక మనవడు, యింత దూరం యెందుకొచ్చిందవ్వా అని అడిగితే, ఎండిన పొలాలను చూడలేక, ఏడ్చే పిల్లల్ని చూడలేక, గుండెలుబాదుకుంటూ వస్తోంది ఏరు అంటుంది. మనం ఆశ్చర్యంగా చదువుతుంటాం. వచ్చింది ఎవరు. నది ఏమిటని. బంగళా మునిగిపోయుంటుంది అంటుంది అవ్వ. బంగళా, ఆ పక్కనే శంకర్రావు యిల్లూ మునిగిపోయిందనీ, యింకేవో కొట్టకపోయాయనీ తెలుస్తుంది. కొందరికది కదిలే కార్చిచ్చులా కన్పిస్తే, కొందరికది వూతమిస్తుందని చెప్తాడు రచయిత. అప్పుడర్థమవుతుంది నదంటే వుద్యమమని. రచయిత వరద గురించి పైకి మాట్లాడుతూ వుద్యమ విశ్వరూపాన్ని సాక్షాత్కారం చేస్తాడు. ఇదీ కె. వీ. కూర్మనాథ్ ప్రతీకాత్మక కథన పద్దతి. ఇట్లా రాసే వాళ్ళు తెలుగులో అరుదు.
మనం పిల్లల కథలు వింటుంటాం. పంచతంత్రం కాలం నుంచి పిల్లలకు వుద్దేశించినట్లుండే జంతు ప్రతీక కథలు, నిజానికి జంతువుల కథలూ కావూ, పిల్లల కోసమే రాసివవీ కావు. జంతుప్రపంచంలో మానవచర్యల్ని సంకేతించేవే. కూర్మానాథ్ కూడా, రాజుగారి పులిస్వారీ, కోరల సింహంగా మారిన కుందేలు కథ, వేటమానేసిన రాజు లాంటి జంతుపాత్రలతో రాజకీయ కథలు రాసాడు. ఆయా కథల కాలాన్ని బట్టి ఆ కథల్లోని పాత్రల్ని వూహించుకోవచ్చు. ఇవన్నీ రాజ్యస్వభావాన్ని చిత్రించిన కథలు. మనిషిని పాత్రగాచేసి యీ కథల్నే చెప్పింటే వెలసిపోయి వుండేవి. దాన్ని అధిగమించేందుకు జంతుప్రతీక కథనం వుపయోగపడింది.
పొదగని గుడ్లు, వెన్నెలపడవ, వేటమానేసిన రాజు, ముసురు, మందు, నదిని నిర్మిస్తున్న వాళ్ళు, కథల్లో పిల్లలు ప్రధానంగా వుండటమో, పిల్లలు అడిగితే పెద్దలు కథ చెప్పడమో, లేదూ పిల్లలే తమ అనుభవంగా కథ చెప్పినట్లుండటమో కన్పిస్తుంది. వెన్నెల పడవ, కవిత లాంటి కథ. శీర్షిక లోనే కవిత్వముంది. కథనంలో కవితాత్మక వచనం వుంది. పిల్లల స్వేచ్ఛానుభవాన్ని అడ్డుకునే పెద్దల ఆధిపత్యం యెంత అవాంఛనీయమో చెబుతుంది కథ. ఇక పొదగని గుడ్లు కథ, మనిషి కాంక్రీట్ జనారణ్యాలను విస్తరించే క్రమంలో పక్షులకు ప్రకృతి సహజమైన ఆవాసాలు లేకుండా పోయి, వాటి జవసత్వాలు నిర్వీర్యమవుతున్నాయి. వ్యవస్థ చేస్తున్న దురాక్రమణ వన్య ప్రాణుల పాలిటి శాపంగా మారిందని చెప్పే పర్యావరణ కథిది. ఒక మధ్య తరగతి యింటిలో గుడ్లు పెట్టడానికొచ్చిన పావురాలను కథ చెప్పే ప్రొటాగనిస్ట్ మొదట పారదోలడానికి ప్రయత్నించే క్రమంలోనే మనుషుల వల్ల అవెంత నిరాశ్రయమయ్యాయో గ్రహిస్తాడు పర్యావరణ స్పృహను, అతి సున్నితంగా చెప్పే కథ. ముసురు కథ, అన్యాయంగా చనిపోయిన పాప పట్ల సమాజమే కాదు ప్రకృతి కూడా సంతాపం తెలిపిందని సూచనగా రాసిన కథ. యెంతో ఆర్ద్రతగల కథ. వేటమానేసిన రాజు కథ, కొడుకు అడిగితే తండ్రి చెప్పే నక్కరాజయ్యే కథ. రాజ్యనిర్బంధమూ రాజ్యహింసపు కథ.
ఇక మందు, నదిని నిర్మిస్తున్న వాళ్ళు కథలు రెండూ, పది పన్నైండేళ్ల పిల్లవాడు చెప్పిన కథలు. రెండింటిలోనూ వుద్యమం ఆవిష్కరింపబడుతుంది. కథ చెప్పే గొంతుక వల్ల కొంత విడ్డూరంగా అన్పించినా గొప్ప భావోద్వేగాన్ని రగిలించే కథలు.
ఈ కథలనిండా రాజ్యనిర్బంధమూ, ఎన్ కౌంటర్లూ, ఎన్నికల ప్రజాస్వామ్యమ్యంలోని దుర్మర్గాలూ చిత్రితమై వున్నా, ఎక్కడా ఆ జార్గాన్ కన్పించనే కన్పించదు. ఆ మేరకు యీ కథలన్నీ వున్నతీకరింపబడ్డ విప్లవ కథలు. ఇది కూర్మనాథ్ సాధించిన శిల్ప నైపుణ్యం. మాజిక్ రియలిజం టెక్నిక్ ను యింత తెలుగు తనం చేసుకున్న రచయిత వర్తమాన సందర్భంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ఆధునిక పంచతంత్రాన్ని ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వినియోగించే కథనాలుగా మలుస్తున్నందుకు సృజనకారుడైన కూర్మనాథ్ ను అభినందించకుండా వుండలేము. ఈ దారిలోనే మరింత పరిణితిచెంది రాయగలడని ఆశించకుండా వుండలేము.
*
Add comment