ప్రతి ఉదయం గుర్తొస్తూనే ఉంటారు!

సాహిత్యాన్ని సాహిత్యం కోసమే ప్రేమించే సహృదయం అందరికీ సాధ్యం కాదు.  మా సంభాషణ ఎప్పుడూ సాహిత్యపు చెలమల్లోనే తిరుగుతూ ఉండేది. 

భిరుచులు కలిస్తే స్నేహమంటారు. ఈరోజుల్లో ఏడు లైకులకో పద్నాలుగు కామెంట్లకో నేస్తం కడుతున్నామేమో! అలాగే తారసపడిన పరిచయం కల్యాణి నీలారంభం గారిది. ఫేస్బుక్ నేపథ్యంగా సాహిత్యం, సంగీతం, పువ్వులూ నవ్వులూ వీటితోపాటు ప్రత్యక్ష నారాయణుడి ఫోటోలు… ఇవన్నీ ఆవిడతో స్నేహితులందరం కలబోసుకునేవారం.

కొన్నాళ్ళకి కల్యాణి గారంటే శర్వాణి గారమ్మాయిని తెలిసింది. కన్నడ సాహిత్యాన్ని  తెలుగులోకి అనువదించి మేలుదారి వేసిన అనువాదకుల కుటుంబంలోని వారని, అనుపమ నిరంజన “మాధవి” నవల అనువదించినది స్వయంగా ఆమేనని తెలిసింది. అనువదించినది అప్పటికి అక్షరాలా నలభై ఏళ్ళక్రితం! మళ్ళీ ప్రింట్ వేస్తే బావుంటుందని ఆ సందర్భంలో కల్యాణి గారితో మాట్లాడుతూ “మాధవి” ఏయే భాషల్లో, రూపాల్లో వచ్చిందో ఇద్దరం లెక్కవేశాం. నవల, నాటకం, పద్యకావ్యం.. ఒక్క తెలుగులోనే ఎన్ని రూపాలు దిద్దుకుందో మాధవి!

కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై “విషాద మాధవి” పద్యకావ్యానికి రాసిన ముందుమాటలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారన్నారూ.. “మహాభారత కవులెవరూ మాధవికి జరిగిన దారుణమైన అన్యాయాన్ని గుర్తించనూ లేదు, సానుభూతి చూపనూ లేదు. నాకు తెలిసినంతలో మాధవి అనుభవించిన దుఃఖాన్ని, హింసనూ లోకం దృష్టికి తెచ్చిన గౌరవం కన్నడ రచయిత్రి అనుపమా నిరంజనకు దక్కుతుంది. ఆమె “మాధవి” అన్నపేరుతో ఒక గొప్ప నవలను చాలాకాలం క్రితమే రాశారు. అది తెలుగులోకి కూడా అనువాదం పొంది, పాఠకుల మన్ననను సంపాదించుకుంది.” అని.

వల్లంపాటికి కూడా అనువాదకురాలి పేరు గుర్తులేదు అన్నాను కాస్త కినుకగానే..

ఆవిడ నవ్వేసి, “మీరు గమనిస్తే.. మాధవిని మాధవికోసమే జనం ఇష్టపడ్డారు కానీ అనువాదకురాలి పాత్ర నేపథ్యంలోనే ఉండిపోయింది. అది నిజమైన కాంప్లిమెంట్. నచ్చింది నాకు..” అన్నారు. కల్యాణి గారి గొంతులో “మీరు గమనిస్తే…” అని తేలికపాటి అనునాసికంతో కలిసిన దీర్ఘం, దానిని ఆనుకుని వాక్యపు ఎత్తుగడ..  ఆమె మాటలు విన్నవారందరూ ఊహించుకోగలరు.. ఆవిడ మార్క్ అది. అలాంటి మాటతీరు నేనింకెవరిదగ్గరా వినలేదు. కల్యాణి గారి మాటల్లో ముక్కలు చెక్కల వాక్యాలెప్పుడూ లేవు. స్పష్టమైన సులువైన వాక్యాలతో నిక్కచ్చిగా మాట్లాడేవారు. కాలేజీలో ఆవిడ దగ్గర పాఠాలు నేర్చుకున్నవాళ్ళు అదృష్టవంతులు.

“ఎఫ్బీలోకి వచ్చిందాకా అసలు నేనది అనువాదం చేశానని ఎవరికీ తెలియదు. మాధవి చదివిన వారికి కూడా గుర్తుండదు. అది ఆ పుస్తకపు బలం.” అని సంతోషంగా అన్నారు. సాహిత్యాన్ని సాహిత్యం కోసమే ప్రేమించే సహృదయం అందరికీ సాధ్యం కాదు.

ఆ సందర్భంలోనే  కన్నడ కవర్ పేజీ మీద పౌరాణిక కాదంబరి అని చదివి ‘కాదంబరి’ అంటే ఏమిటండీ అనడిగాను. “నవల కదా!” అన్నారు. అక్కడితో ఊరుకుంటే కల్యాణి గారెలా అవుతారు! నిఘంటువు తిరగేశారు. సంతృప్తికరమైన అర్ధం, అన్వయం దొరకలేదు. కాసేపటికి ఆవిడే “పదార్థ చింతామణి” అనే కన్నడ ఫేస్బుక్ గ్రూప్ లింక్ తో వచ్చారు. “బాణుని కాదంబరి కల్పితగాథ. అక్కడ నుంచి నవల అనే అర్ధంలో వాడుకలోకి వచ్చిందట. మీ కుతూహలం వల్లే ఇంత ప్రయత్నం చేశా. చిన్నప్పట్నుంచీ ఆ పదం వాడుతూండడం వలన నేనూ అంత ఆలోచించలేదు. ఎంత అందమైన పేరో చూడండి!” అన్నారు. కొత్త విషయం, అది కూడా సాహిత్యానికి సంబంధించినది తెలుసుకున్న సంతోషాన్ని ఇద్దరూ సమానంగా అనుభవించగలగడమే కదా స్నేహమంటే.

కల్యాణి గారు అనువదించిన “మాధవి” తో పాటుగా, శర్వాణి గారి అనువాదం “వసంత గానం” కూడా పునర్ముద్రణ అయింది. ఆ నవల కబుర్లు చెప్తూ.. “కాలేజీ నుంచి వచ్చి ఆ పూటకి అమ్మ అనువదించిన మేరకు వసంతగానం ప్రూఫ్ దిద్దడం.. దిద్దిన పదిపేజీల్లోనూ ఏ వంట ప్రస్తావన ఉంటే అది చేసిపెట్టమని అమ్మని సతాయించడం..” అని పకపకా నవ్వారు.

కల్యాణి గారి బాల్యం గురించి చిత్రకారుడు బాలి తన ఆత్మకథ “చిత్రమైన జీవితం” లో ఓ సరదా సంగతి రాశారు. అది పంపితే “అవునా.. అనకాపల్లిలో మా ఇంటికి ఆయన వచ్చేవారు. మంచి కథలు కూడా రాశారాయన.” అన్నారు. మా సంభాషణ ఎప్పుడూ సాహిత్యపు చెలమల్లోనే తిరుగుతూ ఉండేది.

ఓసారెప్పుడో అడిగా.. “మీ అమ్మగారూ, మీరూ అనువాదాలు కుటుంబ పరిశ్రమలా చేసేవారని చెప్తూ ఉంటారు కదా. మీరసలు ఏ భాషలో ఆలోచిస్తారు?” అని. తడుముకోకుండా “కన్నడ” అన్నారు.

“నాలుగో తరగతిలో ఉన్నప్పుడు కర్ణాటక వదిలేసాను. అయితే ఇప్పటికీ కన్నడ సీరియల్స్ చూస్తూ ఉంటాను. సీరియల్ అన్నానని నవ్వకండి.  ‘కన్నడతి’ అని పాండెమిక్ మధ్యలో మొదలైన సీరియల్. ఎపిసోడ్ చివర్లో హీరోయిన్ చేత రోజుకొక కన్నడ పదం ఎలా పలకాలో, ఆ పదం పుట్టుపూర్వోత్తరాలేమిటో చెప్పిస్తున్నారు. “సిరిగన్నడం గెల్గె” దాని పేరు.. ఆ రెండు నిమిషాలూ చూసి తీరాల్సిందే. పిల్లా పెద్దా అందరూ చూస్తారట కూడా! భాష మీద అంత ప్రేమ వాళ్లకి! ఈరోజుకి కన్నడ దేశంలో గణేశ మంటపాల్లో, పూజల్లో మంగళహారతి పాడుతారు. టీవీలో బసవణ్ణ పదాలు, అక్కమహాదేవి పదాలు వినిపిస్తాయి. అభివృద్ధి దేశమంతా ఒకేలా జరుగుతోంది కదా.. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మరి. అయినా కన్నడ సాహిత్యం మౌఖికంగా బతికి ఉంది, పుస్తకాలు అచ్చవుతున్నాయి, అమ్ముడుపోతున్నాయి.”  అని ఆమె చెపుతూంటే నాకు మాటలేదు! అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టు భాషాభిమానాన్ని తెలుగుకి విస్తరించారు కల్యాణిగారు. నాబోంట్లకి కాస్త సాంత్వన, ప్రేరణ.

అనువాదం థాంక్ లెస్ జాబ్ కదా.. అంటే “ఆడుతూ పాడుతూ చేసేశాం. అదొక హాబీ మా ఇంట్లో..” అని నవ్వేశారు. సాహిత్యాభిమానం అంటూ ఊకదంపుడుగా వినిపించేమాట ఇలా బహు కొద్దిమందికి మాత్రం అతికినట్టు సరిపోతుంది. పదాల విలువ కాపాడ్డానికి అప్పుడప్పుడూ అన్నివైపుల నుంచీ కొందరు వస్తూంటారు. పడుతూ లేస్తున్న తెలుగు సాహిత్యానికి మనం ఇవాళ కొత్తగా చేర్చేదేముందన్న నిస్సత్తువ కలిగినప్పుడల్లా కల్యాణి గారిలాంటి unsung heros గుర్తొస్తే మళ్ళీ ఉత్సాహం పుంజుకుంటామనడం అతిశయోక్తి కానేకాదు.

“సాహిత్యం స్వరూపం మారిపోతోంది. కన్నడలోంచి తెలుగులోకి అనువాదాలు బాగానే అయ్యాయి కానీ, తెలుగులోంచి కన్నడలోకి సరైన సాహిత్యం వెళ్ళలేదనిపిస్తుంది.. మా పిన్ని కోమలి గాంధారం, కృష్ణవేణి.. ఇలా చాలానే అనువదించారు. ఇంకా ఉన్నాయి కదా. మరో ముఖ్యమైన విషయం.. ఏ భాష బతకాలన్నా బాలసాహిత్యమే ఆయువుపట్టు. కన్నడలో అనుపమ నిరంజన “దినక్కొందు కథె” అని మూడువందల అరవై ఐదు కథలు రాశారు పిల్లలకోసం! పన్నెండు భాగాలు ఇప్పటికీ రీప్రింట్లు అవుతున్నాయి.  తెలుగునాట మన పిల్లలూ యువకులకీ, కన్నడ దేశంలో వారికీ తేడా ఏముంది? అదే టెక్నాలజీ అన్నిచోట్లా.. కదా? అక్కడా అన్నిరకాల సాహిత్యమూ వస్తుంది. అక్కడా ప్రసారమాధ్యమాలు మారిపోతున్నాయి. మార్పు అనివార్యం. అయితే మారుతున్నవాటిని మనం సరిగ్గా వాడుకోవడం లేదు. అదీ తేడా.”

“ఇంకా చాలా పని ఉంది..” అనుకునేవాళ్లం మాట్లాడుకున్నప్పుడల్లా. సాహిత్యం విషయంలో “ఆఁ ఏముందిలే..” అనే పెదవి విరుపు కానీ, నిరాశ కానీ కల్యాణి గారి మాటల్లో ఎప్పుడూ లేదు. ఆ నవ్వులాగే సాహిత్యం మీద ఆమెకున్న ప్రేమ కూడా మనలో ప్రతిఫలించి తీరుతుంది.

కల్యాణి అనే పేరుతో నాకున్న అనుబంధం గురించి చెప్పానోసారి.

“నాకు వాణి అని పెట్టాలనుకున్నదట అమ్మ.. నాన్న ఛాయిస్ కల్యాణి. ఏంటో తెలుసా. ఇంట్లో రంగు తక్కువ నేనే.. అందుకని తొళద కెండ అనేవారు. కడిగిన నిప్పు.. అని.” అని నవ్వారావిడ. ఊదా రంగు శాలువ కప్పుకుని నవ్వుతున్న కల్యాణి గారి లేటెస్ట్ ఫోటో.. ఆ వెంటనే ఐదుగురు చిన్నిచిన్ని పిల్లలు కూర్చున్న బ్లాక్ అండ్ వైట్  ఫోటో ఒకటి వాట్సాప్ లో వచ్చాయి. “చివర్లో రెండు జడలు నేను..” అని చెప్పారు. మీ చిన్నప్పటి కబుర్లు రాయచ్చు కదా అంటే నవ్వేశారు.

ఆవిడతో మాట్లాడితే ఎన్ని రిఫరెన్సులు దొరికేవంటే.. కుక్కపిల్ల అరుపు విని “మీరు ఎవ్రీ నైట్ జోసెఫీన్ చదివారా? జాక్వెలిన్ సూజన్ ది. మిస్ అవకండి. నా పుస్తకం ఎక్కడుందో..” అన్నారొకసారి. నేను చదివి, ఆవిడకి ఓ కాపీ అందజేస్తే “గుర్తుంచుకుని పంపారా? థాంక్యూ! నేనోసారి చదివి వసుధకి ఇవ్వాలి.” అన్నారు.

మంచు ఉదయాల ఫోటో పంపగానే “ఈమధ్య నాకు సూర్యుడిలా ఫోటోల్లోనే దర్శనమిస్తున్నాడు..” అని డీలా పడిపోయేవారు. మళ్ళీ కాసేపట్లోనే పువ్వులో, దీపపు వెలుగులో, ఇంకాస్త మంచిరోజైతే ఆవిడనవ్వులో నావైపుగా వచ్చేవి. హఠాత్తుగా అవి ఆగిపోవడం తీరని లోటే. అలా అనుకుని కన్నీళ్ళలోనే నిలిచిపోతే కల్యాణి గారికి అస్సలు నచ్చకపోవచ్చు.

ఇంకా చాలా పని ఉంది కల్యాణి గారూ.. మీరిచ్చిన స్నేహం, స్ఫూర్తి, మీ సాహిత్యాభిలాష ప్రతి ఉదయం గుర్తొస్తూనే ఉంటాయి. వెళ్ళిరండి.. థాంక్ యూ!

*

సుస్మిత

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్చ్.. ఎంత ఆలస్యంగా పరిచయమయారో నాకు. అందీ అందకుండా జారిపోయిన అపురూప స్నేహం ఆమెది.

    వీరలక్ష్మి గారింట్లో ‘కొన్ని శేఫాలికలు’ పుస్తకావిష్కరణకి వచ్చి విజయవాడలో ఉన్న ఒక్క రోజూ అపురూపమైన సాహితీ నందన వనంలో విహరించిన అనుభూతి! అలా ముగ్గురు సాహితీ ప్రియులు ఒకేచోట ఉండాలని కోరుకుని ఒకచోటే ఇళ్లు తీసుకుని రోజూ కలిసి సాహిత్యాధ్యయనం చేయడం, ఆ మకరందాన్ని ఆస్వాదించడం ఈ ఒక్క చోటే చూశాను.

    చక్కని నివాళి అందించారు.

  • ఆవిడ నాకు అంతగా తెలియదు. కానీ, ఇప్పుడు ఈ పోస్టు చదవగానే నామీద నాక్కోపం వస్తోంది. ఎందుకంటే ఒకే ఊళ్ళో ఉంటూ, దగ్గర తావులోనే బ్రతుకుతూ, అప్పుడప్పుడూ సాహితీ సభల్లో ఎదురుపడుతూ కూడా పరిచయం చేసుకోలేదని! ఇప్పుడు పరిచయం చేసుకుందామన్నా వీల్లేదు కదా!!!
    ఏమైనా ఆవిడ ఇష్టపడి అనువదించిన పుస్తకాలన్నీ అభిమానంగా చదువుకుంటాను. అంతే, చేయగలిగింది!

  • ఈ రోజు ఉదయం నెచ్చెలి లో వారి ముఖాముఖి విన్నాను. తన కథలు గురించి చెప్తూ తను మరిచిపోయ్యాను. ‘రెండో మూడో కథలు సుస్మిత వెతికి పంపింది నాకు అని చెప్పారు. కొంతమంది అంతే… చెప్పాపెట్టాకుండా వెళ్లిపోతారు. శర్వాణి గారి కథల సంపుటి తెద్దామనుకున్నట్టున్నారు. అది ఎంత వరకు వచ్చిందో మరి!

  • మీ నుండే నాకు ఆమె పరిచయం ! ఎఫ్‌బి లో సన్నిహితురాలయ్యారు. చక్కని నివాళి !!!

  • క్రితం నెల విజయవాడ అమ్మాయి,మనవరాలితో ఓపని మీద వెళ్ళి అలా వీరలక్ష్మిగారిని కలవటానికి వెళ్ళాను.అయితే ఓ గంట ముందే ముగ్గురు మిత్రులు చెన్నై పాటకచ్చేరీకి వెళ్ళి తిరిగొచ్చారని వీరలక్ష్మి గారు చెప్పారు.కళ్యాణి గారిని కలవాలనుకుంటే అలసిపోయి పడుకున్నారని తెలిసి డిస్టర్బ్ చేయటమెందుకని వెళ్ళిపోయాను.ఎంత పొరపాటు చేసానని ఇప్పుడు అనిపిస్తోంది.

  • ప్రేమ పూర్వక నివాళి. చాలా బాగా వ్రాశారు.

    ఆమె చిరునవ్వు ముఖాన్ని మర్చిపోవటం అంత సులభం కాదు.
    విజయవాడలో సాహితీసమావేశాల్లో వీరలక్ష్మీదేవి గారు, వసుధరాణి గారితో కలిసి కనపడేవారు, పలుకరించేవారు.

    కల్యాణి గారు మనల్ని వదిలివెళ్ళిపోయారు అని తెలిసిన తర్వాత వీరలక్ష్మీదేవి గారిని కలిసి మాట్లడాను.

    కల్యాణి గారు చాలా మనోధైర్యంతో, తనకు నచ్చిన విధంగా, నవ్వుతూ తన జీవితాన్ని గడిపిన తీరు నాకు చాలా నచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు