వాన కురిసే దృశ్యం కోసమే
– నందిని సిధారెడ్డి
నీటికోసం అలసిపోయిన
మనిషిని లాలించేందుకు
మబ్బు
వేల చేతులు చాస్తుంది
వాన కురిసే దృశ్యం కోసమే
ఇప్పటిదాకా ఎదుర్చూసింది
చంటిపిల్లాడిని కాళ్ల మీద బోర్లా వేసుకుని
స్నానం చేయిస్తున్నట్టు
గగనతలం భూమికి తలస్నానం పోస్తుంది
ముడుచుకున్న గొడుగులు
వందలాది ఒక్కసారి విరబూసి
రోడ్లమ్మటి కదుల్తుంటాయి
తడిసి వొణుకుతున్న యూనిఫామ్ పిల్లలు.
ఒలుకుతున్న నీటిముత్యాలతో
కిలకిల్లాడుతూ తేలిపోతున్న అమ్మాయిలు
వాన కురిసే దృశ్యమే వేరు
ఉన్న ఒక్క గోచి ఊడబీకేసి
చినుకుల్లో చిందులేస్తున్న
గిరిజన బాలుడి పరవశమే చూడాలి
రైతు కళ్లలో
ఆనందం కురిసే ఆ దృశ్యమే వేరు
సరదా పిల్లలు పడవాట ఆడుకోవటానికి
వీధుల్లో జలాశయాలు దించి వెళ్తుంది వాన
దిసమొలల్తో దిక్కులేకుండా ఉన్న చెట్లకు
కొమ్మలిచ్చి రెమ్మలిచ్చి
కోట్లాది ఆకులిచ్చి రంగు పులిమిపోతుంది
పచ్చరంగుతో హోళీ ఆడినట్లు
నేల తనువంతా ఒకటే రంగు
వాన కురిసింతర్వాత
అడవి శోభే మారిపోతుంది
నవనవలాడే ఆ శోభకోసమే
ఇన్నాళ్లు ఎదురుచూసింది
పొదలతో పొడవాటి ఆకుల్తో
చిగురు తొడిగే మన హృదయంతో
దట్టంగా అల్లుకునే దృశ్యం కోసమే
ఇన్నాళ్లూ వేచి ఉంది
నీళ్లు దొరకని గ్రీష్మంలో పరుగెత్తించి
ముప్పుతిప్పలు పెట్టినవాడు
ఇప్పుడు గిజగిజా తన్నుకొంటున్నాడు
సొగసైన వనంలో
పిట్టల్ని కొట్టడానికి వచ్చిన సోగ్గాడు
దేన్నీ పోల్చుకోలేక దద్దరిల్లుతున్నాడు
వలనెగరేసుకు పోయిన పావురాల కథ తెలిసీ
వలవేసి కూచున్న పెదరాయుళ్ల నేమనాలి?
జీవోలు పట్టుకొచ్చినవాన్ని చూసి
పూలు కిసుక్కున నవ్వుతాయి
హద్దులు దాటిన అహంకారంతో
అడుగుపెట్టిన వాన్ని చూసి
గడ్డిచిల్కలు గుసగుసలాడుతాయి
వనగీతాల మీద నిషేధరేఖలు పనిచేయవు
గడ్డిమోపులూ ఆకుపొదలూ
ఒడిచాపి ఆత్మీయుల్ని ఆదుకుంటాయి
కవాతులు చూసి జలపాతాలు జనకవు
వానాకాలం తీరేవేరు
వనశోభలో మునిగితేలే ఆ అనుభవమే వేరు
ఎంతకోరుకున్నా ఒక్కకాలమే ఎప్పుడూ ఉండదు
ఎండాకాలం తర్వాత
వానాకాలమే మరి.
9-9-1992
( నందిని సిధారెడ్డిగారి ” ప్రాణహిత”
కవితా సంపుటి నుంచి )
—-
వానలు కురుస్తున్నప్పుడు అనేక దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఊహా పటిమ కల్గిన కవులు అందరూ చూసే దృశ్యాలనే మరోరకంగా చూస్తారు. వర్ణనలు చేస్తారు.
ప్రాచీన కవులు వారి కావ్యాల్లో ఎన్నో హృద్యమైన వర్ష ఋతు వర్ణనలు చేశారు. కొన్నిటిని చూద్దాం.
కం. కుంభీనసములు వ్రేలిన
గుంభనమున గుంభిహస్త గురుతర ధారా
రంభమున రేయు బగలున్
గుంభద్రోణములు వట్టి కురిసెల్ వానల్
సంకుసాల నృసింహకవి, “కవికర్ణరసాయనము”లో వానలు కురిసిన తీరును చిత్రించిన పద్యమిది.
కురుస్తున్న వర్షధారలు ఎలా ఉన్నాయంటే – ఆకాశంనుంచి పాములు ( కుంభీనసములు ) వ్రేలిన విధంగా వున్నాయి. మరికాసేపటికి అవే ఏనుగుతొండాలంతటి పెద్ద పెద్ద ( గురుతర ) ధారలుగా మారిపోయాయి. రాత్రింబగళ్లు కుండలు, దోనెలు ( కుంభ – ద్రోణ )పట్టి గుమ్మరించినట్టు వానలు కురిశాయి.
నాగయామాత్యుడు, ఆధ్యాత్మ రామాయణంలో వర్షాకాలం వచ్చినప్పటి విశేషాలను ఇట్లా వివరించి చెప్పాడు:
” వర్షాకాలం తమకు బాధాకరం కాబట్టి హంసలు పారిపోయాయి. మబ్బుల్ని చూసిన సంతోషం వల్ల నెమళ్ళకు ఆటలు చెలరేగాయి. మబ్బులు ఉబ్బి వృద్ధి చెందాయి. క్రొత్త మెరుపుతీగలు జతకలిశాయి. చల్లని గాలులు వ్యాపించాయి. మన్మథుడు జాజిపూల బాణాల గుంపులను నూరాడు. పదునెక్కించాడు.
బాటసారుల ధైర్య గుణాలు కొద్దిగా జారిపోయాయి. అప్పటివరకు ఉన్న గ్రీష్మం చటుక్కున తుర్రుమంది. ఇలలో వర్షాగమం అతిశయించింది.
“మిత్రవిందా పరిణయం”లో కుందుర్తి వేంకటాచలకవి వర్ష ఋతువులో చినుకులు రాలుతున్న దృశ్యాన్ని ఇలా ఊహ చేసి చూపాడు :
” మెరిసే వర్షాకాల లక్ష్మి, మేఘాలు అనే నల్లని జల్లెడలలో ముత్యాలు నిండుగా ఉంచి పట్టి జల్లించినప్పుడు, రాలిన గుండ్రని ముత్యాలా అన్నట్లు చినుకులు మొదట రాలాయి”.
పోతన, భాగవతంలో వర్షాకాలంలో రైతులు పొలం దున్నినప్పుడు నేలమీద నాగలికర్రు చేసిన గుర్తులను ఇట్లా వర్ణించాడు:
కం. వర్షాకాలభుజంగుడు
హర్షముతో నిడిన నవ నఖాంకములనియు
త్కర్షింప భూమిసతిపై
గర్షకహలరేఖ లమరె గహనాంతములన్
వర్షాకాలము అనే విటుడు ( భుజంగుడు) ఆనందంతో పరవశించి, భూకాంత శరీరం మీద చేసిన క్రొత్త నఖక్షతాలు ( నవ నఖాంకములు ) అని ప్రశంసించేటట్లు అరణ్యాల్లో – పొలాల్లో ( గహనాంతములన్) కర్షకులయొక్క నాగటిగుర్తులు ( హలరేఖలు ) ఒప్పినవి.
( పద్యాలకు వ్యాఖ్య: శ్రీ నరాల రామారెడ్డి )
*
ఇవే వానలు కురుస్తున్నపుడు ఆధునిక కవి చూస్తున్న దృశ్యాలు, మనకు చూపించదలచుకున్న దృశ్యాలు ప్రాచీన కవుల కన్నా ఎట్లా వేరుగా ఉన్నాయో గమనించడానికి ” వాన కురిసే దృశ్యం కోసమే ” అనే ఈ కవిత ఒక చక్కని ఉదాహరణ.
ఈ కవితలో- ప్రకృతి ఉంది. మైదానప్రాంత దృశ్యాలున్నాయి. అటవీ శోభ ఉంది. విప్లవోద్యమం నేపథ్యంగా చేసిన వ్యాఖ్యానాలున్నాయి… ఇట్లా పలు అంశాలను గుదిగుచ్చి కవితనల్లారు కవి.
” నీటికోసం అలసిపోయిన
మనిషిని లాలించేందుకు
మబ్బు
వేలచేతులు చాస్తుంది…
చంటిపిల్లాడిని కాళ్లమీద బోర్లా వేసుకుని
స్నానం చేయిస్తున్నట్టు
గగనతలం భూమికి తలస్నానం పోస్తుంది “
ఒక ఊహతో ఈ కవితను ప్రారంభించారు. ప్రారంభ వాక్యంలోని ‘చేతులు చాచడం’ అనే క్రియకు, తరువాతి వాక్యంలోని ‘స్నానం చేయించడం’ అనే క్రియతో చక్కగా అన్వయం కుదరడాన్ని గమనించవచ్చు.
“ముడుచుకున్న గొడుగులు వందలాదిగా ఒక్కసారిగా విరబూయడం “, “తడిసి వొణుకుతున్న యూనిఫామ్ పిల్లలు”, ” ఒలుకుతున్న నీటి ముత్యాలతో కిలకిల్లాడుతూ తేలిపోతున్న అమ్మాయిలు” _ ఇవన్నీ కవి చూపుతున్న మైదానప్రాంత దృశ్యాలు.
“ఉన్న ఒక్క గోచి ఊడబీకేసి చినుకుల్లో చిందులేస్తున్న గిరిజన బాలుడు”, తదితరాలు అటవీ ప్రాంత దృశ్యాలు.
“జీవోలు పట్టుకొచ్చినవాన్ని చూసి
పూలు కిసుక్కున నవ్వుతాయి
హద్దులు దాటిన అహంకారంతో
అడుగుపెట్టిన వాన్ని చూసి
గడ్డిచిల్కలు గుసగుసలాడుతాయి
వనగీతాల మీద నిషేధ రేఖలు పనిచేయవు
గడ్డిమోపులూ ఆకుపొదలూ
ఒడిచాపి ఆత్మీయుల్ని ఆదుకుంటాయి
కవాతులు చూసి జలపాతాలు జనకవు” …
ఇక్కడ జీవోలు, హద్దులు దాటిన అహంకారం, నిషేధ రేఖలు, కవాతులు – అనేవి రాజ్య వ్యవస్థకు, రాజ్యవ్యవస్థ చర్యలకు సంకేతాలు. పూలు కిసుక్కున నవ్వడం, గడ్డిచిల్కలు గుసగుసలాడడం,
వనగీతాలు లెక్క పెట్టకపోవడం, జలపాతాలు జనకకపోవడం – రాజ్యవ్యవస్థ చర్యలకు అడవి ప్రతిచర్యలు.
ఒక ప్రాకృతిమైన విషయాన్నే కవితావస్తువుగా తీసుకున్నప్పటికీ ఆధునిక కవి తన దృష్టిని, దృక్పథాన్ని, ఆ ప్రాకృతిక, సాంస్కృతిక అంశాలకు ఎలా జోడిస్తాడో, ఎలా అన్వయిస్తాడో – వ్యాఖ్యానిస్తాడో గమనించడానికి ఈ కవితనొక చక్కని ఉదాహరణగా స్వీకరించవచ్చు.
***
Add comment