1
నేమినాధునూరు
చీకటి రాత్రది దిగంబరి
పున్నమి రాత్రేమో పీతాంబరి
పగటి పూట మాత్రం శ్వేతాంబరి
చతుర్పూర్వలు వినిపిస్తాయి
అలనాటి ఆరామాల నుండి
పర్యుషాన పండుగలూ
ప్రకాశిస్తాయి లోగడ లోగిళ్ళ నుండి
సమ్వత్సరిలు సమసిపోవు
బహుముఖీన సత్యం
స్యాద్వాతమౌతుంది బహుశః
తీర్థంకరుని శిరసుపై
మఠమేసుకు కూచుందిది ఇన్నాళ్ళూ
సల్లేఖనవ్రత సజీవ సమాధుల
ప్రాణంతః పొరల నుండి ప్రత్యక్షమై
పునరుజ్జీవిస్తోంది
2
ప్రణయ జలధి
అలనాటి యవ్వననేత్రాలను
వెతుకులాడిన మార్గాలను
అనునయిస్తున్నాను
తెరలని తొలుచుకు వచ్చే
వీక్షణల వెనుక ఊగే
వయ్యారి వాల్జడలు
జలధి నుంచి
భూతలం పైకి విస్తరించటం
నా కనులతో కాంచుతున్నాను
సంచరిస్తున్నాను
విఫల ప్రేమల
సఫల ఆత్మహత్యల తావుల్లో
ప్రేమికుల కమ్మని మౌనాన్ని
పొదువుకెల్తున్నాయి
అలనాటి అలలు
నిరంతరాయంగా
ప్రియురాళ్ళ లోతైన కన్నుల్లో
నిండుగా మునిగింది సముద్రం
తీరని దాహతీరంలో
గోధుమ వర్ణపు ప్రేమికుల ఆత్మలు
పసిదోసిళ్ళతో ఆటలాడుతాయి
తీరుగ తీరుబడిగ యుగయుగాలు
*
Add comment