ప్రచ్ఛన్న హింస

వీధిలో గొంతెత్తి అరిచినప్పుడు

వాడు

ఇంటి చుట్టూ ఇనుప ముళ్ళ కంచెను మరో అడుగు పెంచుకున్నాడు

 

చూపుతో శబ్దాన్ని సానబెట్టి ప్రశ్న చేసినప్పుడు

వాడు

బానెట్లకు చట్టాలను చుట్టే పనిలో పడ్డాడు

 

నెత్తుటి గాయమై కాగితం మీద పడి

కవిత్వాన్ని దుఃఖించినప్పుడు

వాడు

ఎక్కిళ్ళ చప్పుడుకు గురిపెట్టడం మొదలు పెట్టాడు

 

నోరు బిగపట్టుకుని నిశ్శబ్దమైనప్పుడు

దేహాన్నొక వ్యూహంగా చూసి చుట్టూ సైన్యాన్ని మోహరించాడు

 

2.

నిశ్శబ్దం…

సలుపుతున్న గాయం లాంటి నిశ్శబ్దం

కదలని కంటి నుంచి కల జారిపోతున్ననిశ్శబ్దం

ఎడతెగని కలత వంటి నిశ్శబ్దం

శబ్దంగా ఎదుగుతున్న నిశ్శబ్దం…

వాడిని నిద్రపోనివ్వదు

ఆ నిశ్శబ్దాన్ని పసిగట్టేందుకు వాడు

పగలూ రాత్రీ జామర్లతో ఒంటరిగా భయం భయంగా వెతుకుతుంటాడు-

 

ఒకడిది పిడికిట్లో బిగుస్తున్న నిశ్శబ్దం

మరొకడిది నిశ్శబ్దానికి తెగి పడుతున్న శబ్దం

 

3.

నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా

అట్ట ముక్క మీద నినాదం కాకున్నా

వీధిలోకి వచ్చి అరవకున్నా

వాడెలాగూ నీ ఇంట్లోకి వస్తాడు

నీ నుంచి నువ్వు పారిపోతుంటే

నీ దేహాన్నే నీకో జైలు చేసి కానుకిస్తాడు

నిన్ను సరిహద్దు మీద కాపలాగా నిలబెడతాడు-

యుద్ధానికీ యుద్ధానికీ మధ్య వాడు

పాటల సమాధుల మీద కోటలనే నిర్మిస్తాడు

4.

నీకు నువ్వే వెన్ను చూపించుకునే

ఆత్మిక హింసల చారిత్రక పునరావృతాల నడుమ

నువ్వెప్పటికైనా దట్టించిన నిశ్శబ్దమై పేలి పోవల్సిందే-

*

పసునూరు శ్రీధర్ బాబు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇవ్వాళ మద్యాహ్నం శ్రీధర్ గారికి ఫోన్ చేసి సర్ మీరు కవితా రాశి చాలరోజులయిందని ప్రశ్నిస్తే ఇంత మంచి కవిత రాశారంటే సంతోషంగా ఉంది.]

    వాడెలాగూ నీ ఇంట్లోకి వస్తాడు

    నీ నుంచి నువ్వు పారిపోతుంటే

    నీ దేహాన్నే నీకో జైలు చేసి కానుకిస్తాడు

    నిన్ను సరిహద్దు మీద కాపలాగా నిలబెడతాడు-

    యుద్ధానికీ యుద్ధానికీ మధ్య వాడు

    పాటల సమాధుల మీద కోటలనే నిర్మిస్తాడు

  • పసికట్టడం ఒక మార్మిక విద్య
    అది పసునూరికి బాగా తెలుసు!!

  • నిశ్శబ్దం కాదు, యుద్ధానికి సమాయత్తం కమ్మని శబ్దానికి పదును పెట్టిన కవీ, వందనం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు