ప్రతి రోజూ ఒక నేషనల్ అవార్డే: నర్సిం   

ఒక పక్క చదువు మీద మనసు పోతున్న సమయంలోనే మరో పక్క బొమ్మలు వేస్తే బాగుండు అనే ఆలోచనా సారా దుకాణంలోనే మొదలయింది.

”ఏడెనిమిది ఏండ్ల వయసది. తిండికి కూడా కటకటలాడే కాలం. మా నాయన బతుకుతెరువు వెతుక్కుంటూ ఖమ్మం వెళ్లాడు. ఆయన సంపాదన అక్కడికక్కడికే సరిపోయేది.ఇంక మాకేం పంపిస్తాడు. మా అమ్మ చిన్న డబ్బా కొట్టు పెట్టి చపాతీలు, టీ వంటివి అమ్మడం ప్రారంభించింది. అప్పటికి నేను రెండో తరగతిలో ఉన్నా. చదువు మాని ఏదో ఒక పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మాకుతెలిసిన ఒక సారా దుకాణంలో పనికి పెట్టింది మా అమ్మ. రోజుకి చారణా (25పైసలు) జీతం. దీనికి తోడు ఒకటి రెండు  రూపాయలు టిప్పులు వచ్చేవి. నా ఈ కొద్ది సంపాదనే మా అమ్మకు ఎంతో సాయంగా ఉండేది. అయితే నాకు మాత్రం నరకంగా ఉండేది సారా దుకాణం. పొద్దున్నే వెళ్లి రాత్రి పదికి గానీ ఇంటికి చేరేవాణ్ణికాదు. సారా తాగటానికి వచ్చినవారికి సారా అందించడం, వారిచ్చిన డబ్బును యజమానికి ఇవ్వడం నా విధుల్లో ఒకటి. అయితే తాగినవాళ్లు కొందరు డబ్బులివ్వకుండా ఇబ్బంది పెట్టేవారు. ఇవ్వమని అడిగితే బూతులు తిడుతూ కొట్టేవారు. డబ్బులు ఇవ్వడంలేదని యజమానికి చెబితే ఆయనా కొట్టి, డబ్బులు వసూలు  చేసుకురమ్మనేవాడు”-ఇది ఓ ప్రముఖ కార్టూనిస్ట్‌ బాల్యంలో చేసిన బతుకు యుద్ధంలో చిన్న ఘట్టం.
ఇటువంటి ఎన్నో భయయంకర ఘట్టాలను దాటిన ఒకనాటి ఆ బాల కార్మికుణ్ణి ‘ప్రెస్‌కౌన్సిల్  ఆఫ్‌ ఇండియా’ వారు 2018కి గాను జాతీయ స్థాయిలో ‘ఉత్తమ కార్టూనిస్ట్‌’ అవార్డుకి  ఎంపిక చేశారు. అతడే నర్సిం. 16 నవంబరు నాడు ఢిల్లీలో అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని  ముచ్చట్లివి.
మనిషిని తన చుట్టూరా ఉన్న పరిసరాలు, పరిస్థితులే తీర్చిదిద్దుతాయనడానికి నర్సిం జీవితం కూడా ఒక ఉదాహరణే. నల్లగొండ జిల్లాలో పెద్దవూర అనే గ్రామంలో చిన్న గుడిసెలో భోజన శాలను నడుపుకునే చేనేత కుటుంబానికి చెందిన సత్తయ్య- సుశీల  దంపతుల రెండవ సంతానం నర్సిం. (పూర్తి పేరు పున్నా నర్సింహ). అక్కడ ఇల్లు జరగక మిర్యాలగూడ వెళ్లి చిన్న భోజన హోటల్‌ ప్రారంభించింది ఆయన కుటుంబం. ఇంతలో జై ఆంధ్ర ఉద్యమం వచ్చి కర్ఫ్యూ విధించడం, కాల్పులు జరగడంతో హోటల్‌ నడవకుండా మూతపడింది. తండ్రి పని వెతుక్కుంటూ ఖమ్మం వెళ్లాడు.
నర్సిం బడి మాని సారా దుకాణంలో పనికి కుదిరాడు. రోజూ రెండు జాడీలను రిక్షాలో వేసుకొని సారా కాంట్రాక్టర్‌ దగ్గరికి వెళ్లి ‘రకం’ (డబ్బు) కట్టి, సారా తీసుకువచ్చేవాడు. ఈ రిక్షా కార్మికుడు వాళ్ల అబ్బాయి చదువు, స్కూలు గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉండేవాడు. అప్పటికే బడికి దూరమైన నర్సింలో అతడి మాటలు చదువు గురించి ఆలోచించేలా చేశాయి. దీంతో ఒక రోజు ఇంట్లో నుంచి పారిపోయి పెద్దవూరలో ఉన్న తన బాబాయి దగ్గరకి చేరాడు. చదువుకుంటానని, స్కూల్లో చేర్పించమని అడిగాడు. కానీ రెండురోజుల తరువాత ఆ బాబాయి నర్సింను తీసుకొచ్చి తల్లికి అప్పగించాడు. రెండు దెబ్బలు పీకి మళ్లీ సారా దుకాణంలో  పడేసిందామె.
ఒక పక్క చదువు మీద మనసు పోతున్న సమయంలోనే మరో పక్క బొమ్మలు వేస్తే బాగుండు అనే ఆలోచనా సారా దుకాణంలోనే మొదలయింది. ”నేను పనిచేసే సారా దుకాణం పక్కనే ఒక సినిమా హాలు నిర్మాణం జరుగుతూ ఉండేది. దాంట్లో ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో భాగంగా చిత్రకారుడు, శిల్పి అయిన జానయ్యగారు(నా బాల్య మిత్రుడు ప్రముఖ చిత్రకారుడు ‘చిత్ర’ తండ్రి) ఉమర్‌ ఖయ్యాం కావ్యంలోని ఘట్టాలకు దృశ్యరూపమిస్తూ శిల్పాలు చెక్కేవారు. ఆయన మధ్యాహ్న భోజనానికి ముందు మా దుకాణానికి వచ్చి ఒక డ్రాం సారా తాగి భోంచేసి, మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యేవారు. ఆయన సారా దుకాణంలోని గోడలపై బొగ్గుతో అత్యంత వేగంగా బోస్‌, గాంధి, నెహ్రూ వంటి బొమ్మలు వేసేవారు. అది చూసి నేను విస్మయానికి గురయ్యేవాడిని. నేనుకూడా బొమ్మలేస్తే బాగుండు కదా అనే ఆలోచన అప్పుడే వచ్చిందం”టూ బొమ్మలపై దృష్టి మళ్లిన పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు నర్సిం.
మరోసారి ఇంటి నుండి పారిపోయి మిర్యాలగూడలోనే ఉన్న తన మేనమామ ఇంటికి చేరుకున్నాడు నర్సిం. వెళ్లేటప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులతో రెండు నోట్‌ పుస్తకాలు కొనుక్కొని వెళ్లి ఏదైనా బడిలో చేర్చమని బతిమిలాడాడు మామయ్యను. ఆయన నేరుగా ఒక బడికి తీసుకెళ్లి చేర్పించేశాడు. ‘వాడ్ని బడిలో చేర్పించేశా, చదువుకుంటడట, ఏమనకూ అని గట్టిగా తన అక్కతో చెప్పి వెళ్లాడు. దీంతో సారా దుకాణం నుంచి విముక్తి కలిగింది. బడిలో నాల్గవ తరగతిలో చేర్చుకున్నారు. ఆకలిగొన్న పులిలా చదువుమీద పడ్డాడు. మరోపక్క ఇంటిదగ్గర తల్లి నడుపుతున్న టీ షాపులో అన్న యాదగిరితో కలిసి పనిచేసేవాడు.
”ఎనిమిదవ తరగతికి వచ్చే నాటికి శేషు సార్‌ నాలో శాస్త్రీయ ఆలోచనలకు బీజాలు వేశారు. ఆ తర్వాత సుదర్శన్‌ సార్‌ పరిచయం అయ్యారు (తర్వాతి రోజుల్లో ‘దాసి’ సినిమాకు పనిచేసి నేషనల్‌ అవార్డు పొంది ‘దాసి సుదర్శన్‌’గా పేరు పొందారు). ఆయన గొప్ప కళాకారుడు. ఆయన నాకు లెటరింగ్‌, సైన్‌బోర్డులు, హోర్డింగ్‌లు వంటివాటిపై అవగాహన కల్పించారు. శేషు సార్‌, సుదర్శన్‌ సార్‌ ఇంక వాళ్ల మిత్రుల ఆధ్వర్యంలో  ‘చైతన్య సమాఖ్య’ అనే లైబ్రరీ నడుస్తుండేది.  దానిలో ఆ వయసులోనే ప్రముఖుల రచనలు చదివేవాడిని. ఆ లైబ్రరీలోనే ఉన్న ఫిల్మ్‌ సొసైటీలో చేరి పారలల్  సినిమాలు చాలా చూశాను. అప్పట్లో మిర్యాలగూడ కమ్యూనిస్టు భావాలతో అగ్నిగుండంగా ఉండేది. అందువల్ల ఆ సెగ నామీద బాగానే పఁనిచేసింది. చదువుకుంటూనే సైన్‌బోర్డులు రాయడం, బొమ్మలు వేయడం సుదర్శన్‌ సార్‌ దగ్గర నేర్చుకున్నా. ఇంటర్మీడియట్‌ చదువే సమయంలో సైన్‌ బోర్డులు రాసి నా ఖర్చులకు డబ్బులు  సంపాదించుకున్నా.”
“డిగ్రీ చదవడానికి హైదరాబాదు వచ్చిన తరువాత కూడా బ్యానర్లు, సైన్‌బోర్డులు రాయడం మానలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఈనాడు గ్రూపు పత్రికలైన విపుల, చతురలో ఆర్టిస్టుగా చేరాను. పరీక్షల సమయంలో రిజైన్‌ చేసి పరీక్షలు రాశా. డిగ్రీ తరువాత ‘వారం వారం’ పత్రికలో చేరడంతో నా సీరియస్‌ వర్క్‌ ప్రారంభమయింది. ఉదయం, ఆంధ్రజ్యోతి, సుప్రభాతం పత్రికల్లో మొత్తం కలిపి పదేళ్లు, ఇండియాటుడే లో ఇరవై మూడేళ్లు పనిచేసి ఎందరో ఆర్టిస్టుల ప్రభావానికి లోనయ్యాను. ఇప్పుడు మూడేళ్లుగా ‘నవతెలంగాణ’తో ప్రయాణం. నా శ్రమ, ఆలోచనల్ని నేను నేర్చుకున్న జ్ఞానానికి జోడిస్తేనే నేను వేలాదిగా గీసిన ఈ కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, డ్రాయింగులు!” అని తన జీవన సమరంలోని వివిధ ఘట్టాలను గుర్తుచేసుకున్నాడు నర్సిం.
”జర్నలిజంలో ముప్పై ఐదేండ్ల ప్రస్థానంలో ఎక్కడా ఆగింది లేదు. ప్రతిరోజూ కార్టూన్‌ సబ్జెక్ట్‌ ఎన్నుకునే దగ్గరి నుంచి పంచ్‌ పడేదాకా ప్రసవ వేదనే! అలా పుట్టిన కార్టూన్‌ను నలుగురూ మెచ్చుకుంటే రోజుకో నేషనల్‌ అవార్డు వచ్చినట్లు భావిస్తా’నంటాడు నర్సిం. దటీజ్‌ నర్సిం!!
*

గుంటూరు శివరామకృష్ణ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు