ప్రతి ప్రయాణమూ యాత్ర కాదు!

ప్రయాణాల మీద ఆసక్తి ఎప్పుడు కలిగిందీ? ఎలా కలిగిందీ?

బాగా చిన్నప్పుడే. ఐదారేళ్ళ వయసులోనే తిరగడంలోని సంతోషాన్ని అనుభవించడం తెలిసింది. బంటుమిల్లి గ్రామజీవితం, నది చేరువునా కొండల మధ్య  ఉన్న విజయవాడ, సాగరతీరపు కాకినాడ బాగా చిన్నప్పట్నించీ నా ప్రయాణాలకు ఊతమిచ్చాయి. .కానీ అప్పటి ప్రయాణాలకు చాపల్యమే ముఖ్యప్రేరణ. ఇరవై నిండేసరికి సాహిత్యం లాగానే ప్రయాణమూ జీవితంలో అంతర్భాగమన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది.

ఇరవై రెండేళ్ల వయసులో ఉద్యోగరీత్యా ఢిల్లీ చేరాక నా ప్రయాణాలకు స్థిరత్వం ఏర్పడింది. ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఆగ్రా, జైపూర్ లాంటి నగరాలూ, జైసల్మేర్ ఎడారులూ, ముస్సోరీ, సిమ్లాలాంటి హిమాలయ ప్రాంతాలూ విరివిగా తిరిగాను. నేను చూసిన వింతలూ విశేషాలూ అందరికీ చెప్పాలన్న తపనతో ఆయా ప్రయాణాల గురించి విరివిగా రాసాను. కానీ రాశాక తిరిగి చూసుకుంటే అవి సంతృప్తి కలిగించలేదు. పొడవు, వెడల్పు, ఖర్చు, ఘనత – ఇలాంటి గణాంక వివరాలు రాయడం, పాఠకులకు అందించడం అనవసరమని అనిపించింది. మానేసాను. ఇది 1980 నాటి మాట.

– – –

ఒక ప్రయాణం చెయ్యడం, ఆ ప్రయాణానుభవాలు నెలల తరబడి మనసులో మెదలాడుతూ ఉండటం, వాటి గురించి రాయాలన్న తపన – అలా రాసుకుంటూ వెళ్తే అదో ఎనభై పేజీలకు  విస్తరించడం, ఎవరో అనుభవజ్ఞులు అనుకోకుండా అది చదివి, ముచ్చటపడి, పూనుకుని, ఓ పత్రికలో వారవారం ధారావాహికగా వచ్చేలా చెయ్యడం – 1989-90ల నాటి ముచ్చట ఇది.

ఆఫీసు పనిమీద పది రోజులు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండులు 1989లో వెళ్లాను. నాలోని యాత్రికుడు ‘పగలంతా ఆఫీసు పనిచేసుకో, ఉదయమూ రాత్రీ ఆయా ఊళ్లన్నీ చెడదిరుగు’ – అని పురమాయించాడు. అలా చేసాను. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, స్వల్పవ్యవధిలోనే చక్కని  పరిచయాలు, కొన్ని క్షణాల్లో మెరిసి ముగిస్తే మరికొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. పాత భ్రమలు – వర్ణ వివక్ష, సాంస్కృతిక తూర్పు పడమరలులాంటివి తొలిగాయి. కొత్త ఎరుకలు – మనుషుల్లోని పై పై పొరలు  ఎలా ఉన్నా విశ్వవ్యాప్తంగా మనిషిలోని కోర్ ఒక్కటే లాంటివి కలిగాయి. అవన్నీ నాకు తోచిన రీతిలో రాసి, అవి పదిమందికీ చేరినపుడు వాటికి పాఠకుల ఆమోదముద్ర లభించింది. నాయని కృష్ణకుమారి, మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు, భరాగో లాంటి పండితులూ సీనియర్ రచయితలూ, ‘బావుంది, ఎన్నో విషయాలు చెప్పావు. రసవత్తరంగా చెప్పావు. అలా రాసుకుంటూ వెళ్ళు’ అన్నారు. నమ్మకం కలిగింది – నేను రాస్తున్న విషయాలు పదిమందికీ ఎంతో కొంత ఉపయోగపడతాయి. నా యాత్రానుభవాలు పత్రికలకు ఎక్కి పుస్తకాలుగా రాదగ్గవి – అన్న నమ్మకం కలిగింది.  1991లో ఆ యూరప్ అనుభవాలను ‘మూడు నగరాలు’ అన్న పేరిట ప్రచురించాను.

అప్పటికే కథలు, వ్యాసాలూ, అనువాదాలు, రేడియో ప్రసంగాలు – వీటితో బహుముఖాలుగా సాగిపోతోంది నా రచనా వ్యాసంగం. 1990లు ఎంతో జబ్బపుష్టితో వందలాది పేజీలు  రాసి ప్రచురించిన సమయం. ఆ వ్యాపకాల్లో యాత్రల గురించి రాయడం కూడా ఒకానొక వ్యాపకంగా పరిణమించింది. అవే నగరాలు, అవే కొండలు, అవే నదులు, అదే ప్రకృతి – వాటిగురించి 1990లలో రాసిన పద్ధతికీ, 1970లు 80లలో రాసిన పద్ధతికీ నాకే ఎంతో తేడా కనిపించింది. వింతలూ విశేషాల గురించి రాయడం తగ్గి మనుషులూ ప్రకృతీ గురించి మొగ్గు చూపడం కనిపించింది. పత్రికలకు పంపడం ఆరంభించాను. క్రమం తప్పకుండా అవి పత్రికల్లో పడటం సాగిపోయింది.

చేసిన ప్రతి ప్రయాణమూ యాత్ర కాదు. ప్రతి యాత్రా రచనకు దారితీయదు. పది యాత్రలు చేస్తే అందులో ఒక్కటే నాకే గాకుండా పదిమందికీ పనికొచ్చే అనుభవాల మాలిక అవుతుంది. ఈ ఎరుక నాకు కలిగింది. ఆ పదో అనుభవం గురించే రాయడం మొదలెట్టాను.

1993 వేసవిలో అయిదారు రోజులపాటు స్కూటర్ల మీద హిమాలయాలలోని కులు, మనాలి, రోహతాంగ్ కనుమ, ధర్మశాలలకు వెళ్లి రావడమన్నది అలాంటి ఒక విలక్షణమైన అనుభవం. మైదాన ప్రదేశాల్లోంచి బయటపడి, కొండలూ లోయలూ చేరుకొని, నదులూ సెలయేళ్లతో పరిచయం ఏర్పరచుకుంటూ, పువ్వుల్నీ పక్షుల్నీ పలకరించుకుంటూ యథేఛ్చగా సాగిన ఆ స్కూటరు ప్రయాణం మరోసారి సుదీర్ఘ యాత్రారచనకు పురికొల్పింది. రాయడం మొదలెట్టాక కొండలూ పక్షులే గాకుండా దారి పొడవునా కనిపించిన విలక్షణమైన వ్యక్తులూ, వారు అసంకల్పితంగా అందించిన జీవిత పాఠాలూ నా రచనలో సహజంగానే చోటుచేసుకున్నాయి. ‘స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర’ అన్న ఆ రచన, ముందు ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గానూ 1997లో పుస్తకంగానూ వచ్చింది.

‘స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర’ పుస్తకంగా వచ్చాక పదీపదిహేనేళ్లపాటు  పెద్దపాటి యాత్రా రచన చెయ్యాలన్న తపన కలగలేదు. హంపీ, వాలీ ఆఫ్ ఫ్లవర్స్, పిండారీ గ్లేషియర్ లాంటి ఎన్నో ప్రయాణాల గురించి వ్యాసాలూ రాసి ప్రచురించినా పెద్ద పుస్తకం రాయాలన్న ప్రేరణ కలగలేదు. 2012లో నేను చేసిన రెండు వారాల అండమాన్ యాత్ర నాకు అలాంటి తపనా ప్రేరణా కలిగించింది. సమాధానం చెప్పింది. ఆదిమజాతుల జీవితాలు, భారతీయ భాషల సహజ సమన్వయం, బంగ్లాదేశ్ నుంచి ప్రవాసం వచ్చి పునరావాసపు జీవితంలో ఎదిగిన బృందపు గాథా, నాగరికత ప్రభావం సోకని వారి జీవితాలలోని సరళత, వారి వారి మాతృభాషా ప్రదేశాలను ఏనాడూ చూడకుండానే అండమాన్లలోనే పుట్టి పెరిగిన అఖిల భారత యువజనులు, భర్త ఆధారం హఠాత్తుగా కోల్పోయినా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన నిరక్షర మహిళ –  ఇన్నిన్ని అనుభవాల వెనక కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు, చారిత్రక సాంస్కృతిక శోధనలు – ఇలా ఎన్నెన్నో ప్రక్రియల్లో ఇమడగల ముడిసరుకు కనిపించింది.  కళ్ళూ మనసూ విప్పి చేసిన ఏ యాత్ర అయినా ఇలాంటి ముడిసరుకును మనకు అందించగలదని స్పష్టమయింది. సరైన పరిశీలనతో స్పందనతో ఆయా విషయాలను అక్షరాల్లో వ్యక్తపరిస్తే ఆ రచన అన్ని సాహితీ ప్రక్రియలనూ తనలో ఇముడ్చుకోగలదని స్ఫురించింది.

‘అండమాన్ డైరీ’ రాసాను. 2016లో ప్రచురించాను.

– – –

ప్రతి మనిషీ  కలలు కంటాడు. యాత్రికుడు సగటును మించిన కలల జీవి. ఆయా కలలన్నిటినీ సజావుగా అమర్చి గుది గుచ్చితే అది ఒక స్వప్నం అవుతుంది.

బంగాళాఖాతపు తీరరేఖను హత్తుకుని వెళ్లి కన్యాకుమారి చేరి అక్కడ యూటర్న్ తీసుకుని అరేబియా సముద్ర తీరాన తిరిగి రావడమన్నది నేను స్కూలు రోజుల్నుంచీ పదే పదే కన్న కల. పదమూడేళ్ల వయసులో కన్న ఆ కలను అరవై మూడు నిండినా సాకారం చేసుకోకపోవడమేమిటీ? ఇపుడు కాకపోతే ఇంకెప్పుడూ?

2015లో తేలికపాటి స్కూటరు తీసుకుని పది పన్నెండు రోజులపాటు ఆయా తీరరేఖల వెంబడి తిరిగాను. రాజమార్గాలూ రహదారులూ వదిలి, పల్లెబాటలూ, ఇసుక తోపుల్లో బండిని నడిపాను. నాకెవరూ తెలియని ప్రదేశాల్లో, నేనెవరికీ తెలియని కాలాలలో పది రోజులపాటు నాకు నేనే తోడుగా మనసు నిండేలా తిరిగాను. తిరిగి గూటికి చేరీ చేరగానే ఆ అనుభవాలకు అక్షరరూపం ఇచ్చాను. ‘కొన్ని కలలు ఒక స్వప్నం’ అన్న యాత్రా రచన ప్రచురించాను. దృష్టిని వింతలూ విశేషాల మీదినుంచీ, కొండలూ అడవుల మీదినుంచీ, పక్షులూ ప్రకృతీ మీదనుంచీ, మనుషులూ పరిసరాల మీదనుంచీ మళ్ళించి నా లోలోపలి అంచులు తాకే అప్రయత్న ప్రయత్నమా స్కూటరు యాత్ర. నాలోని కొత్త కోణాల ఆవిష్కరణ, ఆ ఆవిష్కరణను విశాల విశ్వంతో అనుసంధించవచ్చునన్న ఎరుక – గొప్ప అర్థవంతమైన ప్రయాణప్రయోగమది.

– – –

మనకు ఇష్టమున్నా లేకపోయినా మన కుటుంబం గురించీ, ఊరు గురించీ, జిల్లా రాష్ట్రం దేశం గురించీ మనకు తెలియకుండానే మనలో ఒక అతిశయభావం ఉంటుంది. దాన్ని ప్రేమ అనో దేశభక్తి అనో మనం పిలవచ్చు. అలాగే అమెరికానుంచి ఆస్ట్రేలియా దాకా – ఆయా దేశాలమీద భయమూ భక్తీ ఉన్నా లోపల లోపల  మనమే ఊహించుకున్న నిరసన భావనలుంటాయి. సొంత దేశంలో బతకలేక దూరపు ఖండాలమీద పడిన వెర్రిమూక అనో, నేరాలు చేసి దూరాలలోకి తమ దేశమే విసిరికొట్టిన వారి సంతానం అనో – ఏవో వెర్రిమొర్రి అహంకార కారణాలు వెదుకుతాం. మన గురించి మనం గర్వంగా భావించుకుంటాం.

అందరూ కాకపోయినా కనీసం నేను ఈ వలకు అతీతుడిని కాను.

2019 దాకా థాయ్‌లాండ్ అంటే ఏదో చిన్న దేశం. ఆగ్నేయాషియా పటంలో కనిపించీ కనిపించని చుక్క. అభివృద్ధి అన్న మాట పట్టించుకోని మనుషులు… స్థిరత్వం లేని ప్రభుత్వం… రామాయణం త్రిపిటకాలు తప్ప తమదంటూ సంస్కృతి లేని జాతి – ఉన్నదల్లా మసాజ్ సంస్కృతే –

ఇవన్నీ నేను నమ్మలేదుగానీ, వీటి ప్రభావం నా మీద లేకపోలేదు.

అనుకోకుండా మిత్రుల ప్రేరణ వల్ల 2019 మే నెలలో పది రోజులు థాయ్‌లాండ్‌లో గడిపాను. ఆ స్వల్పసమయంలోనే థాయ్‌లాండ్‌ నా మనసును గెలుచుకుంది. పరాయి దేశం అనిపించలేదు. మనకూ ఆ దేశానికీ మధ్యనున్న సంస్కృతీ సారూప్యం, సరళ జీవనసరళి, మనుషుల స్నేహశీలత, సంస్కారయుత ప్రవర్తన, ప్రకృతి సౌందర్యం, చిన్న బిందువు అనుకున్న మారుమూల దేశం దగ్గరకు వెళ్లేసరికి అది మహావిరాట్టులా కనబడటం – ఇవన్నీ కలసి నా పొరపాటును నేను గ్రహించేలా, అక్కడి అనుభవాలను ప్రేమించేలా చేసాయి. వెరసి: ‘అనగనగా ఒక రాజ్యం’ అనే ట్రావెలాగ్. ఒక రకంగా ఇది రాయడమన్నది ఆనందవ్యక్తీకరణే కాకుండా అపరాధ భావననుంచి విముక్తిమార్గంగానూ నేను భావిస్తాను.

అలాంటి అనుభవమే దుబాయ్ ఒమాన్ల విషయంలోనూ కలిగింది. 2020 మార్చిలో వెళ్ళినప్పుడు కాంక్రీటు జంగిల్ అనుకొని వెళ్లాను. మిలియన్ పువ్వుల మిరాకిల్ గార్డెన్ కనిపించింది. యాంత్రికంగా సాగే జీవనమనుకొన్నాను. వంద దేశాలనుంచి వచ్చిన ఎక్స్‌పాట్స్ చక్కని సమన్వయంతో సజీవంగా జీవించడం గమనించాను. చరిత్రే లేదనుకున్నాను –  ఉందని అక్కడి మ్యూజియం చెప్పింది. సాహిత్యమూ సంగీతమూ ఉండవనుకొన్నాను. దుబాయ్ క్రీక్ ఒడ్డున పొయెట్రీ హౌస్ కనిపించింది. గోల్డ్ సోక్ కు కూతవేటు దూరంలో పోతన, కబీరు, గాలిబ్, కాళోజీల కలగలపులా అనిపించిన కవి ‘ఒఖైలీ’ నివాస గృహం కనిపించింది. ఒమాన్ లో అయితే వెయ్యీ పదిహేనువందల ఏళ్ళనాటి నగరాలు… ఇస్లాం ధర్మపు అడుగు జాడలు – నేర్చుకోవాలేగానీ అక్కడ ఎంతో ఉంది. అందులో నేను తెలుసుకున్న ఇసుక రేణువంత పరిజ్ఞానం, అనుభవాలు, అనుభూతులు అందరికీ అందవద్దూ? ఫలితం ‘గల్ఫ్ గీతం’.

– – –

నిజానికి ఒకో మనిషీ ఒకో మహాగ్రంధం – మనం బతికే అలవాటూ చదివే అలవాటూ తిరిగే అలవాటూ పోగొట్టుకోకపోయినట్లయితే!

ఒక్కో ట్రావెలాగూ – ముందే చెప్పినట్లు – విభిన్న సాహితీ ప్రక్రియలను తనలో ఇముడ్చుకోగల శక్తి ఉన్న గ్రంథం… ఒక్కో యాత్రా వింతలూ విశేషాలూ ప్రకృతీ సంస్కృతీ మనుషులనూ దాటుకొని మనం మనలోకి, లోలోపలికి చేసే ఉత్తేజకరమైన ప్రయాణం – ప్రపంచాన్నీ మననూ మనసుతో చూసే అలవాటు చేసుకో గలిగితే!

మరి ప్రయాణాలు చేయకుండా, వాటి గురించి రాయకుండా ఎలా ఉండగలనూ!!

*

Dasari Amarendra

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ వ్యాసం చదువరుల్లో మీ అన్ని కాకపోయినా కొన్నైనా యాత్రలు చేయాలనే ఉలుకు పుట్టిస్తుంది.
    మీరు చేసిన యాత్రా రచనల అనువాదాల గురించి కూడా రాసి ఉంటే వ్యాసం పూర్తి అయ్యింది.

  • మీ అనుభవాలను ఇలా పాఠకులతో పంచుకోవడం చాలా నచ్చింది, అమరేంద్ర గారు. మీకు, సారంగకు ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు