ప్రజాస్వామ్య మానవీయ విమర్శ కావాలన్న బహుళ 

సాహిత్య ప్రపంచంలోని నిశ్శబ్దాన్ని చెదరగొట్టే ప్రయత్నం ఈ పుస్తకం.

నేకతకీ వివిధతకీ ముంగిలిగా చెప్పుకున్న బహుళ పుస్తకం వచ్చి రెండేళ్ళవుతోంది. పర్స్పెక్టివెస్ సంస్థకి, సంపాదకుడు ఏకే ప్రభాకర్ కీ గల దృఢమైన సాహిత్య రాజకీయ దృక్పధాలకి తలొగ్గకుండా భిన్న భావజాలాల్ని ఒక తాటిమీదకి తెచ్చే సాహసోపేతమైన ప్రయత్నం చేసిందీ పుస్తకం. రాసినవాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు కృషిచేసిన విభాగాల్లోని ఖాళీలను పూరించే ప్రయత్నమే చేశారు. నిజాయితీతో కూడిన వీళ్ళ కష్టాన్ని అభినందించవలసిందే. అయితే ఈ పుస్తకం అదనంగా చేసిన మేలేమిటి ? కొత్తగా ఏం చర్చకు పెట్టింది ? దేన్ని కాదనింది ? అవునని దేన్ని సమర్ధించింది ? ఏకధ్రువంగా ఉండటం కన్నా వాస్తవికమైన వైరుధ్యాన్ని ఒప్పుకుంది. విమర్శ యొక్క అనువర్తితమైన (application) విషయాలని ‘తక్కువ’ చర్చకు పెట్టినా మూల సిద్దాంతపరమైన అంశాల్ని మాత్రం చక్కగా ఒకచోటకి చేర్చగలిగింది. ఆధునిక అస్తిత్వవాదాలు, తత్పూర్వ సాహిత్య సైద్ధాంతిక వాదోపవాదాలూ అన్నీ సద్దుమణిగి, సాహిత్య ప్రపంచంలో ఏర్పడ్డ ఒక నిశ్శబ్దాన్ని భగ్నం చేసే కష్టసాధ్యమైన ప్రయత్నం చేసిందీ పుస్తకం.

చర్చకు తీసుకున్న వస్తువుల్లో కొత్తదనం తక్కువ ఉంది. వ్యాసాల్లోని చాలా విషయాలకు అతివ్యాపిత (Overlapping) లక్షణం కనిపిస్తుంది. సాహిత్యంలో వస్తు శైలి శిల్పాల పరిశీలన (ఆదెపు లక్ష్మీపతి) ఏనాటిది ? అది అదనంగా ఏమి సమకూర్చగలిగిందన్న ప్రశ్న వస్తుంది. ప్రత్యామ్నాయ కవిత్వ శిల్పానికి దళిత కళాతత్వం ఏమేరకు దోహదపడిందీ (కోయి కోటేశ్వర్రావు గారి ‘బతుకు పేగు తెంచుకు పుట్టిన దళిత కళా తత్వం’) ; జీవన సాంస్కృతిక వాస్తవికతలో దళిత సాహిత్య సౌందర్య రూపురేఖలు (చల్లపల్లి స్వరూపరాణి) ఆసక్తి రేపిన వ్యాసాలు. సామాన్యుడి శ్రమలోని లయాత్మక సౌందర్యంలోంచి ప్రజల రాజకీయ చైతన్య స్వరంగా పాట ఈనాటికీ ఏలాంటి శక్తివంతమైన సాధనమో(పాటను విస్మరించిన సాహిత్య విమర్శ – కాశీం) బహుళ ప్రస్తావించింది. కాలానుగుణమైన మార్పులకి కారణాలను విశ్లేషించడంలో సాహిత్య పరికరాల చొరవకు సంబంధించిన స్పృహ ఒకటుంటుంది కదా. ఆ క్రమంలో వస్తువు మీది ఇష్టానికే  మొగ్గుచూపినట్లున్నప్పటికీ ప్రక్రియాస్వభావ రిత్యా శిల్ప విన్యాసం గురించి చాలా వ్యాసాల్లో స్థూలంగానో సూక్ష్మంగానో విలువైన చర్చ జరిగింది.

వాస్తవికత-కాల్పనికత (పాపినేని శివశంకర్); సామాజికత-సాహిత్యకత (పాణి) లాంటి వ్యాసాలు స్థిర విషయాల్ని పునర్మూల్యాంకనం చేస్తాయి. శివశంకర్ గారి ఉదాహరణలు కానీ, విమర్శకుడిగా చర్చనీయాంశం పట్ల అతను చూపిన తాటస్థ్యం వలన గానీ దాని సారం పాఠకుణ్ణి ఎటువంటి ప్రలోభానికీ గురిచేయదు. హత్తుకుంటుంది.

పాణి అభివ్యక్తిలో కొంత శుష్క (Dry) వచనముందనిపించినా  ప్రగతిశీల కవులూ రచయతల రచనల్లోని సామాజికతకుగల సాహిత్యక లక్షణాన్ని సహేతుకంగా బలపరచడం బాగుంటుంది. సాహిత్య విమర్శలో మార్క్సిస్టు తాత్వికతకున్న శాస్త్ర పరిధుల్ని సులువుగా విస్మరిస్తున్నవారిది ఉపయోగవాదమూ/జనరంజక వాదమని ముద్దుగా పిలుచుకోవచ్చనడం గంభీరంగా ఉంటూనే పెదవులపై చిర్నవ్వులు పూయిస్తుంది. కానీ నిడివి మీద తగినంత అదుపు చేసుండవలసిన వ్యాసం. ప్రశ్న పలుచబడుతోందన్న వ్యాసంలో కాత్యాయని గారు తెలంగాణేతర కవుల విగ్రహాల విధ్వంసం వెనుకనున్న భావజాల విధ్వంసంలో విప్లవ సాహిత్య సాంస్కృతిక సంస్థలు జనరంజకవాదానికి లోనయ్యాయంటుంది. పాణి-కాత్యాయనిగార్లిద్దరూ అన్న మాటలకర్ధమేమిటి ? సాహిత్య విమర్శలో ఎవర్నెవరు ఎందుకు ఏ కారణంగా రంజింపజేస్తున్నారో, తత్ప్రయోజనమెవరికేమిటో అన్న అంతర్మధనం ఎంత దాచుకున్నా దాగదు. పాణి వ్యాసం చదివాక సాహిత్య విమర్శ-మార్క్సిస్టు దృక్పధం (వి శ్రీనివాస్) వ్యాసం సారూప్యంగా తోస్తుంది గానీ మారిన తరం మార్క్స్ తాత్వికతని ఏమేరకు జీర్ణం చేసుకోగలుగుతోందోనన్న ఆలోచన చేస్తుంది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నవాళ్ళు ప్రభు భక్తులయ్యిన వాస్తవాన్ని అల్లం రాజయ్య కుండబద్దలు కొడతాడు. నీళ్ళకోసం ఉద్యమాలు నడుపుతున్న రాయలసీమ ప్రజల్ని తెలంగాణ పోరాటం నుండి గుణపాఠం నేర్చుకోమంటాడు. విమర్శ పుస్తకం చదువుతున్న స్పృహ కలిగిస్తాడు రాజయ్య.

సాహిత్య విమర్శలోని విస్మృత కోణాల్ని గురించి రాసిన వినోదిని గారి వ్యాసం ఈ సంకలనం  ప్రాణ మూలాన్ని తెలియజెబుతుంది. వినోదినేకాక ఇంకొకరిద్దరితో సహా ఆధునిక సాహిత్య విమర్శలోని బ్రాహ్మణ వాదపక్షపాతాన్ని; శూద్ర దళిత సమూహాల విస్మరణని చీల్చి చెండాడ్డం బాగుంటుంది. నిజం కనుక బాగుంటుంది. బ్రాహ్మణవాద భావజాలాన్ని మనం ఎన్నేళ్ళుగా విమర్శిస్తున్నాం ? వద్దని కాదు, చేయవలసిందే. కానీ దాన్నిదాటి నిర్మించుకోవల్సిన బలమైన పునాదుల సంగతేమిటి ? వర్తమానంలో అందుకు జరుగుతున్న ప్రయత్నాలేమిటి ? అందుకే ఆమె ప్రతిపాదించిన నూతన ప్రజాస్వామ్య మానవీయమైన విమర్శనా శాస్త్ర సందర్భాన్ని మెచ్చుకోవాలి. ముస్లిం అస్తిత్వాన్ని అస్మితవాదమని ఖాదర్ మొహియుద్దీన్ గారు ఎందుకన్నారో అతని నామకరణం (coinage) ప్రయోజనం పూర్తిగా నెరవేరినట్టనిపించదు గానీ, వినోదిని లానే ఖాదర్ గారు కూడా సామాజిక ప్రజాస్వామీకరణ సాహిత్యంలోకి రావల్సిన అవసరాన్ని బలపరుస్తారు. నారాయణస్వామి వెంకటయోగి కూడా ప్రజాస్వామిక భావనల్లోని ఖాళీలను అంబేద్కర్, జ్యోతీబా పూలే, పెరియార్ లాంటివాళ్ళ ఆలోచనలతో ఎందుకు నింపుకోవాలో మాట్లాడతాడు. గాంధీ, నెహ్రూ, రాధాకృష్ణన్ లాంటివారి భావజాలాల్లో కూరుకుపోయిన సాహిత్య దౌర్భల్యాన్ని జిలుకర శ్రీనివాస్ లేవనెత్తతాడు. గ్రామీణ సంక్షోభాలూ, ప్రజాపోరాట, బహుజన, ఆదివాసీ, ముస్లిం జీవితాల్ని గురించిన వ్యాసాల్లోనూ స్వానుభవమూ- సహానుభూతికి సంబంధించిన విభజన రేఖే స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు కాదు. పడ్డవాడి బాధ మరెవ్వరూ అనుభవించలేనిది. సమానంగా రాయలేనిది కూడా. అందుకే కులతత్వ వైషమ్యాలు, జండర్ రాజకీయలతో సహా వర్గ స్వామ్యం  ఎదుర్కుంటోన్న సవాళ్ళకి సాహిత్యం ఇవ్వగలిగిన ఆలంబన పట్ల విమర్శకున్న నిబద్దతని బహుళ నిజాయితీగానే చాటుకున్నది. మరి వీటితో ప్రమేయంలేకుండా సమాంతరంగా ఉండే ఇతర సాహిత్య రూపాల సంగతేమిటి? ఈ రెండింటిమధ్య గల సారూప్య వైరుధ్యాల్ని కూడా తాకవల్సిన అవసరమున్నది కదా ?

మల్లిపురం జగదీష్ గారు ఆదివాసీ సాహిత్యం దళితఅస్తిత్వమంత అభివృద్ది చెందకపోవడానికి వాళ్ళల్లో జాషువానో, అంబేద్కరో లేకపోవడమేనని అభిప్రాయపడ్డం సబబనిపించలేదు. జాషువా తన పద్య శైలిలోనే ‘విశ్వనరుడ నేను’ అని స్వయంగా చెప్పడాన్ని ఇక్కడ విస్మరించకూడదు కదా. అంబేద్కర్ చాటిన సారమైతే విశ్వజనీనమైనది. అలానే కొమురం భీము లాంటి వార్ని పోరాట యోధులే తప్ప ‘ఆదివాసీ సాహిత్యానికి’ లెజెండరీ/రోల్ మోడల్సు కాదన్న స్పృహలో మాట్లాడ్డం కూడా మొత్తం వ్యాసాన్ని ఇరుకున పడేసింది. ఏ కాలంలోనైనా కొంతమంది వ్యక్తులు స్పూర్తిప్రదాతలే కానీ, సామూహిక పోరాటానికి మించిన ప్రేరణ అస్తిత్వవాద సాహిత్యానికి ఏ మనుషుల్నుంచి మాత్రమే వచ్చింది? విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి మించిన వ్యక్తికేంద్రకమైన స్పూర్తి మరేదన్నా ఉన్నదంటే ఎవరన్నా ఒప్పుకుంటారా?

కవిత్వం అమ్ముడుపోని సరుకయ్యినందుకు సంతోషించేవాళ్ళుంటారు. కధల్నైతే మార్కెట్టే వదలట్లేదు. వ్రతం చెడుతున్నా ఫలితాలు దక్కకుండా పోతున్న విమర్శనెవరు ఆదరించాలి ? నేటి సాహిత్య వాతావరణంలో బహుళ లాంటి పుస్తకాలొచ్చి ఏంచేస్తాయి ? ఇంతకుముందున్న ప్రమాణాల్ని చెరిపేస్తాయా ? విమర్శకి శాస్త్ర ప్రతిపత్తి ఉండాలనో అవసరం లేదనో తీర్మానిస్తాయా ? ఏం చేసినా చేయకపోయినా ఉద్దేశ్యపూర్వక నిశ్శబ్దం పాటించినంతమాత్రాన ఆగిపోని ఒక కదలిక నిస్తాయి. మంచో చెడో, తప్పో వప్పో ఒక చర్చ చేస్తాయి. ఇలాంటి పుస్తకాలు మనచుట్టూ క్షణ క్షణానికీ మారుతున్న సామాజిక జీవన రూపాన్ని అర్ధం చేసుకునేందుకు కావల్సిన అవగాహన నిస్తాయి. ఒక ముందుచూపునిస్తాయి. జాగరూకతనిస్తాయి. తర్కం పాళ్ళు పెరిగినపుడు కొంత సంక్లిష్టం కూడా అవుతాయి.  మేధావుల్ని మాత్రమే అలరించే విచిత్ర పాకమూ అవుతాయి! అప్పుడేం చెయ్యాలి ?

అసురా అన్నట్టు విమర్శని వ్యర్ధ కలాపమనేద్దామా ? చదువరే తీర్పరన్న దీన్ని మొట్టమొదటి వ్యాసంగా వేసుకోవడంలో సంపాదకుని చమత్కృతికి మనం అబ్బురపడాల్సిందే. విందుభోజనంలో అత్యంత ఇష్టమైన తీపి పదార్ధాన్ని చివర్న తిందామనుకుని అట్టేపెట్టుకుని, అప్పటిదాకా తిన్న వంటకాలకి భుక్తాయాసం కలిగాక దాచుకున్న దాన్ని తింటే రుచి తెలుస్తుందా ? అందుకే అసురా వ్యాసం ముందర పెట్టడం ఏకే ప్రభాకరుని మాయోపాయం. అసురా విమర్శకుణ్ణి సృజనశీలి కాదంటాడు, పరాన్నభుక్కుడు, దళారి, సెల్ఫ్ అపాయింటెడ్ సింగిల్ జడ్జ్, నామ్కే వాస్తే పురోహితుడు లాంటి తిట్లు తిడతాడు. తిట్టాల్సింది తిట్టి, విమర్శ వద్దనడం నా ఉద్దేశ్యం కాదు, సృజనాత్మక హృదయం లేనివాడు, ధీసిస్సులు రాసిపారేసి విశ్వవిద్యాలయాల గ్రంధాలయాల్ని ఆక్రమించేవాడు, బ్రాహ్మణ్యపు అవశేషమైన మడికంపు గలవాడూ విమర్శకుడు కారాదని తనదైన ఉపమానాల్తో  ‘విమర్శ’ చేస్తాడు. కువిమర్శకుల పట్ల అతని అభిప్రాయాల్ని కాదనలేము గానీ, అనన్యసామాన్యమైన పాఠకులు కాకుండానో, సృజనాత్మక వ్యాపారం కాకపోతేనో  ఎందరో మహానుభావులు విమర్శకులుగా సాహిత్యానికి సేవ ఎట్లా చేయ గలిగారు? ఇతని మౌలిక వ్యాఖ్యల్ని స్వాగతిస్తూ ఎంతటి సానుకూలమైన ఆలోచన చేసినప్పటికీ ఈ ఆమూలాగ్ర వ్యాసము పుస్తకానికి చేసిన మేలు తక్కువేననిపించక మానదు. విమర్శకుడు తననితాను మేధావనుకుంటే ఎంత పొరబాటో, విమర్శకుణ్ణి మేధావిగా జమకట్టేవారిదీ అంతే పొరబాటవుతుంది. అట్లాంటి మేధావితనాన్ని కేవలం సాహిత్యేతర విషయముగా భావించవలసిందే. అయితే పాఠకుల్ని అసురా డిస్టర్బ్ చేస్తాడు. ఆమేరకు ఈ వ్యాసప్రయోజనం చాలావరకూ నెరవేరిందనిపించింది.

విమర్శలో ఉన్న బహుళవాదాన్ని (Pluralism) ఆధునిక-ఆధునికానంతర వాదాల్ని గురించిన చర్చల్ని లక్ష్మీనరసయ్య వ్యాసంలో ప్రవేశపెట్టిన తీరు ఆ దిశగా అపరిష్కృతంగా ఉన్న విషయాల్ని గుర్తుచేస్తుంది. స్థానికత-ప్రతిఘటన (అఫ్సర్); వలసలు విస్థాపనలు (అట్టాడ); డయాస్పోరాసాహిత్యం (వేలూరి వెంకటేశ్వర్రావు), వ్యాసాలు వస్తుపరంగా భిన్నమైనవి.ఇవన్నీ చదివాక బహుళ గొప్పతనమిదేనేమో అనిపించింది. తెలుగు సాహిత్యంలో ఇప్పుడున్న విమర్శ స్వరూపాన్ని ‘తగుమాత్రంగానైనా’ బహుళ సవాల్ చేయగలిగిందని ఊరట కలిగింది.

కారణమేదయినా? విమర్శ పుష్పక విమానం అయినా కాకపోయినా ? ఎన్ వేణుగోపాల్, హెచ్చార్కే, బీ తిరుపతిరావ్, సీతారాం, మేడిపల్లి, జూపాక సుభద్ర, రాచపాళెం, కె శ్రీనివాస్, శ్రీదేవి గారి లాంటి కొంతమంది విలువైన సాహితీ విమర్శకుల, ఆలోచనాపరుల ప్రాతినిధ్యం లేకపోవడం బహుళ ప్రదర్శించిన మేధోస్థాయికి పూరించలేని ఖాళీగానే తోస్తుంది. కానీ ఇంతమందిని ఒకచోటకి చేర్చే క్రమంలో సంపాదకుడు పడే యాతన వర్ణనాతీతం. అందుకు ఆర్కేగారినీ, ఏకే ప్రభాకర్ గార్నీ ఎంత అభినందించినా అది తక్కువేనేమో. ఈ బహుళ మరిన్ని కొత్త ఆలోచనల్ని రేకెత్తించే విమర్శ పుస్తకాలకి స్పూర్తినిస్తుందేమో ! వేచి చూద్దాం.

(ఈ పుస్తకం నవోదయా పబ్లిషర్స్, హైదరాబాదు వారి దగ్గర లభిస్తుంది. ధర 290/- ఫోన్: 040-24652387)

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతున్న అనుభవం.
    ఆలోచనాత్మక ప్రక్రియ విమర్శ అయితే,దాన్ని కూడా వివరంగా తెలుసుకున్నాం.శ్రీరాం గారి స్టాండర్డ్స్ కి అభినందనలు.

  • ఈ పుస్తకం చదవాలి అనిపించేంతగా ఉంది వ్యాసం
    సాహిత్యంలో విమర్సకి ఎంద ఆదరణ ఉందో ,అంతే విముఖత ఉంది!అయితే శ్రీరాం రాతల వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి!ఈ యివ కవికి నా అభినందనలు….

  • అన్నా గుడ్ మానింగ్…మీ వ్యాసం బహుళ ను తప్పక చదవాలి అనేలా ఉంది..విమర్శ పుస్తకం పై సార్థకమైన విమర్శనా వ్యాసం.ఒక పుస్తకాన్ని ఎలా ?ఎంత మనసు చదవాలో స్పష్టం చేసిన వ్యాసం.
    మీ వాక్య నిర్మాణంలో చాలా మంచి మార్పు వచ్చింది.బావుంది…నచ్చింది.అన్న..శుభాకాంక్షలు

  • బహుళ వ్యాసాల పై శ్రీరామ్ విశ్లేషణ బాగుంది..

    కానీ

    పాట గురించి కాశిం గారి వ్యాసంలో వంగపండు పాట ను ప్రస్తావించకపోవడం అన్యాయం. గుర్తుకు రాని‌ పాటా వంగపండు పాట? ఎలాచూడాలి దీన్ని.

    ఈ వ్యాసకర్తకూడా ఈ విషయాన్ని గుర్తిస్తే బాగుండేది..

    అభినందనలు

  • విమర్శ పుస్తకం పై మీదైన పరామర్శ….సినిమా తప్పక చూడాలనిపించే రాజమౌళి టీజర్ లా ఉంది..
    కుడోస్ శ్రీరాం జీ👍👍👍👌👌💐

  • బహుళ సాధించిన విజయం గురించి, సాహిత్యానికి చేర్పుగ ఏం చేసింది అన్న విషయాన్ని చాలా బాగా వివరించారు సార్. అందులోని ఒక్కొక్క వ్యాసాన్ని మీదైన చూపుతో పరామర్శ చేయడం బాగా నచ్చింది. ముగింపు లో మీ వాక్యాలు ఆలోచనాత్మకంగ ఉన్నాయి సార్ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు