1
సారంగకి పన్నెండేళ్ళు నిండాయి. అంటే, ఇప్పుడు టీనేజ్ లోకి అడుగుపెడుతోంది.
ఈ టీనేజ్ వయసులో కష్టాలూ వుంటాయి, సంతోషాలూ వుంటాయి. అలాగే, ఇంకేమిటో అర్థం కాని అనుభవాలూ వుంటాయి. కానీ, ఒక నిలకడ ఏదో తెలుస్తూ వుంటుంది. ఇన్నేళ్లు నిలదొక్కుకున్నామన్న తృప్తితో నిండిన భావమేదో ముఖమ్మీద మెరుస్తూ వుంటుంది. తెలుగు సాహిత్య రంగంలో “సారంగ” కేవలం ఒక పత్రిక కాదు, చాలా మంది రచయితలకు, వేల సంఖ్యలో వుండే పాఠకులకు తోడూ నీడా.
ఇది సాహిత్య స్థల, కాలాలన్నీ పరిమితమై పోతున్న దశ. ఇంకో వైపు రెండు తెలుగు రాష్ట్రాలూ రచయితలూ కవులతో క్రిక్కిరిసిన రైలుబండిలా వున్నాయి. అక్షరాన్ని అక్షరంగా నమ్ముకున్న వాళ్ళ ప్రయాణాలు సజావుగా సాగుతాయన్న భరోసా ఏమీ లేదు. కొంతమందికి రానూపోనూ టికెట్లు కూడా దొరకడం లేదు. దీనికి తోడు ఇంకొంతమంది దొంగ ప్రయాణీకులు. వాళ్ళు టికెట్ వున్నవాళ్ళ కంటే దర్జాలు వొలకబోస్తుంటారు. అధికారం చెలాయిస్తుంటారు. వాక్యం రాసే శక్తి లేకపోయినా కేవలం వాక్ధాటి మీదనో, రాజకీయ పరపతి మీదనో గమ్యం చేరుకుంటూ వుంటారు. ఏ పత్రికకీ , ఏ రచయితల సంఘాలకీ ఇలాంటి వాటిని అడ్డుకునే శక్తీ సామర్ధ్యం లేవు. వాటిని అడ్డుకోవాలన్న కనీస కోరిక కూడా లేకపోవచ్చు. చాలాసార్లు మనం ఏం చేయగలమన్న ప్రశ్న కూడా బిక్కచచ్చిపోతోంది. ఏమీ చేయలేమన్న అపనమ్మకం కూడా బరువెక్కుతూ వుంది. నిజమే! ఇది మనం గట్టెక్కలేని గండం.
అయినా, ఒక చిన్న ప్రయత్నమేదో కావాలి. ఒక భరోసా ఏదో ఇవ్వాలి- అన్న తపనలోంచి పుట్టిందే- సారంగ!
2
పన్నెండేళ్ళ ప్రయాణంలో సారంగ ఎదుర్కొన్న సవాళ్ళు అనేకం వున్నాయి.
మొదటి దశలో అసలు రచనలే కరువు. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా రచనలు. ప్రతిరోజూ కనీసం పాతిక ముప్ఫయి రచనలు చదువుతున్నాం. ఇవి గాక మేం ఆయా సందర్భాల కోసం ప్రత్యేకంగా రాయించే రచనలూ వుంటాయి. అంటే, ఒక పూర్తి స్థాయి పత్రికగా మారింది సారంగ. ఇదివరకటి మాదిరిగా కేవలం ముగ్గురితో నడిచే పని కాకుండా పోయింది. పైగా, పక్షానికోసారి కావడం వల్ల పనిభారం మూడు రెట్లు పెరిగింది. ఈ కొత్త పనిభారాన్ని ఎదుర్కోవడం ఎట్లా అనుకునే లోపు కొత్త కొత్త పనులు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే కొందరి సాయం తీసుకోవడం మొదలెట్టాం. కొన్ని శీర్షికల నిర్వహణ కొందరికి పూర్తిగా అప్పజెప్పాం. ఈ విషయంలో మాకు లభించిన సహాయ సహకారాలు నిజం చెప్పాలంటే- అద్భుతం! సారంగ ని తమ పత్రికగా భావించి, ఇలాంటి బాధ్యతల్ని తలకెత్తుకున్న వాళ్ళున్నారు. అది సారంగకి పూర్తిగా కలిసి వచ్చింది. ఇలా తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు.
కానీ, ప్రధానమైన సమస్య అలానే మిగిలిపోయింది. ఈ సమస్య ఏమిటంటే, రచయితలూ కవులు తుదిప్రతి పంపించడంలో అశ్రద్ధగా వుండడం! రచన అనేది చిత్రరచన లాంటిదే. లేదా, అందరిముందూ సంగీత కచేరీ లాంటిదే. ఈ రెండీటీకి చాలా శిక్షణ కావాలి. చిత్రకారులు చివరి రేఖా రూపం పదునుగా చిత్రిక పట్టి కానీ లోకానికి చూపించరు. అలాగే, ఎంతో రిహార్సల్ చేసి గాని, అందరి ముందుకీ రారు. రచన విషయంలో కూడా అంతే రూపశ్రద్ధ, సాధన అవసరం.
కొంతమంది సారంగ కి పంపించే తుదిప్రతులు చాలా సందర్భాల్లో చిత్తుప్రతుల కన్నా అన్యాయంగా వుంటున్నాయి. రచయితలు తమ రచన పట్ల తామే ఇంత నిర్లక్ష్యంగా వుండడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏమాత్రం మెరుపు కనిపించినా, ఆ రచనని ప్రోత్సహించాలన్న తపన మాది. అట్లా అని నాణ్యతలేని, వాక్యం తీరు సరిగా లేని రచనల్ని ఒప్పుకోలేం కదా! రచన తుదిప్రతి ఎలా వుండాలన్న విషయంలో సారంగ కి పట్టింపు వుంది. తనదైన శైలీ విధానం వుంది. సారంగ హోం పేజీలోకి వెళ్ళి చూస్తే రచయితలకు సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ రచన పంపించే ముందు దయచేసి వాటిని చదవండి. రచన తప్పకుండా సారంగ ఈమెయిల్ కి మాత్రమే పంపించండి. మీ వీలునిబట్టి msword document లో పంపించండి. లేకపోతే, ఈమెయిల్ లోనే రెండు మూడు సార్లు చదువుకొని, సరిచూసుకొని పంపించండి.
ఈ మధ్య ఈ విషయంలో మేం కొంచెం కఠినంగా వుండడం వల్ల నిజానికి కొన్ని మంచి రచనలు కూడా పరిశీలనకి తీసుకోలేకపోతున్నామన్నది వాస్తవం. అయినా సరే, ఈ విషయంలో కఠినంగా, పద్ధతిగా వుండక తప్పడం లేదు. రచయితలకు మరోసారి మా మనవి ఏమిటంటే- రచన తుదిప్రతి మాత్రమే పంపించండి. తుదిప్రతి అంటే మీరు ఎంతో శ్రద్ధతో, జాగరూకతతో ఎడిట్ చేసిన ప్రతి. అచ్చుతప్పుల్లేని ప్రతి. స్పేసులూ, పేరాగ్రాఫులూ సరిగా వుండే ప్రతి.
3
ఇలా అంటున్నామంటే – సారంగ లో లోపాలు లేవని కాదు. తప్పకుండా వుంటాయి.
వాటిని మీరు నిక్కచ్చిగా చెప్పే తీరాలని మేం కోరుకుంటున్నాం. ప్రతి రచన గురించీ, ప్రతి శీర్షిక గురించీ మీరు మాకు రాయండి. కామెంట్ల రూపంలో బహిరంగంగా రాయలేకపోతే, మా ఈమెయిల్ కి రాయండి. వాటిని మేం సహృదయంతో తీసుకుంటాం. మా పరిధుల్లో పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కొన్ని సాంకేతిక ఇబ్బందులు సారంగ లో వున్న మాట కూడా నిజమే.
ప్రస్తుతం మేం ఎంపిక చేసుకున్న సర్వర్ వాటిని అనుమతించని సందర్భాలూ వున్నాయి. అయినా సరే, వీలయినంత వరకు వాటిని అర్థం చేసుకొని, పరిష్కరిస్తాం. మరో విషయం- రచనలకు సంబంధించిన ప్రాధమిక పరిశీలన ఈ మధ్యకాలంలో కొంత జాప్యం జరుగుతోంది. అసంఖ్యాకంగా రచనలు వస్తూ వుండడం వల్లా, వాటిని చదవడానికి కొంత ఆలశ్యం అనివార్యంగా జరుగుతోంది. ఈ దిశగా మేం చేసిన మొట్టమొదటి పని- ఒక చదువరుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మాకు వచ్చిన రచనల్ని వీరు ప్రాధమికంగా పరిశీలన చేస్తారు. ఆ తరవాత మేం వాటిని చదివి, మా అభిప్రాయాలని మీకు రాస్తాం. వాటి ప్రకారం మీరు తుదిప్రతిని మార్పులతో పంపించాల్సి వుంటుంది. ఈ పద్ధతి ఎక్కువ మందికి నచ్చుతుందని మేం అనుకుంటున్నాం.
కొత్త ఆలోచనలకూ, కొత్త శీర్షికలకూ సారంగ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. మీ ఆలోచనలు మాతో పంచుకోండి. మరిన్ని కొత్త శీర్షికలకు మీ తోడ్పాటు అందించండి.
4
పన్నెండేళ్ళు నిండిన సందర్భంగా ఈ సంచిక నుంచి మీరు అనేక కొత్త శీర్షికలు చూస్తారు.
ఈ కొద్దికాలంలో ఒక ముఖ్య విషయాన్ని మేం గమనించాం. మన స్మృతి మరీ కురచ అయిపోతోంది. అయిదేళ్ళ కిందటి సాహిత్య సంగతులూ, రచనలు కూడా మన స్మృతిలోంచి పెట్టేబేడా సర్దుకొని ఎటో వెళ్లిపోతున్నాయి. వాటిని గుర్తుచేసుకునే మనఃస్థితి వుండడం లేదు. కుదురు లేదు. కొంచెం గతంలోకి వెళ్ళి, ఇప్పటి ప్రముఖుల తొలి రచనల ఆనవాళ్లని పట్టిచ్చే రెండు కొత్త శీర్షికలు చదవండి. పోయిన సంచికలోనే “మొదటి కథ కబుర్లు” మీరు చదివారు. ఈ సంచికలో “సిరి చుక్క మొగ్గ- తొలి కవిత ఆనవాళ్ళు” మీరు చదువుతారు. అలాగే, ఇంకా కొన్ని కొత్త శీర్షికలు మీకు కనిపిస్తాయి. అవీ చదవండి. మీ అభిప్రాయాలు రాయండి. ఇప్పటికీ చాలా మంది తమ అభిప్రాయాలూ ఫేస్ బుక్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. పత్రికలో ఆ అభిప్రాయాలు అచ్చవడం వల్ల అవి ఎక్కువ కాలం నిలిచి వుంటాయని మరచిపోకండి.
సారంగ చదువుతూనే వుండండి. సారంగకి రాస్తూనే వుండండి.
సారంగ మాత్రమే కాదు, మంచి సాహిత్యం కోసం ఏ కొద్దిపాటి ప్రయత్నం జరిగినా దాన్ని ప్రోత్సహిద్దాం. నలుగురితోనూ పంచుకుందాం.
-అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు
*
చిత్రం: రోజారమణి
సారంగ ఒక సాహిత్య పాఠశాల.
ఈ వేదిక మీద రాయడమే కాదు చదవడం కూడా మంచి అనుభవం. స్ఫూర్తి.
Congrats
పత్రిక నిర్వహణ కత్తిసాములాంటిదే. వచ్చిన ఆర్టికల్ దేనికి సంబంధించినదో సరిగా తూకం వేసి ఆహ్వానించినపుడే..సాహిత్యం పదికాలాలపాటు నిలదొక్కుకోగలదు. నిబద్ధత నిమగ్నత రెండు అవసరమే. స్పష్టమైన అవగాహన లేనివాటిని నివారించవలసినదే….నిరాటంకంగా కొనసాగుతున్న సారంగకు అభినందనలు
“సారంగ” కేవలం ఒక పత్రిక కాదు, చాలా మంది రచయితలకు, వేల సంఖ్యలో వుండే పాఠకులకు తోడూ నీడా.
సారంగ కు హృదయపూర్వక అభినందనలు.
కంగ్రాట్స్ సారంగ అండ్ టీం. way to go
12 ఏళ్లు పూర్తి చేసుకున్న సారంగకి దిల్ సే ముబారక్. ఇన్నేళ్లు ఒక పత్రిక నడపడం ఎన్నో వ్యయ ప్రయాసల ప్రయాణం. మీరు వెలుబుచ్చిన అభిప్రయాల్లో అది స్పష్టంగా కనిపించింది. ఎంతోమంది రచనలను ప్రోత్సహించినట్టు నా రచనలు కూడా ప్రచురించి నన్ను ప్రోత్సహించిన మీకు ఈ సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సారంగ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అందులో మీరు కల్పనా మేడం, రాజ్ కారంచేడు గార్ల కృషి ఎంతో ఉంది. మీ అందరికీ అభినందనలు. మున్ముందు కూడా సారంగ మీరన్న కొత్త శీర్షికలతో అలరించాలని ఆశిస్తున్నాను. మరోమారు సారంగకి సాల్ గిరా ముబారక్.
చాప్టర్ -2 నా గురించే రాసినట్లు ఉంది 😊 .
సారంగ కు శుభాకాంక్షలు . All the best .😍
సారంగ బృందానికి శుభాకాంక్షలు